కధ 2014…ఇంకో ముగ్గురు కధకులు కాక ఇంకొకరు

katha 1990 to 2009

2014 లో సెప్టెంబరు నెలలో రెండవ ఆదివారం తేది14 అయ్యింది.  ఆ రోజున మధురాంతకం నరేంద్ర గారి  కథని వేదిక – సాహితీ సమావేశం సభ్యులు చర్చించుకున్నారు. ఆ కథ ని కధా సాహితి సంపాదకులు తమ కధ 2014 సంకలనంలో చేర్చుకున్నారు.  మధురాంతకం నరేంద్ర సాహిత్యం గురించి మరి కొన్ని వివరాలు కథానిలయం లో ఇక్కడ చూడండి.

రచయిత మధురాంతకం నరేంద్ర

పెద్దిభొట్ల సుబ్బరామయ్య పురస్కారం వారి చేతుల మీదుగానే అందుకుంటున్న మధురాంతకం నరేంద్ర.  వీరిద్దరూ అధ్యాపకులే!  తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారిని కూడా ఇందులో చూడవచ్చు.

ఇవి కాక ఆంగ్లంలో The Hans India ఆంగ్ల దిన పత్రికలో ముఖ్యంగా తెలుగు సాహిత్యం మీద నరేంద్ర వ్యాసాలు కూడా వ్రాస్తుంటారు. నరేంద్ర గారి కథలలో కొన్ని; అత్యాచారం (991), నిత్యమూ నిరంతరమూ (1993), అస్తిత్వానికి అటూ – ఇటూ – (2001), నమ్మకం (2008), చిత్రలేఖ (2010), చివరి ఇల్లు (2013)  ఇదివరలో కథాసాహితి వారి కధ సంపుటాలలో చోటు చేసుకున్నవి.

ఇందులో చెప్పుకోవలిసిన అంశం ఏమిటంటే 1992 లో  కధ 1991ని ఆవిష్కరించింది కీ.శే మధురాంతకం రాజారాం.  వారి తనయుడు మధురాంతకం నరేంద్ర.

ఇక కథా సారంగ లో (July 9, 2015) 3456GB వ్రాసిన కొట్టం రామకృష్ణారెడ్డి తొలి కధ – తీర్పు.  ఇది 1991 ఫిబ్రవరిలో రచన మాస పత్రికలో వచ్చింది.  వీరి కథ కూడ ఈ కథ 2014 సంపుటిలో ఉంది. వివరాలకు  సంకలనాన్ని చూడండి.

బంధం కధ 2013 లో ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం ప్రచురించింది.  ఆ కథ వ్రాసింది బోడపాటి హరితాదేవి.  కలం పేరు రాధిక. సంపాదకులు ఎన్నుకున్న కధని మీరు కథ 2014 లోనే చూసుకోవాలి మరి.  🙂

2014 అక్టోబరులో రెండవ ఆదివారం 12 వ తేది అయ్యింది.  ఆ రోజు సాయంత్రం డా. వి చంద్రశేఖర రావు గారి నవల నల్లమిరియం చెట్టు మీద వేదిక సాహితీ సమావేశంలో తన అభిప్రాయాన్ని వినిపించారు కన్నెగంటి రామారావు. మరో సాహిత్య పిపాసి 🙂 డాక్టర్ ఇస్మాయిల్ కూడా ఆ రోజు సాయంత్రం వేదిక సమావేశంలో పాల్గొన్నారు.  వీరిద్దరూ అమెరికాలో ఉంటారు.  చెప్పొచ్చేదేమిటంటే యాజి కూడా అమెరికాలోనే ఉంటారు.
కథకుడు యాజి తన కధకు ఎన్నుకున్న అంశం మీద సాహిత్యలోకంలో చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది.  యాజి కథకూడ కధ 2014 లో చోటుచేసుకుంది.  విశేషం ఏమిటంటే యాజి స్వస్థలం తెనాలి.  😎

Author Yajiకధ 2014 – కధాసంపుటిలోని ఒక ముగ్గురు కథకులను గురించి, ఇక్కడేమో మరో ముగ్గురు కధకులు గురించి తెలియచేసాను.  రేపు … ఆ మిగతా కథకుల గురించి.  😎   అన్నట్టు తెనాలి కి వస్తున్నారుగా! తెనాలి లో కవిరాజు ఉద్యావనం (పార్క్) ఇక్కడుంది.

రెండు దశాబ్దాలు
కథ 1990 – 2009
౩౦ కధలతో రెండు దశాబ్దాల ఉత్తమ కధల సంకలనం

ప్రతులకు
164, Ravi Colony, Tirumalagherry, Secunderabad 500 015, India  Ph: +91 2779 7691
ధర: రూ 150.00 / US $ 25.00
పోస్ట్ / కొరియర్ ఖర్చులు అదనం.

కథ 2014 … మరో ముగ్గురు కథకులు

katha 2014 book launch invitation

కథ 2014 కథా సంపుటి కథాసాహితి వారి ప్రచురణలో ఇరవై అయిదవది.  ఈ పాతిక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వెలువడింది.  కథాసాహితి తొలి కధల సంపుటి వెలువడింది 1990 లో.  కీ శే ఆచార్య. చేకూరి రామారావు గారి చేతులమీదుగా ఆవిష్కరణ.  ఆనాటి సభాధ్యక్షులు ఆచార్య కె.వి శివారెడ్డి.  ఆ అధ్యక్షుల వారిది తెనాలి.  పాతికేళ్ళ కథ 2014 కూడా తెనాలిలో అవిష్కరణకి నోచుకోవడం కాకతాళీయం అయినా తెలుగు సాహిత్యంలో ఒక చారిత్రక ఘట్టం.

ఇక ఆ ముగ్గురు కథకులు ఎవరో చూద్దాం.

