మాలతీ చందూర్ – మద్రాసు – ఒక స్మృతి

Malati and N R Chendur, Madras

మొన్న జనవరి లో కలిసాను మాలతీ చందూర్ గారిని.  వారింట్లోనే.  కచేరి రోడ్డు లో, మైలాపూర్‌లో శాంధోమ్ చర్చి కి దగ్గిర్లో.  వారింటి పక్కనే ఒక కేరళ వైద్యశాల ఉంటుంది.  శ్యామలాంబ గారు వారి సోదరి.  నేను, ఆరుద్ర రామలక్షి గారి పిల్లలు, దాశరధి గారి పిల్లలందరం కలిసి చదువుకున్న చిల్డ్ర్‌న్స్ గార్డెన్ స్కూలో లో వారు ఉపాధ్యాయురాలు.  దాదాపు మా కుంటుబాలు అన్ని కూడా 4 దశాబ్దాలుగా కలుస్తునే ఉన్నాయి. సాహిత్య సభలు కానివ్వండి, సినిమా ప్రీవ్యూలు కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, వివాహాలు కానివ్వండి మరొహటి కానివ్వండి.

చందూరు గారు వచ్చేవారు, హెరాల్డ్ కారులో. మాలతీ గారు కూడ వారితో బాటే. సినిమా సెన్సార్ బోర్డ్ కి వేసే సెన్సార్ షో కి నేను కూడ వెళ్ళేవాడిని. సినిమా నటుడు, ఛంద్రమోహన్ మామగారు, రచయిత్రి తులసి జలంధర గారి తండ్రి , డా గాలి బాలసుందర రావు గారు అద్దెకుండే ఇంట్లో ఒక పక్కగా ఖాళీ స్థలం ఉండేది. దానిలో సాహితీ సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. వాటికి కూడా భార్యా భర్తలు ఇద్దరూ వస్తుండేవారు.

1996 లో మా అమ్మ చనిపోయిన తరువాత ఫోనులో పలకరించుకోవడమే గాని, నేను వెళ్ళి కలిసింది లేదు. కాని మొన్న జనవరిలో వెళ్ళినప్పుడు కలిసాను. సాయంత్రం కలుద్దామనుకుంటే, మరుసరి రోజు ఉదయం కలుద్దామని అన్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో వెళ్ళాను. దాదాపు గంటో గంటన్నరో గడిపాను. మద్రాసులో తెలుగు వాతావరణం, తెలుగు సాహిత్య సభలు, సమావేశాలు, ఆ వాతావరణం, ఆంధ్ర రాష్ట్రం లో సాహిత్యం, సాహిత్య రంగంలో రాజకీయాలు వగైరాలు సాహితి మిత్రుల గురించి వాకబులు, కబుర్లు.
“జగతి”  గురించి ప్రస్తావన వచ్చింది.  చందూర్ గారు పోగానే “జగతి” ప్రచురణ ని ఆపేసానని చెప్పారు. ఇంతలో నేను వద్దని వారిస్తున్నా వినకుండా “కాఫీ చేసి తెస్తానుండు”, అంటూ మా టీచర్ గారు లోపలికి వెళ్ళారు.  “అనిల్ తో మామయ్య గురించి మాట్లాడవచ్చు అంటావా?” అంటూ మాలతి గారు మా టీచర్ గారిని అడగటం..వారు “తనేమన్నా బయట వాడా నువ్వు మాట్లాడకుండా ఉండటానికి” అంటుండగానే..లోపలికి వెళ్ళి ఇంతలావు బైండ్ చేసిన పుస్తకం తీసుకువచ్చారు. అదే “జగతి డైరి”. జగతి నుంచి ఏరి కూర్చిన వ్యాస సంకలనం. చందూరు గారి వ్రాసినవి. ఎంతొ ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో ఆ పుస్తకాన్ని నాకు చూపించారు ఆవిడ. దాదాపు ఒక సంవత్సర కాలం “జగతి” లన్ని ముందేసుకుని వాటిలో ఏరి కూర్చిన సంకలనం అది.  అంత పెద్ద పుస్తకానికి ధర కూడ తక్కువే పెట్టారు.

నా భార్య గతించిన విషయం తనకి తెలిసిందని అంటూ తను వ్రాసిన శిశిరవసంతం నవల లో “సంధ్య” గురించి చెబుతూ ఆ నవలని తప్పకుండా చదవమని కోరారు.  ఆ నవలలో “సంధ్య” కి కాన్సర్.  కాన్సర్ తో చేసిన యుద్దంలో సంధ్య గెలుస్తుంది ఆ నవలలో.

పాత్రికేయురాలు అరుణ పప్పు వ్రాసిన కథా సంపుటి “చందనపు బొమ్మ“కి ఒక పరిచయ సభని మద్రాసులో ఏర్పాటు చేసినప్పుడు ఆ నాటి సాయంత్రం వక్తలలో ఆమె ఒకరు. సినీ రచయిత, కవి భువనచంద్ర, నటి లక్ష్మి, నిర్మాత కాట్రగడ్డ మురారి, ఘంటసాల రత్నకుమార్ తదితరులు ఆ సభలో పాల్గొన్నారు.  ఆ సందర్భంలో తన కోసం ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళి వారితో సంతంకం చేయించుకున్న జ్ఞాపకంగా మిగిలి పోయిన “శిశిర వసంతం” నవల ఇది. కాని నిజ జీవితంలో గెలిచిన మాలతీ చందూర్ కాన్సర్ తో చేసిన యుద్దంలో పరాజిత.

శిశిరవసంతం, సంధ్య నాయిక

2 Replies to “మాలతీ చందూర్ – మద్రాసు – ఒక స్మృతి”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.