2014 లో సెప్టెంబరు నెలలో రెండవ ఆదివారం తేది14 అయ్యింది. ఆ రోజున మధురాంతకం నరేంద్ర గారి కథనివేదిక – సాహితీ సమావేశం సభ్యులు చర్చించుకున్నారు. ఆ కథ ని కధా సాహితి సంపాదకులు తమ కధ 2014 సంకలనంలో చేర్చుకున్నారు. మధురాంతకం నరేంద్ర సాహిత్యం గురించి మరి కొన్ని వివరాలు కథానిలయం లో ఇక్కడ చూడండి.
పెద్దిభొట్ల సుబ్బరామయ్య పురస్కారం వారి చేతుల మీదుగానే అందుకుంటున్న మధురాంతకం నరేంద్ర. వీరిద్దరూ అధ్యాపకులే! తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారిని కూడా ఇందులో చూడవచ్చు.
ఇవి కాక ఆంగ్లంలో The Hans India ఆంగ్ల దిన పత్రికలో ముఖ్యంగా తెలుగు సాహిత్యం మీద నరేంద్ర వ్యాసాలు కూడా వ్రాస్తుంటారు. నరేంద్ర గారి కథలలో కొన్ని; అత్యాచారం (991), నిత్యమూ నిరంతరమూ (1993), అస్తిత్వానికి అటూ – ఇటూ – (2001), నమ్మకం (2008), చిత్రలేఖ (2010), చివరి ఇల్లు (2013) ఇదివరలో కథాసాహితి వారి కధ సంపుటాలలో చోటు చేసుకున్నవి.
ఇందులో చెప్పుకోవలిసిన అంశం ఏమిటంటే 1992 లో కధ 1991ని ఆవిష్కరించింది కీ.శే మధురాంతకం రాజారాం. వారి తనయుడు మధురాంతకం నరేంద్ర.
ఇక కథా సారంగ లో (July 9, 2015) 3456GB వ్రాసిన కొట్టం రామకృష్ణారెడ్డి తొలి కధ – తీర్పు. ఇది 1991 ఫిబ్రవరిలో రచన మాస పత్రికలో వచ్చింది. వీరి కథ కూడ ఈ కథ 2014 సంపుటిలో ఉంది. వివరాలకు సంకలనాన్ని చూడండి.
బంధం కధ 2013 లో ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం ప్రచురించింది. ఆ కథ వ్రాసింది బోడపాటి హరితాదేవి. కలం పేరు రాధిక. సంపాదకులు ఎన్నుకున్న కధని మీరు కథ 2014 లోనే చూసుకోవాలి మరి. 🙂
2014 అక్టోబరులో రెండవ ఆదివారం 12 వ తేది అయ్యింది. ఆ రోజు సాయంత్రం డా. వి చంద్రశేఖర రావు గారి నవల నల్లమిరియం చెట్టు మీద వేదికసాహితీ సమావేశంలో తన అభిప్రాయాన్ని వినిపించారు కన్నెగంటి రామారావు. మరో సాహిత్య పిపాసి 🙂 డాక్టర్ ఇస్మాయిల్ కూడా ఆ రోజు సాయంత్రం వేదిక సమావేశంలో పాల్గొన్నారు. వీరిద్దరూ అమెరికాలో ఉంటారు. చెప్పొచ్చేదేమిటంటే యాజి కూడా అమెరికాలోనే ఉంటారు.
కథకుడు యాజి తన కధకు ఎన్నుకున్న అంశం మీద సాహిత్యలోకంలో చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది. యాజి కథకూడ కధ 2014 లో చోటుచేసుకుంది. విశేషం ఏమిటంటే యాజి స్వస్థలం తెనాలి. 😎
కధ 2014 – కధాసంపుటిలోని ఒక ముగ్గురు కథకులను గురించి, ఇక్కడేమో మరో ముగ్గురు కధకులు గురించి తెలియచేసాను. రేపు … ఆ మిగతా కథకుల గురించి. 😎 అన్నట్టు తెనాలి కి వస్తున్నారుగా! తెనాలి లో కవిరాజు ఉద్యావనం (పార్క్) ఇక్కడుంది.
రెండు దశాబ్దాలు
కథ 1990 – 2009
౩౦ కధలతో రెండు దశాబ్దాల ఉత్తమ కధల సంకలనం
ప్రతులకు
164, Ravi Colony, Tirumalagherry, Secunderabad 500 015, India Ph: +91 2779 7691
ధర: రూ 150.00 / US $ 25.00
పోస్ట్ / కొరియర్ ఖర్చులు అదనం.