Author Patanjalisastry
తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారి తొలి కథ సీతన్న తాట.  ఇది 1962 లో ఆంధ్రప్రభ వారు ప్రచురించారు.  వీరి ఇతర కథలు, నవలలు గురించిన వివరాలు కథానిలయంలో
ఇక్కడ తెలుసుకోవచ్చు.

వాల్ పోస్టర్, సర్మా, గారడీ, రామేశ్వరం కాకులు ఇదివరలో ఆయా కథ వార్షిక సంకలనాలలో ప్రచురించారు.

వీటిలో వేదిక లో రామేశ్వరం కాకులు మీద చర్చ జరిగింది. ఆ కధని ఇక్కడ చదువుకోవచ్చు.

అద్దేపల్లి ప్రభు, కాకినాడ వాస్తవ్యులు.  వీరి తొలి కధ విలువలు 1984 లో అరుణతార మాస పత్రికలో వెలువడింది. వారి ఇతర సాహిత్యం కథానిలయంలో ఇక్కడ చూడండి.

     

Sunil Kumar P V - Author

1986 స్వాతి వార పత్రికలో ప్రచురించిన మూషికార్జునీయం కథకులు పి విసునీల్ కుమార్. లఘుచిత్రం గా వెలుగుచూసిన కథ దెయ్యం వీరిదే.  వేదిక లో వీరి తోక దెయ్యం చెప్పిన డిసిప్లి మీద 2015 మే నెలలో చర్చించుకున్నారు.   ఆ కథని ఇక్కడ చదువుకోవచ్చు.

వీరు ముగ్గురూ, నిన్న ముగ్గురు కధకులు మాత్రమే కాదు.  ఇంకా ఉన్నారండి.  వారిలో మరో ముగ్గురు కధకులని మీకు రేఫు పరిచయం చేస్తాను.

రానున్న ఆదివారం, సెప్టెంబరు 20, 2015 న తెనాలిలో  జరగనున్న ఆవిష్కరణ సభకి ఇదిగో ఆహ్వానం.katha 2014 book launch invitation

కథ 2014…ముగ్గురు కథకులు

గత పాతికేళ్ళుగా క్రమం తప్పకుండా వెలువడుతున్న కధాసాహితి వారి 25 వార్షిక కథా సంకలనం కథ 2014 లో ఈ ముగ్గురి కథలున్నవి.

బత్తుల రమాసుందరి
మొదటి కథ ఇక్కడRamasundari Battula - Atuhor
చదువుకోవచ్చు; మనిద్దరమే ఉందాం అమ్మా!
ఆంధ్రజ్యోతి దిన పత్రిక వారి ఆదివారం అనుబంధం (01-09-2013లో ప్రచురితం)

 

 

 

Author Palagiri Viswa Prasada Reddy

ఇక రెండవ వారు పాలగిరి విశ్వప్రసాద్, వీరి  మొదటి కథ
బోలు మనుషులు  రచన మాస పత్రిక సెప్టెంబరు 1991లో
ప్రచురితం.  నేను వెతికినంతలో అది నాకు జాలంలో దొరకలేదు.

 

 

 

 

Author Bhagavantham
ఇక మూడవ కథకుడు భగవంతం.
వీరి మొదటి కథ వెయిటింగ్ ఫర్ యాద్గిరి.
ఈ కథ తొలిసారిగా 2006లో వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితం.
చలన చిత్ర దర్శకుడు వంశీ, నా కెందుకు నచ్చిందంటే  అనే శీర్షికతో
గోతెలుగు డాట్ కాం
 లో ఈ కథని మెచ్చుకుంటూ పరిచయం చేసిన కథ.  భగవంతం పాడిన పాట ఇక్కడ వినొచ్చు.  సా.వెం.రమేశ్ స్వరం కూడా!

రానున్న ఆదివారం 20న, తెనాలి లో జరగనున్న  కథ 2014 ఆవిష్కరణ సభలో బహుశ వీరందరిని మీరు కలుసుకోవచ్చు.  వీరు ముగ్గురే కాదు ఇంకా ఉన్నారు.  వారిలో కొంతమంది గురించి రేపు చెబుతాను.

ఇదిగో కథ 2014 కి అహ్వాన పత్రిక.

katha 2014 book launch invitation

పగలని గోళీ

ఆరడుగుల ఎత్తున్న ప్రహరీ గోడ. ఇనుముతో చేసిన చట్రానికి ఇనుపరేకు బిగించిన గేటు. అటూ ఇటూ చూస్తే
గేటుని బిగించిన స్తంభానికి అమర్చి ఉంది ఒక బుల్లి మీట. దానిని నొక్కాడు. భయంకరమైన గొంతుతో కుక్క
అరుపులు మొదలైనవి. ఒక్కసారి ఝడుసుకున్నాడు. అప్రయత్నంగానే ఒకడుగు వెనుకకు పడింది. దానిని
అదిలిస్తూ లోపలెక్కడ్నుంచో ఒక ఆడమనిషి వచ్చి గేటు పైనించి అతన్ని ఎవరికోసం అన్నట్టు చూసింది.

గొంతు పెగల్చుకుని అక్కకోసం అని చెప్పేలోపు వసారా లోపల నుండి అక్క. ‘‘ఎవరూ?’’ అని చూస్తూ
తమ్ముణ్ని గుర్తుపట్టి, పనిమనిషిని గేటు తెరవమని పురమాయిస్తూ ముందు వసారాలోకి వచ్చింది.

