ఇలా అర్ధాంతరంగా వెళ్ళి పోతే ఎలా?

రాంకీ గారి మాటలతో సభ మొదలైనది.

ఎన్ వేణుగోపాల రావు,  వీక్షణం సంపాదకుడు , సభకు అధ్యకత వహించారు.  63 ఏళ్ళకే రోహిణి ప్రసాద్ గారి ఆకస్మిక నిష్క్రమణ విచారం కలిగిస్తున్నది. ఆయన ఒక అణు విజ్ఞాన శాస్త్రవేత్త. కాని తన ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త చూపించలేదేమోనని అభిప్రాయపడ్డారు.

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ సంస్మరణ సభ
వేదిక మీద వక్తలు: ఎడమ నుండి కుడికి
దివికుమార్ (ప్రజాసాహితి), నటుడు కాకరాల, ఎన్. వేణుగోపాల రావు, సభకు అధ్యక్షుడు..(సంపాదకుడు వీక్షణం మాస పత్రిక), వరవర రావు (సృజన సంపాదకుదు, విరసం సభ్యుడు) గీతా రామస్వామి ( హైద్రాబాద్ బూక్ ట్రస్ట్ సభ్యురాలు)

దివికుమార్, ప్రజాసాహితి.
“నేను టెలిఫోను డిపార్ట్‌మెంట్ వాడిని కనుక ఎవరితోనైనా మాట్లాడడానికి అవకాశం ఉండేది. అలాగే రోహిణి ప్రసాద్ గారితో నా మొదటి పరిచయం. వారు విజయవాడ వచ్చినప్పుడు వారి చెబితే కాని తెలియలేదు చందమామలో వారి తండ్రిగారి సమకాలీకులు దాసరి సుబ్రహ్మణ్యం గారు అని.  ఉద్యోగ విరమణాంతరం విజయవాడలోనే ఉంటున్నారని.అలాగ దాసరి గారిని కలవడానికి రోహిణి  ప్రసాద్ గారు కారణం.

రోహిణీ ప్రసాద్ గారు హైద్రాబాద్ వచ్చిన తరువాత తరచూ కలుస్తూ ఉండే వారం.  ‘మీరు వ్రాయాలి.  ఈ దిన పత్రికలలో కూడా మీ వ్యాసాలు అచ్చులో చూడాలి’ అని అనేవారు ఆయన.   ‘నా పేరు కనపడితేనే వెయ్యటం లేదండి’, అని అన్నప్పుడు, ‘మరో పేరుతో వ్రాసి పంపండి..ఏదో కలం పేరు పెట్టి పంపేయ్యండి’ అని అన్నారు.  ఆ పనే చేసాను.  విజ్ఞానాన్ని పది మందికి పంచాలి అన్నది రోహిణీ ప్రసాద్ గారి ప్రధానమైన ఆశయంగా ఉండేది.

కోపం వచ్చింది!
గీత రామస్వామి – హైద్రాబాద్ బుక్ ట్రస్ట్
”  ఆయన చాలా అర్ధాంతరంగా వెళ్ళిపొయ్యారు.  హైద్రాబాదు బుక్ ట్రస్ట్ తరఫున వారివి ఒక మూడు పుస్తకాలు ప్రచురించాము.  మరి కొన్ని పుస్తకాలకి ప్రణాళికలు కూడా వేసుకున్నాము.  కాని ఇలా వెళ్ళి పోతారని ఊహించనైనా ఊహించలేదు.

వారిలో ఒక గొప్ప సుగుణం ఉంది.  అది తెలుగులో వ్రాసేటప్పుడు తెలుగులో ఆలోచించేవారు.  ఇంగ్లిష్‌లో వ్రాసేటప్పుడు ఇంగ్లిష్‌లో వ్రాసేవారు.  అందుకనే వారి సైన్సు వ్యాసాలు సరళమైన తెలుగు లో అందరికి అర్ధమయ్యేవిధంగా ఉండేవి.  ఇప్పుడు ఆ వ్యాసాలు ఆ పుస్తకాలని ఏం చెయ్యాలి అన్నది ఆలోచించి చెయ్యవలసిఉంది. “

గోగినేని బాబు
“ఆయన మీద ఒక హీరో వర్షిప్ ఉండేది నాకు.
“పది మంది ఉంటే చాలు.  మనం కార్యక్రమం చెయ్యాలి. మన పిల్లలకి సైంటిఫిక్ టెంపర్  ఉండాలి. రావాలి. కావాలి.  ఈ మూఢ నమ్మకాలు కాదు. వీరిని చైతన్యవంతులని చెయ్యాలంటే మనం ముందుండి వారికి తెలియజెయ్యాలి. మీరు కార్యక్రమాలు చేపట్టండి.  నా ఖర్చులతో నేను వస్తాను’ అని అనేవారు.  ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతారని ఊహించలేదు. ఇక్కడందరితో పాటు నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను”, అని గోగినేని బాబు అన్నారు.

