మీ టూ

స్క్రీన్ బీ – త్రీ లోకి ప్రవేశించాడు జిష్ణు.  షో అయిపోయినట్టుంది.  ఖాళీగా ఉంది థియేటర్.  తనకి దగ్గిర్లో కిందపడిఉన్న ఖాళీ ‘లేస్’ కవర్‌ని తీసేస్తున్న క్లీనింగ్ స్టాఫ్‌ని ఉద్దేశించి “నెక్స్ట్ షోకి ఇంకా ఎంత టైముంది?” అని అతను అడిగితే “టెన్ మినిట్స్” అని జవాబిచ్చింది ఆమె.  అతను “థాంక్స్” అని గొణుగుతూ వెనక్కి తిరిగి ఫోయర్‌ ( థిఏటర్ ఆవరణ) లోకి నెమ్మదిగా అడుగులేస్తూ వెళ్ళాడు.

డోర్స్‌కి రెండువైపులా గోడలకి ఆనించి పొడుగ్గా సోఫాసెట్‌లు ఉన్నవి.  వాటికి ఎదురుగా ఫోయర్‌లోనే అక్కడక్కడ డిస్‌ప్లే విండోస్.  వాటితో పాటే రిలీజ్ కాబొయ్యే కొత్త సినిమాల పోస్టర్లు, ఫొటో కార్డ్‌లు.

కుడి చేతివైపు సోఫాలో, ఆ చివర గోడకి ఆనుకుని ఒక యువతి కూర్చునుంది. ఆమె కాళ్ళు తన ముందున్న యువకుడి ఒడిలో ఉన్నాయి.  వాళ్ళు తమదైన మరో ప్రపంచంలో ఉన్నారు.

జిష్ణు చిరాకుగా ఎడం వైపుకి తల తిప్పాడు.

ఎడం చేతి వైపు సోఫా వరుసలో అటు చివరగా ఒంటరిగా కూర్చుని ఉన్నాడు అతను.  లౌడ్ కలర్స్ తో ఉన్న చెక్‌డ్ షర్ట్.  స్లిమ్ ఫిట్ డార్క్ బ్లూ కలర్ జీన్స్‌‌లోకి టక్ చేసుకున్నాడు.  లెదర్ బెల్ట్ కొంచెం బిగించినట్టున్నాడు.  అయినా పొట్ట బెల్ట్ మీదుగా కొంచెం కిందకి జారి కనపడుతున్నది.  కుడి కాలు తొడ మీద, ఎడం కాలేసుకుని కూర్చున్నతను కాస్త తీక్షణంగాను ప్రపంచాన్ని మరిచిపోయి మరీ చూస్తున్నాడు. రెప్పవెయ్యకుండా.  అతను చూస్తున్నవైపే జిష్ణు తన దృష్టిని జారించాడు.

అక్కడ చూడ ముచ్చటగా ఉన్న జంట.  వారితో పాటు ఒక బాబు కూడా ఉన్నాడు.  ఏడెమినిదేళ్ళుండవచ్చు. కొంచెం ఊరిన బుగ్గలతో, ఎర్ర్రని పెదాలతో, నిగ నిగ లాడుతూ ఆరోగ్యంగా ఉన్నాడు.    బ్లేజింగ్ రెడ్ కలర్ టీ.  కొంచెం  టైట్‌గానే ఉన్నట్టుంది.  ఛాతికి అతుకున్నట్టు ఉంది.  అది వైట్ కలర్ షార్ట్స్ లోకి టక్ఇన్ చేసుంది.  షార్ట్స్ కూడా టైట్‌గా ఉన్నట్టున్నాయి.  పిర్రలకి అతుక్కుని లోపలి అండర్‌వేర్ కూడా కనపడి కనపడకుండా కనపడుతోంది.   బొద్దుగా, క్యూట్‌గా కూడా  ఉన్నాడు.     ఆ పక్కనే ఉన్న ‘జస్టిస్ లీగ్’ సినిమా పోస్టర్ వాడిని ఆకర్షించినట్టుంది.  3డి సినిమా పోస్టర్ అది.  వాడు అటు తిరిగి దాని దగ్గిరకు వెళ్ళాడు.  ఈ లోపు ఆ బాబుతో ఉన్న ఆమె తనతో ఉన్నతనితో డ్రింక్స్‌కో, ఈటబుల్స్‌కో ఆర్డర్ ఇవ్వమన్నట్టుంది.  అతను ఆ ఫోయర్‌లో కుడి చేతి వైపున్న స్టాల్స్ వైపు వెళ్ళాడు.

బాబు పోస్టర్‌ని చూస్తున్నాడు.  రెప్ప మూసి తెరిచేటప్పడికి,  బ్లూజీన్స్ వ్యక్తి బాబు పక్కనే నిలబడి పోస్టర్‌ని చూస్తూ కనపడ్డాడు.   బాబు వైపు తిరిగి ఏదో అన్నాడు.  వాడు నవ్వుతూ తల అడ్డంగా తిప్పాడు.  అతను బాబు వెనక్కి వెళ్ళాడు.  వాడి భుజాల మీద తన చేతులు వేసాడు.   బాబు పక్కనే ఉన్న మరో పోస్టర్‌ దగ్గిరకి వెళ్ళాడు.  అతను వాడి భుజాలమీద చేతులు తియ్యలేదు.  అలాగే వాడి వెనకే నిలబడి బాబు అడుగులో అడుగువేస్తూ ఫాలో అయ్యాడు.  ఇప్పుడు బాబు వెనక్కి ఆనుకుని నడుస్తున్నాడు.  బాబు ఎడమ భుజం విదిలించుకున్నాడు. బ్లూ జీన్స్ వాడి భుజాలని వదలలేదు.   ఇప్పుడు పూర్తిగా బాబు వెనుకభాగాన్ని బ్లూ జీన్స్ శరీరం ఆక్రమించేసింది. వాళ్ళిదరి మధ్య ఏ మాత్రం ఖాళీ లేదు.