‘‘ఎప్పుడొచ్చావు?’’ అని అడుగుతూ, పరదాలని అడ్డం తీస్తూ లోపల హాలులోకి దారితీసింది. ‘‘నిన్ననే
వచ్చాను, ఇంటర్వ్యూ కోసం,’’ అని చెబుతూ ఎడమచేతి వైపు త్రీ సీటర్ సోఫాలో ఒదిగి కూర్చున్నాడు. అతనికి
ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది అక్క. పనిమనిషి తెచ్చిన మంచినీళ్ల గ్లాసును అందుకుంటూ అటూ ఇటూ
చూస్తుంటే, ‘‘బావగారు ఆఫీసు పనిమీద బయటకు వెళ్లారు’’ అంటూ అందరి క్షేమ సమాచారాలు అడిగి
తెలుసుకుంటోంది. కాసేపు అవీ ఇవీ మాట్లాడిన తరువాత. ‘‘మాటల్లో పడి మరిచిపోయాను, ఉండు నీకు టీ అంటే
ఇష్టం కదా! చేసి తీసుకు వస్తాను’’ అని లేచి లోపలికి వెళ్లింది. ఆ గుమ్మానికీ పొడుగాటి పరదాలు.

ఎదురుగా ఉన్న పత్రికని అందుకుని తిరగెయ్యడం మొదలుపెట్టాడు. ఏదో అలికిడి అయితే కుడిచేతి వైపుకి తలతిప్పి చూశాడు. గాలికి కదిలిన పరదాల చప్పుడు కాబోలు. దృష్టి తిప్పితే గుమ్మానికి ఎడం పక్కనే గోడకి ఉన్న ఫొటోఫ్రేమ్‌లో ఒక పదేళ్ల పాప నవ్వుతూ కనపడింది. అక్క కూతురు. ఎంత చక్కగా ఉందో. కళ్లల్లో ఒక
విధమైన పెంకితనం కూడా కనపడింది అతనికి. మరోపక్క గోడమీద చామనచాయ రంగు చెక్కలతో చేసిన చట్రానికి బిగించిన అద్దం లోపలి నుంచి కనబడుతున్న బొమ్మ.

ఆ! బొమ్మ కాదు అది. ఒక్కసారి వాడి ఊపిరి స్తంభించింది. అక్క వస్తున్నదేమోనని చూశాడు. అలికిడి లేదు. లేచి సోఫాలు దాటుకుంటూ వెళ్లి ఆ చట్రం ముందు నిలబడ్డాడు. పసుపుపచ్చని రంగు అట్టమీద ఒక వైపుకి
వాలుగా నెమలిపింఛం బిగించి ఉంది. గుమ్మం బయటి నుంచి హాలులోకి వస్తున్న వెలుతురు ఆ అద్దం మీద
గింగిరాలు తిరుగుతున్నది. నెమలి పురివిప్పుకుని అద్భుతమైన నాట్యాన్ని మొదలుపెట్టింది. అతని కళ్లు
చెమ్మగిల్లాయి. మసకబారిన ఆ కళ్లలోని తడి నెమ్మదిగా అతని మనసు లోపలి పొరలలోకి ఇంకుతోంది.

అతనే వాడు. వాడి మనసిప్పుడు గాలిపటంలాగా రివ్వున ఎగురుతోంది. మాంజా వేసిన దారం, పట్ట్టీలేసుకున్న
వేళ్ల మధ్య నుంచి సర్రున జారుతోంది. వాడి మనసు నిండా అక్కే! కళ్ల నిండా అక్కే. వాడి ఆలోచనల నిండా
అక్కే. అక్క ఈసారి ఎక్కడికి తీసుకెళుతుందో! అక్కని ఈసారి తప్పకుండా జూకి తీసుకెళ్లాలి.

సాయంత్రం స్నేహితులతో గోళీలు ఆడుతున్నా, వీధి మలుపు మీదే వాడి దృష్టి. కుడిచేతి చూపుడు వేలుని
ఎడమచేతి చూపుడు వేలుతో పూర్తిగా వెనక్కి లాగి, ఆరు జానలవతలున్న నీలం రంగు గోళీ మీదకి తన
పసుపురంగు గోళీని గురిచూస్తున్నా, వాడి చెవులిక్కడ లేవు. అక్క ఫియట్ కారు హార్న్ చప్పుడు వినడం
కోసం ఎదురు చూస్తున్నవి. వాడి దృష్టి నీలం రంగు గోళీ మీదున్నా, పక్కన చెవిపోగు గాడి చెమట కంపు
నాసికల ద్వారా అందుతున్నా, అక్క పూసుకునే కునేగా సెంటుతో వాడి బుర్ర నిండిపోయింది. వాడి దృష్టికిప్పుడు అక్క కనబడుతోంది!

వాడి కుడి భుజం మీద చెలికాడి అరిచేయి స్పర్శ వాడికి అక్క నునువెచ్చని స్పర్శనే గుర్తుచేస్తోంది. కుడిచేతి
బొటనవేలు నెమ్మదిగా, మెత్తగా అప్పుడే మొలుస్తున్న గడ్డి మొలకల మధ్య నుండి చల్లగా ఉన్న ఆ నేలలోకి
దిగబడుతోంది. ఇక చూపుడి వేలుకున్న గోళీకాయ విడివడడమే ఆలస్యం. నీలం రంగు గోళీకాయ పగిలిపోవాలి. వాడి ఏకాగ్రత అంతా దానిమీదే ఉంది. వాడి సావాసగాళ్ల కళ్లన్నీ కూడా వాడి చూపుడువేలుకి ఉన్న పసుపురంగు గోళీకాయ మీదే ఉన్నాయి. పగులుద్దా! వాళ్లందరూ ఊపిరి ఆపి బిగబట్టి చూస్తున్నారు.

