నా చిన్నప్పుడు సెలవులకి మా ఊరు వెళ్ళాను. బహుశ ఉహ తెలిసిన తరువాత అదే అనుకుంటా మొదటి సారి నేను వెళ్ళడం. మహానగరం నుండి కుగ్రామానికి వెళ్ళడం కదా, బంధువులందరూ చాలా జాగ్రత్తగా, ప్రేమతో
చూసుకునేవారు. ఏదో పండగ వచ్చింది. సంక్రాంతి అనుకుంట. మా మావయ్య నాకు అప్పుడు ఒక జత బట్టలు కొన్నాడు. ఆ ఊళ్ళో బట్టల కొట్టు లేదండి! నాలుగు మైళ్ళు (mile) అవతల ఉన్న ఊళ్ళో ఒక దుకాణంలో మా మావయ్యకి ఖాతా ఉండేది. ఆది కోసం నావి ఒక జత బట్టలు తీసుకుని ఒక ఉదయం పూట బయలుదేరి నాలుగు మైళ్ళూ నడుచుకుంటూ ఆ ఊరు వెళ్ళాడు. ఆ కొట్టులో టైలర్ (Tailor) దగ్గిరే బట్టలు కుట్టించడం. పాపం మా మావయ్య! మళ్ళీ సాయంత్రం అయ్యింది, వెనక్కి వచ్చేటప్పడికి. ఒక వారంలో వచ్చినవి లెండి ఆ బట్టలు. టెర్లిన్ (Terylene) షర్ట్ ( చొక్క, అంగి), టెర్లిన్ నిక్కర్ (knickers = లాగు, మొకాలు దాటని పంట్లాము). అవి వేసుకుంటే గాలి అడేది కాదు. చమట పట్టినప్పుడు ఒంటికి అతుక్కుని పొయ్యేవి ఆ బట్టలు. చాలా చిరాకు వేసేది. కాని వాళ్ళు ప్రేమతో కుట్టించినవి కదా! అందుకని భరించేవాడిని. అదొక అనుభవం.
తరువాతి రోజులలో టెర్రి కాటన్ (Terry cotton) గుడ్డ అందుబాటులోకి వచ్చింది. అవి బాగానే ఉండేవి. ఆ బట్టలు కూడా టైలర్ కి ఇచ్చి కుట్టించుకోవడమే. మంచి టైలర్ కోసం వెతుక్కుంటూ బట్టలు కుట్టించుకోవడాఅనికి ఊళ్ళూ తిరిగే వారు. అప్పటి ఆంధ్ర ప్రదేశ్ లో, హీరో ఎన్.టి.ఆర్ కి కాస్ట్యూమ్ (Costumes) డిజైన్ చేసిన యాక్స్ (Yax) టైలర్స్ ఒక వెలుగు వెలిగారు. యాక్స్ టైలర్స్ బ్రాంచెస్ ఉండేవి. అంత గొప్పగా నడిచింది వాళ్ళ వ్యాపారం.
తరువాత రెడి మెడ్ దుస్తులు ఊపందుకున్నవి. గురు షర్ట్లు, చీజ్ కాటన్ (cheese cotton) షర్ట్స్ వచ్చినవి. వాటితో పాటు డెనిం (denim)పాంట్స్ (pants). 1980 ఆ ప్రాంతల్లో చెన్నై, ఢిల్లీ, ముంబై మహానగరాలలో పేవ్మెంట్ మీద గుట్టలుగా పోసి అమ్మేవారు. కావల్సినవి ఏరుకుని కొనుక్కునేవాళ్ళం. మనకి ఇక టైలర్స్తో పని తగ్గింది. అన్ని రెడి మేడ్స్. కుమార్ షర్ట్ ఒకవైపు, చెర్మాస్ ఒకవైపు మొదలయ్యారు. పది రూపాయలకి షర్ట్. పాతిక రూపాయలకి పాంట్. అప్పటికి ఇంకా ఐ.టి (IT, Information Technology) ఉద్యోగాల జోరు మొదలవ్వ లేదు. కాబట్టి ఎంతో కొంత తక్కువ ధరలో కొనుక్కునేవారు సామాన్య ప్రజానీకం.
