ఈ కథని దాదాపు పదేళ్ల క్రితం రాసాను.
ఇటీవలి కాలంలో ఒకానొక పత్రికా సంపాదకులు, మిత్రులు కథలుంటే ఒకటి పంపండి మా పత్రికలో ప్రచురిస్తాం అని అడిగితే. ఈ కథని పంపాను. ఇదిగో అదిగో అంటూ కొన్ని నెలలు జరిగిన తరువాత తన మిత్రులెవరో నచ్చలేదన్నారని తెలియజేసాడాయన.
అది ఇలా ఈ డిసెంబరు 17, 2023 ఆదివారం నాడు సంచిక లో ప్రచురణకి నోచుకుంది.
కథని ఈ లంకె ని క్లిక్ చేసి చదువుకోవచ్చు.
చాలు!
నేను తరచూ చెప్తుంటాను.
ఫేస్‌బుక్‌లో ప్రవేశించేవారికి చర్మం మందంగా వుండాలని. ఎంత మందంగా వుంటే అంత మంచిదనికూడా. ఎందుకంటే వాళ్ళూ, వీళ్ళు తెలిసీ, తెలియక నోరు పారేసుకుంటూవుంటారు. అలాంటి సందర్భాలలో ఒకొక్కసారి collateral damageలో భాగంగా పక్కనున్నవాళ్ళకి కూడా దెబ్బలు తగులుతుంటాయి. గాయలవుతాయి. అలా దెబ్బలు తిన్నవాళ్లని, గాయపడ్డవారిని చూస్తూనే వున్నాను.
గాయపడ్డ వాళ్ళ చర్మం మందాన్ని బట్టి, వారి మనసుకి బాధని భరించే శక్తిని బట్టి ‘హర్టు’ అవుతుంటారు. విషయం పూర్తిగా ఆకళింపు చేసుకోకుండా, నేపధ్యమూ, వివరమూ తెలియకుండా దారినపోయే దానయ్యలూ, దానమ్మలూ కూడ రాళ్ళు విసురుతారు!
వెనక్కి తిరిగి రాళ్ళు విసిరినవాళ్ళకి పబ్లిక్‌గా జవాబిచ్చే అవకాశం వున్నా, అది తమని దుర్గంధపూరితమైన మురికికూపంలోకి లాగుతుందని తెలిసి స్పందించకుండా పక్కకు తప్పుకుని వెళ్ళిపోవడం అత్యున్నతమైన మార్గమని తెలిసిన వాళ్ళు కొందరుంటారు. వీళ్ళు ఈ ఫేసుబుక్ లోకం ఏమనుకున్నా ఫరవాలేదనుకుంటారు! After all Facebook is not the only world! ఎందుకంటే తాము తప్పు చెయ్యలేదని వారికి స్పష్టంగా తెలుసు.
దాదాపు పది పదిహేనేళ్ళుగా ఈ ఫేసుబుక్‌లో అనేకమైన సందర్భాలలో అనేక మంది వ్యక్తులను, వారి వ్యక్టిత్వాలను, ప్రవర్తనను చూస్తూవస్తున్నాను. ఇటీవల రెండు సంఘటనలు చూసిన తరువాత చూసింది, విన్నది, అర్ధం చేసుకున్నది, స్పందించింది ఇక చాలు అనిపించింది.
అందులో ఒకటి ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినది. ఇద్దరూ విజ్ఞులే. తమ తమ రంగాలలో నిష్ణాతులు. తమ విద్వత్తుతో, జీవితానుభవంతో సమాజానికి తమ తోచినంతమేరకు సహాయ సహకారాలు అందిస్తున్నవారే! వాళ్ళిద్దరి మధ్య ‘బ్లాకు’!
మరో సందర్భంలో కూడా అలాంటిదే.
ఇంత చిన్న జీవితంలో కాలి మడమలు కూడ తడపలేని లోతున్న ఈ ఫేస్‌బుక్ ‘స్నేహ సముద్రం’లో వ్యక్తిగతంగా పరిచయంలేని (ఆఫ్ ది గ్రిడ్) ‘స్నేహా’లలో comments ని out of context కి twist చేసి తమకు అనుకూలంగా convoluted arguments చేసి దానితో ఆగక బురదజల్లుడు, దూషణలు, బ్లాకులు. అవసరమా?
మరొక సందర్భంలో అకారణంగా ద్వేషాన్ని పెంచుకోవడం! చిన్న పిల్లలా అంటే కాదు! తల్లులు, తండ్రులుగా వృత్తిపరంగా బాధ్యతలు, విధులూ నిర్వహిస్తున్నవారే! అపోహలకి, అపార్ధాలకి దారి తీసిన విషయాలను కూర్చుని సంప్రదించుకుని నిర్ణయాలు తీసుకోగలిగిన వివేకవంతులే(?) కారేమో మరి!