వాడి ఎడమ చూపుడు వేలుతో నెమ్మదిగా కుడిచేతి చూపుడువేలు అంచుకు లాగుతున్నాడు. నేలలోకి పాతుకుపోయిన బొటనవేలు పూర్తిగా సాగిపోయింది. బొటనవేలు, చూపుడువేలు మధ్యనున్న కండ తెగుతుందా అన్నట్టుగా సాగింది.ఇక అయిపోయింది. నీలిరంగు గోళీకాయ పగిలిపోవడం తప్పదు! అక్క నవ్వు వినపడిన తరువాత వెనక్కి లాగిన చూపుడు వేలుని వదిలాడా, లేక నీలిరంగు గోళీకాయలో అక్క నవ్వు కనపడిన తరువాత వదిలాడా అన్నది వాడికిప్పటికీ తెలియదు. ఏదైతేనేం ఆ నీలిరంగు గోళీకాయ పగిలిపోలేదు. గోడకి తగిలి మరో యాభై జానల అవతల ప్లాట్‌ఫాం అంచునుండి కిందకి జారనా వద్దా అన్నట్టు వూగి, రోడ్డుమీదకి జారిపడిపోయింది.

అప్పుడు వినపడింది ఫియట్ కార్ హార్న్ వాడికి. కారు మలుపు తిరుగుతోంది. వెనక సీట్లో అక్క కనపడుతోంది.
బావగారికి డ్రైవర్ అడ్డంగా ఉన్నాడు. ఆయన సరిగ్గా కనపడ్డం లేదు. అటుపక్కనే ఉన్న చెవిపోగులు గాడిని,
ఇటువైపున్న గద్దముక్కుని తోసేసి ఉరుకు. లాగు నడుంపైకి లాక్కుంటూ ఉరుకు. ఇంటిగేటు వైపుకు
కారుకి ఎదురుగా ఉరుకు. కారు ఇంకా ఆగలేదు. వెనక తలుపు తెరుస్తూ తనవైపుకి లాక్కున్నాడు. అక్క
ముఖం నిండా నవ్వు. వాడి మొఖం నిండా నవ్వు. అక్క మీదకి దూకి. రెండు చేతులు అక్క మెడ చుట్టూ
వేసేశాడు. అక్క వాడిని వాటేసుకుని, హత్తుకుంది. వాడికి ఆ క్షణంలో ప్రపంచం గుర్తులేదు. వాడికి అక్కే
ప్రపంచం అయిపోయింది.

అక్క కదిలింది. వాడు కదిలాడు. అక్క కుడిపాదం జాపి నెమ్మదిగా కారులోంచి దిగింది. ఈలోపు అలికిడికి అమ్మ
బయట వసారాలోకి వచ్చింది. అక్కని కుడిచెయ్యి పట్టుకుని దాదాపుగా లాక్కుంటూ తీసుకువెళుతున్నాడు వాడు.అక్కను చూస్తున్న ఆనందంతో అమ్మ మొహం విప్పారింది. వెనక వస్తున్న బావగారిని చూసి పలకరింపుగానవ్వింది. వసారాలో గుమ్మం పక్కనే చెప్పులు విడిచింది అక్క. ఆమె కుడిచేతిని వాడు ఇంకా వదల్లేదు. అమ్మలోపల హాలులోకి వెళ్లింది. బావగారు కూడా వసారాలోకి వచ్చి, అక్క విడిచిన చెప్పుల పక్కనే తన చెప్పులు విడిచారు.

హాలు లోపలికి అక్క వెనకే అడుగులు వేశారు. హాలులో ఎడమచేతి వైపు విడిగా ఉన్న సోఫాలో బావగారు
కూర్చున్నారు. ఆయన పక్కనే ఉన్న చిన్న మోడా మీద కూర్చుంది. అక్క ఒడిలోకి జారిపోయాడు వాడు. డ్రైవరు హాలులోపల గుమ్మానికి కుడిపక్కన గోడపక్కనే సూటుకేసులని నిలబెట్టాడు. ఈలోపు పనిమనిషి స్టీలు ట్రేలో రెండు గాజు గ్లాసుల నిండా మంచినీళ్లు తెచ్చింది. బావగారు ఒక గ్లాసు అందుకున్నారు. వాడు ఆ రెండో గ్లాసుని అందుకుని అక్కకి ఇచ్చాడు. హాలులో గుమ్మం పక్కనే పొట్టి టేకు బల్లమీద నల్ల ఫోను అందుకుని అమ్మ ఫోను చేసింది నాన్నగారికి… ‘‘అమ్మాయి, అల్లుడుగారు వచ్చేశారు, తొందరగా వచ్చేయండి’’ అంటూ.

సూటుకేసులు అవీ పాప గదిలో పెట్టమని పనిపిల్లని పురమాయిస్తూ వచ్చిన జంటని స్నానం చేసి బట్టలు
మార్చుకోండి అని చెబుతూ నాన్నగారికి వారి రాకని తెలియజేశానని తొందరగా వచ్చేస్తారని అక్కకి చెప్పింది అమ్మ. వాడుఅక్కతో పాటు పడకగదిలోకి వెళ్లాడు. ఒక పక్కగా చిన్న బల్లమీద పెట్టి ఉన్నవి సూట్‌కేసులు. ఆ బల్ల పక్కనే రెండు టేకుతో చేసిన కుర్చీలు. సూట్‌కేసుని తెరిచింది అక్క. బట్టలపైనే ఉందది. కపిల వర్ణం కాగితంతో
ఉన్న చిన్న కట్ట. తెల్లని టై్వన్ దారంతో భద్రంగా కట్టారు. పక్కనే తనని ఆనుకుని నిలబడ్డ తమ్ముడికి
ఇచ్చింది అక్క. రెండు చేతులతో దానిని అందుకున్నాడు. పక్కనే ఉన్న కుర్చీమీద కూర్చుని దాని ముడి విప్పాడు.

