గత పాతికేళ్ళుగా క్రమం తప్పకుండా వెలువడుతున్న కధాసాహితి వారి 25 వార్షిక కథా సంకలనం కథ 2014 లో ఈ ముగ్గురి కథలున్నవి.
బత్తుల రమాసుందరి మొదటి కథ ఇక్కడ
చదువుకోవచ్చు; మనిద్దరమే ఉందాం అమ్మా! ఆంధ్రజ్యోతి దిన పత్రిక వారి ఆదివారం అనుబంధం (01-09-2013లో ప్రచురితం)
ఇక రెండవ వారు పాలగిరి విశ్వప్రసాద్, వీరి మొదటి కథ బోలు మనుషులు రచన మాస పత్రిక సెప్టెంబరు 1991లో
ప్రచురితం. నేను వెతికినంతలో అది నాకు జాలంలో దొరకలేదు.
ఇక మూడవ కథకుడు భగవంతం.
వీరి మొదటి కథవెయిటింగ్ ఫర్ యాద్గిరి.
ఈ కథ తొలిసారిగా 2006లో వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితం.
చలన చిత్ర దర్శకుడు వంశీ, నా కెందుకు నచ్చిందంటేఅనే శీర్షికతో
గోతెలుగు డాట్ కాం లో ఈ కథని మెచ్చుకుంటూ పరిచయం చేసిన కథ. భగవంతం పాడిన పాట ఇక్కడ వినొచ్చు. సా.వెం.రమేశ్ స్వరం కూడా!
రానున్న ఆదివారం 20న, తెనాలి లో జరగనున్న కథ 2014 ఆవిష్కరణ సభలో బహుశ వీరందరిని మీరు కలుసుకోవచ్చు. వీరు ముగ్గురే కాదు ఇంకా ఉన్నారు. వారిలో కొంతమంది గురించి రేపు చెబుతాను.
“బెర్నాడ్ షా వ్రాసిన ‘సీజర్ అండ్ క్లియోపాట్రా’ నాటకంలో థియోడాటస్ అనే అతను అలెగ్జాండ్రియా లైబ్రెరి తగలబడిపోతుంటే చూడలేక సీజర్ దగ్గిరకి వెళ్ళి బ్రతిమాలాతాడు. సైనికులని పంపి మంటలార్పమనీ, పుస్తకాలని కాపాడమనీ. సీజరు ససేమిరా అంటాడు.
‘అక్కడాహుతౌతున్నది వట్టి కాగితాల కట్టలు కాదు. మానవజాతి కష్టించి ఆర్జించుకున్న సంస్కృతీ, సంస్కార, సంప్రదాయాలు దగ్ధమౌతున్నాయి. మానవజాతి సంపాదించుకున్న మధుర స్మృతులన్నీ మసైపోతున్నాయి’ అని అక్రోశిస్తాడు ధియోడాటస్.
‘నువ్వేమి చెయ్యకుండా కూర్చుంటే రాబొయ్యే తరాలవారు నిన్ను పుస్తకాల విలువ కూడా తెలుసుకోలేని మూర్ఖుడిగాను, ఆటవిక సైనికుడిగాను జమ కడతారు సుమా!’ అని సీజర్ని హెచ్చరిస్తాడు.
అలాంటి సీజర్లింకా యీ యిరవయ్యో శతాబ్దంలో కూడా ఉన్నారా? అని మనం సందేహించవల్సిన అగత్యం లేకుండా పోయింది: ‘ప్రజాస్వామ్యానికి, వ్యక్తి స్వాతంత్యానికి పట్టుకొమ్మ అని, భూతలస్వర్గం (God’s own country) అని పేరు మోసిన అమెరికా పుస్తకాల మీద బ్రహ్మాండమైన దాడిని ప్రారంభించింది.’ ” అట్లూరి పిచ్చేశ్వర రావు వ్రాసిన విన్నవి – కన్నవి లో నుంచి.
నిన్న జరిగిన సంఘటన నాకు మా నాన్న వ్రాసిన పై పేరాగ్రాఫ్‌ని గుర్తు చేసింది.
కానీ దాని నేపధ్యం వేరు.
నిన్న సాయంత్రం యువ సాహితీ మిత్రుడు అనిల్ బత్తుల (అతను ఈ భూమ్మిద పడకముందే ప్రచురించబడ్డ సోవియట్ పుస్తకాలు అతి ముఖ్యంగా వాటి తెలుగు అనువాదాలని ఇప్పుడు డిజిటల్ ఫార్మాట్ లో ఉచితంగానే అందరికి అందజేయాలనే ఒక ఆశయంతో ముందుకు సాగుతున్నవాడు) నాకు ఫోన్ చేసి, “సార్, పారిస్ పతనం మీ నాన్నగారే కదా అనువదించింది? ఒక పాత ప్రతి ఒకటి ఈ హైద్రాబాద్ బుక్ ఫెయిర్‌లో ఎక్కడో ఉందట! ఇందాక ఫలానా వారు ఫోన్ చేసారు. ఒక్కసారి మిమ్మల్ని కనుక్కుని కన్ఫర్మ్ చేసుకుందామని చేసాను సార్,” అని అన్నాడు.
