మునగ చెట్టు

మునగచెట్టు

చూసాను.
చాలామందిని చూసాను.
అతి దగ్గిరగా చూసాను.
ఎక్కించిన వాళ్లను చూసాను.
పైకి ఎగదోసి మరి ఎక్కించిన వారిని చూసాను.
చిటారు కొమ్మదాక ఎక్కిన వారిని చూసాను.

ఎక్కిన వారిని చూసాను.
ఎక్కి కళ్ళు మూసుకుని పోయి గుడ్డివాళ్ళైపోయిన వారిని చూసాను.
పైనుంచి క్రిందపడ్డ వారిని చూసాను.
దబ్బున పడ్డ వారిని చూసాను.
కాళ్ళు చేతులు విరిగిన వారిని చూశాను.
నడుములు పడిపోయి జీవితాంతం మంచాలకే బంది ఐపోయిన వాళ్ళని చూసాను.
పడిన వాళ్ళకి అసరాగా ఎవరూ నిలబడని పరిస్థితులని కూడా చూసాను.
వాళ్ళు ఒంటరిగా దుర్భరమైన జీవితాన్ని గడిపి కాల గర్భంలో కలిసిపోయిన వైనాన్ని గమనించాను.

మునగ చెట్టు
మునగ చెట్టు

ఇంకా చెప్పాలంటే మునగ చెట్టుకి మిగతా చెట్లకి ఉన్న తేడా కూడా తెలుసుకున్నాను.
దేవదారు వృక్షాలకి, మామిడి చెట్లకి, పూల పొదలకి,  గడ్డిపోచలకి మధ్య ఉన్న సారూప్యాలను కూడా తెలుసుకున్నాను.

పైవేవి నేను స్వయంగా అనుభవించి తెలుసుకోలేదు.
జీవితం నాకు నేర్పిన పాఠాలు అవి.
నేను మంచి విద్యార్ధిని అని నా నమ్మకం.

కరెంటు షాక్ కొడుతుందని ముట్టుకుని తెలుసుకోనఖర్లేదు.
నిప్పు ముట్టుకుంటే కాలుతుందని కూడ దానిని ముట్టుకుని తెలుసుకోన‌ఖర్లేదు.

అలాగే మునగ చెట్టు ఎక్కి కింద పడి అనుభవం పొందనఖర్లేని ఒక జీవితం నాకు దొరికింది.
అటువంటి జీవితం నాకు ప్రసాదించిన జ్ఞానం అది.
కాబట్టి నన్ను మునగచెట్టు ఎక్కించడానికి ప్రయత్నించవద్దు.
భంగ పడి మీరు అవమానాల ఊబి లో కూరుకుపోవద్దు.
చక్కగా మీ జీవితాన్ని,  హుందాగా, ఆత్మగౌరవంతోను,  ఆనందంగాను, సుఖసంతోషాలతో గడపండి.
దయచేసి నన్ను మునగచెట్టు ఎక్కించడానికి ప్రయత్నించొద్దు!
అది మీవల్ల కాదు కదా..మీమ్మల్ని పుట్టించిన ఆ బాబు వల్ల కూడా కాదు!!