ఈ పోస్ట్ కూడా అనవసరం అనుకున్నాను కాని ఇది off the grid, వ్యక్తిగతంగా నన్ను తెలిసిన దేశ విదేశాలలోవున్న మిత్రులకి తెలియజేయడం కోసం చెప్పాల్సి వస్తోంది. నేను ఇక్కడ కనపడటంలేదని అనుకోవద్దు. నాతో వ్యక్తిగత పరిచయం వున్నవారందరి వద్ద నా contact coordinates వుంటాయి కాబట్టి టచ్‌లో వుందాం. కుదిరినప్పుడు ఒక కప్పుటీ తో ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు వీలున్నప్పుడు కలుద్దాం.
BTW, ఇక్కడ నా అకౌంట్‌ని ప్రస్తుతానికి డిలీట్ గాని డీఆక్టివేట్‌గాని చెయ్యడం లేదు. వేదిక కార్యక్రమం ప్రకటనలుంటాయిగా!
Note: This Facebook post was made public disabling the comments on 15 Dec 2023.
మీ టూ
స్క్రీన్ బీ – త్రీ లోకి ప్రవేశించాడు జిష్ణు. షో అయిపోయినట్టుంది. ఖాళీగా ఉంది థియేటర్. తనకి దగ్గిర్లో కిందపడిఉన్న ఖాళీ ‘లేస్’ కవర్‌ని తీసేస్తున్న క్లీనింగ్ స్టాఫ్‌ని ఉద్దేశించి “నెక్స్ట్ షోకి ఇంకా ఎంత టైముంది?” అని అతను అడిగితే “టెన్ మినిట్స్” అని జవాబిచ్చింది ఆమె. అతను “థాంక్స్” అని గొణుగుతూ వెనక్కి తిరిగి ఫోయర్ ( థిఏటర్ ఆవరణ) లోకి నెమ్మదిగా అడుగులేస్తూ వెళ్ళాడు.
డోర్స్‌కి రెండువైపులా గోడలకి ఆనించి పొడుగ్గా సోఫాసెట్‌లు ఉన్నవి. వాటికి ఎదురుగా ఫోయర్‌లోనే అక్కడక్కడ డిస్‌ప్లే విండోస్. వాటితో పాటే రిలీజ్ కాబొయ్యే కొత్త సినిమాల పోస్టర్లు, ఫొటో కార్డ్‌లు.
కుడి చేతివైపు సోఫాలో, ఆ చివర గోడకి ఆనుకుని ఒక యువతి కూర్చునుంది. ఆమె కాళ్ళు తన ముందున్న యువకుడి ఒడిలో ఉన్నాయి. వాళ్ళు తమదైన మరో ప్రపంచంలో ఉన్నారు.
జిష్ణు చిరాకుగా ఎడం వైపుకి తల తిప్పాడు.
ఎడం చేతి వైపు సోఫా వరుసలో అటు చివరగా ఒంటరిగా కూర్చుని ఉన్నాడు అతను. లౌడ్ కలర్స్ తో ఉన్న చెక్‌డ్ షర్ట్. స్లిమ్ ఫిట్ డార్క్ బ్లూ కలర్ జీన్స్‌లోకి టక్ చేసుకున్నాడు. లెదర్ బెల్ట్ కొంచెం బిగించినట్టున్నాడు. అయినా పొట్ట బెల్ట్ మీదుగా కొంచెం కిందకి జారి కనపడుతున్నది. కుడి కాలు తొడ మీద, ఎడం కాలేసుకుని కూర్చున్నతను కాస్త తీక్షణంగాను ప్రపంచాన్ని మరిచిపోయి మరీ చూస్తున్నాడు. రెప్పవెయ్యకుండా. అతను చూస్తున్నవైపే జిష్ణు తన దృష్టిని జారించాడు.
అక్కడ చూడ ముచ్చటగా ఉన్న జంట. వారితో పాటు ఒక బాబు కూడా ఉన్నాడు. ఏడెమినిదేళ్ళుండవచ్చు. కొంచెం ఊరిన బుగ్గలతో, ఎర్ర్రని పెదాలతో, నిగ నిగ లాడుతూ ఆరోగ్యంగా ఉన్నాడు. బ్లేజింగ్ రెడ్ కలర్ టీ. కొంచెం టైట్‌గానే ఉన్నట్టుంది. ఛాతికి అతుకున్నట్టు ఉంది. అది వైట్ కలర్ షార్ట్స్ లోకి టక్ఇన్ చేసుంది. షార్ట్స్ కూడా టైట్‌గా ఉన్నట్టున్నాయి. పిర్రలకి అతుక్కుని లోపలి అండర్‌వేర్ కూడా కనపడి కనపడకుండా కనపడుతోంది. బొద్దుగా, క్యూట్‌గా కూడా ఉన్నాడు. ఆ పక్కనే ఉన్న ‘జస్టిస్ లీగ్’ సినిమా పోస్టర్ వాడిని ఆకర్షించినట్టుంది. 3డి సినిమా పోస్టర్ అది. వాడు అటు తిరిగి దాని దగ్గిరకు వెళ్ళాడు. ఈ లోపు ఆ బాబుతో ఉన్న ఆమె తనతో ఉన్నతనితో డ్రింక్స్‌కో, ఈటబుల్స్‌కో ఆర్డర్ ఇవ్వమన్నట్టుంది. అతను ఆ ఫోయర్‌లో కుడి చేతి వైపున్న స్టాల్స్ వైపు వెళ్ళాడు.
