సినిమా చూడటానికి ఎడ్ల బళ్ళు కట్టుకుని వెళ్ళిన వాళ్ళున్నారు. వైజాగ్ నుంచి మద్రాసుకి ఒకరాత్రంతా ప్రయాణం చేసి వచ్చి సినిమా చూపించమని నన్ను వేధించుకుని తిని సినిమా చూసి అటునుంఛి అటే సెంట్రల్ స్టేషన్లో పొగబండికి రిజర్వేషన్ కూడా నాతో చేయించుకుని వెళ్ళిపోయినవారున్నారు.
అటువంటి అవకాశం లేని వారికి అప్పట్లో ఆకాశవాణి వారి సంక్షిప్త శబ్ద చిత్రాలే గతి. ఒకటికి పది సార్లు చూడటానికి అవకాశం లేని వారు, ఎన్టీవోడి డవిలాగు, ఏ ఎన్ ఆర్ ఎస్వీఆర్ డవిలాగు కాకుండా అసలు కథ ని ఓల్మొత్తం అర్ధం చేసుకోవడానికి, చదివి చూడలేని తోటివారికి చదివి వినిపించడానికి వెండితెర నవలలు భలే పనిచేసేవి. అంతే కాకుండా ఆ వెండి తెర నవల ద్వారా తమ సినిమాలకి కొంత అదనపు ఆకర్షణ ని కూడ తెచ్చుకోవడానికి వాటిని వాడుకున్నారు ఆనాటి చలనచిత్ర నిర్మాతలు, పంపిణీదారులు.
తెలుగు లో వెండితెరనవలకు ఆద్యులు అట్లూరి పిచ్చేశ్వర రావు (12th April 1925 – 26th Sept 1966). వారి తొలి తెలుగు ప్రక్రియ కి తెరతీసినది గౌతమ బుద్ధ లఘుచిత్రం. ఆ బాటనే పయనించినవారు రామచందర్, ముళ్ళపూడి వెంకటరమణ, రావి కొండలరావు, నేటి చలన చిత్ర దర్శకులు వంశీ తదితరులు.
వెండితెర నవలల మీద TV 5 ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తమ “Favorite Five” శీర్షికన ప్రసారం చేసింది. సుమారు పదిహేను నిముషాలు నిడివి ఉన్న ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు.