చనుప, నెరవు, తెరువు, దడము, బడిమి, పుంత, నడవ, మయి, జాడ, ఓణి, కంతి, చొప్పు. వీటన్నింటికి ఒకటే అర్ధం, తెలుగులో దారి అని. తెరువు అనే పదాన్ని “అంద చెన్నై మానగరిత్తిలే,” వాళ్ళు వాడగా విన్నాను, నేను వాడాను. వాళ్ళు ఇంకా వాడుతున్నారు. రెండు వందల పదహారు పేజిల కతల గంప లో
18 కతలున్నాయి. అందులోని ఆఖరి కతే, విశాలాక్షి మాస పత్రిక తమ అక్టోబర్ 2014 సంచికలో ప్రచురించింది. ఆ కధే కథ 2014 లో కూడా చోటు చేసుకుంది.
ఉత్తరపొద్దు (2003), ఊడల్లేని మర్రి (2006 ), రయికముడి ఎరుగని బతుకు(2012), సిడిమొయిలు (2013), ఇదిగో ఈ రెండువేల పద్నాలుగులో ఈ దారమ్మ చెప్పిన కత. మొన్న అంటే రెండవ ఆదివారం సెప్టెంబరు 13 న ఈ కథను గురించి కూడా వేదిక సభ్యులు చర్చించుకున్నారు. కధానిలయంలో ఈ కథకుడి కథల పట్టిక ఇక్కడ చూడోచ్చు.
తొలికధ మీసర వాన. 2002 లో నడుస్తున్న చరిత్ర లో ప్రచురితం. నడుస్తున్న చరిత్ర ఇప్పుడు అమ్మనుడి గా సామల రమేశ్ బాబు గారే మాస పత్రికగా ప్రచురిస్తున్నాను. చేతులు మారలేదు.
ఇక కధానిలయం లో కల్పన రెంటాల కథలు మూడు మాత్రమే నమోదయ్యాయి. తన తొలి బ్లాగ్ నవల తన్హాయి. కొంత అలజడిని, ఆసక్తిని కలిగించిన ఆ నవల గురించి ప్రస్తావన లేదు మరి ఎందుకనో. వీరి తొలి కధ ఋతుభ్రమణం వార్త వారి ఆదివారం అనుబంధంలో 2003-12-14 లో ప్రచురించారు. కధ 2014 లోకి ఎన్నుకున్న ఈ కధ ప్రాతినిధ్య 2014 కధాసంపుటంలో కూడ ఉంది. వేదిక కూడ ఈ కధని చర్చించుకుంది. కల్పన బ్లాగ్ ఇక్కడ.
“ఇండియాకి వస్తున్నాను,” అని అనగానే వేదిక సభ్యులతో ఒక సాయంత్రం ఏర్పాటు చేస్తాను మీకు వీలుంటే అనగానే సంతోషంగా ఒప్పేసుకున్నారు ఈ కథకుడు. అలాగా ఏప్రిల్, 2015 లో ఒక ఆదివారం, 5వ తారిఖున గొర్తి సాయిబ్రహ్మానందం – వేదిక కాసేపు కబుర్లు చెప్పుకున్నారు.
ఈ కధకుడి కధలు కొన్ని ఇదివరకు కధాసాహితి సంపుటిలో చేరినవి; అతను (2009), సరిహద్దు (2011), ఈ సారి కూడా. కధకోసం ఆ సంపుటిని చూడాల్సిందే! 🙂
1978 లో తొలి కధ ప్రచురించుకున్న కవి విమల. ఆ పత్రిక నూతన. అవును కవి.
కధలు కూడా వ్రాస్తారు.
2015 మార్చ్ ఒకటిన, వేదిక నిర్వహించిన కధ నిన్న – నేడు – రేపు లో వీరు కూడ నిర్వాహకులుగా తమ సహాయాన్ని అందించారు. వేదికవీరి కధను కూడ చర్చకు తీసుకుంది. ఆ కధే ఈ కధ 2014 లో కూడా ఉంది.
కధ 2013 ప్రతులకు
కధాసాహితి, 164, రవి కాలని, Tirumalgherry, Secunderabad 500 015.