ఇందాక బాబుతో ఉన్నామె ఇప్పుడు మరో పోస్టర్‌ని చూస్తోంది.  ఆమెతో వచ్చినతను ఇంకా స్టాల్స్ దగ్గిరే ఉన్నాడు.  బాబుని వాళ్ళిద్దరు పట్టించుకున్నట్టు లేరు.

జిష్ణు  చూపు ఇప్పుడు ఫోయర్‌లో ఎడం చేతివైపుకి మళ్ళింది.  అక్కడున్న ఆ అమ్మాయి ఎదురుగుండా వాల్ డిస్‌ప్లే లో వస్తున్న సినిమా ట్రైలర్ ని చూడడంలో నిమగ్నమై ఉంది.

బ్లూజీన్స్ ఇంకా బాబుని వెనకనుండి గట్టిగా  హత్తుకున్నట్టే  ఉన్నాడు.  బాబు భుజాలు విదిలిస్తున్నాడు.    అతని చేతులు వాడి భుజాల మీద బిగుతుగానే ఉన్నాయి.  బాబు అసహనంగా కదులుతున్నాడు.

డోర్స్ దగ్గిరున్న జిష్ణు వాళ్ళిద్దరి వైపు కదిలాడు.

బాబు ఈ సారి గట్టిగా విదుల్చుకున్నాడు.  బ్లూజీన్సతని  చేతులు వాడి భుజం మీద నుంచి జారిపోయినవి.  బాబు  దాదాపుగా పరిగెత్తుకుంటూ ఆ స్త్రీ దగ్గిరకి వెళ్లిపోయి నడుం చుట్టూ చేతులు వేసేసి మొహాన్ని ఆమె వొడిలోకి దూర్చేసాడు.

జిష్ణు బయలుదేరిన చోటే ఆగిపొయ్యాడు.

బాబు భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి.  ఆమె ముందుకి వంగి బాబుకి మాత్రమే వినపడేటట్టుగా ఏదో అడిగింది.  బాబు తల విసురుగా  విదిలిస్తున్నాడు.  బాబు భుజాలు పట్టుకున్న ఆమె కిందకి మోకాళ్ళమీదకి వంగి బాబుని సముదాయిస్తూ  మాట్లాడుతోంది.    బాబు తల పైకెత్తకుండా ఏదో చెబుతున్నాడు.  ఆమె తల తిప్పి అటు ఇటు చూసింది.   మళ్ళీ వాడి గెడ్డం పట్టుకుని తలని కొంచెం ఎత్తి వాడి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. ఈ సారి వాడి కళ్ళనిండా నీళ్ళు.  బుగ్గలమీద చారికలు కనపడ్డాయి జిష్ణుకి. వాడు కళ్ళు అటు ఇటు తిప్పి ఆ బ్లూ జీన్స్  వ్యక్తి వైపు సారించి ఆవిడతో ఏదో చెప్పాడు.

సరిగ్గా అప్పుడే స్టాల్స్ దగ్గిరున్నతను వెనుతిరిగాడు.

విసురుగా ఆమె లేచి నిలబడి బాబు కుడి చెయ్యి మణికట్టు దగ్గిరపట్టుకుని దాదాపుగా లాక్కుని వెళ్తున్నట్టు, బ్లూజీన్సతని వైపుకి బయలు దేరింది.  స్టాల్ దగ్గిర నుండి వెనక్కు తిరిగినతను ఆమె హడావుడిని  గమనించి అనుసరించాడు.

ఫోయర్‌కి ఎడం చేతివైపున్న (‘మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్’) సినిమా వాల్ పోస్టర్‌ని చూస్తోంది, ఇందాక జిష్ణు చూసిన ఆ అమ్మాయి. పన్నెండు పదమూడేళ్లు ఉంటాయేమో!  వైట్  హెయిర్ బాండ్  కింద నుంచి నల్లని పొడుగాటి జుత్తు, భుజాల  మీదుగా వీపు మీదకి జారుతోంది.  టాప్ టైట్‌గా ఉంది. వికసిస్తున్న (రానున్న)  టీన్స్‌ని దాచలేక పోతోంది ఆ టాప్.  రెడ్ కలర్ బెల్ట్ ఉన్న బ్లూ కలర్ జీన్స్‌కి  ఆ టాప్‌కి మధ్య మెరుస్తూ కనపడుతున్న నడుం. రివెటెడ్ బటన్స్‌తో ఉన్న హిప్ హగ్గింగ్  జీన్స్ అవి!

బ్లూ కలర్ జీన్సతని  దృష్టి ఆ అమ్మాయి మీద పడినట్టుంది.  నెమ్మదిగా ఆ అమ్మాయి పక్కకి చేరుకున్నాడు.  నవ్వుతూ ఆ అమ్మాయితో ఏదో అంటూ చనువుగా ఆమె ఎడం భుజం మీద తన ఎడం  చెయ్యి వేసాడు.

జిష్ణు దృష్టిలో పడిందది.  జిష్ణు దూకుడుగా వాళ్ళిదరి వైపుకి అడుగులు వేసాడు.

ఫెటేలన్న మోతతో  ఆ ఫోయర్ దద్దరిల్లింది.  ఒక్కసారిగా   అందరు ఉలికి పడ్డారు.  అప్పటికే బ్లూజీన్సతని  దగ్గిరకి బాబు, ఆమె,  అతనూ చేరారు. జిష్ణు కూడా.

జిష్ణుని చూడగానే ఒక్క గెంతులో అతని పక్కకి చేరి అతని కుడి చేతిని పెనవేసుకుంది ఆ వైట్ టాప్, బ్లూజీన్స్ అమ్మాయి, “మామయ్యా!”  అంటూ ఏడుపు గొంతుతో. తన ఎడం చేత్తో ఆ అమ్మాయిని దగ్గిరకు తీసుకున్నాడు జిష్ణు.

ఎర్రగా కందిపోయిన ఎడమ చెంపని  రుద్దుకుంటూ బ్లూజీన్స్ అక్కడి నుంచి పరుగువేగంతో  ఫోయర్ లోని లిఫ్ట్ కోసం కూడా ఆగకుండా, మెట్ల మీదుగా దూకుతూ కిందకి  వెళ్లిపోయ్యాడు.  బాబుతో ఉన్నావిడ ఆవేశంతో రొప్పుతోంది.  ఆతను  ఆమెను చూస్తూ నిలబడిపొయ్యాడు.  కళ్ళు నులుముకుంటున్నాడు బాబు.


