…లు

The image of a Great Dane dog with Mr Lu in the story
..లు గారు తన మేలుజాతి శునకము ‘ప్రిన్స్’ తో తన భవనం ముందు…

ఈ కథని దాదాపు పదేళ్ల క్రితం రాసాను.
ఇటీవలి కాలంలో ఒకానొక పత్రికా సంపాదకులు, మిత్రులు కథలుంటే ఒకటి పంపండి మా పత్రికలో ప్రచురిస్తాం అని అడిగితే. ఈ కథని పంపాను. ఇదిగో అదిగో అంటూ కొన్ని నెలలు జరిగిన తరువాత తన మిత్రులెవరో నచ్చలేదన్నారని తెలియజేసాడాయన.

అది ఇలా ఈ డిసెంబరు 17, 2023 ఆదివారం నాడు సంచిక లో ప్రచురణకి నోచుకుంది.
కథని ఈ లంకె‌ ని క్లిక్ చేసి చదువుకోవచ్చు.

అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు – ఈమాటలో

Atluri Pitcheswara Rao short story anthology paperback placed on the bed

– ఈమాట వెబ్‌జైన్‌ లో సుజాత వేల్పూరి పరిచయం

వినూత్న తెలుగు సాహిత్య వాతావరణంలో ఒక కొత్త సంస్కృతి వచ్చి చేరింది. అది మంచిదిలాగే కనపడ్తుంది గానీ దాని వల్ల కల్గే హాని చాప కింద నీరులా విస్తరిస్తూ పోతుంది.

కొత్తగా రాస్తున్న వాళ్ళలో చాలా మంది “కాఫ్కాని చదువు, మాయా ఫలానా రచన చదివావా? మంటో శైలి ఎంత గొప్పదంటే, ఫలానా ఫ్రెంచ్ రచయిత ఏమన్నాడంటే, ఫలానా ఇంగ్లీష్ నవల్లో ఒక చోట రచయిత ఇలా అంటాడు” అని ఉటంకిస్తుంటారు. ఇందులో తప్పేమీ లేదు. అయితే వీళ్ళలో తొంబైశాతం మందికి మన సొంతింటి సుగంధాలు బహుదూరం. వాళ్ళేమన్నారో, రాశారో తెలీదు. పక్కా లోకల్ చాసోనో, కుటుంబరావో, రావిశాస్త్రో తెలుస్తారని, వాళ్ళ పుస్తకాలు వీళ్ళు చదివారని మనం అనుకోకూడదు. చాలామంది కొత్త రచయితలకి వీళ్ల పుస్తకాలు గ్రీకూ లాటినూ.

ఆనాటి పాత సాహిత్యాన్ని ఇష్టపడి చదివే పాఠకులకు అపురూపంగా దొరికిన కొత్త పుస్తకం అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు (కొత్త ముద్రణ).

APR kathalu cover page

అనేక సంవత్సరాల నుంచి పెండింగ్‌లో పెట్టబడిన ఈ పుస్తకాన్ని పిచ్చేశ్వరరావుగారి కుమారుడు, రచయిత అనిల్ అట్లూరి ఎట్టకేలకు ఇటీవల తీసుకు వచ్చారు. ఈ పుస్తకంలో పిచ్చేశ్వరరావుగారివి 26 కథలు, నాలుగు పుస్తక సమీక్షలు, అనిల్ రాసుకున్న కొన్ని మాటలూ, జ్ఞాపకాలూ ఉన్నాయి. పుస్తకం పేపర్ క్వాలిటీ అంత గొప్పగా లేకపోవడం కొంత నిరాశపరిచే విషయం. తర్వాతి ముద్రణలో ఈ విషయమై ప్రకాశకులు జాగ్రత్త పడాల్సి ఉంది. అలానే పిచ్చేశ్వరరావు కథలకే ఈ పుస్తకాన్ని పరిమితం చేసుంటే బాగుండేదేమో. కాని ఇవి పట్టించుకోవలసిన అభ్యంతరాలు కావు. ఈ పుస్తకంలో కథలు అలాంటివి.అట్లూరి పిచ్చేశ్వరరావుగారి పేరు తెలిసినవారికి ఆయన కథకుడిగా కంటే అనువాదకుడిగా ఎక్కువగా తెలుసు. ముఖ్యంగా కిషన్ చందర్ అనువాదకుడిగా. ఆయన సినిమా రచయితగా కూడా పని చేశారు. ముఖ్యంగా ‘వెండితెర నవల’ కాన్సెప్ట్ పిచ్చేశ్వరరావుగారితోనే మొదలైందని కోతి కొమ్మచ్చిలో ముళ్ళపూడి కూడా రాస్తారు. తొలి వెండితెర నవల గౌతమ బుద్ధ. అది రాసింది పిచ్చేశ్వరరావుగారు.

పూర్తి సమీక్ష చదవడానికి ఈ  లంకె మీద క్లిక్ చెయ్యండి.

ఆయన యుద్ధకాలాన్ని చూశారు. స్వయంగా నేవీలో పనిచేశారు.

ఈ పుస్తకం చదివాక, రచయితగా ఆయనేమిటో తెలిశాక, ఆయన ఇంకా ఏమి రాశారనే ఆలోచన పాఠకుడి మెదడులో తప్పక మొలకెత్తుతుంది. అటువంటి ప్రభావశీలమైన కథలు ఇందులో ఉన్నాయి.

