Category Archives: అట్లూరి పిచ్చేశ్వర రావు

కోరిన వరం

ఓ సర్వాంతర్యామి!

నీకు అంతా తెలుసు. నీకు తెలియందంటూ ఈ చరాచరా ప్రపంచంలొ ఏముంటుంది. ఎట్లా ఉంటుంది. ఉండదు. ఉంటే- అయ్యొ! నువ్వు సర్వాంతర్యామివి.

నువ్వు కొయ్యముక్కవంటాడు చిరంజీవి. కళ్ళు తెరవని పసికూన ఇంకేమనగలడు. నువ్వా కొయ్యముక్కవి. నాకు తెలుసు. భగవాన్ నిన్ను గురించి నాకంతా తెలుసు. పసికూనల మాటలకి కోపం తెచ్చుకోవని తెలుసు. దేవుడరుగుమీద కూర్చుని యెందుకలా నవ్వుతావు. భగవాన్, ఈ చిరుతరగ మందహాసం ఎప్పుడూ నీకు పెట్టని నగగానే అట్టే పెట్టుకుంటావా?

హే చరాచరణ స్థితిలయకారణా!

నా దొకటే ప్రార్ధన. ఒకే ఒక ప్రార్ధన. ఇంక నిన్ను ప్రార్ధించను. అయ్యో కాదు భగవాన్, నాలుక తడబడింది. అంతే – నాలుక నీకు తెలియదూ బుద్దేరిహగిన దగ్గిర్నుంచి రోజూ ప్రార్ధిస్తున్నాగా నిన్నేమీ అడక్కుండా ప్రతిఫలాపేక్ష లేకుండా నిష్కామంతో. ఎందుకు ఇదంతా నీతో చెప్పడం? నీకు తెలియదుగనకనా? నేనబద్ధమాడను భగవాన్. అయితే అడిగావనుకో, ఇంటిపెద్ద ఇల్లు మరిచి ఆ పాడుముండ ఏం బాయో-బాయట – వెధవ – భగవాన్! కోపం వస్తోందా, మర్చిపోయాను. భగవాన్ నీకు అందరూ బిడ్డలే. నువు అందరికి తండ్రివే!ఆ. ఆయన, ఆ బాయి యింట్లోనే కాలకృత్యాలన్ని తీర్చుకునేటప్పుడు కోరిన మాట నిజమే. నువ్వు చేసిన మేలు మర్చిపోను బాబు. మర్నాటికి పొన్నుకర్ర టకటకలాడిస్తూ వచ్చిన మనిషి మళ్ళీ ఆ ముండ గడప తొక్కలేదు. చిరంజీవి ఏమంటాడొ తెలుసా భగవాన్. దానికి వేరో ఏదొ కారణం ఉందంట! ఆయన్ని ఆ రాత్రి ఎందరో దబాయించారంట. ఆ ముండ దబాయించేవాళ్ళ వెన్ను చరిచిందంట. భగవాన్, వాడు పసికూన. నాకు తెలియదూ? నిన్ను ప్రార్ధించినదానికి, వరమడిగినదానికి నాకు తెలియదూ? అంతా నీ మహిమే! ఎన్ని లక్షల గుర్రాలా కళ్ళేలు నీ చేతిలో వున్నాయ్యో ఆ నెత్తురుగుడ్డుకేం తెలుసు? అయ్యో అంతా నీకు తెలుసు భగవాన్. నీకంతా తెలుసు.

ఒహో, ఆపద్భాంధవా!

ఆపదొచ్చినప్పుడల్లా నిన్నెప్పుడూ మరవలేదు. నా అపదలన్ని తీర్చింది నువ్వుగాదూ. నీ అండలేకుండా యీ సంసారనావని యీదగలిగేదాన్నా నీకు తెలియదూ – అయితే భగవాన్ నిన్ను పొగుడుతున్నాననుకోకు. ఈ అపదలన్ని ఇంత తెలికగా చిక్కుతీస్తావే! ఇదంతా మాయేనా? ఇదంతా నాకెందుగ్గాని, యిలాగే వస్తాను భగవాన్. తలంటుకుని, చాకలి మడతవిప్పి, కట్టుకుని, కుంకం పెట్టుకుని, చిక్కు వీడని జుట్టుతో – నీకు తెలియదు గనకనా ఇట్లాగే నీ ముందేట్లా కూర్చున్నానో అట్లాగే అచ్చంగా అట్లాగే – వస్తున్నాను, వస్తాను, ఆయనేమంటారో తెలుసా భగవాన్. మీదగ్గరకు వచ్చినఫ్ఫట్లోఉన్న ఉత్సాహంలో వెయ్యోవంతుగూడా ఉండదట ఆయన్ని చూసినప్పుడు. వొట్టి కొంటి మనిషి భగవాన్. ఆయన యెన్నెనోళ్ళోచ్చినా పెళ్ళిడూకొచ్చిన మనవాడున్నాడనైనా మానరు ఆ మాటలు. నీకు తెలుసుగా ఆయన నైజం. అంతే. యెప్పుడూ అంతే.

యెన్ని సార్లు చెప్పానని? యే వయసుకు ఆ మురిపెం ఉండాలని.యీడు దాటితే కోట దాటుతారు. ఆ చిరంజీవికి మూడుముళ్ళు వెయ్యండి అని యెన్ని సార్లు చెప్పాను! యెన్ని సార్లు- వింటేనా? చెవిని యిల్లు కట్టుకుని పోరాను. ఊహూ!

నీ పెళ్ళికి ముందు మీ అమ్మనీ అయ్యనీ నిద్ర పోనిచ్హావని నాకు నమ్మకం లేదు అంటారుగదా! భగవాన్! దానికి దీనికి ఏమన్నా సంబంధం వుందా, నువ్వే చెప్పు భగవాన్?

నాకు అమ్మా, అయ్యా వున్నారుకాబట్టి సరిపోయింది! వాడికి అమ్మా? అయ్యా? వాడు కళ్ళు తెరవకముందే నీ దగ్గిరకు వచ్చారు గదా?

హా సృష్టిలయకారణా!!

నీకు తెలుసునుగా – ఒక్కగాను ఒక్క ఆడబిడ్డ మనవణ్ణీ కన్నది గదా అనుకుంటే యిట్టే యెత్తుకునిపోతివి – ఈ దేవుడరుగుముందు కూర్చుని యెంత యేడ్చాను. యేం లాభం? నీ గుండె కరగ లేదు.