మొన్న అంటే ఫిభ్రవరి 8 తారీఖున, ఆదివారం రోజు లా మకాన్లో ఉదయం ఒక సాహిత్య కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఒక అంశం తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ (రచయిత గా నేను చచ్చిపొయ్యాను అని ప్రకటింఛిన రచయిత) కి సంఘీభావం తెలియజేయటం. రెండవ అంశం కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత వేంపల్లి షరీఫ్, జనవరి 2015 లో ప్రచురించుకున్న తన కథ “తలుగు” కథా పఠనం. మూడవ అంశం యువ కథకులు – కథన రీతులు మీద డాక్టర్ ఏ కే ప్రభాకర్విశ్లేషణ.
బత్తుల రమాసుందరి – సాహిత్యాభిమాని, కార్యకర్త
మొదటి అంశం:
రచయిత్రి బత్తుల రమాసుందరి , తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ ని పరిచయం చేస్తూ, ఆ రచయిత ప్రకటనకి నేపధ్యం, ఆ రచయితకి ఎందుకు సంఘీభావం తెలియచేయాలి అన్ని దాన్ని మీద కూలంకషంగానే అయినా తనకున్న పరిమితులలో, ఆ రచన గురించి పరిచయం చేస్తూ, ఆ రచన పుర్పాపరాలను విశదీకరిస్తూ, ప్రస్తుత సమాజం ఆ రచయితకి నైతిక మద్దతునివ్వాల్సిన అవసరం మీద తన దృకద్పం గురించి సమగ్రంగానే మాట్లాడారు. బహూశ ఆ సభకు వచ్చినవాళ్ళలో ఆమె తప్పితే పెరుమాళ్ మురుగన్ రచనలు చదివిన వారున్నారని అనుకోను. నాతో సహా! తమిళ భాష చదవడం వచ్చి ఉండదు కాబట్టి! అలాగే ఇంగ్లిష్ అనువాదం ఉన్నా కొని చదివివుంటారా అంటే అదీ అనుమానమే!
మూడో అంశం ఇది: యువ కథకులు – కథనరీతులు.
ఫేస్‌బుక్‌లో కథ కోసం ఏర్పడిన ఒక సమూహం (గ్రూప్) ఉంది. ఆ సమూహం ఒక కథల పోటిని నిర్వహించింది. ఆ కథలలో కొన్నింటిని ఎన్నుకుని “యువకథకులు – కథన రీతులు” అనే అంశం ప్రాతిపదికగా సాహితీవేత్త డా. ఏ కే ప్రభాకర్ ని విశ్లేషించమన్నారు. పదకొండు గంటలకు మొదలుపెట్టాల్సిన సమావేశం దాదాపు పన్నెండు గంటలకు మొదలవ్వడంలో ప్రభాకర్ కూడ తనకిచ్చిన యువ కథకులు – కథనరీతులు ని కుదించుకోవాల్సి వచ్చింది.సూచన ఆ నాటి కార్యక్రమ నిర్వాహకులు ఆయన విశ్లేషణని ఎక్కడన్నా పదిమందికి అందుబాటులో ఉండేవిధంగా పొందు పరిస్తే బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఆయా రచయితలకి. ఇది ఒక సూచన మాత్రమే సుమా!
మరొక విషయం. కథ మీద రచయితలకోసం వేదికద్వారా చేయదలుచుకున్న ఒకానొక కార్యక్రమం గురించి ఒక ప్రకటన చేద్దాం అని అనుకున్నాను. కార్యక్రమ నిర్వాహకుల అనుమతి కూడా తీసుకున్నాను.
ఇక పోతే ప్రభాకర్ “యువ కథకులు – కథనరీతులు” విశ్లేషిస్తూ కొన్ని వాఖ్యలు చేసారు. వాటిల్లో ఒక విషయం గురించి మాత్రమే మీతో ప్రస్తావించుదామని అనుకున్నాను.
