ఆ ఉగాది రోజున…

Bapu drawing

స్క్రిప్ట్ ఆర్ట్శ్ శాస్త్రిగారు ‘బాపు‘ బొమ్మలతో తెలుగువారి పండగలకి కొత్త శోభలిఛ్హిన రోజులవి.  ఉగాదికి, సంక్రాంతికి, వివాహాలకనేమిటి ప్రతి సందర్భానికి ఒక బాపు కార్డ్.  ఒక పాకెట్లో పది కార్డులు.  పది కవరులు వాటికి సరిపడా!  బొమ్మలాయనివి.  లోపల మాటలు.  బొమ్మకి తగినట్టుగా పదాలు. కొన్ని కావ్యాలలోనుంచి.  కొన్ని ఆరుద్ర లాంటి కవుల కలాలనుండి.

ఒకటి రెండూ కాదు.  కొంటే అదొక పాకెట్టు.  ఇదొక పాకెట్టు.  తలా ఒకటి అసార్టెడ్.  బావకి మరదలు.  చెల్లెలికి అన్నయ్య.  భార్యకి భర్త.  మామ్మకి మనవడు.  ఆఫ్రికాకి.  అట్లాంటాకి.  ఆస్ట్రేలియాకి. అబుదభికి.  గవర్నర్ గారేంటి.  సి ఎమ్ గారేంటి.  సినిమా తారలేంటి.  గుమస్తా ఏమిటి? ఎమ్ డి ఏవిటి?  ఒకడేవిటి?  ఒక నెలరోజుల ముందే కొనేసి రిజిస్టర్డ్ పోస్ట్‌లో పంపేవాళ్ళు కొందరు.  స్పీడ్‍పోస్ట్ లో పంపేవాళ్ళు కొందరు.

సర్కార్ ఎక్స్ ప్రెస్ ఎక్కి, బీచీ స్టేషన్‍లో దిగి, మద్రాసులో సి ఎ చదివేసి,  పనిలో పనిగా సినిమా తారలందర్ని ఒక లుక్కేసి మళ్ళీ ఏ హౌరా మెయిలో, కోరమాండలో ఎక్కేసే రోజులవి.
అలాంటి రోజుల్లో…

ఒక ఉగాది.

Bapu drawing
బాబు బొమ్మ నమస్కారం

పొద్దున్నే.
నీరసంగా వఛ్హారు ఇద్దరు కుర్రాళ్ళు.
బాపు గ్రీటింగ్స్ కావాలంటూ.  అన్ని అయిపోగా మిగిలిన వాటిల్లో నుంచి తలాఒకటి కార్డ్లు  తీసుకున్నారు.  ఆంధ్రపత్రిక వారి పంచాగం ఒకటి. నేమాని వారి పంచాంగం ఒకటి.  మొహాలు వేలాడేసుకుని చిల్లర ఇస్తున్నారు అమ్మకి.

“ఏంటయ్యా, పండగరోజు ఇలా నిరుత్సాహంగా ఉన్నారు?” అని అడిగింది అమ్మ.

“ఉగాది రోజండి.  ఎప్పుడు ఇల్లు వదిలి లేమండి. అమ్మ చేత్తో ఉగాది పఛ్హడి తినేవాళ్ళం.  ఈ సంవత్సరం ఆ గతి లేదు.  ఇక్కడెక్కడా ఉగాది పచ్చడి పెట్టేవాళ్ళెవరూ లేరు.  ఇంక ఇలా ఉండక ఎలా ఉంటామండి?” అని అన్నాడు అందులో ఒకడు చెమర్చిన కళ్ళతో.  ఏదో కంపెనిలో ఇంటర్నల్ ఆడిట్ కని వఛ్హారట.  పండక్కి ఇంటికి వెళ్ళడానికి  కుదర్లేదు.  “వెళ్ళొస్తామండి”  అని వాళ్ళు వెళ్లబోతుంటే  అమ్మ వాళ్ళని మాటల్లో దింపింది.  నేను కలగజేసుకున్నాను.  ఏలూరు వైపు వాళ్ళు.  అమ్మ వాళ్ళతో మాట్లాడుతూనే ఉంది.  మధ్యలో ఫోన్ చేసింది ఇంటికి.  నా భార్యకి ఏదో చెప్పింది.  నాతో ‘కరుప్పయ్య’ ని ఒక్కసారి వెంటనే ఇంటికి వెళ్ళి రమ్మనమని చెప్పు అంది.