లోపల రంగు రంగుల బొమ్మలతో అందంగా ఉన్న పుస్తకాలు. జానపద కథలు, కొన్ని విజ్ఞానానికి సంబంధించినవి.  పిల్లల గేయాలు. వాడి కళ్లల్లో ఆనందం చూసి అక్క మురుసుకుంది. కొద్దిగా వంగి, వాడి చెంపలని తన రెండు అరచేతుల మధ్య పట్టుకుని వాడి తలని తన ఒడిలోకి లాక్కుని గట్టిగా, చప్పుడు చేస్తూ వాడి నుదుటిమీద ముద్దుపెట్టుకుంది. అటుపక్కన తన సూట్‌కేసులో బట్టలు తీసుకుంటున్న బావగారు వాళ్లిద్దర్ని చూస్తూ, ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. క్రీగంటన అది చూసి వాడు సిగ్గుపడ్డాడు. గారంగా భుజాలూపుతూ వాడు అక్క ఒడిలోకి మరింతగా ఒదిగిపోయాడు. వీపు మీదకి చేతులు జార్చి చప్పుడయ్యేట్టు చరిచి వాడిని పక్కకి నెట్టేసింది అక్క.

అక్క, బావగారు ఒక వారం రోజులున్నారు. ఒకరోజు హాలులో భోజనాలు. ఒక సాయంత్రం బతికిన కాలేజీ. మరో
రోజు హోటల్లో. ఒకపూట అక్క చదువుకున్న స్కూలు. మరోరోజు ఉదయం వరండాలో పిట్టగోడమీద కూర్చుని
టిఫిన్లు. ఇంకో రోజు డాబామీద వెన్నెల రాత్రిలో భోజనాలు. అక్కతో కనీసం ఒక ముద్దన్నా పెట్టించుకోనిదే భోజనాల తరువాత చెయ్యి కడిగేవాడు కాదు. మరొకపూట ఉద్యానవనం. ఉయ్యాలలో అక్కతో పోటీ. బావగారితో సినిమాలు, షికార్లు.ఆ వారం రోజులు పండగే వాడికి.

ఆగమని అంటూ తుర్రుమని ఇంట్లోకి పరుగెత్తాడు. తన మేజా మీదనున్న లెక్కల నోటు పుస్తకం తెరిచి పేజీలు
తిరగేశాడు. మెరుస్తూ కనపడిందది. వాడి బెస్టుఫ్రెండ్ వాడి కోసం ఇచ్చిందది. దాన్ని జాగ్రత్తగా పట్టుకుని
మళ్లీ రివ్వున పరిగెత్తుకుంటూ కారు దగ్గిరకి వచ్చాడు. అక్కని చెయ్యి చాపమని అడిగాడు. కారు తలుపులో
నుంచి కుడిచేతిని చాపింది. అరచెయ్యి తెరిచి ఉంది.

నెమ్మదిగా అక్క అరచేతిలోకి జార్చాడు దానిని. మృదువుగా, మెత్తగా వాడి ప్రేమంత మధురంగా ఉంది ఆ నెమలిపింఛం. అందుకుంది అక్క. కళ్లు చెమర్చాయి. అమ్మ పక్కకి తిరిగి చీరకొంగుతో కళ్లు వత్తుకుంది. గేటు
దగ్గర నిలబడ్డ నాన్న కళ్లజోడు అద్దాలు కొంచెం మందమైనవి. ఆయన కళ్లు ఆ జోడులో నుంచి కనపడలేదు.
బావగారు చేతులూపారు. కారు కదిలింది. అక్క ఆయన భుజం మీదకి వాలిపోవడం కనపడింది. ఆయన ఆమె భుజం చుట్టూ చెయ్యి వేశారు. బహుశా ఓదార్చుతున్నారేమో!

‘‘ఏమిటి ఇక్కడ నిలబడ్డావు?’’ అని అడుగుతూ అక్క ఆ నెమలిపింఛాన్ని చూసి చిరునవ్వుతో, ‘‘నువ్వు
ఇచ్చిందే. బావగారు ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు’’ అంటూ సోఫా వైపుకు దారితీసింది. వాడికోసం టీతో పాటు కొన్ని
చేగోడీలు, చక్కిడాలు, పంచదార గవ్వలు ఉన్న పింగాణి పళ్లెం తెచ్చి సోఫా ముందున్న గాజు టేబుల్ మీద
పెట్టింది. అక్కకి మాత్రమే కాదు తనంటే ప్రేమ. బావగారికి కూడా తనంటే ఎంతో ఇష్టం అని మురుసుకున్నాడు.
ఎప్పుడెప్పుడా రాలిపోదాం అని చూస్తున్న కన్నీళ్లని అక్క చూడకుండా ఒడుపుగా అరచేతుల్తో గబుక్కున
తుడిచేసుకున్నాడు.

లోపలెక్కడో ఉన్న కుక్క మళ్లీ నెమ్మదిగా గారంగా మొరుగుతోంది. సోఫాలోకి కూలబడి, తలవంచుకునే తన చదువుగురించి, ఉద్యోగంలో ఇంటర్వ్యూ కోసం వచ్చిన సంస్థ గురించి, ఉద్యోగం ప్రాముఖ్యత గురించి చెబుతూ అక్క గుర్తుచేసినప్పుడల్లా ఒక గవ్వో, చేగోడో, చక్కిడమో అందుకుని తింటూ, ఇక చాలన్నట్టుగా మంచినీళ్లు
అందుకుని తాగాడు. టీ కప్పున్న సాసర్‌ని అందుకున్నాడు కుడిచేతితో. ఎడమచేతితో సాసర్‌ని పట్టుకుని
కుడిచేతితో కప్పు చెవిని చూపుడువేలు, బొటన వేళ్ల మధ్య పట్టుకుని పెదవుల దగ్గరికి తీసుకువెళ్లాడు
నెమ్మదిగా. పెదవులకి ఆనించి, ఒక గుక్క జాగ్రత్తగా నోట్లోకి లాగాడు చప్పుడుచేయకుండా. కాలలేదు. తనకి
సరిపోయే వేడితోనే ఉందా టీ. పంచదార కూడా సరిపోయింది. అక్క టీ చెయ్యడంలో మార్పేమీ లేదు. అప్పుడు తలెత్తి అక్కని చూశాడు. దేవత.