బాబు పోస్టర్‌ని చూస్తున్నాడు. రెప్ప మూసి తెరిచేటప్పడికి, బ్లూజీన్స్ వ్యక్తి బాబు పక్కనే నిలబడి పోస్టర్‌ని చూస్తూ కనపడ్డాడు. బాబు వైపు తిరిగి ఏదో అన్నాడు. వాడు నవ్వుతూ తల అడ్డంగా తిప్పాడు. అతను బాబు వెనక్కి వెళ్ళాడు. వాడి భుజాల మీద తన చేతులు వేసాడు. బాబు పక్కనే ఉన్న మరో పోస్టర్ దగ్గిరకి వెళ్ళాడు. అతను వాడి భుజాలమీద చేతులు తియ్యలేదు. అలాగే వాడి వెనకే నిలబడి బాబు అడుగులో అడుగువేస్తూ ఫాలో అయ్యాడు. ఇప్పుడు బాబు వెనక్కి ఆనుకుని నడుస్తున్నాడు. బాబు ఎడమ భుజం విదిలించుకున్నాడు. బ్లూ జీన్స్ వాడి భుజాలని వదలలేదు. ఇప్పుడు పూర్తిగా బాబు వెనుకభాగాన్ని బ్లూ జీన్స్ శరీరం ఆక్రమించేసింది. వాళ్ళిదరి మధ్య ఏ మాత్రం ఖాళీ లేదు.
ఇందాక బాబుతో ఉన్నామె ఇప్పుడు మరో పోస్టర్‌ని చూస్తోంది. ఆమెతో వచ్చినతను ఇంకా స్టాల్స్ దగ్గిరే ఉన్నాడు. బాబుని వాళ్ళిద్దరు పట్టించుకున్నట్టు లేరు.
జిష్ణు చూపు ఇప్పుడు ఫోయర్‌లో ఎడం చేతివైపుకి మళ్ళింది. అక్కడున్న ఆ అమ్మాయి ఎదురుగుండా వాల్ డిస్‌ప్లే లో వస్తున్న సినిమా ట్రైలర్ ని చూడడంలో నిమగ్నమై ఉంది.
బ్లూజీన్స్ ఇంకా బాబుని వెనకనుండి గట్టిగా హత్తుకున్నట్టే ఉన్నాడు. బాబు భుజాలు విదిలిస్తున్నాడు. అతని చేతులు వాడి భుజాల మీద బిగుతుగానే ఉన్నాయి. బాబు అసహనంగా కదులుతున్నాడు.
డోర్స్ దగ్గిరున్న జిష్ణు వాళ్ళిద్దరి వైపు కదిలాడు.
బాబు ఈ సారి గట్టిగా విదుల్చుకున్నాడు. బ్లూజీన్సతని చేతులు వాడి భుజం మీద నుంచి జారిపోయినవి. బాబు దాదాపుగా పరిగెత్తుకుంటూ ఆ స్త్రీ దగ్గిరకి వెళ్లిపోయి నడుం చుట్టూ చేతులు వేసేసి మొహాన్ని ఆమె వొడిలోకి దూర్చేసాడు.
జిష్ణు బయలుదేరిన చోటే ఆగిపొయ్యాడు.
బాబు భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఆమె ముందుకి వంగి బాబుకి మాత్రమే వినపడేటట్టుగా ఏదో అడిగింది. బాబు తల విసురుగా విదిలిస్తున్నాడు. బాబు భుజాలు పట్టుకున్న ఆమె కిందకి మోకాళ్ళమీదకి వంగి బాబుని సముదాయిస్తూ మాట్లాడుతోంది. బాబు తల పైకెత్తకుండా ఏదో చెబుతున్నాడు. ఆమె తల తిప్పి అటు ఇటు చూసింది. మళ్ళీ వాడి గెడ్డం పట్టుకుని తలని కొంచెం ఎత్తి వాడి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. ఈ సారి వాడి కళ్ళనిండా నీళ్ళు. బుగ్గలమీద చారికలు కనపడ్డాయి జిష్ణుకి. వాడు కళ్ళు అటు ఇటు తిప్పి ఆ బ్లూ జీన్స్ వ్యక్తి వైపు సారించి ఆవిడతో ఏదో చెప్పాడు.
సరిగ్గా అప్పుడే స్టాల్స్ దగ్గిరున్నతను వెనుతిరిగాడు.
విసురుగా ఆమె లేచి నిలబడి బాబు కుడి చెయ్యి మణికట్టు దగ్గిరపట్టుకుని దాదాపుగా లాక్కుని వెళ్తున్నట్టు, బ్లూజీన్సతని వైపుకి బయలు దేరింది. స్టాల్ దగ్గిర నుండి వెనక్కు తిరిగినతను ఆమె హడావుడిని గమనించి అనుసరించాడు.