రచయిత విప్లవ వాది కావడంతో దాదాపు అన్ని కథల్లోనూ ఈ ధోరణి కనిపిస్తుంది. దాదాపు ప్రతి కథా ఒక విముక్తిని సూచిస్తూ ముగుస్తుంది. సుబ్బమ్మ కథ ‘సంఘానికీ జై’ అని ముగిస్తే, నెత్తురు కథ ఆసాంతం ఎర్రెర్రగా సెగలు కక్కుతుంది.

చిరంజీవి కథ ఒక విప్లవ తరంగమే. ఆయన కథలన్నిటిలోకీ ది బెస్ట్‌గా ఈ కథను విమర్శకులు ఎన్నిక చేస్తారు.

‘ఇదిప్పుడు మన దేశమే’, ‘బ్రతకటం తెలియని మనిషి’, ‘జీవచ్ఛవాలు’ ఇత్యాది కథలన్నీ సామాజిక అంశాలు, నిరసన, తిరుగుబాటు తత్వాలతోనే నిండి ఉంటాయి. అమెరికా నుంచి వచ్చిన నావికుడి కథ జీవచ్చవాలు. యుద్ధం ప్రజల జీవితంలోనే కాదు, యుద్ధంలో పనిచేయాల్సి వచ్చినవారి జీవితంలోనూ ఎంతటి అశాంతిని మనిషి జీవితంలో నింపుతుందో. అందుకే ఆ కథలో చివర్లో “మళ్ళీ టోవెడో (నౌక)ఎప్పుడొస్తుందిరా?” అని రచయిత స్నేహితుడు అడుగుతాడు. “ఎందుకురా?” అని కథకుడు అడిగితే అతడంటాడు. “ఆ మృతజీవిని చూడాలిరా.”

ప్రతి కథలోనూ మానవతాకోణం అంతర్భాగమై అల్లుకుపోయి ఉంటుంది. మనుషులన్నా, స్వేచ్చ అన్నా, స్వాభిమానమన్నా, పోరాటమన్నా, ముఖ్యంగా చిక్కని ఎరుపన్నా రచయితకు మహా ప్రేమ. మనుషుల కోసం, మానవకల్యాణం కోసం ప్రతి కథలో రచయిత తపిస్తాడు. జీవితంలో దుఃఖానికి కారణాలు అన్వేషిస్తాడు.

కథాకాలాన్ని అనుసరించి ఈ కథల్లో యుద్ధ వాతావరణమూ, యుద్ధం మీద చర్చా ఉన్నాయి. రచయితకు ఉన్న అపార విజ్ఞానం ఈ కథల్లో చోటు చేసుకున్న సంఘటనల మీద, అంతర్జాతీయ పరిణామాల మీద ఆయన వ్యాఖ్యానం తేటతెల్లం చేస్తుంది. స్వయంగా నేవీలో కొంతకాలం పనిచేసిన రచయిత రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటులో పాల్గొని ఉండటం ఆయన నేవీ కథలకు నేపథ్యం అని స్పష్టమవుతుంది.

చిరంజీవి కథ ఈ నేపథ్యంలోంచి పుట్టిందే. ప్రతి పాఠకుడినీ కదిలించే ఈ కథ తెలుగు కథాసాహిత్యంలో నిజంగా ఎప్పటికీ నిల్చిపోయేదే.

చిరంజీవి ఒక ప్రత్యేక వ్యక్తి ప్రత్యేక వ్యక్తిత్వపు కథ. ఎవరికీ లొంగని, ఎన్నడూ జంకని చిరంజీవి మిలటరీ హాస్పటల్లో పడి చివరి క్షణాల్లో మూలుగుతున్నపుడు కథకుడు అతని కథ మనకి చెపుతూ పోతాడు. అధికారులను ఎక్కడికక్కడ ఎదిరిస్తూ, ప్రశ్నిస్తూ, తిరగబడుతూ, తోటి సైనికుల్ని తన మాటలతో, ఉపన్యాసాలతో ఉర్రూతలూగించి, రక్తాన్ని పరుగులు పెట్టించి విప్లవ జ్వాలలు రేపిన చిరంజీవి చచ్చిపోతాడేమో అని గుండె దడ పుట్టిస్తాడు రచయిత. చివరికి డాక్టరు లోపల నుంచి వచ్చి కళ్ళు తుడుచుకుని “చిరంజీవి చనిపోలేదు, అట్లా చూస్తావేం? వీళ్ళంతా చిరంజీవులే, ఈ జనం చిరంజీవులే” అని పాఠకులకు చిరంజీవితో ఎనలేని బంధాన్ని క్షణంలో కట్టేస్తాడు.

మసకబారిన చూపు మధ్య నుంచి ఆ తర్వాతి వాక్యం “ఎస్. బీ. ఏ. చేతుల్లోంచి తుపాకీ లాక్కున్నా నేను” అని కనపడి అని చిరంజీవిని నిజంగా చిరంజీవిని చేస్తుంది.

‘కథకుడికిగా పిచ్చేశ్వరరావు’ అని కొడవటిగంటి కుటుంబరావు 1967లో రాసిన వ్యాసంలో “ఒక మనిషి చావు అవాస్తవం అనిపించడానికి కారణం ఏమిటని నేను ఆలోచించాను. ఆ మనిషి మీది ప్రేమాభిమానాలు మాత్రమే అందుకు కారణం కావు. మనిషితో పాటు పోకుండా సజీవంగా మిగిలిపోయేదేదో ఉంటుంది. అదే మనిషి చావుని నమ్మశక్యం కాకుండా చేస్తుంది” అంటారు. డాక్టరు వచ్చి “చిరంజీవి చనిపోలేదు, ఈ జనమంతా చిరంజీవులే” అన్నపుడు, చప్పున ఈ వాక్యం గుర్తొస్తుంది.

