స్త్రీ వాదంతో ఓ సాయంత్రం!

స్త్రీ వాదంతో ఓ సాయంత్రం!

స్త్రీ వాదము, స్త్రీత్వము, స్త్రీ ఆలోచనా విధానము.. వీటి గురించి ఎన్నిసార్లు విన్నా, ఎంతమంది చెప్పినా, ఎంత చదివినా ఎప్పుడూ నాకు ఓ సరైన సమాధానం వచ్చేది కాదు. అసలు సమాధానమే వచ్చేది కాదా?

అంటే అలా అనేం లేదు. సమాధానమైతే వచ్చేది కానీ, నా వయసుకు, నా స్థాయికి సరిపడే ఆలోచనకు ఆ సమాధానాన్ని పోల్చుకుని చూసేప్పటికి అది ఎక్కడో తేలిపోయినట్లు కనిపించేది.

సరే, ఈ ప్రశ్నలా ఉండనీ, పూర్తి సమాధానం ఏదో ఒకరోజు దొరక్కపోదా అనుకుంటూనే నన్ను నేను అఫీషియల్‌గా ఫెమినిస్ట్‌నని ఎప్పుడో ప్రకటించుకున్నా. ప్రకటించుకోవడం వరకూ బాగానే ఉంది. నా ఆలోచనా
స్థాయిలో స్త్రీ వాదినని చెప్పుకోవడమూ బాగానే ఉంది. మరి పూర్తి సమాధానం ఎప్పుడు దొరకాలి? ఎలా దొరకాలి? ఉఫ్..

మోగిందండీ.. ‘నీకీ విషయం చెప్పడానికే వేదిక గ్రూపు ఓల్గా గారితో ఓ సమావేశం ఏర్పాటు చేసింద’న్న సమాచారంతో ఓ ఫోన్ కాల్.

13 ఫిబ్రవరి 2016. సరిగ్గా 5 అయిందప్పుడు (అంటే మన టైమ్ ప్రకారం నాలుగున్నరే అనుకుందాం!)

అప్పటికే వచ్చినవారంతా సమావేశం కోసం ఆసక్తి ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఆ రోజు సమావేశంలో సాహిత్యంతో తన ప్రయాణం గురించి చెప్పేందుకు ఓల్గా గారు సిద్ధంగా ఉన్నారు. నా మెదడులో ఒక్కటే
తిరుగుతోంది, సమాధానం దొరుకుతుంది కదా?

మెల్లిగా సమావేశం ప్రారంభమైంది. ఓల్గా గారు సాహిత్యంతో తన ప్రయాణాన్ని, తన సాహిత్య ప్రయాణాన్ని, స్త్రీ వాదాన్ని, స్త్రీ ఆలోచన విధానాన్ని లోతుగా ప్రస్తావిస్తూ వెళుతున్నా కొద్దీ, ఈ విషయంపై నాకు  కావాల్సిన సమాధానం కూడా దొరుకుతున్నట్లనిపించింది. ఇక్కడ ఆ ముందు మాటలు కొన్ని ఓల్గా స్వరంతోనే

కొన్ని పుటోలు ఇక్కడ.

చిన్నతనం నుంచే పుస్తకాలతో స్నేహం పెంచుకోవడం, కాలేజీ రోజుల్లో చిన్న చిన్న కవితలు రాయడం, సాహితీ వేత్తలను, రచయితలను కలుసుకోవడం, వాళ్ళ దగ్గర్నుంచి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, రాజకీయాలు, స్త్రీ ఆలోచనా, స్త్రీని సమాజం అర్థం చేసుకున్న విధానం, స్త్రీ వాదం అనే ఆలోచన, స్త్రీ వాదం అనే ఆలోచనను సమాజం అర్థం చేసుకున్న విధానం.. ఇలా ఓల్గా గారు ఒక్కో విషయాన్ని చెబుతూ పోతూ ఉంటే నీదనే ఆలోచన బలపడాలంటే నీదైన ప్రయాణం ఒకటి చేయాల్సి ఉంటుందని, ఆ ప్రయాణం మొదలుపెట్టడం దగ్గర్నుంచి, ఆ ప్రయాణం మనకు అర్థమయ్యే వరకూ ధైర్యంగా ముందుకెళ్ళడం ఒక్కటే మనముందున్న కర్తవ్యమని ఆమె మాటల్లో అర్థం అర్థమవుతూ పోయింది.

