చావెరుగని ‘‘చిరంజీవి’’!

అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు నాలుగవ ముద్రణ వెలువడక ముందే విశాలాంధ్ర దినపత్రిక లో వెలువడిన వ్యాసం.

సాధారణ రచయితల రచనలు గాలివాటంగా బతికి, మరుపున పడిపోతుంటాయి. బాతాఖానీరాయుళ్ళ రచనలు వేడివేడి పల్లీ బఠానీల్లా కాలక్షేపానికి బాగానే పనికి రావచ్చుకానీ, ముందుపేజీలో ఏం చదివామో వక్కపేజీకి వచ్చేసరికే మర్చిపోతుంటాం మనం! కానీ గొప్ప రచయితల రచనలు అలాకాదు; అవి నిద్రలోనూ మెలకువలోనూ కూడా మనల్ని వెంటాడతాయి! అలాంటి రచనలు మాత్రమే నాలుగు కాలాల పాటు నిలుస్తాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే కనక, విస్తృతంగా వివరించుకోనవసరం లేదుగానీ రెండు ముక్కల్లో ప్రస్తావించుకుని పక్కనపెడదాం! మామూలు రచయితల రచనల్లో ప్రాణంలేని పాత్రలుంటాయి; మంచి రచయితల రచనలలో మాత్రమే రక్తమాంసాలున్న మనుషులుంటారు! సాదాసీదా రచయితల రచనల్లో నాటునాటకీయత వుంటుంది – మంచి రచయితల రచనల్లో మాత్రమే జీవితవాస్తవం వుంటుంది! సాహిత్య విద్యార్థులందరికీ తెలిసిన సామాన్యమైన విషయాలే ఇవి!! నాలుగు కాలలపాటు నిలబడివుండి, చదువరులకు దారిదీపాలుగా వుపయోగవడిన ఏ రచనని చూసినా ఈ విషయం బోధపడుతుంది. మీకు ఇంకా సులువయిన మార్గమొకటి చెప్తాను- అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు ఒక్క సారి చదివిచూడండి! కనీసం, చిరంజీవి అనే ఉదాత్తమయిన వ్యక్తిత్వం కలిగిన నావికుడి గురించి రాసిన “బ్రతకడం తెలియనివాడు” అనే ఒక్క కథానిక చదవండిచాలు! ఇది, ఒకరకం, అత్మకథాత్మక కథనం! ఈమాట నేనన్నది కాదు- పిచ్చేశ్వరరావును క్షుణ్ణంగా తెలిసిన కొడవటిగంటి కుటుంబరావు చెప్పినమాట! “మనిషి తోపాటు పోకుండా సజీవంగా మిగిలిపోయేదేదో వుంటుంది. అదే, ఆ మనిషి చావును నమ్మశక్యం కాకుండా చేస్తుం” దన్నారు. కుటుంబరావు. పిచ్చేశ్వరావు కన్ను మూసిన తర్వాత సంవత్సరానికి, “పిచ్చేశ్వరావు కథలు” పుస్తకానికి రాసిన ముందుమాటలో అన్న మాటలివి! ఇన్నేళ్ళ తర్వాత ఇప్పటికీ, పిచ్చేశ్వరరావులో “అదేదో” మిగిలేవుందింకా – ఆయన రచనల్లో దాన్ని మనం చూడొచ్చు!!

