ఈ కథని దాదాపు పదేళ్ల క్రితం రాసాను.
ఇటీవలి కాలంలో ఒకానొక పత్రికా సంపాదకులు, మిత్రులు కథలుంటే ఒకటి పంపండి మా పత్రికలో ప్రచురిస్తాం అని అడిగితే. ఈ కథని పంపాను. ఇదిగో అదిగో అంటూ కొన్ని నెలలు జరిగిన తరువాత తన మిత్రులెవరో నచ్చలేదన్నారని తెలియజేసాడాయన.
అది ఇలా ఈ డిసెంబరు 17, 2023 ఆదివారం నాడు సంచిక లో ప్రచురణకి నోచుకుంది.
కథని ఈ లంకె ని క్లిక్ చేసి చదువుకోవచ్చు.
చాలు!
నేను తరచూ చెప్తుంటాను.
ఫేస్‌బుక్‌లో ప్రవేశించేవారికి చర్మం మందంగా వుండాలని. ఎంత మందంగా వుంటే అంత మంచిదనికూడా. ఎందుకంటే వాళ్ళూ, వీళ్ళు తెలిసీ, తెలియక నోరు పారేసుకుంటూవుంటారు. అలాంటి సందర్భాలలో ఒకొక్కసారి collateral damageలో భాగంగా పక్కనున్నవాళ్ళకి కూడా దెబ్బలు తగులుతుంటాయి. గాయలవుతాయి. అలా దెబ్బలు తిన్నవాళ్లని, గాయపడ్డవారిని చూస్తూనే వున్నాను.
గాయపడ్డ వాళ్ళ చర్మం మందాన్ని బట్టి, వారి మనసుకి బాధని భరించే శక్తిని బట్టి ‘హర్టు’ అవుతుంటారు. విషయం పూర్తిగా ఆకళింపు చేసుకోకుండా, నేపధ్యమూ, వివరమూ తెలియకుండా దారినపోయే దానయ్యలూ, దానమ్మలూ కూడ రాళ్ళు విసురుతారు!
వెనక్కి తిరిగి రాళ్ళు విసిరినవాళ్ళకి పబ్లిక్‌గా జవాబిచ్చే అవకాశం వున్నా, అది తమని దుర్గంధపూరితమైన మురికికూపంలోకి లాగుతుందని తెలిసి స్పందించకుండా పక్కకు తప్పుకుని వెళ్ళిపోవడం అత్యున్నతమైన మార్గమని తెలిసిన వాళ్ళు కొందరుంటారు. వీళ్ళు ఈ ఫేసుబుక్ లోకం ఏమనుకున్నా ఫరవాలేదనుకుంటారు! After all Facebook is not the only world! ఎందుకంటే తాము తప్పు చెయ్యలేదని వారికి స్పష్టంగా తెలుసు.
దాదాపు పది పదిహేనేళ్ళుగా ఈ ఫేసుబుక్‌లో అనేకమైన సందర్భాలలో అనేక మంది వ్యక్తులను, వారి వ్యక్టిత్వాలను, ప్రవర్తనను చూస్తూవస్తున్నాను. ఇటీవల రెండు సంఘటనలు చూసిన తరువాత చూసింది, విన్నది, అర్ధం చేసుకున్నది, స్పందించింది ఇక చాలు అనిపించింది.
అందులో ఒకటి ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినది. ఇద్దరూ విజ్ఞులే. తమ తమ రంగాలలో నిష్ణాతులు. తమ విద్వత్తుతో, జీవితానుభవంతో సమాజానికి తమ తోచినంతమేరకు సహాయ సహకారాలు అందిస్తున్నవారే! వాళ్ళిద్దరి మధ్య ‘బ్లాకు’!
మరో సందర్భంలో కూడా అలాంటిదే.
ఇంత చిన్న జీవితంలో కాలి మడమలు కూడ తడపలేని లోతున్న ఈ ఫేస్‌బుక్ ‘స్నేహ సముద్రం’లో వ్యక్తిగతంగా పరిచయంలేని (ఆఫ్ ది గ్రిడ్) ‘స్నేహా’లలో comments ని out of context కి twist చేసి తమకు అనుకూలంగా convoluted arguments చేసి దానితో ఆగక బురదజల్లుడు, దూషణలు, బ్లాకులు. అవసరమా?
మరొక సందర్భంలో అకారణంగా ద్వేషాన్ని పెంచుకోవడం! చిన్న పిల్లలా అంటే కాదు! తల్లులు, తండ్రులుగా వృత్తిపరంగా బాధ్యతలు, విధులూ నిర్వహిస్తున్నవారే! అపోహలకి, అపార్ధాలకి దారి తీసిన విషయాలను కూర్చుని సంప్రదించుకుని నిర్ణయాలు తీసుకోగలిగిన వివేకవంతులే(?) కారేమో మరి!
ఈ పోస్ట్ కూడా అనవసరం అనుకున్నాను కాని ఇది off the grid, వ్యక్తిగతంగా నన్ను తెలిసిన దేశ విదేశాలలోవున్న మిత్రులకి తెలియజేయడం కోసం చెప్పాల్సి వస్తోంది. నేను ఇక్కడ కనపడటంలేదని అనుకోవద్దు. నాతో వ్యక్తిగత పరిచయం వున్నవారందరి వద్ద నా contact coordinates వుంటాయి కాబట్టి టచ్‌లో వుందాం. కుదిరినప్పుడు ఒక కప్పుటీ తో ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు వీలున్నప్పుడు కలుద్దాం.
