వేణువు ఊదుకుంటున్న గోపాలుడికి ఆ సాయంత్రం పొద్దెక్కడం కొంచెం ఆలస్యంగా తెలిసింది. హడావుడి పడుతూ తన మేకలని కాలువ వైపుకి తోలాడు. ఊళ్ళో వాళ్ళెవరూ ఆ కాలువ, ఆ వంతెన వైపుకి చీకటి పడే సమయానికి రారు. భయం. ఎప్పుడో చెక్కతో కట్టిన వంతెన అది. ఇప్పుడో, అప్పుడో పడిపోయెటట్టుంది ఆ వంతెన. ఆ వంతెన ఇవతల గట్టుకి ఆనుకుని ఒక పెద్ద మఱ్ఱిచెట్టుంది. దాని మీద దెయ్యాలున్నాయిని ఆ ప్రాంతం ప్రజల నమ్మకం. చీకటి పడిన తరువాత ఆ వంతెన మీదుగా ఆ కాలువని దాటి ఏ ప్రాణి అయినా ఆ మఱ్ఱిచెట్టు కిందగా వెళ్తే దాని మీదున్న దయ్యాలు చంపేసి, రక్తం తాగి, శవాన్ని ఆ కాలువలో పడేస్తాయన్న కధని తరతరాలుగా ఆ ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటు ఉంటారు.
కాని గోపాలుడు మేకలని తొందరగా ఇంటికి చేర్చాలనే ఆలోచనలో ఉండి, ఆ మఱ్ఱిచెట్టు కిందుగా వెళ్ళి, ఆ కాలువ వంతెన మీదుగా దాటిస్తున్నాడు. అప్పటికే చీకటి పడిపోయింది. మఱ్ఱిచెట్టు భయంకరమైన దయ్యంలాగా కనబడుతోంది. గాలి విసురుగా తగుల్తోంది. మేకలన్ని పరిగెడుతున్నాయి. ఆఖరు మేక వంతెన దాటి గట్టు మీదకి చేరింది. దాని వెనకే గోపాలుడు కుడి కాలు మోపాడు. ఎడం కాలు ముందుకు తీసుకుని అడుగు వేస్తున్నాడు… వేసేశాడు. ఇప్పుడు కాలువకి ఇవతలి గట్టు మీదున్నాడు. పేద్ద శబ్దం చేస్తూ వంతెన ముక్కలు, ముక్కలుగా విరిగిపోయి, ఆ కాలువలోకి భళ్ళున పడిపోయింది. భయంతో మేకలన్నీ ఇంటి వైపు పరుగెట్టడం మొదలు బెట్టినవి. పరుగో, పరుగు, ఒకటే పరుగు. ఆగితే దయ్యాలు తమని కూడా పట్టుకుంటాయని భయం.
సరిగ్గా అప్పుడే గోపాలుడికి భయంతో ఏడుస్తున్న మేక పిల్ల అరుపు వినిపించింది. గబుక్కున వెనక్కి తిరిగి చూశాడు గోపాలుడు. ఆ కమ్ముకుంటున్న చీకట్లో అవతలి గట్టు మీద కనపడింది మేక పిల్ల. అది ‘మే… మే” అని భయంతో ఏడుస్తోంది. ఎర్రటి కళ్లతో దాని పీకని పట్టుకుని కనపడింది దయ్యం. చూడటానికే భయంకరంగా ఉంది ఆ దయ్యం.
“దాన్ని వదిలేయి, దయ్యమా. నువ్వేది అడిగితే అది ఇస్తాను, ” అని గోపాలుడు ఆ దయ్యాన్ని అడిగాడు. ఇవ్వను అన్నట్టుగా తలని అడ్డంగా అటూ, ఇటూ తిప్పింది దయ్యం.
గోపాలుడు మోకాళ్ళ మీద మోకరిల్లి, రెండు చేతులు కలిపి దణ్ణం పెడుతూ, “దయ్యం, దయ్యం దయచేసి నా మేకపిల్లని వదిలెయ్యవా?” అని మళ్ళీ అడిగాడు.
అప్పుడు దయ్యం, “సరే, వదిలేస్తాను. మరీ ఈ మేకపిల్ల నీ దగ్గిరకు ఎలా వస్తుంది?” అని అడిగింది.
గోపాలుడుకి ఏమి సమాధానం చెప్పాలో తెలియక బిక్క మొహం వేసాడు. అప్పుడు దయ్యం “నువ్వు ఒప్పుకుంటే ఒక షరతు మీద ఈ మేక పిల్లని వదిలేస్తాను,” అని అంది.
“ఏమిటా షరతు?” అని అడిగాడు గోపాలుడు.
“నువ్వు రేపు వచ్చేటప్పటికి ఇక్కడ ఒక సరికొత్త వంతెన ఏర్పాటు చేస్తాను. కానీ…”.
“ఊ…కానీ..నేను ఏం చెయ్యాలో చెప్పు,” అని ఆదుర్దాగా అడిగాడు గోపాలుడు.
“ఆ వంతెన మీదుగా దాటి వచ్చిన మొదటి ప్రాణిని నాకు బలి ఇవ్వాలి,” అని అంది ఆ దయ్యం.
“ఆ…?” అని ఆలోచనలో పడ్డాడు గోపాలుడు.
“నువ్వు ఒప్పుకోకపోతే ఈ మేకపిల్లని ఇప్పుడే చంపేస్తాను. రేపు ఆ వంతెన కూడా ఉండదు,” అని అంది ఆ భయంకరమైన దయ్యం.
“వద్దు, ఆ మేకపిల్లని చంపకు. నువ్వు చెప్పింది నాకు అంగీకారమే. అలాగే చేస్తాను, ” అని అన్నాడు గోపాలుడు.
మరుసటి రోజు ఉదయం, తన సద్దిమూటతో మేకలని తోలుకుంటూ కాలువ దగ్గిరకి బయలుదేరాడు గోపాలుడు. ఆశ్చర్యం! కాలువ మీద కట్టెలతో కట్టిన సరికొత్త వంతెన సిద్దంగా ఉంది అక్కడ. కాలువ అవతల గట్టున వంతెన దగ్గిర దయ్యం నిలబడి ఉంది. కాలువ ఇవతల గట్టున, వంతెనకి ఇవతల గోపాలుడు, అతని వెనకే మేకలు. ఆ మేకలతో పాటు ఒక గజ్జి కుక్క. మేకలని గట్టు మీదే ఉండమని చెప్పి, తను ఆ వంతెన మీద కాలు బెట్టి గట్టిగా ఉందో లేదో చూద్దామనుకున్నాడు. కానీ ఈ లోపు దయ్యానికి తనకి ఉన్న ఒప్పందం గుర్తు వచ్చింది. అందుకని వంతెన మీద కాలుపెట్టకుండా ఇవతలే నిలబడ్డాడు.
భుజానికి ఉన్న సద్ది మూటని విప్పాడు. అందులో నుంచి తను విడిగా పెట్టుకున్న మాంసం ముక్కని బయటికి తీసాడు. తన మేకలతో పాటే వచ్చిన గజ్జి కుక్కకి దాన్ని వాసన చూపించాడు. తన బలం అంతా వినియోగిస్తూ కుడి చేత్తో ఆ మాంసం ముక్కని వంతెన మీదుగా దయ్యం నిలబడి ఉన్న గట్టు మీదకి విసిరాడు. ఆ మాంసం ముక్క అవతల గట్టు మీద పడేలోపు, గజ్జి కుక్క ఆ కాలువ మీదున్న వంతెన మీదుగా అటు వైపుకి దూకింది. అటు దూకడేమేమిటి, ఆ గట్టు మీద పడ్డ మాంసం ముక్కని నోటితో పట్టుకోవడం కూడా అయిపోయింది.
ఇదంతా చూస్తున్న దయ్యం ఆశ్చర్యంతో నిర్ఘాంత పోయింది. దాని పక్కనే ఉన్న మేకపిల్ల దయ్యం పట్టు విదిలించుకుని ఆ గట్టునుంచి ఇటు గట్టు మీదకి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. గోపాలుడు దాన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ దయ్యం వైపు చూశాడు.
దయ్యం బూడిదగా మారి కుప్పగా కూలిపోయింది.
ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ మర్రిచెట్టు పైనకాని ఆ కాలువ గట్టున కానీ దయ్యాలు మళ్ళీ కనపడలేదు.
* * * కధ పూర్వపరాలు
2017లో మా అమ్మాయి, అల్లుడు తో కలిసి కొంత కాలం గదుపుదామని స్కాట్ లాండ్ వెళ్ళాను. వాళ్ళింట్లో వాళ్లుంటున్న ఎడిన్ బరో నగర పురాతన చరిత్ర గురించిన ఒక పుస్తకం కూడా ఉంది. ఎడిన్ బరో నగరంలో ఉన్న శిలా స్థూపాలు, ప్రతిమల గురించి కూడా కొంత వ్రాసి ఉంది. సెల్టిక్ కధల ప్రస్తావన వచ్చినప్పుడు జాలంలో కొన్ని కధలు చదివినప్పుడు వచ్చిన ఆలోచన ఇది. కధ వ్రాయడం మొదలుపెట్టిన తరువాత, ‘చిన్న పిల్లల కధ’ గా తయారయింది అనిపించింది. అప్పుడే చిన్న పిల్లలకి కూడా ఒక కధ వ్రాసానని, బాల సాహిత్యంలో కూడా వేలు పెట్టానని చెప్పుకోవచ్చు కదా అనిపించింది. దాంతో చిన్న పిల్లలకి కధలాగానే వ్రాసేసాను. చిన్న పిల్లల కధ గా రూపు దిద్దుకుంటునప్పుడు, పిల్లలకి దెయ్యలూ, భూతాలు, దేవుళ్ళు, దేవతలు (నేను నమ్మనివి) హేతువాదానికి, తర్కానికి నిలబడనివి, హింసని చూపించేవి ఎంత వరకు సబబు అని కూడా అనిపించింది. కానీ చందమామలో భేతాళ కధలు చదివిన నేను బాగానే ఉన్నానుకదా, నా పిల్లలూ బాగానే ఉన్నారు కదా , అని అనుకుని… దెయ్యాన్ని అలాగే ఉంచేసాను. ఇక ప్రచురణకి పంపాలనుకున్నప్పుడు ఏ పత్రిక అన్న మీమాంస మొదలైంది. సాహితీ మిత్రుడొకరు సాక్షిని సూచించారు. సాక్షి ఫన్ డే కి పంపాను. వారు ప్రచురించారు. కాకపోతే కధకి బొమ్మ వేసినవారు పెద్దగా శ్రమ పడకుండా జాలం నుంచి దెయ్యం బొమ్మకి బదులు దొరల మాంత్రీకురాలు బొమ్మని దింపేసి వాడేశారు. సాక్షి ఫన్ డే సంపాదకులకి ధన్యవాదాలు.