నాకు తెలుసు, నీ గుండె వెన్నపూసలాంటిదని – యేం లాభం? అదంతా నీ ఇష్టం అనుకుని అల్లుణ్ణి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఆయన్నీ అంతే చేస్తివి – పిల్లణ్ణి చూసుకుని యింట్లో పెట్టుకుంటే భోరున యేడ్చాడు. మీకు అప్పగించి వెల్తున్నానని చెరువైపొయ్యాడు. వాడి కోసం పెళ్ళిమానుకున్నానన్నాడు. పెళ్ళి చేసి ఒక యింటివాడ్ని చెయ్యండని గడ్డం పుచ్చుకున్నాడు. నీకు తెలుసుగా..అప్పుడే నీ దగ్గిరకి పరిగెత్తుకొచ్చానుగా – యేం లాభం!

హూ! హే భగవాన్!

నిన్నేమి అనటంలేదు. ఏమని యేంలాభం! అప్పటికే అన్ని అయిపొయ్యే. నువ్వు మాత్రం యేం చెయ్యగలవ్. మంచివాళ్ళకీభూమ్మిద నూకలుండవని నువ్వేగదా అన్నది. అన్నమాటమీద నిలబడవద్దా అనుకున్నాను. అంతే భగవాన్, నిన్ను తిట్టాలేదు, తిమ్మాలేదు. యేమి అనలేదు.

అయితే వాడు – అదే – మా చిరంజీవి పెళ్ళిచేసుకోనంటాడు గదా. యిదేం ఖర్మ భగవాన్! నా మాట మర్చిపొయ్యావా భగవాన్! అందరూ నన్ను ఉమ్మేస్తున్నారు. నీకేం. ఆ దేవుడరుగుమీదనుంచుని సాంబ్రాణిపొగ కళ్ళల్లోకొస్తున్నా అట్లాగే నవ్వుతుంటావయ్యే – అయ్యో! – అయ్యో. నీ తలంతా అదేంటి నల్లగా కరిధూపం!

ఇక్కడేమి మసిగుడ్డకూడాలేదు. యేం ఫరవాలేదు. నా చీర చెరగుతో తుడుస్తాను. కొంగుతో కొత్త చీర కొంగుతో తుడిచాను. చూసావా నువ్వంటే నాకెంత భక్తో!

ఆ! విన్నావా? యీ విడ్డూరం విన్నావా? పెళ్ళి చేసుకోకుండా మీ తాత వున్నాడా, మీ తండ్రి వున్నాడా? ఎవరన్నా పెళ్ళి చేసుకోం అన్న వాళ్ళని చూసారా అంటే సంత పాకల్లో వందల కొద్ది ఉన్నారంటాడు! అని వూరుకోడు, నవ్వుతాడు. పెళ్ళిచేసుకోనివారు బోలెడు మంది వున్నారంటాడుగదా, యెట్లా భగవాన్?

నేను వూరుకోలేదు భగవాన్. నీకు తెలియదూ. నేనూరుకుంటానా? వూరుకుంటే యెట్లా? వూరుకోవాలట! యెట్లా వూరుకోకేం! వాళ్ళకి పిల్లలిస్తామన్నవాలేర్రా, నీకేం రారాజువి. పిల్లని, పిల్లతో పాటు కట్నాన్ని యిస్తామన్నవాళ్ళు కో అంటేఅ కోటి మందిరా అన్నాను. ఒక్క అమ్మయినేగా చేసుకునేది, మిగతావాళ్ళందరూ ఏమౌతారంటాడు. యీ కాలపు పిల్లలికి నువ్విచ్చిన తెలివేనా అది భగవాన్? అంతా తెలిసి యింత అయోమయాన యెలా పడ్డావ్ భగవాన్?

నా ఒఖ్ఖ మాటే కాదు ఎవరి మాటన్నా ఖాతర్లేదు. వాళ్ళ పెదనాన్న వచ్చి వంశాన్ని నిలబెట్టవురా అని అడిగితే నా పొలం కట్టుబడి చాలటంలేదా అని అడిగాడు. వాళ్ళ పిన్ని వచ్చి మీ అమమ్మ ముఖమైన చూసి చేసుకోరా ఆ మూడు ముళ్ళూ చూసి కన్ను మూయాలనుకుంటోది అని అంటే అమ్మమ్మని ఇంకో పదికాలాలాపాటు బ్రతకనీయండి, ఇవ్వాళే పెళ్ళి చేసుకుంటే రేపే కళ్ళు మూస్తుందేమో అని అంటాడు. చెల్లెలుని కళ్ళల్లో పెట్టుకుంటాడు. వదెన్ని చూడాలని ఉందంటే పట్టు చీర పట్టుకొస్తాలేమ్మా అని అంటాడు.

యేమిటి భగవాన్! యిదంతా? యెవరి మాటకి..యెన్నడూ ఎదురు చెప్పని వాడికి యిదేమి గుణం? నీ కాళ్ళు పట్టుకుంటాను, ఆ గుణం తీసెయ్యి బాబు. నీ సంకల్పంలేనిదే గడ్డిపూచ కూడ కదలదుకదా!

అయ్యో కారణకారణా!

నాకు తెలీకడుగుతాను, ఇవ్వన్నీ నువ్వే అనిపిస్తున్నావా వాడితో!ఒహో! చిదచిద్విలాసా!

ఈ మహాకల్పనతో మాయకట్టు కట్టి నాటకమాడిస్తున్నావా నళిననేత్ర! ఆడిన నాటకం చాలదూ..అసలు ఆ మాటే మర్చిపోయాను. యీ ఆట కట్టిపెట్టు మహానుభావా!

నాకు తెలియదూ..మా చిరంజీవి సంగతి, నోరు తెరిచి యెరగడు. అలాంటి వాడు మాటల పుట్టయిపోయే. పెళ్ళి చేసుకోవటమంటే మాటలు కాదంట. పెళ్ళాన్ని పోషించాలంట. (అదెవళ్ళకు తెలియదో! చేసుకున్నవాళ్ళందరూ పోషించటంలా? బ్రతికనంతకాలమూ పొరపచ్చాలేకుండా బ్రదకాలంట. మేమంతా బ్రతకటంలా? ఆయనా నేను ఎన్నిసార్లు పోట్లాడుకోలేదు? మళ్ళీ మాట్లాడుకోలా! మళ్ళీ క్రిందా మీద పడలా?)