కరుప్పయ్యన్ రిక్షాతను.  కొత్తగా అప్పట్లో రిక్షాలకి మోటర్లుండేవి.  పోస్టాఫిసు మూలమీద రిక్షా స్టాండ్.  అక్కడుంటాడు.  స్టాండ్ లోనే ఉన్నాడు.   “ఒకసారి అర్జెంటుగా ఇంటికి వెళ్ళిరా,” అని పంపాను.  ఇదిగో ఇక్కడున్నటు వస్తాను అని బుర్రు మని వెళ్ళాడు.  గట్టిగా నడిస్తే పది నిముషాలు పట్టదు ఇంటికి చేరుకోవడానికి.

పది నిముషాలలో వఛ్హాడు వెనక్కి.  చేతిలో చిన్న సంచి.  అందుకుని అమ్మకిచ్చాను.  సంచి తీసుకుని అమ్మలోపలికి వెళ్ళింది.  పుస్తకాల రాక్‍ల వెనుక కొంత ఖాళీ ఉంటుంది.  ఈ కుర్రాళ్ళ మూడు బాగోలేదుగా!  “వెళ్ళొస్తామండి” అని కుర్చిల్లో కూర్చున్నవారు లేచారు.  (అప్పట్లో ‘ఆంటి’ లు ‘అంకుల్స్’ లేరు.  అక్కయ్య గారు,  బాబయ్, పిన్ని గార్లే. ఎక్కువ.  లేదు “అండి”!)

“ఆగండాగండి,” ఆంటూ అమ్మ ముందుకు వఛ్హింది.  అమ్మ చేతిలో స్టీలు పళ్ళెం.  అందులో రెండు గిన్నెలు. గెన్నెలో స్పూన్.  ఆ రెండిట్లోను ఉగాది పఛ్హడి.

అవి చూడగానే  వాళ్ళ ముఖాలు విప్పారి ఇంతింతైనవి.  కళ్ళలో ఆనందం.  అమ్మ  వాళ్ళ అరిచేతిల్లోకి గిన్నెలో నుంచి స్పూన్ తో తీసి ఆ ఉగాది పచ్చడిని అందించింది.  లొట్టలేసుకుంటూ తినేసారు.  అందులో ఒకతను అరి చెయ్యి నాకేసుకున్నాడు.  బయటపెట్టిన బకెట్ నీళ్లతో చేతులు కడుకున్నారు ఇద్దరూ.  మాటల్లేవు.  పాంట్ జేబులోంచి హాంకిలు తీసుకుని మూతులు తుడుచుకున్నారు.  చేతులు తుడుచుకున్నారు.  ” తినండమ్మా ఇంకా కావాలంటే,” అని అమ్మ ఆ పళ్ళెం టేబుల్ మీద పెట్టింది, టేబుల్ వెనక్కి వెళ్ళి  కూచోబోతూ.

“ఉండండుండండి,” అంటూ అందులో ఒకరు  అమ్మ కాళ్ళమీదకి పడిపోయ్యి ” మా అమ్మ అంతటివారు, మిమ్మల్ని మరిచిపోలేమమ్మా, మమ్మల్ని ఆశీర్వదించండి” అని అపేశారు.  అందంతా అయిపోయింది.  వెళ్లలేక వెళ్ళారిద్దరూ!  కళ్ళు తుడుచుకుంటూ!

ఆ ఉగాది మొదలు ప్రతి ఉగాది రోజున అడిగిన వారికి ఉగాది పచ్చడి వడ్డించడం ఆనవాయితి అయిపోయింది రాణీ బుక్ సెంటర్ కి.  తరువాత తరువాత ‘రాణమ్మ’  చేతి ఉగాది పచ్చడి కోసమే పాండిబజారులోని రాణీ బుక్ సెంటర్ కి వచ్చేవారు కొంతమంది.  వాళ్ల ఇళ్ళల్లో చేసుకుని తిన్నా!

But today, it is a different story.  Neither is Rani Book Center there, nor my mother!  What an irony!  But that is life I guess.