Footnote
దాదాపు ఐదేళ్ళక్రితం ఖదీర్‌బాబు, కె సురేశ్ , తాము 2018 నిర్వహించిన రైటర్స్‌మీట్‌లో పాల్గొన్న వారు రాసిన కథలను, కొత్తకథ 2018 మకుటంతో వెలువరించిన సంకలనంలో ప్రచురించిన కథ ఈ #మీటు. సంకలనంలో వచ్చిన కథలని కనీసం రెండు సంవత్సరాలు బయట ఎక్కడ ప్రచురించరాదని వారి సూచనని మన్నించి ఇప్పటివరకు దీనిని ప్రచురించలేదు. కథలలో సత్తా వుంటే పాఠకులు గుర్తుపెట్టుకుని, వెతుక్కుని మరీ చదువుతారనే బలమైన అభిప్రాయం మరొక కారణం. వెతుక్కోవడానికి ముందు వుండాలిగా అందుకని ఈ అంతర్జాలంలో ఈ బ్లాగులో...
౨ - ఈ కథ పూర్వాపరాలకు చెందిన మరికొంత అదనపు సమాచారం ఈ లంకె లో చదువుకోవచ్చు.  
౩ - దిగువనున్నది కొత్తకథ2018 సంకలనాన్ని, 13 మే 12018 ఉదయం, తెలుగు విశ్వవిద్యాలయం, భాగ్యనగరంలో ఆవిష్కరించిన సందర్భలో, నా హితోభిలాషి, కవి దేవిప్రియగారి నుండి ప్రతి అందుకుంటున్నప్పటిది.

కొత్త కథ 2018 ప్రతులు ఇక్కడ దొరుకుతాయిః
ధర రూ 149.00 మాత్రమే (24 కథలు)
♣ నవోదయ బుక్ హౌజ్
3-3-865,Opp Arya Samaj mandir, Kachiguda,Hyderabad, Pin Code: 500027,
Telangana,India. Mob:+91-9000413413, Office:040-24652387
Email:[email protected]
Web: www.TeluguBooks.in

A short Poster for the sort story mee too
#మీ టూ కధకి సోషల్ మీడియా కోసం మహీ తయారుచేసిన కార్డ్

భలేగా దొరికాడు!

క్లాసు పుస్తకాలు, నోటుబుక్కులు, హోం వర్కులు చేస్తూ కనబడ్డవాడేకాని చేతిలో చందమామ, బాలమిత్ర లాంటి పుస్తకాలతో చూసిన గుర్తు లేదు. (చదివే ఉంటాడు, చదవకుండా ఎలా!) ఇద్దరమూ, మిగతా మిత్రులతో కలిసి, గోళీలు ఆడుకున్నాం. బిళ్లం గోడు కూడా అడుకున్నాం. క్రికెట్టు కూడా. కొట్టుకున్న, తిట్టుకున్న సందర్భాలు లేవు.

తరువాతెప్పుడో, మెడిసిన్ లో సీటు వచ్చింది చదువుకుంటున్నాడని తెలుసు. సరే, ఇక పెళ్ళి. బజుల్లా రోడ్డు ఇంట్లో సత్యనారాయణ వ్రతం. ఒకటి రెండు సార్లు, ఆంధ్రా బాంకులో కనపడ్డాడు. వాళ్ళ నాన్నగారు ఉన్నన్నిన్నాళ్ళు తన కబుర్లు కొన్ని తెలుస్తుండేవి. తరువాత ఎప్పుడో స్పర్ టాంక్ రోడ్ మూలమీద కనపడ్డాడు. ఇంగ్లాడ్‌లో ఉంటున్నానన్నాడు.

అప్పుడప్పుడు వెతుక్కునేవాడిని, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడో అని! ఆ తరువాతెప్పుడో తెలిసింది అమెరికాకి వెళ్ళాడని.  వాళ్ళ్ అన్నయ్యనుకుంటాను చెప్పాడు.

అనుకోకుండా రెండు, మూడేళ్ల క్రితం, హైద్రాబాదులో ఎయిర్‍పోర్టుకి వెళ్తూ దారిలో కధాసాహితి నవీన్ ఫోనులో పలకరించాడు. మూలింటామె గురించి మాట్లాడాడు. ఆశ్చర్య మేసింది. “సాహిత్యమేమిటి, తెలుగు సాహిత్యమేమిటి, మూలింటామె ఏమిటి? దాన్ని నువ్వు సమీక్షించడమేమిటి,” అన్న నా ప్రశ్నల పరంపరకి, “దేశానికి దూరంగా ఉన్నప్పుడు, ప్రేమలు, ఆపేక్షలు పెరుగుతాయిగా…నాకు అలా తెలుగు మీద ప్రేమ, సాహిత్యం మీద అనురాగం పెరిగింది,” అన్నాడు. సరేలే అనుకున్నాను.

మొన్న జంపాల గారు ఫేస్‌బుక్ లో, DTLC పేజిలో ఒక ఫోటోలో ఉన్నారు.  అది గ్రూప్ ఫోటో.   అందులో కనబడ్డాడు. వార్ని, భలే దొరికాడుగా అనుకున్నాను. ఆ ఫోటో కి కామెంట్ లో ఆ మిత్రుడికి తెలియజేయమని కోరాను.

DTLC Detroit Oct 2018
డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి సమావేశంలో రాఘవేంద్ర చౌదరి

మర్నాడు 22 అక్టోబరు. ఉదయం తన ఫోను కాల్ తో నిద్రలేపాడు. ఆ తేది, ఆ రోజు మర్చిపోను.