BTW, ఇక్కడ నా అకౌంట్‌ని ప్రస్తుతానికి డిలీట్ గాని డీఆక్టివేట్‌గాని చెయ్యడం లేదు. వేదిక కార్యక్రమం ప్రకటనలుంటాయిగా!
Note: This Facebook post was made public disabling the comments on 15 Dec 2023.
మీ టూ
స్క్రీన్ బీ – త్రీ లోకి ప్రవేశించాడు జిష్ణు. షో అయిపోయినట్టుంది. ఖాళీగా ఉంది థియేటర్. తనకి దగ్గిర్లో కిందపడిఉన్న ఖాళీ ‘లేస్’ కవర్‌ని తీసేస్తున్న క్లీనింగ్ స్టాఫ్‌ని ఉద్దేశించి “నెక్స్ట్ షోకి ఇంకా ఎంత టైముంది?” అని అతను అడిగితే “టెన్ మినిట్స్” అని జవాబిచ్చింది ఆమె. అతను “థాంక్స్” అని గొణుగుతూ వెనక్కి తిరిగి ఫోయర్ ( థిఏటర్ ఆవరణ) లోకి నెమ్మదిగా అడుగులేస్తూ వెళ్ళాడు.
డోర్స్‌కి రెండువైపులా గోడలకి ఆనించి పొడుగ్గా సోఫాసెట్‌లు ఉన్నవి. వాటికి ఎదురుగా ఫోయర్‌లోనే అక్కడక్కడ డిస్‌ప్లే విండోస్. వాటితో పాటే రిలీజ్ కాబొయ్యే కొత్త సినిమాల పోస్టర్లు, ఫొటో కార్డ్‌లు.
కుడి చేతివైపు సోఫాలో, ఆ చివర గోడకి ఆనుకుని ఒక యువతి కూర్చునుంది. ఆమె కాళ్ళు తన ముందున్న యువకుడి ఒడిలో ఉన్నాయి. వాళ్ళు తమదైన మరో ప్రపంచంలో ఉన్నారు.
జిష్ణు చిరాకుగా ఎడం వైపుకి తల తిప్పాడు.
ఎడం చేతి వైపు సోఫా వరుసలో అటు చివరగా ఒంటరిగా కూర్చుని ఉన్నాడు అతను. లౌడ్ కలర్స్ తో ఉన్న చెక్‌డ్ షర్ట్. స్లిమ్ ఫిట్ డార్క్ బ్లూ కలర్ జీన్స్‌లోకి టక్ చేసుకున్నాడు. లెదర్ బెల్ట్ కొంచెం బిగించినట్టున్నాడు. అయినా పొట్ట బెల్ట్ మీదుగా కొంచెం కిందకి జారి కనపడుతున్నది. కుడి కాలు తొడ మీద, ఎడం కాలేసుకుని కూర్చున్నతను కాస్త తీక్షణంగాను ప్రపంచాన్ని మరిచిపోయి మరీ చూస్తున్నాడు. రెప్పవెయ్యకుండా. అతను చూస్తున్నవైపే జిష్ణు తన దృష్టిని జారించాడు.
అక్కడ చూడ ముచ్చటగా ఉన్న జంట. వారితో పాటు ఒక బాబు కూడా ఉన్నాడు. ఏడెమినిదేళ్ళుండవచ్చు. కొంచెం ఊరిన బుగ్గలతో, ఎర్ర్రని పెదాలతో, నిగ నిగ లాడుతూ ఆరోగ్యంగా ఉన్నాడు. బ్లేజింగ్ రెడ్ కలర్ టీ. కొంచెం టైట్‌గానే ఉన్నట్టుంది. ఛాతికి అతుకున్నట్టు ఉంది. అది వైట్ కలర్ షార్ట్స్ లోకి టక్ఇన్ చేసుంది. షార్ట్స్ కూడా టైట్‌గా ఉన్నట్టున్నాయి. పిర్రలకి అతుక్కుని లోపలి అండర్‌వేర్ కూడా కనపడి కనపడకుండా కనపడుతోంది. బొద్దుగా, క్యూట్‌గా కూడా ఉన్నాడు. ఆ పక్కనే ఉన్న ‘జస్టిస్ లీగ్’ సినిమా పోస్టర్ వాడిని ఆకర్షించినట్టుంది. 3డి సినిమా పోస్టర్ అది. వాడు అటు తిరిగి దాని దగ్గిరకు వెళ్ళాడు. ఈ లోపు ఆ బాబుతో ఉన్న ఆమె తనతో ఉన్నతనితో డ్రింక్స్‌కో, ఈటబుల్స్‌కో ఆర్డర్ ఇవ్వమన్నట్టుంది. అతను ఆ ఫోయర్‌లో కుడి చేతి వైపున్న స్టాల్స్ వైపు వెళ్ళాడు.
బాబు పోస్టర్‌ని చూస్తున్నాడు. రెప్ప మూసి తెరిచేటప్పడికి, బ్లూజీన్స్ వ్యక్తి బాబు పక్కనే నిలబడి పోస్టర్‌ని చూస్తూ కనపడ్డాడు. బాబు వైపు తిరిగి ఏదో అన్నాడు. వాడు నవ్వుతూ తల అడ్డంగా తిప్పాడు. అతను బాబు వెనక్కి వెళ్ళాడు. వాడి భుజాల మీద తన చేతులు వేసాడు. బాబు పక్కనే ఉన్న మరో పోస్టర్ దగ్గిరకి వెళ్ళాడు. అతను వాడి భుజాలమీద చేతులు తియ్యలేదు. అలాగే వాడి వెనకే నిలబడి బాబు అడుగులో అడుగువేస్తూ ఫాలో అయ్యాడు. ఇప్పుడు బాబు వెనక్కి ఆనుకుని నడుస్తున్నాడు. బాబు ఎడమ భుజం విదిలించుకున్నాడు. బ్లూ జీన్స్ వాడి భుజాలని వదలలేదు. ఇప్పుడు పూర్తిగా బాబు వెనుకభాగాన్ని బ్లూ జీన్స్ శరీరం ఆక్రమించేసింది. వాళ్ళిదరి మధ్య ఏ మాత్రం ఖాళీ లేదు.