డా ఏ కే ప్రభాకర్ – సాహిత్య విశ్లేషకులు – “సమకాలీనం” రచయిత
వేగం
కథనంలో కథకులలో వేగం. అది వాసి కావచ్చు. రాశి కావచ్చు. “రహదారి మీద టూ వీలర్ మీదో, ఫోర్ వీలర్ మీద మనం వెడుతున్నప్పుడు మన భుజాల్ని దాదాపుగా తాకుతు, అత్యంత వేగంగా మనముందు నుంచి దూసుకువెళ్ళే క్షణం లో ఒక “ఝలక్” కి గురవుతాము చూసారా? ఒక క్షణం పాటు. అది ఉంది ఈ యువ రచయితలలందరిలోను. మంచిదే! ఆ వేగం కూడ కావాలి. ఆ దూసుకుపోయే తత్వం కూడా కావాలి. అయితే నా బోటి వాడికి భయం కూడా వేస్తుంది! ఎందుకంటే అంత వేగంతో వెళ్తున్నప్పుడు ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉంది. అద్భుతమైన రచనలు చెయ్యాల్సిన ఔత్సాహిక రచయిత వేగంగా వెడుతున్నప్పుడు కొన్ని అంశాలని గుర్తించలేకపోవచ్చు. (శిల్పం, కథనం, వస్తువు, భాష రచనకు సంబంధించిన తదితర విషయాలు). తద్వారా ఒక గొప్ప రచయితని మనం కోల్పోయే అవకాశం ఉంది!”
ఇవన్ని నా మాటల్లో డా. ప్రభాకర్ ఏ కె గారి అభిప్రాయాలు. నా మాటల్లో కాబట్టి నేను అర్ధం చేసుకుని, వాటిని మీకందించే క్రమంలో పొరబాట్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిల్లో ఈకలు వెతికి పీక్కోవద్దు.
రెండవ అంశం
‘తలుగు’ కథ రచన: వేంపల్లి షరిఫ్
కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత వేంపల్లి షరీఫ్ కథ తలుగు పఠన కార్యక్రమం ముందు అనుకున్న పద్దతిలో కాకుండా ఒక రెండు ముందు మాటలు.. కథనుండి కొన్ని ముఖ్యమైన పేరాగ్రాఫులని ప్రముఖ కథా రచయిత, చలనచిత్ర సంభాషణల కర్త అరిపిరాల సత్యప్రసాద్ చదివి వినిపించడంతో ఆ సమావేశం ముగిసింది.
కాకపోతే ఆ సభలో కథ గురించి వేదికచేయనున్న ఒకానొక కార్యాక్రమం గురించి వచ్చిన సభికులకు ఒక ప్రకటన చేద్దామనుకుంటే కారణాలేమైనా ఆ ప్రకటన చెయ్యలేకపోయ్యాను.
* * *
వేదిక
అదే రోజు సాయంత్రం ఆలంబన లో ప్రతి నెల రెండవ ఆదివారం సాయంత్రం 4.30 నుండు 6.30 మధ్య జరగుతున్న సాహిత్య సమావేశం ఈ సారి పూర్తిగా చంద్రశేఖర ఆజాద్ కథ నీళ్ళు – రక్తం కే సరిపోయింది.
దాదాపు ఏడున్నర దాకా సాహిత్య ప్రేమికులందరూ ఆ ఒక్క కథ మీదే చర్చని కొనసాగించారు.
ఏతా వాత తేలిందేమంటే…రచయత అన్నట్టు “మనం వినే సామెతలు, సూక్తులు, పాక్షిక సత్యాలు. ఆయా సందర్భాలకు వర్తిస్తాయంతే.”
నేను పరిచయం చేద్దామనుకు ఝంపా లహరి కథ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. 🙂
ఆ రోజు సాయంత్రం సమావేశానికి వచ్చిన వారిలో ప్రధములు వేమూరి సత్యం గారు. గతంలో స్వాతి మాస పత్రిక ప్రారంభంలో 70 – 73 వరకూ సంపాదక శాఖలోను, నిర్వాహణ శాఖలోను పాలుపంచుకుని, 73 నుండి దాదాపు తొమ్మిదేళ్ళపాటు జ్యోతి (కీ.శే వి రాఘవయ్య – లీలావతి రాఘవయ్య గార్ల మాస పత్రిక) కి సహ-సంపాదకుడి గాను, ఆ తరువాత సినిమా రంగంలోనూ – ప్రొడక్షన్ డిజైనర్‌గాను, ఎక్జిక్యూటివ్ నిర్మాతగాను, స్టోరి డిస్కషన్స్, స్క్ర్రిన్‌ప్లే రైటింగ్‌లలోనూ ఇంకా పలు బాధ్యతలను నిర్వహించిన సాహిత్యాభిమాని వేమురి సత్యం (సత్యనారాయణ) గారి మాట ఒకటి పంచుకుంటాను.