పందొమ్మిదివందల ఇరవై దశకంలో పుట్టిన రచయితల తరంలో కనిపించే విశిష్టతలన్నీ అట్లూరి పిచ్చేశ్వరరావులోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. నిజానికి అవే పిచ్చేశ్వరరావుకు అమృతత్వం ఆపాదించాయనిపిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంలో ఈతరం విశిష్టమైన స్వరాన్ని సమకూర్చుకుంది. ఎక్కడో, అమెరికాలో వయె జనులందరికీ సార్వజనీనమైన వోటుహక్కు కల్పించడాన్ని- మొదటి ప్రపంచయుద్ధంలో చావుతప్పి, కన్నులొట్టబోయిన బ్రిటిష్ వలసవాదం ఒక్కొక్కటి గా ఆఫ్రో- అసియా దేశాలకు స్వాతంత్ర్యం ప్రకటిస్తూ రావడాన్ని- జపాన్ భూకంపాన్ని- డార్విన్ చెప్పిన పరిణామ సిద్ధాంతాన్ని పాఠశాల విద్యార్థులకు బోధించిన ‘నేరానికి’ జాన్ స్కోప్స్ అనే బ్రిటిష్ టీచర్ కి శిక్షపడడాన్ని- చాలా దేశాల్లో స్టాలిన్, ముసోలినీ, హిట్లర్, చర్చిల్ తదితర కండబలం కలిగిన నేతలు రంగం మీదికి రావడాన్ని- ఆర్థిక మాంద్యాన్ని- చర్చిల్ తెచ్చి పెట్టిన బెంగాల్ కరువునూ – పర్ల్ హార్బర్‌పై జపాన్ దాడిని- రెండో ప్రపంచయుద్ధం ముగిసిపోతున్న దశలో అమెరికా హిరోషిమాపై చేసిన పరమాణుబాంబు దాడిని – భారతదేశంతో పాటుగా అనేక మూడో ప్రపంచ దేశాలు వరసగా స్వతంత్రం కావడాన్ని- ఈతరానికి చెందిన రచయితలు తమ పెరుగుదలలో భాగంగా గమనిస్తూ, అనుభవిస్తూ వచ్చారు. అవి వాళ్ళకు రక్తగతమైపోయాయి! తెలుగు విషయానికి వస్తే కందుకూరి – గురజాడ- గిడుగు అందించిన అధునిక స్ఫూర్తి అభ్యుదయ దృక్పథానికి మూడో కన్నులా ఉపయోగపడింది!!

ముఖ్యంగా – బ్రిటిష్ వలస పాలకులకు తమ మాన సంరక్షణార్థం – భారతదేశ స్వాతంత్ర్య ప్రకటనను తక్షణ అవసరంగా మార్చిన రాయల్ ఇండియన్ నేవీ (ఆర్ ఐ ఆన్) పితూరీ అనే చరిత్రాత్మక తిరుగుబాటు అభ్యుదయ రచయితల, ప్రగతిశీల కళాకారుల నెత్తురును వేడెక్కించింది. 1945-53 మధ్యకాలంలో నేవీలో పనిచేసిన పిచ్చేశ్వరరావు అయిదు రోజులు సాగిన ఆ తిరుగుబాటులో స్వయంగా పాల్గొన్నవారు! అంచేత, పిచ్చేశ్వరరావుపై దాని ప్రభావం మరింతగా వుండడం సహజమే! కుటుంబరావు ముందుమాటలో ప్రస్తావించిన కథానిక ఈ తిరుగుబాటు గురించినదే. ఈ సంఘటనను చిత్రిస్తూ చిత్తప్రసాద్ వేసిన చిత్రం సుప్రసిద్ధం – అలాగే, ఇదే సందర్భంగా సలిల్ చౌదరీ రాసి, స్వరబద్ధంచేసిన గీతం కూడా ప్రసిద్ధమే! చిత్రమేమిటంటే కరాచీ నుంచి కోల్‌కతా వరకూ జరిగిన ఈ తిరుగుబాటు- ఒక్క కమ్యూనిస్టు పార్టీ తప్ప- దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఖండించాయి; తిరగబడ్డ నావికులు మాత్రం తమ అధీనంలోకి వచ్చిన 78 నౌకలపై కాంగ్రెస్, ముస్లింలీగ్, కమ్యూనిస్ట్ పార్టీల జెండాలు ఎగరేశారు!! అంతేకాదు, తిరుగుబాటుదార్ల తొలి డిమాండే, దేశంలోని రాజకీయ ఖైదీలనందరినీ తక్షణమే విడుదల చెయ్యాలని! రెండో డిమాండ్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులందరినీ వెంటనే విడుదల చెయ్యాలని! సంకుచిత, తక్షణ రాజకీయ ప్రయోజనాలకు అతీతమయిన చైతన్యం ప్రదర్శించిన నావికులనుచూసి, ఆనాటి బ్రిటన్ ప్రధాని క్లెమెన్ట్ అట్లీ దిగొచ్చాడంటే వింతేముంది? ఈ తిరుగుబాటులో ప్రత్యక్షంగా పాల్గొన్న పిచ్చేశ్వరరావు ఎందరో ‘చిరంజీవుల్ని’ కళ్ళారా చూసే వుంటారు! 1948 వరకూ స్వతంత్ర భారత్ -పాక్ దేశాల్లోని బ్రిటిష్ సేనలన్నింటికీ సుప్రీం కమాండర్‌గా పనిచేసిన – ఒకనాటి కమాండర్-ఇన్-చీఫ్ అచిన్‌లెక్ ప్రసంగించనున్న వేదిక పైనే ‘క్విట్ ఇండియా!’, ‘రివోల్ట్ నౌ!’ స్టికర్లు అతికించిన 22ఏళ్ళ సాహసి బీ.సీ. దత్ లాంటి వ్యక్తుల కథల ప్రాతిపదికపైనే “బ్రతకడం తెలియనివాడు” కథానిక పుట్టివుంటుంది . చిరంజీవి మాదిరిగా దత్తును ఎవరూ కాల్చిచంపకపోయినా, ఆయన నోటికాడ కూడు పడగొట్టి అంతపనీ చేశారు మన జాతీయ నాయకమ్మన్యులు!! పిచ్చేశ్వరరావులాంటి అభ్యుదయ రచయితలు ఇలాంటి పోకడలను – నిర్లిప్తంగా చూస్తూవుండలేరు మరి!