ధర: అరవై రూపాయలు / పది అమెరికన్ డాలర్లు గమనిక: తపాల / కొరియర్ ఖర్చులు అదనం
2014 లో సెప్టెంబరు నెలలో రెండవ ఆదివారం తేది14 అయ్యింది. ఆ రోజున మధురాంతకం నరేంద్ర గారి కథనివేదిక – సాహితీ సమావేశం సభ్యులు చర్చించుకున్నారు. ఆ కథ ని కధా సాహితి సంపాదకులు తమ కధ 2014 సంకలనంలో చేర్చుకున్నారు. మధురాంతకం నరేంద్ర సాహిత్యం గురించి మరి కొన్ని వివరాలు కథానిలయం లో ఇక్కడ చూడండి.
పెద్దిభొట్ల సుబ్బరామయ్య పురస్కారం వారి చేతుల మీదుగానే అందుకుంటున్న మధురాంతకం నరేంద్ర. వీరిద్దరూ అధ్యాపకులే! తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారిని కూడా ఇందులో చూడవచ్చు.
ఇవి కాక ఆంగ్లంలో The Hans India ఆంగ్ల దిన పత్రికలో ముఖ్యంగా తెలుగు సాహిత్యం మీద నరేంద్ర వ్యాసాలు కూడా వ్రాస్తుంటారు. నరేంద్ర గారి కథలలో కొన్ని; అత్యాచారం (991), నిత్యమూ నిరంతరమూ (1993), అస్తిత్వానికి అటూ – ఇటూ – (2001), నమ్మకం (2008), చిత్రలేఖ (2010), చివరి ఇల్లు (2013) ఇదివరలో కథాసాహితి వారి కధ సంపుటాలలో చోటు చేసుకున్నవి.
ఇందులో చెప్పుకోవలిసిన అంశం ఏమిటంటే 1992 లో కధ 1991ని ఆవిష్కరించింది కీ.శే మధురాంతకం రాజారాం. వారి తనయుడు మధురాంతకం నరేంద్ర.
ఇక కథా సారంగ లో (July 9, 2015) 3456GB వ్రాసిన కొట్టం రామకృష్ణారెడ్డి తొలి కధ – తీర్పు. ఇది 1991 ఫిబ్రవరిలో రచన మాస పత్రికలో వచ్చింది. వీరి కథ కూడ ఈ కథ 2014 సంపుటిలో ఉంది. వివరాలకు సంకలనాన్ని చూడండి.
బంధం కధ 2013 లో ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం ప్రచురించింది. ఆ కథ వ్రాసింది బోడపాటి హరితాదేవి. కలం పేరు రాధిక. సంపాదకులు ఎన్నుకున్న కధని మీరు కథ 2014 లోనే చూసుకోవాలి మరి. 🙂
2014 అక్టోబరులో రెండవ ఆదివారం 12 వ తేది అయ్యింది. ఆ రోజు సాయంత్రం డా. వి చంద్రశేఖర రావు గారి నవల నల్లమిరియం చెట్టు మీద వేదికసాహితీ సమావేశంలో తన అభిప్రాయాన్ని వినిపించారు కన్నెగంటి రామారావు. మరో సాహిత్య పిపాసి 🙂 డాక్టర్ ఇస్మాయిల్ కూడా ఆ రోజు సాయంత్రం వేదిక సమావేశంలో పాల్గొన్నారు. వీరిద్దరూ అమెరికాలో ఉంటారు. చెప్పొచ్చేదేమిటంటే యాజి కూడా అమెరికాలోనే ఉంటారు.
కథకుడు యాజి తన కధకు ఎన్నుకున్న అంశం మీద సాహిత్యలోకంలో చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది. యాజి కథకూడ కధ 2014 లో చోటుచేసుకుంది. విశేషం ఏమిటంటే యాజి స్వస్థలం తెనాలి. 😎
కధ 2014 – కధాసంపుటిలోని ఒక ముగ్గురు కథకులను గురించి, ఇక్కడేమో మరో ముగ్గురు కధకులు గురించి తెలియచేసాను. రేపు … ఆ మిగతా కథకుల గురించి. 😎 అన్నట్టు తెనాలి కి వస్తున్నారుగా! తెనాలి లో కవిరాజు ఉద్యావనం (పార్క్) ఇక్కడుంది.
రెండు దశాబ్దాలు
కథ 1990 – 2009
౩౦ కధలతో రెండు దశాబ్దాల ఉత్తమ కధల సంకలనం
ప్రతులకు
164, Ravi Colony, Tirumalagherry, Secunderabad 500 015, India Ph: +91 2779 7691
ధర: రూ 150.00 / US $ 25.00
పోస్ట్ / కొరియర్ ఖర్చులు అదనం.