ఒకళ్ళ గుణాలు వొకళ్ళకి తెలియాలట! ముందు బాగా తెలిసివుండాలట. (వాడు చిన్నప్పటినుంచి యెరిగినవాళ్ళూ యెంత మంది లేరు? ఒట్టి పిచ్చివాడు. యెంతమంది స్నేహితులనుకున్నాడు. యెంతమంది మోసపుచ్హారు. ..జేబులో పదిరూపాయలనోటేసి కెళ్ళితే ఇంతటికొచ్చేటప్పటికి రాగి దమ్మిడి వుండదే? ..వున్న గుణాలు మారవు పిచ్చి కాని..తెలీని గుణాల్ని సందేహించాడు. మారిన గుణాల్తో మెలగ్గలుగుతాడా?)

యెందుకొచ్చిన మాటలూ యివన్నీ? కూటికా? గుడ్డకా? యెందుకివన్ని నేర్పావు భగవాన్ యివ్వని వాడికి?

యెం చెప్పినా వినడయ్యె, యెట్లా భగవాన్? నీకు పుణ్యం వుంటుంది, ఆ శంఖం వూదుదు, ఆ చక్రం తిప్పుదూ, ఆ గద తిప్పుదూ, ఆ చిరునవ్వు మానుదూ.

అయ్యో! అయ్యో! ఇదేంటి, ఇట్లాగా నేను ప్రార్ధించాల్సింది? అయ్యో! అయ్యో!

ప్రొదెక్కింది, ఆయనొచ్చేవేళయింది. విసిగెత్తుతోంది భగవాన్. ఇంకేమి లేదు. ఆ! విన్నావా! నువ్వు వినకేం. నీకు వినపడనిదేముంటుంది కనక! వూళ్ళొ వాళ్ళేమనుకుంటున్నారో విన్నావా? అది సాగితే ఇదేందుకు? అంటున్నారు. పాపం, ఆ బిడ్డని పట్టుకుని అట్లా నోటికొచ్చినట్లల్లా అంటారుగదా భగవాన్, ఏమనాలి వాళ్లని?

తల్లీ తండ్రీలేని అనాధుణ్ణి అట్లా అందరి నోళ్ళళ్ళో పడేస్తే పుణ్యమా? పురుషార్ధమా? నీకు తెలుసునని నాకు తెలుసు భగవాన్!

యెన్నెన్నో పడ్డాను, యెన్నెన్నో భరించాను. ఇంక నా వల్ల కాదు. యీ పాడు కాలంలో బ్రతకలేను. నన్నేతుకుపో నాయనా, నాకింకా నూకలున్నాయా? అయితే నా మనమడికి, చిరంజీవికి ఆ మూడుముళ్ళు పడేటట్టు చూడు బాబూ.

ఆయనొచ్చేవేళయింది. ఆ వొచ్చేవాళ్ళ పిల్లనన్నా చేసుకునేటట్లు చూడు భగవాన్. ఆ పిల్ల చక్కని చుక్క. గోదేవి లాంటిది. వాళ్ళూ వున్నవాళ్ళూ. కట్నమిస్తారు. వెండి సామాను పెడతారు, వాడు యిష్టపడితే చాలు. కాస్త యిష్టపడమని చెబుదూ, ఇన్ని మాటలనిపించినవాడివి, ఆ ఓక్ క్ ఖ మాట అనిపించలేవూ?

నాకు తెలుసు, అంతా నీకు తెలుసు, నీకు తెలుసని, నాకు తెలుసు. నాకు తెలుసు. నువ్వేం చెయ్యమంటే అది చేస్తాను. ఏకాదశి చెయ్యనా? శనివారం వుండనా? అన్నీ చేస్తాను. ఆ వొక్క మాట నెగ్గించుదూ, కావల్సినన్ని కొబ్బరికాయలు కొడతాను.

పెళ్ళి కాగానే వారిద్దరితో మ్రొక్కిస్తాను. అంతా నీదే. నీవు మ్రొక్కించుకోవాలంటే మ్రొక్కనివాళ్ళేవరు?

అంతే, నేను కోరేది దేవుడా! అలా, ఆ! సురుచిర మందహాసం!

సర్వాంతర్యామి! చరా చర స్థితిలయకారణా! ఆపద్భాంధవా! కారణగారణా! చిదచిద్విలాసా! మహానుభావా! ఓ దేవుడా!

హే! భగవాన్! యీ చిక్కులో చిక్కుకున్న చిక్కును విడదియ్యవూ?

(ప్రచురణ కాలం 1954)
కధకుడు: అట్లూరి పిచ్చేశ్వరరావు.
(1925 ఏప్రిల్ 12 – 1966 సెప్టెంబర్ 26)

//
id = 20806;
// ]]>

Reblog this post [with Zemanta]

రచయిత – రచన

రచయిత – రచన

జీవితం లో పాల్గొనే ప్రతి వ్యక్తి, ప్రజల్లో సజీవంగా మెలగుతున్న ప్రతి మనిషీ రచయిత కాగలడా? కాడు ! మానవ సమాజం తప్పటడుగులు వేస్తున్నప్పుడు ప్రతి కళాసృష్టి లోనూ సమాజం అంతా పాల్గొనేది. అప్పుడు రచయితకీ ప్రజలకి భేదం లేదు. అలాంటి పరిస్థితుల్లో రచయిత స్వయం ప్రతిభ అనే ప్రశ్నే లేనేలేదు. అప్పుడు ఉత్పత్తి : కొనుగోలులకి భేదం ఉండేది కాదు ఆర్ధికరంగం లో, అదే సాహిత్యంలో కూడా ప్రతిబింబించేది.

అంచేతనే ఆనాటి సాహిత్యంలో అదంతా జానపద సాహిత్యమని జమకట్టవచ్చుచైతన్యం సున్నాగా కనిపించింది; వ్యక్తిత్వం గూడా కనిపించదు. ఐనా ఆ సాహిత్యం లో ఎకాగ్రతఅద్భుతంగా ఉండేది. ప్రకృతికి మనిషికీ జరిగే పోరాటంలోని పరస్పర వైరుధ్యాలు అన్నీ యెత్తిచూపుతూ మానవ యత్నానికి చక్కటి దోహదం యిచ్చేది.

