దాదాపుగా గత దశాబ్దం అంటే పదేళ్ళుగా నేను తెలుగు సాహిత్యం – పాఠకులు గురించి నేను ఒక ప్రతిపాదన చేస్తూవచ్చాను. ఆ ప్రతిపాదన మిత్రులతో పంచుకుంటూనే వున్నాను. అలాగే సాంఘిక మాధ్యమాలు అంటే Social Media. ప్రస్తుతం ఒక తరం విరివిగా వాడుతున్న ఫేస్‌బుక్, కొంతకాలం క్రితం ప్రాచుర్యంలో వున్న బ్లాగ్ ప్రపంచం, గూగుల్ వారి ఆర్కుట్, గుగుల్ ప్లస్ లాంటి వాటిల్లో నా అభిప్రాయాన్ని తెలియపరుస్తునే వచ్చాను.
అదేమిటంటే సాంఘిక ప్రసారమాధ్యమాలలో మాత్రమే తెలుగు సాహిత్య పిపాసువులు అంటే కవులు, రచయితలు, కళాకారులున్నారన్నది భ్రమ! తెలుగు సాంఘిక మాధ్యమాల వెలుపల విస్తారమైన ప్రపంచం వున్నదన్నీనూ, అందులో తెలుగులో రాసే రచయితలు, కవులు వగైరా మాత్రమే కాక తెలుగు పాఠకులు వున్నారన్నీను అని నా ప్రతిపాదన! అంతే కాదు ఆ ఫేస్‌బుక్‌లో యువత లేదని కూదా చెప్పాను. ఆ యువత తెలుగు చదివే ఆసక్తి వున్న యువత అని, తెలుగులో రాయాలని కోరిక ఆ యువతకి వున్నదని కూడా చెప్పాను.
కాకపోతే ఆ యువతకి తెలుగు సాహిత్యం చదవడం ఎక్కడ మొదలు పెట్టాలని తెలియదు. వారిలో కొంత మందితో మాట్లాడినప్పుడు వారు నన్ను అడిగారు కూడా.
“సార్, తెలుగు సాహిత్యం చదవాలంటే ఏ పుస్తకంతో మొదలు పెట్టాలి?”
దానికి అనేక మంది అనేక సలాహాలు ఇస్తూ వచ్చారు. ఇస్తున్నారు కూడా. ఆ జాబితాల వివరాలు భవిష్యత్తులో ఇక్కడే మీకు ఇస్తాను.
ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వాలని నేను ఎప్పట్నుంచో ఇవ్వాలని అనుకుంటూ వచ్చాను. అది ఇప్పటి ఈ రోజుకు కి కుదిరింది. ప్రస్తుతం దాదాపు పాతికేళ్ళ (పాతిక = 25, + ఏళ్ళు = సంవత్సరాలు = పాతికేళ్ళు) క్రితం కొంతమంది తెలుగు సాహిత్యాభిమానులు తయారు చేసిన జాబితా ఇది. దీనిని ఈమాట అనే తెలుగు జాల పత్రిక (interent / web / magazine) లో ప్రచురించారు. ఈ జాబితాను ప్రచురించినవారు వారి మాటల్లోనే ఇలా అన్నారు:
“లోకో భిన్న రుచిః! ఈ జాబితా మీకు సమగ్రంగా తోచకపోవచ్చు, అసంపూర్ణంగా అనిపించవచ్చు; మీ గొప్ప 100 పుస్తకాల జాబితా వేరే పుస్తకాలతో నిండి ఉండవచ్చు. ఈ జాబితా వెనుక ఏ రకమైన అధికారిక గుర్తింపు లేదు. ఇది కొంతమంది సాహిత్యాభిమానుల సమిష్టి ఎన్నిక. కొందరు పాఠకులతో ఈ పుస్తకాలను మొదటిసారో, మరోసారో చదివించటమే ఈ ఎన్నిక ఉద్దేశం.”
కాబట్టి మీకు మీ మిత్రులు, బంధువులు కాని ఇతరులు సూచించిన పుస్తకాలు గురించి కాని వివరాలు వుండకపోవచ్చు. దానికి కారణం మొదట్లోనే చెప్పినట్టు ఈ జాబితా దాదాపు 25 సంవత్సరాల క్రితంది. కాబట్టి ఇందులో సమకాలీన (contemporary) అంటే 1999 తరువాత వెలువడ్డ సాహిత్యం, పుస్తకాలు, కవితలు, కథలు, నవలలు, నాటకాలు వగైరా వుండవు.