అమ్మ   = చౌదరాణి
ఇక్కడ వాడిన బాపు బొమ్మకి హక్కుదార్లుః https://te.wikipedia.org/w/index.php?curid=78744

మొన్న సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా హైద్రాబాద్‌కి వచ్చాడు

The Loneliness of Being
Rajesh Khanna
DARK STAR
ఇది ఇంగ్లిష్ పుస్తకం.

హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్.  ఈ పుస్తకానికి  #hydlitfestival కి  ఈ టపాకి ఏమిటి సంబంధం అని మీకు సందేహాలు రావడం ఆశ్చర్యం లేదు.  మద్రాసు.  అదే సంబంధం.  Chennai is a city, Madras is an emotion అదే జ్ఞాపకం వస్తోంది ఇప్పుడు.

దాదాపు దశాబ్దం క్రితం వరకు దక్షిణాది చలనచిత్రాలకు కేంద్రంగా ఉండేది మద్రాసు.  ఉత్తరాది వాళ్ళు కూడ మద్రాసులో సినిమా నిర్మాణాలు చేసుకునేవారు.  వాళ్ళకి పంపిణీ కార్యాలయాలు కూడ అక్కడ ఉండేవి.  ఆంద్రప్రదేశ్ వారికి కూడ మద్రాసే అప్పుడు.

చాలా సినిమాలు మద్రాసులో షూట్ చేసుకున్నారు బాంబే నిర్మాతలు.  వాటిలో ఒకటి.  హాతీ మేరే సాథి. నిర్మాత సాండో‘ చిన్నప్ప తేవర్. హాతీ మేరే సాథి లో నాయకుడు రాజు పాత్రధారి – రాజేష్ ఖన్నా. సినిమాలో హీరో ఉద్యోగం కోసం రోడ్లవెమ్మటపడతాడు.  అందులో భాగంగా పాండిబజార్‌ లో ఆ దృశ్యాలని చిత్రీకరించారు.  (ఆ పాండిబజారులోనే రాణి బుక్ సెంటర్ తెలుగు పుస్తకాల కొట్టు ఉండేది.  రాణి బుక్ సెంటర్‌ని స్థాపించింది  చౌదరాణి. రచయిత అట్లూరి పిచ్చేశ్వర రావు – చౌదరాణి నా తల్లితండ్రులు.  చౌదరాణి కవిరాజుత్రిపురనేని రామస్వామి కనిష్ట పుత్రిక.)  ఇక మా నాన్న అట్లూరి పిచ్చేశ్వరావు తొలి తెలుగు వెండితెర కథనాన్ని గ్రంధస్తం చేసినవారు.

హాతీ మేరే సాథి లో రాజేష్ ఖన్నాకి “ఉద్యోగం కావాలి, ఉందా?” అని అడిగితే, “లేదు పో,” పొమ్మనడం కూడ ఉంది. రాణి బుక్ సెంటర్ ఎదురుగుండా ఉండే రాజేశ్వరి ఎలక్ట్రికల్స్‌లోను, హమీదియా హోటల్ & బేకరి లో కూడా ఉద్యోగాలు లేవని ఈ కాకా / జతిన్ ఖన్నా ని తరిమేస్తారు.

ఆ హాతీ మేరే సాథి సినిమా గురించి, రాజేష్ ఖన్నా గురించి పుస్తకం రాసిన రచయిత ఈ #hydlitfestival కి వస్తున్నాడు కదా అని వెళ్ళాను.

Gautam at hyd Lit festival jan26, 2015
రాజేష్ ఖన్నా డార్క్ స్టార్ రచయిత గౌతమ్ చింతామణి, ఉమా మగళ్, రచయిత రాఘవేందర్.

రచయిత ఎవరు?  కవిత చింతామణి పుత్రుడు.  కవిత ఎవరు?  కె. ఆరుద్ర రామలక్షి ల ప్రధమ పుత్రిక.  సరే, ఈ ఆరుద్ర, రామలక్షి‌ లు ఎవరు?  ( మీకు తెలియకపపోతే  గూగుల్ చెయ్యండి).  నా తల్లి తండ్రులకు స్నేహితులు. సాహితీ బంధువులు.  ఓహ్ రచయిత పేరు చెప్పలేదు కదూ!  అతని పేరు గౌతమ్ చింతామణి.

