దాదాపు ఒక రెండు దశాబ్దాల క్రితం అనుకుందాం. పడవల్లాంటి కార్లు, ఆరడగుల ఆజానుబాహువు, నుదుటి మీద ముంగుర్లు సర్దుకుంటూ ఏ ఫెమినానో, డికెన్సు పుస్తకాన్ని చదువుకుంటున్న ఆమె, తో, ప్రేమ, ఆఖరి పేజిలో కధానాయిక కోరుకున్న ఆసుపత్రి ప్రారంభోత్సవం లాంటి ఆకాశంలో విహరించడానికి కావల్సిన అందమైన కలలతో వెలువడే నవలా శకం అది.
ఒక ఒంటరి వాడు, ఒక యువతి, ఏ పల్లెటూరు నుంచో ఒక మహా నగరానికి వచ్చి ప్రపంచాన్ని జయించే క్రమంలో ఇచ్చే వాల్యుబుల్ కోట్స్ తో మరో వైపునుంచి పర్సనాలిటి డెవలెప్మెంట్ ఇత్రివృత్తాలతో వెలువెడుతున్న సో కాల్డ్ ‘క్షుద్ర సాహిత్యం’ నవలా యుగం అది.
బెంగాలి నవలల అనుసృజనలతో హోరెత్తి పోతున్న సమయంలో, రాబిన్ కుక్, నిక్ కార్టర్ కిల్ మాస్టర్, ఆర్ధర్ హెయిలి, అలిస్టర్ మెక్లెయిన్, హారోల్డ్ రాబిన్స్, స్టాన్లి గార్డ్‌నెర్ , ఫోర్స్‌త్, డేవిడ్ సెల్జర్ ల రచనల / పాత్రల కిచిడి తో సీరియస్‌గా సీరియల్స్ తో వార పత్రికల అమ్మకాలు లక్షల్లోకి చేరుకున్న శకం అది.
బ్లాంక్ చెక్‌లతో తన ఇంటి వసారాలో ప్రచురణ కర్తలు కూర్చుని ఉంటే రచయిత/త్రు లు వారిని గుర్తించని రోజులు, అవి.
ఆలాంటి రోజులలో రచయితకు సాంఘిక బాధ్యత ఉన్నదన్న నిర్దుష్టమైన అభిప్రాయంతో ఉండి రచనలు చేస్తున్న ఒకానొక రచయితకు ప్రభుత్వం గుర్తింపుతో బాటు కొంత నగదు కూడ అందింది.
కమర్షియల్ రైటర్‌గా డబ్బుకు డబ్బుకు, పేరు, గుర్తింపు పొందిన ఒకానొక రచయిత , ఈనాడు గ్రూప్‌లో మేగజైన్స్ ఎడిటర్ చలసాని ప్రసాద రావు గారిని కలిసాడు. పిచ్చాపాటి మాటల్లో, ఆ రచయిత “ఆయ్యా, ఇన్ని పత్రికలలో, నా కథ గాని, నవలగాని, సీరియల్ గాని, ప్రచురించనివి ఒకటి కూడ లేవు. మరి నన్ను గుర్తించదేమి ఈ ప్రభుత్వం?” అని తన అవేదనని, ఆక్రోశాన్ని, అక్కస్సుని వెళ్లబుచ్చాడు.
ఠకీ మని ఆయన అన్నాడు కదా, ” నీకు గుర్తింపు ఎందుకు? డబ్బు సంపాదించుకుంటున్నావు కదా? నీకు గ్లామర్ ఉంది కదా? ఆయనకి అవి రెండు లేవు కదా! అందుకనే ఆయన్ని ప్రభుత్వం గుర్తించింది. పురస్కారమిచ్చి గౌరవించింది. నీకున్న దానితో నువ్వు తృప్తి పడు. నీ సాహిత్యానికి అదే ఎక్కువ!”
ఈ సందర్భంగా
మీకు,
మీ అప్తులకు,
మీ ఆత్మీయులందరికి
సంక్రాంతి
శుభాకాంక్షలు
తెలియజేసుకుంటున్నాను.
సౌజన్యం ఆ మధ్య ఏవో మాటల మధ్య దాసరి అమరేంద్ర, నేను, కథ నవీన్ కలిసి మాట్లాడుకుంటుంటే బయటపడ్డ విషయం అది. రచయిత/త్రి పేరు మాత్రం నన్ను అడగవద్దు. 😉