ఫుడ్కోర్ట్ ఓనరు గారి సతీమణి

భుజానికి చెవికి మధ్యనుంది అతని కరవాణి.

చేతులు ఖాళీగా లేవు.ఫుడ్ కౌంటర్ వెనకాల అతనున్నాడు.

ఫుడ్ కౌంటరు ముందు నాలాగా చేతిలోనో, జేబుల్లోన్నో డబ్బులున్న మారాజులు, మారాణులు, ఫుడ్‌కి లాట్రికొడుతున్నవాళ్ళున్నారు.  కానీ అతనికి ఇవేమి పట్టటంలేదు. ఫోనులో చక్కగా అవతలి వాళ్ళతో చతుర్లాడుతూ రెండుచేతుల్తోటి ఏదో టిపిని ని పొట్లం కడుతున్నాడు.  అతనివెనకాల 24 ఇంచి కలర్ టీవీ బ్లేర్ మంటోంది.  ఫూడ్ కోర్ట్ యజమాని స్నేహితులనుకుంటాను ముగ్గురూ దానికెదురుగా మూడు ప్లాస్టిక్కు కుర్చిలలో కూర్చుని అదేదో చలనచిత్ర కళాఖండాన్ని చూస్తున్నారు.  అందులో ఒకడు గోల్డ్ ఫ్లేకు పిల్టర్ కింగ్స్ సిగరెట్టు నుసిని అలవోకగా కుడిచేత్తో ఆ ఫుడ్‌కోర్ట్ నేలమీదకి రాలుస్తున్నాడు. అఫ్ కోర్సు అతనికి పాసివ్ స్మోకర్స్ గురించి పెద్ద బెంగున్నట్టు లేదు.  ఈ పెపంచకంలో ఎన్ని దోమలు, ఈగలు చావటంలేదు క్షణ క్షణానికి.  జీవితములు బుద్బుదప్రాయములు కదా!  అయినా మన స్నేహితుడు ఓటల్లో మనం శ్వేతకాష్టాన్ని కాల్చకపోతే ఇంహెవడు కాలుస్తాడు?

మన పాకర్ ఇంకా భుజానికి చెవికి మధ్యనున్న కరవాణి ద్వారా చేస్తున్న సంభాషణకి స్పాట్ పెట్టలేదు.

మెడలో కుక్కబిళ్ళ తగిలించుకున్న ఆ యువతి బహుశ తిన్నగా తన కార్యాలయం నుండి వచ్చినట్టుంది, ముఖంలో అలసట కనపడుతోంది.  తలకి తగిలించుకున్న శిరస్త్రాణం బరువును మోస్తూ, ఒంటికాల్మీద నిలబడి, కాదు, వేచి ఉంది.

ఆ పక్కనే ఇద్దరు పిల్లలతో  ఉన్నాడు, వాళ్ల తండ్రి కామోసు!  వాళ్ళు ఆశగా సీమవెండి పళ్ళెంలో చెల్లాచెదురుగా పడేసిన పకోడిలవైపు చూస్తున్నారు.  అవి సాయంకాలం ఏ నాలుగింటికో వేయించినట్టున్నవి.  చూస్తుంటేనే తెలిసిపోతున్నది ఆ వాలిపోయిన ఉల్లిపాయల ముక్కల్ని చూస్తుంటే…ఏ సబ్ జీరో టెంపరేచర్లోనే ఉన్నాయని.

మన పాకర్ ఇంకా భుజానికి చెవికి మధ్యనున్న కరవాణి ద్వార చేస్తున్న సంభాషణకి స్పాట్ పెట్టలేదు.

ఫుడ్కోర్ట్ ఓనరు గారి సతీమణి అనుకుంటాను…ఏమ్చెయ్యాలో  తోచక అక్కడ నిలబడుంది.

ఇందాక పాక్చేసిన టిప్నిని కౌంటర్ మీదున్న ఒక పోలిధిన్ సంచిలోకి తోసేసి  ఎదురుగా నిలబడ్డ ఆయన్కేసి చూసేసి…ఇవి నీకే తీసుకుఫో అని కళ్లతోనే అనేసాడు ఆ పాకర్ కుర్రాడు.  ఎంత గొప్ప నైపుణ్యమున్న మారాజు!