గొప్ప విషయం ఏమిటంటే, DTLC లో ఉన్నాడు. 2005 నుంచి.  దాదాపు పదమూడేళ్ళు! ఇద్దరికి తెలిసిన వారు, పరిచయం ఉన్నవారు, సాహిత్య పిపాసులు.  తెలుగు, తెలుగు సాహిత్యం! అయినా నాకు తెలియక పోయింది!  బహుశ ఏ సోషల్ మెడియాలోను ప్రోఫైల్ లేదనుకుంటాను!  లేకపోతే నేనెప్పుడో తగులుకునేవాడిని.  (బహుశ నాలాంటి వాళ్లు తగులుకుంటారనే తప్పుకునుంటాడు.
ద హ
)

రాత్రి నిఘంటువు చూసా,” అని అందులో అంటూ నన్ను ‘రిపబ్లిక్ గార్డెన్స్‘ కి తీసుకువెళ్లిపొయ్యాడు. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం. తన భాష, యాస, పలుకుబడి, ఆ నవ్వు, ఆ తల ఊపడం, దేన్ని వదులుకోలేదు! “ఆంధ్ర సాహిత్య పరిషత్తు” గురించి ప్రస్తావిస్తూ, “మా ఊరు మద్రాసు” అని అన్నాడు! ప్రాణం ఒక్కసారి లేచి వచ్చింది! చి న

Amazing, రాఘవేంద్ర…చౌదరి! అసలు నువ్వు తెలుగులో, ఆ సామెతలు, ఆ కోటబుల్ కోట్స్ , ఆ వ్యంగ్యం, ఆ చమత్కారం…భలే!  You know something! DTLC స్పూర్థి నాకు వేదిక ని మొదలుపెట్టడానికి. అఫ్‍ కోర్సు, మద్రాసులో మేము (అమ్మ, నేను, ఇతర సాహితీమిత్రులు) దాదాపు మూడు దశాబ్దాలు నిర్వహించిన సాహితీ సమావేశాల అనుభవం ఉందనుకో!

It is nice to know of your association with DTLC and love for your Telugu language! You made my day.

ఇక్కడ DTLC లో తన మాటలని వినండి.

BTW, that is…
పోఁగాలము దాపించినవారు దీప నిర్వాణగంధము నరుంధతిని మిత్రవాక్యమును మూర్కొనరు, కనరు, వినరని పెద్దలు చెప్పుదురుచి న

సంగీతం – మూడు కథలు

vedika october
వేదిక – 27 అక్టోబరు 2018

 వేదిక మిత్రులకు,
ఈ శనివారం అంటే 27 అక్టోోబరున, 2018 నాడు “వేదిక” సాహిత్య సమావేశంలో
సంగీత నేపధ్యంతో మూడు కథలు గురించి ముచ్చటించుకుందాము.
కానుక – ముళ్ళపూడి వెంకటరమణ ( మోహిత)
వాయులీనం – చా సో (ఊణుదుర్తి సుదాకర్)
చూపున్న పాట – కె ఎన్ వై పతంజలి (శ్రీమతి. రామలక్షి)

కధలను ఇక్కడ ఆన్‍లైన్‍లో చదువుకోవఛ్హు.
http://bit.ly/Vedika27Oct2018
మరో ముఖ్యమైన విషయం
అక్టోబరు 25 ఉదయాన, అధ్యాపకులు, రచయిత కవన శర్మ గారు బెంగుళూరులో చనిపోయారు. వేదిక వారికి శ్రద్దాంజలి ఘటిస్తుంది.

సమావేశం సాయంత్రం 5.30కి మొదలవుతుంది. సభాస్థలి: ఆలంబన, 85 – హెచ్ ఐ జి కాలని, వెంగళాస్ కేటరర్స్ పక్కన, బాలాజీనగర్, కూకట్‌పల్లి, హైదరాబాదు 500072.
దారి వివరాలకు; +(91)-40-2305 5904, +(91) – 9440103189, 98483 21703
Google Map:
https://goo.gl/maps/GvjOi

How to reach the venue Aalambana Hyd – వేదిక చేరుకోవడానికి దారి:
Omni Hospitals is the land mark visible on Kukatpally village main road. Take the road adjacent to it. You will find Kalyan Jewellers to your right on that road. Stick to that road. Pass ‘More’ departmental store, to your left. You will come across a ‘+’ junction.. and then Apollo Pharmacy, again to your left, while approaching from the Kukatpally main road. Take the left there and you will find Aalambana to your right. The 3rd building.

కొత్త కథ 2018 లో #మీ టూ, దాని నేపధ్యం

A short Poster for the sort story mee too

2016 లో వ్రాసుకున్న ఒక పెద్ద కథలో ఒక భాగం, ఈ ‘#మీ టూ’. ఆ కధ చాల పెద్దది. బహుశ జాల పత్రికలకి కూడా పెద్దదయ్యేదేమో. అందుకనే అందులో నుంచి ఒక భాగమే తీసుకున్నాను.

కధా వస్తువు నా జీవితంలో నేను చూసిందే. నా బాల్యంలోనే. లోపల ఎక్కడో దాగుంది అది. 2016 లో బయట పడింది. మార్నింగ్ వాక్ లో పార్క్‌లో కనబడేవాళ్లోలో ఒకతను తన కూతుర్ని కూడా తీసుకుని వఛ్హేవాడు. ప్రతిరోజు వఛ్హేవాడు కాదుకాని వఛ్హినప్పుడు ఒకొసారి అతని కూతురు కూడా తనతో పాటు వఛ్హేది.  చిన్న పిల్ల బహుశ ఒక పది పన్నెండేళ్లుంటాయేమో! ఆ వారంలో వాళ్ల స్కూల్లో ఏదో పోటిలో ఒక చిన్న బహుమతి అందుకుంది. తండ్రి తన కూతురు ప్రతిభని గురించి చెబుతుంటే ఆపి, పాపనే చెప్పమన్నాను. దాన్ని గురించి నా పక్కనే కూర్చుని సిగ్గు పడుతూ చెబుతోంది. ఆ సిగ్గు చూసి ముఛ్హటేసి, దగ్గిరకు తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాను. It was spontaneous act of appreciation, and an act of encouragement to continue to participate in competitions without giving a damn about winning or losing! అంతే. నేను ముద్దు పెట్టిన మరుక్షణం తన చేత్తో బుగ్గని తుడుచుకుంది. It was almost a reflex action. ఎందుకనో ఆ అనుభవం (తనకి గతంలోఒక bad touch అనుభవాన్ని గుర్తుంచేసిందేమో అన్న అనుమానం) తో ఇక నా దగ్గిరకు రాదేమో అనుకున్నాను. ఆ తరువాతెప్పుడో ఒకసారి వాళ్ళింటికి వెళ్లడం తటస్థించింది. “అంకుల్” అంటూ దగ్గిరకొఛ్హి వాటేసుకుంది. అక్కడ పడింది ఈ కథకి పునాది.  గత అయిదారు దశాబ్దాల పరిశీలన, ఇతరుల జీవితానుభవాలతో ఒక కధ రాయడం మొదలుపెట్టాను.  ఇందాక అన్నట్టు చాలా పెద్దదైపోయింది.  అందులో నుంచి ఒక భాగాన్ని విడగొడితే ఈ #మీటూ వఛ్హింది.  ఇది సూక్షంగా ఈ కథ నేపధ్యం. #మీటూ పోగా మిగతా వాటితో బహుశ మరో రెండు కధలు రాద్దామనుకుంటున్నాను.  చూద్దాం.