ప్రచురణానంతరం… కధ ప్రచురించిన తరువాత నేను పంచుకున్న మిత్రులలో ఒకరు, “నేనైతే పిల్లలకి దెయ్యాల భూతాల కధలు రాయనండి,” అని సున్నితంగా చెప్పారు. మరొకరు, “ఇమేజరి అంతా బాగుంది కాని పిల్లలకి దెయ్యం ఎందుకు…ఒక బాడ్ మాన్ తో వ్రాసి ఉండవచ్చు కదా?” అన్నారు. అది ఈ కధా నేపధ్యం. చి న సాంఘిక మాధ్యమాలలో ఇంకా ప్రచురించలేదు. చూడాలి అక్కడ చదివిన వాళ్ళేమంటారో! ద హ
పాద సూచి
సాక్షి, ఫన్ డే, ఆదివారం, ఆగస్ట్ 4 న సంచికలో వెలువడ్డ కధ పూర్తి పాఠం ఇక్కడ (image)
Text link here.
Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on whatsapp
WhatsApp
Share on email
Email
వేదిక మిత్రులకు,
ఈ శనివారం అంటే 27 అక్టోోబరున, 2018 నాడు “వేదిక” సాహిత్య సమావేశంలో
సంగీత నేపధ్యంతో మూడు కథలు గురించి ముచ్చటించుకుందాము. కానుక – ముళ్ళపూడి వెంకటరమణ ( మోహిత) వాయులీనం – చా సో (ఊణుదుర్తి సుదాకర్) చూపున్న పాట – కె ఎన్ వై పతంజలి (శ్రీమతి. రామలక్షి)
కధలను ఇక్కడ ఆన్‍లైన్‍లో చదువుకోవఛ్హు. http://bit.ly/Vedika27Oct2018
మరో ముఖ్యమైన విషయం
అక్టోబరు 25 ఉదయాన, అధ్యాపకులు, రచయిత కవన శర్మ గారు బెంగుళూరులో చనిపోయారు. వేదిక వారికి శ్రద్దాంజలి ఘటిస్తుంది.
సమావేశం సాయంత్రం 5.30కి మొదలవుతుంది. సభాస్థలి: ఆలంబన, 85 – హెచ్ ఐ జి కాలని, వెంగళాస్ కేటరర్స్ పక్కన, బాలాజీనగర్, కూకట్‌పల్లి, హైదరాబాదు 500072.
దారి వివరాలకు; +(91)-40-2305 5904, +(91) – 9440103189, 98483 21703
Google Map: https://goo.gl/maps/GvjOi
How to reach the venue Aalambana Hyd – వేదిక చేరుకోవడానికి దారి:
Omni Hospitals is the land mark visible on Kukatpally village main road. Take the road adjacent to it. You will find Kalyan Jewellers to your right on that road. Stick to that road. Pass ‘More’ departmental store, to your left. You will come across a ‘+’ junction.. and then Apollo Pharmacy, again to your left, while approaching from the Kukatpally main road. Take the left there and you will find Aalambana to your right. The 3rd building.
కొంత మంది పాఠకులకి నేను వ్రాసిన ఇడ్లి, వడ, సాంబారు కధ పూర్తిగా అర్ధం కాలేదన్నారు. ఈ టపా వారికోసం.
ఈ క్రింద ఇఛ్హినవి సారంగ లో వఛ్హిన కధ ఇడ్లి, వడ,సాంబార్ లోని వాక్యాలు. ఇవన్ని అంతర్గతంగా కధాంశానికి సంబంధించిన సూచినలిస్తాయి. వీటన్నింటిని ఒక క్రమంలో చదువుకుంటే కధ అర్ధం కావాలి. ఈ వాక్యాలు చదివిన తరువాత, కధని మళ్ళీ ఒకసారి చదువుకోండి. దానికి లంకె ఈ కింది వాక్యాల తరువాత చివర ఇఛ్హాను.
> ఇది అతని కధ.
> అతను ఒక స్త్రీ మూర్తిని తన చేతులమీదుగా ఎత్తుకుని తీసుకుని
రావడం…
> వాలిపోయిన ఆవిడ తలక్రింద చేతులు వేసి…
> స్త్రీని చాలా నెమ్మదిగా అతి జాగ్రత్తగా ఆ రేర్ సీట్ మీద పడుకోబెట్టాడు…
> …భుజాలక్రింద నుంచి చేతులేసి ఆవిడ తలని ఎంతో ప్రేమతో తన
ఒడిలోకి లాక్కుని…
> …తన రెండు చేతులతో ఎంతో వాత్సల్యంతో ఆవిడ కాళ్ళని తన ఒడిలోకి
తీసుకుంది…
> ఆంగర్, డినైయల్, బార్గైనింగ్, డిప్రెషన్ అండ్ అక్సెప్‌టన్స్. (Anger, denial, bargaining, depression and acceptance) – are the five stages of grief and not necessarily in that order. You can read more about it here. (If you haven’t yet, do watch that movie ‘All that Jazz‘. ఈ సినిమా ఆస్కార్ బహుమతులు పొందినది.))
> …(Yea…blood an’ shit!)…
> … బమ్స్ మధ్య నుంచి పరుపు మీదకి బెడ్ షీట్ మీదుగా. దేర్ గోస్ ది
బ్లడి షీట్!…
> …ఊపిరి తిత్తుల నిండా అవే. ఒన్…ఫోర్…ఎయిట్…మిలియన్స్ టు ది
పవర్ ఆఫ్ బిలియన్స్…దే ఆర్ చోకింగ్మాన్! లెట్ హర్ గో ఈజీలీ!
(Let her go easily!)…
> ఇట్ టూ ఈజ్ డెడ్ మాన్! (It too is dead man!)
> …(With a carcass…oh no!)…
(ఇది కధలో లేదు, కాని తెలియని పాఠకులకోసం ఇక్కడ ఇఛ్హాను. The following are the stages of “Rigor Mortis“, తెలుగులో ఇక్కడుంది. )
> బిలియన్స్ ఆఫ్ సెల్స్… డూ దే హావ్టు ప్రై దెమ్ ఓపెన్?
(Billions of cells…do they have to pry them open?)
> ఆర్ బ్రేక్? (Or break?)
> బ్రేక్ వాట్? (Break what?)
> ది జాస్, డూడ్…హర్ జాస్! (The jaws, dude…her jaws!)
> గెస్ నాట్! (Guess not!)
> షిట్… హౌ కెన్ యు ఎవెన్ధింక్ లైక్ దట్! (Shit…how can you
even think like that?)
> ఇట్స్ ఎ కడెవ…వాట్! (It’s a cadav’…what?)
> …నెమ్మదిగా సెటిన్ అవుతోంది…
> యు ధింక్ హర్ జా వుడ్‌హెవ్ బిగన్ టూ ఫ్రీజ్? (You think her jaw would have begun to freeze?)
> ఐ లిడ్స్?
(Eye lids?)
> …వాళ్ళందరూ ఇంకా తింటునే ఉన్నారు.
> ఇడ్లి, వడ, సాంబార్ కూడా…
That woman was part of their life and she lay dead in that car and they are having breakfast. Those monologues in English are his ( ఇంగ్లిష్ లోని స్వగతాలు, అతనివి) .
…. While they traveled with a member of their family who is dead (body), they stopped at a restaurant and had their breakfast.
చనిపోయిన తమ కుటుంబ సభ్యురాలి దేహంతో, ప్రయాణం సాగిస్తూ, దారిలో కనబడ్డ దాబా లో కూర్చుని ఉదయపు అల్పాహారాన్ని కోరుకుని తిన్నవి, ఈ కధలోని కొన్ని పాత్రలు. అది జీవితం. బహుశ మనందరి జీవితాలు అంతేనేమో!
ఇక తెలుగు కధలో ఇంగ్లిష్ వాక్యాలు, వాటిని టెంగ్లిష్ (ఇంగ్లిష్ పదాలని తెలుగు లో వ్రాయడం) మళ్ళీ అవే వాక్యాలని ఇంగ్లిష్‍లో (బ్రాకెట్లలో) ఇవ్వడానికి కారణం, తెలుగులో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్నవాళ్ళకి, ఇంగ్లిష్ తెలిసిన వాళ్ళకి, చదువుకోవడానికి సులువుగా ఉంటుందని.
ఈ టపా సమయానికి, నా వరకూ వఛ్హిన పాఠకుల వ్యాఖ్యలన్నింటినికి వివరణ ఇది.
ఆరడుగుల ఎత్తున్న ప్రహరీ గోడ. ఇనుముతో చేసిన చట్రానికి ఇనుపరేకు బిగించిన గేటు. అటూ ఇటూ చూస్తే
గేటుని బిగించిన స్తంభానికి అమర్చి ఉంది ఒక బుల్లి మీట. దానిని నొక్కాడు. భయంకరమైన గొంతుతో కుక్క
అరుపులు మొదలైనవి. ఒక్కసారి ఝడుసుకున్నాడు. అప్రయత్నంగానే ఒకడుగు వెనుకకు పడింది. దానిని
అదిలిస్తూ లోపలెక్కడ్నుంచో ఒక ఆడమనిషి వచ్చి గేటు పైనించి అతన్ని ఎవరికోసం అన్నట్టు చూసింది.
గొంతు పెగల్చుకుని అక్కకోసం అని చెప్పేలోపు వసారా లోపల నుండి అక్క. ‘‘ఎవరూ?’’ అని చూస్తూ
తమ్ముణ్ని గుర్తుపట్టి, పనిమనిషిని గేటు తెరవమని పురమాయిస్తూ ముందు వసారాలోకి వచ్చింది.
‘‘ఎప్పుడొచ్చావు?’’ అని అడుగుతూ, పరదాలని అడ్డం తీస్తూ లోపల హాలులోకి దారితీసింది. ‘‘నిన్ననే
వచ్చాను, ఇంటర్వ్యూ కోసం,’’ అని చెబుతూ ఎడమచేతి వైపు త్రీ సీటర్ సోఫాలో ఒదిగి కూర్చున్నాడు. అతనికి
ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది అక్క. పనిమనిషి తెచ్చిన మంచినీళ్ల గ్లాసును అందుకుంటూ అటూ ఇటూ
చూస్తుంటే, ‘‘బావగారు ఆఫీసు పనిమీద బయటకు వెళ్లారు’’ అంటూ అందరి క్షేమ సమాచారాలు అడిగి
తెలుసుకుంటోంది. కాసేపు అవీ ఇవీ మాట్లాడిన తరువాత. ‘‘మాటల్లో పడి మరిచిపోయాను, ఉండు నీకు టీ అంటే
ఇష్టం కదా! చేసి తీసుకు వస్తాను’’ అని లేచి లోపలికి వెళ్లింది. ఆ గుమ్మానికీ పొడుగాటి పరదాలు.
ఎదురుగా ఉన్న పత్రికని అందుకుని తిరగెయ్యడం మొదలుపెట్టాడు. ఏదో అలికిడి అయితే కుడిచేతి వైపుకి తలతిప్పి చూశాడు. గాలికి కదిలిన పరదాల చప్పుడు కాబోలు. దృష్టి తిప్పితే గుమ్మానికి ఎడం పక్కనే గోడకి ఉన్న ఫొటోఫ్రేమ్‌లో ఒక పదేళ్ల పాప నవ్వుతూ కనపడింది. అక్క కూతురు. ఎంత చక్కగా ఉందో. కళ్లల్లో ఒక
విధమైన పెంకితనం కూడా కనపడింది అతనికి. మరోపక్క గోడమీద చామనచాయ రంగు చెక్కలతో చేసిన చట్రానికి బిగించిన అద్దం లోపలి నుంచి కనబడుతున్న బొమ్మ.