కథ 2014 కథా సంపుటి కథాసాహితి వారి ప్రచురణలో ఇరవై అయిదవది. ఈ పాతిక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వెలువడింది. కథాసాహితి తొలి కధల సంపుటి వెలువడింది 1990 లో. కీ శే ఆచార్య. చేకూరి రామారావు గారి చేతులమీదుగా ఆవిష్కరణ. ఆనాటి సభాధ్యక్షులు ఆచార్య కె.వి శివారెడ్డి. ఆ అధ్యక్షుల వారిది తెనాలి. పాతికేళ్ళ కథ 2014 కూడా తెనాలిలో అవిష్కరణకి నోచుకోవడం కాకతాళీయం అయినా తెలుగు సాహిత్యంలో ఒక చారిత్రక ఘట్టం.
ఇక ఆ ముగ్గురు కథకులు ఎవరో చూద్దాం.
తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారి తొలి కథ సీతన్న తాట. ఇది 1962 లో ఆంధ్రప్రభ వారు ప్రచురించారు. వీరి ఇతర కథలు, నవలలు గురించిన వివరాలు కథానిలయంలో ఇక్కడ తెలుసుకోవచ్చు.
వాల్ పోస్టర్, సర్మా, గారడీ, రామేశ్వరం కాకులు ఇదివరలో ఆయా కథ వార్షిక సంకలనాలలో ప్రచురించారు.
అద్దేపల్లి ప్రభు, కాకినాడ వాస్తవ్యులు. వీరి తొలి కధ విలువలు 1984 లో అరుణతార మాస పత్రికలో వెలువడింది. వారి ఇతర సాహిత్యం కథానిలయంలో ఇక్కడ చూడండి.
1986 స్వాతి వార పత్రికలో ప్రచురించిన మూషికార్జునీయం కథకులు పి వి. సునీల్ కుమార్. లఘుచిత్రం గా వెలుగుచూసిన కథ దెయ్యం వీరిదే. వేదిక లో వీరి తోక దెయ్యం చెప్పిన డిసిప్లి మీద 2015 మే నెలలో చర్చించుకున్నారు. ఆ కథని ఇక్కడ చదువుకోవచ్చు.
వీరు ముగ్గురూ, నిన్న ముగ్గురు కధకులు మాత్రమే కాదు. ఇంకా ఉన్నారండి. వారిలో మరో ముగ్గురు కధకులని మీకు రేఫు పరిచయం చేస్తాను.
రానున్న ఆదివారం, సెప్టెంబరు 20, 2015 న తెనాలిలో జరగనున్న ఆవిష్కరణ సభకి ఇదిగో ఆహ్వానం.
గత పాతికేళ్ళుగా క్రమం తప్పకుండా వెలువడుతున్న కధాసాహితి వారి 25 వార్షిక కథా సంకలనం కథ 2014 లో ఈ ముగ్గురి కథలున్నవి.
బత్తుల రమాసుందరి మొదటి కథ ఇక్కడ
చదువుకోవచ్చు; మనిద్దరమే ఉందాం అమ్మా! ఆంధ్రజ్యోతి దిన పత్రిక వారి ఆదివారం అనుబంధం (01-09-2013లో ప్రచురితం)
ఇక రెండవ వారు పాలగిరి విశ్వప్రసాద్, వీరి మొదటి కథ బోలు మనుషులు రచన మాస పత్రిక సెప్టెంబరు 1991లో
ప్రచురితం. నేను వెతికినంతలో అది నాకు జాలంలో దొరకలేదు.
ఇక మూడవ కథకుడు భగవంతం.
వీరి మొదటి కథవెయిటింగ్ ఫర్ యాద్గిరి.
ఈ కథ తొలిసారిగా 2006లో వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితం.
చలన చిత్ర దర్శకుడు వంశీ, నా కెందుకు నచ్చిందంటేఅనే శీర్షికతో
గోతెలుగు డాట్ కాం లో ఈ కథని మెచ్చుకుంటూ పరిచయం చేసిన కథ. భగవంతం పాడిన పాట ఇక్కడ వినొచ్చు. సా.వెం.రమేశ్ స్వరం కూడా!