ఫోను మోగింది. బావగారేమో? అక్క లేచి వెళ్లి ఫోనులో ఏదో మాట్లాడుతోంది. టీని మరో గుటక వేశాడు. అక్క కలిపిన టీ. ఎంత బాగుందో. నెమ్మదిగా గొంతులో నుంచి జారుతూ ఉంటే ఎంత హాయిగా ఉందో! అక్క తనకోసం చేసింది.  అక్కకి తనమీద ప్రేమ తగ్గలేదు. పనిమనిషిని చెయ్యనివ్వలేదు. తనే చేసి తనే తీసుకువచ్చి ఇచ్చింది. అక్కకి తనమీద ప్రేమ ఏమీ తగ్గలేదు. లోపలి నుంచి ఇందాక ఫొటోలో చూసిన పాప సుడిగాలిలా గదిలోకి వచ్చింది. తెల్ల రంగు ఫ్రాక్. ఎర్రని అంచులతో. బొద్దుగా, ఆరోగ్యంగా చక్కగా ఉంది. హాలులో ఎవరో కొత్తమనిషి ఉన్నారన్నది గుర్తించింది. ఒక్క క్షణం. అలా అక్కడే ఆగిపోయింది. ‘‘ఎవరో గుర్తుపట్టావా?’’ అని అక్క పాపని అడిగితే, లేదంటూ అడ్డంగా, కొంచెం విసురుగానే తలని తిప్పినట్టుంది. అక్క నవ్వుతూ, ‘గుర్తుతెచ్చుకో’ అంటోంది.

ముందుకు వంగి గాజు టేబుల్‌మీద టీకప్పుని అందుకుని, అక్క ఎంతో ప్రేమగా తనకోసం చేసిన టీ మరో గుటక
వేసుకోవడానికి నోట్లోకి వంపుకున్నాడు. అది గొంతులోకి జారి అక్కడి నుంచి నెమ్మదిగా, అతి నెమ్మదిగా అతని
గుండెల్లోకి ఆమె ప్రేమని వొంచి నింపుకుంటున్నాడు. పాప అప్పుడు గమనించినట్టుంది అతను టీ తాగడం.
అక్కవైపు చూస్తూ, ‘‘టామీకి పాలు లేవు మమ్మీ. చూశావా?’’ అని అడుగుతూ, కొత్తగా కనబడుతున్న
అతనివైపు చూసింది.

పాప దృష్టి ఇప్పుడు అతని చేతిలోని టీ కప్పు మీద పడింది. ఆ మరుక్షణం ఆ కళ్లలో ఒక వెలుగు. ఒక
మెరుపు. తనకి అర్థమై తెలిసిపోయిందన్న అమాయకపు గర్వంతో కూడిన వెలుగు. ఒక్క క్షణమే ఆ మెరుపు.
అప్పుడు ఆ కళ్లలోని అర్థమైన మెరుపుని ఆ ‘పక్కింటి’ తమ్ముడు ఎప్పటికీ మరిచిపోడు. ‘‘మమ్మీ, టామీ పాలతో టీ కలిపిచ్చావా? చీ యాఖ్… ఆ పాలు కుక్కకోసం ఉంచినవి’’ అంటూ ప్రపంచంలోని అసహ్యాన్నంతా ఆ పదాలలోకి ఒంపి, నింపి బయటకు విసిరేసింది.

ఈ కథ , సాక్షి దిన పత్రిక వారి ఆదివారం అనుబంధం ఫన్‌డే జూన్ 21, 2015 లో ప్రచురితం.

కతల గంప – స వెం రమేశ్

ఇప్పుడే అందింది.  రమేశ్ పంపాడు.
ముఖచిత్రం చూస్తే ‘రయికముడి ఎరగని బతుకు’ (భూమిక, డిసెంబరు 2012) గుర్తు వచ్చింది.
అట్టమీద బొమ్మ వేసింది బి కిరణ్ కుమారి.  బాగుంది.  చూడగానే చేతిలోకి పుస్తకాన్ని తీసుకుని చదవాలనిపిస్తుంది…రమేశ్ ఎవరో,  రమేశ్ కతలేమిటో తెలియని వారికి కూడా!
ఆ నలుపు, తెలుపు రంగులలో ఒక అందం ఉంది.

పుస్తకం వెనుక తిప్పిచూస్తే…కొన్ని స్కెచెస్ ఉన్నాయి.  నలుపులో తెలుపు. అక్షరాలు కూడా తెలుపులో.
ఆ అక్షరాలతో మనం కూడ పరుగెడతాం!

రమేశ్ కళ్ళెదుట నిలిచిన కల లో కొన్ని మాటలు:
మళ్ళా ‘కతలమ్మో కతలు’ అనే నా గొంతు తెరువులో ఉలివింది.
తిరిగినాను, తిరిగినాను, తెరువంతా తిరిగినాను.  అది బాగా రూకలుండే తెరువే.  అంతకు ముందు నా కతల్ని అబ్బురంగా తీసుకున్నవాళ్ళు ఉండే తెరువే.  కాని నా కతలు వెలపోలేదు.
. . .
ఒక్కటీ నచ్చలేదు వాళ్లకు, ఒక్కటీ కతగా తోచలేదు వాళ్ళకు.
. . .
నాకు దిగులు కలిగింది.
. . .
అప్పుడు తిరుపతి ఉమన్న చెప్పినాడు, ‘పెద్దతెరువులోనే బండిని తిప్పితే ఎట్టాసామీ, సన్న సందుల్లో కూడా మణుసులు ఉంటారు.  అక్కడకూడ కతలంటే ఊపిరిచ్చేవాళ్ళు ఉంటారు.  ఒకసారి ఆ తట్టుకు పోయిరా పో’ అని.