ఈ కథలు చదివి, పుస్తకం అలా గూట్లో పడేసి పక్కకి పోలేం. అలా అని పుస్తకం ఎదురుగా ఉంటే అది వేసే ప్రశ్నల్ని మనం తట్టుకోలేం. వెంటాడి ప్రశ్నించి వేధించే పుస్తకం ఇది.

మనం బజారుకి పోతే, ఏ ఆస్పత్రి సందు చివరో చిరంజీవి కనపడి పలకరిస్తాడేమో, ఏ సుబ్బమ్మో కనపడి నినదిస్తుందో, వసుంధర గురించి తనకేం తెలుసో ఆ రోడ్డు చెప్తుందేమో, శాస్త్రి పలకరిస్తాడా, విమలాదేవి ఎదురై విషాదంగా నవ్వుతుందా అన్నంతగా జీవం నింపుకున్న ఆ పాత్రలన్నీ మన వెంట పడతాయి.

పుస్తకం మొదలు కావడమే నెత్తురు కథతో మొదలవుతుంది. అది నెత్తురా, మనిషా, ఆత్మా, రక్తమాంసాలు నిండినా మనిషా?

‘రంగేసిన గుడ్డ కాదది, నెత్తురు పులుముకున్న గుడ్డ, నీలా నాలా బతికిన మనిషి నెత్తురు’ అని స్పష్టత ఇస్తాడు రచయిత. ఆ నెత్తురులో తెల్ల రక్తకణాలూ ఈదినై, ఎర్ర రక్తకణాలూ ఈదినై అంటాడు.

ఈ కథల నిండా గట్టి గుండె, స్థిరమైన ఆలోచనలు, మొండి తిరుగుబాటు స్వభావమూ ఉన్న మనుషులు పలకరిస్తుంటారు. నేవీలో ఆవిరి మెషిన్ లీకేజ్ నుంచి అందరినీ కాపాడిన చిరుద్యోగికి పెన్షన్ ఇవ్వ నిరాకరించి “గేటు దగ్గర కూచునే ఉజ్జోగం చేస్తావా పోనీ” అన్న ఆఫీసరు మొహాన్న పేణ్ణీళ్ళు కొడతాడతను.

తన పెన్షన్ గవర్నమెంట్‌కి వృథా ఖర్చు అన్న ఆ అధికారికి, ఆనాడు జరిగిన సంఘటన మొత్తం చెప్పి నేవీ ఆఫీసర్ల జీతాలెంత వృథానో వివరించి, “గేటు కీపర్ ఉజ్జోగం చెయ్యను” అంటాడు. ఇలాంటి వ్యక్తులే కాదు, జీవం నిండిన వాక్యాలు, చదవగానే ఎప్పటికీ గుర్తుండిపోతాయేమో అన్నట్టుండే మెరుపు వాక్యాలు, కథకు నిండుతనాన్ని తెచ్చిపెట్టే వాక్యాలు ఈ కథల నిండా పరుచుకుని ఉంటాయి.

– నేటి నుంచీ నేను స్వతంత్రుణ్ణట. ఔను, కాదనేందుకు నాకు స్వాతంత్ర్యం లేదు (ఆగస్టు 15 న).

– మారే పరిస్థితుల్లో చావు బతుకులు చోట్లు మార్చుకుంటాయి. వీళ్ళందరూ చావంటే ఉన్న భయంతో బతుకుతున్నారు గానీ, బతుకంటే ఉన్న మమతతో కాదు ( బ్రతకటం తెలియని వాడు).

– చేతిలో ఉన్న చావుని చూసి భయపడటానికి ఒప్పుకోక పోతే గతంలో బతకండి (వెర్రి కాదు వేదాంతం).

అభ్యుదయపు మేలిముసుగుల మీద ఛెళ్ళున తగిలే సన్నని చర్నాకోల దెబ్బలున్నాయి ఈ కథల్లో.

‘మనవాళ్ళమ్మాయే’ కదాని పనిలో పెట్టుకున్న సుబ్బమ్మని ‘సుబ్బి’ అని పిలిచే రమణయ్య లాటి మనుషుల మీద చెణుకు: “మనవాళ్ళ పిల్లే కదా, మరి సుబ్బీ అని పిలుస్తావేమిరా?” అని అడగబోయిన కథకుడు “ఒకవేళ మన వాళ్ల పిల్ల కాకపోతే వాడు సుబ్బీ అని పిలిస్తే నేనేమి అభ్యంతరం చెప్పే వాడినో” అంటాడు.