ఇందాక బాబుతో ఉన్నామె ఇప్పుడు మరో పోస్టర్‌ని చూస్తోంది. ఆమెతో వచ్చినతను ఇంకా స్టాల్స్ దగ్గిరే ఉన్నాడు. బాబుని వాళ్ళిద్దరు పట్టించుకున్నట్టు లేరు.
జిష్ణు చూపు ఇప్పుడు ఫోయర్‌లో ఎడం చేతివైపుకి మళ్ళింది. అక్కడున్న ఆ అమ్మాయి ఎదురుగుండా వాల్ డిస్‌ప్లే లో వస్తున్న సినిమా ట్రైలర్ ని చూడడంలో నిమగ్నమై ఉంది.
బ్లూజీన్స్ ఇంకా బాబుని వెనకనుండి గట్టిగా హత్తుకున్నట్టే ఉన్నాడు. బాబు భుజాలు విదిలిస్తున్నాడు. అతని చేతులు వాడి భుజాల మీద బిగుతుగానే ఉన్నాయి. బాబు అసహనంగా కదులుతున్నాడు.
డోర్స్ దగ్గిరున్న జిష్ణు వాళ్ళిద్దరి వైపు కదిలాడు.
బాబు ఈ సారి గట్టిగా విదుల్చుకున్నాడు. బ్లూజీన్సతని చేతులు వాడి భుజం మీద నుంచి జారిపోయినవి. బాబు దాదాపుగా పరిగెత్తుకుంటూ ఆ స్త్రీ దగ్గిరకి వెళ్లిపోయి నడుం చుట్టూ చేతులు వేసేసి మొహాన్ని ఆమె వొడిలోకి దూర్చేసాడు.
జిష్ణు బయలుదేరిన చోటే ఆగిపొయ్యాడు.
బాబు భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఆమె ముందుకి వంగి బాబుకి మాత్రమే వినపడేటట్టుగా ఏదో అడిగింది. బాబు తల విసురుగా విదిలిస్తున్నాడు. బాబు భుజాలు పట్టుకున్న ఆమె కిందకి మోకాళ్ళమీదకి వంగి బాబుని సముదాయిస్తూ మాట్లాడుతోంది. బాబు తల పైకెత్తకుండా ఏదో చెబుతున్నాడు. ఆమె తల తిప్పి అటు ఇటు చూసింది. మళ్ళీ వాడి గెడ్డం పట్టుకుని తలని కొంచెం ఎత్తి వాడి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. ఈ సారి వాడి కళ్ళనిండా నీళ్ళు. బుగ్గలమీద చారికలు కనపడ్డాయి జిష్ణుకి. వాడు కళ్ళు అటు ఇటు తిప్పి ఆ బ్లూ జీన్స్ వ్యక్తి వైపు సారించి ఆవిడతో ఏదో చెప్పాడు.
సరిగ్గా అప్పుడే స్టాల్స్ దగ్గిరున్నతను వెనుతిరిగాడు.
విసురుగా ఆమె లేచి నిలబడి బాబు కుడి చెయ్యి మణికట్టు దగ్గిరపట్టుకుని దాదాపుగా లాక్కుని వెళ్తున్నట్టు, బ్లూజీన్సతని వైపుకి బయలు దేరింది. స్టాల్ దగ్గిర నుండి వెనక్కు తిరిగినతను ఆమె హడావుడిని గమనించి అనుసరించాడు.
ఫోయర్‌కి ఎడం చేతివైపున్న (‘మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్’) సినిమా వాల్ పోస్టర్ని చూస్తోంది, ఇందాక జిష్ణు చూసిన ఆ అమ్మాయి. పన్నెండు పదమూడేళ్లు ఉంటాయేమో! వైట్ హెయిర్ బాండ్ కింద నుంచి నల్లని పొడుగాటి జుత్తు, భుజాల మీదుగా వీపు మీదకి జారుతోంది. టాప్ టైట్‌గా ఉంది. వికసిస్తున్న (రానున్న) టీన్స్‌ని దాచలేక పోతోంది ఆ టాప్. రెడ్ కలర్ బెల్ట్ ఉన్న బ్లూ కలర్ జీన్స్‌కి ఆ టాప్‌కి మధ్య మెరుస్తూ కనపడుతున్న నడుం. రివెటెడ్ బటన్స్‌తో ఉన్న హిప్ హగ్గింగ్ జీన్స్ అవి!
బ్లూ కలర్ జీన్సతని దృష్టి ఆ అమ్మాయి మీద పడినట్టుంది. నెమ్మదిగా ఆ అమ్మాయి పక్కకి చేరుకున్నాడు. నవ్వుతూ ఆ అమ్మాయితో ఏదో అంటూ చనువుగా ఆమె ఎడం భుజం మీద తన ఎడం చెయ్యి వేసాడు.
జిష్ణు దృష్టిలో పడిందది. జిష్ణు దూకుడుగా వాళ్ళిదరి వైపుకి అడుగులు వేసాడు.