కాని

ఇప్పుడో! రచయితకీ, పఠితకి ప్రత్యక్ష సంబంధం లేదు. రచయిత తాను రచించింది మార్కెట్‌లోకి పంపుతాడు. చదివేవాడు కొనుక్కుని తనగదిలో చదువుకుంటాడు. ఇప్పుడు గూడా మనిషికి ప్రకృతికీ పోరాటం జరుగుతునే ఉంటుంది. రచయిత ఇప్పుడు కూడా మనిషి కొమ్మే కాయాలి. పూర్వం జరిగిన ఫలితమే ఏకాగ్రత – ఇప్పుడు కూడా వ్యక్తులుగా విడిపోయిన పాఠకుల్లో కలగాలి. ఇందుకు పూర్వం సంఘానికి రచయితకి వున్న ప్రత్యక్ష సంబంధమూ , రచనలో ఉన్న సమిష్టి యత్నమూ, పాల్గొనే సమిష్టి ప్రజల స్వార్ధం లో ఉన్న సామ్యము యెక్కువగా సహకరించేవి. ఇదివరకున్న ఆ ప్రత్యక్ష సంబంధం , సమిష్తి యత్నాల స్థానాన్ని, రచయిత స్వయం ప్రతిభ స్వంతం చేసుకోవాలి. ఎవరన్నా ఇదే ఇంస్పిరేషన్‌అన్నా అభ్యంతరం లేదు; అలా అనే వాళ్ళు ఇంస్పిరేషన్‌కి పర్స్పిరేషన్‌ కి బేధం తెలిసినవాళ్ళయితే.

ఆదిమ సాహిత్యానికి పునాదులుగా నిలబడ్డ మంత్రశక్తి, జ్యోతిషమూ, ఆవేశమూ, దూరదృష్టీ, సమిష్టీ స్వార్ధమూ, పూలకం లాంటి ఆవేశమూ, యీనాటి రచయితకి అవసరమే! కాని ఆనాటి మానవుడు ఆదర్శం ప్రధానంగాకుక్షింభరత్వంమాత్రమే! అయితే మానవుడు పురోగమించుతూ అనేక విలువల్ని, గుణపాఠాల్ని నేర్చుకున్నాడు. ఈ అనుభవాలకీ, విలువలకీ, రచయిత వారసుడు కావాలి. కాగా ఆ రచయిత శాస్త్రజ్ఞానమూ, హేతువాదమూ, గతి తార్కిక భౌతిక జ్ఞానమూ, వర్తమానానికి భవిష్యత్తుకీ ఉన్న సంబంధ పరిచయమూ మూర్తీభవించాలీ. ప్రజలకీ నాయకుడికీ ఉన్న భేదమే రచయితలో వివిధ రూపాల్లో కనిపించుంతుంది.

ఒక సందర్భంలో ఇబ్సన్‌ అంటాడు; ప్రశ్నలడగటమ్వరకే నా కర్తవ్యం, వాటికి సమాధానాలు చెప్పడం నా పని గాదు. సమస్య్లని పరిష్కరించడం నా వల్ల అయ్యే పని గాదు. మనుష్యుల్ని, వాళ్ళకుండే విభిన్న గుణగణాల్ని, వీటన్నటిని నిర్ణయించే ఆధునిక సాంఘిక సంబంధాల్నీ, సిధ్హాంతాల్నీ చూపించగలిగితే నేను కృతకృత్యుణ్ణయినట్టే.

ఇంతగా నియమిత ఆదర్శాన్ని ముందుంచుకున్న ఇబ్సన్‌ ప్రముఖ రచయితల్లో ఒకడిగా పరిగణించబడ్డాడు. కాని యీ నాటికి రచయితలూ అదే ఆదర్శంతో రచనా యత్నానికి పూనుకుంటే పప్పులో కాలువేసిన వాళ్ళవుతారు.

ఎంచేతనంటే మనిషి ఇబ్సన్‌ ని వదిలిపెట్టి చాలా ముందుకి వచ్చాడు. ఇబ్సన్‌ రోజుల్లో గందరగోళాల బురదలో మినుకు మినుకు మంటు కనిపించిన సామాజిక సత్యాలూ, సిద్ధాంతాలూ, ఇవ్వాళ్ళ కాళ్ళుని నిలబడ్డాయి. ఇబ్సన్‌ రోజుల్లో మనిషి సాంఘిక సంబంధాలని మరింత గందరగోళం చేసుకుంటూ పురోగమించేవాడు. ఆ గందరగోళాలన్ని ఈ రోజు మురుగు కంపు కొడ్తున్నాయి. ఆధునిక రచయితలు కూడా ఈ గందరగోళం వెనుకవున్న సంఘాన్ని, సాంఘిక సంబంధాన్ని చూడలేక ఈ గందరగోళం సంఘమని, సాంఘిక సంబంధమనీ, వాస్తవమనీ మసక కళ్ళతో చూసి విశ్వసిస్తున్నారు. ఆధునిక రచయిత, అబివృద్ధయిన పరిణామ సిధ్హాంతాన్ని, హేతువాదాన్ని, గతితార్కిక భౌతికవాదాన్నీ కళ్ళజోడుగా పెట్టుకుని, చేయూతగా తీసుకుని, మసకలోనుమంచి, పొగలోనుంచి బయటపడగలగాలి.

ఇలా బయటపడుతున్న రచయితల్లో పరిఢవిల్లే ప్రకాశం, ఆ పొగను, మసకను భేదిస్తాయి. భేదించుతున్న ప్రకాశం మరింత పదునెక్కుతుంది. ఈ ప్రకాశం మృగ్యమైనప్పుడు రచయితకున్న ఇన్స్పిరేషన్ పెర్స్పిరేషన్‌గా తయారవుతుంది. ఇన్స్పిరేషన్ “వేడి” లాంటిది, అనుకుంటే ఆ రాగితీగలో ప్రవహించే సర్వమానవాభ్యుదయ వాంచ్హ అనే విద్యుచక్తి తనలోవున్న “వేడి” నంతటిని సేకరించుకుని అవిరామంగా తిరుగుతూవుంటుంది. తనకంటే బలంగావున్న ప్రకాశంతో కుస్తిపట్టేటప్పుడు అందరికీ ఉపయోగించే వెలుతురు పుట్టుకొస్తుంది. ఇదీ రచయితలలో కనిపించాల్సిన “స్వయంప్రతిభ…”

రచయితలకు పునాదులుగా వుండవల్సిన ఈ “ప్రతిభ” వస్తు నిర్ణయంలోను, సంవిధాన యత్నంలోనూ, కళ్ళకు కట్ట్టినట్లు కనిపించుతుంది. ఇందులో ఎక్కడ లోపమున్న అది రచనలో ఎక్కడో ఒక చోట పొక్కుతుంది.

ఈ స్వయం ప్రతిభని ఉపేక్షించే రచయితలునుద్దేశించేమో టీ.ఎస్.ఇలియట్ అంటాడు:

మేం బోలు మనుషులం

మేం గడ్డిబొమ్మలం

మా వంటి నిండా వరిగడ్డే

మేమేం చెయ్యం? మేమేం చెయ్యగలం?

మేం గుసగులం; మేం గునుస్తాం

మా గుసగుసల్లో, మా గునుకుల్లో వేగం లేదు:

వేడీ లేదు; అర్ధం సున్నా!