ఆ! బొమ్మ కాదు అది. ఒక్కసారి వాడి ఊపిరి స్తంభించింది. అక్క వస్తున్నదేమోనని చూశాడు. అలికిడి లేదు. లేచి సోఫాలు దాటుకుంటూ వెళ్లి ఆ చట్రం ముందు నిలబడ్డాడు. పసుపుపచ్చని రంగు అట్టమీద ఒక వైపుకి
వాలుగా నెమలిపింఛం బిగించి ఉంది. గుమ్మం బయటి నుంచి హాలులోకి వస్తున్న వెలుతురు ఆ అద్దం మీద
గింగిరాలు తిరుగుతున్నది. నెమలి పురివిప్పుకుని అద్భుతమైన నాట్యాన్ని మొదలుపెట్టింది. అతని కళ్లు
చెమ్మగిల్లాయి. మసకబారిన ఆ కళ్లలోని తడి నెమ్మదిగా అతని మనసు లోపలి పొరలలోకి ఇంకుతోంది.
అతనే వాడు. వాడి మనసిప్పుడు గాలిపటంలాగా రివ్వున ఎగురుతోంది. మాంజా వేసిన దారం, పట్ట్టీలేసుకున్న
వేళ్ల మధ్య నుంచి సర్రున జారుతోంది. వాడి మనసు నిండా అక్కే! కళ్ల నిండా అక్కే. వాడి ఆలోచనల నిండా
అక్కే. అక్క ఈసారి ఎక్కడికి తీసుకెళుతుందో! అక్కని ఈసారి తప్పకుండా జూకి తీసుకెళ్లాలి.
సాయంత్రం స్నేహితులతో గోళీలు ఆడుతున్నా, వీధి మలుపు మీదే వాడి దృష్టి. కుడిచేతి చూపుడు వేలుని
ఎడమచేతి చూపుడు వేలుతో పూర్తిగా వెనక్కి లాగి, ఆరు జానలవతలున్న నీలం రంగు గోళీ మీదకి తన
పసుపురంగు గోళీని గురిచూస్తున్నా, వాడి చెవులిక్కడ లేవు. అక్క ఫియట్ కారు హార్న్ చప్పుడు వినడం
కోసం ఎదురు చూస్తున్నవి. వాడి దృష్టి నీలం రంగు గోళీ మీదున్నా, పక్కన చెవిపోగు గాడి చెమట కంపు
నాసికల ద్వారా అందుతున్నా, అక్క పూసుకునే కునేగా సెంటుతో వాడి బుర్ర నిండిపోయింది. వాడి దృష్టికిప్పుడు అక్క కనబడుతోంది!
వాడి కుడి భుజం మీద చెలికాడి అరిచేయి స్పర్శ వాడికి అక్క నునువెచ్చని స్పర్శనే గుర్తుచేస్తోంది. కుడిచేతి
బొటనవేలు నెమ్మదిగా, మెత్తగా అప్పుడే మొలుస్తున్న గడ్డి మొలకల మధ్య నుండి చల్లగా ఉన్న ఆ నేలలోకి
దిగబడుతోంది. ఇక చూపుడి వేలుకున్న గోళీకాయ విడివడడమే ఆలస్యం. నీలం రంగు గోళీకాయ పగిలిపోవాలి. వాడి ఏకాగ్రత అంతా దానిమీదే ఉంది. వాడి సావాసగాళ్ల కళ్లన్నీ కూడా వాడి చూపుడువేలుకి ఉన్న పసుపురంగు గోళీకాయ మీదే ఉన్నాయి. పగులుద్దా! వాళ్లందరూ ఊపిరి ఆపి బిగబట్టి చూస్తున్నారు.
వాడి ఎడమ చూపుడు వేలుతో నెమ్మదిగా కుడిచేతి చూపుడువేలు అంచుకు లాగుతున్నాడు. నేలలోకి పాతుకుపోయిన బొటనవేలు పూర్తిగా సాగిపోయింది. బొటనవేలు, చూపుడువేలు మధ్యనున్న కండ తెగుతుందా అన్నట్టుగా సాగింది.ఇక అయిపోయింది. నీలిరంగు గోళీకాయ పగిలిపోవడం తప్పదు! అక్క నవ్వు వినపడిన తరువాత వెనక్కి లాగిన చూపుడు వేలుని వదిలాడా, లేక నీలిరంగు గోళీకాయలో అక్క నవ్వు కనపడిన తరువాత వదిలాడా అన్నది వాడికిప్పటికీ తెలియదు. ఏదైతేనేం ఆ నీలిరంగు గోళీకాయ పగిలిపోలేదు. గోడకి తగిలి మరో యాభై జానల అవతల ప్లాట్‌ఫాం అంచునుండి కిందకి జారనా వద్దా అన్నట్టు వూగి, రోడ్డుమీదకి జారిపడిపోయింది.
అప్పుడు వినపడింది ఫియట్ కార్ హార్న్ వాడికి. కారు మలుపు తిరుగుతోంది. వెనక సీట్లో అక్క కనపడుతోంది.
బావగారికి డ్రైవర్ అడ్డంగా ఉన్నాడు. ఆయన సరిగ్గా కనపడ్డం లేదు. అటుపక్కనే ఉన్న చెవిపోగులు గాడిని,
ఇటువైపున్న గద్దముక్కుని తోసేసి ఉరుకు. లాగు నడుంపైకి లాక్కుంటూ ఉరుకు. ఇంటిగేటు వైపుకు
కారుకి ఎదురుగా ఉరుకు. కారు ఇంకా ఆగలేదు. వెనక తలుపు తెరుస్తూ తనవైపుకి లాక్కున్నాడు. అక్క
ముఖం నిండా నవ్వు. వాడి మొఖం నిండా నవ్వు. అక్క మీదకి దూకి. రెండు చేతులు అక్క మెడ చుట్టూ
వేసేశాడు. అక్క వాడిని వాటేసుకుని, హత్తుకుంది. వాడికి ఆ క్షణంలో ప్రపంచం గుర్తులేదు. వాడికి అక్కే
ప్రపంచం అయిపోయింది.
అక్క కదిలింది. వాడు కదిలాడు. అక్క కుడిపాదం జాపి నెమ్మదిగా కారులోంచి దిగింది. ఈలోపు అలికిడికి అమ్మ
బయట వసారాలోకి వచ్చింది. అక్కని కుడిచెయ్యి పట్టుకుని దాదాపుగా లాక్కుంటూ తీసుకువెళుతున్నాడు వాడు.అక్కను చూస్తున్న ఆనందంతో అమ్మ మొహం విప్పారింది. వెనక వస్తున్న బావగారిని చూసి పలకరింపుగానవ్వింది. వసారాలో గుమ్మం పక్కనే చెప్పులు విడిచింది అక్క. ఆమె కుడిచేతిని వాడు ఇంకా వదల్లేదు. అమ్మలోపల హాలులోకి వెళ్లింది. బావగారు కూడా వసారాలోకి వచ్చి, అక్క విడిచిన చెప్పుల పక్కనే తన చెప్పులు విడిచారు.
హాలు లోపలికి అక్క వెనకే అడుగులు వేశారు. హాలులో ఎడమచేతి వైపు విడిగా ఉన్న సోఫాలో బావగారు
కూర్చున్నారు. ఆయన పక్కనే ఉన్న చిన్న మోడా మీద కూర్చుంది. అక్క ఒడిలోకి జారిపోయాడు వాడు. డ్రైవరు హాలులోపల గుమ్మానికి కుడిపక్కన గోడపక్కనే సూటుకేసులని నిలబెట్టాడు. ఈలోపు పనిమనిషి స్టీలు ట్రేలో రెండు గాజు గ్లాసుల నిండా మంచినీళ్లు తెచ్చింది. బావగారు ఒక గ్లాసు అందుకున్నారు. వాడు ఆ రెండో గ్లాసుని అందుకుని అక్కకి ఇచ్చాడు. హాలులో గుమ్మం పక్కనే పొట్టి టేకు బల్లమీద నల్ల ఫోను అందుకుని అమ్మ ఫోను చేసింది నాన్నగారికి… ‘‘అమ్మాయి, అల్లుడుగారు వచ్చేశారు, తొందరగా వచ్చేయండి’’ అంటూ.
సూటుకేసులు అవీ పాప గదిలో పెట్టమని పనిపిల్లని పురమాయిస్తూ వచ్చిన జంటని స్నానం చేసి బట్టలు
మార్చుకోండి అని చెబుతూ నాన్నగారికి వారి రాకని తెలియజేశానని తొందరగా వచ్చేస్తారని అక్కకి చెప్పింది అమ్మ. వాడుఅక్కతో పాటు పడకగదిలోకి వెళ్లాడు. ఒక పక్కగా చిన్న బల్లమీద పెట్టి ఉన్నవి సూట్‌కేసులు. ఆ బల్ల పక్కనే రెండు టేకుతో చేసిన కుర్చీలు. సూట్‌కేసుని తెరిచింది అక్క. బట్టలపైనే ఉందది. కపిల వర్ణం కాగితంతో
ఉన్న చిన్న కట్ట. తెల్లని టై్వన్ దారంతో భద్రంగా కట్టారు. పక్కనే తనని ఆనుకుని నిలబడ్డ తమ్ముడికి
ఇచ్చింది అక్క. రెండు చేతులతో దానిని అందుకున్నాడు. పక్కనే ఉన్న కుర్చీమీద కూర్చుని దాని ముడి విప్పాడు.
లోపల రంగు రంగుల బొమ్మలతో అందంగా ఉన్న పుస్తకాలు. జానపద కథలు, కొన్ని విజ్ఞానానికి సంబంధించినవి. పిల్లల గేయాలు. వాడి కళ్లల్లో ఆనందం చూసి అక్క మురుసుకుంది. కొద్దిగా వంగి, వాడి చెంపలని తన రెండు అరచేతుల మధ్య పట్టుకుని వాడి తలని తన ఒడిలోకి లాక్కుని గట్టిగా, చప్పుడు చేస్తూ వాడి నుదుటిమీద ముద్దుపెట్టుకుంది. అటుపక్కన తన సూట్‌కేసులో బట్టలు తీసుకుంటున్న బావగారు వాళ్లిద్దర్ని చూస్తూ, ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. క్రీగంటన అది చూసి వాడు సిగ్గుపడ్డాడు. గారంగా భుజాలూపుతూ వాడు అక్క ఒడిలోకి మరింతగా ఒదిగిపోయాడు. వీపు మీదకి చేతులు జార్చి చప్పుడయ్యేట్టు చరిచి వాడిని పక్కకి నెట్టేసింది అక్క.
అక్క, బావగారు ఒక వారం రోజులున్నారు. ఒకరోజు హాలులో భోజనాలు. ఒక సాయంత్రం బతికిన కాలేజీ. మరో
రోజు హోటల్లో. ఒకపూట అక్క చదువుకున్న స్కూలు. మరోరోజు ఉదయం వరండాలో పిట్టగోడమీద కూర్చుని
టిఫిన్లు. ఇంకో రోజు డాబామీద వెన్నెల రాత్రిలో భోజనాలు. అక్కతో కనీసం ఒక ముద్దన్నా పెట్టించుకోనిదే భోజనాల తరువాత చెయ్యి కడిగేవాడు కాదు. మరొకపూట ఉద్యానవనం. ఉయ్యాలలో అక్కతో పోటీ. బావగారితో సినిమాలు, షికార్లు.ఆ వారం రోజులు పండగే వాడికి.