కాకరాల
” నిజానికి నాకు రోహిణి ప్రసాద్ గారితో పరిచయం చాల తక్కువ.  కుటుంబరావుగారి కుటుంబంతో ఎక్కువ. కాని కుటుంబరావు గారితో ఇంకా చాలా ఎక్కువ.  కాబట్టి రోహిణో ప్రసాద్ గారితో నాది గొప్ప పరిచయం కాదు.

ఇదేమిటి ఈ మనషి ఇలా మాట్లాడేస్తాడు.  ఇలా ఉరుకులు, పరుగులు పెట్టేస్తున్నాడు ఈయన.  వారి తండ్రిగారు కుటుంబ రావు గారు. నాలుగైదు దశాబ్దాల పాటు వ్రాసింది, ఈయన అంతకంటే త్వరలో ముగించేటట్టు ఉన్నాడు.  ఇదేదో ఆమెరికా జీవన సరళిని ఈయన  ఇక్కడ కూడా నడిపిస్తున్నట్టున్నాడు, కాని అది సరి కాదు అని అనుకునే వాడిని. అది ఆయన బ్రతికుండగా వున్న అభిప్రాయం.

Kakarala sharing his experiences with Rohini Prasad
నటుడు కాకరాల రోహిణీ ప్రసాద్‌తో తన అనుభవాలాను పంచుకుంటూ..

ఐనా వారు హైద్రాబాదు వచ్చిన తరువాతే వారితో పరిచయం పెరిగింది.  వారి జీవితంలోని వేగం, వారు పోయిన తరువాత అర్ధం అయ్యింది. తండ్రి గారి లాగే ఒక ప్రణాళిక ప్రకారం వారు తన జీవితాన్ని, తన రచనా వ్యాసంగాన్నీ, తన సాహిత్య ప్రస్థానాన్ని, తన సంగీతానికి ఒక గమ్యాన్ని నిర్దేశించుకున్నారు.  బహుశ వారికి తెలిసే ఉంటుంది ..వెళ్ళే లోపు చెయవలసిన పనులు చాల ఉన్నవి, అవన్నీ కూడా ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని.

వారి తల్లి గారికి కూడా ఫో‌న్ చేసి చెప్పాను. అమ్మా రోహిణీ ప్రసాద్ గారి గురించి నా అభిప్రాయం మార్చుకున్నాను.  ఆయన ఎన్నుకున్న దారే సరైనది.  మీరుకూడా మీ అభిప్రాయాన్ని మార్చుకోవాలి అని కోరుకుంటున్నాను అని చెప్పాను”.

వరవర రావు
“సంగీతం గురించి నాకు అసలు తెలియదు. కానీ రోహిణి ప్రసాద్ సితార్ వాయిద్యం వినాలని పిలిచినప్పుడు వారి ఇంటికి వెళ్ళాను. బహశ అదేనేమో నేను సంగీతం కోసం ఒకరి ఇంటికి వెళ్ళి వినడం.
విరసం సభ్యుడు, వరవర రావు, సృజన సంపాదకుదు
వైజాగ్‌లో శ్రీశ్రీ  షష్టి పూర్తికి మేము మొదటి సారి కలిసాము.  కొ కు, చలసాని ప్రసాద్ రోహిణి ప్రసాద్ మరికొందరు మిత్రులు అక్కడ కలిసాము.  ఆ సభకి ఒక ప్రత్యేకత ఉంది.  విరసం ఆవిర్భావినికి అక్కడే కదా జరిగింది. ఆ నేపధ్యం లో ఆలోచిస్తే రోహిణి ప్రసాద్ చెయ్యవలసింది ఇంకా చాల ఉన్నా..ఇలా వెళ్ళిపోవడం చింతించవలసిన సందర్భమే.  వారిని గురించి నేను ఒక వ్యాసం ఆంధ్రజ్యోతి లో వ్రాసాను.  గడగడా మాట్లాడుతాడు అని.  ఆయన నొచ్చుకున్నాడేమో తెలీయదు కాని ఇప్పుడు అనిపిస్తున్నది అలా రాయాల్సింది కాదేమోనని.  ఆయన అలా మాట్లాడక పోతే పదిమందికి ఆయన అభిప్రాయాలు తెలియపరిచగలిగే వారు కాదు.