రానున్న ఆదివారం 20న, తెనాలి లో జరగనున్న కథ 2014 ఆవిష్కరణ సభలో బహుశ వీరందరిని మీరు కలుసుకోవచ్చు. వీరు ముగ్గురే కాదు ఇంకా ఉన్నారు. వారిలో కొంతమంది గురించి రేపు చెబుతాను.
దిద్దుబాటు తొలి తెలుగు కథ అని అనుకున్నాం. కాదు ఇంకా ముందే కథలున్నాయి అని అన్నారు. సరే, దిద్దిబాటు కన్నా ముందు కథల సంగతి తేల్చుకుందాం అని అనుకున్నారు, వి వి న మూర్తి గారు. ఇదేదో బాగానే ఉంది కదా? రానున్న తరాల వారికి ఈ పుస్తకం ద్వారా ఆ కథలు వాటి నేపధ్యం గురించి తెలియజేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన నచ్చింది జంపాల చౌదరి గారికి. జంపాల గారు తానా ప్రచురణ లకి అధ్యక్షులు.
కొన్ని ప్రశ్నలు – కొన్ని ఆలోచనలు ప్ర: ఏది కథ? జ: వ్రాసిన రచయిత గాని, అచ్చువేసిన పత్రికా సంపాదకులు గాని కథ అనడం. ప్ర: ఇంకా మన దృష్టికి రాని కథలు ఉండవచ్చా? జ: భవిష్యత్తులో బయటపడవచ్చు. ప్ర: తొలి కథ? జ: చిలక గురించిన సంభాషణ 1879 జనవరి జనవినోదిని ప్ర: తొలి కధా సంపుటం? జ: చిత్రమంజరి 1902 మే. రచయిత రాయసం వెంకటశివుడు. అయ్యా, ఇంకా చాలా వివరాలున్నవి. ప్రస్తుతానికి ఈ వివరాలు ఈ సేకరణ కి మాత్రమే పరిమితం. ఇందాక అన్నట్టు.. మరి కొన్ని వివరాలు భవిష్యత్తులో బయటపడవచ్చు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) లక్షాలలో ప్రముఖమైనది తెలుగు భాష, సంస్కృతులను పోషించి, పరిరక్షించుకోవడం. దాదాపు గత నాలుగు దశాబ్దాలుగా ఈ పని చేస్తూన్నది తానా. అందులో ఒక పాత్రని పోషిస్తున్నది తానా ప్రచురణలు. ప్రచురణలో లేని, ప్రచురణ కాని ముఖ్యమైన తెలుగు పుస్తకాలను ఉత్తమ ప్రమాణాలతో, ప్రచురించి సాహిత్యాభిమానులకు అందుబాటులోఉండే ధరలకు అందిచడం తానా ఉద్దేశం.
రానున్న జూన్‌లో జంపాల చౌదరి 2015 జూన్ లో, తానా (TANA) కి అధ్యక్షుడిగాకూడా పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పుడు తానా ఆ పుస్తకాన్ని ప్రచురిస్తోంది.
రేపు అంటే శుక్రవారం, జనవరి 2, 2015 న విజయవాడ లో జరగనున్న తెలుగు పుస్తకాల పండుగ లో, దీనిని ఆవిష్కరించనున్నారు. ఆవిష్కరించనున్నది ఆచార్య కడియాల రామ మోహన్ రాయ్ గారు.
చిత్రకారుడు చంద్ర వేసిన ముఖచిత్రం తో వెలువడున్నది ఈ దిద్దుబాటలు.
496 పేజీలు, ధర 300.00 రూపాయలు. US $ – 25.
ప్రచురణ కర్తల కృతజ్ఞతలు
” శ్రీ కొడవళ్ళ హనుమంత రావు వితరణ, శ్రీ ‘నవోదయ’ రామ్మోహనరావు, శ్రీ వాసిరెడ్డి నవీన్ సహృదయత, శ్రమదానం, తానా కార్యవర్గం, తానా ఫౌండేషన్, మరెందరో హితోభిలాషుల సహకారం తో…” ఈ పుస్తకం వెలువడుతోంది.
పుస్తకానికి ప్రూఫులు చూసిన ఎ.వి రమణమూర్తి గారికి, పుస్తకాన్ని అందంగా రూపొందించడంతో పాటు చదవడానికి వీలుగా పదవిభజన చేసిన అక్షర సీత గారికి అచ్చువేసిన చరిత ప్రెస్ పరుచూరి సుబ్బయ్య గారికి” కూడా.