ఆగమని అంటూ తుర్రుమని ఇంట్లోకి పరుగెత్తాడు. తన మేజా మీదనున్న లెక్కల నోటు పుస్తకం తెరిచి పేజీలు
తిరగేశాడు. మెరుస్తూ కనపడిందది. వాడి బెస్టుఫ్రెండ్ వాడి కోసం ఇచ్చిందది. దాన్ని జాగ్రత్తగా పట్టుకుని
మళ్లీ రివ్వున పరిగెత్తుకుంటూ కారు దగ్గిరకి వచ్చాడు. అక్కని చెయ్యి చాపమని అడిగాడు. కారు తలుపులో
నుంచి కుడిచేతిని చాపింది. అరచెయ్యి తెరిచి ఉంది.
నెమ్మదిగా అక్క అరచేతిలోకి జార్చాడు దానిని. మృదువుగా, మెత్తగా వాడి ప్రేమంత మధురంగా ఉంది ఆ నెమలిపింఛం. అందుకుంది అక్క. కళ్లు చెమర్చాయి. అమ్మ పక్కకి తిరిగి చీరకొంగుతో కళ్లు వత్తుకుంది. గేటు
దగ్గర నిలబడ్డ నాన్న కళ్లజోడు అద్దాలు కొంచెం మందమైనవి. ఆయన కళ్లు ఆ జోడులో నుంచి కనపడలేదు.
బావగారు చేతులూపారు. కారు కదిలింది. అక్క ఆయన భుజం మీదకి వాలిపోవడం కనపడింది. ఆయన ఆమె భుజం చుట్టూ చెయ్యి వేశారు. బహుశా ఓదార్చుతున్నారేమో!
‘‘ఏమిటి ఇక్కడ నిలబడ్డావు?’’ అని అడుగుతూ అక్క ఆ నెమలిపింఛాన్ని చూసి చిరునవ్వుతో, ‘‘నువ్వు
ఇచ్చిందే. బావగారు ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు’’ అంటూ సోఫా వైపుకు దారితీసింది. వాడికోసం టీతో పాటు కొన్ని
చేగోడీలు, చక్కిడాలు, పంచదార గవ్వలు ఉన్న పింగాణి పళ్లెం తెచ్చి సోఫా ముందున్న గాజు టేబుల్ మీద
పెట్టింది. అక్కకి మాత్రమే కాదు తనంటే ప్రేమ. బావగారికి కూడా తనంటే ఎంతో ఇష్టం అని మురుసుకున్నాడు.
ఎప్పుడెప్పుడా రాలిపోదాం అని చూస్తున్న కన్నీళ్లని అక్క చూడకుండా ఒడుపుగా అరచేతుల్తో గబుక్కున
తుడిచేసుకున్నాడు.
లోపలెక్కడో ఉన్న కుక్క మళ్లీ నెమ్మదిగా గారంగా మొరుగుతోంది. సోఫాలోకి కూలబడి, తలవంచుకునే తన చదువుగురించి, ఉద్యోగంలో ఇంటర్వ్యూ కోసం వచ్చిన సంస్థ గురించి, ఉద్యోగం ప్రాముఖ్యత గురించి చెబుతూ అక్క గుర్తుచేసినప్పుడల్లా ఒక గవ్వో, చేగోడో, చక్కిడమో అందుకుని తింటూ, ఇక చాలన్నట్టుగా మంచినీళ్లు
అందుకుని తాగాడు. టీ కప్పున్న సాసర్‌ని అందుకున్నాడు కుడిచేతితో. ఎడమచేతితో సాసర్‌ని పట్టుకుని
కుడిచేతితో కప్పు చెవిని చూపుడువేలు, బొటన వేళ్ల మధ్య పట్టుకుని పెదవుల దగ్గరికి తీసుకువెళ్లాడు
నెమ్మదిగా. పెదవులకి ఆనించి, ఒక గుక్క జాగ్రత్తగా నోట్లోకి లాగాడు చప్పుడుచేయకుండా. కాలలేదు. తనకి
సరిపోయే వేడితోనే ఉందా టీ. పంచదార కూడా సరిపోయింది. అక్క టీ చెయ్యడంలో మార్పేమీ లేదు. అప్పుడు తలెత్తి అక్కని చూశాడు. దేవత.
ఫోను మోగింది. బావగారేమో? అక్క లేచి వెళ్లి ఫోనులో ఏదో మాట్లాడుతోంది. టీని మరో గుటక వేశాడు. అక్క కలిపిన టీ. ఎంత బాగుందో. నెమ్మదిగా గొంతులో నుంచి జారుతూ ఉంటే ఎంత హాయిగా ఉందో! అక్క తనకోసం చేసింది. అక్కకి తనమీద ప్రేమ తగ్గలేదు. పనిమనిషిని చెయ్యనివ్వలేదు. తనే చేసి తనే తీసుకువచ్చి ఇచ్చింది. అక్కకి తనమీద ప్రేమ ఏమీ తగ్గలేదు. లోపలి నుంచి ఇందాక ఫొటోలో చూసిన పాప సుడిగాలిలా గదిలోకి వచ్చింది. తెల్ల రంగు ఫ్రాక్. ఎర్రని అంచులతో. బొద్దుగా, ఆరోగ్యంగా చక్కగా ఉంది. హాలులో ఎవరో కొత్తమనిషి ఉన్నారన్నది గుర్తించింది. ఒక్క క్షణం. అలా అక్కడే ఆగిపోయింది. ‘‘ఎవరో గుర్తుపట్టావా?’’ అని అక్క పాపని అడిగితే, లేదంటూ అడ్డంగా, కొంచెం విసురుగానే తలని తిప్పినట్టుంది. అక్క నవ్వుతూ, ‘గుర్తుతెచ్చుకో’ అంటోంది.
ముందుకు వంగి గాజు టేబుల్‌మీద టీకప్పుని అందుకుని, అక్క ఎంతో ప్రేమగా తనకోసం చేసిన టీ మరో గుటక
వేసుకోవడానికి నోట్లోకి వంపుకున్నాడు. అది గొంతులోకి జారి అక్కడి నుంచి నెమ్మదిగా, అతి నెమ్మదిగా అతని
గుండెల్లోకి ఆమె ప్రేమని వొంచి నింపుకుంటున్నాడు. పాప అప్పుడు గమనించినట్టుంది అతను టీ తాగడం.
అక్కవైపు చూస్తూ, ‘‘టామీకి పాలు లేవు మమ్మీ. చూశావా?’’ అని అడుగుతూ, కొత్తగా కనబడుతున్న
అతనివైపు చూసింది.
పాప దృష్టి ఇప్పుడు అతని చేతిలోని టీ కప్పు మీద పడింది. ఆ మరుక్షణం ఆ కళ్లలో ఒక వెలుగు. ఒక
మెరుపు. తనకి అర్థమై తెలిసిపోయిందన్న అమాయకపు గర్వంతో కూడిన వెలుగు. ఒక్క క్షణమే ఆ మెరుపు.
అప్పుడు ఆ కళ్లలోని అర్థమైన మెరుపుని ఆ ‘పక్కింటి’ తమ్ముడు ఎప్పటికీ మరిచిపోడు. ‘‘మమ్మీ, టామీ పాలతో టీ కలిపిచ్చావా? చీ యాఖ్… ఆ పాలు కుక్కకోసం ఉంచినవి’’ అంటూ ప్రపంచంలోని అసహ్యాన్నంతా ఆ పదాలలోకి ఒంపి, నింపి బయటకు విసిరేసింది.
ఈ కథ , సాక్షి దిన పత్రిక వారి ఆదివారం అనుబంధం ఫన్‌డే జూన్ 21, 2015 లో ప్రచురితం.
మొన్న అంటే మార్చ్ పదిహేనో తారీఖున, ఆంధ్రజ్యోతివారి ఆదివారం అనుబంధం లో, నేను తెలుగులో వ్రాసుకున్న కథని తొలిసారిగా ప్రచురించారు. దాని పేరు అదితి. మీరు అదితి చదవకపోతే ఇక్కడ చదువుకోవచ్చు.
ఆ కథ మీద పాఠకులనుండి వచ్చిన స్పందనల గురించి ఈ టపా.ఈ స్పందనలను ఇక్కడ నమోదు చెయ్యడానికి ప్రేరణ వి వి న మూర్తి గారు తమ కథ “ఒక రేపిస్టు ప్రేమలేఖ” (ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం – ఫిబ్రవరి 1,2015, ప్రచురణ) మీద ఫేస్‌బుక్‌లోని కథ సమూహంలో వారికి వచ్చిన స్పందనలని పంచుకోవడమే. అలాగని వారితో కాని మరెవ్వరితోకాని నన్ను కాని నా రచనలని కాని నేను పోల్చుకోవడం లేదు.
మరొక ముఖ్యమైన కారణం – భవిష్యత్తులో ఈ అదితి గురించి పాఠకులు నాకు చేరవేసిన తమ అభిప్రాయాలు వ్రాసుకున్న ఈ కొన్ని, నా జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. కథ చదువుకున్న తరువాత మీరు ముందుకు సాగితే బాగుంటుందని నా అభిప్రాయం. కథ చదవకుండా దానిమీద పాఠకుల స్పందన తెలుసుకున్న తరువాత కథ చదివితే మీ అభిప్రాయంలో మార్పుకి అవకాశం ఉండవచ్చు. ఉండకపోనూవచ్చు.
ఈ పాఠకుల స్పందనలకి గణాంకాలు కాని సంఖ్యాక వివరాలు కాని లేవు. జ్ఞాపకం ఉన్నంతమేరకు ఇక్కడ పంచుకుంటున్నాను. గమనించగలరు. ఫోన్లు చేసిన పాఠకుల పేర్లు నేను అడగలేదు. వారి ఏ ఊరు నుంచి చేస్తున్నారన్నది తెలుసుకోవడానికి మాత్రమే వారి ఊరి పేరు అడిగాను.
అదితి ని స్త్రీలూ పురుషులు ఇద్దరూ చదివారు. ఫోన్లు చేసారు, ఎస్ ఎమ్ ఎస్ లు పంపారు. చాట్ లో చెప్పారు.
ఫోన్లు చేసిన వారి సంఖ్యని నేను మొదట్లో లెఖ్ఖ పెట్టడానికి ప్రయత్నించాను కాని తరువాత విరమించుకున్నాను, నాకు అంత ఓపికాలేదు, ఆ ఆసక్తి లేకుండా పోయింది. ఉజ్జాయింపుగా ఒక అంచనా అయితే ఉంది.
అదితి కథ చదివిన తరువాత, నా గురించి తెలిసిన వారు, నా గురించి విన్నవారు చాలా ఆసక్తిగా అడిగిన ప్రశ్న. “ఇదేనా మీరు వ్రాసిన తొలి కథ?” అని. ముఖ్యంగా సాహిత్యకారులు. రచయితలు, కొంత మంది సంపాదకులు కూడా. ఆ ప్రశ్నని నేను అసలు ఎదురుచూడలేదు. బహుశ నన్ను నేను ఆ కోణంలోనుంచి (ఒక తెలుగు రచయితగా) చూసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ కలగలేదు. అందుకనేమో మరి!