ఇవన్ని అతి ముఖ్యమైన కారణాలు నేను #hydlitfestival కి వెళ్లడానికి. జనవరి 23,24,25, 26 తారిఖులలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగం పేట లో జరిగింది ఈ హైద్రాబాద్ లిటరేచర్ ఫెస్టివల్.  పైన హెడర్ లో ఉంది ఆ పాఠశాల ప్రధాన భవంతి చిత్రమే!  అందులో 26 వ తేదిన టాటా రాక్‌ఫోర్ట్ సభాస్థలి వేదిక.  మధ్యాహ్నం Reams on Reels అనే శీర్షికమీద గౌతమ్ , ఎమ్. కె రాఘవేంద్ర లు చలనచిత్ర రంగం మీద తాము వ్రాసిన పుస్తకాలను గురించి సంచాలనకర్త ఉమ మగళ్ తో కలిసి వచ్చిన ఆహుతులతో పంచుకున్నారు.

ఇక పుస్తకం ఎలాగుంది?

ఇప్పటికే బాలివుడ్‌మీద రాస్తూ తనకుంటూ ఒక ఉనికిని ఏర్పరుచుకుంతున్న రచయిత గౌతమ్. నిబద్ధతతో చేసిన రచన ఇది.

సూపర్ స్టార్

Rajesh Khanna Superstar
The Loneliness of Being Rajesh Khanna Dark Star

→  రాజేష్ ఖన్నా ఎవరితో పడుకున్నాడు,
→  ఏ నిర్మాతని ఏడిపించాడు,
→  రోజుకుని ఎన్ని పెగ్గులు తాగేవాడు,
  పేక ఆడేవాడా?

లాంటి వ్యక్తిగత విషయాలూ, అతని జీవితంలోని వివాదాలు రాయలేదు. సూపర్‌స్టార్ రాజేష్‌ ఖన్నా గురించి అతని నటజీవితం గురించి మాత్రమే వ్రాసాడు. ఒక్క మాటలో చెప్పాలంటే  ఈ గౌతమ్ చింతామణి తన మాతమహుల పేరు నిలబెట్టాడు.  అనవసరమైన వ్యక్తిగత వివాదాలలోకి వెళ్ళలేదు.  అయినా పుస్తకం విడుదలైన అతి తక్కువ సమయంలోనే మలి ముద్రణకి నోచుకుంది.  భారతీయ చలనచిత్ర రంగంలోని తొలి  “సూపర్ స్టార్” మీద వెలివడిన పుస్తకం ఇది.

The Loneliness of Being Rajesh Khanna  DARK STAR బాలివుడ్ మీద ఆసక్తి వున్నవాళ్ళు అందరూ చదవతగ్గ పుస్తకం.

1950 ప్రాంతలలో పుట్టిన వాళ్ళకి హింది సినిమా అభిమానులకు, ‘సూపర్ స్టార్’ రాజేష్ ఖన్నా ఫాన్‌లకు గొప్ప బహుమతి ఈ పుస్తకం.

ఈ పుస్తకం గురించి ఆంగ్ల పత్రికలలో వచ్చిన కొన్ని సమీక్షలు ఇక్కడున్నవి.
తెలుగులో ఈ పుస్తకం గురించి పూర్ణిమ వ్రాసిన పరిచయం ఇక్కడ  పుస్తకం డాట్ నెట్‌లో చదువుకోవచ్చు .
ప్రతులు – ఇక్కడ అమెజాన్ లోనూ ఫ్లిప్‌కార్ట్‌లో ఇక్కడ కొనుక్కోవచ్చు

వెలగా వెంకటప్పయ్య

మొన్న మళ్ళీ కాళీపట్నం రామారావు మాస్టారి నవతీతరణం అభినందన ప్రత్యేక సంచిక చదివినప్పుడు వెలగా వారి వ్యాసం చదివాను.  చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వారి వయస్సుకి అంతర్జాలం గురించి ఆ మాత్రం అవగాహన ఉండటం.  అంతే కాదు ఆ ఏడు పేజీల సాహితీ వ్యాసం చివరి పేరగ్రాఫ్ లో వారన్న మాట: “ఇంటర్‌నెట్ ఉంటే ప్రతి ఇల్లు ఒక కథానిలయం అవుతుంది…కారా మాస్టారు సేకరించిన అపూర్వ కథా సంపదను అధికంగా ఉపయోగించినా, అసలు ఉపయోగించకపోయినా శిధిలమౌవుతుంది.  శిధిలం మాట మరిపించేది, మురిపించేది అంతర్జాల మాయాజాలం.”