Time Pass – Memoirs of Protima Bedi
ఒకానొక సందర్భంలో ఆయన ప్రొతిమా బేడి (ప్రొతిమా గౌరి) తో ఒక భేటిలో “మీరు కబిర్ బేడి ( Sandokan / Octopussy fame) కి విడాకులిచ్చేసారు. అప్పుడు మీ చుట్టూ ఉన్న సమాజం మిమ్మల్ని ‘ఇదిగో ఈమే ప్రొతిమ. మొగుడుకి విడాకులిచ్చేసి తిరుగుతున్నది’ అని వేలేత్తి చూపించి, దూషించి, విమర్శించి ఉంటుంది కదా! మరి అప్పుడు ఆ విమర్శని మీరు ఏ విధంగా ఎదుర్కొన్నారు? ” అని ప్రశ్నించారట.
దానికి ప్రొతిమ (గౌరి) బేడి జవాబు, “It is the business of society. It would stop, point out something that catches its attention and then moves on. It has other businesses too on its agenda. It happened the same with me too. I knew it would raise it’s finger at me. It did and then it moved on to the next one. It doesn’t bother me any more.”
మళ్ళీ కలుద్దాం!
ఈ టపాలో సాహిత్యవేత్తల పుస్తకాలు కావాలంటే…
మీ దగ్గిర్లోఉన్న పుస్తకాల దుకాణం లో అడగండి. లేవు అని అంటే తెప్పించి పెట్టమనండి. కుదరదంటే ఇక్కడ ఇచ్చిన చిరునామాలలో సంప్రదించండి.
ముందున్నది మూడు చెరువులు. ఒడ్డున్న ఉన్నది అప్పుడే వాటిల్లో మునిగి, ఈది, తేలి, గట్టుకు చేరిన సుశిక్షుతులైన గజ ఈతగాళ్ళు. ఆ చెరువులు చెరువులేనా?.. ద్రోహ వృక్షం, నల్ల మిరియం చెట్టు, ఆకుపచ్చని దేశం. ఒడ్డున్న ఉండి మళ్ళీ దూకడానికి ఉద్యుక్తుడవుతున్న నవయువకుడు శివారెడ్డి..కానీండి ఇంకా చూస్తారే?..నేనైతే ‘జీవని’ లోకి దూకాను. ‘ఐదు హంసలు’ని కూడా చూసాను. దూకడమే..అలా ఒడ్డున నిలబడిపోతే మీ జీవితంలో ఒక ఎపిక్ ప్రపోర్షన్ లో ఒక అనుభవాన్ని కోల్పోతారంటాడు.
ఇందులో ద్రోహవృక్షం కథల సంపుటి. మిగతా రెండూ – నల్లమిరియం చెట్టు, ఆకుపచ్చని దేశం నవలలు. రచయిత డా॥ వి. చంద్రశేకఖర రావు.
డా: చంద్రశేఖర రావు నవలలు ఆవిష్కరణ సభ..మీ ఎడమవైపు నుండి..శ్రీ జగన్నాధ శర్మ, నవ్య సంపాదకులు – ఆకుపచ్చిని దేశం తో, కవి శివారెడ్డి అక్కుపచ్చిని దేశం లో నల్ల మిరియం చెట్టు తో, రచయిత డా॥ చంద్రశేఖర రావు వి, వారి ప్రక్కన విమర్శకులు సీతారాం.
ఆ పుస్తకాల పేర్లు చూడండి. ఒక మార్మికత లేదూ వాటిల్లో?! చిన్నప్పుడు మా నాన్న తెచ్చి ఇస్తే పుస్తకాలు, ఏది ముందు చదవాలో అర్ధం అయ్యేది కాదు. అన్నింటిని ఒకే సారి చదవలేము. సరే, పుస్తక పరిచయ సభకి వెళ్ళాం కదా..ఆ మహామహుల మాటలు విన్నాం కదా? వాళ్ళందరూ ఏదో ఒక పుస్తకాన్ని ఆకాశానికెత్తేస్తే దాంతో మొదలు పెట్టవచ్చు. అసలు ఆ సాహితీవేత్తలు ఆ అవకాశం లేకుండా అన్నింటి గురించి చెప్పేసారు. అసలు ముందు వాళ్ళ మాటలు వింటుంటే ఒక అయోమయం.