ఫెటేలన్న మోతతో ఆ ఫోయర్ దద్దరిల్లింది. ఒక్కసారిగా అందరు ఉలికి పడ్డారు. అప్పటికే బ్లూజీన్సతని దగ్గిరకి బాబు, ఆమె, అతనూ చేరారు. జిష్ణు కూడా.
జిష్ణుని చూడగానే ఒక్క గెంతులో అతని పక్కకి చేరి అతని కుడి చేతిని పెనవేసుకుంది ఆ వైట్ టాప్, బ్లూజీన్స్ అమ్మాయి, “మామయ్యా!” అంటూ ఏడుపు గొంతుతో. తన ఎడం చేత్తో ఆ అమ్మాయిని దగ్గిరకు తీసుకున్నాడు జిష్ణు.
ఎర్రగా కందిపోయిన ఎడమ చెంపని రుద్దుకుంటూ బ్లూజీన్స్ అక్కడి నుంచి పరుగువేగంతో ఫోయర్ లోని లిఫ్ట్ కోసం కూడా ఆగకుండా, మెట్ల మీదుగా దూకుతూ కిందకి వెళ్లిపోయ్యాడు. బాబుతో ఉన్నావిడ ఆవేశంతో రొప్పుతోంది. ఆతను ఆమెను చూస్తూ నిలబడిపొయ్యాడు. కళ్ళు నులుముకుంటున్నాడు బాబు.
Footnote
దాదాపు ఐదేళ్ళక్రితం ఖదీర్‌బాబు, కె సురేశ్ , తాము 2018 నిర్వహించిన రైటర్స్‌మీట్‌లో పాల్గొన్న వారు రాసిన కథలను, కొత్తకథ 2018 మకుటంతో వెలువరించిన సంకలనంలో ప్రచురించిన కథ ఈ #మీటు. సంకలనంలో వచ్చిన కథలని కనీసం రెండు సంవత్సరాలు బయట ఎక్కడ ప్రచురించరాదని వారి సూచనని మన్నించి ఇప్పటివరకు దీనిని ప్రచురించలేదు. కథలలో సత్తా వుంటే పాఠకులు గుర్తుపెట్టుకుని, వెతుక్కుని మరీ చదువుతారనే బలమైన అభిప్రాయం మరొక కారణం. వెతుక్కోవడానికి ముందు వుండాలిగా అందుకని ఈ అంతర్జాలంలో ఈ బ్లాగులో...
౨ - ఈ కథ పూర్వాపరాలకు చెందిన మరికొంత అదనపు సమాచారం ఈ లంకె లో చదువుకోవచ్చు.
౩ - దిగువనున్నది కొత్తకథ2018 సంకలనాన్ని, 13 మే 12018 ఉదయం, తెలుగు విశ్వవిద్యాలయం, భాగ్యనగరంలో ఆవిష్కరించిన సందర్భలో, నా హితోభిలాషి, కవి దేవిప్రియగారి నుండి ప్రతి అందుకుంటున్నప్పటిది.
కొత్త కథ 2018 ప్రతులు ఇక్కడ దొరుకుతాయిః
ధర: రూ 149.00 మాత్రమే (24 కథలు)
♣ నవోదయ బుక్ హౌజ్
3-3-865,Opp Arya Samaj mandir, Kachiguda,Hyderabad, Pin Code: 500027,
Telangana,India. Mob:+91-9000413413, Office:040-24652387
Email:[email protected]
Web: www.TeluguBooks.in
అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు – ఈమాటలో
చావెరుగని ‘‘చిరంజీవి’’!
పిచ్చేశ్వరరావు – ‘‘జీవచ్ఛవాలు’’
ఈ కథలు… చదవటమొక అవసరం
దెయ్యాల వంతెన
వేణువు ఊదుకుంటున్న గోపాలుడికి ఆ సాయంత్రం పొద్దెక్కడం కొంచెం ఆలస్యంగా తెలిసింది. హడావుడి పడుతూ తన మేకలని కాలువ వైపుకి తోలాడు. ఊళ్ళో వాళ్ళెవరూ ఆ కాలువ, ఆ వంతెన వైపుకి చీకటి పడే సమయానికి రారు. భయం. ఎప్పుడో చెక్కతో కట్టిన వంతెన అది. ఇప్పుడో, అప్పుడో పడిపోయెటట్టుంది ఆ వంతెన. ఆ వంతెన ఇవతల గట్టుకి ఆనుకుని ఒక పెద్ద మఱ్ఱిచెట్టుంది. దాని మీద దెయ్యాలున్నాయిని ఆ ప్రాంతం ప్రజల నమ్మకం. చీకటి పడిన తరువాత ఆ వంతెన మీదుగా ఆ కాలువని దాటి ఏ ప్రాణి అయినా ఆ మఱ్ఱిచెట్టు కిందగా వెళ్తే దాని మీదున్న దయ్యాలు చంపేసి, రక్తం తాగి, శవాన్ని ఆ కాలువలో పడేస్తాయన్న కధని తరతరాలుగా ఆ ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటు ఉంటారు.