పాపారావు తండ్రి, మాల వాళ్ల సరసన కూచుని భోజనాలు చేసిన మనిషి. కొడుకు మాత్రం వెట్టి వెంకడి కొడుకుతో గోళీలాడ్డం అతనికి సుతరామూ నచ్చదు. వెంకడొచ్చి వీడిని “చిన్న దొరగారూ” అంటుంటే, వెంకడి కొడుకొచ్చి “పాపారావూ, రావోయ్ గోళీలాడుకుందాం” అని పిలుస్తుంటే ఆయనకు మండుతుంది. “మాలవాళ్ల చేత నీళ్ళెందుకు పోయించుకుంటున్నావంటే, వాళ్లంటే ప్రేమ ఉండీ కాదు,అంటంటే పెడమొగం ఉండీ కాదు, పడమర చెరువు మీ ఇంటికి అరమైలు దూరంలో ఉంది. ఇంట్లోకి కావల్సిన పది కావిళ్ళూ మోస్తే పెద్దలు గుర్తొస్తారని చేస్తున్నావు ఈ సంస్కరణంతా. మీ పాలేరుకు పది సోలలు వడ్లెక్కువ కొల్చావా? పది రోజులు సెలవులిచ్చావా?” అని పక్కింటి వాడు అడుగుతాడేమో అని పాపారావు భయపడుతున్న మాటలు తాను అనేస్తాడు రచయిత.

కొన్ని కథలు ఆలోచనల ప్రవాహంతో చైతన్యస్రవంతి శైలిలో సాగుతాయి. వెర్రి కాదు వేదాంతం, ఒక అనుభవం, కోరిన వరం ఈ కోవలోవే. అబ్‍స్ట్రాక్ట్ చిత్రణ పిచ్చేశ్వరరావుగారికి అతి సులభమైన ప్రక్రియగా తోస్తుంది కొన్ని కథలు చదువుతుంటే. ఓల్గా అన్నట్టు ఆయన చిన్న వయసులోనే కాలం చేయకుండా ఉండి ఉంటే, తన మార్మికతతో తెలుగు సాహిత్యపు మార్కెజ్‍గా మిగిలేవారే.

వసుంధర కథ తెలుగు కథా సాహిత్యంలో ఎన్నడూ చూడని, ఎవరూ చేయని ఒక వినూత్న ప్రయోగం. వసుంధర గురించి ఆమె చదువుకున్న కాలేజీ, ఆమె నడిచిన రోడ్డూ, గడ్డీ అన్నీ వివరంగా చెపుతుంటాయి. మధ్యలో కాలం, వ్యక్తులు వచ్చి మార్పులు అనివార్యమంటుంటాయి. కథ వసుంధర చుట్టూనే తిరిగినా, ఆమె ఎక్కడా మాట్లాడదు. ప్రజాకంటకుడైన భర్త నుంచి సమాజాన్ని కాపాడటానికి వసుంధర చేసిన పనిని కూడా వసుంధర చెప్పదు. ఇటువంటి కథ బహుశా ఇంతకు ముందెన్నడూ చదివి ఉండం. ఈ సంకలనంలో ఇదొక ఆణిముత్యం లాంటి కథ. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర ఈ వసుంధర. ఒక బలమైన వ్యక్తి ఆమె, రాజీ పడిని నిక్కచ్చి మనిషి.

వేదన, హింస అనుభవిస్తూ కూడా, రేపటిలో వెలుగు చూసి సర్దుకుపోయే ఇద్దరు స్త్రీల కథలు ఇందులో ఉన్నాయి. గడిచిన దినాలు కథని ఉత్తమ పురుషలో నడుపుతూ రచయిత, తల్లి పాత్రని వర్ణించిన విధానం చదువుతుంటే గుండె చెమరుస్తుంది.

పని మనిషి మరో కథ. ఇందులో కథ మొత్తం కథలోని భార్యా భర్తల మధ్య నడుస్తుంది గానీ రచయిత వారింట్లో పని చేసే పని మనిషిని శీర్షికగా ఎంచారు. తన వెగటు అలవాట్లు మార్చుకోలేక, భార్య అందాన్ని, పరిశుభ్రతను సహించలేక, తాను స్వయంగా ఆత్మన్యూనత పాలవుతూ, ఆమెపై గెలవటానికి ఆమె పుట్టింటిని ఎద్దేవా చేసే విమలా దేవి భర్త, చివరికి ఆత్మన్యూనత ఉక్రోషంగా మారి భార్యను ఇనపచువ్వతో చితకబాదుతాడు. పర్యవసానం పైడితల్లి నెత్తిన పడుతుంది. ఇటువంటి భర్తలు కూడా చిరంజీవులే, కాలాతీత వ్యక్తులే ఒక విధంగా. ప్రతి సమాజంలోనూ, ప్రతి వీధిలోనూ ఉంటారు.

తీరని కోరిక కథలో ‘కోరికలలో తెగలూ తరగతులూ తప్పించుకోలేని వాళ్లం, తరగతులూ తెగలూ లేని సమాజాన్ని సృష్టించుకోగలమా?’ అనే వాక్యం రేకెత్తించే ఆలోచనలు అసంఖ్యాకం. శాస్త్రి, కథకుడు, వింత మరణం, గడవని నిన్న – దేనికదే సరి కొత్త ఇతివృత్తం, అబ్బురపరిచే శైలి, దొరికినట్టే దొరికి జారిపోయే వాక్యం.

గొప్ప రచయితలు నిశ్శబ్దంగా రచనలు చేస్తారు. తమంతట తాము మన దగ్గరికి రారు. మనమే వెదికి పట్టుకోవాలి. తెలుగు రాయడం తెలియడమే అర్హతగా కథారచన సాగుతున్న ఈ రోజుల్లో, అట్లూరి పిచ్చేశ్వరరావుగారి రచనలు చదవడం ఒక అవసరం. ఒక పాఠం.