నల్లమిరియం చెట్టు గురించి మాట్లాడుతూ, ఆకుపచ్చని దేశం లోకి వెళ్ళిపోతారు. పోనీ దాని గురించి మాట్లాడుతారా అంటే ఉహు మళ్ళీ ద్రోహవృక్షంలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఉంటారా అంటే ఆబ్బే సుందరం అంట..ఆదెమ్మ అంట, చెంచులు అంట, నరసింహం ఆత్మహత్య, మొసళ్ళు వాటితో యుద్దమా లేదా తప్పించుకుని అవతలి ఒడ్డుకి చేరటమా అన్న ఆలోచనంట..ఇవేవి కావు అసలు ఈ చంద్రశేఖరం గారు కవిత్వం వ్రాస్తున్నాడంటున్నారు, నా దృష్టిలో అది కవిత్వం కాదు..ఈ రచయిత రచనల మీద నేను పరిశోధన చేస్తున్నాను అని మరో వక్త. సరే! వాళ్ళు పుస్తకాలు చదివారు కాబట్టి వేదిక మీద ఉన్నవాళ్ళందరికి రచయితతో సహా తాము ఏమి మాట్లాడుతున్నారో తెలుసు.
మరి పాఠకుడి పరిస్థితి.
సీరియల్‌ని చదివిన పెద్దాయన కవి శివారెడ్డి. ప్రతి వారం ఒక వార పత్రికని కొని..ఒక ముక్క చదివి..మళ్ళీ వచ్చేవారం కోసం ఎదురుచూస్తు..ముక్కలు ముక్కలుగా చదవటానికి విముఖుడు. అలా చదవాలంటే చెడ్డ చిరాకు ఈ కవికి. కాని ఆయన ప్రతివారం ముక్కలు ముక్కలుగానే చదువుకున్నాడంట సీరియల్‌ని. అంతగా ఆకర్షించింది ఆయన్ని. ఇక్కడ గుర్తుంచుకోవలసింది ఒకటి ఉంది. ఆయన కవి. కథకుడు కాదు. నవలా కారుడు అంతకంటే కాదు. అవంటే పెద్ద ప్రేమా, మోజు లేదాయనకి. ఆయనే చెప్పుకున్నాడా మాట ఆ వేదిక మీద నుంచి. ఏకంగా 22 పేజీల ముందుమాట వ్రాసేయించింది ఆ నవల ఆ కవితో.
ఎవరూ ఏ పుస్తకాన్ని ఒక్క సారి చదివి నమిలి పిప్పిని పారేసిన వారు కాదు, బెకన్ అన్నట్టుగా. మాట్లాడిన వారందరూ ఆ నవలలని..ఆ కథలని పరిచయం చేసిన వారందరు ప్రతి పుస్తకాన్ని ఆవాహన చేసుకున్నవారే. ఆ పుస్తకాలు వారందర్నీ తమ ప్రపంచంలోకి రమ్మనమని సాదరంగా ఆహ్వానించినవి. వీరు ఆ యా ప్రపంచాలలోకి వెళ్ళి ప్రతి పాత్రతోను పయనించి, వారి జీవితాలని స్పృశించి, ఆ లోకాలను అనుభవిస్తూ వెలికి వచ్చారు. మళ్ళీ అ సాహిత్యంలోకి వెళ్లాలనిపించి వెళ్ళారు. వదలలేదు. వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్లారు. రేపు మరోసారి మళ్ళీ వెడతారు. వారి మాటలు వింటుంటే మళ్ళీ మళ్ళీ ఆ లోకాలలో విహరిస్తూనే ఉంటారనిపిస్తుంది.
నవీన్ వాసిరెడ్డి
సభకు అధ్యక్షుడు. నేను పోలీసుల చెకప్పులు, వినాయకుడి విగ్రహాలను తప్పించుకుంటూ హైద్రాబాదు ట్రాఫిక్కులోపడి ఈదుకుంటూ వెళ్ళేటప్పడికి ఆయన ఉపన్యాసం అయిపొయ్యి వక్తలను ఆహ్వానిస్తున్నారు.
జగన్నాధ శర్మ (నవ్య సంపాదకులు,) చాల క్లుప్తంగా మాట్లాడారు.