ఫోయర్‌కి ఎడం చేతివైపున్న (‘మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్’) సినిమా వాల్ పోస్టర్‌ని చూస్తోంది, ఇందాక జిష్ణు చూసిన ఆ అమ్మాయి. పన్నెండు పదమూడేళ్లు ఉంటాయేమో! వైట్ హెయిర్ బాండ్ కింద నుంచి నల్లని పొడుగాటి జుత్తు, భుజాల మీదుగా వీపు మీదకి జారుతోంది. టాప్ టైట్‌గా ఉంది. వికసిస్తున్న (రానున్న) టీన్స్‌ని దాచలేక పోతోంది ఆ టాప్. రెడ్ కలర్ బెల్ట్ ఉన్న బ్లూ కలర్ జీన్స్‌కి ఆ టాప్‌కి మధ్య మెరుస్తూ కనపడుతున్న నడుం. రివెటెడ్ బటన్స్‌తో ఉన్న హిప్ హగ్గింగ్ జీన్స్ అవి!
బ్లూ కలర్ జీన్సతని దృష్టి ఆ అమ్మాయి మీద పడినట్టుంది. నెమ్మదిగా ఆ అమ్మాయి పక్కకి చేరుకున్నాడు. నవ్వుతూ ఆ అమ్మాయితో ఏదో అంటూ చనువుగా ఆమె ఎడం భుజం మీద తన ఎడం చెయ్యి వేసాడు.
జిష్ణు దృష్టిలో పడిందది. జిష్ణు దూకుడుగా వాళ్ళిదరి వైపుకి అడుగులు వేసాడు.
ఫెటేలన్న మోతతో ఆ ఫోయర్ దద్దరిల్లింది. ఒక్కసారిగా అందరు ఉలికి పడ్డారు. అప్పటికే బ్లూజీన్సతని దగ్గిరకి బాబు, ఆమె, అతనూ చేరారు. జిష్ణు కూడా.
జిష్ణుని చూడగానే ఒక్క గెంతులో అతని పక్కకి చేరి అతని కుడి చేతిని పెనవేసుకుంది ఆ వైట్ టాప్, బ్లూజీన్స్ అమ్మాయి, “మామయ్యా!” అంటూ ఏడుపు గొంతుతో. తన ఎడం చేత్తో ఆ అమ్మాయిని దగ్గిరకు తీసుకున్నాడు జిష్ణు.
ఎర్రగా కందిపోయిన ఎడమ చెంపని రుద్దుకుంటూ బ్లూజీన్స్ అక్కడి నుంచి పరుగువేగంతో ఫోయర్ లోని లిఫ్ట్ కోసం కూడా ఆగకుండా, మెట్ల మీదుగా దూకుతూ కిందకి వెళ్లిపోయ్యాడు. బాబుతో ఉన్నావిడ ఆవేశంతో రొప్పుతోంది. ఆతను ఆమెను చూస్తూ నిలబడిపొయ్యాడు. కళ్ళు నులుముకుంటున్నాడు బాబు.
Footnote
దాదాపు ఐదేళ్ళక్రితం ఖదీర్‌బాబు, కె సురేశ్ , తాము 2018 నిర్వహించిన రైటర్స్‌మీట్‌లో పాల్గొన్న వారు రాసిన కథలను, కొత్తకథ 2018 మకుటంతో వెలువరించిన సంకలనంలో ప్రచురించిన కథ ఈ #మీటు. సంకలనంలో వచ్చిన కథలని కనీసం రెండు సంవత్సరాలు బయట ఎక్కడ ప్రచురించరాదని వారి సూచనని మన్నించి ఇప్పటివరకు దీనిని ప్రచురించలేదు. కథలలో సత్తా వుంటే పాఠకులు గుర్తుపెట్టుకుని, వెతుక్కుని మరీ చదువుతారనే బలమైన అభిప్రాయం మరొక కారణం. వెతుక్కోవడానికి ముందు వుండాలిగా అందుకని ఈ అంతర్జాలంలో ఈ బ్లాగులో...
౨ - ఈ కథ పూర్వాపరాలకు చెందిన మరికొంత అదనపు సమాచారం ఈ లంకె లో చదువుకోవచ్చు.
౩ - దిగువనున్నది కొత్తకథ2018 సంకలనాన్ని, 13 మే 12018 ఉదయం, తెలుగు విశ్వవిద్యాలయం, భాగ్యనగరంలో ఆవిష్కరించిన సందర్భలో, నా హితోభిలాషి, కవి దేవిప్రియగారి నుండి ప్రతి అందుకుంటున్నప్పటిది.
కొత్త కథ 2018 ప్రతులు ఇక్కడ దొరుకుతాయిః
ధర: రూ 149.00 మాత్రమే (24 కథలు)
♣ నవోదయ బుక్ హౌజ్
3-3-865,Opp Arya Samaj mandir, Kachiguda,Hyderabad, Pin Code: 500027,
Telangana,India. Mob:+91-9000413413, Office:040-24652387
Email:[email protected]
Web: www.TeluguBooks.in
అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు – ఈమాటలో
ఇక్కడ దొరుకుతుంది పుస్తకం!