ఆంధ్రజ్యోతి లో వి వి న మూర్తి గారి దిద్దుబాటలు కి ముందు మాటలు ప్రచురించారు. వాటిని మీరు ఇక్కడ చదువుకోవచ్చు.
ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. నా స్వార్ధం మరి. తానా వారి ప్రచురణలు ప్రచురించిన కథ నేపధ్యం తొలి సంకలనం ఆవిష్కరణ 2012 జనవరి 3 న ఇదే విజయవాడలో అదే వేదిక మీద జరిగింది. వేదిక మీద శ్రీమతి సత్యవతి పోచిరాజు, శ్రీరమణ, శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య, శ్రీ ‘నవోదయ’ రామ్మోహన రావు, శ్రీ తోటకూర ప్రసాద్ (అధ్యక్షులు తానా), తానా ప్రచురణల అధ్యఖులు శ్రీ జంపాల చౌదరి. వారందరితోను నేను.
దయచేసి మీ ప్రతులకోసం వీరిని సంప్రదించండి. ఇండియా లో:
AG – 2, ‘A’ Block, Mathrusri Apartments,
Hyderguda, Hyderabad 500029
Phone – 040 – 2324 4088.
USA
TANA Publications,20374, Buckthorn Court, Mundelein, Illinois 60060 USA
ప్రధాన విక్రేతలు; ఆంద్ర ప్రదేశ్:
విశాలాంధ్ర ప్రబ్లిషింగ్ హవుస్, విజయవాడ (ఫోను 0866 -2572949) వారి బ్రాంచీలన్నింటిలోను.
నవోదయ పబ్లిషర్, ఏలూరు రోడ్డు, విజయవాడ – ఫోను 0866 – 2573500, 9849825204 ప్రభవ బుక్ సెంటర్, No- 16-2-157, Near Vijaya Hospital, Pogathota, Nellore, Andhra Pradesh 524 001 ఫోను: ౦861- 2323 167 / 232 9567
తెలంగాణ: నవచేతన పబ్లిషింగ్ హవుస్, హైదరాబాద్ వారి బ్రాంచీలన్నింటిలోను. ప్రజాశక్తి బుక్ హౌస్, 1-1-187/1/2, Viveknagar, Chikkadpally, Chikkadpally, Hyderabad, Telangana 500020. ఫోను: 040 2760 8107 నవోదయ బుక్ హౌస్, 3, Kachiguda Station Road, Chappal Bazar, Kachiguda, Hyderabad, Telangana 500027 – 040 2465 2387
ముందున్నది మూడు చెరువులు. ఒడ్డున్న ఉన్నది అప్పుడే వాటిల్లో మునిగి, ఈది, తేలి, గట్టుకు చేరిన సుశిక్షుతులైన గజ ఈతగాళ్ళు. ఆ చెరువులు చెరువులేనా?.. ద్రోహ వృక్షం, నల్ల మిరియం చెట్టు, ఆకుపచ్చని దేశం. ఒడ్డున్న ఉండి మళ్ళీ దూకడానికి ఉద్యుక్తుడవుతున్న నవయువకుడు శివారెడ్డి..కానీండి ఇంకా చూస్తారే?..నేనైతే ‘జీవని’ లోకి దూకాను. ‘ఐదు హంసలు’ని కూడా చూసాను. దూకడమే..అలా ఒడ్డున నిలబడిపోతే మీ జీవితంలో ఒక ఎపిక్ ప్రపోర్షన్ లో ఒక అనుభవాన్ని కోల్పోతారంటాడు.
ఇందులో ద్రోహవృక్షం కథల సంపుటి. మిగతా రెండూ – నల్లమిరియం చెట్టు, ఆకుపచ్చని దేశం నవలలు. రచయిత డా॥ వి. చంద్రశేకఖర రావు.
ఆ పుస్తకాల పేర్లు చూడండి. ఒక మార్మికత లేదూ వాటిల్లో?! చిన్నప్పుడు మా నాన్న తెచ్చి ఇస్తే పుస్తకాలు, ఏది ముందు చదవాలో అర్ధం అయ్యేది కాదు. అన్నింటిని ఒకే సారి చదవలేము. సరే, పుస్తక పరిచయ సభకి వెళ్ళాం కదా..ఆ మహామహుల మాటలు విన్నాం కదా? వాళ్ళందరూ ఏదో ఒక పుస్తకాన్ని ఆకాశానికెత్తేస్తే దాంతో మొదలు పెట్టవచ్చు. అసలు ఆ సాహితీవేత్తలు ఆ అవకాశం లేకుండా అన్నింటి గురించి చెప్పేసారు. అసలు ముందు వాళ్ళ మాటలు వింటుంటే ఒక అయోమయం.
