నాకు గుర్తున్న బాలు మహేంద్ర ఈ క్రింది బొమ్మలో ఉన్నట్టు ఉండేవాడు.అప్పటికే మూండ్రాం పిరై విడుదలై పోయింది. సఫైర్ కాంప్లెక్స్ లోని ఎమరాల్డ్ లో చూసాను ఆ సినిమాని. సెకండ్ షో. తరువాత సత్యం ధియేటర్స్‌లో చూసాను. శివం లో అనుకుంటాను. తెలుగు సినిమాలలో కెమరా ఒకటి ఉంది, దానితో సినిమాని మనకి చూపించేవాడు కెమరమెన్ అని తెలియజేసిన అద్బుతమైన కెమరామెన్ వి ఎస్ ఆర్ స్వామి అని అనుకునేవాళ్లం నేను నా స్నేహితులం. అలాగే తమిళ సినిమాలకి బాలు.
కూర్చుని ఏదో చదువుకుంటున్నాను. నీడ, తరువాత అలికిడి. చదువుతున్న పుస్తకంలోనుండి తలెత్తి చూస్తే పొడుగ్గా ..నాకంటే ఎత్తు.. అదిగో ఆ బొమ్మలో లాగా ఆలివ్ గ్రీన్ కాప్ తో బాలు. నవ్వుతూ. మామూలుగా సినిమా రంగం వాళ్ళతో వాళ్ల సినిమా గురించి పబ్లిక్ గా ప్రస్తావించేవాడిని కాదు. ఆ రోజున మేమిద్దరమే ఉన్నాం. “మూండ్రాం పిరై బాగుంది. మీ కెమరా అద్భుతం”, అని అన్నాను. చిరునవ్వు తో సమాధానమిచ్చాడాయన. “నేను కూడా చాలా హాపి. అందరికి నచ్చింది. నాకూ నచ్చింది” అన్నాడాయన. తెలుగులో అదే “వసంత కోకిల” గా విడుదలైనది.
ఒక రెండు నిముషాలు అవి ఇవి మాట్లాడుకున్న తరువాత.. “తెలుగు లో గొప్ప సాహిత్యం ఉందంట కదా? ఏమైన మంచి పుస్తకాలు సజెస్ట్ చెయ్యండి అన్నాడాయన. “మీకు తెలుగు చదవడం వచ్చా?” అని ఆశ్చర్యంగా అడిగాను. “ఏం తెలుగు చదవడం నాకు రాకపోతే ఏం? ఎవరితోనైనా చదివించుకుంటానుగా!” అని అన్నాడాయన”.
అలా తెలుగు సాహిత్యం తో ఆయనకి పరిచయం. తెలుగు సాహిత్యం ద్వారా నాకు పరిచయం. ఆయన సినిమాలు అన్ని చూసాను. గొప్ప కెమెరామెన్. నిన్న #pepperspray కథ లేకుండా ఉంటే..బహుశ మన మిడియా వాళ్ళూ ఆయన క్లిప్‌లతో మోత మోగించేవారనుకుంటా!
ఏమైనా మరో మంచి కళాకారుడు వెళ్ళిపొయ్యాడు.