ఇక వారి ప్రశ్నకి జవాబు;
తెలుగులో నేను వ్రాసిన కథలలో ఆఫ్‌లైన్‌లో అంటే (అచ్చు) పత్రికలలో ప్రచురణకి నోచుకున్న తొలి కథ ఇదే.
పోతే ఇందాక అనుకున్న పాఠకులలో రచయితలు, సంపాదకులూ ఉన్నారన్నాను కదా! వారందరి ఏకాభిప్రాయం: “ఇది మీ తొలికథ లాగా లేదు.”
గోక్కోవడం
“దురద” ని మెచ్చని వారు కూడా ఉన్నారు. కనీసం ముగ్గురున్నారు. ఒకరు స్వయంగా నాకు తన అభిప్రాయం తెలియజేస్తే మరొకరు ఫేస్‌బుక్ కథ సమూహంలో ఆ మాటలే కాకున్న అటువంటి అర్ధం వచ్చే మాటలే వాడారు. ఒకరు సందేశం పంపారు.
అదితి కథలో లంకేష్
ఒకరిద్దరు “శిల్పాన్ని ఇంకా చక్కగా engineer చేసి ఉంటే బాగుండేది,” అన్నవారున్నారు. కథని గతం – వర్తమానం మధ్య నడిపిస్తూ “మీరు కొత్తగా ఏమి చేసారు?” అని నిలదీసినవారున్నారు. అడిగిన వారికి నా అప్రకటిత (కనీసం వారి దృష్టిలో) రచనా సామర్థ్యం మీద వారికున్న నమ్మకానికి ఆశ్చర్యమేసింది.
శైలిని కూడ దాదాపు అందరూ మెచ్చుకున్నారు. భాష విషయానికి వస్తే, “మరి అంత ఇంగ్లిష్ అవసరమా?” అని అడిగినవారు కూడా ఉన్నారు. “మీరు ఎన్నుకున్న నేపధ్యానికి మీరు వాడిన బాషే సరిపోయింది,” అని మెచ్చుకున్నవారున్నారు.
దాదాపు అందరూ “…నట్లు కొట్టకుండా, ఆపకుండా చదివించింది మీ కథ,” అని చెప్పారు.
“మీ కథని తెలుగు పాఠకులు మెచ్చుకోవడం అనుమానమే,” అని అభిప్రాయాన్ని వెల్లడించిన ఇద్దరు పాఠకులు రచయితలే! వారిద్దరూ నా శ్రేయోభిలాషులే.
“మీ ఈ కథలని తెలుగు పాఠకులు అందుకోలేరండి. తొందరగా మీ కథలని కూడా నాకివ్వండి. అనువదిస్తాను,” అని అంటే ముక్కున వేలేసుకోవడం నా వంతైయ్యింది.
కాస్త చదువుకున్నవారు ( సాహిత్యం ), లోకజ్ఞానమున్నవారు కథ ముగింపుని హర్షించలేదు. సైకోసొమాటిక్ డిజార్డర్ అని మీరు చెప్పకపోయినా అది పాఠకులకి అర్ధం ఆయ్యేది అని వారు అభిప్రాయపడ్దారు. వీరందరూ పట్టణ ప్రాంతాలలో జీవిస్తున్న విద్యాధికులే! రచయితలందరూ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
కథకి పాత్ర పేరు అదితి కాకుండా మరోక మకుటం పెట్టిఉంటే బాగుండేది అన్నపాఠక, సంపాదక వర్గ, రచయితలున్నారు.
అదితి కథ అర్ధం కాలేదు అని సందేశాలు పంపినవారు ఇద్దరు.
బోర్ కొట్టిందని సందేశం పంపుతూ “ఇంకా మంచి కథలుమీరు వ్రాయలి!” అని ప్రోత్సహించిన వారు ఒకరు.
సైకోసొమాటిక్ డిజార్డర్ అనే లక్షణం నిజంగా ఉందా అని అడిగిన వారు కొందరు.
దాదాపు ఒక పదిమంది దాకా తమ కుటుంబంలోనో , స్నేహితులలోనే ఇటువంటివి చూసినవారున్నారు. వివరంగా నాతో వారి అనుభవాన్ని పంచుకున్నారు.
అదితి చదివిన తరువాత ఆ దురద లాంటి ఇతర అలవాట్లని గుర్తించిన పాఠకులు కథని విపరీతంగా మెచ్చుకున్నారు.
అదితి ఒక ప్రమాదాన్ని కూడా తెచ్చిపెట్టింది. కుటుంబ సమస్యలకి నన్ను పరిష్కారం కోరుతూ పాఠకులు ఫోను చేసారు. మరీ ముఖ్యంగా వైవాహిక జీవితంలో భార్యా భర్తల మధ్య వచ్చిన అవగాహానాలేమి. ఫోన్లు చేసిన వారందరూ స్త్రీలే!
పాత్రల పేర్లు మీద కూడా స్పందించారు. “ఆ పేర్లు ఏమిటి? అన్ని కృతకంగా ఉన్నాయి! ఆ భాష ఏంటి?” అని అన్నవారు కూడా ఉన్నారు.
ఈ టపా సమయానికి ప్రవాసాంధ్ర పాఠకులెవరి స్పందనా నాకు అందలేదు.
కథలతో పాటు రచయిత ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు ప్రచురణకర్తలకు అభిప్రాయాలు అందటం లేదట!
– ౦ –
నా పరిశీలనలోనూ, నా అధ్యయనంలో తెలిసిన రెండు ముఖ్యమైన విషయాలు చెప్తాను.
1 – స్థూలంగా 40ల లోపున్న వారికి ఈ కథ అంతగా నచ్చలేదు.
2 – 40 లు దాటిన వారందరికీ ఈ కథ చాలా బాగా నచ్చింది.
3 – ఈ నలభైలలోపు ఉన్నవారికి ఈ కథ: శోభన్ బాబు లాంటి పల్లెటూరి మొగుడు, పట్నం పెళ్లాం, కొత్త దేవత లాంటి భార్య ఇందులో కొత్తేముంది?” అని అడిగినవారు ఉన్నారు. మరో అడుగు ముందుకేసి ఇల్లాలు సినిమా కి మీ కథకి పెద్ద తేడా ఏముంది అనికూడా అడిగేసారు. 🙂
4 – లంకేష్ ఒక “చచ్చెధవ, సౌమ్య భలే పని చేసింది,” అని ఆ పాత్రని మెచ్చుకున్న స్త్రీ లు కూడా ఉన్నారు. 🙂
ఫేస్ బుక్ కథ సమూహంలో కథని పంచుకున్న సాయి పద్మ కి, సోదరుడు అట్లూరి శ్రీ కి, అబ్బిగారి రాజేంద్ర ప్రసాద్ , వ్యవస్థాపక అధ్యక్షులు రాష్త్ర కధానిలయం, నందలూరు వారికి మప్పిదాలు.ఇక ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం సంపాదక వర్గం సభ్యులకి, బొమ్మలు వేసిన అక్బర్ గారికి నా నెనర్లు.
గమనిక
ఈ కథని ఏ ఒక్క పత్రికనో దాని పాఠకులనో దృష్టిలో ఉంచుకుని వ్రాసింది కాదు. కథని వ్రాసుకున్న తరువాత ఒకే ఒకరితో పంచుకున్నాను. వారి అభిప్రాయాన్ని విన్నాను. ఆ అభిప్రాయంతో నా కథలో మార్పులు చేర్పులు చెయ్యలేదు. అది వారి అభిప్రాయంగానే తీసుకున్నాను. అంతే.
ఈ కథకి నేపధ్యం ఉందా అంటే ఉంది. ఒకటి అప్పుడెప్పుడో నేనేదో వ్రాస్తే దాన్ని చదివి ఒకానొకరు “మీరే వ్రాసారా? ఎవరైనా ఎడిట్ చేసారా?” అని అడిగితే ఆ ప్రశ్నకి కోపంవచ్చింది. అంతేకాదు మరొక distant cousin కూడా ఎక్కడో “…వ్రాసేవాళ్ళెవరూ లేరు నేను తప్ప,” అని అంటే అది గుచ్చుకుంది. అప్పుడు వ్రాసుకున్న కథలలో ఇది ఒకటి. అందుకోసమే వ్రాసిన దాన్ని ప్రచురణకి పంపాను. నాకు కోపం తెప్పించిన వారిద్దరికి కూడ మప్పిదాలు. 🙂 రెండు నా దృష్టికి వచ్చిన కొన్ని అనుభవాలని ఏర్చి కూర్చి ఒక కథగా మలిచాను. ఆ అనుభవాలు కూదా దాదాపుగా మూడు దశాబ్దాలమేరా విస్తరించిన అనుభవాల సమాహారం.
దక్షిణామూర్తి ఎడం చేతివైపు ఇండికేటర్ వేసి నెమ్మదిగా గేటు లోపలికి నడిపించాడు బండిని. సెక్యూరిటి మనిషి ఈలేస్తూ బండి పార్కు చేసుకోవడానికి స్థలం చూపించాడు. రెండిటి మధ్యన జాగ్రత్తగా నిలిపాడు. దిగి బండి వెనకకి వెళ్లగానే “దస్” అంటూ ఆ సెక్యూరిటి వాడు పసుపు రంగు రసీదుని చేతిలో పెట్టాడు. “పది రూపాయలా?” అని మనసు మూలిగినా, పర్సు తీసి అందులో రెండు వంద రూపాయలనోట్ల మధ్యనున్న ఐదు పదిరూపాయలనోట్లనుండి, ఒక నోటుని వాడికి అందించాడు. అతనిచ్చిన పార్కింగ్ టికెట్‌ని పర్సు లోపలి అరలో ఒకవైపుకి దోపి దానిని పాంటు వెనుక జేబులోకి నెట్టాడు.
***
‘లూ’ గారంటే దక్షిణామూర్తిగారికి చాల గౌరవం. ఆయన దగ్గిర తన తండ్రి పనిచేసాడు. తండ్రి చెప్పినదానిని బట్టి ‘లూ’ గారి మంచితనంతోనే తన తండ్రికి ఉద్యోగం లభించింది. గుమస్తా ఉద్యోగమే ఐనా, ఇతర అర్హతలు లేకపోయినా విపరీతమైన ‘నమ్మకం’ అనే లక్షణం ఉండటం మూలకంగా ‘లూ’ గారు తమ కొలువులో చేర్చుకున్నారనేది జగద్వితం. గిట్టని వాళ్ళు మాత్రం ‘లూ’ గారికి కావల్సింది “కుక్క లాగ విశ్వాసంతో కాళ్ళ దగ్గిర పడిఉండే జీవి” అన్నిన్నూ దానికి దక్షిణామూర్తి తండ్రి సరిగ్గా సరిపొయ్యాడు కాబట్టి అతనిని కొలువులోకి తీసుకున్నాడు అన్నిన్ను చెవులుకొరుక్కుంటూ ఉంటారు.
