మొన్న (ఆదివారం, 4 నవంబరున, Hyderabad Study Circle లో ) జరిగిన కవన శర్మ జ్ఞాపకాల సభలో సాహితీ మిత్రులందించిన మూడు సందేశాలు వ్యవధి లేక జారిపొయ్యాయి.
ఒక నిర్వాహకుడిగా అది నా తప్పిదమే. మిత్రులను క్షమాపణలు కోరుకుంటూ, వాటిని ఇక్కడ అందరితో పంచుకుంటున్నాను.
…
రావు, వేమూరి – University of California, Davis విశ్రాంత ఆచార్యులు (అమెరికా)
వేమూరి వెంకటేశ్వర రావు గారి సందేశంః
ఏనాటి మాటో! కవన శర్మ గారుట. బోస్టన్ నుండి ఫోనులో పిలచేరు – నేను తెలుగు భాషా పత్రికలో రాస్తూన్న వ్యాసాలు బావున్నాయని చెప్పడానికి. తరువాత పది సంవత్సరాల కాలం గడచిపోయింది. నేను హైదరాబాదు వచ్చేను. శర్మ గారు ఊళ్లో ఉన్నారని తెలసి పలకరించడానికి వెళ్లి పరిచయం చేసుకోబోయాను. “అయ్యో! మీరు తెలియకపోవడం ఏమిటి? కించిత్ భోగో కథ రాసింది మీరే కదూ?” అంటూ స్వాగతించేరు. తరువాత వైజాగులో వారింట్లో ఒక సారి కలుసుకున్నాను. నేను రాసిన మహాయానం కథల పుస్తకానికి అడిగిన వెంటనే ముందుమాట రాసి ఇచ్చారు. రెండేళ్ల క్రితం బెంగుళూరు శివార్లలో నేను ఉన్నానని తెలిసి ప్రత్యేకం నన్ను చూడడానికి వచ్చేరు. ఆయన్ని కలుసుకున్నది కేవలం మూడు సార్లు. ప్రతి సారి మా సమావేశం గంటకి మించలేదు. అయినా సరే, ఆయన నా మనస్సులో ఒక ముద్ర వేసుకుని కూర్చున్నారు. ఇటీవలి కాలంలో – ఆయన ఇక లేరని తెలిసిన తరువాత – ఫేస్ బుక్ ని తెరచి చూడబుద్ధి కావటం లేదు. కవన శర్మ గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ
— వేమూరి వేంకటేశ్వరరావు.
తులసీ జలంధర చంద్రమోహన్ – రచయిత్రి ( చెన్నై )
జలంధర గారు ఆడియో ఫైల్ పంపారు. క్రింద ఆడియో ఫైల్ లో వారి
“కవన శర్మ గారికి పుష్పాంజలి” వినవచ్చు.
గ్రీకువీరునికి వీడ్కోలు
కవనశర్మగారి గురించి నాలుగు మాటలు పంచుకోమని అనిల్ అడిగారు.
రచయితలుగా మన పరిచయంలో ఉన్నవారి గురించి మాట్లాడటం కొద్దిగా సులువు. సాహిత్య లోకానికి వారి తోడ్పాటుని మన అవగాహన లోనుంచి చెప్పవచ్చు. కానీ వారు మనకి వ్యక్తులుగా కూడా తెలిసినపుడు, వారి అభిమానాన్ని పొందిన స్నేహితులం అయినపుడు మాట్లాడటం కొద్దిగా కష్టం. వ్యక్తిగతం, సాహిత్యం కలగలిసిపోతాయి. విడదీసుకుని నిబ్బరంగా వ్యాఖ్యానించడానికి, వారి సాహిత్య కృషిని మదింపు చేయడానికి నాకైతే సాధ్యం కాదు. ఆమె ఇల్లు, విడాకులు చదివినపుడు స్త్రీల సమస్యల మీద ఆయనకి ఉన్న సహానుభూతికి సంతోషపడ్డాను. పరిధి చదివినపుడు అతిక్రమణల గురించి తెలుసుకున్నాను. రచన పత్రికలో సాహిత్య నిర్మాణ సూత్రాల గురించి రాసినపుడు ఆ దీర్ఘ వ్యాసానికి ఉన్న శాస్త్రీయ దృష్టికి ఆశ్చర్యపడ్డాను. వ్యంగ్య కవనాలకి నవ్వుకున్నాను.
నచ్చింది రాయడం తప్ప నచ్చనిదాని గురించి మాట్లాడను, మౌనమే విమర్శ అన్నపుడు అంగీకరించలేకపోయాను. ఏ రచనకైనా మానవ స్పర్శ అంటుకుని ఉండాలని చెప్పినపుడు ప్రేమించాను. రెండునెలల కిందట కలిసినపుడు, “ప్రత్యేకించి వైద్యం తీసుకోనని, రాబోయే వారికోసం చోటు ఖాళీ చేసేయాలని చెప్పినపుడు బాధతో వాదించాను. నిక్కచ్చితనాన్ని మృదువుగా చూపేపుడు అబ్బురపడ్డాను. సమయపాలనకి పెట్టింది పేరైన కవనశర్మ గారు, మొదటిసారి సమయం తప్పారు. 29 వ తారీఖున విశాఖ వెళ్లాలని, తన ఇంటిలోని నల్లబల్ల మీద రాసుకున్న ఆయన దానిని మర్చేపోయారు. విశాఖ వచ్చినపుడు మాట్లాడాల్సిన విషయాలున్నాయని రెండు మెయిల్స్ పెట్టారు. ఆయన నాతో ఏం మాట్లాడాలనుకున్నారో వివినమూర్తి గారికి తెలుసు, కుందుర్తి రజనికాంత్ గారికి తెలుసు. మీరు నాకు చెపితే కవనశర్మ గారు నాకు చెప్పేసినట్లే.
– మల్లీశ్వరి కె ఎన్ – రచయిత్రి (విశాఖపట్నం)
కోరిన వెంటనే తమ తమ సందేశాలను పంపినందుకు శ్రీమతి తులసీ జలంధర చంద్రమోహన్, వేమూరి వెంకటేశ్వర రావు, కె.ఎన్ మల్లీశ్వరి గారలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, జరిగిన పొరబాటుకి మన్నించగలరని ఆశిస్తున్నాను.