ఇన్ని రోజుల తర్వాత ఈ పుస్తకం తెలుగు పాఠకుడి చేతిలోకి రావడం తెలుగు సాహిత్య వాతావరణంలో ఒక మేలి మలుపు. కొత్తగా రాస్తున్న వాళ్ళూ, ఎప్పటి నుంచో రాస్తున్న వాళ్ళే కాక, పాత కొత్త పాఠకులు, సాహితీ ప్రేమికులూ తప్పక చదవవలసినవి అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు.

ఇవి పాఠకులని నిరాశ పరచవు సరికదా, పాత సాహిత్యం ఎంత గొప్పదో తెలిసి మరి కొన్ని పాత పుస్తకాలూ తిరగేసేలా చేస్తుంది.

అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు
పుటలు: 280
ప్రచురణ: CLS Publishers, Hyderabad.
పుస్తకం ధర: 250రూ.

ప్రతుల కోసం ఈ లంకెని క్లిక్ చెయ్యండి:
లభ్యం: నవోదయా బుక్‍హౌస్ (హైదరాబాద్), పల్లవి పబ్లికేషన్స్ (విజయవాడ), అనల్ప ప్రచురణలు, అమెజాన్లోగిలి (గుంటూరు), బుక్ సెంటర్, వాగ్దేవి (విశాఖపట్నం).

  •  

క్లుప్తంగా ఇడ్లి, వడ, సాంబార్ కధ ఇది!

కొంత మంది పాఠకులకి నేను వ్రాసిన ఇడ్లి, వడ, సాంబారు కధ పూర్తిగా అర్ధం కాలేదన్నారు.  ఈ టపా వారికోసం.

ఈ క్రింద ఇఛ్హినవి సారంగ లో వఛ్హిన కధ ఇడ్లి, వడ,సాంబార్ లోని వాక్యాలు. ఇవన్ని అంతర్గతంగా కధాంశానికి సంబంధించిన సూచినలిస్తాయి.  వీటన్నింటిని ఒక క్రమంలో చదువుకుంటే కధ అర్ధం కావాలి. ఈ వాక్యాలు చదివిన తరువాత, కధని మళ్ళీ ఒకసారి చదువుకోండి.  దానికి లంకె ఈ కింది వాక్యాల తరువాత చివర ఇఛ్హాను. 

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

> ఇది అతని కధ.
> అతను ఒక స్త్రీ మూర్తిని తన చేతులమీదుగా ఎత్తుకుని తీసుకుని
రావడం…

> వాలిపోయిన ఆవిడ తలక్రింద చేతులు వేసి…
> స్త్రీని చాలా నెమ్మదిగా అతి జాగ్రత్తగా ఆ రేర్ సీట్ మీద పడుకోబెట్టాడు…
> …భుజాలక్రింద నుంచి చేతులేసి ఆవిడ తలని ఎంతో ప్రేమతో తన
ఒడిలోకి లాక్కుని…

> …తన రెండు చేతులతో ఎంతో వాత్సల్యంతో ఆవిడ కాళ్ళని తన ఒడిలోకి
తీసుకుంది…

> ఆంగర్, డినైయల్, బార్గైనింగ్, డిప్రెషన్ అండ్ అక్సె‌ప్‌టన్స్.
(Anger, denial, bargaining, depression and acceptance) – are the five stages of grief and not necessarily in that order. You can read more about it here.
(If you haven’t yet, do watch that movie ‘All that Jazz‘.  ఈ సినిమా ఆస్కార్ బహుమతులు పొందినది.))
…(Yea…blood an’ shit!)…
బమ్స్ మధ్య నుంచి పరుపు మీదకి బెడ్ షీట్ మీదుగా. దేర్ గోస్ ది
బ్లడి షీట్!…

> …ఊపిరి తిత్తుల నిండా అవే. ఒన్…ఫోర్…ఎయిట్…మిలియన్స్ టు ది
ప‌వర్ ఆఫ్ బిలియన్స్…దే ఆర్ చోకింగ్ మాన్! లెట్ హర్ గో ఈజీలీ!
(Let  her go easily!)…

> ఇట్ టూ ఈజ్ డెడ్ మాన్! (It too is dead man!)
> …(With a carcass…oh no!)…

(ఇది కధలో లేదు, కాని తెలియని పాఠకులకోసం ఇక్కడ ఇఛ్హాను. The following are the stages of “Rigor Mortis“, తెలుగులో ఇక్కడుంది. )

బిలియన్స్ ఆఫ్ సెల్స్… డూ దే హావ్టు ప్రై దెమ్ ఓపెన్?
(Billions of cells…do they have to pry them open?)

>  ఆర్ బ్రేక్? (Or break?)

>  బ్రేక్ వాట్? (Break what?)

>  ది జాస్, డూడ్…హర్ జాస్! (The jaws, dude…her jaws!)
గెస్ నాట్! (Guess not!)
షిట్… హౌ కెన్ యు ఎవెన్ధింక్ లైక్ దట్! (Shit…how can you
even think like that?)

ఇట్స్ ఎ కడెవ…వాట్! (It’s a cadav’…what?)
…నెమ్మదిగా సెటిన్ అవుతోంది…

>  యు ధింక్ హర్ జా వుడ్‌హెవ్ బిగన్ టూ ఫ్రీజ్?
(You think her jaw would have begun to freeze?)

ఐ లిడ్స్?
(Eye lids?)

>  …వాళ్ళందరూ ఇంకా తింటునే ఉన్నారు.
ఇడ్లి, వడ, సాంబార్ కూడా…

కధ అర్ధం అయివుండాలి.