2017 లోనే ఈ కధని వీలైనంత మంది పాఠకుల చేరువగా తీసుకెళ్లాలని అనుకున్నాను. 2017 నవంబరులో ఒక ప్రధాన పత్రికకి పంపాను. సంపాదక వర్గం ఎందుకనో ‘గజ,గజ’ వణికిందన్నారు. నాలుగు అక్షరాల పదాలు లేవు. అసభ్యమైన మాటలు లేవు. సెక్సు లేదు. బూతు లేదు. మరో పత్రికకు పంపాను. ఆ పత్రిక కూడా నిరాకరించింది. రెండో పత్రిక నుంచి, కథ అర్ధంకాక రెండో సారి చదువుకుని నాకు ఫోను చేస్తే ఆ కధ వివరం చెప్పిన సందర్భం కూడా ఉంది. పిడోఫైలియా అన్నదొకటి ఉన్నది అని కూడా తెలియని తనం కనపడింది. బహుశ అప్పుడే అక్టోబర్ ఆ ప్రాంతాల్లో #మీటూ ఉద్యమం మన భారతదేశంలో కూడ మొదలయ్యింది. బహుశ అదొక కారణం అయివుంటుంది. సున్నితమైన వస్తువు అని అనుకునుంటాయి ఆ రెండు పత్రికలు. పైగా ఆ సమయంలోనే కాదు, ఇతరత్రా కూడా అందరి దృష్టి స్త్రీల మీదే ఉంది. పిల్లల మీద లేదు. నాకు తెలిసినంతలో పిడోఫైలియా మీద తెలుగులో కధలు లేవు. ఉంటే దయచేసి తెలియజేయండి. చదువుకుంటాను. లింక్ ఇస్తే మరీ సంతోషం.

ఇందాక అన్నాను కదా, ఎక్కువమంది పాఠకులకి అందాలని అనుకున్నానని. కారణం ఇది. తల్లి, తండ్రులకి, శ్రేయోభిలాషులకి, ఇలాంటి అనుభవాలు కూడా ఉండే ఉంటాయి, కాబట్టి జాగ్రత్త అని హెఛ్హరించాలని! ఒక సేఫ్ టచ్, బాడ్ టచ్ గురించి పిల్లలకి చెప్పడం మాత్రమే కాదు. వారి వేష భాషల్లోను మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్ని వేళలా, అన్ని చోట్ల వారిని ఒంటరిగా వదిలెయ్యడం కూడా సరికాదు.

కథను చదివిన పెద్దలు (మగవారు) కొందరు తాము కూడా ఈ అనుభవాలకి గురయ్యాము అని తెలియజేసారు! మాములుగా స్త్రీలు చెబుతారు, మగవాళ్ళు ఇలా చేస్తారు, అలా చూస్తారు అని!

2017 లో వెలువడాల్సిన కథే ఇది.  ప్రచురణకి నోచుకున్న నాలుగో కధ అయినా, (ఇది నా మూడో కథ, మొదటిది ఇక్కడ, రెండోది ఇక్కడ), కొత్త కధ 2018 సంకలనం లో చేర్చుకున్నందుకు ఖదీర్‍కి, సురేష్ కి కృతజ్ఞుడను.  కొత్తకధ 2018 సంపాదకులైన వెంకట్ సిద్ధారెడ్డికి, కుప్పిలి పద్మకి నమస్సులు.  సోషల్ మీడియాలో ప్రాచుర్యం కోసం ఆకర్షణీయమైన బొమ్మతో ఒక డిజైన్ ని తయారు చేసి ఇఛ్హినందుకు Artio మహీ బెజవాడకు ధన్యవాదాలు.

సోషల్ మీడీయాలో #మీటూ ప్రచురణార్ధం, మహీ బెజవాడ తయారుచేసిన కార్డ్ లో కధలోని వాక్యం ఇదిః
మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్‘ సినిమా వాల్ పోస్టర్ని చూస్తోంది. ఇందాక జిష్ణు చూసిన ఆ అమ్మాయి, పన్నెండు పదమూడేళ్ళు ఉంటాయేమో! వైట్ హెయిర్ బాండ్ కింద నుంచి నల్లని పొడుగాటి జుత్తు భుజాల మీదుగా వీపు మీదకి జారుతోంది. టాప్ టైట్ గానే ఉంది.’

కొత్త కథ 2018 ప్రతులు ఇక్కడ దొరుకుతాయిః
ధర రూ 149.00 మాత్రమే (24 కథలు)
♣ నవోదయ బుక్ హౌజ్
3-3-865,Opp Arya Samaj mandir, Kachiguda,Hyderabad, Pin Code: 500027,
Telangana,India. Mob:+91-9000413413, Office:040-24652387
Email:[email protected]
Web: www.TeluguBooks.in

♣ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్
Karl Marx Road, Opp:Hotel Raj Towers, Eluru Road, Vijayawada, 520 002,
Andhra Pradesh, India.
Contactః  (0866) 257 2949, +91 94909 52107

♣ నవచేతన
Navachethana Book House
Address: 4-1-456, Bank St, Troop Bazaar, Abids, Hyderabad, Telangana 500 001, India.
Phone: 040 2460 2646

 

క్లుప్తంగా ఇడ్లి, వడ, సాంబార్ కధ ఇది!