ఇక ఈ జాబితాల సేకరణలో నాకు తోడ్పడిన మిత్రులు
డా జంపాల చౌదరి, ఏ వి రమణమూర్తి, సి . భాస్కరరావు గారలకు
నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఆ జాబితలు విడిగా ఇస్తాను. చాలా మంది చాలా జాబితాలు తయారు చేసారు కాని వాటిల్లో కొన్నింటిని నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
సరే, ఇక్కడ ఇందాక ప్రస్తావించిన ఈమాట లో వచ్చిన జాబితా చూడండి. మీకు ఏవైనా సందేహాలుంంటే నాకు ఇక్కడే comment బాక్స్‌లో తెలియజేయండి. నాకు తెలిసినంత మేరకు సందేహాలు తీర్చడానికి ప్రయత్నిస్తాను.
ఇక ఈ జాబితాల సేకరణలో నాకు తోడ్పడిన మిత్రులు డా జంపాల చౌదరి, ఏ వి రమణమూర్తి, సి . భాస్కరరావు గారలకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Note; This post was written keeping in mind the Gen Z who are interested in reading Telugu books.
ఖూనీ
ఖూనీ – నాటకం
‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి గారి కుమార్తె చౌదరాణి. తల్లి అన్నపూర్ణ. జననం గురువారం, జూలై 25న. 1935 లో. తెనాలి లో. తండ్రి గతించిన నాటికి తనకి ఏడు సంవత్సరాలు. అందుకే తండ్రినుండి అంత ప్రేమకి నోచుకుందేమో.
అతి పిన్న వయసులోనే భర్త అట్లూరి పిచ్చేశ్వర రావు ని కోల్పోయింది. ఒంటరిగానే బతికింది. కాదు జీవించింది. జీవితంతో ధైర్యంగా యుద్దం చేసి మరీ జీవించింది. అవసరమైనప్పుడు రివాల్వర్ లైసెన్సు తీసుకోవడానికి కూడ వెరువలేదు. భర్త ఇచ్చిన ధైర్యమే. గెలిచింది. జీవితంలో వసంతాలు తక్కువే ఐనా అరవై వేసవులు చూసింది. నేటికి ఉంటే 80 పూర్తి అయ్యేవి. ప్రపంచం మర్చిపోయినప్పుడు తన తండ్రిని ప్రపంచానికి గుర్తుచేసింది.
తనని గుర్తు చేసుకుంటూ తనకిచ్చే ఈ చిరుకానుక ఈ రోజున ఈ పుస్తకం ఖూనీ. తనుకోరుకున్నట్టుగా అందరికి అందుబాటులో. డిజిటల్ ఎడిషన్ గూగుల్ బుక్స్ ప్లే ద్వారా. ఇప్పుడు గూగుల్ బుక్స్ లో మీరు
అందుకుని చదువుకోవచ్చు.
మీకు సులభంగా అర్ధమయ్యే తెలుగు లో శ్రీ రావెల సాంబశివరావు గారికి కృతజ్ఞతలతో.
పుస్తకం సాంకేతిక వివరాలు:
Full Title: Khooni, a play
Author: “Kaviraju” Tripuraneni Ramaswamy
Re-told: Ravela Sambasiva Rao
Language: Telugu
Print Length: 45 Pages
Google Play GGKey:WKYHC48AABJ E
Publisher: Tripura Prachuranalu
Published: January 2014
Cover design: Giridhar
ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు
మొన్న ఎలక్షన్‌లో గెలిచిన నరేంద్రమోడి గెలుపుకి పుస్తకాలకి సంబంధం ఏమిటా? అంతర్జాలం. సోషల్ మిడియా!
తొలి ముద్రణ 2013. మలి ముద్రణ 2013. అమ్మకాలు దాదాపు ముప్పై ఐదు వేలు. పుస్తకం ఆవిష్కరణ సభ భాగ్యనగరం లో పెద్ద హోటలు. ఐదువందల రూపాయలు నోట్లు ఇచ్చిన వారు, చేతికి అందిన ప్రతులు అందుకున్నారు. చిల్లర అడగలేదు. తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు..
