ఆదివారం. మార్చ్ 2, 2014. మళ్ళీ SMS. ఆర్టిస్ట్ మోహన్ గారి పిలుపు. మనవాళ్లందరూ వస్తున్నారు. మీరు కూడా రావాలి. మన శేఖర్ కి మనం చెయ్యాలి! సందర్భం శేఖర్ కార్టూనిస్ట్‌గా గోల్డెన్ జూబిలి సెలబ్రేషన్.
శేఖర్ కార్టూనిస్ట్ గా నే పరిచయం అయ్యాడు ఆంధ్రజ్యోతి లో. కె.పి డెస్క్ పక్కనే. కె.పి ని దాటుకుని శేఖర్ డెస్క్‌కి వెళ్ళాలి. ఆ పక్కనే వసంతలక్ష్మి గారి డెస్క్.
కినిగె కి తన కార్టూన్ పుస్తకాన్ని ఇచ్చిన తొలి కార్టూనిస్టు శేఖర్. అదొక అభిమానం. తరువాత ఎప్పుడో ఒకసారి నా మీద కోపగించుకున్నాడు కూడా! “నాకు మీరు పిచ్చేశ్వరరావు గారి అబ్బాయని ఎందుకు చెప్పలేదు. ఆయనంటే మా తరానికి ఎంత ఇష్టమో, మీకు తెలియదు. అటువంటి వాళ్ళు అంత త్వరగా వెళ్ళిపోవాడనికి హడావుడి ఏమిటో?” అనుకున్నడు స్వగతంగా.
అమెరికా సంయుక్త రాష్ట్రాలకి వెళ్లబోయేముందు, వెళ్ళి వచ్చిన తరువాత తన పుస్తకాన్ని డిజిటల్ బుక్‌గా ఎలా డిజైన్‌చేస్తే బాగుంటుందో అని కలిసినప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. కలవనప్పుడు ఫోన్ చేసేవాడు. ఫోనులో “తింటున్నాన్నా?” అని అడిగి నవ్వేవాడు.
“సార్, మీ ఇంటికి దగ్గిర్లోకి మారుతున్నాను. మనం ఇక రోజు కలుసుకోవచ్చు. బహుశ నేనే మీ ఇంటికి వస్తాను. కలిసి టీ తాగోచ్చు,” అని ఎంతో సంతోషంగా నవ్వుతూ చెప్పినప్పుడు ఆనందమేసింది.
తరువాత ఎప్పుడో తెలిసింది..ఆరోగ్యం బాగోలేదని. ఇంటికి వెళ్ళి పలకరించాలని అనుకునేటప్పడికి ఇల్లు మారడం కూడా ఐపోయింది.

ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అతని కోసం చూసాను. కొంచెం ఆలస్యం అయ్యింది నేను వెళ్ళేటప్పటికి. మనిషి కనబడలేదు. వెతుకున్నాను. కాప్..నోటికి మాస్క్ అడ్డం ఉంది. ఆ మాస్క్ పైన కళ్ళు. నవ్వు. ఉగ్గబట్టుకున్న ఆనందం. సంతోషం. ప్రెస్‌క్లబ్ నిండిపోయింది. కాని మనిషిని చూసిన నేను ఖంగు తిన్నాను. నాకు తెలిసిన శేఖర్ రూపు కాదది. మనిషి మొఖంలో విపరీతమైన అలసట. సగం అయిపొయ్యాడు. ఎందుకో ఉండబుద్ది కాలేదక్కడ. తనతో మాట్లాడడానికి తగిన ప్రదేశమూ కాదు..సందర్భమూ కాదు. ఈ లోపు ఒకటికి రెండు సార్లు ఫోను చేసిన అన్వర్, sms లు గుప్పించిన ఇతర మిత్రులని పలకరించాను.