స్త్రీ వాదం అంటే ఏంటో అర్థమయ్యాక, దాన్ని తానుగా ఈ ప్రపంచానికి ఎలా అర్థమయ్యేలా చెప్పడానికి చేసిన రచనలే తన సాహిత్య ప్రయాణమని చెప్పినపుడు ఒక వ్యక్తి, ఒక వాదాన్ని అర్థం చేసుకొని, దానికోసమే శ్రమిస్తే ఎంతదూరం వెళ్ళగలరో ఓల్గా గారు నిరూపించి చూపినట్లనిపించింది.

“స్త్రీ వాదమంటే.. స్త్రీ తన శక్తిని, సామర్థ్యాన్ని, ఆలోచనను ప్రపంచానికి చెప్పడమే. స్త్రీ వాదమంటే స్త్రీ ధైర్యంగా తన సొంతంగా, తానుగా నిలబడి ముందుకెళ్ళడమన్న ఒక ఆలోచనే. అంతేకానీ, స్త్రీ వాదమంటే
పురుషుడిని ధ్వేషించడమో, మరోటో కాదు” అని స్త్రీ వాదానికి ఓల్గా గారిచ్చిన నిర్వచనం చాలా స్పష్టంగా అర్థమయ్యేలా ఉంది. స్త్రీ వాదంలో మళ్ళీ ఇంకా చాలా ఆలోచనలున్నాయని, వాటిని వేరు చేసి చూడడం అన్న ఆలోచనను పక్కనబెడితే, వాటి గురించి కూడా ఇంకా లోతైన చర్చ జరిగి ఒక అభిప్రాయం బలపడాల్సిన అవసరం ఉందని ఓల్గా గారు ఈ సందర్భంగా తన ఆలోచనను పంచుకున్నారు.

ఓల్గా గారి కథల సంపుటి ‘విముక్త‘కు కేంద్ర ప్రభుత్వం సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడమనేది ఒక వాదాన్ని చెప్పడంతో పాటు, ఆ వాదాన్ని చెప్పడానికి ఎంచుకున్న ఒక సరైన సాహితీ ప్రక్రియ వల్లే సాధ్యమైందని భావిస్తున్నట్లు ఒక అభిప్రాయం వినిపించింది. దాంతో పాటు ఈ సాహితి ప్రక్రియలో మీదైనా ముద్రను తేవడానికి ఎలాంటి కృషి చేశారు? అన్న ప్రశ్నకు ఓల్గా గారు సమాధానమిస్తూ.. “ఒక వాదాన్ని చెప్పేందుకు ఎంచుకునే భాషలో కూడా ప్రయోగం, కొత్తదనం చూపాలి. అప్పుడే అందరికీ ఆ ఆలోచన చేరడంతో పాటు దానికి ఒక అర్థం వస్తుంది. నా వరకూ నేను నా భాష పరంగా ఎదగడం ఎప్పటికప్పుడు సాహిత్యంతో స్నేహం వల్లే సాధ్యమైంది” అన్నారు.

ఇలా చాలా ప్రశాంతంగా మొదలైన సమావేశం, అంతే ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రశాంత సమావేశానికి ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఓ అందాన్ని, అర్థాన్ని తెచ్చిపెట్టింది.

ఇలాంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన వేదికకు, ఆలంబనకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆలంబనలో చిన్నారులు నాకైతే తెగ నచ్చేశారు. గొడవ పడే స్థాయి చర్చలు జరిగినా, ఈ పిల్లలు నవ్వులు ఆ ఆలోచనను కూడా తేనివ్వవేమో అన్నంత అందంగా ఉన్నాయి.

రమణ మూర్తి గారు సమావేశం మొదలయ్యే ముందు The Story of an Hour అనే కథ గురించి ప్రస్తావించారు. ఆ కథను వీలైతే (వీలైతే కాదు, తప్పక) చదవండి.
ఈ నివేదిక ని అందించినవారు వర్ధమాన రచయిత – వి మల్లికార్జున్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.