ఈ కథలు… చదవటమొక అవసరం

ఈ కథలు.. చదవటమొక అవసరం

నరేష్‌కుమార్ సూఫీ
నరేష్‌కుమార్ సూఫీ

విస్తృత పథికుడు, నిత్య చదువరి

Atluri Pitcheswara Rao kathalu - title page
అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు - సంపుటి - ముఖచిత్రం
Share on facebook
Share on twitter
Share on whatsapp
Share on telegram

కాస్త సిగ్గేసింది… మూడుదశాబ్దాల జీవితంలో చాలా చదివా అనే గర్వం లాంటిది ఏ మూలనైనా ఉంటే అది సమూలంగా తుడిచిపెట్టుకుపోయింది. అట్లూరి పిచ్చేశ్వరరావు అనే పేరు కేవలం అనువాద రచయితగా మాత్రమే తెలుసు నాకు. అదీ… కిషన్ చందర్ రచనలవరకే…అయితే…! ఇదిగో ఈ పుస్తకం చూశాక ఈ కథలు చదివాక, ఒకానొక ఉద్విగ్న, దుఃఖ సమయాలని అనుభవించాక.. మా తరంమీద జాలేసింది. కొత్త కొత్త పుస్తకాలని తెస్తున్నాం, చూస్తున్నాం ఆధునిక సాహిత్యాన్ని మళ్లీ వెలుగులతో చూస్తున్నాం. కానీ, ఒకానొక కాలపు వెతలని ఇంత హృద్యంగా మళ్లీ చదవటం ఒక అనుభవం. భాష, కథనం రెండూ కలిసిన ఒక ఫ్లో… అద్భుతం కదా ఈ అనుభవం.

ఈ కథల్ని ఇప్పటికైనా చదవగలిగాను.. చదువుతూ గుండె చప్పుడు పైకే విన్నాను, కంటినుంచి అప్రయత్నంగా వచ్చిన కన్నీటి చుక్కని తుడుచుకుంటూ పుస్తకాన్ని చేతిలో ఆప్యాయంగా పట్టుకున్నాను… అట్లూరి పిచ్చేశ్వరరావుని అభిమానించుకున్నాను…

నెత్తురు కథలో… ఒక కాలాన్ని, ఒక పోరాటాన్ని అనుభవిస్తూనే ఆనాటి కాలాన్ని దర్శించుకున్నాను. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాంశాలని. పోరాట జీవితకాలాలని ఇంత హృద్యంగా టచ్ చేయటం, దాన్ని ఇంత అందంగా రాయటం. ఎలా పట్టుబడుతుందీ కళ!? “ఆ.. అదే ఎర్రజండా. సుత్తీలేదు,కొడవలీ లేదు. నిజమే! ఆ రంగు గూడానూ.. రంగేసిన గుడ్డ కాదది. నెత్తురుపులుముకున్న గుడ్డ. నీలా నాలా బతికిన మనిషి నెత్తురు…” (నెత్తురు కథ) పాఠకుడా! ఎట్లా భరించగలవీ వలపోతని? నిజంగా రాయటానికి ముందు ఆ రచయిత మామూలు మనిషిగా ఎలా భరించాడీ వ్యధని?? కథ సమకాలీన పరిస్థితులకి కూడా అచ్చంగా సరిపోయేదే మన దేశపు ముఖ చిత్రమైన నెత్తుటి బతుకు చిత్రణ ఈ కథ.

“చిరంజీవి చనిపోలేదు. అట్లా చూస్తావేం! వీళ్లంతా చిరంజీవులు కాదూ! ఆ (తిరగబడే) జనమంతా చిరంజీవులే!!” అంటున్నాడు డాక్టరు. ఎస్.బీ.ఏ. చేతిలోంచి తుపాకీ లాక్కున్నాను నేను… ఇక్కడితో “చిరంజీవి” కథ ముగుస్తుంది. కానీ ఆ చిరంజీవి ఇచ్చిన ఆలోచన మనలోనూ మొలకెత్తిపోయి ఉంటుంది. ఆ ఫీల్ నుంచి బయటకు రావడం అంత ఈజీ కాదు. అది ముద్ర రచయిత వేసిన ముద్ర.

