మీ టూ

స్క్రీన్ బీ – త్రీ లోకి ప్రవేశించాడు జిష్ణు.  షో అయిపోయినట్టుంది.  ఖాళీగా ఉంది థియేటర్.  తనకి దగ్గిర్లో కిందపడిఉన్న ఖాళీ ‘లేస్’ కవర్‌ని తీసేస్తున్న క్లీనింగ్ స్టాఫ్‌ని ఉద్దేశించి “నెక్స్ట్ షోకి ఇంకా ఎంత టైముంది?” అని అతను అడిగితే “టెన్ మినిట్స్” అని జవాబిచ్చింది ఆమె.  అతను “థాంక్స్” అని గొణుగుతూ వెనక్కి తిరిగి ఫోయర్‌ ( థిఏటర్ ఆవరణ) లోకి నెమ్మదిగా అడుగులేస్తూ వెళ్ళాడు.

డోర్స్‌కి రెండువైపులా గోడలకి ఆనించి పొడుగ్గా సోఫాసెట్‌లు ఉన్నవి.  వాటికి ఎదురుగా ఫోయర్‌లోనే అక్కడక్కడ డిస్‌ప్లే విండోస్.  వాటితో పాటే రిలీజ్ కాబొయ్యే కొత్త సినిమాల పోస్టర్లు, ఫొటో కార్డ్‌లు.

కుడి చేతివైపు సోఫాలో, ఆ చివర గోడకి ఆనుకుని ఒక యువతి కూర్చునుంది. ఆమె కాళ్ళు తన ముందున్న యువకుడి ఒడిలో ఉన్నాయి.  వాళ్ళు తమదైన మరో ప్రపంచంలో ఉన్నారు.

జిష్ణు చిరాకుగా ఎడం వైపుకి తల తిప్పాడు.

ఎడం చేతి వైపు సోఫా వరుసలో అటు చివరగా ఒంటరిగా కూర్చుని ఉన్నాడు అతను.  లౌడ్ కలర్స్ తో ఉన్న చెక్‌డ్ షర్ట్.  స్లిమ్ ఫిట్ డార్క్ బ్లూ కలర్ జీన్స్‌‌లోకి టక్ చేసుకున్నాడు.  లెదర్ బెల్ట్ కొంచెం బిగించినట్టున్నాడు.  అయినా పొట్ట బెల్ట్ మీదుగా కొంచెం కిందకి జారి కనపడుతున్నది.  కుడి కాలు తొడ మీద, ఎడం కాలేసుకుని కూర్చున్నతను కాస్త తీక్షణంగాను ప్రపంచాన్ని మరిచిపోయి మరీ చూస్తున్నాడు. రెప్పవెయ్యకుండా.  అతను చూస్తున్నవైపే జిష్ణు తన దృష్టిని జారించాడు.

అక్కడ చూడ ముచ్చటగా ఉన్న జంట.  వారితో పాటు ఒక బాబు కూడా ఉన్నాడు.  ఏడెమినిదేళ్ళుండవచ్చు. కొంచెం ఊరిన బుగ్గలతో, ఎర్ర్రని పెదాలతో, నిగ నిగ లాడుతూ ఆరోగ్యంగా ఉన్నాడు.    బ్లేజింగ్ రెడ్ కలర్ టీ.  కొంచెం  టైట్‌గానే ఉన్నట్టుంది.  ఛాతికి అతుకున్నట్టు ఉంది.  అది వైట్ కలర్ షార్ట్స్ లోకి టక్ఇన్ చేసుంది.  షార్ట్స్ కూడా టైట్‌గా ఉన్నట్టున్నాయి.  పిర్రలకి అతుక్కుని లోపలి అండర్‌వేర్ కూడా కనపడి కనపడకుండా కనపడుతోంది.   బొద్దుగా, క్యూట్‌గా కూడా  ఉన్నాడు.     ఆ పక్కనే ఉన్న ‘జస్టిస్ లీగ్’ సినిమా పోస్టర్ వాడిని ఆకర్షించినట్టుంది.  3డి సినిమా పోస్టర్ అది.  వాడు అటు తిరిగి దాని దగ్గిరకు వెళ్ళాడు.  ఈ లోపు ఆ బాబుతో ఉన్న ఆమె తనతో ఉన్నతనితో డ్రింక్స్‌కో, ఈటబుల్స్‌కో ఆర్డర్ ఇవ్వమన్నట్టుంది.  అతను ఆ ఫోయర్‌లో కుడి చేతి వైపున్న స్టాల్స్ వైపు వెళ్ళాడు.