మెడలో కుక్కబిళ్ళున్న యువతికి, భుజానికి చెవికి మధ్యనున్న కరవాణితో అలానే సంభాషిస్తూ…నీకు ఏం కావలన్న చూపు.  ఆమె  “రెండు పరోటాలు, కర్రీ” అంది.  ఈ లోపు ఫుడ్‌కోర్ట్ ఓనరు గారి సతీమణి అనుకున్నామే ఆవిడ ముందుకు కదిలింది.  మెడలో కుక్కబిళ్ళున్న యువతి భుజానికున్న షోల్డర్‌బ్యాగులోపల్నుంచి పర్సు తీసి లోపలికి చెయ్య్ జొనిపి దెవులాడి ఒక వంద రూపాయల నోట్ని దొరకబుచ్చుకుని ఆ ఫుడ్కోర్ట్ ఓనరు గారి సతీమణి  అనుకున్నామే ఆవిడకి అందించింది, కుడిచెత్తో.  అసలే మన అడలేడిస్‌కి సెంటిమెంట్స్ ఎక్కువకదా!  ఫుడ్కోర్ట్ ఓనరు గారి సతీమణి అనుకున్నామే ఆవిడ కూడ కుడి చేత్తో దాన్ని అందుకుంటూ మన పాకర్ వైపు చూసింది…ఎంత తీసుకోవలని ప్రశ్న అనుకుంటాను.  పెదాలతో అరవై అన్నాడా మహానుభావుడు.  ఫుడ్కోర్ట్ ఓనరు గారి సతీమణి అనుకున్నామే ఆవిడ కాష్ కౌంటర్వైపు వెళ్ళింది, చిల్లర తెచ్చివ్వడానికి.

Chapati
చపాతిలు – వితౌట్ ఆయిల్ కాదు

మన పాకర్ ఇంకా భుజానికి చెవికి మధ్యనున్న కరవాణి ద్వారా చేస్తున్న సంభాషణకి స్పాట్ పెట్టలేదు.

ఫుడ్డు కౌంటర్ పక్కనే ఉన్న స్టూలు మీదున్న పెద్ద హాట్పాక్ నుండి రెండు పరోటాలు అందుకున్నాడు.  వాటిని తనముందున్న ఫుడ్కౌంటర్ లోపల ఖాళీ జాగాలో పడేసాడు. రెండు అరజేతులతోను వాటిని మర్దనా చేసాడు.  ఆ మర్దన కి ఫుడ్కౌంటరు అదిరిపోయింది.  ఒక దినపత్రిక ఫుల్ షీట్ అందుకుని, దానిలోకి వాటిని విసిరేసి చుట్టు చుట్టేసి, అంచులు మడిచేసి, దాన్నిఓ పాలిధీన్ సంచిలోకి తోసేసి, అదే చేత్తో మరో చిన్న పాలిధిన్ కవర్ అందుకుని, తన పక్కనే ఉన్న సాంబారు (అని నేఅనుకున్నా)  స్టీలు గిన్నె లోఉన్న గరిటేని అందుకుని దానిని మరో పక్కనే ఉన్న పప్పు (అని నేఅనుకున్న) గిన్నెలోకి పడేసి ఇంత పప్పు అందుకుని దానిని ఆ పాలిధిన్ సంచీలోకి వొంపేసాడు.  తరువాత ఆ పాలిధిన్ సంచీ కొసలు పట్టుకుని గిర్రున తిప్పాడు.  ఎంత నైపుణ్యం!  ఇప్పుడు ఆ కొసలు రెండింట్ని మధ్యకంటా లాగి ముడేసాడు.  ఆ పప్పు పాకెట్ని ఇందాక పరోటాచుట్టని పడేసిన సంచిలోకి వేసేసి, కుడిచేత్తో మెడలో కుక్కబిళ్ళున్న యువతికి అందించాడు.  పాపం, మహా పతివ్రతఅయిన ఆ ఇల్లాలు, పాకర్ వేళ్లకి తనవేళ్ళు తగలకుండా అతి జాగ్రత్తగా ఆ సంచిని అందుకుంది.  ఈ లోపు ఫుడ్కోర్ట్ ఓనరు గారి సతీమణి అనుకున్నామే ఆవిడ చిల్లరని తెచ్చి ఈ మెడలో కుక్కబిళ్ళున్న యువతికి అందించింది కుడిచేత్తోనే. ఈవిడకూడా కుడిచేత్తోనే అందుకుంది.  అందుకుని వెనక్కి తిరుగుతూ, ఎడం చేత్తో, తను వేసుకున్న టాప్ని సర్దుకుంది, నడుంకిందకి లాక్కుంటూ.  బహుశ పాకర్ చూపుల మీద అనుమానం కామోసు!