“తెలివిగల నాలుక పనిచేయదోయ్ పిచ్చి! నవ్వే మొఖం పని చేస్తుంది” అంటుంది విన్నీ. (గడవని నిన్న) ఎన్నెన్ని ముఖాల, మరెన్ని మనుషుల్ని చూసిన అనుభవం ఇది. ముఖ్యంగా ఆ కథల్లో కనిపించే వాతావరణం. అచ్చంగా మనం ఆ పరిసరాలని ఊహించుకుంటూ చదవగలిగేంత స్పష్టంగా ఉంటుంది. అసలు దాదాపుగా వందేళ్ల కిందట రాసిన కథ… ఇప్పుడు ఈ కాలాన బతుకుతున్న కుర్రాడికి కూడా అదే అనుభవం ఇవ్వటం… వ్యవస్థ వైఫల్యమా? రచయిత భవిష్యద్దర్శనమా?? (ఆగస్టు 15న) ఒక ఆలోచన, అబ్స్ట్రాక్ట్ చిత్రణ. ఎన్నెన్ని ఆలోచనలకు మొలకలు వేసిన కథ ఇది. “నేటినుండీ నేను స్వతంత్రున్నట. ఔను! కాదనేందుకు నాకు స్వాతంత్రం లేదు.” ఎప్పటికాలపు వ్యాఖ్య ఇది!!? నిన్నా మొన్నా కూడా ఇదే వినపడిందే…!!!

నిజానికి తెలుగులో కథలో చాలా మార్పు వచ్చింది. కానీ ఇప్పుడు కూడా అద్భుతం అనిపించే థాట్, కొత్త రకపు ప్రజంటేషన్ మనల్ని చకితుల్ని చేస్తుంది. “వసుంధర” కథ రాసిన తీరు. ఇలాంటి ఫార్మాట్ లో కథ రాయొచ్చనే ఆలోచనే ఒక తిరుగుబాటు. స్టిల్ ఎ ఫ్రెష్ ఫీల్ ఇన్ ఇట్. అంత వైవిధ్యంలోనూ…. చెప్పాలనుకున్న విషయం సూటిగా పాఠకుడి మెదడుకు చేరుతూనే ఉంటుంది. చదవడంలో ఏమాత్రం అడ్డంకి ఉండదు. ఖచ్చితంగా ఇవి ఈనాటి కొత్త రచయితలకు అందాల్సిన కథలు, రాబోయే తెలుగు పాఠకులకు చేరాల్సిన విషయాలు. బహుశా ఇలాంటి శైలిలో తెలుగు కథ నావరకూ నేను గమనించింది “త్రిపుర”లో. పిచ్చేశ్వరరావుని అందుకోవటంలో కాస్త ఆలస్యమే జరిగింది. ఆనాటి కాలానికి ఇంత రాజకీయ చైతన్యంతో కూడిన రచనలు చాలా వచ్చి ఉండవచ్చును కానీ కచ్చితంగా ఇలాంటి ఫ్రేమింగ్ మాత్రం లేదు. ఇది పారడాక్స్ అనొచ్చునో లేదో కానీ ఒక విధపు “క్లిష్టమైన సరళత” కనిపించింది.

మంటో కథల్లో కనిపించే హృద్యమైన చిత్రణ, తగలి శివశంకరన్ పిళ్ళై తరహా సూటిదనం… పిచ్చేశ్వరరావులో కనిపించాక నిజ్జంగా మొదటిగా చెప్పుకున్నట్టు సిగ్గుగానే అనిపించింది. వేరు వేరు భాషల కథలని, కథకులని తెలుసుకున్న నేనూ… ఈయనని ఇంత ఆలస్యంగానా తెలుసుకోవటం?? నేవీ నేపథ్యంలో ఉన్న కథలు… ఆ కథల్లో కనిపించే వాతావరణం, కొత్త కొత్త పదాలు, ఆనాటి వస్తువులు… ఆఖరికి వారి వస్త్రధారణ కూడా మనకు కనిపిస్తుంది. ఇక ఆ పాత్రల ప్రవర్తన మనలో కూడా కొన్నిసార్లు ప్రవేశిస్తుంది. ఇది ఒక సినిమాకి పనికి వచ్చే స్టైల్, ప్రతీ కథని అలాగే నేరుగా స్క్రిప్టు కింద తీసుకోవచ్చు. అంత చక్కటి స్క్రీన్ ప్లే తరహా కథనం కనిపిస్తుంది.

శాస్త్రి కథ ఒకసారి చదివాక జీవితంలో మర్చిపోగలమా? అలాగని అందులో ఏముంది?? నరాల్ని పొంగించే ఇతివృత్తంకాదు, మరీ హత్తుకునే విషయమూ లేదు.. కానీ, ఆ సున్నితమైన వ్యంగ్యంతో కూడిన రచనా శైలి, ఆ స్మూత్ సర్కాజం. అవునూ..!ఈ శాస్త్రి కథ రాసినాయనేనా ఆ “నెత్తురు కథ”రాసిందీ!!??
“ఇదుగో, నిన్నే, ఎవరో చూడు. అడుక్కుతినేవాళ్ళు లాగుంది.” (అన్నాడు కవి)
“మనకంటేనా” అంటూ నడవాలోకెళ్లింది.(కవిగారి భార్య). అచ్చంగా కాదుగానీ ఇలాంటి కవి/రచయిత కథతో ఈమధ్యే టాలీవుడ్లో ఒక సినిమా కూడా వచ్చింది. రాయలేని తనాన్ని “కొత్తదనం అని, పాఠకులు తనంత ఎదగలేదని” కవర్ చేసుకునే రచయితలు ఉంటారుంటారు.. అప్పుడూ ఇప్పుడూనూ…

