ఆ మధ్య ఒక సాయంత్రం జుబిలీ హిల్స్, మహాప్రస్థానం లో ఎవరికో వీడ్కోలు పలికి వస్తుంటే, దారిలో ఆ పాప, తమ్ముడు, వాళ్ళ నాన్నతో కనిపించారు. చలాకిగా నవ్వుతూ, తుళ్ళుతూ, హుషారుగా, సంతోషంగా దాదాపుగా పరిగెడుతున్నారు. వాళ్ల వెనుక వాళ్ళ నాన్న అనుకుంటా, భుజం నుంచి వాటర్ బాటిల్ తగిలించుకుని వాళ్ళ అడుగులో అడుగు వేసుకుంటూ హాయిగా నవ్వుతూ వెళ్తున్నాడు. అమీర్ పేట మెట్రో స్టేషన్. నేను వాళ్లతో పాటే, స్టేషన్ వైపుకి అడుగేసాను. ఆ పాప ఎస్కలేటర్ ఎక్కడానికి సందేహిస్తూ ఆగి పోయింది. తమ్ముడు, ఒక గెంతు, గెంతి ఎస్కలేటర్ మీదికి చేరుకున్నాడు. అప్పుడు గమనించాను. వాళ్ళ తండ్రి, ఎడం చేతివైపు మెట్లమీద, మాకంటే ముందుండి తన పిల్లల్ని మొబైల్ కెమెర ఫోటోలతో జ్ఞాపకాలని దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని.
“ఫరవాలేదమ్మా, ముందుకొక అడుగెయ్యి, వెనక నేనున్నాగా!” అంటూ వెనక నుంచి నాకు అందుబాటులో ఉన్న పాప కుడి భుజం మీద తట్టాను. అప్పటిదాక నన్ను చూడని పాప వెనక్కి తిరిగి చూసింది. బిగుతుగా కట్టిన రెండు జడలు ఒక్కసారిగా వెనక్కి తిరిగాయి. చక్కగా నవ్వుతున్న పెద్ద కళ్ళు. వాళ్ళమ్మ కాటుకతో దిద్దిన కళ్ళు. వాటి మధ్య ఎర్రటి బొట్టు. అమాయకంగా నవ్వుతున్న పెదవులు! ఆ నవ్వు పాపకళ్ళలో కూడా జర్రున పాకింది! ఎంత అమాయకంగా, ఆనందంగా ఉందో! ఆ మొహం! గబుక్కున మరో పాప మొహం గుర్తోఛ్హింది!
తమ్ముడు ఎస్కలేటర్ మీద రెండు మెట్లు ముందుకు దూకాడు.
పాప ఎస్కలేటర్ మీదకి అడుగేసింది.
అవతల తండ్రి మెట్ల మీద మరో రెండడుగులేసి, రెండు మెట్లు దాటి వాటి పైకి చేరుకున్నాడు. ఫోటో తియ్యడానికి వాళ్ళూ, వీళ్లు అడ్డం వస్తున్నారు.
“నువ్వు దూకు ముందుకి. మెట్లెక్కినట్టు ఎక్కెయ్. ఏమి కాదు. నీ వెనక నేనున్నానుగా!” అంటుంటే విని, నేను భుజం తట్టేలోపు, ఒక మెట్టేక్కింది. మళ్ళీ మరొకటి. ఈ సారి రెండు. రైలింగ్ని పట్టుకుని వడివడిగా, హుషారుగా! అందరం పైకి చేరుకున్నారు. నేను పైకి వెళ్ళేటప్పడికి, పిల్లల్నిద్దర్ని ఒక వైపు నుంచో బెట్టి తండ్రి ఫోటోలు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. పశ్చిమాన దిగుతున్న సూర్యుడు, తండ్రి మొఖం మీద. అక్కడున్న సైన్బోర్డ్ నీడలో పిల్లలిద్దరు.
“Go, stand with them, I will help you with the pictures,” అని నేను ముందుకు వెళ్తే, ఆ తండ్రి “థాంక్ యూ సార్” అంటూ మొబైల్ ఫోన్ నాకందించాడు.
ఇప్పుడు సైన్బోర్డ్ నీడలో తండ్రి, పాప, తన తమ్ముడు. రెర్ కెమెరా లో వాళ్ల బొమ్మలు ప్రస్ఫుటంగా కనబడటం లేదు. వెలుతురు సరిపోవడం లేదు. జూమ్ చేసాను. పాప జూమ్‌లో ఉంది. అమాయకంగా నవ్వుతున్న కళ్ళు. నవ్వుతున్న పెదాలు. గబుక్కున మరో పాప మొహం గుర్తోఛ్హింది. కళ్ళు అలుక్కుపొయ్యాయి.
రెండో, మూడో టక టక మని క్లిక్ మనిపించాను. వాళ్ల ముగ్గురుని గ్రూప్ లోకి తీసుకుని మరో రెండో, మూడో క్లిక్ చేసాను. తరువాత, వాళ్ళ ముగ్గుర్ని దిగుతున్న సూర్యుడికి అభిముఖంగా, టికెట్ కౌంటర్స్ బాక్ డ్రాప్ తో తీస్తుంటే, తమ్ముడు పెదవులు బిగించి చూస్తున్నాడు. “Say cheese and smile,” అని అంటుంటే వాడు, వాడి అక్క #అసిఫా, వాళ్ల నాన్న నవ్వుతుంటే రాపిడ్గా మరో అయిదో, ఆరో క్లిక్ చేసాను.
“Say thanks to uncle,” ఆంటూ వాళ్ళ తండ్రి నేనందించిన తన మొబైల్ ని అందుకున్నాడు. పాప దగ్గిరకొఛ్హి, కుడి చెయ్య సాచి, “థాంక్స్ అంకుల్,” అంది. తమ్ముడు అక్కడే నిలబడి నా వంక చూస్తున్నాడు. “It’s OK”, అంటూ నేను వెను తిరిగాను.
ఆ పాపలో నాకు Asifa కనపడింది. అప్పట్నించి నా చుట్టూ నాకు ప్రతి బాలికలోను అసిఫా కనబడుతోంది.