నల్లమిరియం చెట్టు గురించి మాట్లాడుతూ, ఆకుపచ్చని దేశం లోకి వెళ్ళిపోతారు. పోనీ దాని గురించి మాట్లాడుతారా అంటే ఉహు మళ్ళీ ద్రోహవృక్షంలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఉంటారా అంటే ఆబ్బే సుందరం అంట..ఆదెమ్మ అంట, చెంచులు అంట, నరసింహం ఆత్మహత్య, మొసళ్ళు వాటితో యుద్దమా లేదా తప్పించుకుని అవతలి ఒడ్డుకి చేరటమా అన్న ఆలోచనంట..ఇవేవి కావు అసలు ఈ చంద్రశేఖరం గారు కవిత్వం వ్రాస్తున్నాడంటున్నారు, నా దృష్టిలో అది కవిత్వం కాదు..ఈ రచయిత రచనల మీద నేను పరిశోధన చేస్తున్నాను అని మరో వక్త. సరే! వాళ్ళు పుస్తకాలు చదివారు కాబట్టి వేదిక మీద ఉన్నవాళ్ళందరికి రచయితతో సహా తాము ఏమి మాట్లాడుతున్నారో తెలుసు.
మరి పాఠకుడి పరిస్థితి.
సీరియల్‌ని చదివిన పెద్దాయన కవి శివారెడ్డి. ప్రతి వారం ఒక వార పత్రికని కొని..ఒక ముక్క చదివి..మళ్ళీ వచ్చేవారం కోసం ఎదురుచూస్తు..ముక్కలు ముక్కలుగా చదవటానికి విముఖుడు. అలా చదవాలంటే చెడ్డ చిరాకు ఈ కవికి. కాని ఆయన ప్రతివారం ముక్కలు ముక్కలుగానే చదువుకున్నాడంట సీరియల్‌ని. అంతగా ఆకర్షించింది ఆయన్ని. ఇక్కడ గుర్తుంచుకోవలసింది ఒకటి ఉంది. ఆయన కవి. కథకుడు కాదు. నవలా కారుడు అంతకంటే కాదు. అవంటే పెద్ద ప్రేమా, మోజు లేదాయనకి. ఆయనే చెప్పుకున్నాడా మాట ఆ వేదిక మీద నుంచి. ఏకంగా 22 పేజీల ముందుమాట వ్రాసేయించింది ఆ నవల ఆ కవితో.
ఎవరూ ఏ పుస్తకాన్ని ఒక్క సారి చదివి నమిలి పిప్పిని పారేసిన వారు కాదు, బెకన్ అన్నట్టుగా. మాట్లాడిన వారందరూ ఆ నవలలని..ఆ కథలని పరిచయం చేసిన వారందరు ప్రతి పుస్తకాన్ని ఆవాహన చేసుకున్నవారే. ఆ పుస్తకాలు వారందర్నీ తమ ప్రపంచంలోకి రమ్మనమని సాదరంగా ఆహ్వానించినవి. వీరు ఆ యా ప్రపంచాలలోకి వెళ్ళి ప్రతి పాత్రతోను పయనించి, వారి జీవితాలని స్పృశించి, ఆ లోకాలను అనుభవిస్తూ వెలికి వచ్చారు. మళ్ళీ అ సాహిత్యంలోకి వెళ్లాలనిపించి వెళ్ళారు. వదలలేదు. వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్లారు. రేపు మరోసారి మళ్ళీ వెడతారు. వారి మాటలు వింటుంటే మళ్ళీ మళ్ళీ ఆ లోకాలలో విహరిస్తూనే ఉంటారనిపిస్తుంది.
నవీన్ వాసిరెడ్డి
సభకు అధ్యక్షుడు. నేను పోలీసుల చెకప్పులు, వినాయకుడి విగ్రహాలను తప్పించుకుంటూ హైద్రాబాదు ట్రాఫిక్కులోపడి ఈదుకుంటూ వెళ్ళేటప్పడికి ఆయన ఉపన్యాసం అయిపొయ్యి వక్తలను ఆహ్వానిస్తున్నారు.