జెన్ట్స్ (gents) టైలర్స్ కి ప్రాముఖ్యత బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా యువతకి. రెడిమేడ్లో అన్ని దొరికేస్తున్నవి. కావల్సిన రంగులు, డిజైన్లు, కావల్సిన బట్ట, ఖరీదుకి తగ్గ నాణ్యత. ఈ రోజున స్త్రీలు కూడా అదే దోవన వెడుతున్నారు తమ దుస్తుల ఎంపిక విషయంలో. 🙂
ఉద్యోగాలు అంతే! ఒకప్పుడు ఉద్యోగం కావాలనుకుంటే, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ (employment exchange) కి వెళ్ళాలి. ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుని సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ఆ రోజుల్లో ఉద్యోగం లో చేరితే, దాదాపు జీవితాంతం అదే సంస్థ లో చెయ్యడం అదే సంస్థ లో రిటైర్ (retire) అవ్వడం. ప్రైవేట్ (private) సంస్థలైతే టైపిస్ట్ (typist)తో అప్ప్లికేషన్ (application) టైప్ (type)చేయించుకోవడం, అప్లై (apply) చేసుకోవడం. రికమండేషన్ (recommendation) కోసం వెతుక్కోవడం.
ఒకప్పుడు మంచి టైలర్ కోసం వెతుక్కునేవాళ్ళు. ఈ రోజున ఒక మంచి రెడిమేడ్ (ready made) బట్టల షాప్ (shop) కోసం వెతుక్కుంటున్నారు. మంచి బ్రాండ్ (brand) కోసం వెతుక్కుంటున్నారు. మీకు కావల్సిన రంగు, డిజైన్ (design), సైజ్ (size)లలో బట్టలు లభ్యం అవుతున్నవి. ఇవి కాక డిజైనర్ లెబిల్స్ (designer labels) ఉండనే ఉన్నవి. జేబులో డబ్బుండాలే కాని పాతికవేలకి ఒక పాంటు (pant)కొనుక్కోవచ్చు. లక్ష రూపాయలకి ఒక చీర కొనుక్కోవచ్చు.
ఈ రోజు చదువులు అంతే! ఉద్యోగాల కోసం చదవడమే! ఏడవ తరగతి నుండి ఐ.ఐ.టి (I I T)కి కోచింగ్ (coaching). మంచి ఉద్యోగాలు. షర్ట్లు మార్చినంత సులభంగా ఉద్యోగాలు మారడం. ఆదాయం కొద్ది బ్రాండెడ్ డ్రెస్లు (branded dress). ఉద్యోగాలు అంతే! టెర్లిన్ ఉద్యోగాలు. ఆ రోజుల్లో ఇష్టం ఉన్నా లేకున్నా చెయ్యడమే! ఒకప్పుడు టైపిస్ట్ లేని ఆఫీసుండేది కాదు. తరువాత ఎలక్ట్రిక్ టైప్రైటర్ (Electric Typewriter), ఎలక్ట్రానిక్ టైప్రైటర్గా (Electronic Typewriter) రూపాంతరం చెందింది. ఈ రోజు మీరే ఒక టైపిస్ట్ ఐపొయ్యారు. కంప్యూటర్ మీద. టైపు చెయ్యకుండా కుదరదు. ఈ రోజున వంట పాత్రలకి కళాయి వేసేవారు కనపడుతున్నారా మీకు? లేని ఉద్యోగం కోసం వెతికితే లాభం ఏమిటి? ఉన్న ఉద్యోగాల గురించి ఆలోచించాలి గాని. మితృడు కృష్ణప్రసాద్ అంటున్నట్టు, జీవనానికి ఉద్యోగాలు లేవు అనడం సబబు కాదు. ఉద్యోగాలున్నవి. మనం చెయ్యగలమా, లేదా అన్నదే ప్రశ్న!
మరి ఆ ఉద్యోగాలేక్కడున్నవా?
మళ్ళీ టపాలో చెబుతా!