విన్నవి – కన్నవి

వ్యాసం  ఆంధ్రప్రభ వార పత్రిక లో (౧౯౬౯) ప్రచురితం

34. విన్నవి – కన్నవి

వివిధ జీవిత రంగాలమీద వ్యాఖ్యానిస్తూ, విమర్శలు చేస్తూ తెలుగులో చాలా సాహిత్యం వచ్చింది. అయితే మన బుక్ పబ్లిషర్లు ఇలాంటి సాహిత్యాన్ని పుస్తక రూపంలో వెలువరించటానికి అంతగా ఆసక్తి చూపటం లేదు. దానికి మార్కెట్ లేదని వారి ఉద్దేశం కావచ్చు. అలా అయితే అది అపోహే. కిందటి నెల విడుదలయిన చిత్రాలు చాలా భాగం ఈ నెలలో నామరూపాలు లేకుండా పోయినట్టే, కిందటేడు విడుదల అయిన కల్పనా సాహిత్యం కొంత ఈ ఏటికి కనుచూపుమేరలో లేకుండా పోతున్నది. కాని పుస్తకరూపంలో వెలువడిన వ్యాసావళి – ప్రత్యేకించి
‘కన్నవీ – విన్నవీ’ లాటిది ఎంతకాలమేనా బతికి ఉంటుంది.

అందుకు వేరే నిరద్శనం అవసరం లేదు. ఈ చిన్న పుస్తకంలో తరిచిన అనేక విషయాలు విస్మృత చరిత్రా, విస్మృత సంఘటనలూను. అయినా వాటి మీద పిచ్చేశ్వరరావు వ్యాఖ్యానాలు అశోకుడి శిలాశాసనాల్లాగా ఎంతకాలమైనా నిలిచేవిగా ఉన్నాయి.

ఈ పుస్తకంలో ప్రస్తావించిన కొన్ని విషయాలు :
♦ ఈనాడు రచయితకీ, పఠితలకీ ఉండవలసిన సంబంధం.
♦ మనిషికీ, జంతువులకూ ఉన్న(లేక, లేని) తేడా.
♦ అభ్యుదయ నిరోధకులకు మంచి సాహిత్యం పట్ల ఉండే ద్వేషం.
♦ ఈనాడు వెలువడే చౌకబారు సాహిత్యం.
♦ విద్యార్థులూ, రాజకీయాలూ (!)
♦ చార్లీ చాప్లిన్ పట్ల అమెరికా వైఖరి.

పుస్తకంలో ఉన్నవి 11 వ్యాసాలే అయినా అందులో ఇన్ని విషయాలు చర్చించబడ్డాయి.  ఆ చర్చలో ఈ నాటికీ మనం గ్రహించవలిసిన విషయాలు ఎన్నయినా ఉన్నాయి.

“ముక్కుపచ్చలారని నవ్యాంధ్ర రాష్ట్ర శిశువు మూలుగుతూ మూలనున్న ముసలాడి వధువు అవుతూంటే, చూస్తూ ఊరుకుని కీటక సన్యాసుల్లాగా….. గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్న కొంతమంది…” ఈనాడు లేరా ?

“భడవల దారిన పోయేందుకే బ్రహ్మాండ శక్తులూ అవసరం లేదు” అన్నది మనం నిత్యమూ స్మరించదగిన విషయం కాదా?

“ఇండియా ఇంకా (1954 జనవరి 26 నాటికి) కామన్వెల్తులోనే ఉంది. వెల్త్ గూడ కొద్ది మంది అనే కామన్ మనుష్యుల గుప్పెట్లోనే ఉంది!” అన్నదానికి ఈ 15 సంవత్సరాలలో మార్పేమన్నా వచ్చిందా?

“ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేని రచయిత, వాళ్ళ సమస్యల్నీ, వాళ్ల పోరాటాల్నీ, అనుభవాల్ని పత్రికల్లో చదివి, ఎంతో సానుభూతితో ఆలోచించుతున్నాను అనుకునే రచయిత ఎంతవరకు ప్రజాసాహిత్యాన్ని సృష్టించగలుగుతాడు? అనేది ఒక పెద్ద ప్రశ్న ” – ఇప్పటికీ, ఎప్పటికీని.

“పోరాటం లేనిదే పురోగమనం లేదు – ఇంటా, బయటా కూడా.” అయినా మనం పురోగమనాన్ని ఇంకా శాంతిలోనే వెతుకుతున్నాం!