“సాహితీలోకంలో ఒక మాట ఉంది. 1910 నంచి 20/30 ల దాక తెలుగు సాహిత్యంలో అనువాద కాలం అని. కాని నేను ఇప్పుడు చెబుతున్నాను. 2010 నుంచి మళ్ళీ తెలుగు కధా సాహిత్యం, నవలా సాహిత్యం మొదలైనది. భారతదేశంలోని ఇతర భాషలు తెలుగు భాష వైపు తెలుసు సాహిత్యం వైపు చూస్తుండాల్సిన తరుణం వచ్చేసింది. దానికి కారణం చంద్రశేఖర రావు లాంటి రచయితలు. నవల రూపు చూడకండి. నవలలో వస్తున్న వస్తువుని చూడండి. గొప్ప తెలుగు సాహిత్యం ఈ దశాబ్దం తో మొదలయ్యింది మళ్ళీ. ఇంతకన్నా తెలుగు సాహిత్యం గురించి నేను చెప్పగలిగింది లేదు”.
కవి శివారెడ్డి
కవి శివారెడ్డి మూడు సార్లు చదివారు. ఆయన నల్ల మిరియం చెట్టు కి ముందుమాట(?) అందామా “ఒక గాధ గురించి” అని శీర్హిక పెట్టి..అంటారు కదా..తొలి వాక్యం లో.
” నేనిప్పుడో మహోపన్యాసం చెయ్యగలను డా॥ వి. చంద్రశేకఖర రావు గారి సాహిత్యం మీద”.
“Preconceived notions లేకుండా రచయిత దగ్గిరకు వెళ్ళే ఒక తరం పాఠకులొస్తారు. వచ్చారు. విమర్శకులే రావాల్సింది.
ఊర్వశి అంటుంది పురూరవుడి తో,’ప్రేమ కావాలా..నీ అలంకారాలన్ని, ఆభరణాలన్నీ పక్కన బెట్టి దిగంబరంగా నా దగ్గిరకు రా,’ అని. అలా పాఠకుడు అన్ని misconceived, wrong notions ని పక్కనబెట్టి – పరమ దిగంబరంగా వాచకం దగ్గిరకెళ్ళాలి – ఆ పాల సముద్రం లో మునగాలి.” అవి ఆయన మాటలు.
ఎ కె ప్రభాకర్ గారు
చంద్రశేఖర రావు సాహిత్యం గురించి సోదాహరణం గా వివరించారు. నల్ల మిరియం చెట్టుగురించి మాట్లాడుతూ వారి మిగతా సాహిత్యంలోకి సభికులను లాకెళ్ళారు. ప్రత్యేకంగా ఆ నవల ముగింపుని పాజిటివ్ దృక్పధంతో నే చూడవచ్చు అని అన్నారు.
సీతారాం
చంద్రశేఖర రావు వచనం కవిత్వం కాదు. ఆయన తన ఆవేదనని పరివేదని అలా వ్యక్తం చేస్తున్నాడు. It is his expression of agony. His form and content needs more critics. “ఆయన రచనలమీద పరిశోధన చేస్తున్నాను,” అని అన్నారు. అంతగా కదిలించినవి చంద్రశేఖర రావు గారి సృజనలు ఆయనలోని విమర్శకుడిని. నల్ల మిరియం చెట్టుగురించే తాను మాట్లాడు దాం అని అనుకున్నానని కాని..దాని పరిధి దాటి మాట్లాడారు.
గుడిపాటి
చంద్రశేఖర రావు గారి సాహిత్యం మీద చాల చర్చ జరగవలసి ఉంది. ఇక్కడ కలిసిన ఈ రెండు మూడు వందల సాహితీవేత్తల మధ్య జరిగినదే కాదు. ఇంకా జరగాలి. వేదికలెక్కాలి. పాఠకులు అందులో ఇన్వాల్ కావాలి. ఇది ఇక్కడితో ఆగిపోదు.
రచయిత
నా కాల పరిస్థితులే నా రచనలని రూపొందించినవి. ఈ వేదిక మీద ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడం బాగుండదు.