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

అంతర్జాల పత్రిక, సారంగ లో కధ ఇక్కడ చదువుకోవఛ్హు.
ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి.  కధకి తగ్గ abstract బొమ్మ గీసిన అన్వర్ కి థాంక్స్.

ఇక్కడ ఈ టపాకి వాడిన Photo by Axel Antas-Bergkvist on Unsplash.

That woman was part of their life and she lay dead in that car and they are having breakfast. Those monologues in English are his ( ఇంగ్లిష్‌ లోని స్వగతాలు, అతనివి) .

….
While they traveled with a member of their family who is dead (body), they stopped at a restaurant and had their breakfast.

చనిపోయిన తమ కుటుంబ సభ్యురాలి దేహంతో, ప్రయాణం సాగిస్తూ, దారిలో కనబడ్డ దాబా లో కూర్చుని ఉదయపు అల్పాహారాన్ని కోరుకుని తిన్నవి, ఈ కధలోని కొన్ని పాత్రలు.  అది జీవితం.  బహుశ మనందరి జీవితాలు అంతేనేమో!

ఇక తెలుగు కధలో ఇంగ్లిష్ వాక్యాలు, వాటిని టెంగ్లిష్ (ఇంగ్లిష్ పదాలని తెలుగు లో వ్రాయడం) మళ్ళీ అవే వాక్యాలని ఇంగ్లిష్‍లో (బ్రాకెట్లలో) ఇవ్వడానికి కారణం, తెలుగులో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్నవాళ్ళకి, ఇంగ్లిష్‍ తెలిసిన వాళ్ళకి, చదువుకోవడానికి సులువుగా ఉంటుందని.

ఈ టపా సమయానికి, నా వరకూ వఛ్హిన పాఠకుల వ్యాఖ్యలన్నింటినికి వివరణ ఇది.

నాలుగు అక్షరాలు – మూడు కథలు

ఆ మధ్య ఒక రచయితని అడిగాను, “మీరు ఎందుకు వ్రాస్తున్నారు?” అని.
ఠకీమని చెప్పాడాయన “డబ్బుల కోసం” అని.
మరొకరిని అడిగాను.  “అయ్ ఆమ్ ఎక్స్‌ప్రెసివ్” అని జవాబు.
ఆంధ్రులు కాదు తెలుగు వారందరూ అభిమానించే (సినవారు కూడా ఉన్నారు) జవాబు, “రాయక పోతే చచ్చిపోతా”.
సముద్రంలోనుంచి బయటపడి, చెట్టుమీదకి ఎక్కి కిందకి దిగాడు. అన్ని వందల వేల సంవత్సరాలలో, వాడికి శబ్దం చెయ్యడం వచ్చింది.  దానికి ఒక లయ ఏర్పచుకున్నాడు.  భాష అయ్యింది అది.  కథలు చెప్పుకోవడం మొదలయ్యింది.  అనుకుందాం! సరే మౌఖికంగా కథలు చెప్పుకుంటున్ననాటి నుంచి బూతులు, అసభ్యపదజాలం వాడుక దేశ కాల పరిస్థితులని బట్టి మారుతునే ఉన్నవి.  రోజు ఇంటా బయటా వింటున్నవేకదా?
ఫ్రీడ్‌మన్ అన్నట్టు,  డాల్ఫిన్స్ కి , వేల్స్ కీ కూడా భాష ఉంది.  మాట్లాడుకుంటాయి.  ఏనుగులు, కాకులు, కుక్కలు, పిల్లులు, పాములు అన్నింటికి ఒక భాష వుంది.  అన్ని ప్రేమించుకుంటాయి, కాట్లాడు కుంటాయి, తిట్టుకుంటాయి, ఆడుకుంటాయి అన్ని పనులు చేసుకుంటాయి.
“దిద్దుబాటు” తెలుగులో తొలి కథ అని అన్నారు. అబ్బే లేదు..ఇంకా చాలా కథలున్నవి  (దాదాపు ఒక తొంభై దాకా అని ఒక అంచనా!) దానికి ముందే అని తెల్ఛేసారు. రేపో, మాపో అవి మనచేతుల్లోకి రానున్నవి. (బహుశ ఈ  2014 లోనే రావచ్చు).దిద్దుబాటు ని షార్ట్‌ఫిల్మ్‌గా కూడా తీసాడు అట్టాడ అప్పల్నాయుడు గారి అబ్బాయి సృజన్.
సరే, దిద్దుబాటుతోనే మొదలు పెడదాం.
మరి ఆ రోజే సాని కొంపలున్నవిగా?
మగాడు తిరుగుతునే ఉన్నాడుగా?  ఆవిడ ఇంట్లోనే ఉందిగా?
“కన్యాశుల్కం” నుంచి, ఈ రోజు “వాడి పాకేజి నాకంటే తక్కువలేవే..వాడ్ని నేనెలాచేసుకుంటానే మమ్మీ?” అని ఈ రోజు చదువుకుని,ఉద్యోగంచేసుకున్న యువతి గారాలు పోతోంది.దిద్దుబాటు వెలువడిన సాంఘిక నేపధ్యం ఏమిటి?  దేశ కాల పరిస్థితులేమిటి?  ఈ రోజు దేశ కాల  పరిస్థితులేమిటి?  ఎరుపు రోజుల్లో కథకి ఒక సాంఘిక బాధ్యత ఉంది అని అనుకుని వాళ్ళు కథలు, నవలలు, కవితలు, నాటికలు గట్రా వ్రాసుకున్నారు.  అవి “గర్జించు రష్యా” రోజులనుకుంటే ఇవి “గాండ్రించు అమెరికా ” రోజులనుకోవచ్చు.  మరి మార్పు రాలేదా?మూలింటామె లో లాగా పందొసంత లాంటి వ్యక్తులు లేరా? అంటే ఉన్నారు! ఇప్పుడు కాదు..అనగనగా అప్పుడెప్పుడోనే ఉన్నారు.  ఈ రోజు బయటికి వచ్చిందా?  కాదే?  పల్లెటూళ్ల లో పాలేర్లు, రైతులు, రైతు కూలీలు అయితే, పట్టణాలలో సేల్స్ గరల్స్, ఆఫీసులో క్లెర్క్‌లు వాళ్ళ రాసలీలల మీద ఎన్ని కథలు రాలేదు!
మరి “అరుంధతి” (ఉన్నంతలో – రాజారామ్మోహనరావు – 2012 స్వాతి మాస పత్రికలో) రామారావు పక్కలోకి వెళ్ళలేదేం? (కథ 2012 సంకలనం – సం:  వాసిరెడ్డి నవీన్, శివశంకర్ పాపినేని)
కాబట్టి ఆ మార్పుని ఒప్పుకున్నవాళ్ళు ఈ మార్పులని కూడా అంగీకరించాలి.
అలాగే చదవతగ్గ రచన ఏదైనా సరే చదువుతారు.  దానికి భాష అడ్డం రాకూడదు.  కాని వచ్చేసిందిగా?!
భాషే కాదు.  వస్తువులో కూడా మార్పులు వచ్చేసినవి.