సాహిత్య వ్యాసాలు
పుట – 559

“ఫ్రాంకో, హిట్లర్, గోబెల్స్, ముసోలినీలూ…….. ఈ డాలరుమార్కు ప్రజాస్వామ్యం కంటే ముందే ఈ ఘనకార్యాన్ని ( ఉత్తమ సాహిత్యాన్ని నిషేధించటాన్ని) కొనసాగించాలని చూశారు. ” డాలరు మార్కు ప్రజాస్వామ్యం ఈనాడు ఇంకా వెర్రితలలు వేస్తున్నది.

“చాప్లిన్ అమెరికాలో ఆడుగుపెట్టేందుకు అర్హుడౌనా ? కాదా? అనేది సమస్య కానే కాదు చాప్లిన్ లాంటి ఉత్కృష్ట కళాకారులు ఉండదగిన దేశమేనా అమెరికా?’ చాప్లిన్ అనంతరం మరికొందరు ప్రముఖులకు అమెరికాలో చోటు లేకుండా పోయింది.

“విద్యార్థి ఉద్యమాలు ప్రజాచైతన్యానికి చూపుడు వ్రేలు లాంటివి. ప్రభుత్వ దమన నీతికి థర్మామీటర్లు” – ఇవాళ కూడాను.

“ప్రభుత్వం ఎవరిదైనా – 1857 లో గద్దె మీద ఉన్నవారికి పట్టిన గతే, 1953 లో గద్దెమీద కూర్చున్న వారికి కూడా తప్పదని గడచిన చరిత్రతో బాటు, నడిచే చరిత్రగూడ సూచిస్తుంది.” ఈనాడు నడిచే చరిత్ర ఈ మాటను మరింత బాగా రుజువు చేస్తున్నది.  “అమెరికా నుంచి ఎగుమతై, వందలకొద్దీ థియేటర్లలో ప్రదర్శితమయ్యే తుక్కు చిత్రాల మాటేమిటి? ఈ చిత్రాలన్నీ తుక్కు అనీ, బూతుల పుట్టలనీ ఈ మంత్రులే అన్నారే.” “తుక్కు – బూతు” చిత్రాలు దేశవాళీ పరిశ్రమగా రూపొందటం కళ్లారా చూసి అనందించటానికి పిచ్చేశ్వర్రావు బ్రతికి ఉండవలిసింది.

అతను 40 ఏళ్లకే అకాలమరణం పాలుకాకుండా ఉన్నట్టయితే ఈనాటి జీవితాన్ని ఎలా విమర్శించి, తూర్పారబట్టి ఉండేవాడో! దేశంలో అభ్యుదయ భావాలూ, అభ్యుదయ దృక్పథమూ గలవారు చాలా మంది ఉన్నారు. కాని “కసిస్టెంటుగా ”తాను తరిచే ప్రతి విషయంలోనూ ఒక తప్పటడుగు లేకుండా నిజాన్ని అందరికీ అవగాహన అయేటట్టు చూపటం గొప్ప ప్రతిభ. అంతేకాదు. పిచ్చేశ్వర్రావు ప్రతి ప్రత్యక్ష సమస్యలోనూ శాశ్వతత్వం
కూడిన నిజాన్ని ఇట్టే పట్టెయ్యగల శక్తిని ప్రదర్శించాడు. అది చాలా అరుదైన శక్తి. తాను ప్రకటించే నిజాన్ని పదిమంది నోటా విని ఆమోదించటంతో తృప్తిపడక, తనకు తానుగా చాలా దీర్ఘంగా ఆలోచించేవాడు; ఇతరులతో చర్చించేవాడు. అదే అతనిలో బలం. ముందు చెప్పిన 11 వ్యాసాలు గాక ఈ పుస్తకంలో రెండు కథానువాదాలూ, బెర్టోల్ బ్రెస్ట్
నాటక సిద్ధాంతం మీద ఒక వ్యాసమూ ఉన్నాయి. కథానువాదాలను గురించి ప్రత్యేకంగా చెప్పకోవలిసిందేమీ లేదు.

గాని, బ్రెస్ట్ గురించి పిచ్చేశ్వరరావు ఏనాడో రాసి ఉండటం గమనార్హం. ఎందుచేతంటే నా టక తత్వమూ, నాట్యకళా విప్లవ పూరితమైనవి. అతని సిద్ధాంతాలు అన్ని దేశాలవారినీ ఆకర్షించాయి. మన దేశంలో కూడా కొందరు మేధావులు బ్రెస్ట్ నాటకాలను హిందీలోకి అనువదించి ప్రదర్శిస్తున్నారు. బ్రెస్ట్ విషయం తెలుగు పాఠకులకోసం పిచ్చేశ్వర్రావు వేసిన బాటను ఇతరులు నడవకపోవటం శోచనీయమే.

ఆంధ్రప్రభ, వారపత్రిక, 18-6-1969
560
కొకు వ్యాసప్రపంచం – 5

One Reply to “విన్నవి – కన్నవి”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.