కృష్ణా జిల్లాలోని సాదాసీదా పల్లెటూళ్ళోని సామాన్య రైతుకుటుంబంలో పుట్టి, ఇంటర్మీడియట్ చదివి, హిందీ భాషలో విశారద పట్టం పొందిన పిచ్చేశ్వరావు నేవీలో ఏడెనిమిదేళ్ళు పనిచేశారు. ఆ తర్వాత విశాలాంధ్ర దినపత్రి కలో దాదాపు దశాబ్ద కాలం పనిచేశారు. అదే సమయంలో ఆయన ఎన్నో ప్రసిద్ధ రచనలను హిందీ నుంచి తెలుగు లోకి అనువాదం చేశారు. ప్రేమ్ చంద్ సుప్రసిద్ధ నవల గోదాన్‌ను, కిషన్ చందర్ రాసిన అద్భుత వ్యంగ్య నవల “ఒకానొక గాడిద ఆత్మకథ”నూ ఇల్యా ఎహ్రెన్‌బర్గ్ రచన “పారిస్ పతనం” తదితర రచనలనూ ఆయన అదే కాలంలో తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. మరెన్నో రచనలనూ, మరెందరో రచయితలనూ పిచ్చేశ్వరావు తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. 1955 మధ్యంతర ఎన్నికల తర్వాత మద్రాసు బాట పట్టిన అనేకమంది అభ్యదయ రచయితల దారిలోనే, 1960కి అటూఇటూగా పిచ్చేశ్వరావు సినీరంగప్రవేశం చేశారు. ‘ఇల్లరికం‘, ‘నమ్మినబంటు‘, ‘చివరకు మిగిలేది‘, ‘భార్యాభర్తలు‘, ‘వాగ్దానం‘, ‘బాటసారి‘, ‘ఆత్మబంధువు‘, ‘వివాహ బంధం‘ తదితర చిత్రాలకు రచన చేశారు. సినిమా రంగంలో అభ్యుదయ రచయితలకు ఆత్మతృప్తి కలిగే సందర్భాలు అరుదుగానే వుంటాయి. అది ఫక్తు వాణిజ్యరంగం! అక్కడ వాణిజ్య విలువలు తప్ప మరే విలువలూ చెలామణీ కావు!! పిచ్చేశ్వరావు లాంటి వ్యక్తులు అలాంటి చోట కూడా తమకు ఆత్మతృప్తినిచ్చే రచనలు చేసేందుకు యత్నిస్తారు. “గౌతమ బుద్ధ“, “కందుకూరి వీరేశలింగం” లఘు చిత్రాలకు స్క్రిప్ట్ సమకూర్చడం అందులో భాగమే!

