అన్వర్ కి ధాంక్స్‌తో..

ఆదివారం.  మార్చ్ 2, 2014. మళ్ళీ SMS.  ఆర్టిస్ట్ మోహన్ గారి పిలుపు.  మనవాళ్లందరూ వస్తున్నారు.  మీరు కూడా రావాలి.  మన శేఖర్ కి మనం చెయ్యాలి! సందర్భం శేఖర్ కార్టూనిస్ట్‌గా గోల్డెన్ జూబిలి సెలబ్రేషన్.

శేఖర్ కార్టూనిస్ట్ గా నే పరిచయం అయ్యాడు  ఆంధ్రజ్యోతి లో.  కె.పి డెస్క్ పక్కనే.  కె.పి ని దాటుకుని శేఖర్ డెస్క్‌కి వెళ్ళాలి.  ఆ పక్కనే వసంతలక్ష్మి గారి డెస్క్.

కినిగె కి తన కార్టూన్ పుస్తకాన్ని ఇచ్చిన తొలి కార్టూనిస్టు శేఖర్.  అదొక అభిమానం.  తరువాత ఎప్పుడో ఒకసారి నా మీద కోపగించుకున్నాడు కూడా!  “నాకు మీరు పిచ్చేశ్వరరావు గారి అబ్బాయని ఎందుకు చెప్పలేదు.  ఆయనంటే మా తరానికి ఎంత ఇష్టమో, మీకు తెలియదు. అటువంటి వాళ్ళు అంత త్వరగా వెళ్ళిపోవాడనికి హడావుడి ఏమిటో?” అనుకున్నడు స్వగతంగా.

అమెరికా సంయుక్త రాష్ట్రాలకి వెళ్లబోయేముందు, వెళ్ళి వచ్చిన తరువాత తన పుస్తకాన్ని డిజిటల్ బుక్‌గా ఎలా డిజైన్‌చేస్తే బాగుంటుందో అని కలిసినప్పుడు మాట్లాడుకునేవాళ్ళం.  కలవనప్పుడు ఫోన్ చేసేవాడు.  ఫోనులో “తింటున్నాన్నా?” అని అడిగి నవ్వేవాడు.

“సార్, మీ ఇంటికి దగ్గిర్లోకి మారుతున్నాను. మనం ఇక రోజు కలుసుకోవచ్చు.  బహుశ నేనే మీ ఇంటికి వస్తాను.  కలిసి టీ తాగోచ్చు,” అని ఎంతో సంతోషంగా నవ్వుతూ చెప్పినప్పుడు ఆనందమేసింది.

తరువాత ఎప్పుడో తెలిసింది..ఆరోగ్యం బాగోలేదని.  ఇంటికి వెళ్ళి పలకరించాలని అనుకునేటప్పడికి ఇల్లు మారడం కూడా ఐపోయింది.

Cartoonist Chandrasekher
Cartoonist Chandrasekher (Jul 16, 1965 – 19 May 2014)

ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ ‌క్లబ్‌లో అతని కోసం చూసాను.  కొంచెం ఆలస్యం అయ్యింది నేను వెళ్ళేటప్పటికి.  మనిషి కనబడలేదు.  వెతుకున్నాను.  కాప్..నోటికి మాస్క్ అడ్డం ఉంది.  ఆ మాస్క్ పైన కళ్ళు. నవ్వు.  ఉగ్గబట్టుకున్న ఆనందం.  సంతోషం.  ప్రెస్‌క్లబ్ నిండిపోయింది.  కాని మనిషిని చూసిన నేను ఖంగు తిన్నాను.  నాకు తెలిసిన శేఖర్ రూపు కాదది.  మనిషి మొఖంలో విపరీతమైన అలసట. సగం అయిపొయ్యాడు.  ఎందుకో ఉండబుద్ది కాలేదక్కడ.  తనతో మాట్లాడడానికి తగిన ప్రదేశమూ కాదు..సందర్భమూ కాదు.  ఈ లోపు ఒకటికి రెండు సార్లు ఫోను చేసిన అన్వర్, sms లు గుప్పించిన ఇతర మిత్రులని పలకరించాను.

హడావుడిగా పరిచయుస్థుడొకాయన వచ్చాడు.  పక్కనే శ్రీమతి అనుకుంటాను.  పేద్ద పూలమాల.  ఒక పుష్ఫగుచ్చం.  హడావుడి హడావుడిగా వేదిక దగ్గిరకు దాదాపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపొయ్యారు.  ఆఖరి చూపు.  పార్ధివ శరీరాన్ని పుష్పమాలంకృతాన్ని చెయ్యాలన్న తాపత్రయం కనపడింది ఆ వేగంలో, ఆ మాటల్లో, ఆ గమనంలో.  విరక్తి పుట్టింది.