మా గొంతుల్లో పొడి

మా పదాలు పగిలిన అద్దాల మీద నడిచే యెలుకల చతుష్పాదాలు

మా పదాలు యెండుగడ్డి కదిపేగాలి పిల్లల కెరటాలు!

ఇలాంటి బోలు మనుష్యులు, గడ్డిబొమ్మలు కావల్సినంత మంది వున్నారు.వీళ్ళు పెద్ద పులుల్తో “సత్యాగ్రహాలు” చేయించగలరు.”స్వర్గానికి నిచ్చేనలు” వేయగలరు. వీళ్ళే సర్వమానవ నాశన కారణాలయ్యే “తుపాను” లు వీయించుతారు. కారణం?

స్వయంప్రతిభ సాధనంవల్ల కలిగేదని వీళ్ళు నమ్మరు. యీ ప్రతిభ, పుట్టుకతోనే కలుగుతుంది కాబట్టి ప్రపంచం యీ ప్రతిభని యీఇనాటికాక్కుంటే రేపటికైనా గుర్తిస్తుందని నమ్ముతారేమో! వీరికున్న ప్రతిభ విలక్షణమైనది. సాధన విపరీతమైనది. వర్తమానాన్ని అర్ధం చేసుకోలేక, భవిష్యత్తువైపు తేరిపారా చూడలేక గతంలో తలదూర్చి బ్రతుకుతుంటారు.

పుట్టుకకి ప్రతిభకి సాపత్యం లేదని, సంబంధం ఉండదని యెవరూ అనరు. కాని అంతటితోనే అది అంతమవుతుందంటే అభ్యంతరం వస్తుంది.

సాహిత్యం కూడ ఒక వృత్తి లాంటిదే. మిగతా వృత్తుల విలువలకి, యీ విలువలకి వ్యత్యాసముంది. నిజమే. కాని మిగతా వృత్తులలో, నైపుణ్యం సంపాదించటం ఎంత కష్టమో, యీ వృత్తిలో ఆరి తేరెందుక్కుడా అంత దీక్షా, సాధనా అవసరమే. ఈ సాధన గడిచిన చరిత్రని, భాషాబేషజాన్ని పరిశీలించి, సొంతం చేసుకున్నంత మాత్రాన సిద్దించేది కాదు. చరిత్ర వెనుకవున్న సత్యాన్ని, భాషకున్న చరిత్రనీ, ప్రయోజనాన్ని గూడా గుర్తించగలగాలి. ఇదంతా సమకూడాలంటే యెడతెగని కృషి వుండాలి.

ఇందుకు రచయితలందరు కృషికున్న విలువని గుర్తించాలి; కృషి అంటే వున్న చిన్నచూపుని సంస్కరించుకోవాలి. రచయిత కూడ కొన్ని హద్దులో కార్మికుడేనన్న విషయాన్ని మరిచిపోగూడదు. అప్పుడే కష్టజీవుల అండని నిలబడటంలో వున్న గౌరవం అర్ధమౌతుంది. అప్పుడు గాని ఈట్స్ అన్న మాటల్లోని యదార్ధం అవగతం కాదు; ” You must learn your trade.”

రచయిత – రచనలు – మీద కీ..శే అట్లూరి పిచేశ్వర రావు అభిప్రాయాలు

సృజనాత్మకం

ఆ తల్లి పిల్లల్ని పోషించే విధిని నిర్వహించలేనట్లే, పెద్ద మనిషిసాంఘిక చైతన్యానికి దారి చూపలేడు.

సంఘంలో చైతన్యం కలగాలంటే, సృజనాత్మక రచనలు కావాలి. సృజనాత్మక రచనలు, సంఘంలో చైతన్యాన్ని విద్యుద్దిపించాలాంటే, సాంఘిక సంసృతీ సంప్రదాయాలు అందులో సంలీనం కావాలి. మన సాంఘిక ప్రాచీన జీవితంలోని చచ్చుపుచ్చుల్ని దులిపి, కడిగి, యేరి, సజీవభాషనూ, రూపాల్ని, సాంకేతికాలనూ స్వీయం చేసుకోవాలి. అప్పుడుగాని ప్రజల హృదయతంత్రుల్ని మీటి సంగీతాన్ని పలికించలేము.

ఈనాడు గలగల తొణికే విషాదాశ్రువుల్ని , కణకణ మండే విలాపాగ్నూలని, సాహిత్య రూపాల్లో సాక్షాత్కరింపజేసుకోవాలి. దారిద్ర్యాలను పరిష్కరిస్తూ, దౌర్జన్యాలను బహిష్కరించే బాటలకు రూపులు దిద్దాలి.

వ్యదార్థజీవితాల యధార్ధాన్ని చిత్రిస్తూ, సంఘానికి భవిష్యత్తు చూపే సోపానాలను నిర్మించుకుంటూ సంఘం అంతా హర్షాన్ని పూచేట్లు చేసుకోవాలి.

అదే ప్రజా సాహిత్యం. ప్రజాసామాన్యం అంతా నిరక్షరాస్యులుగా వున్న మధ్య యుగాలలో గూడా ఉత్తమ సాహిత్య రూపాలు ప్రసిద్ధి కెక్కాయి. ఆ నాటికి నియమితమైన సాహిత్య చైతన్యంతో, ప్రజాజీవితాన్ని తరచి, ప్రజలిని కలవరపరచిన సమస్యల్ని వారి హృదయాలకు హత్తుకునేట్లు చిత్రించిన సంస్కృతీ రూపాల్నీ, ఈ నిరక్షరాస్యులైన ప్రజలే అత్తారు బలంగా దాచుకుని, ఆనందించారు; ఈనాడు అంతే.

బుధనిర్వచనం
నిరక్షరాస్యుడు: కుక్షి కోసం చక్షువులు మూసుకునే మనిషి.

అట్లూరి పిచ్చేశ్వర రావు

కార్టూన్లు

వినతి
“విన్నవి – కన్నవి” అనే అనే శీర్షికతో, అట్లూరి పిచ్చేశ్వర రావు ఆ నాటి పత్రికలో వ్రాసిన వ్యాసాలివి. సుమారు రెండు దశాబ్దాలకు పైగా ఆయా సమకాలిన ఘటనలపై వ్రాసినవి. వ్యక్తులు పరిస్థితులు మారినా, ఈ నాటికి వర్తించే విమర్శనా, వ్యంగ్యము ఈ రచనలలోని విశిష్టత.

అందులో ఒకటి ఇది.