అట్లూరి పిచ్చేశ్వరరావు కథల పుస్తకం ఈ క్రింది విక్రేతల దగ్గిర లభిస్తుంది. అమెరికాలో పాఠకులకి కూడా ఆ దేశంలో అందుబాటులో వుంది. ఇంకేమన్నా వివరాలు కావాలంటే కింద కామెంట్ లో తెలియజేయండి. జవాబిస్తాను. పుస్తకం వివరాలు కింద ఇచ్చాను చూడండి.
Sole Distributors:
Navodaya Book House,
Opp: Metro Pillar 14,
Kachiguda Cross Roads,
Hyderabad 500 027,
Telangana, India
Mobile: +91 – 90004 13413
వీరిదే ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌లో ఇక్కడ కూడా తీసుకోవచ్చు.
https://bit.ly/APRinNavodayaOnLine
విజయవాడలో
Pallavi Publications,
29-28-27, Dasari Vari St,
Moghalrajpuram, Suryaraopeta,
Vijayawada – 520 010,
Andhra Pradesh, India
Mob: 98661 15655
మీకు అమెజాన్‌లో కావాలనుకుంటే
Analpa Books ద్వారా ఇక్కడ తీసుకోవచ్చు:
35-69/1 2nd Floor GK COLONY (bus stop)
near Neredmet Cross Road, Saptagiri Colony,
Sainikpuri, Secunderabad – 500 094 Telangana, India
Mob: +91 70938 00678
https://amzn.to/3mnKBKN
https://bit.ly/APRonAnalpa
Logili Book House,
Guntur – 522 007
Andhra Pradesh, India
Mobile: +91 95501 46514
వారి ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌లో ఇక్కడ తీసుకోవచ్చు:
https://bit.ly/APRonLogili
విశాఖలో
Book Center
Gur Banga Complex,
Shop No.47-15-4,
Diamond Park Rd,
Dwaraka Nagar,
Visakhapatnam, 530 016
Andhra Pradesh, India
Landline: 0891 2562684
Mob: 98851 42894
విశాఖలో
Vagdevi
Gur Banga Complex, Door No.47-15-4, Diamond Park Rd,
Dondaparthy, Dwaraka Nagar, Visakhapatnam, 530 016
Mob : 93473 20588
Ph: +91 0891 2505785
చావెరుగని ‘‘చిరంజీవి’’!
పిచ్చేశ్వరరావు – ‘‘జీవచ్ఛవాలు’’
ఈ కథలు… చదవటమొక అవసరం
మనసుంటే మార్గముంటుంది!
1908, సెప్టెంబరు 9 బుధవారం. వినాయక చవితి పండగ రోజు. ముంబై లో ఆ రోజున ఆంధ్రపత్రిక – వారపత్రిక గా మొదలైంది. వ్యవస్థాపకులు కాశీనాథుని నాగేశ్వరావు పంతులు. ముంబై నుండి 1914 లో మద్రాసు – ప్రస్తుతం చెన్నై కి వెళ్లింది ఆంధ్రపత్రిక. ఇసబెల్లా హాస్పిటల్, లజ్ కార్నర్ కి మధ్యలో నాగేశ్వరరావు పార్క్ వుంది. దానిని ఆనుకునే అమృతాంజన్ (ఆయుర్వేదం తైలం) నొప్పికి వాడే మందు కర్మాగారం కూడా అ పక్కనే వుండేది. (నాన్నతో కొన్ని సాయంత్రాలు ఆ పార్క్ లో గడిపాను నేను.) మద్రాసులో ఆ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుండి ఆ దినపత్రికతో బాటు ‘అంధ్ర పత్రిక’ వారపత్రిక కూడ వెలువడడం మొదలైంది. దాదాపు దశాబ్దం తరువాత అంటే జవరి 1924 లో ‘భారతి‘ మాసపత్రిక వెలువరించారు నాగేశ్వరావు పంతులు గారు.
“భారతియందు భాష, వాజ్మయము, శాస్త్రములు, కళలు మొదలగు విషయములు సాదరభావముతోఁ జర్చించుటకవకాశములు గల్పించబడును. వాజ్మయ నిర్మాణమునకిపుడు జరుగుచున్న ప్రయత్నములు పరిస్ఫుటము చేయబడును. శిల్పమునకు చిత్రలేఖనమునకు శాసనములకు సంబంధించిన విషయములు చిత్రములతోఁ బ్రచురింపఁ బడును.” అని భారతి సంపాదకులు చెప్పుకున్నారు.