వారి పుస్తకానికి నన్ను ముందు మాట కూడ వ్రాయమని అడిగారు.  రాసాను.  అవి సైన్సు వ్యాసాలు. నాకు సైన్స్ గురించి కూడా పెద్ద తెలియదు.  తన పుస్తకం కాబట్టి చదివి కొంత సైన్స్ గురించి తెలుసుకుంటానన్న ఉద్దేశం తో నన్ను ఆయన రాయమని ఉంటాడు అని అనుకుంటున్నాను. ఆయనది ఒక ఆకస్మిక నిష్క్రమణ. చింతించవలసిన విషయం కూడా!”

Kodavati Ganti Rohini Prasad
Kodavati Ganti Rohini Prasad

** ఒక రచయిత చనిపోయినప్పుడు ప్రచురణ కర్తలు ముందుకు వచ్చి ఇలాంటి సభని ఏర్ఫాటు చెయ్యడం హర్షించ దగ్గ విషయం.  కాకరాల గారు వక్తగా వేదికనెక్కితే చాలా ఆవేశంగా మాట్లాడేవారు.  ఈ సభలో ఇదివరకున్న ఆవేశం లేదు.

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

మరో తరం వెళ్ళిపోవడం మొదలయ్యింది.

మద్రాసులో బాల్యంలో మా నాన్న గారితో వారింటికి వెళ్ళడం కుటుంబరావు గారు, నాన్న గారు సాహిత్యం, రాజకీయం మీద చర్చోపచర్చలు కబుర్లు చెప్పుకుంటూవుంటే ప్రసాద్ గారితో ఏదో కాలక్షేపం చెయ్యడం లీలగా గుర్తుంది.

వారి సాహిత్యం గురించి, వారి సంగీతం గురించి, వారి శాస్త్రీయ రచనల గురించి నా కంటే వివరంగా చెప్పేవాళ్ళూ, విశదీకరించే వారున్నారు కాబట్టి నేను వాటి జోలికి వెళ్లడం లేదు.

దాసరి సుబ్రహ్మణ్యం గారు ఒకరోజు సాయంత్రం  ప్రసాద్‌గారిని తీసుకునివచ్చి “మిమ్మల్నీ కలవడానికి వచ్చాడు’,  అని మా అమ్మకి పరిచయం చెయ్యడం నుంచి బాగా గుర్తు ఉంది. అప్పటికి ఆయన అమెరికాలోనే ఉన్నారు. దాదాపు ఒక గంట ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్న తరువాత..ఇంకేదో పనిమీద వెళ్ళిపొయ్యారు.  చాలా సీదాసాదాగా, సరదగా నవ్వుతూ ఉండేవారు.Kodavati Ganti Rohini Prasad

మా నాన్నగారిని బాగా అభిమానించేవారు. వారి రచనలన్నింటిని ఈ తరానికి పరిచయం చెయ్యాలని అంటూ ఉండేవారు.
I still remember his cheerful presence in our house and how badly my father took his untimely demise.
I feel your father’s excellent works should be reintroduced to today’s generation. If you have no objection you can get them posted in pranahita.org or prajakala.org and poddu.net. with introductory remarks. In case you are not familiar with typing in Unicode etc I can tell you.”

ఆ మధ్య డెట్రాయిట్‌లో త్రిపురనేని గోపిచంద్ జ్ఞాపకార్ధం జరిగిన సాహితీ సభలలో కూడా త్రిపురనేని సాయిచంద్ ని కలిసినప్పుడు:
In the Detroit meeting I requested Saichand to say a few words about Pitcheswara Rao garu after the discussion on Gopichand garu“, అని చెప్పాను అని కూడా అన్నారు.

అలాగే దాసరి సుబ్రహ్మణ్యం గారి స్మృత్యర్ధం విజయవాడ సభకి వెడుతున్నాను., అనగానే వారిమీద వ్రాసిన వ్యాసాన్ని పంపుతూ “మీరు అక్కడే ఎవరితోనైనా చదివించి వినిపించండి, ప్లీజ్“, అంటు కోరారు.  ప్రజాసాహితి రవిబాబు గారు ఆ సభలో దానిని చదివి వినిపించారు.
స్నేహాశీలి..చిన్నా పెద్దా తారతమ్యం లేదు. అందరితోను కలివిడిగా ఉండేవారు.  చేతనైన సహాయం చేసేవారు.

తరచూ ఈమైల్స్ తో పలకరించే వారు.

నా బాల్యం – సాహిత్యం – మద్రాసుకి ఒన్న మరో గుర్తు కాలగర్భంలో కి జారిపోయింది.

వారి బ్లాగులు:
http://rohiniprasadk.blogspot.in/
http://rohiniprasadkscience.blogspot.in/
కినిగెలో వారి పుస్తకాలు ఇక్కడ:
http://kinige.com/kbrowse.php?via=author&name=Kodavatiganti+Rohini+Prasad&id=122