* * *
” ఇంటా బయటా కూర్చున్నప్పుడూ, తిరుగుతుండగాను కనిపించిన వ్యక్తులు మాట్లాడిన మాటలు ఇవి. సంస్కరించకుండా విన్నవి విన్నట్లు, కన్నవి కన్నట్లు ఒక వరుసా క్రమము ఏర్పరచకుండా మీకు ఒప్పచెబుతున్నా. అయినా వరుసా క్రమము ఏర్పడి వుంటే అందుకు గౌరవం ఆయా వ్యక్తులకే దక్కుతుంది. ఆయా మాటలు నాకు వినబడేంత చేరువగా మాట్లుడుకున్నందుకు వారందరికి ధన్యవాదాలు.” – అట్లూరి పిచ్చేశ్వర రావు
***

రెడ్డేమంటున్నాడు?

గోదావరి వరద బాధితులకి సహాయం చెయ్యండి.

మా కర్నూలికా వరదలు రావు.

దొడ్డిగుమ్మం గొళ్ళెం వూడదు.

నా సీమ రాయలసీమ కాదండి.

ప్రకాశం అవుతాడంటారా?

దిడ్డిగం వేసి ముడ్డితొ దాటే వారుంటారు.

ఏమో లెండి. బట్టతలలు బట్టతలలే మొకాళ్ళూ,

మోకాళ్ళే

ఎన్ని చెప్పినా ఆయన రాజాకీయనుభవాని

కున్నంత వయసుగూడా లేదాయె వీళ్ళకి.

అబ్బో! మా మంచి విగ్రహం!

ఎంత మంచి కాకపొతే అంతమంది పోలీసులు

కాపలా కాయవలసి వచ్చిందంటారు.

విగ్రాహాలకి ఆగ్రహం వుండదు. ఒకటే

నిగ్రహం.

అదే మృగ్యం.

మీసాలు లేనివరికి రోసాలు మిక్కుటం.

ఆర్డినెన్సులు పెట్టడంలో అగ్రతాంబూలం మనదే చూడండి.

* * *

నెత్తురు కధ

నెత్తురు కధ గురించి కొడవటిగంటి కుటుంబరావు
“..కళాకారుడికి శిల్పంలో పొదుపు
అత్యవసరం. ఈ పొదుపుకు ఆదర్శప్రాయమనదగినది “నెత్తురు కధ”. అయిదు పేజీలు పూర్తిగాలేని ఈ కధలో ఒక జీవితమే కాదు, ఎంతో చరిత్ర లిఖించి ఉంది. …..ఇంటి వరండాలో ఎత్తున కూర్చున్న ఓ ముసల్ది చచ్చింది. ఆ ఫొటొ మనలో కొందరం చూశాం. వరండాలో అయిన రక్తం మడుగుమీద పిచ్చేశ్వరరావు కాల్షియం ఇంజెక్షన్‌లాటి కధ రాశాడు”.

 

నెత్తురు కధ

చూచారా మీరు? అదిగో చూడండి. ఆ వీధి చివర మలుపులో అక్కడ ఎర్రగా కనిపించడంలేదూ, గాలిలోరెప రెప లాడుతూ. ఆఁ అదే. జాగ్రత్త! చెత్తా,చెదారామునూ..ప్రక్కగా తప్పించుకు నడవండి!

ఆఁ. దే ఎర్ర జండా.

సుత్తి లేదు, కోడవలీ లేదు. నిజమే! ఆ రంగు గూడానూ. రంగేసిన గుడ్డ కాదిది.నెత్తురు పులుముకున్న గుడ్డ. నీలా నాలా బ్రదికిన మనిషి నెత్తురు. ఒకప్పుడు- నీ రక్తంలా, నా రక్తంలా ప్రేమతో పొంగి, దుఃఖంతో కరిగి,క్షోభతో కుమిలి, కోపంతో మండి..న నెత్తురు.

ఆ రక్తంలోనూ యెర్ర కణాలు యీదినయి. ఆ రక్తంలో యెర్ర కణాలు పరుగెత్తినయి.

ఏవరో పంచిపెట్టిన రక్తంగాదు అది. పొలం దున్ని, కాయ కష్టం జేసి, పంటలు పండించి, సుఖంగా బ్రతికిన రైతులే ఆ రక్తానికి జీవం పోసింది; ఆ శరీరాన్ని పెంచింది. నీలా, నాలా, – ఆ రక్తాన్ని సొంతం చేసుకున్న శరీరం ఊయ్యాలల్లో ఊగింది. తల్లి రొమ్ము పాలు తాగింది. తండ్రి వొడిలొ గంతులేసింది. మాయా మర్మము; కల్లాకపటము తెలియకుండా రాత్రిళ్ళు నిద్రపోయింది; రేపటి సంగతి తెలియకుండా వుత్సాహంతో వూగిపోయింది. సంతోషంతో కేరింతలు కొట్టింది. ఆనందంతో ఆటలాడి పాటాలు పాడుకొంది.

పలకా బలపమూ పుచ్చుకొని బళ్ళోకెళ్ళింది. పంతులుగారు బెత్తం ఝలిపిస్తే గడ గడ వణికిపొయింది.పంతులుగారు పుస్తకం పట్టుకుంటే పాఠం గడగడ వప్పచెప్పింది.

పెళ్ళినాడు భర్తపేరు చెప్పేందుకు సిగ్గుతో వంగిపొయింది. చెరువులో నీళ్ళు తెచ్చెందుకు భర్త కావడేసుకుని, రొమ్ము విరుచుకుంటు బయలుదేరితే వుబ్బితబ్బిబ్బయ్యింది.

నువ్వూ, నేను గాంధిగారి ఫొటో చూడకముందు తన యింట్లో గాంధీ పటాన్ని వ్రేలాడగ ట్టింది. రాములవారి పటాన్ని పూజించినట్లు పూజించింది.

నువ్వూ, నేను ఖద్దరంటూ వొకటుందని తెలుసుకోక పూర్వమే, రాట్నం వడికింది. ఇంటిల్లపాది ఖద్దరు కట్టేట్టు చేసింది.

నువ్వు నేను చూడని జైళ్ళలోకి హత్యలు చేనవాళ్ళూ, దొంగతనాలు చేసినవాళ్ళూ, వాళ్ళల్లాంటి వాళ్ళు వెళ్ళేప్పుడు భర్త చేతికి “రాట్నం జండా” యిచ్చి, భర్త నుదుట కుంకుమ బొట్టు పెట్టి హారతిచ్చి , కళ్ళంట నీళ్ళు పెట్టుకోకుండా భర్తని జైలు గేటుదాకా సాగనంపి వచ్చింది.