జరిగిన సభ గుఱించి నా మాటలు:
ఎవరూ కూడా రచయిత వ్రాసిన ఏ ఒక్క కథకో ఏ ఒక్క నవలకో పరిమితం కాలేకపొయ్యారు. కారణం రచయిత ఎన్నుకున్న వస్తువు, శిల్పం, శైలి, భాష. ఒకరు దండోరా గుఱించి మాట్లాడితే, మరొకరు తెలంగాణా నేపధ్యంతో వ్రాసిన హెచ్ నరసింహం అత్మహత్య గురించో లేక చెంచువుల గురించో..ఐదు హంసల గురించో మరో కథ గురించో మాట్లాడారు. మధ్యలో కొ కు ఫోర్త్ డైమన్షన్ ని లాకొచ్చారు.
సాహిత్యం, పోకడలు, చంద్రశేఖర రావు రచనలు వారిమీద వారి ఆలోచనల మీద, ఆయన రచనలు తమ బుర్రకు పెట్టిన పనిమీద, పదునెక్కించిన రీతి..ఆ యా నవలల సాంఘిక, రాజకీయ, ఆర్ధిక, సామాజిక నేపధ్యాలు అధ్యయనం చెయ్యవలసిన అవసరం ఒకటేమిటి ఎన్నో అంశాలు..పరిపూర్ణమైన ఒక సాహితీ సభ అది.
కొత్త తరం పాఠకులు వచ్చారు!
కొత్త తరం పాఠకులు వచ్చారు. నేనంటున్నది కూడా అదే. నవ్య సంపాదకులు అంటున్నది అదే! కవి శివారెడ్డి అంటున్నది అదే. ప్రభాకర్ గారు అన్నది అదే! సీతారాం చెబుతున్నది అదే! గుడిపాటి చెప్పింది అదే! మీరందరూ చదవవలసిన పుస్తకాలు ఇవి.
చాలా రోజుల తరువాత సాహితీ మిత్రులను చాల మందిని కలుసుకున్నాను. చాల సంతోషమేసింది. ఎంత సాదరంగా అహ్వానించారో! ఆదరంగా పలుకరించారో అందరూ.
ఇక మీరు చెయ్యవలసింది.
ఈ బ్లాగ్ పోస్ట్ చూసి ఇక్కడి దాకా చదివారంటే..మీకు అంతర్జాలంతో పరిచయం ఉండే ఉండాలి. సాహిత్యం మీద అభిరుచు ఉండి ఉండాలి. కాబట్టి ఈ మూడు పుస్తకాలు ముందు సంపాదించండి.తరువాత వీటిని కూడా సంపాదించి చదువుకోండి.
జీవని
లెనిన్ ప్లేస్
మాయా లాంతరు
ద్రోహవృక్షం..ఈవన్నీ ఈ రచయిత కధా సంకలనాలు.
దిష్టి చుక్క:
తెలుగు ప్రసార మాధ్యమాల ఫోటోగ్రాఫర్‌లు. జరుగుతున్న సభ మధ్యలో దూరి, ఆ క్రమాన్ని ఆరాచకంగా ఆపేసి, తమ కెమరా ప్రలోభానికి కి లొంగనివాడెవ్వడూ లేడని చెప్పకుండా చెబుతూ దర్పంగా వచ్చినంత వేగంగా వెళ్ళిపోతారు. వాళ్ళు అడ్డం రావడం కారణంగా గుడిపాటి, నవీన్, ఎ కె ప్రభాకర్ బొమ్మల్లో కనిపించకుండా పొయ్యారు. తీసినవి సరిగ్గా రాలేదు. ఉన్నవి కాని ఇక్కడ పోస్ట్ చెయ్యలేదు.
గొప్ప సాహితీ సభ ఎందుకైనదంటే..ఎవరూ పక్కవారి చెవులు కొరకలేదు. గుస గుసలు లేవు. ఫోన్లు మోగలేదు. హాలు బయట కుహానా సాహితీవేత్తల అరుపులు, పెడబొబ్బలు లేవు. ఇక సభలో ఉన్నవారి సంగతంటారా! అందర్ని ఆ వేదిక మీద వక్తలు తమ మాటలతో కట్టి పడేసారు. ఇప్పుడు అర్థమయ్యిందా ఆ రచయిత డా॥వి. చంద్రశేఖర రావు రచనా పటిమ? పుస్తకాలు కొనుక్కుని చదువుకోండి. చదువుకుని మీ బ్లాగుల ద్వారానో మరొక వెబ్‌సైట్ ద్వారానో మీ అభిప్రాయాలని పది మందితో పంచుకోండి! ఇక మొదలెట్టండి!