విజయవాడలో “మో” హాస్పిటల్‌లో ఉంటే..”సార్,  ఐపోయ్యిందా?  డిక్లేర్ చేసేద్దామా”?   అని స్ట్రింగర్స్ శ్రీ శ్రీ విశ్వేశ్వరావు గారిని పీక్కు తిన్న వైనం గుర్తోచ్చింది.  మనసు రోసింది. అసహ్యం వేసింది. రోత పుట్టింది.

వెళ్ళిపోదామని వెనక్కి తిరుగుతుంటే..అన్వర్ ఎదురువచ్చాడు.  “సార్, వెళ్ళిపోతున్నారా?” అంటూ. ఔనన్నట్టుగా తలూపూతూ గేటు వైపుకి కదులుతుంటే..”వుండండి సార్..రెండు మాటలు మాట్లాడి వెళ్లండి”  అని అన్నాడు.  వాళ్ళ మధ్య నేనేమి మాట్లాడుతాను అనుకుంటూ నిలబడిపొయ్యాను.  “ఉండండి సార్.  ఒక్క రెండు మాటలు మాట్లాడండి.  తనుకూడా వింటాడు కదా?”అని అన్నాడు. ఇక ఆ మాటకు తిరుగులేదు.  సరే అని ఆగి పొయ్యాను.

ఈ లోపు మాట్లాడేవాళ్ళున్నారు.  వాళ్ళ తరువాత..అన్వర్ నాకు మైకు ఇప్పించాడు.  శేఖర్ వెనకకి చేరుకున్నాను.  శేఖర్ భుజం మీద చెయ్యి వేసాను.  శేఖర్ నా ముఖంలోకి చూసాడు.  మా ఇద్దరి కళ్ళు కలిసినవి.  He knows.  He knew, I knew. He also knew that my heart is with him. I wished him all the best with all my heart.  I expressed my good wishes to all his frineds for supporting him at that time. లేచి నిలబడ్డాడు.  కౌగలించుకున్నాడు.  That was the parting embrace. I knew.

మైక్ ఆర్టిస్టు మోహన్ గారికిచ్చాను.  అన్వర్ కి థాంక్స్ చెప్పాను.  వచ్చేసాను.

మా అమ్మ పోయినప్పుడు చలసాని ప్రసాదరావు గారు రాలేదు.  దానికి ఆయన చెప్పిన కారణం.  “నాకు మీ అమ్మ చక్కగా సంతోషం గా నవ్వుతూ ఉన్నప్పుడు చూసిన జ్ఞాపకం.  నాకు అదే గుర్తుంచుకోవాలని ఉంది” అని.
చంద్రశేఖర్ విషయం లో నాది అదే ఉద్దేశం. అందుకే కొడుకు పెళ్ళికి వెళ్ళలేక పొయ్యాను.  ఈ రోజు వెళ్ళడం లేదు.  ఫోటో కూడ తను నవ్వుతున్నదే పెట్టాను.

ఆ రోజున అన్వర్ నన్ను గుర్తుపెట్టుకుని పిలవకపొతే..నాకు శేఖర్ చిరు దరహసం అందేది కాదు.

గుడ్‌బై శేఖర్.  You are a good friend.  I shall remember your smile.  Always.

ఇది వ్యాపారం కాదు.  నేను ఇప్పుడు కినిగె లో లేను కూడా!  శేఖర్ పుస్తకాలు ఇవి కొన్ని అని చెప్పడానికి మాత్రమే:  http://kinige.com/author/Shekar

ఇలా అర్ధాంతరంగా వెళ్ళి పోతే ఎలా?

రాంకీ గారి మాటలతో సభ మొదలైనది.

ఎన్ వేణుగోపాల రావు,  వీక్షణం సంపాదకుడు , సభకు అధ్యకత వహించారు.  63 ఏళ్ళకే రోహిణి ప్రసాద్ గారి ఆకస్మిక నిష్క్రమణ విచారం కలిగిస్తున్నది. ఆయన ఒక అణు విజ్ఞాన శాస్త్రవేత్త. కాని తన ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త చూపించలేదేమోనని అభిప్రాయపడ్డారు.