బాబు పోస్టర్‌ని చూస్తున్నాడు.  రెప్ప మూసి తెరిచేటప్పడికి,  బ్లూజీన్స్ వ్యక్తి బాబు పక్కనే నిలబడి పోస్టర్‌ని చూస్తూ కనపడ్డాడు.   బాబు వైపు తిరిగి ఏదో అన్నాడు.  వాడు నవ్వుతూ తల అడ్డంగా తిప్పాడు.  అతను బాబు వెనక్కి వెళ్ళాడు.  వాడి భుజాల మీద తన చేతులు వేసాడు.   బాబు పక్కనే ఉన్న మరో పోస్టర్‌ దగ్గిరకి వెళ్ళాడు.  అతను వాడి భుజాలమీద చేతులు తియ్యలేదు.  అలాగే వాడి వెనకే నిలబడి బాబు అడుగులో అడుగువేస్తూ ఫాలో అయ్యాడు.  ఇప్పుడు బాబు వెనక్కి ఆనుకుని నడుస్తున్నాడు.  బాబు ఎడమ భుజం విదిలించుకున్నాడు. బ్లూ జీన్స్ వాడి భుజాలని వదలలేదు.   ఇప్పుడు పూర్తిగా బాబు వెనుకభాగాన్ని బ్లూ జీన్స్ శరీరం ఆక్రమించేసింది. వాళ్ళిదరి మధ్య ఏ మాత్రం ఖాళీ లేదు.

ఇందాక బాబుతో ఉన్నామె ఇప్పుడు మరో పోస్టర్‌ని చూస్తోంది.  ఆమెతో వచ్చినతను ఇంకా స్టాల్స్ దగ్గిరే ఉన్నాడు.  బాబుని వాళ్ళిద్దరు పట్టించుకున్నట్టు లేరు.

జిష్ణు  చూపు ఇప్పుడు ఫోయర్‌లో ఎడం చేతివైపుకి మళ్ళింది.  అక్కడున్న ఆ అమ్మాయి ఎదురుగుండా వాల్ డిస్‌ప్లే లో వస్తున్న సినిమా ట్రైలర్ ని చూడడంలో నిమగ్నమై ఉంది.

బ్లూజీన్స్ ఇంకా బాబుని వెనకనుండి గట్టిగా  హత్తుకున్నట్టే  ఉన్నాడు.  బాబు భుజాలు విదిలిస్తున్నాడు.    అతని చేతులు వాడి భుజాల మీద బిగుతుగానే ఉన్నాయి.  బాబు అసహనంగా కదులుతున్నాడు.

డోర్స్ దగ్గిరున్న జిష్ణు వాళ్ళిద్దరి వైపు కదిలాడు.

బాబు ఈ సారి గట్టిగా విదుల్చుకున్నాడు.  బ్లూజీన్సతని  చేతులు వాడి భుజం మీద నుంచి జారిపోయినవి.  బాబు  దాదాపుగా పరిగెత్తుకుంటూ ఆ స్త్రీ దగ్గిరకి వెళ్లిపోయి నడుం చుట్టూ చేతులు వేసేసి మొహాన్ని ఆమె వొడిలోకి దూర్చేసాడు.

జిష్ణు బయలుదేరిన చోటే ఆగిపొయ్యాడు.

బాబు భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి.  ఆమె ముందుకి వంగి బాబుకి మాత్రమే వినపడేటట్టుగా ఏదో అడిగింది.  బాబు తల విసురుగా  విదిలిస్తున్నాడు.  బాబు భుజాలు పట్టుకున్న ఆమె కిందకి మోకాళ్ళమీదకి వంగి బాబుని సముదాయిస్తూ  మాట్లాడుతోంది.    బాబు తల పైకెత్తకుండా ఏదో చెబుతున్నాడు.  ఆమె తల తిప్పి అటు ఇటు చూసింది.   మళ్ళీ వాడి గెడ్డం పట్టుకుని తలని కొంచెం ఎత్తి వాడి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. ఈ సారి వాడి కళ్ళనిండా నీళ్ళు.  బుగ్గలమీద చారికలు కనపడ్డాయి జిష్ణుకి. వాడు కళ్ళు అటు ఇటు తిప్పి ఆ బ్లూ జీన్స్  వ్యక్తి వైపు సారించి ఆవిడతో ఏదో చెప్పాడు.

సరిగ్గా అప్పుడే స్టాల్స్ దగ్గిరున్నతను వెనుతిరిగాడు.

విసురుగా ఆమె లేచి నిలబడి బాబు కుడి చెయ్యి మణికట్టు దగ్గిరపట్టుకుని దాదాపుగా లాక్కుని వెళ్తున్నట్టు, బ్లూజీన్సతని వైపుకి బయలు దేరింది.  స్టాల్ దగ్గిర నుండి వెనక్కు తిరిగినతను ఆమె హడావుడిని  గమనించి అనుసరించాడు.

ఫోయర్‌కి ఎడం చేతివైపున్న (‘మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్’) సినిమా వాల్ పోస్టర్‌ని చూస్తోంది, ఇందాక జిష్ణు చూసిన ఆ అమ్మాయి. పన్నెండు పదమూడేళ్లు ఉంటాయేమో!  వైట్  హెయిర్ బాండ్  కింద నుంచి నల్లని పొడుగాటి జుత్తు, భుజాల  మీదుగా వీపు మీదకి జారుతోంది.  టాప్ టైట్‌గా ఉంది. వికసిస్తున్న (రానున్న)  టీన్స్‌ని దాచలేక పోతోంది ఆ టాప్.  రెడ్ కలర్ బెల్ట్ ఉన్న బ్లూ కలర్ జీన్స్‌కి  ఆ టాప్‌కి మధ్య మెరుస్తూ కనపడుతున్న నడుం. రివెటెడ్ బటన్స్‌తో ఉన్న హిప్ హగ్గింగ్  జీన్స్ అవి!

బ్లూ కలర్ జీన్సతని  దృష్టి ఆ అమ్మాయి మీద పడినట్టుంది.  నెమ్మదిగా ఆ అమ్మాయి పక్కకి చేరుకున్నాడు.  నవ్వుతూ ఆ అమ్మాయితో ఏదో అంటూ చనువుగా ఆమె ఎడం భుజం మీద తన ఎడం  చెయ్యి వేసాడు.

జిష్ణు దృష్టిలో పడిందది.  జిష్ణు దూకుడుగా వాళ్ళిదరి వైపుకి అడుగులు వేసాడు.

ఫెటేలన్న మోతతో  ఆ ఫోయర్ దద్దరిల్లింది.  ఒక్కసారిగా   అందరు ఉలికి పడ్డారు.  అప్పటికే బ్లూజీన్సతని  దగ్గిరకి బాబు, ఆమె,  అతనూ చేరారు. జిష్ణు కూడా.

జిష్ణుని చూడగానే ఒక్క గెంతులో అతని పక్కకి చేరి అతని కుడి చేతిని పెనవేసుకుంది ఆ వైట్ టాప్, బ్లూజీన్స్ అమ్మాయి, “మామయ్యా!”  అంటూ ఏడుపు గొంతుతో. తన ఎడం చేత్తో ఆ అమ్మాయిని దగ్గిరకు తీసుకున్నాడు జిష్ణు.

ఎర్రగా కందిపోయిన ఎడమ చెంపని  రుద్దుకుంటూ బ్లూజీన్స్ అక్కడి నుంచి పరుగువేగంతో  ఫోయర్ లోని లిఫ్ట్ కోసం కూడా ఆగకుండా, మెట్ల మీదుగా దూకుతూ కిందకి  వెళ్లిపోయ్యాడు.  బాబుతో ఉన్నావిడ ఆవేశంతో రొప్పుతోంది.  ఆతను  ఆమెను చూస్తూ నిలబడిపొయ్యాడు.  కళ్ళు నులుముకుంటున్నాడు బాబు.


Footnote
దాదాపు ఐదేళ్ళక్రితం ఖదీర్‌బాబు, కె సురేశ్ , తాము 2018 నిర్వహించిన రైటర్స్‌మీట్‌లో పాల్గొన్న వారు రాసిన కథలను, కొత్తకథ 2018 మకుటంతో వెలువరించిన సంకలనంలో ప్రచురించిన కథ ఈ #మీటు. సంకలనంలో వచ్చిన కథలని కనీసం రెండు సంవత్సరాలు బయట ఎక్కడ ప్రచురించరాదని వారి సూచనని మన్నించి ఇప్పటివరకు దీనిని ప్రచురించలేదు. కథలలో సత్తా వుంటే పాఠకులు గుర్తుపెట్టుకుని, వెతుక్కుని మరీ చదువుతారనే బలమైన అభిప్రాయం మరొక కారణం. వెతుక్కోవడానికి ముందు వుండాలిగా అందుకని ఈ అంతర్జాలంలో ఈ బ్లాగులో...
౨ - ఈ కథ పూర్వాపరాలకు చెందిన మరికొంత అదనపు సమాచారం ఈ లంకె లో చదువుకోవచ్చు.  
౩ - దిగువనున్నది కొత్తకథ2018 సంకలనాన్ని, 13 మే 12018 ఉదయం, తెలుగు విశ్వవిద్యాలయం, భాగ్యనగరంలో ఆవిష్కరించిన సందర్భలో, నా హితోభిలాషి, కవి దేవిప్రియగారి నుండి ప్రతి అందుకుంటున్నప్పటిది.

కొత్త కథ 2018 ప్రతులు ఇక్కడ దొరుకుతాయిః
ధర రూ 149.00 మాత్రమే (24 కథలు)
♣ నవోదయ బుక్ హౌజ్
3-3-865,Opp Arya Samaj mandir, Kachiguda,Hyderabad, Pin Code: 500027,
Telangana,India. Mob:+91-9000413413, Office:040-24652387
Email:[email protected]
Web: www.TeluguBooks.in

A short Poster for the sort story mee too
#మీ టూ కధకి సోషల్ మీడియా కోసం మహీ తయారుచేసిన కార్డ్

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.