మన పాకర్ ఇంకా భుజానికి చెవికి మధ్యనున్న కరవాణి ద్వారా చేస్తున్న సంభాషణకి స్పాట్ పెట్టలేదు.

నా వంక చూసాడు, పాకర్ “ఏం కావా”లన్నట్టు.

కరవాణిలో మాట్లాడుతున్నాడుగా అని ఎడం చెయ్యి బొటన్వేలుతో చిటికినవేల్ని, నాలుగోవేల్ని మడిచిపట్కుని చూపుడువేల్తో బాటు మధ్యవేల్ని చూపించాను. చూపిస్తూ  శబ్దం చెయ్యకుండా పెదాల్ని, రెండు చపాతిలు అని అర్ధం అయ్యేలాగ కదిలించాను.  అలాగే ‘పప్పు’ వైపు కళ్ళతో సైగ చేసాను.  సైగ చేస్తూ ఫుడ్‌కోర్ట్ ఓనరు గారి సతీమణి అనుకున్నామే ఆవిడ్కి నా ఎడంచేత్తో, నా జీన్స్ పాంటు వెనకాతలున్న ఎడం జేబిలోనుంచి యాభై రూపాయల్నోట్నిలాగి బొటనవేలు చూపుడువేల్మధ్య పట్కుని అందించాను.  ఆవిడ్నోటు అటువైపు కొసల్తోటి అందుకుంది.

ఇందాక లాగానే, పాకర్ హాట్పాక్ నుంచి రెండు చపాతీలు తీసి, న్యూస్పేపర్ మీదకి గిరాటేసి, రోల్చేసి, అంచుల్మడిచేసి, పోలితిన్కవర్లోకి నెట్టేసాడు.  పప్పు గిన్నెలోంచి రెండు గరిటెల పప్పుని మరో చిన్నకవర్లోకి వేసేసాడు.  దాని కొసలుపట్టుకుని తిప్పాడు.  ఈలోపు కరవాణి తో సంభాషణ తీవ్రత ఘాటు గాఢమైనట్టుంది.  గొంతు పెంచాడు.  పప్పున్న సంచి కొసర్లు ముడేసేసి, దాన్నిన్ను, చపాతిరోలున్న సంచినిన్ను ఫుడ్ కౌంటర్మీదకి విసిరేసినంతపన్జేసాడు.

ఫుడ్కోర్ట్ ఓనరు గారి సతీమణి అనుకున్నామే ఆవిడ యాభై రూపాయలలో, చపాతి ఒక్కింటికి పది రూపాయల్చొప్పున్న రెండు చపాతీలకి ఇరవై రూపాయలు, కరికి మరో ఇరవై రూపాయలు వెరసి నలభై రూపాయల్పోను తీసుకుని నాకివ్వాల్సిన పది రూపాయల చేంజ్ చేత్తో పట్టుకుని నా వైపొస్తున్న క్షణంలో…
నేను పప్పున్నసంచి, చపాతిరోలున్న సంచిన్ను అందుకుంటుంటే…పప్పున్న సంచి చెవుల ముడి ఊడిపొయ్యి…పప్పు నేలతల్లి నోట్లోకి జారుకుంది.

అప్పుడు…ఏది ….అప్పుడు మన పాకర్ ఇంకా భుజానికి చెవికి మధ్యనున్న కరవాణి ద్వారా చేస్తున్న సంభాషణకి స్పాట్  పెట్టాడు.

చపాతిరోలున్న సంచిని ఆ ఫుడ్కవుంటర్ మీదకి గిరాటేసి ఫుడ్కవుంటర్ వాళ్ళకి నా వీపు చూపిస్తూ వడివడిగా అడుగులేసుకుంటూ వచ్చేసాను.

నా వెన్క ఫుడ్‌కోర్ట్ ఓనరు గారి సతీమణి అనుకున్నామే ఆవిడ “అంకుల్, అంకుల్” అని పిలుస్తోంది.  “సార్”, “సారు,” అంటూ పాకర్ పిలుస్తున్నాడు.

ఇంటికాడ ఒక ఆప్లికాయ, పెద్ద గళాసునిండ హెర్టేజ్వాడి పెరుగు గిల్కోట్టేసి మజ్జిగ చేసేస్కుని తిని,తాగి తొంగున్నా ఆ రాత్రి.

 

వేట లో ఇది మూడవది అనుకుంటా! మొదటిది ఇక్కడ.  రెండవదేమో ఇక్కడాను.