కొంత మంది పాఠకులకి నేను వ్రాసిన ఇడ్లి, వడ, సాంబారు కధ పూర్తిగా అర్ధం కాలేదన్నారు.  ఈ టపా వారికోసం.

ఈ క్రింద ఇఛ్హినవి సారంగ లో వఛ్హిన కధ ఇడ్లి, వడ,సాంబార్ లోని వాక్యాలు. ఇవన్ని అంతర్గతంగా కధాంశానికి సంబంధించిన సూచినలిస్తాయి.  వీటన్నింటిని ఒక క్రమంలో చదువుకుంటే కధ అర్ధం కావాలి. ఈ వాక్యాలు చదివిన తరువాత, కధని మళ్ళీ ఒకసారి చదువుకోండి.  దానికి లంకె ఈ కింది వాక్యాల తరువాత చివర ఇఛ్హాను. 

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

> ఇది అతని కధ.
> అతను ఒక స్త్రీ మూర్తిని తన చేతులమీదుగా ఎత్తుకుని తీసుకుని
రావడం…

> వాలిపోయిన ఆవిడ తలక్రింద చేతులు వేసి…
> స్త్రీని చాలా నెమ్మదిగా అతి జాగ్రత్తగా ఆ రేర్ సీట్ మీద పడుకోబెట్టాడు…
> …భుజాలక్రింద నుంచి చేతులేసి ఆవిడ తలని ఎంతో ప్రేమతో తన
ఒడిలోకి లాక్కుని…

> …తన రెండు చేతులతో ఎంతో వాత్సల్యంతో ఆవిడ కాళ్ళని తన ఒడిలోకి
తీసుకుంది…

> ఆంగర్, డినైయల్, బార్గైనింగ్, డిప్రెషన్ అండ్ అక్సె‌ప్‌టన్స్.
(Anger, denial, bargaining, depression and acceptance) – are the five stages of grief and not necessarily in that order. You can read more about it here.
(If you haven’t yet, do watch that movie ‘All that Jazz‘.  ఈ సినిమా ఆస్కార్ బహుమతులు పొందినది.))
…(Yea…blood an’ shit!)…
బమ్స్ మధ్య నుంచి పరుపు మీదకి బెడ్ షీట్ మీదుగా. దేర్ గోస్ ది
బ్లడి షీట్!…

> …ఊపిరి తిత్తుల నిండా అవే. ఒన్…ఫోర్…ఎయిట్…మిలియన్స్ టు ది
ప‌వర్ ఆఫ్ బిలియన్స్…దే ఆర్ చోకింగ్ మాన్! లెట్ హర్ గో ఈజీలీ!
(Let  her go easily!)…

> ఇట్ టూ ఈజ్ డెడ్ మాన్! (It too is dead man!)
> …(With a carcass…oh no!)…

(ఇది కధలో లేదు, కాని తెలియని పాఠకులకోసం ఇక్కడ ఇఛ్హాను. The following are the stages of “Rigor Mortis“, తెలుగులో ఇక్కడుంది. )

బిలియన్స్ ఆఫ్ సెల్స్… డూ దే హావ్టు ప్రై దెమ్ ఓపెన్?
(Billions of cells…do they have to pry them open?)

>  ఆర్ బ్రేక్? (Or break?)

>  బ్రేక్ వాట్? (Break what?)

>  ది జాస్, డూడ్…హర్ జాస్! (The jaws, dude…her jaws!)
గెస్ నాట్! (Guess not!)
షిట్… హౌ కెన్ యు ఎవెన్ధింక్ లైక్ దట్! (Shit…how can you
even think like that?)

ఇట్స్ ఎ కడెవ…వాట్! (It’s a cadav’…what?)
…నెమ్మదిగా సెటిన్ అవుతోంది…

>  యు ధింక్ హర్ జా వుడ్‌హెవ్ బిగన్ టూ ఫ్రీజ్?
(You think her jaw would have begun to freeze?)

ఐ లిడ్స్?
(Eye lids?)

>  …వాళ్ళందరూ ఇంకా తింటునే ఉన్నారు.
ఇడ్లి, వడ, సాంబార్ కూడా…

కధ అర్ధం అయివుండాలి.

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

అంతర్జాల పత్రిక, సారంగ లో కధ ఇక్కడ చదువుకోవఛ్హు.
ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి.  కధకి తగ్గ abstract బొమ్మ గీసిన అన్వర్ కి థాంక్స్.

ఇక్కడ ఈ టపాకి వాడిన Photo by Axel Antas-Bergkvist on Unsplash.

That woman was part of their life and she lay dead in that car and they are having breakfast. Those monologues in English are his ( ఇంగ్లిష్‌ లోని స్వగతాలు, అతనివి) .

….
While they traveled with a member of their family who is dead (body), they stopped at a restaurant and had their breakfast.

చనిపోయిన తమ కుటుంబ సభ్యురాలి దేహంతో, ప్రయాణం సాగిస్తూ, దారిలో కనబడ్డ దాబా లో కూర్చుని ఉదయపు అల్పాహారాన్ని కోరుకుని తిన్నవి, ఈ కధలోని కొన్ని పాత్రలు.  అది జీవితం.  బహుశ మనందరి జీవితాలు అంతేనేమో!

ఇక తెలుగు కధలో ఇంగ్లిష్ వాక్యాలు, వాటిని టెంగ్లిష్ (ఇంగ్లిష్ పదాలని తెలుగు లో వ్రాయడం) మళ్ళీ అవే వాక్యాలని ఇంగ్లిష్‍లో (బ్రాకెట్లలో) ఇవ్వడానికి కారణం, తెలుగులో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్నవాళ్ళకి, ఇంగ్లిష్‍ తెలిసిన వాళ్ళకి, చదువుకోవడానికి సులువుగా ఉంటుందని.