పుస్తకాన్ని పూదోట శౌరీలు, మల్లవరపు విజయమరియదాస్ లకు అంకితం ఇచ్చాడు రమేశ్.

<img class="wp-image-19 size-full" src="https://telugu.anilatluri.com/wp-content/uploads/sites/3/2014/12/KathalaGampaBySaVeMRamesh_Anil_Atluri13thDec2014.jpg?w=808" alt=" kathala gaMpa" originalw="808" width="225" height="300" scale="2">
కతల గంప – తెలుగు కతలు కతకుడు స. వెం రమేశ్

పుస్తకం లో ఉన్న కతలు వాటి క్రమం:

తెలుగు సిన్నోడు తిమ్మరాయప్ప
మీసర వాన
ఊడల్లేని మర్రి
పదిమందికి పెట్టే పడసాల
ఆ అడివంచు పల్లె
కాకికి కడవడు పిచిక్కి పిడికిడు
రయికముడి ఎరగని బతుకు
చెట్లు చెప్పిన కత
సిడిమొ‌యిలు
బడకొడితి
వాడు గోపాలకృష్ణ కొటాయి
ఒంటినిట్టాడి గుడిసె
ఎందుండి వస్తీవి తుమ్మీదా
అబ్బిళింత
కతలగంప
మాదిగపుటక కాదు
మొ‌యిలు నొగులు
పాంచాలమ్మ పాట

ప్రతి కథ చివర అందులో తను వాడిన కొన్ని పదాలకి…మీకు, మీకేంటి నాకు కూడ అర్ధం అయ్యే తెలుగు పదాల అర్ధం ఇచ్చాడు.

ప్రతులకు మీరు పుస్తకం ధర రెండు వందలు పంపవలసింది ఇక్కడికి:
1-2-740, హనుమాన్ మందిరం దగ్గిర, రాకాసి పేట, బోధన్ 503 180
ఫోను: +91 90101 53505

గమనిక  పుస్తకంలో  ప్రతులకు “అన్ని ముఖ్యమైన పుస్తక కేంద్రాలు” అని ఉన్నా  అవి ఈ విషాదాంధ్రలో కాని, ప్రజాశ్రేయస్సులో కాని దొరుకుతాయన్న నమ్మకం లేదు.  కాబట్టి పై ప్రచురణకర్తలకి రొక్కం పంపండి.  అనుమానాలుంటే వారికి ఫోను చెయ్యండి.  చెబుతారు మీకు పుస్తకం ఎక్కడ దొరుకుతుందో.  వీలైతే వాళ్ళకి కొరియరు / పోస్ట్ ఖర్చులు పంపండి.  మరో పుస్తకం వాళ్ళు ప్రచురిస్తే మనకి మరో పుస్తకం అందుబాటులోకి వస్తుంది మరి!

నేనైన నీకు నీవైన నేను

“నేనైన నీకు నీవైన నేను”  అని  2006 లో అన్నాడామాట. పైగా అతి రమణీయం గాను.
రాయడం ఒక దురద,” అని కూడ అన్నాడు.
“ఆ మాట చాలా చీప్ గా ఉంది,” అని ఒకానొక పాఠకుడి ఒక వ్యాఖ్య.
“నా కథల్లో అంతర్లీనంగా తార్కికత, తాత్వికత కనిపించడానికి నా చిన్నప్పటి అధ్యయనం కారణం కావచ్చు,” అని నిన్న అన్నాడు.
ఇంకా ఆరుపదులకి ఆమడ దూరంలోనే ఉన్నా..ఒక ఆరుపదులవరకు రాసేసాడు, కథలు.
ట్విన్నవలలు.  అసలు ఆ మాట విన్నారా? ఇవిగో ఇక్కడున్నవి.

<img class="wp-image-19 size-full" src="https://telugu.anilatluri.com/wp-content/uploads/sites/3/2014/12/TwinnavalaluByAnaamakuduRamasastri_Anil_Atluri.jpg?w=656" alt="ట్విన్నవలలు " originalw="656" width="808" height="1220" scale="2">
ట్విన్నవలలు – రాతగాడు అనామకుడు

పోయినేడాది…దాదాపు ఇవే రోజుల్లో…వాళ్ళిద్దరు కలిసి ఒకొళ్ళపుస్తకాన్ని మరొకరికి అంకితం ఇచ్చుకున్నారు.
పరిణయం చేసుకుని పాతికేళ్ళే..కాని అంతకుముందే పరిచయం అనొచ్చా?  అనకూడదేమో! బంధుత్వం ఉందిగా మరి.

మరి విముక్తి మూలంగా ఈ ప్రత్యేకత వచ్చిందో..లేక విముక్తి కి జనార్ధన మహర్షి, నవ్య సంయుక్తంగా ఇచ్చిన బహుమతి వల్లవచ్చిందో కాని నవ్య కళ్ళకి ఇతని రూపు ప్రత్యేకం గా కనపడింది.  ఆ ప్రత్యేకం ఇక్కడ చదువుకోండి.

చాలా మందికి తెలియని మరొక విషయం.  ఇతను ఆంగ్లంలో కూడ కథలు వ్రాసాడు. ఇదిగో ఇక్కడుంది ఒకటి చదువుకోండి.

నవ్య వార పత్రిక. తేది డిసెంబరు 10, 2014.  పుటలు 15 నుంచి 20 దాకా.

