పబ్లిక్కుగా బాగానే జరిగింది..ఐనా

ఏదో వెలితి.

తలిశెట్టి రామారావు గారి పేరు విన్నారా?
లేదా?

The first Telugu Cartoonist Talisetty Ramarao

ఆ మహాను భావుడే తొలి తెలుగు వ్యంగ చిత్రకారుడు (అంటే కార్టూనిస్ట్) అని తెలుగు వ్యంగ చిత్రకారులు నిర్ణయించేసారు.  పబ్లిక్కుగానే.  ప్రసార మాధ్యమాలకి ప్రకటనలు, పత్రికలలో వ్రాతలు వగైరా అన్ని ఐపోయినవి. ఆయనే తొలి తెలుగు వ్యంగ చిత్రకారుడు అని వూరుకున్నారా?  లేదు.  ఆయన పుట్టిన మే 20వ తారీఖుని తెలుగు కార్టూనిష్టుల దినోత్సవం గా కూడా నిర్ణయించేసారు.  పబ్లిక్కుగానే.  అలా అనేసి వూరుకున్నారా?  లేదు. ప్రకటించేసారు! ఎలా? పబ్లిక్కుగానే.  ప్రసారమాధ్యమాల వారందరూ కూడ తమ తమ శ్రోతలకి, పాఠకులకి, వీక్షకులకి, ఇతరులకి ఆ వార్తని బట్వాడా చేసేసారు.  ప్లబిక్కుగానే ఇదంతా!

పైగా ఈ తెలుగు ఈ వ్యంగ చిత్రకారులందరూ కలిసి, ఆయన..ఎవరూ? ఆ తొలి తెలుగు వ్యంగ చిత్రకారుడి పేరు మీద ఒక “తలిశెట్టి రామారావు అవార్డు కార్టూన్‌ ల పోటి” ని కూడా ఘనంగా నిర్వహించారు.  పబ్లిక్కుగానే నండీ!  బహుమతులిచ్చారు ఆ పోటీలలో. పబ్లిక్కు గానే!  ఎవరు ఇచ్చారండి బహుమతులు. తనికెళ్ల భరణి..చలనచిత్ర వ్యంగ నటుడు (అందామా)!  ఎక్కడ? భాగ్యనగరం లోనే!ఎప్పుడూ?  ఆ తేదినే!  మే 20వ తారీఖునే!! అది కూడ పబ్లిక్కుగానే.  పబ్లికే కదండీ నేను, అందుకనే హాజరయ్యానండి, దానికి కూడా!

Tanekella Bharani, MVR Sastry, Sanku on dais and Sudhama at the podium

అయ్యా అది ఐపోయింది.

మొన్న అంటే, 28 న మొదలుబెట్టి, 29, 30 న కూడ మన కార్టూనిష్టు మిత్రులు కార్టూనోత్సవ్ పబ్లిక్కుగా,పబ్లిక్కుకి అందుబాటులో ఉండే పబ్లిక్ గార్డెన్స్‌లో జరుపుకున్నారు.నరేంద్ర లూథర్ గారు, పొత్తూరి వేంకటేశ్వరావు గారు, మరి కె.వి రమణా చారి గారు లాంటి  పెద్దల సమక్షంలో 30 వ తారిఖున తమ పెద్దలని ఘనంగా సన్మానించుకున్నారు. పబ్లిక్కు గానే నండోయి!

Cartoonotsav 2012, held between 28th and 30th October, 2012 at Public Gardens, Hyderabad.

అందులో ఒక కొత్త ప్రతిపాదన చేసారు.  పబ్క్లిక్ గానే నండి.  అదేమిటంటే, తమకి గురుతుల్యులైన మరో పెద్ద “కార్టూనిష్టు”  పుట్టిన రోజుని తెలుగు కార్టూనిష్టుల దినోత్సవంగా పరిగణించాలని.  వారు ఎంచుకున్న “కార్టూనిష్టు” గారి గురించి ఏ ఒక్కరికి అభ్యంతరంలేదు. వారికి జరగవలసిన సన్మానాలు, పురస్కారాలు భవిష్యత్తు లో చేయవలసిని కార్యక్రమాలు చాలానే ఉంటవి. అటువంటి సందర్భంలో ఇటువంటి “ప్రతిపాదన” ఎంత వరకు సమంజసమన్నదే ప్రశ్న!  పైగా ఆ “గురువు” గారికి అసలు ఈ విషయం తెలుసా అన్న సందేహం కూడా కలుగుతుంది. తెలిసుంటే వారు సున్నితంగా తిరస్కరించే మనస్తత్వమున్నవారే అని కూడా నా బోటి వారి అభిప్రాయం.    ఆ “గురువు” గారే తన “గురువు” గా భావించే మరొ “పెద్ద గురువు” గారు హటాత్తుగా ఆ సభకి వచ్చివుంటే, అప్పుడు గౌరవం వారికే దక్కేదేమో?! పబ్లిక్కుగా అన్నా, అనకపోయీనా నిన్న “కార్టూనోత్సవ్” కి హాజరైన కొంతమంది మిత్రులు ప్రైవేటుగా నాతో తమ అభిప్రాయాన్ని వెల్లడి చేసుకున్నారు.

ఒకరికి తగిలించిన కిరీటాన్ని లాక్కుని మరొకరిని దానిని ధరింపజెయ్యబూనడం ఎంత వరకు సమంజసం?

అందులోను  పబ్లిక్కుగా!

తలిశెట్టి వ్యంగ చిత్రాలు ఇక్కడ కినిగె.కాం లో