పంతులు గారి మనవడు శివలెంక రాధకృష్ణ గారి హయాంలో ‘భారతి’ ని నిలిపి వేయాల్సి వచ్చింది. కారణం ‘ఆర్ధిక భారం.’ (ఆ రోజుల్లో మద్రాసులో రాణీ బుక్ సెంటర్ మాత్రమే క్రమం తప్పకుండా భారతి ని పాఠకులకి అందించేది. ప్రత్యేక సంచికలను ఒక పదో/పాతిక మందో నెల ముందే ‘బుక్’ చేసుకునేవారు.) కాని ‘భారతి’ ప్రచురణ ఆపడానికి కుదరదు. ఎందుకని? పంతులు గారు ‘అంధ్రపత్రిక’ దినపత్రిక వెలువడినంతకాలం ‘భారతి’ వెలువడాల్సిందే’ అని ఒక నిబంధనని పెట్టారు. మరేం చెయ్యాలి అని యాజమాన్యం ఆలోచించింది. ‘టాబ్లాయిడ్‘ గా వెలువరించాలని నిర్ణయించారు. అలా ‘ఆంధ్రపత్రిక’ దిన పత్రిక లో ఒక ‘బ్రాడ్ షీట్’ ని ‘భారతి’ అని మకుటం పెట్టి ‘టెక్నికల్’ గా ఆపకుండా దానిని నెలకొక సారి ప్రచురించారు. తరువాతి రోజుల్లో మళ్ళీ పుస్తక రూపంలో తెచ్చారు. కానీ ఆంధ్రప్రదేశానికి తరలివచ్చిన తరువాత మొత్తం ‘ఆంధ్రపత్రిక’ మూత పడిపోయింది. దిన పత్రిక, వార పత్రిక, భారతి అన్ని మూత పడ్డాయి.
ఇటీవలి కాలంలో ‘ఆంధ్రజ్యోతి‘ ఆదివారం ‘సండే’ కి కూడా గ్రహణం పట్టింది. అప్పట్లో పిన్నింగు అని, బైడింగు అని రవాణా సరఫరాలో ఇబ్బందులున్నవని చెప్పి ఆంధ్రజ్యోతి ‘ఆదివారం’ ని దినపత్రికలో టాబ్లాయిడ్ కి మార్చేసారు. ఏది ఏమైనా చివరకి అది మళ్ళీ తన పాత రూపులో వెలువడ్డం సంతోషం. ఈ #కరోనా #కోవిడ్19 గడ్డు కాలంలో కూడా పుటలు తగ్గించినా జాల పత్రికగా దాన్ని వెలువరించింనందుకు #ఆంధ్రజ్యోతి సంపాదకవర్గానికి, యాజమాన్యానికి సాహితీప్రియులు ధన్యవాదాలు చెప్పుకోవాలి. గత కొద్ది వారాలుగా అచ్చులో కూడా ‘ఆదివారం’ ఆంధ్రజ్యోతి అందుబాటులోకొచ్చింది. అందుకు కూడా మనం ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు తెలియజెయ్యాలి.
కొన్ని నెలల క్రితమే ‘సాక్షి‘ దినపత్రిక కూడా ‘సాహిత్యం‘ పేజిని ‘ఫన్ డే‘ లో కి పంపింది. ఆ ‘సాహిత్యం’ పేజి ‘డ్రాప్’ అయినప్పుడల్లా వచ్చే వారం వుంటుందా, వూడుతుందా అని ఎదురుచూసేవాళ్లు పాఠకులు. వాళ్లని నిరాశపరచడమెందుకని ‘పర్మనెంటు డ్రాప్’ అనుకుని, వద్దులే అని దయతో ‘ఫన్ డే’ లో ఒక పేజి ఇచ్చారు. గుడ్డిలో మెల్ల అది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రతి సోమవారం ‘వివిధ‘ లో సాహిత్యానికి ప్రాముఖ్యత ఇచ్చి అందజేస్తోంది. ఇంకా కొన్ని తెలుగు దిన పత్రికలు కూడా ఆదివారం మాగజైన్ సంచికలు వెలువరుస్తున్నవి. ఉదాః విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవతెలంగాణ, వార్త, సూర్య, దర్వాజ, నమస్తే తెలంగాణా ఇత్యాదులు.
మనకి జాలపత్రికలు కూడా తక్కువేమి కాదు. ‘సాహిత్యసేవ’ కోసం సాహితీ ప్రియులు వెలువరిస్తున్నవారున్నారు. ఈమాట (1998 అక్టోబరులో ప్రారంభం), సారంగ (దాదాపు దశాబ్దం క్రితం), కౌముది (2007), సంచిక, నెచ్చెలి, వగైరాలు. ఇవన్ని కూడా ఆయా నిర్వాహకులు ఎటువంటి ఆర్ధికమైన లాభాపేక్ష లేకుండా ప్రచురిస్తున్నారు. ప్రకటనలు సైతం వుండవు వీటిల్లో. సభ్యత్వం / చందా రుసుములు కూడా లేవు.
ఈ అంతర్జ్వాల పత్రికలని వ్యక్తులు నిర్వహిస్తుండగా, ఈనాడు / వసుంధర / రామోజి ఫౌండేషన్ ఆ నాలుగు పత్రికలు; విపుల, చతుర, తెలుగు వెలుగు, బాలభారతం ని కనీసం జాల పత్రికల రూపాన్నైనా వెలువరించలేకపోవడం అన్నది నమ్మశక్యంగా లేదు. విపుల, చతుర లు 1978లో మొదలైనవి. దాదాపు నలభై మూడేళ్ళ క్రిత్రం. అలాగే ‘భాషకు, సాహిత్యాని సేవ చేసేందుకు ప్రత్యేక వేదిక ఉండాలన్న ఉద్దేశంతో 2012 సెప్టెంబరు’ లో తెలుగు వెలుగు పాఠకులకి అందించారు. నా వరకు నేను ఇది తెలుగు వారికి మరో ‘భారతి’ గా వుంటుందని ఆశించాను. అలాగే జరిగింది మూతపడటం విషయంలో. ‘ఇన్నాళ్ళుగా సేవాదృక్పథంతో సాగిస్తూ వచ్చిన ఈ నాలుగు పత్రికలను’ ఈమ్యాగజైన్స్ రూపంలో ఈనాడు నెట్ లో అందుబాటులో ఉంచా‘ రు. కానీ ఈ ఏప్రిల్ నుండి నిలిపివేయడం అన్నది ‘సాహిత్యాభిమానులకు’ జీర్ణం కావడం కష్టం. ఈనాడు లాంటి వ్యవస్థ, మానవవనరులున్న సంస్థ ఈ నాలుగు పత్రికల నిర్వాహణ భారాన్ని మోయలేకపోతుండంటే ఆశ్చర్యంగా కూడా ఉంది. నిజమే #కోవిడ్19 లాంటి అనూహ్యమైన ఆపద మానవజీవితాన్ని అతలా కుతలం చేసింది కానీ ఈ రోజున మనకి కోవిడ్ టీకా అందుబాటులోకి వచ్చింది. వ్యాపారంలో ఒడిదుడుకులుంటాయి. వాటిని అధిగమించడం ఈనాడు లాంటి సంస్థలకు కష్టమేమి కాదు. ఈనాడు కంటే చిన్నవి మనగలుగుతున్న సందర్భంలో ‘మన అమ్మభాష పరిపుష్టత కోసం ఈనాడు, ఈటీవీ, ఈ టీవీ భారత్ లు నిరంతరం కృషిచేస్తునే ఉంటాయని’ మేనేజింగ్ ట్రస్టీ – రామోజీ ఫౌండేషన్ చెప్పినా …తెలుగు సాహితీ చరిత్రలో ఈ పత్రికలు ఆపేయ్యడం విషాదమే. ఇన్నాళ్లుగా ఆయా పత్రికలకి రచనలు పంపుతున్న రచయితలు కూడా నిరుత్సాహానికి లోనయ్యారు ఈ వార్త తెలుసుకుని. పాఠకుల ఆదరణ తగ్గింది అన్నప్పుడు బహుశ రచయితలు కూడా తమ చేస్తున్న రచనల గురించి పునరాలోచించుకోవల్సిన సందర్భం అనిపిస్తుంది. మనసుంటే మార్గముంటుంది! కనీసం జాలపత్రికల రూపంలో ఐనా ఈ నాలుగు పత్రికలని బ్రతికించమని రామోజీ ఫౌండేషన్ ని కోరడమే ఒక సాహిత్యాభిమానిగా నేను చెయ్యగలిగింది!
▓► ఆంధ్రపత్రికకి సంబంధించిన వివరాలకి మూలం తెలుగు వికి. – te.wikipedia.org/
బాలాంత్రపు – గోపీచంద్
ఈ బాలాంత్రపు గోపీచంద్ ఎవరు?
బాలాంత్రపు రజనీకాంతరావు గారంటే తెలుగువారిని తన లలిత సంగీతంతో అలరించినవాడు. గేయకర్త. స్వరకర్త. ఇన్ని మాటలెందుకు, బహుముఖ ప్రజ్ఞాశాలి.
గోపీచంద్ అంటే సినిమాల్లో హీరో వేశాలేస్తుంటాడు. అతనేగా? కాదు. మరి?
ఈయన ఇంటిపేరు త్రిపురనేని. కవి, సంఘసంస్కర్త, హేతువాది ‘కవిరాజు‘ బిరుదాంకితుడు, బార్-ఎట్-లా చదివినవాడు, త్రిపురనేని రామస్వామి కుమారుడు, ఈ త్రిపురనేని గోపీచంద్.
తెలుగువారికి తొలి మనోవైజ్ఞానిక నవల అసమర్ధుని జీవయాత్ర ని అందించి తెలుగు సాహిత్య చరిత్రలో అజరామరంగా నిలిచిపోయినవాడు. చలన చిత్ర దర్శకుడు. కొన్నింటికి కధలు కూడా అందించిన వాడు.
మరి ఈ బాలంత్రపు వారికి, ఈ గోపిచంద్ కి ఏమిటి సంబంధం? చలనచిత్రాలలో సంగీతం ఉంటుందిగా! మరీ ముఖ్యంగా మన భారతీయ చలన చిత్రాలలో నృత్యాలు కూడా ఉంటాయికదా! అలా…గోపీచంద్ కి బాలాంత్రపు వారికి సంబంధం ఉంది. వారిద్దరు మిత్రులు. గోపీచంద్ సినిమాలలో పాటలకి స్వరకర్త, బాలాంత్రపు.