నన్ను అమితంగా ఆకట్టుకున్న కథ “విముక్తి” ఎన్నెన్ని తెలంగాణా పల్లెల జీవితాల చిత్రణ ఇది. ఆనాటి కాలపు పెను మార్పును డాక్యుమెంటేషన్ చేస్తూనే.. ఒక గుండెను పట్టుకునే ముగింపుతో మనసులోకి కథ ఇంకిపోతుంది. “సంఘానికీ జై” అన్న సుబ్బమ్మతో పాటుగా మనసులో జై… జై… అని అరవాలనిపిస్తుంది.

“అమ్మా ఆ పరుపుల పెట్టెలో మనం ఎందుకు ఎక్కలేదు?” అంటూ మొదలైన పసివాడి ప్రశ్నలు నిజంగా మనం ఎంతమందిమి వేసుకున్నాం? (కథకుడు) పిల్లలు.. అల్లరి చేసే పిల్లలు.. అమాయకప్పిల్లలు.. ఎన్ని ప్రశ్నలేస్తారు.. ఎంత ఆలోచనని తెప్పిస్తారు.. ఇవే ప్రశ్నలు మనం ఎందుకని ఎవర్నీ అడగటం లేదు? ప్రశ్నించటం మర్చిపోయామా?? ఇన్ని ప్రశ్నలని లేవనెత్తిన కథ “కథకుడు” ఆ పెట్టెలో ఎక్కితే డబ్బులు ఎక్కువ ఖర్చు కదా మరి వాళ్లేందుకు ఆపెట్టెలో ఎక్కారు? మనమెందుకు ఇంకా ఈ పెట్టెలో ఎక్కుతున్నాం అణా ప్రశ్న ఎంతటి తిరుగుబాటుని నిద్రలేపగలదూ… Leopoled Staff “మూడూళ్ళు” కవితలో అన్నట్టు.. “ప్రశ్నలడగని వాడు ఎంత దరిద్రుడైఉండాలి” అనే వాక్యం గుర్తొచ్చింది.

మొత్తంగా అట్లూరి పిచ్చేశ్వరరావు రాసిన ఈ కథలు ఇప్పుడు మళ్లీ చదవటం ఒక అవసరం. పాఠకుడికే కాదు… కొత్తగా రాస్తున్న రచయితలకు చాలా చాలా అవసరం. ఆనాటి తనాన్నే అందుకోలేక పోయిన వాళ్ళు ఇప్పుడు ఇంకా ఏమి కొత్తదనాన్ని వెతుకుతారు?

అద్భుతమైన అనుభవాన్నిచ్చిన కథలు… ఈ రకంగా నాకు అందటం చాలా హ్యాపీ.
ఎంతో నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను.
With ❤️ సూఫీ
27 Dec 2021 11.06pm

అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు
పుస్తకం ధర: 250.00 రూపాయలు
పుటలు :      280
బరువు :       220 గ్రాములు
ఈ పుస్తకానికి Sole Distributors:
Navodaya Book House, Opp: Metro Pillar 14, Kachiguda Cross Roads, Hyderabad 500 027,
Mobile: +91 – 90004 13413
వీరిదే ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌లో ఇక్కడ కూడా తీసుకోవచ్చు.

మీకు అమెజాన్‌లో కావాలనుకుంటే Analpa Books ద్వారా ఇక్కడ తీసుకోవచ్చు:

పుస్తకం లోగిలిలోకూడా లభ్యం:
Logili Book House, Guntur – 522007
Mobile:  +91 95501 46514
వారి ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌లో ఇక్కడ తీసుకోవచ్చు:
https://bit.ly/APRonLogili

విజయవాడ పుస్తకాల పండుగ
(Vijayawasda Book Festival) లో
జనవరి 1 వ తారీఖు నుంచి 11 వరకు
ఈ క్రింది స్టాల్స్ లో
అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు
అందుబాటులో వుంటాయి.

నవచేతన బుక్ హౌస్:       8 -10
పల్లవి పబ్లికేేషన్స్:          25 – 27
సాహితీ మిత్రులు:          29 – 31
శ్రీ హర్ష పబ్లికేషన్స్:         70  – 71
నవసాహితీ బుక్ హౌస్:  117 – 118
విశాలాంధ్ర బుక్ హౌస్:   160-166

Share on facebook
Share on twitter
Share on whatsapp
Share on telegram

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.