ఆరేళ్ళు పెరిగిన కొడుకు “అమ్మా! నానేప్పుడొత్తాలే?” అని అడిగి ఏక్కెక్కి యేడిస్తే ఆ రక్తం ఏమని సమాధానం చెప్పిందో తెలుసా? “యీ లాటీలు పుచ్చుకున్నవాళ్ళ రాజ్యం పోయినప్పుడు వస్తారు బాబూ!”అని చెప్పింది. “తెల్లవాళ్ళ రాజ్యంపోయి మనవాళ్ళ రాజ్యంవచ్చినప్పుడు వస్తారు బాబు!” అని చెప్పింది.

వరదలొచ్చి పంటలుపోతే, వెన్నంటుకున్న బిడ్డల కడుపులుచూచి కుమిలిపోయింది…”చౌరమ్మా!చౌరమ్మా! నేనన్నట్టు వొప్పుకుంటే నీ పొలమూ నీకు దక్కుతుంది, నీ బిడ్డలూ నీకు దక్కుతారు. లేకపొతే…” అని జబల్‌కర్ గుటకలు మింగుతుంటే, యీ రక్తం యేం చేసిందో తెలుసా? రోకలిబండ పుచ్చుకుని ” చీ! చచ్చినాడా” అని జీవంలేని చేతులు వూపింది. పదునులేని పళ్ళు నూరింది. రక్తంలేని కళ్ళు వురిమింది.

పెగలని కంఠంతో ఇంకేమో మాట్లాడబోయి శొ్‌షొచ్చి కూలింది.

భర్త జైలునుండి బయటపడి వచ్చేప్పటికి పొలం పోయింది. ఇల్లు పోయింది. వళ్ళు గుల్లయింది. అయినా, కళ్ళలో పెట్టుకున్న ప్రాణాలతో ఎదురెళ్ళింది. జరిగిందంతా విని భర్త నీరైపోతే యీ రక్తం యేమనందో తెలుసా? “అయిందేదో అయింది. అట్లాంటి కాలం యిట్లాగే వుంటుందా? గాంధిబాబు స్వరాజ్యం తెస్తాడు. అప్పుడు యెవరి సొమ్ము వాళ్ళకే వస్తుంది” అన్నది. “బొంబాయి వెళ్ళి యే మిల్లులో కుదిరినా మన మూడు డొక్కలూ నిండుతయిలే. దిగులు పడకు!” అని దిటవు చెప్పింది. జీవం లేని నవ్వు నవ్వింది.

చిరుగులుకుట్టిన కోక కట్టుకుని కోడలు యింట్లో అడుగుపెడితే గుడ్లలో నీళ్ళు కక్కుకుంది. కొంగుతో కళ్ళు తుడుచుకుని, కోడలు గడ్డం పుచ్చుకుని ఈ రక్తం ఏమన్నదో తెలుసా? ” ఇట్లాంటి కాలం యిట్లాగే వుంటుందా? నీ కోడలు రాకముందే స్వరాజ్యం వస్తుంది. నీ కోడలు లక్షిం దేవికిమల్లే వస్తుంది. నా మనవళ్ళు రాజులకిమల్లే బ్రతుకుతారు” అని అన్నది.

భర్త గుండేల్లో గుండు దూరిందని వార్త వచ్చింది. తన చేతుల్తో తనే సాగనంపింది భర్తను; “చౌరీ! జైలుకెళ్ళిన రోజులు గుర్తుకొస్తున్నయే” అంటే యీ రక్తం అనందంతో పరుగెత్తింది. “ఆప్పుడు నీ మొఖాన కుంకుం పెట్టాను. ఇప్పుడేమి పెట్టి బొట్టు పెట్టను? కాండబ్బంత కుంకం కూడా లేకపొయె యింట్లో. హారతి మాట అనుకోవడానికి గూడా…” అంటూ బేజారయిపోయింది యీ నెత్తురు. “పిచ్చిదానా…!” అంటు భర్త తల మీద చేయివేసి నిమురుతుంటే చిన్నప్పుడు తండ్రి మొకాళ్ళమీద గుర్రం తొక్కుతున్నట్టు‌ వుబ్బి తబ్బిబ్బయింది. ఆ మాటలన్ని గుర్తుకొచ్చాయీ.

అయినా పిండి నూరే చేతుల్లొకి ప్రవహించుతూనే వుంది యీ రక్తం. ఈ చేతులు నూరిన పిండి పెనంమీదకి యెక్కుతూనే వుంది. కాలిన చపాతీలు కాలేజి కుర్రాళ్ళు బోటులోకి జేరవేస్తునే వున్నారు. బోట్లు నీళ్ళళ్ళో నిలుచున్న ఓడలవైపుకు పరుగెత్తుతూనేవున్నవి. ఓడలలోవున్న నావికుల ప్రాణాలు నిలబడినై. యెవరో “వాళ్ళందరూ గూండాలు” అన్నారని ఎవరో వచ్చి చెప్పితే యీ రక్తం నిండార్లయ్యింది.

“తెళ్ళాల్లేనా అన్నది!” అని వెర్రినవ్వు నవ్వింది యీ రక్తం. కోపంతో సలసల కాగిపోయింది యీ రక్తం…

మనవళ్ళని చూచి మురిసిపోయింది యీ రక్తం… “వచ్చే కాలం మీదేరా బాబూ!” అని గోరువెచ్చబడిందీ రక్తం.

మూడు రోజులు పస్తుండి ఆగస్టు పదిహేను పండుగ చేసుకుంది. మనమళ్ళతోనూ, కొడుకుతోనూ, కోడల్తొనూ పట్టణమంతా పిచ్చెత్తినట్లు తిరిగింది ఆనాడు. “అమ్మా! ఆవాళ్ళాది రాట్నం జండా, ఈవాళ్ళది చక్రం జండా” అని కొడుకంటే, చెప్పించని చదువు గుర్తుకొచ్చింది ఈ రక్తానికి.

నూలులేని బట్ట ఎక్కడుంటుంది? ఐనా తిండిలేని రక్తం ప్రవహిస్తూనే వుంది. తిండి కోసం చీపురు పట్టింది., వీధులూడ్చింది…కలిగినవాళ్ళ బిడ్డలు తినిపారేసిన కాగితాలు పొట్లాలూడ్చి గంపలకెత్తింది. మనమళ్ళ మాటన్న తల్చుకోకుండా కొడుకు తోలే బండిలో గుమ్మరించింది. భవనాల్లో వుండేవాళ్ళకి జబ్బులు పుడతాయని భూమ్మీద పండుకుని అకాశాన్ని కప్పుకుని బ్రతుకుతు భవనాలముందు దుమ్ము వూడ్చింది. వున్నవాళ్ళ కారుల టైరులు పోతాయని, కోడలి చేయి పుచ్చుకుని గుర్రాల బళ్ళు పారేసిన పేడకళ్ళేత్తింది యీ రక్తం!