ఈ టపా సమయానికి, నా వరకూ వఛ్హిన పాఠకుల వ్యాఖ్యలన్నింటినికి వివరణ ఇది.

శ్రీదేవి అయ్యప్పన్ తో నా పరిచయం

శ్రీదేవి ఆ క్రితం రాత్రి చనిపోయిందన్న వార్త Facebook లో చదవగానే ఒక చిన్న షాక్!  అప్రయత్నంగానే “అయ్యో!” అనిపించింది.  అంత చిన్న వయసులోనే పోవడం, పైగా ఊహించని విధంగా! ఎంత వరకు నిజం అని తెలుసుకోవడానికి, వెంటనే గూగుల్ లోకి వెళ్ళి సెర్చ్ చేస్తుంటే…ఆమె తండ్రి, అయ్యప్పన్ గారు, తల్లి రాజేశ్వరి, చెల్లెలు శ్రీలత గుర్తు వఛ్హారు.  అంతేకాదు, బహుశ వారి బంధువు మరొకమ్మాయి కూడా గుర్తు వఛ్హింది.

వీళ్లందరితో పాటు అయ్యప్పన్ గారిని పరియం చేసిన టి సి సుబ్బన్న గారు.  అప్పట్లో అయిదారు, సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న నిర్మాత.  బెరైటీస్ ఎగుమతులు లాభాసాటిగా ఉందని ఆ గనులకోసం, చాలా కష్టపడ్డారు.  గల్ఫ్ దేశాల చుట్టూ తిరిగాడాయన.  చివరికి మాకెవరికి తెలియకుండా మద్రాసు జనరల్ హాస్పిటల్ లో పోయారు.  వాళ్ళందరూ ఆ  మనుషులు, వాళ్ళ కలలు అన్ని కళ్ళముందు కదలాడినవి.

గూగుల్ సర్చ్ లో శ్రీదేవి మరణం మీద వస్తున్న కొన్ని వార్తలు చదివినప్పుడు బాధవేసింది.  అయ్యో అనిపించింది.  ఒక పోస్ట్ వ్రాద్దామనుకున్నాను.  కాని అంతక్రితం రోజే ప్రముఖ సాహిత్య వేత్త మునిపల్లె రాజు గారు పోయారు.  ఆ సందర్భంలో ఎవరో ఫేస్‍బుక్ లో కొంచెం వ్యంగ్యంగా, ఇక మళ్ళీ మొదలన్నమాట పోయిన వాళ్లందరితోను వాళ్ళు తీసుకున్న ఫోటోలు, వాళ్ళ ఘాఢమైన స్నేహాలతో ఈ ఫేసుబుక్ గోడల నిండా పిడకలు,  పేడ కంపు అంటూ పోస్ట్ చేసింది గుర్తు వఛ్హింది.  అందుకని తటపటాయించాను.  చివరకి పోస్ట్ చేసాను కూడా!  కానీ  శ్రీదేవి లాంటి నటితో నాకున్న పరిచయాన్ని నేను exploit చేస్తున్నానన్న అపవాదు నా మీద పడుతుందా అన్న అనుమానంతో ఆ పోస్ట్ ని తొలగించేసాను.

మళ్ళీ సందిగ్ధం!

మద్రాసులో, రాణీ బుక్ సెంటర్ రోజులు నా జీవితంలో స్వర్ణయుగం!  మద్రాసులోని తెలుగువారికి కూడ ఆ మూడు దశాబ్దాలు స్వర్ణయుగమే!  అంతకు ముందు, ఆ తరువాత నాకు తెలీదు ఎందుకంటే నేను లేను గనక.  రాణీ బుక్ సెంటర్ అంటే అమ్మ, చౌదరాణి.  తనని గుర్తు చేసుకోవడమే నేను.  అలాగని తనని మరిచిపోయానని కాదు…  but anyways..ఆంతకు ముందు వ్రాసి డిలీట్ చేసింది తెలుగనుకుంటాను…కాని ఈ సారి నా తమిళ తంబీలకి ఇతర భాషా మిత్రులకి కూడ తెలుస్తుందని ఇంగ్లిష్ లో వ్రాసాను.  మరి ఫోటో కావాలి కదా? శ్రీదేవి కుటుంబంతో ఉన్న ఫోటోలు చూసిన గుర్తు ఉంది నాకు.  అవి గౌతమ్ అని ఆ రోజుల్లో ప్రోట్రైట్ ఫోటోలకి గొప్ప పేరున్నతను తీసిన ఫోటోలే సరి అనుకున్నాను.  ఆ ఫోటొలు అప్పట్లో వఛ్హే Star & Style, Stardust, Cine Blitz, Filmfare లాంటి పత్రికల్లో వఛ్హిన గుర్తు.  నెట్ లో చాలా సేపు వెతగ్గా దొరికింది.  చాలా బొమ్మలుండాలి గాని ఒకటే దొరికింది. (Twitter లో శ్రీదేవి హాండిల్ లో చూసాను కాని మళ్ళీ అది కనపడలేదు ) అదే నేను వాడింది. Facebook లో నా పోస్ట్ లన్ని పబ్లిక్.  ఇక్కడ ఫేస్‍బుక్ లో నా ఇంగ్లిష్ పోస్ట్. ఒకవేళ మీకు ఆ పోస్ట్ అందుబాటు లోకి రాకపోతే ఇక్కడిఛ్హాను.

Shocking to know that the Sridevi, I knew had to pass away this early! Paan chewing Ayyappan garu, her father is a lawyer and is a Telugu gent, from Sivakasi, the town that makes the firecrackers for India if not the world. A pleasant man, always dressed in white, be it a lungi, or trousers and a shirt.

I am talking about the times, around late 70’s, when she used to come by in a rikshaw along with her mother Smt Rajeswari and drop into our #RaniBookCenter, just to know if her father had come by. There were many times when Ayyappan garu and I used to have cuppa tea at Hotel Hameedia and this lady with her mother would be waiting in the book store for her dad! Her younger sister Srilatha was a Holy Angels student.