Dr Velaga Venkatappaiah, Tenali
డా. వెలగా వెంకటప్పయ్య (1930 – 29 Dec 2014)

సాక్షి దిన పత్రిక లో నేను వ్రాసిన గూగుల్ నెట్‌లో e బుక్స్ చదివి వెంటనే నాకు ఫోన్ చేసి అభినందించిన వారిలో ఆయన ఒకరు.  ఆ వ్యాసాన్ని ఆయన ఆంధ్రా యూనివర్సిటి కి సమర్పించిన ఒక పత్రంలో ప్రస్తావించానని, అక్కడి విద్యార్ధులకి అందజేసానని కూడ తెలియజేసారు.

తెలుగునాట గ్రంధాలయాల ఏర్పాటు కోసం ఆయన చేసిన కృషి చాల గొప్పది.

కవిరాజు త్రిపురనేని రామస్వామి అంటే వారికి అభిమానం.  కవిరాజు మనుమడిగా ఆ అభిమానం నా మీద కూడ కొంత చూపించారనుకుంటాను.  మేము మద్రాసులో ఉన్నప్పుడు ఆక్కడికి వచ్చినప్పుడల్లా మా అమ్మ ‘కవిరాజు’ కుమార్తె చౌదరాణి ని తప్పక కలిసేవారు.

ఆదివారం మే 6, 2012 న కేంద్ర సాహిత్య అకాడెమి కవిరాజు త్రిపురనేని రామస్వామి సాహిత్యం మీద గుడివాడ లో నిర్వహించిన సదస్సులో వారు కూడ పాల్గొన్నారు.

Seminar on Kaviraju Tripuraneni Ramaswamy
The invitation to the seminar on ‘Kaviraju’ Tripuraneni Ramaswamy.

వెలగా వారు ఈ రోజు ఉదయం విజయవాడలో ఆయుష్ హాస్పిటల్స్ లో ఆఖరి శ్వాస తీసుకున్నారని తెలిసినప్పుడు బాధవేసింది. మరో స్థంభం నేల కూలింది.

రచనలు
వారి రచనలలో కొన్ని, వాటి  ముఖచిత్రాలు ఇక్కడున్నవి.  సాహిత్యాభిమాని – ఆర్ బి రావ్ సౌజన్యం.
https://www.facebook.com/media/set/?set=a.10155009212985385.1073741875.624985384&type=1&l=1ce9757082

గెస్ట్‌కాలం – ఈ రీడింగ్

ఈ రీడింగ్ – ఈజీ రీడింగ్
ఈ వ్యాసం నిన్న సాక్షి దినపత్రిక,  ఫామిలీ లో మొదలైన గెస్ట్‌కాలం లో వచ్చింది.  పుస్తకాలతో మొదలుపెడితో బాగుంటుందని అని వారనుకుని నన్ను వ్రాయమని కోరారు.  ఆ సందర్భంగా వ్రాసిని వ్యాసం ఇది.  అన్నట్టు ఈ గెస్ట్‌కాలం ప్రతి బుధవారం వస్తుంది.  ఆయా రంగాలలో నిష్ణాతుఁలు వారనికొకరు మీకు అందిస్తుంటారు.  ఇక వ్యాసం ఇది.  స్థలాభావం వల్ల వ్యాసం కొంత “సంపాదకుల కోత” కి గురైంది.  పూర్తి పాఠం తరువాత ఎప్పుడైనా వీలున్నప్పుడు ఇక్కడే పోస్ట్ చేస్తాను.