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ సంస్మరణ సభ
వేదిక మీద వక్తలు: ఎడమ నుండి కుడికి
దివికుమార్ (ప్రజాసాహితి), నటుడు కాకరాల, ఎన్. వేణుగోపాల రావు, సభకు అధ్యక్షుడు..(సంపాదకుడు వీక్షణం మాస పత్రిక), వరవర రావు (సృజన సంపాదకుదు, విరసం సభ్యుడు) గీతా రామస్వామి ( హైద్రాబాద్ బూక్ ట్రస్ట్ సభ్యురాలు)

దివికుమార్, ప్రజాసాహితి.
“నేను టెలిఫోను డిపార్ట్‌మెంట్ వాడిని కనుక ఎవరితోనైనా మాట్లాడడానికి అవకాశం ఉండేది. అలాగే రోహిణి ప్రసాద్ గారితో నా మొదటి పరిచయం. వారు విజయవాడ వచ్చినప్పుడు వారి చెబితే కాని తెలియలేదు చందమామలో వారి తండ్రిగారి సమకాలీకులు దాసరి సుబ్రహ్మణ్యం గారు అని.  ఉద్యోగ విరమణాంతరం విజయవాడలోనే ఉంటున్నారని.అలాగ దాసరి గారిని కలవడానికి రోహిణి  ప్రసాద్ గారు కారణం.

రోహిణీ ప్రసాద్ గారు హైద్రాబాద్ వచ్చిన తరువాత తరచూ కలుస్తూ ఉండే వారం.  ‘మీరు వ్రాయాలి.  ఈ దిన పత్రికలలో కూడా మీ వ్యాసాలు అచ్చులో చూడాలి’ అని అనేవారు ఆయన.   ‘నా పేరు కనపడితేనే వెయ్యటం లేదండి’, అని అన్నప్పుడు, ‘మరో పేరుతో వ్రాసి పంపండి..ఏదో కలం పేరు పెట్టి పంపేయ్యండి’ అని అన్నారు.  ఆ పనే చేసాను.  విజ్ఞానాన్ని పది మందికి పంచాలి అన్నది రోహిణీ ప్రసాద్ గారి ప్రధానమైన ఆశయంగా ఉండేది.

కోపం వచ్చింది!
గీత రామస్వామి – హైద్రాబాద్ బుక్ ట్రస్ట్
”  ఆయన చాలా అర్ధాంతరంగా వెళ్ళిపొయ్యారు.  హైద్రాబాదు బుక్ ట్రస్ట్ తరఫున వారివి ఒక మూడు పుస్తకాలు ప్రచురించాము.  మరి కొన్ని పుస్తకాలకి ప్రణాళికలు కూడా వేసుకున్నాము.  కాని ఇలా వెళ్ళి పోతారని ఊహించనైనా ఊహించలేదు.

వారిలో ఒక గొప్ప సుగుణం ఉంది.  అది తెలుగులో వ్రాసేటప్పుడు తెలుగులో ఆలోచించేవారు.  ఇంగ్లిష్‌లో వ్రాసేటప్పుడు ఇంగ్లిష్‌లో వ్రాసేవారు.  అందుకనే వారి సైన్సు వ్యాసాలు సరళమైన తెలుగు లో అందరికి అర్ధమయ్యేవిధంగా ఉండేవి.  ఇప్పుడు ఆ వ్యాసాలు ఆ పుస్తకాలని ఏం చెయ్యాలి అన్నది ఆలోచించి చెయ్యవలసిఉంది. “

గోగినేని బాబు
“ఆయన మీద ఒక హీరో వర్షిప్ ఉండేది నాకు.
“పది మంది ఉంటే చాలు.  మనం కార్యక్రమం చెయ్యాలి. మన పిల్లలకి సైంటిఫిక్ టెంపర్  ఉండాలి. రావాలి. కావాలి.  ఈ మూఢ నమ్మకాలు కాదు. వీరిని చైతన్యవంతులని చెయ్యాలంటే మనం ముందుండి వారికి తెలియజెయ్యాలి. మీరు కార్యక్రమాలు చేపట్టండి.  నా ఖర్చులతో నేను వస్తాను’ అని అనేవారు.  ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతారని ఊహించలేదు. ఇక్కడందరితో పాటు నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను”, అని గోగినేని బాబు అన్నారు.

కాకరాల
” నిజానికి నాకు రోహిణి ప్రసాద్ గారితో పరిచయం చాల తక్కువ.  కుటుంబరావుగారి కుటుంబంతో ఎక్కువ. కాని కుటుంబరావు గారితో ఇంకా చాలా ఎక్కువ.  కాబట్టి రోహిణో ప్రసాద్ గారితో నాది గొప్ప పరిచయం కాదు.