జగన్నాధ శర్మ (నవ్య సంపాదకులు,) చాల క్లుప్తంగా మాట్లాడారు.
“సాహితీలోకంలో ఒక మాట ఉంది. 1910 నంచి 20/30 ల దాక తెలుగు సాహిత్యంలో అనువాద కాలం అని. కాని నేను ఇప్పుడు చెబుతున్నాను. 2010 నుంచి మళ్ళీ తెలుగు కధా సాహిత్యం, నవలా సాహిత్యం మొదలైనది. భారతదేశంలోని ఇతర భాషలు తెలుగు భాష వైపు తెలుసు సాహిత్యం వైపు చూస్తుండాల్సిన తరుణం వచ్చేసింది. దానికి కారణం చంద్రశేఖర రావు లాంటి రచయితలు. నవల రూపు చూడకండి. నవలలో వస్తున్న వస్తువుని చూడండి. గొప్ప తెలుగు సాహిత్యం ఈ దశాబ్దం తో మొదలయ్యింది మళ్ళీ. ఇంతకన్నా తెలుగు సాహిత్యం గురించి నేను చెప్పగలిగింది లేదు”.
కవి శివారెడ్డి
కవి శివారెడ్డి మూడు సార్లు చదివారు. ఆయన నల్ల మిరియం చెట్టు కి ముందుమాట(?) అందామా “ఒక గాధ గురించి” అని శీర్హిక పెట్టి..అంటారు కదా..తొలి వాక్యం లో.
” నేనిప్పుడో మహోపన్యాసం చెయ్యగలను డా॥ వి. చంద్రశేకఖర రావు గారి సాహిత్యం మీద”.
“Preconceived notions లేకుండా రచయిత దగ్గిరకు వెళ్ళే ఒక తరం పాఠకులొస్తారు. వచ్చారు. విమర్శకులే రావాల్సింది.
ఊర్వశి అంటుంది పురూరవుడి తో,’ప్రేమ కావాలా..నీ అలంకారాలన్ని, ఆభరణాలన్నీ పక్కన బెట్టి దిగంబరంగా నా దగ్గిరకు రా,’ అని. అలా పాఠకుడు అన్ని misconceived, wrong notions ని పక్కనబెట్టి – పరమ దిగంబరంగా వాచకం దగ్గిరకెళ్ళాలి – ఆ పాల సముద్రం లో మునగాలి.” అవి ఆయన మాటలు.
ఎ కె ప్రభాకర్ గారు
చంద్రశేఖర రావు సాహిత్యం గురించి సోదాహరణం గా వివరించారు. నల్ల మిరియం చెట్టుగురించి మాట్లాడుతూ వారి మిగతా సాహిత్యంలోకి సభికులను లాకెళ్ళారు. ప్రత్యేకంగా ఆ నవల ముగింపుని పాజిటివ్ దృక్పధంతో నే చూడవచ్చు అని అన్నారు.
సీతారాం
చంద్రశేఖర రావు వచనం కవిత్వం కాదు. ఆయన తన ఆవేదనని పరివేదని అలా వ్యక్తం చేస్తున్నాడు. It is his expression of agony. His form and content needs more critics. “ఆయన రచనలమీద పరిశోధన చేస్తున్నాను,” అని అన్నారు. అంతగా కదిలించినవి చంద్రశేఖర రావు గారి సృజనలు ఆయనలోని విమర్శకుడిని. నల్ల మిరియం చెట్టుగురించే తాను మాట్లాడు దాం అని అనుకున్నానని కాని..దాని పరిధి దాటి మాట్లాడారు.
గుడిపాటి
చంద్రశేఖర రావు గారి సాహిత్యం మీద చాల చర్చ జరగవలసి ఉంది. ఇక్కడ కలిసిన ఈ రెండు మూడు వందల సాహితీవేత్తల మధ్య జరిగినదే కాదు. ఇంకా జరగాలి. వేదికలెక్కాలి. పాఠకులు అందులో ఇన్వాల్ కావాలి. ఇది ఇక్కడితో ఆగిపోదు.
రచయిత
నా కాల పరిస్థితులే నా రచనలని రూపొందించినవి. ఈ వేదిక మీద ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడం బాగుండదు.