కథకుడిగానూ, అనువాదకుడిగానూ, స్క్రిప్టు రచయితగానూ పిచ్చేశ్వరరావు చేసిన కృషి చూస్తే ఆయన శక్తిసామర్థ్యాల గురించి అంచనా వేసుకోవడం కష్టం కాదు. ముఖ్యంగా, సినిమా స్క్రిప్టు అధారంగా రూపొందించే ‘వెండితెర నవల‘ అనే ప్రక్రియను – బహుశా తొలిసారి జయప్రదంగా నిర్వహించిన పిచ్చేశ్వరరావు తర్వాతి రోజులలో ఈ రంగంలో వచ్చిన అనేక ప్రయోగాలను కూడా సుసంపన్నం చేసివుండేవారు. 1950 దశకంలోనే అకిర కురసవా రూపొందించుకున్న “సెవెన్ సమురాయ్ – షూట్ రెడీ స్క్రిప్ట్’ ను యథాతథంగా అచ్చువేస్తే, కొత్తతరం పాఠకులు దాన్ని నవల చదువుకున్నట్టు చదువుకున్నారట! దాదాపు నలభయ్యేళ్ళ తర్వాత తెలుగులోకూడా అలాంటి ప్రయోగాలు జరిగాయి. “అత్యధిక సర్క్యులేషన్’ గల వ్యాపార పత్రికలే వాటిని అచ్చువేసుకున్నాయి కూడా. సాహిత్య ప్రక్రియ రూపాలను దేశకాల పరిస్థితులు ప్రభావితం చేస్తాయనే ప్రాథమిక సత్యం తెలియనివాళ్ళు వెండితెర నవల లాంటి ప్రయోగాలు జయప్రదంగా చెయ్యలేరు! పిచ్చేశ్వరరావుకు అలాంటి విషయాలు క్షుణ్ణంగా తెలుసుననడానికి ఆయన రాసిన వెండితెర నవలలే నిదర్శనం. అన్నిటికీమించి పిచ్చేశ్వరరావు జీవితానుభవం ఆయన చేత మరెన్నో మంచి రచనలు చేయించివుండేదని అనిపించడం ఖాయం. కానీ, అలాంటి అరుదయిన రచయిత నుంచి తెలుగు భాషకు జరగాల్సినంత సేవ జరగక ముందే పిచ్చేశ్వరరావు కన్నుమూయడం ఓ విషాదం! ఆయన పోవడానికి నాలుగేళ్ళు ముందు పుట్టిన ప్రముఖ రచయిత ఛుక్ పలాఖ్నుయిక్ అన్నట్టుగా, “మనమందరం పోయేవాళ్ళమే; జీవితానికి లక్ష్యం కలకాలం బతకడం కాదు – అలా బతికే దాన్ని సృష్టించడమే మన లక్ష్యం!” పిచ్చేశ్వరావు ఆ పని చేయగలిగారనడంలో సందేహం లేదు. నలభైయేళ్ళ నడిప్రాయంలో, గుండె జబ్బుతో ఆయన కన్నుమూసి నిన్నటికి యాభయ్యయిదేళ్ళు పూర్తయింది!

మందలపర్తి కిషోర్

వ్యాస రచయిత సెల్‌: 81796 91822

అట్లూరి  పిచ్చేశ్వరావు  కథలు 

Published by
CLS Publishers LLP, Hyderabad

పుస్తకం ధర: 250.00 రూపాయలు
పుటలు : 280
బరువు : 220 గ్రాములు
ఈ క్రింది పుస్తకాల దుకాణాలలో కూడా లభిస్తుంది. 

ఈ   పుస్తకానికి:
Sole Distributors:
Navodaya Book House
,
Opp: Metro Pillar 14, Kachiguda Cross Roads, Hyderabad – 500 027,
Mobile: +91 – 90004 13413
వీరిదే ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌లో ఇక్కడ కూడా తీసుకోవచ్చు.
https://bit.ly/APRinNavodayaOnLine

Amazon లో:
Analpa Books ద్వారాకూడా తీసుకోవచ్చు:
Analpa Books,
35-69/1 2nd Floor GK COLONY (bus stop)
near Neredmet Cross Road, Saptagiri Colony,  Sainikpuri, Secunderabad, Telangana – 500 094
Mob: +91 70938 00678
https://amzn.to/3mnKBKN

గుంటూరులో :
Logili Book House,
Guntur – 522 007
Mobile: +91 95501 46514
వారి ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌లో ఇక్కడ తీసుకోవచ్చు:
https://bit.ly/APRonLogili



విశాఖలో
Book Center

Gur Banga Complex, Shop No.47-15-4, Diamond Park Rd, Dwaraka Nagar, Visakhapatnam, Andhra Pradesh 530016
Landline: 0891 2562684
Mob: 98851 42894 

విశాఖలో
Vagdevi – 
Gur Banga Complex, Door No.47-15-4, Diamond Park Rd, Dondaparthy, Dwaraka Nagar, Visakhapatnam, Andhra Pradesh 530 016
Mob : 93473 20588
Ph: +91 0891 2505785

విజయవాడలో
Pallavi Publications 
29-28-27, Dasari Vari St,
Moghalrajpuram, Suryaraopeta,
Vijayawada, Andhra Pradesh 520 010, India
Mob: 98661 15655 

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.