ఇదేమిటి ఈ మనషి ఇలా మాట్లాడేస్తాడు.  ఇలా ఉరుకులు, పరుగులు పెట్టేస్తున్నాడు ఈయన.  వారి తండ్రిగారు కుటుంబ రావు గారు. నాలుగైదు దశాబ్దాల పాటు వ్రాసింది, ఈయన అంతకంటే త్వరలో ముగించేటట్టు ఉన్నాడు.  ఇదేదో ఆమెరికా జీవన సరళిని ఈయన  ఇక్కడ కూడా నడిపిస్తున్నట్టున్నాడు, కాని అది సరి కాదు అని అనుకునే వాడిని. అది ఆయన బ్రతికుండగా వున్న అభిప్రాయం.

Kakarala sharing his experiences with Rohini Prasad
నటుడు కాకరాల రోహిణీ ప్రసాద్‌తో తన అనుభవాలాను పంచుకుంటూ..

ఐనా వారు హైద్రాబాదు వచ్చిన తరువాతే వారితో పరిచయం పెరిగింది.  వారి జీవితంలోని వేగం, వారు పోయిన తరువాత అర్ధం అయ్యింది. తండ్రి గారి లాగే ఒక ప్రణాళిక ప్రకారం వారు తన జీవితాన్ని, తన రచనా వ్యాసంగాన్నీ, తన సాహిత్య ప్రస్థానాన్ని, తన సంగీతానికి ఒక గమ్యాన్ని నిర్దేశించుకున్నారు.  బహుశ వారికి తెలిసే ఉంటుంది ..వెళ్ళే లోపు చెయవలసిన పనులు చాల ఉన్నవి, అవన్నీ కూడా ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని.

వారి తల్లి గారికి కూడా ఫో‌న్ చేసి చెప్పాను. అమ్మా రోహిణీ ప్రసాద్ గారి గురించి నా అభిప్రాయం మార్చుకున్నాను.  ఆయన ఎన్నుకున్న దారే సరైనది.  మీరుకూడా మీ అభిప్రాయాన్ని మార్చుకోవాలి అని కోరుకుంటున్నాను అని చెప్పాను”.

వరవర రావు
“సంగీతం గురించి నాకు అసలు తెలియదు. కానీ రోహిణి ప్రసాద్ సితార్ వాయిద్యం వినాలని పిలిచినప్పుడు వారి ఇంటికి వెళ్ళాను. బహశ అదేనేమో నేను సంగీతం కోసం ఒకరి ఇంటికి వెళ్ళి వినడం.
విరసం సభ్యుడు, వరవర రావు, సృజన సంపాదకుదు
వైజాగ్‌లో శ్రీశ్రీ  షష్టి పూర్తికి మేము మొదటి సారి కలిసాము.  కొ కు, చలసాని ప్రసాద్ రోహిణి ప్రసాద్ మరికొందరు మిత్రులు అక్కడ కలిసాము.  ఆ సభకి ఒక ప్రత్యేకత ఉంది.  విరసం ఆవిర్భావినికి అక్కడే కదా జరిగింది. ఆ నేపధ్యం లో ఆలోచిస్తే రోహిణి ప్రసాద్ చెయ్యవలసింది ఇంకా చాల ఉన్నా..ఇలా వెళ్ళిపోవడం చింతించవలసిన సందర్భమే.  వారిని గురించి నేను ఒక వ్యాసం ఆంధ్రజ్యోతి లో వ్రాసాను.  గడగడా మాట్లాడుతాడు అని.  ఆయన నొచ్చుకున్నాడేమో తెలీయదు కాని ఇప్పుడు అనిపిస్తున్నది అలా రాయాల్సింది కాదేమోనని.  ఆయన అలా మాట్లాడక పోతే పదిమందికి ఆయన అభిప్రాయాలు తెలియపరిచగలిగే వారు కాదు.

వారి పుస్తకానికి నన్ను ముందు మాట కూడ వ్రాయమని అడిగారు.  రాసాను.  అవి సైన్సు వ్యాసాలు. నాకు సైన్స్ గురించి కూడా పెద్ద తెలియదు.  తన పుస్తకం కాబట్టి చదివి కొంత సైన్స్ గురించి తెలుసుకుంటానన్న ఉద్దేశం తో నన్ను ఆయన రాయమని ఉంటాడు అని అనుకుంటున్నాను. ఆయనది ఒక ఆకస్మిక నిష్క్రమణ. చింతించవలసిన విషయం కూడా!”

Kodavati Ganti Rohini Prasad
Kodavati Ganti Rohini Prasad

** ఒక రచయిత చనిపోయినప్పుడు ప్రచురణ కర్తలు ముందుకు వచ్చి ఇలాంటి సభని ఏర్ఫాటు చెయ్యడం హర్షించ దగ్గ విషయం.  కాకరాల గారు వక్తగా వేదికనెక్కితే చాలా ఆవేశంగా మాట్లాడేవారు.  ఈ సభలో ఇదివరకున్న ఆవేశం లేదు.