సూచన: బొమ్మ మీద క్లిక్ చెయ్యండి.  సులభంగా చదువుకోవచ్చు

e reading easy reading

మాలతీ చందూర్ – మద్రాసు – ఒక స్మృతి

Malati and N R Chendur, Madras

మొన్న జనవరి లో కలిసాను మాలతీ చందూర్ గారిని.  వారింట్లోనే.  కచేరి రోడ్డు లో, మైలాపూర్‌లో శాంధోమ్ చర్చి కి దగ్గిర్లో.  వారింటి పక్కనే ఒక కేరళ వైద్యశాల ఉంటుంది.  శ్యామలాంబ గారు వారి సోదరి.  నేను, ఆరుద్ర రామలక్షి గారి పిల్లలు, దాశరధి గారి పిల్లలందరం కలిసి చదువుకున్న చిల్డ్ర్‌న్స్ గార్డెన్ స్కూలో లో వారు ఉపాధ్యాయురాలు.  దాదాపు మా కుంటుబాలు అన్ని కూడా 4 దశాబ్దాలుగా కలుస్తునే ఉన్నాయి. సాహిత్య సభలు కానివ్వండి, సినిమా ప్రీవ్యూలు కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, వివాహాలు కానివ్వండి మరొహటి కానివ్వండి.

చందూరు గారు వచ్చేవారు, హెరాల్డ్ కారులో. మాలతీ గారు కూడ వారితో బాటే. సినిమా సెన్సార్ బోర్డ్ కి వేసే సెన్సార్ షో కి నేను కూడ వెళ్ళేవాడిని. సినిమా నటుడు, ఛంద్రమోహన్ మామగారు, రచయిత్రి తులసి జలంధర గారి తండ్రి , డా గాలి బాలసుందర రావు గారు అద్దెకుండే ఇంట్లో ఒక పక్కగా ఖాళీ స్థలం ఉండేది. దానిలో సాహితీ సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. వాటికి కూడా భార్యా భర్తలు ఇద్దరూ వస్తుండేవారు.

1996 లో మా అమ్మ చనిపోయిన తరువాత ఫోనులో పలకరించుకోవడమే గాని, నేను వెళ్ళి కలిసింది లేదు. కాని మొన్న జనవరిలో వెళ్ళినప్పుడు కలిసాను. సాయంత్రం కలుద్దామనుకుంటే, మరుసరి రోజు ఉదయం కలుద్దామని అన్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో వెళ్ళాను. దాదాపు గంటో గంటన్నరో గడిపాను. మద్రాసులో తెలుగు వాతావరణం, తెలుగు సాహిత్య సభలు, సమావేశాలు, ఆ వాతావరణం, ఆంధ్ర రాష్ట్రం లో సాహిత్యం, సాహిత్య రంగంలో రాజకీయాలు వగైరాలు సాహితి మిత్రుల గురించి వాకబులు, కబుర్లు.
“జగతి”  గురించి ప్రస్తావన వచ్చింది.  చందూర్ గారు పోగానే “జగతి” ప్రచురణ ని ఆపేసానని చెప్పారు. ఇంతలో నేను వద్దని వారిస్తున్నా వినకుండా “కాఫీ చేసి తెస్తానుండు”, అంటూ మా టీచర్ గారు లోపలికి వెళ్ళారు.  “అనిల్ తో మామయ్య గురించి మాట్లాడవచ్చు అంటావా?” అంటూ మాలతి గారు మా టీచర్ గారిని అడగటం..వారు “తనేమన్నా బయట వాడా నువ్వు మాట్లాడకుండా ఉండటానికి” అంటుండగానే..లోపలికి వెళ్ళి ఇంతలావు బైండ్ చేసిన పుస్తకం తీసుకువచ్చారు. అదే “జగతి డైరి”. జగతి నుంచి ఏరి కూర్చిన వ్యాస సంకలనం. చందూరు గారి వ్రాసినవి. ఎంతొ ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో ఆ పుస్తకాన్ని నాకు చూపించారు ఆవిడ. దాదాపు ఒక సంవత్సర కాలం “జగతి” లన్ని ముందేసుకుని వాటిలో ఏరి కూర్చిన సంకలనం అది.  అంత పెద్ద పుస్తకానికి ధర కూడ తక్కువే పెట్టారు.

నా భార్య గతించిన విషయం తనకి తెలిసిందని అంటూ తను వ్రాసిన శిశిరవసంతం నవల లో “సంధ్య” గురించి చెబుతూ ఆ నవలని తప్పకుండా చదవమని కోరారు.  ఆ నవలలో “సంధ్య” కి కాన్సర్.  కాన్సర్ తో చేసిన యుద్దంలో సంధ్య గెలుస్తుంది ఆ నవలలో.

పాత్రికేయురాలు అరుణ పప్పు వ్రాసిన కథా సంపుటి “చందనపు బొమ్మ“కి ఒక పరిచయ సభని మద్రాసులో ఏర్పాటు చేసినప్పుడు ఆ నాటి సాయంత్రం వక్తలలో ఆమె ఒకరు. సినీ రచయిత, కవి భువనచంద్ర, నటి లక్ష్మి, నిర్మాత కాట్రగడ్డ మురారి, ఘంటసాల రత్నకుమార్ తదితరులు ఆ సభలో పాల్గొన్నారు.  ఆ సందర్భంలో తన కోసం ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళి వారితో సంతంకం చేయించుకున్న జ్ఞాపకంగా మిగిలి పోయిన “శిశిర వసంతం” నవల ఇది. కాని నిజ జీవితంలో గెలిచిన మాలతీ చందూర్ కాన్సర్ తో చేసిన యుద్దంలో పరాజిత.

శిశిరవసంతం, సంధ్య నాయిక

నా కోసం

లక్షాలాది మంది ఆయన పాడగా వినాలని,
ఆయనతో ఒక కరచాలనం చెయ్యాలని,
వారి ఆశిస్సులుంటే చాలని కోరుకునేవారు.

ఆయనేమో అక్కడెక్కడో బెంగుళూరు బేకరిలో ఏ పాస్ట్రీ యో, బిస్కట్టో బాగుందని కొని తీసుకువచ్చేవారు.
నాకోసం.
అడయారు నుంచి  టీ నగర్ దాకా. (http://goo.gl/maps/6Z7xu ) దాదాపు ఓ పది కిలోమీటర్లు.  నన్ను గుర్తు పెట్టుకుని మరీ.  వారికి నేనేమి బంధువును కాను.  ఐనా.

ఆదివారం సాయంత్రాలు  ఆరు ఏడు ఆ ప్రాంతాల్లొను,  రాత్రి ఐతే 8 ఏ ప్రాంతాల్లొ వచ్చేవారు.    మేమిద్దరం ఆయన కారులో కూర్చునో, కారుకి ఆనుకునో నిలబడి కబుర్లు చెప్పుకుంటూ గంటల కొద్ది కాలం గడిపేవారం.

“ఫరవాలేదు..నేనిమి అనుకోను..మీ స్మోకింగ్ మీది” అని ముందే అనేసేవారు. మాములుగా మా కబుర్లు సంగీతం, సాహిత్యం మీదే ఉండేది.ఘజల్స్ మీద వారికి ఆసక్తి మెండు.  కొత్తగా వ్రాసింది తీసుకువచ్చేవారు.  రాగయుక్తంగా చదివి వినిపించేవారు.  నాకు అర్థం కాని చోట వివరంగా విడమరిచి చెప్పేవారు.

P B Srinivas ( 22 Sept 1930 - 14 Apr 2013)
P B Srinivas
( 22 Sept 1930 – 14 Apr 2013)

ఆ జేబులో కనీసం ఒక ఐదారు పెన్నులు,  ఆ చేతిలో పుస్తకాలు లేకుండా కనపడేవారు కాదు.  తనని ఆహ్వానించిన ప్రతి సభకి హాజరయ్యేవారు.  ఒక ప్రశంసా పత్రమో, ఒక కవితో చదివి వినిపించి దాన్ని ఆ నాటి కర్త కి అందించి వెళ్ళేవారు. వాటిని సేకరించి ప్రచురిస్తే బాగుంటుంది.  కాని అదేమి సామాన్యమైన విషయం కాదు!  ఆయన అలా వ్రాసిచ్చింది తక్కువేమి కాదు.

వయస్సుతో నిమిత్తం లేకుండా ఎంతో స్నేహంగా ఉండేవారు.  చెరగని చిరునవ్వు!
మొన్నామధ్య మద్రాసు వెళ్ళినప్పుడు కూడా అనుకున్నాను.  వెళ్ళి కలవాలని.
చాలమందిని కోల్పొయ్యాను.
కోల్పోతున్నాను కూడా!