కా రా మాస్టారు ని అడిగాను, “చదవగలుగుతున్నారా?” అని. “ఇబ్బందిగానే ఉంది. ఇదివరకటిలాగా ఏకధాటిగా చదవలేక పోతున్నాను. ఐనా మధ్య మధ్య ఆపి కళ్ళకి కాస్త విశ్రాంతినిస్తూ చదువుతూనే ఉన్నాను. చదవకపోతే ఎలా? ఊపిరి ఆడదుగా?! మీకు తెలియందేముంది ?” అని అన్నారు. అప్పటికి వారికి సుమారు 86 ఏళ్ళు అనుకుంటాను. ఐనా చిన్న స్టూలు లాక్కుని దానిమీద కెక్కి నిలబడి, అటక మీదున్న కొన్ని పుస్తకాలని అందుకుని, దిగి తీసుకువచ్చి మీరు చదవాలని నాకు అందజేసారు. చదవడం మీద ప్రేమ అది.
“అదిగో, దానితో చదువుతున్నాను” అంటూ టేబుల్ మీదున్న భూతద్దాన్ని చూపించారు త్రిపుర, అదే ప్రశ్నని వారిని అడిగినప్పుడు. అది చూసినప్పుడు, “సమగ్ర ఆంధ్ర సాహిత్యం” కోసం భూతద్దం తో కుస్తీపడుతున్న ఆరుద్ర గుర్తు వచ్చారు. “చెక్కుల మీద సంతకాలు పెట్టగలుగుతున్నారా?” అని అడిగాను. “నా కోడి కెలుకుడిని మా బాంక్ వాళ్ళు సంతకం క్రిందే భావిస్తున్నారు. ఐ యాం థాంక్ఫుల్ టు దెం” అని అన్నారు త్రిపుర నవ్వుతూ. చదవకుండా, రాయకుండా ఎలా ఉండగలరు ఎవరైనా అన్నది వారి ప్రశ్న. చదవడం మీద ప్రేమ అది.
“ప్రతిరోజు నెట్ ని ఎప్పుడో ఒకప్పుడు చూస్తూనే ఉంటాను. కంప్యూటర్ మీద, నా రచనలన్నింటిని నేనే టైప్ చేసుకుంటాను నాకు ఇబ్బంది ఏమి లేదు. ఇంటర్నెట్ లో చదువుకుంటాను కూడా”, అని అన్నారు మొన్న “పెద్ధిభొట్ల సాహితీ పురస్కారం” అందుకున్న రచయిత్రి సత్యవతి పోచిరాజు. చదవడం మీద ప్రేమ అది.
“టాంక్ బండ్ మీద వెళ్తున్నప్పుడు వచ్చింది..ఒక ఫ్లాష్ లాంటి ఆలోచన. బండి అపేసి, పక్కనే లాన్లో కూర్చుని లాప్టాప్ మీద అప్పటికప్పుడు వ్రాసిన కధ “వర్డ్ కాన్సర్” అని తెలియజేసిన పాత్రికేయురాలు – వర్ధమాన రచయిత్రి అరుణ పప్పు. వ్రాయడం, చదవడం మీద ప్రేమ అది.
తెలుగు ఆచార్యులు. మల్లీశ్వరి గారు ఆన్లైన్లో వ్రాసుకున్న బ్లాగులను ఏర్చి కూర్చి “జాజిమల్లి” బ్లాగు కథలు గా ప్రచురించింది పర్స్పెక్టివ్ ప్రచురణ సంస్థ.
ఆ మధ్య ఒక పుస్తక ఆవిష్కరణ సభకి హైద్రాబాదు నుండి సకాలంలో అచ్చు పుస్తకాలు అమెరికాలో అందకపోతే, “ప్రింట్ ఆన్ డిమాండ్” సాంకేతిక పరిజ్ఞానంతో అక్కడే తెలుగు పుస్తకాలన్ని అచ్చొంతించి ఆ ఆవిష్కరణ సభని నిర్విఘ్నంగా, విజయవంతంగా నిర్వహించుకున్నారు.