Her father, once when we met in Andhra Bank, (it was then in a rented building adjacent to the present police station on Pondy Bazaar) asked me if I had watched #moondrampirai and urged me to go watch it. He considered it to be one of her best performances at that time. She had already become popular and busy by then. She seems to have been in a rush to leave!

Sridevi, Ayyappan, Srilatha, Rajeswari
Sridevi with her parents and younger sister Srilatha

ఆ తరువాత BBC Telugu బిబిసి తెలుగు వారు నన్ను సంప్రదించారు.  “మీ జ్ఞాపకాలు  ఏవైనా ఉంటే పంచుకోగలరా, మా బిబిసి వెబ్‍సైట్ కి?” అని అడిగారు.  కొంత వ్యవధి కోరాను. వారికి అర్ధం అయినట్టుంది.  “మీకు తెలిసినవారు మరెవరైనా …తెలుగులో చెప్పగలిగిన వారుంటే సూచించమని,” కోరారు.

అప్పట్లో ఈ టచ్ స్క్రీన్ ఫోనులు లేవు కాబట్టి సెల్ఫీలు వగైరా లేవు.  ప్రతి రంగంలోను మరీ ముఖ్యంగా అటు సాహిత్య రంగంలోను, ఇటు చలని చిత్ర రంగంలోను దాదాపు ప్రముఖులందరితోనూ సత్సంబధాలుండేవి.  కనీసం ముఖ పరిచయాలుండేవి.  కాబట్టి వాళ్లతో ఫొటోలు తీసుకోవాలి అన్న ఆలోచన ఉండేదికాదు.  ఇంకొక విషయం.  నాకంటూ ఒక ఫిలాసఫి ఉండేది.  వాళ్ళు వాళ్ళ రంగాలలో నిష్ణాతులు.  వ్యాపారస్థులు కావఛ్హు, విద్యావేత్తలు కావఛ్హు, నటులు కావఛ్హు, పారిశ్రామికవేత్తలు, నిర్మాతలు, కళాకారులు, దర్శకులు, సంగీతం,  MNC సంస్థలలో ఉన్నతాధికారులు కావఛ్హు. కాని వారి దైనందిన జీవితంలో  ఎటూ వత్తిడి ఉంటుంది.  వారు వఛ్హేదే వాటికి దూరంగా పుస్తకాలు చదువుకుంటూ, సేద తీరుదామని.  మళ్ళీ వారి వృత్తికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు గురించి మాట్లాడటం ఏం బాగుంటుందని మాట్లాడేవాడిని కాదు.  వారు ప్రస్తావిస్తే వాటి గురించి మాట్లాడేవాడిని.  అమ్మ దగ్గిరకి సలహాల కోసం వఛ్హేవారు సరే, సరి. అది మరొకసారి!

అందుకని ఇక్కడ కూడా నేను శ్రీదేవి విషయంలో ప్రసార మాధ్యమాలలో విపరీతమైన చెత్త వఛ్హినా వాటి గురించి ప్రస్తావించలేదు.

ఇక బిబిసి వారికి తెలుగులో నేను శ్రీదేవి గురించి వ్రాసిన చిన్న కాలం ఇక్కడ చదువు కోవఛ్హు.

ఇది వ్రాసి బిబిసి తెలుగు కి ఇవ్వడానికే సమయం సరిపోయింది.   అందుకని నేను ప్రత్యేకంగా మళ్ళీ ఇతరులనెవ్వరిని సంప్రదించలేదు.  అవకాశం ఉండి ఉంటే మట్టుకు శ్రీదేవితో కలిసి ఒక సహయ దర్శకుడిగాను, నటుడుగాను పని చేసిన వాడు, రక్తం (2017) చిత్రంలో తన పాత్రకు అంతర్జాతీయ గుర్తింపు పొందిన నటుడు, పూర్వాశ్రమంలో దర్శకత్వరంగంలోనూ, నిర్మాతగాను అనుభవమున్న సన్మిత్రుడు బెనర్జి ని కోరి ఉండేవాడిని.

ఏది ఏమైనా అంత త్వరగా తను వెళ్లిపోవాల్సి రావడం బాధాకరం.

ఇంకా చాలా వుంది.  బహుశ తరువాతెప్పుడైనా…చూద్దాం!

 తా.: ప్రముఖ తెలుసు సాహితీవేత్త ఆరుద్ర గారి మనుమడు (కవిత చింతామణి కుమారుడు) గౌతమ్ చింతామణిThe Last Diva అనే శీర్షికతో The Pioneer పత్రికలో తను వ్రాసిన వ్యాసంలో రాణీ బుక్ సెంటర్ – శ్రీదేవి (అయ్యప్పన్) గురించి ప్రస్తావించాడు. గౌతమ్ అనాటి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా మీది ఒక పుస్తకం వ్రాసాడు.   దాన్ని గురించి కూడా వ్రాసాను, ఈ బ్లాగులోనే ఇక్కడ చదువుకోవఛ్హు.

మరో మాట.  నాలుగేళ్ళూ నిరాఘటంగా వెలువడిన సారంగ వెబ్ జైన్ 2017 జనవరిలో విరామం తీసుకుంది. కొన్ని కొత్త శీర్షికలతో ఈ ఉగాది (ఆదివారం, మార్చ్ 18, 2018) మళ్ళీ ఒక పక్షపత్రికగా పాఠకుల ముందుకొఛ్హింది.  అందులో ఇదివరకున్న కథా సారంగ శీర్షికని పునఃప్రారంభిస్తూ నేను వ్రాసిన కధ ఇడ్లి, వడ, సాంబార్ ని తొలి కధగా ఎన్నుకుంది.  అందుకు సారంగ సంపాదక వర్గానికి, మరీ ముఖ్యంగా అఫ్సర్ కి ధన్యవాదాలు. మీరు ఆ కధని ఇక్కడ చదువుకోవఛ్హు.  మీ అభిప్రాయలని వ్యాఖ్యల రూపంలో అక్కడ కాని ఇక్కడ కాని తెలియజేయ మనవి.