డేంజరస్ కథకుడు

నిండా డేంజరస్ మనుషులుండారు ఈ ప్రపంచంలో. అతి ప్రమాదకారులు వీరు.  మాటలతో మనల్ని మాయజేస్తారు.  ఇదిగో అంటారు.  అదిగో అంటారు.  వీళ్ళు మన నోటికి వినిపిస్తారు.  చెవులకి చూపిస్తారు. చొంగ కారుతుంటుంది ఒక పక్క. చేతులూపుకుంటూ, కళ్ళు తెరుచుకుని వాళ్ల మాయమాటల దారెంట వెళ్ళిపోయి వాళ్ళు చూపించే ఆ మరో ప్రపంచాన్ని కంటాం! చిన్నపిల్లల్లగా!!

Sa Vem Ramesh
సా వెం రమేశ్

డబల్ ఢమాకా అంటారనుకుంటా..ఒక కథతో మొదలుపెడతాడు, మరో కథ మొదలుపెడతాడు.  వాటి చుట్టూ మరో ప్రపంచాన్ని సృష్టిస్తాడు.  ఆ మూడింటీతో పాటు మరో కొత్త అంశం ప్రవేశపెడతాడు. త్రీ డి అంటారే.  అలా! కళ్ళు తిరుగుతాయి.  ఆ సుడిగుండంలో పడిపోతాం.  గిరా గిరా తిరుగుతాం,  పడి కొట్టుకుపోతాం.  మన లోపలికి నీళ్ళేళ్ళిపోతాయి. మరో కొత్త భాష! మరో కొత్త కోణం.  మరో కొత్త మూలం అవిష్కరింపజేస్తాడు.  ఎక్కడో తెల్తాం.  అక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది..కాని ఉండలేం కదా! ఒక జీవితం ఉంది కదా?  ఒక జీవనం చెయ్యాలి కదా?  ఒక జీవిక కావాలి కదా?

కాని అతనికి అదే జీవితం, అదే జీవనం, అదే జీవిక అయ్యింది. సిగ్గు ఎవరికి ఉండాలో మరి?

భగ, భగా, ధగ ధగా మెరుస్తూ కళ్ళు మిరిమిట్లు గొలుపుతుంది., సిడిమొయిలు.  అలాంటి లోకం ఒకటి ఉందా?  తెలుసుకోవాలంటే వివరాలకు కథ 2013 ని కొనుక్కుని చదువుకోండి! కథకి అద్భుతమైన బొమ్మ గీసినవారు ఏలే లక్షణ్.

sidimoyilu katha
Illustraton by Lakshman Aelay

బెంగుళూరులో త్రిపురనేని గోపిచంద్ శతజయంతి

బెంగుళూరులో
త్రిపురనేని గోపిచంద్ శతజయంతి ఉత్సవాలు

జులై 31, 2010
సాయంత్రం 5 గం.లకు ప్రారంభం

శ్రీ కృష్ణ దేవరాయ రసజ్ఞ సమాఖ్య

వేదిక

శ్రీ కృష్ణ దేవరాయ కళామందిరం, తెలుగు విజ్ఞాన సమితి
నెం 29, గాయత్రి దేవి పార్క్ ఎక్సటెన్షన్
29, Gayatri Devi Park Extension
వయ్యలి కావల్,
Vayyali Kaval
బెంగుళూర్ 560 003
Bengaluru
ఫోన్: (080) 2331 7850
Location map

కార్యక్రమం వివరాలు

స్వాగతం
శ్రీమతి దివాకర్ల రాజేశ్వరి
(‌’శ్రీ రస‌’ సంస్థాపక కార్యదర్శి)
*
గోపిచంద్ జీవన రేఖలు
ఆచార్య తంగిరాల సుబ్బారావు
(‘‌శ్రీ రస‌’ సంస్థాపక అధ్యక్షులు)
*
గోపిచంద్ కథలు, నవలలు, మానవతా సంబంధాలు
ముఖ్య అతిధి
ఆచార్య. కాత్యాయని విద్మహే
(తెలుగు శాఖ, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్లు)
*
On Gopichand’s Writing
Dr. Gopichand Katragadda
*
తత్వవేత్తలు
డా. మన్నవ భాస్కర నాయుడు
*
పోస్టు చెయ్యని ఉత్తరాలు
డా. దివాకర్ల రాజేశ్వరి
(‌’శ్రీ రస‌’ సంస్థాపక కార్యదర్శి)
*
మా నాన్న గారు
త్రిపురనేని సాయిచంద్
*
నాకు నచ్చిన గోపిచంద్ కథ
శ్రీమతి అంబిక అనంత్
(‌’శ్రీ రస‌’ సంస్థాపక కార్యదర్శి)
*
మెరుపుల మరకలు (నవల)
డా. కె. ఆశాజ్యోతి
*
సమావేశానికి ముఖ్య అధ్యక్షులు – వారి పలుకులు

ఆచార్య: కవన శర్మ

*

వందన సమర్పణం

*

గోపిచంద్ రచన సర్వస్వం – 10 సంపుటాలు (ధర: రూ 1500/-)
సభా ప్రాంగణంలో లభ్యం
(అలకనంద వారి ప్రచురణ)

సౌజన్యం:

శ్రీమతి కాట్రగడ్డ రజని (త్రిపురనేని గోపిచంద్ కుమార్తె)   & శ్రీ కాట్రగడ్డ సుబ్రహ్మణ్యం
శ్రీమతి కాట్రగడ్డ సీమ & డాక్టర్ కాట్రగడ్డ గోపిచంద్

‘శ్రీ రస‌’
శ్రీ తంగిరాల వెంకట సుబ్బారావు
(సంస్థాపక అధ్యక్షులు)
శ్రీమతి దివాకర్ల రాజేశ్వరి
(సంస్థాపక కార్యదర్శి)
శ్రీ మతి అంబికా అనంత్
(సంస్థాపక కార్యదర్శి)