జరిగిన సభ గుఱించి నా మాటలు:
ఎవరూ కూడా రచయిత వ్రాసిన ఏ ఒక్క కథకో ఏ ఒక్క నవలకో పరిమితం కాలేకపొయ్యారు. కారణం రచయిత ఎన్నుకున్న వస్తువు, శిల్పం, శైలి, భాష. ఒకరు దండోరా గుఱించి మాట్లాడితే, మరొకరు తెలంగాణా నేపధ్యంతో వ్రాసిన హెచ్ నరసింహం అత్మహత్య గురించో లేక చెంచువుల గురించో..ఐదు హంసల గురించో మరో కథ గురించో మాట్లాడారు. మధ్యలో కొ కు ఫోర్త్ డైమన్షన్ ని లాకొచ్చారు.
సాహిత్యం, పోకడలు, చంద్రశేఖర రావు రచనలు వారిమీద వారి ఆలోచనల మీద, ఆయన రచనలు తమ బుర్రకు పెట్టిన పనిమీద, పదునెక్కించిన రీతి..ఆ యా నవలల సాంఘిక, రాజకీయ, ఆర్ధిక, సామాజిక నేపధ్యాలు అధ్యయనం చెయ్యవలసిన అవసరం ఒకటేమిటి ఎన్నో అంశాలు..పరిపూర్ణమైన ఒక సాహితీ సభ అది.
కొత్త తరం పాఠకులు వచ్చారు!
కొత్త తరం పాఠకులు వచ్చారు. నేనంటున్నది కూడా అదే. నవ్య సంపాదకులు అంటున్నది అదే! కవి శివారెడ్డి అంటున్నది అదే. ప్రభాకర్ గారు అన్నది అదే! సీతారాం చెబుతున్నది అదే! గుడిపాటి చెప్పింది అదే! మీరందరూ చదవవలసిన పుస్తకాలు ఇవి.
చాలా రోజుల తరువాత సాహితీ మిత్రులను చాల మందిని కలుసుకున్నాను. చాల సంతోషమేసింది. ఎంత సాదరంగా అహ్వానించారో! ఆదరంగా పలుకరించారో అందరూ.
ఇక మీరు చెయ్యవలసింది.
ఈ బ్లాగ్ పోస్ట్ చూసి ఇక్కడి దాకా చదివారంటే..మీకు అంతర్జాలంతో పరిచయం ఉండే ఉండాలి. సాహిత్యం మీద అభిరుచు ఉండి ఉండాలి. కాబట్టి ఈ మూడు పుస్తకాలు ముందు సంపాదించండి.తరువాత వీటిని కూడా సంపాదించి చదువుకోండి.
జీవని
లెనిన్ ప్లేస్
మాయా లాంతరు
ద్రోహవృక్షం..ఈవన్నీ ఈ రచయిత కధా సంకలనాలు.
దిష్టి చుక్క:
తెలుగు ప్రసార మాధ్యమాల ఫోటోగ్రాఫర్‌లు. జరుగుతున్న సభ మధ్యలో దూరి, ఆ క్రమాన్ని ఆరాచకంగా ఆపేసి, తమ కెమరా ప్రలోభానికి కి లొంగనివాడెవ్వడూ లేడని చెప్పకుండా చెబుతూ దర్పంగా వచ్చినంత వేగంగా వెళ్ళిపోతారు. వాళ్ళు అడ్డం రావడం కారణంగా గుడిపాటి, నవీన్, ఎ కె ప్రభాకర్ బొమ్మల్లో కనిపించకుండా పొయ్యారు. తీసినవి సరిగ్గా రాలేదు. ఉన్నవి కాని ఇక్కడ పోస్ట్ చెయ్యలేదు.
గొప్ప సాహితీ సభ ఎందుకైనదంటే..ఎవరూ పక్కవారి చెవులు కొరకలేదు. గుస గుసలు లేవు. ఫోన్లు మోగలేదు. హాలు బయట కుహానా సాహితీవేత్తల అరుపులు, పెడబొబ్బలు లేవు. ఇక సభలో ఉన్నవారి సంగతంటారా! అందర్ని ఆ వేదిక మీద వక్తలు తమ మాటలతో కట్టి పడేసారు. ఇప్పుడు అర్థమయ్యిందా ఆ రచయిత డా॥వి. చంద్రశేఖర రావు రచనా పటిమ? పుస్తకాలు కొనుక్కుని చదువుకోండి. చదువుకుని మీ బ్లాగుల ద్వారానో మరొక వెబ్‌సైట్ ద్వారానో మీ అభిప్రాయాలని పది మందితో పంచుకోండి! ఇక మొదలెట్టండి!