అతను అడిగింది నిజమే! The Fall of Paris ని వ్రాసింది ఇల్యా ఎహ్రెన్‌బర్గ్ (Ilya Ehrenburg). ఆంగ్లంలో తొలి ప్రచురణ 1940 ప్రాంతాలలో.
దాని తెలుగులో కి అనువదించింది అట్లూరి పిచ్చేశ్వర రావు. సుమారు 840 పేజిలు. తెలుగులో ప్రచురణ కాలం మార్చ్ 1960.
సరే, ఇక బుక్ ఫైయిర్ లో పారిస్ పతనం దొరకడానికి, మీ నాన్న వ్రాసిన దానికి, సీజర్ కి ఆ లైబ్రేరి తగలబెట్టడానికి సంబంధం ఏవిటి అనే దానికి వస్తున్నాను.
1980 ప్రాంతాలలో తానా సభలకి వెళ్ళారనుకుంటాను డి. వి. నరసరాజు గారు. తానా పత్రిక లో ఏదో వ్యాసం కోసం వారికి ఫోను చేసినప్పుడు “ఇస్తాను, రండి ఇంట్లోనే ఉన్నాను,” అని అన్నారు. ఆ సందర్భాన్ని కూడ గుర్తు చేసింది నిన్నటి అనిల్ బత్తుల ఫోన్ కాల్.
నరసరాజు గారు అన్నారు కదా, “అనిల్, పుస్తకాలు మన దగ్గిరే ఉంటే లాభం ఏమి ఉంది? అవి ముద్రించింది పది మంది చదవాలనే కదా! మీరు తీసుకు వెళ్లండి. చదవండి. మీ పని అయిపోయిన తరువాత నాకు తెచ్చి ఇవ్వండి. మీరు నాకు ఇవ్వక పోయినా ఫరవాలేదు. ఇంకేవరైనా చదువుతానంటే వారికివ్వండి,” అని.
పదిమంది చదవడానికి పుస్తక భాండాగారాలు అంటే లైబ్రేరిలు ఏర్పడ్డాయి. ఆ భాండాగారాలలోని పుస్తకాలు ఇప్పుడు పదిమందికి అందుబాటులోకి వెళ్లకుండా దొడ్డి గుమ్మంద్వారా ఇలా బజారులోకి వస్తున్నాయ్యా? అది హర్షణీయమా అన్న ప్రశ్న తలెత్తింది నాలో.
మా నాన్న గారి సాహిత్యం పునర్ముద్రణ కోసం నాకు ప్రస్తుతం అందుబాటులోలేని పుస్తకాలకోసం వెతుక్కుంటున్నప్పుడు సాహిత్యాభిమానులలో ఒకరిద్దరు తాము చూసామని దొరికిన రెండు మూడు పుస్తాకాలు సుమారు నాలుగైదు దశాబ్దాల క్రితం ప్రచురితమైన వాటి ప్రతులు కొని పంపారు.
840 పుటల పారిస్ పతనం, 1960 మార్చి ప్రచురణ, (బవుండ్ ఎడిషన్ అనేవారు) ప్రతి ధర 10 రూపాయలు. ఈ రోజు అదే పుస్తకాన్ని బహుశ ఏ 250/- కో 300/- కో అమ్మినా కొనుక్కునే వారున్నారు. ఎందుకంటే అంత ధర పెట్టి ఆ ప్రతిని కొన్నవారిని నేనెరుగుదును.
మనకి తెలుసో, తెలియకో ఇలాంటి అరుదైన పుస్తకాలని ఏదో ఒక విధంగా సంపాదించి ఇలా అమ్ముకోవడాన్ని మనం సమర్ధించాలా అన్నది నా ప్రశ్న. ఏదో ఒక పుస్తకమే కదా అని సరిపుచ్చుకోమంటారా? అలా ఒక పుస్తకంతో మొదలైనది మరి రేపు లైబ్రేరిలను కొల్లగొడితే? పది మంది కి అందాల్సిన పుస్తకాలు ఏ ఒక్కరి అలమారకో పరిమితమైతే అప్పుడేమంటారు?
దయచేసి మీ అభిప్రాయాల్ని క్రింది వ్యాఖ్యలలో తెలియజేయగోర్తాను.
తా. కలం: హైద్రాబాద్ బుక్ ఫెయిర్‌లో ప్రతి అమ్ముడైపోయింది ! చి న.