మొన్నామధ్య ఒక పెద్ద రసపోషకుడిగారిని కలిసాను. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉంటే..దురదుంది కదా..సాహిత్య దురద..పుట్టింది. గోక్కుంటూ అలనాటి భారతి గురించి, ఆ నాటి ఆంధ్రభూమి గురించి, అప్పటి అభ్యుదయ గురించి, ఆ రోజుల్లో కాగడ గురించి. కృష్ణాపత్రిక గురించి, సంవేదన, కళ ఈ నాటి సృజన గురించి ఆయన ఒక పది మాటలు మాట్లాడితే నేను ఒక పదం వొదుల్తు..పుసిక్కిన మిసిమి అని అన్నాను.
ఆయన చాల లాఘవంగా దాన్ని ఒడిసి పట్టుకుని, దాన్నీ తిప్పి మళ్ళీ నా మీదకు వదిలాడు, “మిసిమి..సెక్‌సు పత్రికా అది..దాని పేరు వినలేదే ఎప్పుడూ?!” అంటూ. మీరందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది..అక్కడ నా పక్కన ఉన్నట్టైయితే..మీ అందరి ఆరోగ్య భీమా పధకాలన్నింటిని పరీక్షకి పంపాల్సి వచ్చేది. అబ్బే లేదండి..నేను బతికే ఉన్నాను! టపా కట్టేసి ఉంటే ఇక్కడ ఈ టపా ఉండేది కాదు కదా!