కాని గోపాలుడు మేకలని తొందరగా ఇంటికి చేర్చాలనే ఆలోచనలో ఉండి, ఆ మఱ్ఱిచెట్టు కిందుగా వెళ్ళి, ఆ కాలువ వంతెన మీదుగా దాటిస్తున్నాడు. అప్పటికే చీకటి పడిపోయింది. మఱ్ఱిచెట్టు భయంకరమైన దయ్యంలాగా కనబడుతోంది. గాలి విసురుగా తగుల్తోంది. మేకలన్ని పరిగెడుతున్నాయి. ఆఖరు మేక వంతెన దాటి గట్టు మీదకి చేరింది. దాని వెనకే గోపాలుడు కుడి కాలు మోపాడు. ఎడం కాలు ముందుకు తీసుకుని అడుగు వేస్తున్నాడు… వేసేశాడు. ఇప్పుడు కాలువకి ఇవతలి గట్టు మీదున్నాడు. పేద్ద శబ్దం చేస్తూ వంతెన ముక్కలు, ముక్కలుగా విరిగిపోయి, ఆ కాలువలోకి భళ్ళున పడిపోయింది. భయంతో మేకలన్నీ ఇంటి వైపు పరుగెట్టడం మొదలు బెట్టినవి. పరుగో, పరుగు, ఒకటే పరుగు. ఆగితే దయ్యాలు తమని కూడా పట్టుకుంటాయని భయం.
సరిగ్గా అప్పుడే గోపాలుడికి భయంతో ఏడుస్తున్న మేక పిల్ల అరుపు వినిపించింది. గబుక్కున వెనక్కి తిరిగి చూశాడు గోపాలుడు. ఆ కమ్ముకుంటున్న చీకట్లో అవతలి గట్టు మీద కనపడింది మేక పిల్ల. అది ‘మే… మే” అని భయంతో ఏడుస్తోంది. ఎర్రటి కళ్లతో దాని పీకని పట్టుకుని కనపడింది దయ్యం. చూడటానికే భయంకరంగా ఉంది ఆ దయ్యం.
“దాన్ని వదిలేయి, దయ్యమా. నువ్వేది అడిగితే అది ఇస్తాను, ” అని గోపాలుడు ఆ దయ్యాన్ని అడిగాడు. ఇవ్వను అన్నట్టుగా తలని అడ్డంగా అటూ, ఇటూ తిప్పింది దయ్యం.
గోపాలుడు మోకాళ్ళ మీద మోకరిల్లి, రెండు చేతులు కలిపి దణ్ణం పెడుతూ, “దయ్యం, దయ్యం దయచేసి నా మేకపిల్లని వదిలెయ్యవా?” అని మళ్ళీ అడిగాడు.
అప్పుడు దయ్యం, “సరే, వదిలేస్తాను. మరీ ఈ మేకపిల్ల నీ దగ్గిరకు ఎలా వస్తుంది?” అని అడిగింది.
గోపాలుడుకి ఏమి సమాధానం చెప్పాలో తెలియక బిక్క మొహం వేసాడు. అప్పుడు దయ్యం “నువ్వు ఒప్పుకుంటే ఒక షరతు మీద ఈ మేక పిల్లని వదిలేస్తాను,” అని అంది.
“ఏమిటా షరతు?” అని అడిగాడు గోపాలుడు.
“నువ్వు రేపు వచ్చేటప్పటికి ఇక్కడ ఒక సరికొత్త వంతెన ఏర్పాటు చేస్తాను. కానీ…”.
“ఊ…కానీ..నేను ఏం చెయ్యాలో చెప్పు,” అని ఆదుర్దాగా అడిగాడు గోపాలుడు.
“ఆ వంతెన మీదుగా దాటి వచ్చిన మొదటి ప్రాణిని నాకు బలి ఇవ్వాలి,” అని అంది ఆ దయ్యం.
“ఆ…?” అని ఆలోచనలో పడ్డాడు గోపాలుడు.
“నువ్వు ఒప్పుకోకపోతే ఈ మేకపిల్లని ఇప్పుడే చంపేస్తాను. రేపు ఆ వంతెన కూడా ఉండదు,” అని అంది ఆ భయంకరమైన దయ్యం.
“వద్దు, ఆ మేకపిల్లని చంపకు. నువ్వు చెప్పింది నాకు అంగీకారమే. అలాగే చేస్తాను, ” అని అన్నాడు గోపాలుడు.
మరుసటి రోజు ఉదయం, తన సద్దిమూటతో మేకలని తోలుకుంటూ కాలువ దగ్గిరకి బయలుదేరాడు గోపాలుడు. ఆశ్చర్యం! కాలువ మీద కట్టెలతో కట్టిన సరికొత్త వంతెన సిద్దంగా ఉంది అక్కడ. కాలువ అవతల గట్టున వంతెన దగ్గిర దయ్యం నిలబడి ఉంది. కాలువ ఇవతల గట్టున, వంతెనకి ఇవతల గోపాలుడు, అతని వెనకే మేకలు. ఆ మేకలతో పాటు ఒక గజ్జి కుక్క. మేకలని గట్టు మీదే ఉండమని చెప్పి, తను ఆ వంతెన మీద కాలు బెట్టి గట్టిగా ఉందో లేదో చూద్దామనుకున్నాడు. కానీ ఈ లోపు దయ్యానికి తనకి ఉన్న ఒప్పందం గుర్తు వచ్చింది. అందుకని వంతెన మీద కాలుపెట్టకుండా ఇవతలే నిలబడ్డాడు.
భుజానికి ఉన్న సద్ది మూటని విప్పాడు. అందులో నుంచి తను విడిగా పెట్టుకున్న మాంసం ముక్కని బయటికి తీసాడు. తన మేకలతో పాటే వచ్చిన గజ్జి కుక్కకి దాన్ని వాసన చూపించాడు. తన బలం అంతా వినియోగిస్తూ కుడి చేత్తో ఆ మాంసం ముక్కని వంతెన మీదుగా దయ్యం నిలబడి ఉన్న గట్టు మీదకి విసిరాడు. ఆ మాంసం ముక్క అవతల గట్టు మీద పడేలోపు, గజ్జి కుక్క ఆ కాలువ మీదున్న వంతెన మీదుగా అటు వైపుకి దూకింది. అటు దూకడేమేమిటి, ఆ గట్టు మీద పడ్డ మాంసం ముక్కని నోటితో పట్టుకోవడం కూడా అయిపోయింది.