ఈ బజార్లలో యీ చెత్తా, యీ చెదారమూ ఎందుకు పోగుపడిందో తెలుసా? వీటిని యేత్తిపారేసే చేతుల్లో రక్తం నీళ్ళైపోయింది. రక్తం నీళ్ళైపొయేటప్పటికి చేతులు “పనిచేయం” అన్నయి. కాళ్ళు”కదలం” అన్నయి. కళ్ళు “చూడం” అన్నయి. అన్నీ కలిసి “రక్తం కావాలి” అని అరిసినవి…

కాగితాలమీద కలాలు నడిచినయి. కాగితాలు చేతుల్లొ కదిలినయి. నలిగి, నలిగి, చిరిగిపోయినయి. చిరిగిపోయి చిత్తుబుట్టల్లో దూరినయి. అయినా “రక్తం” కనిపించలా. చిత్తుబుట్టలు దులిపేందుకు కూడా కనబడకుండాపోయింది.

ఏమైపోయింది? ఎక్కడి కెళ్ళిందీ రక్తం? తెళ్ళాల్ల రాజ్యం పోయింది. మనాళ్ళ రాజ్యం వచ్చింది. నాన్నలేడు, కొంప లేదు, తిండి లేదు, బట్టలేదు. జబల్‌కర్ నెత్తిమీద గాంధి టోపీ వుంది; జబల్‌కర్ ముడ్డికింద అస్సెంబ్లీ కుర్చి వుంది. పోలిసొళ్ళ చేతుల్లొ లాఠిల్లేవు. తూపాకులు వెలసినయి. “అమ్మా,తెళ్ళాల్ల రాజ్యం పోయిందే! మనాళ్ళా రాజ్యం వచ్చిందే అమ్మా!” అని కొడుకంటూటే “విందాం” అని చెవుల్లో పరిగెత్తిందీ రక్తం.

“అత్తా!…ఇంకేంతకాలం? సొరజ్జం వచ్చింది. కోడలు రాలేదు. చిరుగులుపడ్డ కోకలో కోక పోయింది. ఇంకెతకాలమత్తా?” అని కోడలు రక్తాన్ని ఖాండ్రిస్తే, “అయ్యొ” అని అదరా బాదరా కళ్ళలోకి పరుగేత్తిందా రక్తం.

“ఆ వూసిందిగూడా నువ్వే ఎత్తెయ్యలి. వుయ్యబాక!” అని కొడుకు యెకిలినవ్వు నవ్వుతూంటే యేం చెయ్యాలో అర్ధంగాక, యెటు పరుగెత్తాలో అర్ధంకాక అట్లాగే నిలబడిపోయింది ఆ రక్తం.

అప్పుడా రక్తానికి ఏమి తెలియలా. పట్టణంలొ పట్టణారోగ్యం పాడైపొతుందని విలపించే పత్రికలున్నాయని తెలియలా. కాంగార్ మైదానంలో “తిండి కావాలి” అని అరిసే గొంతులూ వినిపించలా. చీపుర్లు పట్టే చేతులు దుమ్మూ, దుమారమూ దులుపుకున్నవనీ తెలియలా. పదమూడువేల వంగిన నడుములు ఒక్కసారి లేచి నిలబడ్డాయని తెలియలా. బిడ్డా, పాప, అడా, మగా అందరు కలిసి బజార్లోకి వచ్చారని, యీసారి వచ్చింది చెత్తా చెదారమూ కదిపేందుకు కాదనీ, యీ సారి వచ్చింది వాళ్ళ నోళ్ళు అప్పు పుచ్చుకొని “తిండి కావాలి” అని అరిసే నాయకుల్ని పొట్టనపెట్టుకున్న రాతిగొడల్ని కదిపేందుకనీ తెలియలా…

ఎవరు సహిస్తారు యీ “సోమరితనాన్ని?” “పనిలేని జీతం” కావాలనేవాళ్ళన్నీ, “జీతమున్న శెలవులు కావాలనే వాళ్ళన్ని”? నువ్వు నేనూ సహించవచ్చు, సానుభూతి చూపవచ్చు, సమర్ధించవచ్చు, బలపర్చవచ్చు,  పోట్లాడవచ్చు…

శాంతి భద్రతలు మేల్కోన్నాయి. ఇంతవరకు నిద్రపోతున్న శాంతి భద్రతలు మేల్కొన్నాయి. ఒక్కసారి ఆవులించాయి. కభందుడిలా ఒక్కసారి వళ్ళు విదుచుకున్నాయి. తరువాత జరిగే సంగతి నీకూ తెలుసు!

పోలిసుల చేతుల్లో తుపాకులు ఫెళ ఫెళ మన్నాయి. తుపాకుల బయట గుళ్ళు బుంయి మంటూ పరుగెత్తాయీ. మనోవేగంతో పరుగెత్తాయి. రక్తాన్ని పలకరించబోయాయి.

ఏమీ తెలియని రక్తానికి అంతా అర్ధమైంది. సలా సలా కాగింది. జల జలా పారింది…వరండా అంతా తడిసింది. గుడ్డలు నానినయి ఆ రక్తంలో…

అది యీ రక్తం! అలాంటిదీ…యీ రక్తం. ప్రేమతో పొంగి, దుఖంతో కరిగి, క్షోభతో కుమిలి, కోపంతో కమిలి…న నెత్తురు.

ఆ రక్తంలోనూ తెల్ల కణాలు యీదినయి. ఆ నెత్తురులోనే ఎర్ర కణా లూ పరుగెత్తినయి…

* * *
ఈ కథ తొలి ప్రచురణ విశాలాంధ్ర తెలుగు దిన పత్రిక 1948-08-01

కధకుడు: అట్లూరి పిచ్చేశ్వరరావు.


కృష్ణా జిల్లా లో ఒక సామాన్య రైతు కుటుంబంలో 1925 ఏప్రిల్ 12న జననం. 1945లో భారత నౌకాదళంలో చేరారు. కొన్నాళ్ళు “విశాలంధ్ర” లో. తరువాత ఆరు చిత్రాలకు మాటలు వ్రాసారు. గొదాన్, ప్రతిధ్వని, పేకముక్కలు, గాడిద ఆత్మకధ వంటి ప్రసిద్ధ అనువాదాలు వారివే. 1966 సెప్టెంబర్ 26 న చనిపోయారు.