‘లూ’ అంటే దక్షిణామూర్తి కి భక్తి కూడా ఉంది. ఎందుకంటే ‘లూ’ గారు తన ‘ట్రస్ట్’ ద్వారా అతని చదువులకయ్యే ఫీజులని స్కాలర్‌షిప్పు తో భరించేసారు. మరీ ఆ సరస్వతీ దేవి కటాక్షం లేకపోతే తను ఏ సైకిల్ షాపులో మెకానిక్కు గానో, బట్టలకొట్లో గుమాస్తాగానో జీవితం గడిపేసివుండేవాడిని కదా అనుకుంటూ ఉంటాడు. ప్రతితోజు ‘లూ’ గారు గోల్ఫ్ క్లబ్బులో కాడి కిచ్చే టిప్పు, తాగివదిలేసే కౌర్వొఇజర్ (Courvoiser) గోల్డెన్ డ్రాప్స్ ధర, పళ్ళెంలో వదిలేసిన డంప్లింగ్స్ ఖరీదు మొత్తం కలిపితే అయ్యే ఖర్చులో బహుశ ఒక పదోవంతు ఉంటుందేమో దక్షిణామూర్తికి అందే నెలసరి భృత్యం.
***
అక్కడెక్కడో హిందు మహా సముద్రంలో ఏర్పడిన తుపాను గాలికి, ఇక్కడెక్కడో బందరు ఒడ్డున ఉన్న పొట్లకాయ తీగకున్న చిగురుటాకులా వణికిపోతున్నాడు దక్షిణామూర్తి. కారణం తనలాంటి వారికి ఇలవేలుపు, పూజ్యుడు, కుబేరుడు, దయామయుడు అయిన “లూ” గారి ఆరోగ్యానికి సంబంధించిన ఓ వార్త అతని చెవిన పడింది. అది విన్నప్పటినుంచి దక్షిణామూర్తి మనసు మనసులో లేదు. అది విన్నప్పట్నుంచి కాలు ఆడడం లేదు, చెయ్యి కదలడం లేదు. మెదడు పని చెయ్యడం లేదు. అలా ఉండిపొయ్యాడు అంతే. ఒక విధమైన స్థబత ఆవరించింది. ఆ వార్త అంది కూడ పదిరోజులైనది. ఐనా “లూ” గారింటికి వెళ్ళే ధైర్యం చెయ్యలేకపొయ్యాడు. ఎందుకని? దక్షిణామూర్తి లాంటి మూడవ తరగతి వారికి డబ్బు ధైర్యం ఇస్తుంది. మూడవ తరగతి వారెవరంటారా? డబ్బులుంటే కాని ధైర్యం చెయ్యలేని వారు, దేనికైనా. మరి నెలాఖరు రోజులు. ఇప్పుడు దక్షిణామూర్తి దగ్గిర డబ్బులేదు. ఐనా ఇక తప్పదు. నెలాఖరైనా సరే వెళ్ళి తీరాలి అన్న నిర్ణయాన్ని తీసుకున్నాడు.
***
ప్రతి బుధవారం ఉదయం “లూ” గారు, తన “గ్రేట్ డేన్” తో సుమారు 7 గంటల ప్రాంతలో ముచ్చట్లాడుకుంటారు. ఒక అరగంట సేపు. వారిద్దరి ముచ్చట్ల ఏకాంతానికి కాపలాదారుడు ఆ గ్రేట్ డేన్ “హాండ్లర్” లాల్. పదాతిదళం లో పది సంవత్సరాలు పని చేసి రిటైరైన వాడు లాల్. డిసిప్లిన్ అంటే ఇష్టపడే “లూ” గారికి లాల్ లాంటి వాడు నచ్చకపోవడం ఉండదు. ఆముప్పై నిముషాలలోపు తనతో మాట్లాడానికి దక్షిణామూర్తి కి చెప్పి చెప్పక అనుమతినిచ్చారు “లూ” గారు. తన విద్యాదాత వారికిష్టమైన, ప్రీతిపాత్రమైన మేలు జాతి శునకరాజముతో సంభాషిస్తునప్పుడే తనకి కూడ సమయం కేటాయించినందుకు దక్షిణామూర్తి కించిత్తు గర్విస్తున్నాడు కూడా!
ఆ రోజు మంగళవారం. ఆ నెలకు అదే ఆఖరి మంగళవారం కూడా. కాగా వచ్చే మొదటి వారాంతం లోపు దక్షిణామూర్తికి జీతం అందే అవకాశం ఉన్నా ఏ బందో, గిందో ఉంటే ఆలస్యం అయ్యే అవకాశాలే ఎక్కువ. కాబట్టి ఉన్న ఆ రెండువందల యాబై రూపాయలతోనే అంత వరకు నెట్టాలి. దక్షిణామూర్తి లాంటి వారు ఆలాంటి నిర్ణయం తీసుకోవడం సులభం కాదు.
దానికి కొనసాగింపే ఈ రోజు ఈ హైపర్ మార్ట్ కి రావడం. పెద్దవాళ్ళ దగ్గిరకి అందులోను “లూ” లాంటి వారి దగ్గిరకి రిక్త హస్తాలతో వెళ్లకూడదని దక్షిణామూర్తి కి తెలుసు. తన తండ్రి ఆచరించి చూపించాడు కూడా. దక్షిణామూర్తి నాన్న పెద్దవాళ్ల దగ్గిరకి వెళ్ళేటప్పుడు తన తాహతుకు తగ్గట్టు రెండో మూడో ఏవో కొన్ని ఫలాలు తీసుకెళ్ళేవాడు. అందులో “లూ” గారి దర్శనార్ధం వెళ్ళేటప్పుడు మరీను. ప్రత్యేకంగా విదేశాలనుంచి దిగుమతి అయిన శ్రేష్టమైన వంగడానికి చెందిన ఫలాలని మాత్రమే కొనుక్కుని తీసుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు దక్షిణామూర్తి అందుకనే ఈ హైపర్ మార్ట్ కి వచ్చాడు.
మరో వారం పది రోజులు ఈ రెండు వందల యాభై రూపాయలతో గడపాలి. అందుకనే రెండు వందరూపాయల మధ్యనున్న ఐదు పదిరూపాయల నోటులలో ఒక నోటుని తీసి సెక్యూరిటి వాడికి ఇచ్చినప్పుడు అతని మనసు ఒక మూలుగు మూలిగింది. జీతం వచ్చిన తరువాత “లూ” గారిని దర్శించుకోవచ్చు గాని అప్పటికే నాలుగు వారాలు అంటే ఒక మాసం గడిచిపోయింది “లూ” గారు అనారోగ్యాని గురై, ఆవార్త తనకి తెలిసీ. పెద్దవారిది పెద్దమనసైనా, తనని “చిన్న మనిషి” అనుకుంటారేమోనని భయం.
ఎలాగన్నా సరే. ఈ బుధవారం వెళ్ళి వారిని దర్శించుకోవాలి. ఈ హైపర్ మార్ట్‌లో అప్లికాయల్ని కొనుక్కుని తీసికెళ్ళి ఇస్తేనేగాని మనసు మనసులో ఉండదు. అందుకే ఈ రోజు ఈ పని పెట్టుకున్నాడు.
సెక్యూరిటి చెక్. డిటెక్టర్ తో పైనుంచి క్రింది దాక స్కాన్ చేసాడు. హోస్టెస్ ప్లాస్టిక్కు నవ్వు నవ్వుతూ ఆ రోజున తమ స్టోరులో అందుబాటులోనున్న ఆఫర్ల గురించి వివరిస్తున్న బ్రోషర్ని అతని ముందుకు సాచింది. తీసుకోవాలా వద్దా ఆన్న సందేహంలో పడ్డాడు దక్షిణామూర్తి. తీసుకుంటే మొహామాటం కొద్ది తనకి అవసరం లేనివి కొనాల్సి వస్తుందేమో! తీసుకోకపోతే ఆమె తనని చిన్నచూపూ చూస్తుందేమోనని. ఆమె చిన్న చూపుని భరించలేనన్న నిర్ణయానికి వచ్చాడు. ఆమె చేతినుండి దానిని అందుకున్నాడు. ఇదంతా క్షణంలో వెయ్యోవంతులో జరిగిపోయింది. అందులో ఉప్పులు, పప్పులు, బట్టల సబ్బులు, కాయగూరల మీద తగ్గింపు ధరలు మాత్రమే ఉన్నవి. వాటిల్లో అతనిని ఆకర్షించినవి, కొనాల్సినవి ఏవి లేవు. బ్రతుకు జీవుడా అనుకుంటూ ముందుకు నడిచాడు.
లోపలికి మరో అడుగు వెయ్యగానే, యూనిఫార్మ్‌లో ఉన్న ఒకమ్మాయి కనపడింది. ఎవరికో కస్టమర్‌కి చేతులూపుతూ ఏదో చెబుతోంది. సేల్స్ గేళ్ అయిఉంటుంది అనుకుంటూ ఆమె వైపుకు వెళ్ళాడు దక్షిణామూర్తి. అతను ఆమెని చేరేటప్పడికి అమె మాట్లాడుతున్న వ్యక్తి వెళ్ళిపొయ్యాడు. పలచటి మొఖం. నుదుట బొట్టులేదు. మెడకి ఏదో బిళ్ల. తాయొత్తో, ఫాషన్ కి గుర్తో దక్షిణాముర్తికి అర్ధంకాలేదు. “అప్లీకాయలెక్కడుంటాయండి” అని ఆమెని అడగడం, “ఆ..”అని ప్రశ్నార్ధకంగా చూసి, “ఓ..ఆపిల్సా..ముందుకి వెళ్ళి లెఫ్ట్‌కి తిరగండి. ఆక్కడ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉంటాయి. అక్‌డ చూడండి” అంటూ చేతులూపుతూ చెప్పింది. ఆమె చేతులూపూతూ చెబుతున్నప్పుడు, భుజంమీద నుండి పైకి జరిగిన షర్ట్ స్లీవు క్రిందనుండి “పిల్లి” బొమ్మ (టాటూ) దక్షిణామూర్తి కళ్ళను తప్పించుకోలేదు. ఇందాక ఆమె మెడకి తగిలించుకుని కనపడింది తాయొత్తు కాదు, ఫేషన్ గా వేసుకుందే అనే నిర్ణయానికి వచ్చేశాడు దక్షిణామూర్తి. విలువలు మారిపోతున్నాయి అని నిట్టూర్చికుంటూ ఆమె చూపించిన వైపుకు సాగాడు దక్షిణామూర్తి.