ఇదంతా చూస్తున్న దయ్యం ఆశ్చర్యంతో నిర్ఘాంత పోయింది. దాని పక్కనే ఉన్న మేకపిల్ల దయ్యం పట్టు విదిలించుకుని ఆ గట్టునుంచి ఇటు గట్టు మీదకి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. గోపాలుడు దాన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ దయ్యం వైపు చూశాడు.
దయ్యం బూడిదగా మారి కుప్పగా కూలిపోయింది.
ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ మర్రిచెట్టు పైనకాని ఆ కాలువ గట్టున కానీ దయ్యాలు మళ్ళీ కనపడలేదు.
* * *
కధ పూర్వపరాలు
2017లో మా అమ్మాయి, అల్లుడు తో కలిసి కొంత కాలం గదుపుదామని స్కాట్ లాండ్ వెళ్ళాను. వాళ్ళింట్లో వాళ్లుంటున్న ఎడిన్ బరో నగర పురాతన చరిత్ర గురించిన ఒక పుస్తకం కూడా ఉంది. ఎడిన్ బరో నగరంలో ఉన్న శిలా స్థూపాలు, ప్రతిమల గురించి కూడా కొంత వ్రాసి ఉంది. సెల్టిక్ కధల ప్రస్తావన వచ్చినప్పుడు జాలంలో కొన్ని కధలు చదివినప్పుడు వచ్చిన ఆలోచన ఇది. కధ వ్రాయడం మొదలుపెట్టిన తరువాత, ‘చిన్న పిల్లల కధ’ గా తయారయింది అనిపించింది. అప్పుడే చిన్న పిల్లలకి కూడా ఒక కధ వ్రాసానని, బాల సాహిత్యంలో కూడా వేలు పెట్టానని చెప్పుకోవచ్చు కదా అనిపించింది. దాంతో చిన్న పిల్లలకి కధలాగానే వ్రాసేసాను. చిన్న పిల్లల కధ గా రూపు దిద్దుకుంటునప్పుడు, పిల్లలకి దెయ్యలూ, భూతాలు, దేవుళ్ళు, దేవతలు (నేను నమ్మనివి) హేతువాదానికి, తర్కానికి నిలబడనివి, హింసని చూపించేవి ఎంత వరకు సబబు అని కూడా అనిపించింది. కానీ చందమామలో భేతాళ కధలు చదివిన నేను బాగానే ఉన్నానుకదా, నా పిల్లలూ బాగానే ఉన్నారు కదా , అని అనుకుని… దెయ్యాన్ని అలాగే ఉంచేసాను. ఇక ప్రచురణకి పంపాలనుకున్నప్పుడు ఏ పత్రిక అన్న మీమాంస మొదలైంది. సాహితీ మిత్రుడొకరు సాక్షిని సూచించారు. సాక్షి ఫన్ డే కి పంపాను. వారు ప్రచురించారు. కాకపోతే కధకి బొమ్మ వేసినవారు పెద్దగా శ్రమ పడకుండా జాలం నుంచి దెయ్యం బొమ్మకి బదులు దొరల మాంత్రీకురాలు బొమ్మని దింపేసి వాడేశారు.
సాక్షి ఫన్ డే సంపాదకులకి ధన్యవాదాలు.
ప్రచురణానంతరం…
కధ ప్రచురించిన తరువాత నేను పంచుకున్న మిత్రులలో ఒకరు, “నేనైతే పిల్లలకి దెయ్యాల భూతాల కధలు రాయనండి,” అని సున్నితంగా చెప్పారు.
మరొకరు, “ఇమేజరి అంతా బాగుంది కాని పిల్లలకి దెయ్యం ఎందుకు…ఒక బాడ్ మాన్ తో వ్రాసి ఉండవచ్చు కదా?” అన్నారు.
అది ఈ కధా నేపధ్యం. చి న
సాంఘిక మాధ్యమాలలో ఇంకా ప్రచురించలేదు. చూడాలి అక్కడ చదివిన వాళ్ళేమంటారో!
ద హ
పాద సూచి
సాక్షి, ఫన్ డే, ఆదివారం, ఆగస్ట్ 4 న సంచికలో వెలువడ్డ కధ పూర్తి పాఠం ఇక్కడ (image)
Text link here.
Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on whatsapp
WhatsApp
Share on email
Email
కవన శర్మ జ్ఞాపకాలతో…ఒక సాయంత్రం
మొన్న (ఆదివారం, 4 నవంబరున, Hyderabad Study Circle లో ) జరిగిన కవన శర్మ జ్ఞాపకాల సభలో సాహితీ మిత్రులందించిన మూడు సందేశాలు వ్యవధి లేక జారిపొయ్యాయి.
ఒక నిర్వాహకుడిగా అది నా తప్పిదమే. మిత్రులను క్షమాపణలు కోరుకుంటూ, వాటిని ఇక్కడ అందరితో పంచుకుంటున్నాను.