కేంద్ర సాహిత్య అకాడెమి లాంటి ప్రచురణ సంస్థలు కూడా ఈ నాడు రచయితలు తమకు పంపే రచనలను సాఫ్ట్కాపీలుగానే పంపమని కోరుతున్నవని గమనించాలి.
ఈ రోజు అదిలాబాదు లో తను రాసిన రచన ని ఆన్లైన్లో తన లాప్టాప్నుండే ఈపబ్లిష్ చేసుకుంటున్నాడు తెలుగు రచయిత.
అది ఈ రోజు రచనా వ్యాసంగంలో ఉన్న తెలుగు రచయితలు, వారి రచనలు, ప్రచురణల పరిస్థితి.
ఒకప్పుడు హైద్రాబాదులోని కోఠీలోనో, కాచీగూడాలోనో, వైజాగు గుప్తా బ్రదర్స్లోనో, విజయవాడ ఏలూరు రోడ్డులోని నవోదయలో నో, మద్రాసు పాండి బజారులోని రాణి బుక్ సెంటర్ లోనో, తెలుగు పుస్తకాలు కొనుక్కుని, మద్రాసు ఇంటర్నేషనల్ ఏయిర్పోర్టు నుంచి వెళ్ళే వారు ప్రవాసాంధ్ర పాఠకులు. కాని ఇప్పటి పరిస్థితి వేరు.
ఇల్లినాయ్లో ఉంటున్న అన్నయ్య, అదిలాబాదులో తన తమ్ముడికి కావల్సిన పుస్తకాన్ని ఆన్లైన్లో ఈబుక్ రూపంలో కొని ఈమైల్ ద్వారా పంపిస్తే దానిని డవున్లోడ్ చేసుకుని చదువుకుంటున్నాడు ఆ విద్యార్ధి. ఫ్రాన్స్ లో తెలుగు పదాన్ని ఉపయోగించడంలో సంధిగ్ధం ఎదురైతే ఆన్లైన్ లో ఆంధ్రబారతికి వెళ్ళి అర్ధం తెలుసుకుంటున్నాడు తెలుగు భాషాభిమాని.
ఇంటర్నెట్ పుణ్యామా అని పుస్తకాలకోసం ఇది వరకటిలాగా గంటల సేపు ప్రయాణాలు, రోజుల తరబడి విలువైన సమయాన్ని వెచ్చించి వెతుక్కోవడం తగ్గింది. ఆన్లైన్ లో ఈబుక్స్ మాత్రమే కాదు, అచ్చు పుస్తకాలు కూడా కొనుక్కోవచ్చు, బంగారం, బస్సు, టికెట్లు లాగా. కొనుక్కోవడమే కాదు, అద్దెకి కూడా తీసుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల మీద దాడికి అమెరికా ఉపయోగించిన “డ్రోన్” ల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్న నవతరం “డ్రోన్” తో పాఠకుడు కోరుకున్న అచ్చు పుస్తకాన్ని అతని ఇంటికే అతి తక్కువ ఖర్చుతో అందే ఏర్పాట్లు చక చకా సాగుతున్నవి.
మనవడితో మాట్లాడుకోవడానికి బామ్మ “టాబ్లెట్” తో కుస్తీ పడుతోంది. మనవరాలికి తెలుగు నేర్పడానికి “స్మార్ట్ఫోన్” ఆప్స్ని ఆశ్రయిస్తున్నాడు తాత గారు. సీరియల్స్ వచ్చి తెలుగు పుస్తకాలని పక్కకి నెట్టేసింది అనడం ఫాషన్ అయి’పోయింది’.
తెలుగు పాఠక ప్రపంచం దినదినాభివృద్ధి చెందుతున్నది. అంది పుచ్చుకోవలసిన వారు, రచయితలు, ప్రచురణ కర్తలే! వారిదే ఆలస్యం! పాఠకుడే రారాజు, ఈ రోజున!
One Reply to “పాఠకుడే రారాజు”