వ్యాపారస్తుడు దొంగ.

అప్పట్లో ఇంటర్‌నెట్ లేని రోజుల్లో గ్రీటింగ్ కార్డులతో పుట్టిన రోజులకి శుభాకాంక్షలు, గిట్టిన రోజులకి సందేశాలు కూడా పంపుకునేవారు.  ఆ రోజుల్లో కొంచెం చదువుకున్నవారు, మహానగరాలలో ఉండేవారు (భారతదేశంలో)  వకీల్స్ వారి గ్రీటింగ్ కార్డులు కొనుక్కుని పంపేవారు.  చక్కని సందేశాలతో, ముచ్చటైన బొమ్మలతో కళాత్మకంగా ఉండేవి అవి. గ్రీటింగ్ కార్డులు కూడా కళాత్మకంగా ఉంటాయా అని అడిగేవారితో నాకు అస్సలు పేచి లేదు.  అందుకని వారి జోలికి వెళ్ళను.  వకీల్స్, ఎలార్ రోజుల్లో వారికి పోటిగా ఆర్చీస్ అనే సంస్థ  బయలుదేరింది.

ఆనాటి నవతరం, యువతరం కోసం వాళ్ళు కార్డ్లు మొదలుపెట్టారు.  ఆ తరువాత పెన్నులు, గన్నులు, బొమ్మల అమ్మకాలన్నింటిలోకి ప్రవేశించారు.  మొదట్లో ఈ గ్రీటింగ్ కార్డులమీద ధరల వివరాలుండేవి కాదు.  దుకాణందారు తనకిష్టం వచ్చిన ధరకి అమ్మేవాడు.  కొనుక్కునేవాడు..మనసులోనే నిక్కినా నిలిగినా కొనుక్కునేవాడు.  తప్పదు.  కొంత పీర్ ప్రెజర్ కూడా ఉండేది.  రీడర్స్ డైజెస్ట్ చేతిలో లేకపోతే వాడొక వెధవాయ్ అన్నటైపులో అన్నమాట!  ఇప్పుడు “చే” బొమ్మతో ఉన్న కాలర్‌లెస్ టీ వేసుకున్నట్టు.  (“చే” ఎవరు అని ఆడిగితే, “చీ, చీ..నన్నే అడుగుతావా  అని తన తెలియని తనాన్ని దాచుకునే వెధవలున్నట్టు).

వ్యాపారస్థులందరూ దొంగలు కాదు!
వ్యాపారస్థులందరూ దొంగలు కాదు!

అలాంటి రోజుల్లో బ్రతక నేర్చిన మిత్రుడు (వాడు బ్రతకనేర్చినవాడని అంతకుముందే తెలిసింది..అది మరొక కథ) ఎవరి బర్త్‌డేకో గ్రీటింగ్ కార్డ్ కావాలని రావడం..(నాతో సెలక్ట్ చేయించుకోవాలని అప్పట్లో తాంబరం నుంచి బెసెంట్ నగర్ నుండి, పరశువాక్కం లాంటి దూరప్రాంతలనుండి వచ్చేవారు)  ఒక చక్కని కార్డుని అసలు ధరకే (లాభాలు లేకుండా..మిత్రుడు కదా?) తీసుకోవడం అయిపోయింది.  పాపం డబ్బులిద్దామని పర్సుతీస్తే అందులో అన్ని వంద రూపాయల నోట్లే!

“అలా రా బాస్,  టీ తాగి, దమ్ము కొడదాం. హోటల్ వాడు చిల్లర ఇస్తాడులే” అని నన్ను లాక్కువెళ్ళాడు.  గోల్డ్‌ఫ్లేక్ కింగ్స్, టెన్స్ పాకెట్ ఆ రోజుల్లో అక్షరాల ముప్పై రూపాయలు.  నా షర్ట్ జేబు ఎప్పుడు దానితో నిండుగా ఉండేది.  (కొందరిలాగా పాంట్ జేబులో పెట్టుకుని దాచుకోవడం నాకు తెలీదు).  సరే, ఒకటి మనవాడికిచ్చాను..నేను ఒకటి అంటిచ్చుకున్నాను.  స్పేషల్ టీ ఆ రోజుల్లో మూడు రూపాయలు.  ఇద్దరికి ఐతే రెండుకప్పుల నిండా వచ్చేది.  ఆ స్పెషల్ టీ తెచ్చిన బేరర్ కి చిల్లరలేక..పావలా టిప్పు.  బిల్లు పే చెద్దామనుకున్న మిత్రుడు మళ్ళీ వంద రూపాయల నోటు ఇస్తే..హోటల్ యజమాన్ నవ్వుతూ నా వంక చూశాడు.  ఆ మూడు రూపాయలు నేనే ఇచ్చాను. (ఇందాకటి పావలా టిప్పు కూడా నాదే!)

ప్లాట్‌ఫార్మ్ మీద నిలబడి కబుర్లు చెప్పుకున్నాం.  ఒక రెండు నిముషాలు.  గోల్డ్‌ఫ్లేక్ కింగ్స్ కదా అనేమో మిత్ర గురువు  దమ్ము లాగుతున్నాడు..ఫిల్టర్ కూడా కాలిపొయ్యేటట్టుంది.  అప్పుడు దానిని చూపుడు వేలు మధ్యవేలు మధ్యన పెట్టుకుని చమత్కారంగా విసిరేసాడు.  అది హోటల్ పక్కనే ఉన్న బడ్డికొట్టుముందు వీధిలాంతరు స్థంభానికి తగిలి కింద పడింది.

“సరే బాసు, మళ్ళీ కలుద్దాం”, అంటూ నేను రోడ్డు దాటడానికి కదులుతూ..అతనికి షేక్‌హాండిచ్చి రాబోతుంటే..చెయ్య్ పట్టుకుని ఆపేసి అన్నాడు కదా..”బాసు రెండు రూపాయల కార్డు కొని, మూడు రూపాయల సిగరెట్టు, ఒక స్పెషల్ టీ కొట్టేసాడేంటి వీడు అని అనుకుంటున్నావా?”

అతను అనేదాక ఆ ఆలోచన నా ఊహలోకి కూడ రాలేదు.  అప్పుడు వచ్చింది.  కార్డు కొన్నానంటాడు అది కూడా ఫ్రీ గానే తీసుకున్నాడు గా అని.  అదేమి లేదులే అని నవ్వేసి, చెయ్యి వదిలించుకుని వచ్చేసాను.

అఫ్‌కోర్సు..ఏదో ప్రభుత్వ సంస్థలో లంచం ఇచ్చి ఉద్యోగం సంపాయించుకున్నాడు.  ఇద్దరు కూతుళ్ళకి అమెరికా సంబంధాలు చేసాడు.  కోట్ల రూపాయల విలువగల భవంతుల యజమాని ఈ రోజు.

ఇదంతా ఎందుకు చెప్పానంటే..ప్రతి వ్యాపారస్థుడు దొంగ కాదు, చీట్ కాదు. వాడికి స్నేహాలు, బంధువులు, ప్రేమలు, అభిమానాలు, నైతిక విలువలుంటాయి!  నిన్న ఎవరో ఫేస్‌బుక్‌లో వ్యాపారస్థుడుకి అలాంటివి ఉండవన్న అర్ధం వచ్చే మాటన్నారు, అందుకని ఈ ఏడుపు!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.