* * *

ఈ మధ్య వచ్చిన కథ ఒకటి.
ఎబినేజర్ అనబడే ఒక మాదిగ నింబోడి కథ ని వ్రాసింది కాశీభట్ల వేణుగోపాల్.
ఈయన “F” నాలుగు అక్షరాల పదాన్ని ఆంగ్లంలోనే అయినా వాడారు.  (ఈ నాలుగు అక్షరాల ఎఫ్ పదం ఏమిటని అడగేవారి కోసం కాదు ఇది వ్రాస్తుంట!)  అందులో ఎబినేజర్ పాత్రకి కళ్ళలో ఒక దానికి శుక్లం వచ్చింది.  శుక్లాన్ని ఆంగ్లంలో కాటరాక్ట్ అంటారు. కాటరాక్ట్‌ని కొన్ని ప్రాంతలలో కొంత మంది “కన్ను పూసింది” అని అంటారు. శుక్లం ని “కన్ను లో పూత” అని కూడ చెప్పుకుంటారు.   అంటే ఈ కథలో ఎబినీజర్ అనే పాత్ర కన్నుపూచింది.  కన్నులో పూవు.    కన్నులో పూవు ఉంది కాబట్టి ఆ వ్యక్తికి  *పూకంటోడు అనే మారుపేరు (నిక్‌నేమ్) ఎగతాళిగా పిలుచుకునే పేరు పెట్టారు.ఆ మారుపేరు తన పాఠకులకు అమోదయోగ్యంకాదని ఒకరో ఇద్దరో సంపాదకులు అభిప్రాయపడ్డారు.  ఆ మారుపేరులో వారికి బూతు వినపడింది.  అంతే కాదు వారికి అసభ్యంగాను అభ్యంతరకరంగాను తోచింది.  రచయితకి ఒక సూచన చేసారు.  ఎబినేజర్ “మారుపేరు” (nickname) మార్చండి. ఆ కథని మేము ప్రచురిస్తామని.  రచయిత ఒప్పుకోలేదు.  రచయిత “మా ప్రాంతంలో అలా కన్నులో పూత అంటే శుక్లాలున్నవాడిని అదే పేరుతో పిలుస్తారు.  అది జనబాహుళ్యంలో ప్రచారంలో ఉంది కాబట్టి నేను మీ సూచనను అంగీకరించను.  మీరు కథని ప్రచురించకపోయినా ఫరవాలేదు” అంటూ వివరణ ఇచ్చారు.
ఆ పత్రిక సంపాదకులు అంగీకరించలేదు.  కాబట్టి ఆ కథని అచ్చులో చదువుకునే అదృష్టం కొంత మంది పాఠకులకి దక్కలేదు.  కొంతమంది జాలపాఠకులకి (online readers)  ఆ దురదృష్టం కలిగింది.  అవును,  ఎవరు దీన్ని గురించి మాట్లడుకున్నట్టు కనపడలేదే!?