నలు చదరంగా ఉన్న పెట్టెలలో వరుసగా పేర్చారు పళ్ళని. బత్తాయిలు. గోవాలు. బెర్రీలు. ఇంకేవో పళ్ళు కనపడ్డవి కాని వాటి పేరేంటో తెలియలేదు దక్షిణామూర్తికి. అప్లికాయలు మట్టుకు నిగ నిగా మెరుస్తున్నవి. కొన్ని ఎర్రగా ఉన్నవి, కొన్ని గులాబి రంగులో ఉన్నవి. దక్షిణామూర్తి ముట్టుకుంటే మాసిపోయెలా గా ఉన్నవి. ఒక పెట్టెలో వాటికి మట్టుకు ప్రతి పండుకి ఏదో తొడిగినట్టుంది. సందేహిస్తూ దాన్ని ముట్టుకున్నాడు. మృదువుగా తగిలింది వేళ్లకి. బహుశ పళ్ళు దెబ్బతినకుండా తగిలించి ఉంటారు అనుకున్నాడు దక్షిణామూర్తి. అక్కడే పళ్ళు సర్దుతున్న సేల్స్‌గరళ్ ని ఆ తొడుగు గురించి అడుగుదామని అనుకున్నాడు కాని, తన ని పల్లెటూరు బైతు అనుకుంటుదేమోనని అనుమానించి ఆ ఆలోచన మానుకున్నాడు. వీటి ధర ఎంతో అనుకుంటూ తలేత్తి చూసాడు. కిలోధర 249/- రూపాయలని చిన్న పలక మీద వ్రాసి ఉంది. గులాబి రంగు ధరవి ఎంతో అని చూసాడు. వాటి ధర 199/- కిలోకి. ఎర్రగా ఉన్నవాటి ధర ఎంతోనని చూసాడు. వాటి ధర కిలో 149/- మాత్రమే. ఎన్ని తూగుతయో ఇవి కిలోకి అనుకుంటూ అటూ ఇటూ చూసాడు. పక్కనే ఉన్న మధ్య వయస్కుడు ఆ కిలో 149/- వే ఏరుకుంటున్నాడు. బహుశ ఇంకా పిల్లలు సంపాదనాపరులై ఉండరేమో అనుకున్నాడు దక్షిణామూర్తి. తను చిన్నమనిషైనా, పెద్దవారికి వారికి తగినవే ఇవ్వాలికదా అదే కదా మన సంస్కారం అనుకుని ఆ 249/- రూపాయల ధర ఉన్న ఆప్లీకాయల వంక చూశాడు. ఏరుకుందామా అనుకుంటే అన్ని ఎర్రగా, ఆరోగ్యంగా, సలక్షణంగా, అందంగా డబ్బున్నవారి లాగానే కనబడ్డాయి. డబ్బుతో వచ్చిన సంస్కారం వంతమైన పళ్లలాగానే కనపడ్డవి.
ఇప్పుడు ఎన్ని ఎన్నుకోవాలన్నది సమస్య. మరి ఒకటి ఐతే మాత్రం తను తీసుకోడు. రెండు మరీ తక్కువ. మూడు పళ్ళు బాగానే ఉంటాయ్ కాని డజను పళ్ల ధరని తను భరించలేడు కదా! పది ఐతే? ఇంట్లో ఎంతమంది ఉంటారో. “లూ” గారింట్లో భోజనానికి ఎంతమంది కూర్చుంటారో తనకి తెలియదాయే. ఒక పండుని చేత్తో తీసుకుని బరువుని తూచడానికి చూసినట్టు పైకి కిందకి ఎగరేసి చూసాడు. అబ్బే లాభం లేదు. అతనికి బరువు తెలియలేదు. పర్సులో మిగిలిందేమో 240/- మాత్రమే. ఇప్పుడేం చెయ్యాలో! దాదాపుగా కళ్ళు మూసుకుని చేతికి అందిన మూడు పళ్ళని అందుకున్నాడు. దగ్గిరలో యూనిఫార్మ్‌లో ఉన్న అమ్మాయి దగ్గిరకి వెళ్ళి, “ఈ మూడు అప్లికాయలు ఎంత అవుతాయ్, మేడం?” అని అడిగాడు. తనకన్నా వయస్సులో చిన్నదైనా “మేడం” అని సంబోధించేంత సంస్కారం తనకున్నదని ఆవిడకు తెలియబరచాలిగా మరి. తనేమి చిన్నమనిషి కాడు మరి. ఆ అమ్మాయి ఒక నవ్వు నవ్వింది. నవ్వి అందికదా, “అక్కడ వెయ్ట్ చూసి చెప్తారు సార్” అని అంటూ తనే చొరవగా దక్షిణామూర్తి చేతిలోని పళ్ళని అందుకుంది.
వెయింగ్ స్కేల్ మీద ఆ మూడు పళ్ళని పెట్టింది. ఎర్రని ఎరుపు రంగులో దానికున్న స్క్రీన్ మీద అక్షరాలు వెలిగాయి. దక్షిణామూర్తి కి కనబడి, అతని గుర్తు పట్టినవి అందులో మూడు సంఖ్యలు..230/- దక్షిణామూర్తి మేధ క్షణాలలో లెఖ్ఖల్లో తేల్చేసింది, ఆ మూడు ఆప్లీకాయాలు కొంటే మిగిలిన పది రూపాయలతో మరో వారం గడపాలి అని. ఇక ఆలోచించడానికి వ్యవధి కూడా లేకుండా ఆ యూనిఫార్మ్‌లో ఉన్న అమ్మాయి, అలా వెయింగ్ మెషిన్ మీట నొక్కడం ఏమిటి, ఇలా అక్కడే ఉన్నా ఒక జల్లెడ సంచిని అందుకోవడమేమిటి, ఆ మూడు ఆప్లీకాయలను ఆ సంచీలోకి జారవెయ్యడమేమిటి, ఆ సంచి మెడను అలా చుట్టేయడమేమిటి, ఈ లోపు గర గర అరుస్తూ, ప్రింటర్ నుంచి బయటపడ్డ స్టికర్న్ ఆ సంచి మెడచూట్టు అంటించడమేమిటి, ఆ సంచీని అందులో ఉన్నా మూడు ఎర్రగా, బుర్రగా, ఆరోగ్యంగా, దక్షిణామూర్తి నాన్న నేర్పిన సంస్కారానికి ప్రతీకలైన ఆప్లీకాయలని దక్షిణామూర్తి అప్రయత్నంగా ముందుకి జాపిన చేతిలోకి నెట్టడమేమిటి ఒకదానెమ్మట ఒకటి జరిగిపోయినవి. ఈ లోపు దక్షిణామూర్తి నెత్తిన జుత్తు మధ్యలో మొదలై ప్రయాణం సాగించిన స్వేదబిందువు, మెడమీద నుంచి, అతను ధరించిన షర్ట్ కాలరుని తడపకుండా వీపు కి అంటుకుపోయిన బన్నిలోని రెండు చిరుగులమధ్య నుంచి జారుకుని అతని నడుం మీదకి పాకింది. సరిగ్గా అప్పుడే దక్షిణామూర్తి కొద్దిగా విడివడిన తన పెదవులతో నోరుని మూసేసుకోవడం కేవలం కాకతాళీయం అని చూసిన వారు అనుకోవచ్చు.
ఆ సంచిని అరిచేతిలో పెట్టుకుని జాగ్రత్తగా పట్టుకుని ఎక్జిట్ గేటు దగ్గిరకి రాగానే, ధృడంగా, ఎర్రగా ఉన్న సెక్యూరిటి వాడు “బిల్ల్ సాబ్” అని అడిగాడు. బిల్లు మీద పేయిడ్ స్టాంప్ వేయించుకుని పార్కింగ్ లో ఉన్న తన వాహనం దగ్గిరకి చేరుకున్నాడు. పార్కింగ్ వాడు పళ్ళు ఇకిలించుకుంటూ వచ్చి ఇందాక అతనిచ్చిన రసీదుని అందుకుని వెళ్ళమన్నట్టు కళ్లతోనే సైగ చేసాడు. స్టార్టర్ బటన్ నొక్కి వాహన్నాన్ని నెమ్మదిగా హైపర్‌మార్ట్ నుండి రోడ్డు మీదకి బుధవారం వైపుకి మళ్ళించాడు దక్షిణామూర్తి.
…
ఆరున్నరకే స్నానపానాదులు ముగించుకుని తనకున్న వాటిలో మంచి బట్టలు వేసుకుని గుమ్మం దగ్గిరకు వచ్చి చెప్పులో కాళ్ళు పెట్టబొయేటప్పుడు వాటిని చూసి ఆగిపొయ్యాడు. వాటినిండా అంగుళం మందాన దుమ్మూ, మట్టి. దులిపేసి పాలిష్ చేసే సమయము లేదు. ఏం చెయ్యాలి? ఎడం చేత్తో వాటిని పట్టుకుని స్నానలగదిలోకి వాటిని తీసుకెళ్ళి పంపు తిప్పి ఆ నీటిధారలో జాగ్రత్తగా వాటిని కడిగాడు. ప్లాస్టిక్ చెప్పులే కదా ఫరవాలేదు అనుకుంటూ. దుస్తుల మీద నీళ్ళు పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ చెప్పుల్ని అలాగే జాగ్రత్తగా తీసుకెళ్ళి నీళ్ళు చెదిరిపొయ్యెలా విదిలించిన తరువాత తన స్కూటర్ ఫుట్‌బోర్డ్ మీద పెట్టాడు. గుమ్మం దగ్గిర కాళ్ళు తుడుచుకునే పీచు మీద తన పాదాలని శుభ్రంగా తుడుచుకున్నాడు. పాదాలకు మళ్ళీదుమ్ము అంటకుండా మడమల మీదే అడుగులు ఎత్తేత్తి వేస్తూ వాహనం దగ్గిరకి చేరుకుని కాళ్ళని జాగ్రత్తగా చెప్పులోకి దూర్చాడు. అప్పుడు అనుకున్నాడు..అయ్యో కొంచెం ముందే లేచి చక్రాలు కూడ కడిగేసి ఉంటే బాగుండేది కదాఅని?
“లూ” గారు ఉండేది ఆ నగరంలోని అత్యంత భాగ్యవంతులు నివశించే ప్రాంతం కదా? అటువంటి ప్రాంతంలో ఆ రహదారులలో తను వాడుతున్న డొక్కు వాహనాలు ఉండవు కదా? మరి తన డొక్కు స్కూటర్‌తో, చెత్త ప్రదేశాలలో తిరిగి, ఆ చెత్తనంతా చక్రాలకు తగిలించుకుని ఆ వీధులలో తిరిగితే ఆవి మాసిపోవు?
వీధి మొదట్లనే ఒక బూమ్ బారియర్. దానికొక గార్డు. ఆ గార్డుకొక కాబిన్. “లూ” గారిని చూడటానికి వచ్చానని దక్షిణామూర్తి గార్డ్‌కి తనని పరిచయం చేసుకుంటూ చెప్పాడు. గార్డు, నీ లాంటి దరిద్రనారాయణుడితో “లూ” గారికి పనేముంటుందని అన్నట్టుగా చూసాడు. కెబిన్ గోడకున్న ఫోను తో ఎవరికో ఫోను చేసాడు. బహుశ “లూ” గారింటికేమో అవతలవాళ్ళు సరే అన్నట్టున్నారు. విజిటర్స్ బుక్ లో దక్షిణామూర్తి పేరు, విలాసం, ఫోను నెంబరు, ఎవరిని కలవడానికి వచ్చింది, అది వ్యక్తిగతమా, అధికారికమా, వచ్చిన సమయం, తేది, సంతకం వ్రాయించుకున్నాడు. “లూ” గారి ఇల్లు తెలుసా అని అడిగాడు. ఎందుకైన మంచిదని కాబిన్ బైటకి వచ్చి బారియర్ పోల్ ని పైకి లేపి, దక్షిణామూర్తికి “లూ” గారింటికి చేరడానికి సూచనలు ఇచ్చి వెళ్లమని సంజ్ఞ చేసాడు.