హడావుడిగా పరిచయుస్థుడొకాయన వచ్చాడు. పక్కనే శ్రీమతి అనుకుంటాను. పేద్ద పూలమాల. ఒక పుష్ఫగుచ్చం. హడావుడి హడావుడిగా వేదిక దగ్గిరకు దాదాపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపొయ్యారు. ఆఖరి చూపు. పార్ధివ శరీరాన్ని పుష్పమాలంకృతాన్ని చెయ్యాలన్న తాపత్రయం కనపడింది ఆ వేగంలో, ఆ మాటల్లో, ఆ గమనంలో. విరక్తి పుట్టింది.
విజయవాడలో “మో” హాస్పిటల్లో ఉంటే..”సార్, ఐపోయ్యిందా? డిక్లేర్ చేసేద్దామా”? అని స్ట్రింగర్స్ శ్రీ శ్రీ విశ్వేశ్వరావు గారిని పీక్కు తిన్న వైనం గుర్తోచ్చింది. మనసు రోసింది. అసహ్యం వేసింది. రోత పుట్టింది.
వెళ్ళిపోదామని వెనక్కి తిరుగుతుంటే..అన్వర్ ఎదురువచ్చాడు. “సార్, వెళ్ళిపోతున్నారా?” అంటూ. ఔనన్నట్టుగా తలూపూతూ గేటు వైపుకి కదులుతుంటే..”వుండండి సార్..రెండు మాటలు మాట్లాడి వెళ్లండి” అని అన్నాడు. వాళ్ళ మధ్య నేనేమి మాట్లాడుతాను అనుకుంటూ నిలబడిపొయ్యాను. “ఉండండి సార్. ఒక్క రెండు మాటలు మాట్లాడండి. తనుకూడా వింటాడు కదా?”అని అన్నాడు. ఇక ఆ మాటకు తిరుగులేదు. సరే అని ఆగి పొయ్యాను.
ఈ లోపు మాట్లాడేవాళ్ళున్నారు. వాళ్ళ తరువాత..అన్వర్ నాకు మైకు ఇప్పించాడు. శేఖర్ వెనకకి చేరుకున్నాను. శేఖర్ భుజం మీద చెయ్యి వేసాను. శేఖర్ నా ముఖంలోకి చూసాడు. మా ఇద్దరి కళ్ళు కలిసినవి. He knows. He knew, I knew. He also knew that my heart is with him. I wished him all the best with all my heart. I expressed my good wishes to all his frineds for supporting him at that time. లేచి నిలబడ్డాడు. కౌగలించుకున్నాడు. That was the parting embrace. I knew.
మైక్ ఆర్టిస్టు మోహన్ గారికిచ్చాను. అన్వర్ కి థాంక్స్ చెప్పాను. వచ్చేసాను.
మా అమ్మ పోయినప్పుడు చలసాని ప్రసాదరావు గారు రాలేదు. దానికి ఆయన చెప్పిన కారణం. “నాకు మీ అమ్మ చక్కగా సంతోషం గా నవ్వుతూ ఉన్నప్పుడు చూసిన జ్ఞాపకం. నాకు అదే గుర్తుంచుకోవాలని ఉంది” అని.
చంద్రశేఖర్ విషయం లో నాది అదే ఉద్దేశం. అందుకే కొడుకు పెళ్ళికి వెళ్ళలేక పొయ్యాను. ఈ రోజు వెళ్ళడం లేదు. ఫోటో కూడ తను నవ్వుతున్నదే పెట్టాను.
ఆ రోజున అన్వర్ నన్ను గుర్తుపెట్టుకుని పిలవకపొతే..నాకు శేఖర్ చిరు దరహసం అందేది కాదు.
గుడ్‌బై శేఖర్. You are a good friend. I shall remember your smile. Always.
ఇది వ్యాపారం కాదు. నేను ఇప్పుడు కినిగె లో లేను కూడా! శేఖర్ పుస్తకాలు ఇవి కొన్ని అని చెప్పడానికి మాత్రమే: http://kinige.com/author/Shekar