 F word and Telugu stories
నాలుగు అక్షరాలు – మూడు కథలు

మరో కథ

వాకిలి *వెబ్‌జైన్ లో పునీత కథ.
ఇందులో లచ్చుమమ్మ మొగుడు కామేశ్వరరావు.  ఆ లచ్చుమమ్మ వయసు  దాదాపు 39 ఏళ్ళు.  కాలేజిలో చదువుకునే సరయు ఈ దంపతుల కూతురు. మురళి లచ్చుమమ్మ మేనల్లుడు. డాక్టరి చదువుకుంటున్నాడు.  వాడి దృష్టి తన మీదకు “మళ్ళించుకోవడానికి సరయు తిప్పలు. దానిని వదిలి నా పక్క చేరడానికి వాడి చిరాకులు.” అని ఆ తల్లి స్వగతం.  మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా?  మురళీ తన మేనత్త తో గడపటానికే వాళ్ళింటికి  వెళ్ళడం. ఎందుకని అంటే ఆమెకి “చేతనైంది చెప్తే చచ్చిపోతావ్రా మగడా. కావాలంటే మురళిని అడుగు. నెలకు మూడుసార్లు ఇంత దూరం ఎందుకొస్తాడో తెలుస్తుంది” అనుకుంటుంది. లచ్చుమమ్మ  మళ్ళీ మరో మాట కూడా అనుకుంటుంది “అయినా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?” అని.
ఎబనీజర్ పాత్ర వాడి పూకంటోడు అనే పేరు 2014 లోదే.
అరుంధతి పాత్ర 2012 లోదే
పునీత పాత్ర 2014 లోదే.
ఈ మూడు కథలని చదువుకున్నవారు ఉన్నారు.
మరో కథ
కీమో ఈ కథ వ్రాసింది వంశీధర్ రెడ్డి.  వైద్యుడు.
“కీమో” కథలో ఆరు చోట్ల *F* పదం వాడారు రచయిత. అది ఆంగ్ల పదం అయినా సంభాషణలు ఇంగ్లిష్‌లో కాబట్టి ట్రాన్స్‌లిటరేటేడ్ పదం అది. మరి ఇందాక భాష అనుకున్నామే?!  మరి ఇక్కడ ఇది కూడా వచ్చేసిందిగా?!

మరో సందర్భం;
ఈ సారి ఏకంగా ఒక వెబ్‌జైన్ సంపాదకుడే వాడేసుకున్నారు F పదాన్ని!
ఆయన మాటల్లోనే “I fucked up so many relationships. I want us to be a success“.
మరి దీనికేమంటారు ?

మరి మంచుపూవు లోని కావేరి కూతురు ప్రియ లో భార్యని చూసుకున్న తండ్రి ఆలోచనలని వెలికి తెచ్చిన రచయిత ని ఏంచెయ్యాలి?మొన్న వేదిక సమావేశం లో ఒక ఆంగ్ల కధని పరిచయం చేసాను.  Ba-Boon – థామస్ పియర్సన్ వ్రాసిన కథ అది. 2014 లొనే వచ్చిందా కథ.  అన్ని తనే అయిన సోదరుడు ఒకానొక దుర్ఘటనకి గురైన తరువాత అతని చెల్లెలు అతనికి తోడై ఉండాల్సిన పరిస్థితి.  తన బాయ్‌ఫ్రెండ్‌తో ఒకానొక సందర్భంలో ఒక compromising situation లో వీడియో షూట్ లో పాల్గొంటుంది.  ఆ టేప్ తెచ్చుకోవాలి.  కొన్ని వందల వీడియో టేపులన్నింటిని చూస్తేగానీ ఏది తనది అన్నది తెలియదు.  మరి సొంత అన్నతోనే ఆ వీడియో చూడాలా?  ఈ అంశాన్ని ప్రంపంచంలోని ప్రతి ఆంగ్ల పాఠకుడు అంగీకరిస్తాడా?
కొవ్వలి నవలలని  జాకెట్లలలో, లంగాలలో, ఓణీలలో దాచుకుని చదువుకునే వారు ఒకనాటి చదువుకున్న స్త్రీలు. అలాగే మధు పుస్తకాలని కూడా దాచుకుని చదువుకునేవారు ఈ జాలం అవతరించకముందు.ఇప్పుడు వస్తున్న ఈ కథలమీద,  ఆ కథల కోసం తీసుకున్న వస్తువు మీద, ఆ పాత్రలు వాడిన భాషమీద  కొంత మంది పాఠకుల అభిప్రాయాలని చదివిన తరువాత, ఇవన్నీ కూడా సెక్సు అంటే బూతు పదాలు వాడినందుకు వచ్చిన విమర్శలు అనే అనిపిస్తోంది.  కొంత మంది అనుకునే బూతు ఆలోచనలు, అవి  బయట పెట్టినందుకు వచ్చిన విమర్శలు గానే మిగిలిపోతాయి తప్ప మరొకటి కాదు.
మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా అంతర్జాలం లోనే వెబ్‌జైన్‌లలోనే వెలువడ్డవి. అంతర్జాలానికి ఎల్లలు లేవు.  అలాగే అక్కడ స్వేచ్చమీద కట్టడి లేదు.కా రా మాస్టారు అన్నట్టు:  ”  చీకటిలో ఉన్నా కొందరందులో వెలుగుని గురించి రాస్తారు.  వెలుగులో ఉంటూ జీవితం లోని చీకటి గురించి రాస్తారు.  వెలుగే తప్ప చీకటిని ఎరుగని వారు అందులోని నీలి నీడలనే చీకటిగాను, మరి కొందరు చీకటి చీకటి కాదని, వెలుగే చీకటి, చీకటే వెలుగని రాస్తారు”          ( కా రా రచనలు పుట 379).
ఆయన వ్రాసిన సందర్భం వేరైనా ఈనాటి కథకులకి, పాఠకులకి తెలియాల్సి ఉంది.

ఆంక్షలు పెట్టకండి.వచ్చేవి ఎలాగు వస్తాయి.  పొయ్యేవి ఎలాగూ పోతాయి.
మంచి ముత్యాలని ఏరుకోవడమే మీరు చేయగలిగింది!
ఏది మంచి?  మీకు ఏది మంచి అని తోస్తే అదే మంచి!!