…
రావు, వేమూరి – University of California, Davis విశ్రాంత ఆచార్యులు (అమెరికా)
వేమూరి వెంకటేశ్వర రావు గారి సందేశంః
ఏనాటి మాటో! కవన శర్మ గారుట. బోస్టన్ నుండి ఫోనులో పిలచేరు – నేను తెలుగు భాషా పత్రికలో రాస్తూన్న వ్యాసాలు బావున్నాయని చెప్పడానికి. తరువాత పది సంవత్సరాల కాలం గడచిపోయింది. నేను హైదరాబాదు వచ్చేను. శర్మ గారు ఊళ్లో ఉన్నారని తెలసి పలకరించడానికి వెళ్లి పరిచయం చేసుకోబోయాను. “అయ్యో! మీరు తెలియకపోవడం ఏమిటి? కించిత్ భోగో కథ రాసింది మీరే కదూ?” అంటూ స్వాగతించేరు. తరువాత వైజాగులో వారింట్లో ఒక సారి కలుసుకున్నాను. నేను రాసిన మహాయానం కథల పుస్తకానికి అడిగిన వెంటనే ముందుమాట రాసి ఇచ్చారు. రెండేళ్ల క్రితం బెంగుళూరు శివార్లలో నేను ఉన్నానని తెలిసి ప్రత్యేకం నన్ను చూడడానికి వచ్చేరు. ఆయన్ని కలుసుకున్నది కేవలం మూడు సార్లు. ప్రతి సారి మా సమావేశం గంటకి మించలేదు. అయినా సరే, ఆయన నా మనస్సులో ఒక ముద్ర వేసుకుని కూర్చున్నారు. ఇటీవలి కాలంలో – ఆయన ఇక లేరని తెలిసిన తరువాత – ఫేస్ బుక్ ని తెరచి చూడబుద్ధి కావటం లేదు. కవన శర్మ గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ
— వేమూరి వేంకటేశ్వరరావు.
తులసీ జలంధర చంద్రమోహన్ – రచయిత్రి ( చెన్నై )
జలంధర గారు ఆడియో ఫైల్ పంపారు. క్రింద ఆడియో ఫైల్ లో వారి
“కవన శర్మ గారికి పుష్పాంజలి” వినవచ్చు.
గ్రీకువీరునికి వీడ్కోలు
కవనశర్మగారి గురించి నాలుగు మాటలు పంచుకోమని అనిల్ అడిగారు.
రచయితలుగా మన పరిచయంలో ఉన్నవారి గురించి మాట్లాడటం కొద్దిగా సులువు. సాహిత్య లోకానికి వారి తోడ్పాటుని మన అవగాహన లోనుంచి చెప్పవచ్చు. కానీ వారు మనకి వ్యక్తులుగా కూడా తెలిసినపుడు, వారి అభిమానాన్ని పొందిన స్నేహితులం అయినపుడు మాట్లాడటం కొద్దిగా కష్టం. వ్యక్తిగతం, సాహిత్యం కలగలిసిపోతాయి. విడదీసుకుని నిబ్బరంగా వ్యాఖ్యానించడానికి, వారి సాహిత్య కృషిని మదింపు చేయడానికి నాకైతే సాధ్యం కాదు. ఆమె ఇల్లు, విడాకులు చదివినపుడు స్త్రీల సమస్యల మీద ఆయనకి ఉన్న సహానుభూతికి సంతోషపడ్డాను. పరిధి చదివినపుడు అతిక్రమణల గురించి తెలుసుకున్నాను. రచన పత్రికలో సాహిత్య నిర్మాణ సూత్రాల గురించి రాసినపుడు ఆ దీర్ఘ వ్యాసానికి ఉన్న శాస్త్రీయ దృష్టికి ఆశ్చర్యపడ్డాను. వ్యంగ్య కవనాలకి నవ్వుకున్నాను.
నచ్చింది రాయడం తప్ప నచ్చనిదాని గురించి మాట్లాడను, మౌనమే విమర్శ అన్నపుడు అంగీకరించలేకపోయాను. ఏ రచనకైనా మానవ స్పర్శ అంటుకుని ఉండాలని చెప్పినపుడు ప్రేమించాను. రెండునెలల కిందట కలిసినపుడు, “ప్రత్యేకించి వైద్యం తీసుకోనని, రాబోయే వారికోసం చోటు ఖాళీ చేసేయాలని చెప్పినపుడు బాధతో వాదించాను. నిక్కచ్చితనాన్ని మృదువుగా చూపేపుడు అబ్బురపడ్డాను. సమయపాలనకి పెట్టింది పేరైన కవనశర్మ గారు, మొదటిసారి సమయం తప్పారు. 29 వ తారీఖున విశాఖ వెళ్లాలని, తన ఇంటిలోని నల్లబల్ల మీద రాసుకున్న ఆయన దానిని మర్చేపోయారు. విశాఖ వచ్చినపుడు మాట్లాడాల్సిన విషయాలున్నాయని రెండు మెయిల్స్ పెట్టారు. ఆయన నాతో ఏం మాట్లాడాలనుకున్నారో వివినమూర్తి గారికి తెలుసు, కుందుర్తి రజనికాంత్ గారికి తెలుసు. మీరు నాకు చెపితే కవనశర్మ గారు నాకు చెప్పేసినట్లే.
– మల్లీశ్వరి కె ఎన్ – రచయిత్రి (విశాఖపట్నం)
కోరిన వెంటనే తమ తమ సందేశాలను పంపినందుకు శ్రీమతి తులసీ జలంధర చంద్రమోహన్, వేమూరి వెంకటేశ్వర రావు, కె.ఎన్ మల్లీశ్వరి గారలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, జరిగిన పొరబాటుకి మన్నించగలరని ఆశిస్తున్నాను.
భలేగా దొరికాడు!