గ్రేట్ డేన్ – ప్రిన్స్
ఆ వీధి చివర ఎడమచేతివైపు ఇల్లు. నడుమెత్తు ప్రహరిగోడ ఐనా ఇల్లు కనపడలేదు. ఇల్లు కనపడకుండా ప్రహరిగోడకి ఆనుకుని అందంగా ఏపుగా పూలతో నిండిన చెట్లు. వాటి మధ్య నుంచి రెండు కళ్ళూ క్రూరంగాను, తీక్షణంగా తనవైపే చూస్తున్నవి. దడుచుకున్నాడు దక్షిణామూర్తి. మూట్టెని ప్రహరిగోడ అంచుమీద ఉంచి చూస్తోంది, చెవులు రిక్కించి వింటోది, ముట్టేతో వాసన పట్టడానికి ప్రయత్నిస్తోంది. దాదాపు అడుగు పొడుగున్న దాని నాలుక, దక్షిణామూర్తి కుడి చేతిలో ఉన్న ఆప్లికాయల్లగానే ఎర్ర్గగా ఉంది. పొట్టిగా ఉన్న తోక ని నిటారుగా నిలబెట్టి ఉద్రేకంగా విసురుగా అటూఇటూ విసురుతోంది. ప్రహరీగోడ అంత ఎత్తున్న మేలుజాతి జాగిలం అది. “ప్రిన్స్, బి యె గుడ్‌బాయ్,” అంటూ ఈ లోపు ఎవరిదో గొంతు వినపడింది. వినడానికా అంటూ చెవులు వెనక్కి కదిలించి “బ్రతికావు ఫో” అంటునట్టుగా ఒక చూపు చూసి, చాలా నిర్లక్షంగా వెనక్కి తిరిగి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయింది. ముచ్చెటమలు పట్టిన దక్షిణామూర్తి జేబురుమాలుతో ముఖం తుడుచుకున్నాడు. కుడి చేతిలో 230/- రూపాయల ఆప్లీకాయలు భద్రంగానే ఉన్నాయి. గేటు దగ్గిరకి వెళ్ళాడు. ఎవరూ లేరు అక్కడ. గేటుని ఎలా తెరవాలో కూడ తెలియకపోయింది దక్షిణామూర్తి కి. కానీ ఈ లోపు “ప్రిన్స్” చేసిన పనిని గుర్తించాడు కాబోలు, ఖాక్కీ నిక్కరు, తెల్లని బన్ని, కాన్వాస్ షూస్ ధరించిన వ్యక్తి బహుశ హేండ్లర్ “లాల్” ఏమో వచ్చి గేటు తెరిచాడు. దక్షిణామూర్తి గేటు దాటాడు. “లూ” గారింటి ప్రహరిలోకి అడుగుపెట్టాడు. ఒకవిధమైన ఒణుకు దక్షిణామూర్తి తల దగ్గిరనుంచి పాదాల వరకు జెర్రిగొడ్డులా పాకి భూమిలోకి వెళ్ళిపోయింది. ఇదంతా ఒక లిప్తలో.
“కమాన్, యంగ్ మాన్” అంటూ వినిపించిన వైపుకు చూసాడు దక్షిణామూర్తి. మల్లెపూవులంత తెల్లగా, స్వచ్చంగా ఉన్న టీ షర్ట్, ఖాఖీ షార్ట్స్, కాళ్ళకి సాక్స్, వాటికి తగ్గ షూస్. అవన్ని కలిపి సుమారుగా ఒక పదివేలు చెయ్యవ్, అనుకోకుండా ఉండలేకపొయ్యాడు దక్షిణామూర్తి. వాటిని ధరించిన “లూ” గారు ఒక బుల్లి మోడా మీద కూర్చుని కనపడ్డారు. మోడా చక్కగా చెక్కిన కొండ రాయి మీద ఉంది. కొండరాయి నలుచదరంగా ఉంది. అలాంటి నలుచదురంగా ఉన్న అనేక కొండరాళ్ళు విశాలంగా పరిచి ఉన్నయి. రాతికి, రాతికి మధ్య అరంగుళంకంటే తక్కువున్న ఖాళీలో అంగుళం మాత్రమే పెరిగిన చిక్కని పచ్చని గడ్డి చక్కగా పెరిగి తమ హద్దులని ప్రకటిస్తున్నాయి. ఆ కొండరాళ్లలోనుంచి అటువైపున వెలిసిన గోడ రంగు చిక్కని గోధుమ రంగు. అందులోనుండి లోపలికి వెళ్ళడానికి పెద్ద ద్వారం. నగిషీలు చెక్కి ఉన్నది. ఒక లక్ష ఖరీదు చెయ్యదూ అని అనుకోకుండా ఉండలేకపొయ్యాడు దక్షిణామూర్తి.
“హల్లో యంగ్ మాన్, హౌ ఆర్‌యూ?” అంటూ పలకరించారు “లూ” దక్షిణామూర్తి ని.
“బాగున్నాను సారు” అని జవాబిచ్చాడు దక్షిణామూర్తి.
“లూ” గారు ఇంకా అటే శునకరాజం వైపే తిరిగిఉన్నారు. ప్రిన్స్ ఆయన ముందు నిలబడి ఉంది. కూర్చున్న “లూ” గారి కంటే ఎత్తుగా ఉంది. దాని మెడకి అరంగుళం మందాన ఉన్న బంగారు రంగు గొలుసుని అటూ ఇటూ తప్పిస్తూ “లూ” గారు తమ కుడిచేత్తో నెమ్మదిగా ఆ మెడని రుద్దుతూ, కండరాలని సర్దుతూ, పామూతున్నారు. ఎడమచేత్తో దాని చెవుల వెనుక మునివేళ్ళతో సుతారంగా గోకుతూ, తలని నిమురుతూ అలా ఉన్నారు. దక్షిణామూర్తికి “లూ” గారి వీపు కనపడుతున్నది. “ప్రిన్స్” అవకాశం ఇస్తే మీదపడి కొరికేద్దామా అని చూస్తున్న కోరచూపులు కనపడుతున్నవి దక్షిణామూర్తికి. లాల్‌కి యోగదృష్టి ఉందేమో! దక్షిణామూర్తి వెనుక నిలబడ్డాడు, ఒక వేళ దక్షిణామూర్తి కోరిక నిజమైతే పారిపోకుండా ఆపుదామన్నట్టు. దక్షిణామూర్తి కుడి చేతిలోని ఆప్లికాయల సంచిని ఎడమ చేతిలోకి మార్చుకున్నాడు. ఎడమకాలు మీద బరువుని కుడి కాలుమీదకి మార్చుకున్నాడు. తలని కాస్త కిందికి వంచాడు.
“లూ” గారు తనవైపు తిరగడం చూడలేదు కాని దక్షిణామూర్తి గ్రహించాడు.
“హవ్స్ యువర్ జాబ్?”
“బాగుందండి”.
“సారు గారు..తమరి ఆరోగ్యం ఎలాగుంది?” అని అడిగాననుకున్నాడు దక్షిణామూర్తి. కాదు అడుగుతున్నాననుకున్నాడు..గొంతు పెగలందే.
ఎడమకాలుమీద బరువుని కుడి కాలుమీదకి మార్చుకున్నాడు.
అప్పుడు గుర్తువచ్చింది. ఎడమచేతిలో ఉన్న ఆప్లీకాయల సంచి.
కుడి చేతిలోకి మార్చుకుని ఆ సంచిని తడబడుతూ మొటుగా “లూ” గారి వైపుకి సాచాడు.
వారికి అర్ధం కాలేదేమో అనుకునేలోపే..వారికి అర్ధం అయ్యి కుడిచేత్తో దాన్ని అందుకున్నారు, చిన్నగా నవ్వుతూ..”యూ అర్ లైక్ యువర్ డాడ్” అంటూ. ఆ సంచిని అలా విసిరెయ్యలేదు. తనముందు నిలబడిఉన్న ప్రిన్స్ ఎడంకాలి పాదానికి ఆరు అంగుళాల దూరంలో ఎడంచేతివైపే పెట్టారు. . దక్షిణామూర్తి మనసు పులకిరించిపోయింది. ప్రభాతసమయంలో నిర్మలమైన వెచ్చని సూర్యుడికిరణాలలో స్నానంచేసినట్టపినించింది. మేను అపాదమస్తకం ఒక్కసారిగా జలదరించింది. మనసులోనే తన తండ్రికి నమస్సులు తెలుపుకున్నాడు. ఆ మహానుభావుడితో పోల్చిన “లూ” గారి వ్యక్తిత్వం తాటిచెట్టుకంటే పొడుగయ్యంది అతని దృష్టిలో.
“వెళ్దామా అయ్యా?” అంటు గొంతు వినిపించినవైపు వెనక్కి తిరిగి చూశాడు దక్షిణామూర్తి. ఎప్పుడు వచ్చాడో గాని, బులుగు రంగు యూనిఫార్మ్‌లో, నల్లగా నిగ నిగలాడుతున్న షూస్ వేసుకుని, వినయం ఉట్టిపడుతూ నిలబడి ఉన్నాడు, “లూ” గారి కారు డ్రైవరు నూకరాజు. పలకరింపుగా నవ్వాడు. దక్షిణామూర్తి. నూకరాజు కూడా అలాగే నవ్వాడు.
“టేక్ ఇట్, నూకరాజు” అంటూ దక్షిణామూర్తి అందించిన ఆప్లీకాయల సంచిని తన కళ్ళతోనే చూపించారు “లూ” గారు. “అయ్యా” అంటూ ముందుకు వంగి రెండుచేతులతోను దానిని అందుకున్నాడు. ముడి విప్పి ఆ సంచిలోపలి నున్న మూడు ఆప్లీకాయలను బయటకు తీసాడు. “మూడున్నయ్ అయ్యా” అని చెప్పాడు. “యూ టేకి వన్” అన్నారు “లూ” గారు.
“గ్యివ్ వన్ టు లాల్” అని మళ్ళీ అన్నారు. ఒకటి తను తీసుకుని, రెండవది “లాల్” కి అందించాడు కృష్ణ.
“సో దేరిజ్ ఒన్‌మోర్ లెఫ్ట్, ఇజిట్? గ్యివ్ ఇట్టు వెంకి” అన్నారు “లూ” గారు.
వెంకి అని పిలవబడుతున్న వెంకయ్య “లూ” గారి తోటమాలి.
“లెట్స్ మీట్ అగైన్ సం టైమ్ లేటర్ మై బాయ్” అంటూలేచి ముందుకు సాగారు “లూ” గారు, ప్రిన్స్ వారి పాదాలవెమ్మట వారి అడుగులో అడుగువేసుకుంటూ కదిలింది. ముందు డైవర్ నూకరాజు, వెనుక “లూ” గారు, వారి వెనక వారి అద్భుతమైన మేలిమి వంగడానికి చెందిన శునకరాజము ‘ప్రిన్స్”, వరుసలో ఆఖరువాడి గా లాల్, ది డాగ్ హేండ్లర్. వారందరితోపాటే “లూ” గారి సంస్కారమున్ను.
తరతరాలుగా, ఒక తరం నుంచి మరోతరాన్ని అందుకుంటూ వచ్చిన “సంస్కారం”తో పునీతుడైన దక్షిణామూర్తి భూమిలోకి పాతేసిన విగ్రహంలాగా అక్కడే నిలబడిపొయ్యాడు. అతనితో పాటే అతని తండ్రినుంచి నేర్చుకున్న సంస్కారమూను.
Image Courtesy:
“Gt. Dane, Lucy” by Fainomenon – Own work. Licensed under Creative Commons Attribution-Share Alike 3.0 via Wikimedia Commons – http://commons.wikimedia.org/wiki/File:Gt._Dane,_Lucy.JPG#mediaviewer/File:Gt._Dane,_Lucy.JPG