వారిద్దరిమధ్య జరిగిన ఒక హాస్య సంఘటనే ఈ బ్లాగ్ పోస్ట్ కి నేపధ్యం. బాలంత్రపు రజనీకాంతరావు గారి కుమారుడు హేమచంద్ర నాకు మంచి మిత్రుడు. ఆ మధ్యేప్పుడో, ఫేస్ బుక్ లో తన తండ్రిగారికి, గోపీచంద్ కి మధ్య జరిగిన ఒక సున్నితమైన హాస్య సంఘటన గురించి తెలియజేసాడు. రజనీకాంతరావు గారు మద్రాసులో మా అమ్మ స్థాపించి నిర్వహించిన రాణీ బుక్ సెంటర్ కి వచ్చిన గుర్తు నాకుంది. ఆయనికి గోపీచంద్ కి ఉన్న సాన్నిహిత్యం తెలిసి ఉండటం వల్ల వారివురి మధ్య జరిగిన ఆ హాస్య సంఘటనని తెలుగువారి సాంస్కృతక చరిత్రలో పొందుపరిస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను.
సాక్షి దిన పత్రికలో ప్రతి సోమవారం సాహిత్యానికంటూ ఒక పుటని కేటాయిస్తుంది. అందులో మరమరాలు మకుటంతో, సంగీత, సాహిత్యమనే కాకుండా ఇతర కళకారుల జీవితాలలోని ఆసక్తికరమైన సంఘటనలని ప్రచురించడం తెలుసు. మొన్న గురువారం అంటే మే 8 న, హేమచంద్రతో కొన్ని చిన్న చిన్న సందేహాలుంటే తీర్చుకుని, ఈ కధనం ప్రచురించడానికి (వీలుంటే ఏదేని పత్రికలో) అనుమతి తీసుకుని, రాసి, శుక్రవారం మే 9న, సాక్షి దినపత్రిక కి పంపాను. వాళ్ళు కూడా ప్రచురిస్తామని తెలియజేసారు.
సాక్షి పత్రికకి పంపిన కధనానికి నేను కాలక్షేపం – బఠాణీలు అని పేరు పెట్టాను. దానికి ఒక కారణం ఉంది. దాసు వామనరావు గారనే హాస్య రచయిత ఒకాయన ఉండేవారు. ఆయన ఆ రోజుల్లో ఒక కాలం రాసేవారు. దానిపేరు ‘కాలక్షేపం‘ అన్నట్టు గుర్తు. ఆయన్ని నేను గుర్తు చేసుకున్నట్టూ ఉంటుందని ఆ పేరుతో పంపాను. (ప్రస్తుతం మద్రాసు, టీ. నగర్ లో దండపాణి వీధిలో ఉంటున్న ష్రైన్ వేలాంగణ్ణి సీనియర్ సెకండరీ స్కూల్, ఆ రోజుల్లో వామనరావు గారిదే! )అంతే కాదు, హేమచంద్ర జ్ఞాపకాన్ని, నా మాటల్లో చెప్పానని కూడా సాక్షి వారికి తెలియజేసాను. కాని ఏం లాభం! రాసిన వారికే బైలైన్ క్రెడిట్ ఇవ్వటం వారి సాంప్రదాయమనుకుంటాను, అలానే చేసారు.
ఇక కధలోకి వెళ్దాం!
రచయిత త్రిపురనేని గోపీచంద్ – చదువుకున్న అమ్మాయిలు, ధర్మదేవత, ప్రియురాలు చిత్రాలకు కథ, మాటలు అందించారు; పేరంటాలు, లక్షమ్మ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. గాయకుడు, స్వరకర్త అయిన బాలాంత్రపు రజనీకాంతరావు, గోపీచంద్ మంచి స్నేహితులు. మద్రాసులో ఒకరోజు వీళ్ళిద్దరు కలిసి కారులో ప్రయాణం చేస్తున్నారు. గోపీచంద్ తీయబోతున్న చిత్రానికి బాలాంత్రపు గేయ రచన, సంగీత దర్శకత్వం వహించబోతున్నారు. ఒకానొక ఘట్టంలో కావల్సిన పాటకి కావాల్సిన మాటల కోసం ఆలోచనలో పడ్డారు గోపీచంద్. ఆ పాటకి సంగీతం గురించి ఆలోచిస్తున్న రజనీకి కాలుమీద దురద పుట్టి, పరధ్యానంగా గోక్కోవడం మొదలుపెట్టిన కాసేపటికి గాభరా పడుతూ, ‘‘నా కాలు స్పర్శ కోల్పోయింది. నేను గోక్కుంటుంటే తెలీటం లేదు. అర్జంటుగా డాక్టరు దగ్గరకి వెళ్ళి చూపించుకోవాలి’’ అన్నారు. తలతిప్పి ఆయన వంక చూసిన గోపీచంద్, ‘‘డాక్టరు, గీక్టరు అక్కర్లేదు. ఇందాకటి నుంచి మీరు గోక్కుంటున్నది మీ కాలు కాదు, నా కాలు’’ అన్నారు. దాంతో అసలు విషయం అర్థమై ఇద్దరు మిత్రులు పగలబడి నవ్వుకున్నారు.
– అనిల్ అట్లూరి
సాక్షి సాహిత్యం పేజికి లంకె ఇక్కడ
ఇక ఆ సాహిత్యం పేజిలో కధనం జెపెగ్ ఈ దిగువునః
ఎంజాయ్ చేసారా? చి న