క్లాసు పుస్తకాలు, నోటుబుక్కులు, హోం వర్కులు చేస్తూ కనబడ్డవాడేకాని చేతిలో చందమామ, బాలమిత్ర లాంటి పుస్తకాలతో చూసిన గుర్తు లేదు. (చదివే ఉంటాడు, చదవకుండా ఎలా!) ఇద్దరమూ, మిగతా మిత్రులతో కలిసి, గోళీలు ఆడుకున్నాం. బిళ్లం గోడు కూడా అడుకున్నాం. క్రికెట్టు కూడా. కొట్టుకున్న, తిట్టుకున్న సందర్భాలు లేవు.
తరువాతెప్పుడో, మెడిసిన్ లో సీటు వచ్చింది చదువుకుంటున్నాడని తెలుసు. సరే, ఇక పెళ్ళి. బజుల్లా రోడ్డు ఇంట్లో సత్యనారాయణ వ్రతం. ఒకటి రెండు సార్లు, ఆంధ్రా బాంకులో కనపడ్డాడు. వాళ్ళ నాన్నగారు ఉన్నన్నిన్నాళ్ళు తన కబుర్లు కొన్ని తెలుస్తుండేవి. తరువాత ఎప్పుడో స్పర్ టాంక్ రోడ్ మూలమీద కనపడ్డాడు. ఇంగ్లాడ్‌లో ఉంటున్నానన్నాడు.
అప్పుడప్పుడు వెతుక్కునేవాడిని, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడో అని! ఆ తరువాతెప్పుడో తెలిసింది అమెరికాకి వెళ్ళాడని. వాళ్ళ్ అన్నయ్యనుకుంటాను చెప్పాడు.
అనుకోకుండా రెండు, మూడేళ్ల క్రితం, హైద్రాబాదులో ఎయిర్‍పోర్టుకి వెళ్తూ దారిలో కధాసాహితి నవీన్ ఫోనులో పలకరించాడు. మూలింటామె గురించి మాట్లాడాడు. ఆశ్చర్య మేసింది. “సాహిత్యమేమిటి, తెలుగు సాహిత్యమేమిటి, మూలింటామె ఏమిటి? దాన్ని నువ్వు సమీక్షించడమేమిటి,” అన్న నా ప్రశ్నల పరంపరకి, “దేశానికి దూరంగా ఉన్నప్పుడు, ప్రేమలు, ఆపేక్షలు పెరుగుతాయిగా…నాకు అలా తెలుగు మీద ప్రేమ, సాహిత్యం మీద అనురాగం పెరిగింది,” అన్నాడు. సరేలే అనుకున్నాను.
మొన్న జంపాల గారు ఫేస్‌బుక్ లో, DTLC పేజిలో ఒక ఫోటోలో ఉన్నారు. అది గ్రూప్ ఫోటో. అందులో కనబడ్డాడు. వార్ని, భలే దొరికాడుగా అనుకున్నాను. ఆ ఫోటో కి కామెంట్ లో ఆ మిత్రుడికి తెలియజేయమని కోరాను.
మర్నాడు 22 అక్టోబరు. ఉదయం తన ఫోను కాల్ తో నిద్రలేపాడు. ఆ తేది, ఆ రోజు మర్చిపోను.
గొప్ప విషయం ఏమిటంటే, DTLC లో ఉన్నాడు. 2005 నుంచి. దాదాపు పదమూడేళ్ళు! ఇద్దరికి తెలిసిన వారు, పరిచయం ఉన్నవారు, సాహిత్య పిపాసులు. తెలుగు, తెలుగు సాహిత్యం! అయినా నాకు తెలియక పోయింది! బహుశ ఏ సోషల్ మెడియాలోను ప్రోఫైల్ లేదనుకుంటాను! లేకపోతే నేనెప్పుడో తగులుకునేవాడిని. (బహుశ నాలాంటి వాళ్లు తగులుకుంటారనే తప్పుకునుంటాడు.
ద హ )
“రాత్రి నిఘంటువు చూసా,” అని అందులో అంటూ నన్ను ‘రిపబ్లిక్ గార్డెన్స్‘ కి తీసుకువెళ్లిపొయ్యాడు. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం. తన భాష, యాస, పలుకుబడి, ఆ నవ్వు, ఆ తల ఊపడం, దేన్ని వదులుకోలేదు! “ఆంధ్ర సాహిత్య పరిషత్తు” గురించి ప్రస్తావిస్తూ, “మా ఊరు మద్రాసు” అని అన్నాడు! ప్రాణం ఒక్కసారి లేచి వచ్చింది! చి న
Amazing, రాఘవేంద్ర…చౌదరి! అసలు నువ్వు తెలుగులో, ఆ సామెతలు, ఆ కోటబుల్ కోట్స్ , ఆ వ్యంగ్యం, ఆ చమత్కారం…భలే! You know something! DTLC స్పూర్థి నాకు వేదిక ని మొదలుపెట్టడానికి. అఫ్ కోర్సు, మద్రాసులో మేము (అమ్మ, నేను, ఇతర సాహితీమిత్రులు) దాదాపు మూడు దశాబ్దాలు నిర్వహించిన సాహితీ సమావేశాల అనుభవం ఉందనుకో!
It is nice to know of your association with DTLC and love for your Telugu language! You made my day.
ఇక్కడ DTLC లో తన మాటలని వినండి.
BTW, that is…
పోఁగాలము దాపించినవారు దీప నిర్వాణగంధము నరుంధతిని మిత్రవాక్యమును మూర్కొనరు, కనరు, వినరని పెద్దలు చెప్పుదురు. చి న