మరో మంచి హోటల్ లో పుస్తక ఆవిష్కరణ. తొలి ముద్రణ ఆగస్టు 2013. అమ్మకానికి ప్రతులు లేవు. మలి ముద్రణ డిసెంబరు 2013. కథకుడు మరో ముద్రణ గురించి ఆలోచిస్తున్నాడు.
తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు.
మరో పుస్తకం. మూడవ ముద్రణ. కొన్ని వేల ప్రతులు. తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు.
పైన నేను ఉదహరించిన తెలుగు పుస్తకాలన్నింటిని చదవాలని, కావాలని పాఠకులు కొనుకున్నారు.
మూడు పుస్తకాలు తెలుగులోనే ఐనా వాటిలోని విషయాలు విభిన్నమైనవి. ఒకటి కధా సంకలనం. ఒకటి జీవిత చరిత్ర. మరొకటి సాహిత్య పురస్కారం అందుకున్నది.
మొన్న ఏప్రిల్ లో నెల్లూరులో మరో పుస్తకం ఆవిష్కరణ. వేదిక దగ్గిర ప్రతులు అమ్ముడైపోయినవి. పుస్తకాలు కావాలి. ప్రతులు లేవు. తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు…కొనుక్కున్నారు. కొంతమంది పదుల ప్రతులు కొనుకున్నారు.
నేనిక్కడ ఉదహరించినవి నా దృష్టికి వచ్చిన వాటిల్లో మూడో నాలుగో పునర్ముద్రణలు మాత్రమే! ఇవి కాక ఇతర ప్రాంతాల్లో పునర్ముద్రణలకు నోచుకున్న పుస్తకాలు అనేకం! ఇవికాక ప్రచురణకర్తలు పునర్ముద్రించుకుంటున్నవి అనేకం ఉన్నవి! ప్రవాసాంధ్రుల ప్రచురణలు?
అనంతరామ్ పేరు విన్నారా? మొన్నామధ్య ఏప్రిల్‌లో పెళ్ళి చేసుకున్న అనంతరామ్ కొంతమంది బ్లాగర్లకి మాత్రమే తన బ్లాగు ద్వారా పరిచయం. రెండువేల పదమూడులో రామ్@శ్రుతిడాట్‌కామ్ అనే శీర్షికతో ఈ నవ యువ రచయిత తన తొలి ప్రేమకధా నవలని ఈబుక్ గా ప్రచురించుకున్నాడు. తొలుత అది ఈబుక్‌గానే వెలువడింది. ఆ నవల తొలుత అచ్చులో వెలువడలేదు. ఈబుక్ అమ్మకాల మీద వచ్చిన రాయల్టీలతో తన పుస్తకం అచ్చువేసుకున్నాడు. తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు. కొనుక్కున్నారు. (పాఠకమహాశయా! ఈ యువ నవ రచయితని ఈ వ్యాసకర్త ఇప్పడిదాక కలవలేదు. కనీసం ఆ రచయిత వివాహానికి ఆహ్వాన పత్రిక అందుకున్న గుర్తు కూడా లేదు).
ఒకప్పుడు రచయితలకి సిగరెట్ల పాకెట్టిచ్చి, తేనిరు పోసి, హ్విస్కి లు తాగించి, పుస్తకాలు వ్రాయించి, డబ్బు పెట్టుబడి పెట్టి, ఆ పుస్తకాన్ని ప్రచురించి, లాభాలార్జించి , భవంతులు కట్టుకున్న ప్రచురణకర్తలున్నకాలం తెలిసినవారుండేవుంటారు మీ పాఠకులలో. అవి ఆ రోజులు.
తన పుస్తకాల అమ్మకాల మీద వచ్చిన రాయల్టీలతో పిల్లలకి చదువులు చెప్పించుకుంటూ, విదేశాలలో ఉద్యోగాలకు పంపించుకుంటూ, భవంతులు కట్టించుకుని, కారులలో షికారులు చేస్తూన్నాడు ఈ రోజు రచయిత. ఇవి ఈ రోజులు.
శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాక.. అదిలాబాదు నుండి తిరుపతి దాక ఉన్న తెలుగు రచయితల సాహిత్యం ఈ రోజు అంతర్జాలం ద్వారా అందరికి అందుబాటులోకి వచ్చింది. ఆక్‌లాండ్ నుండి, ఆసియా నుండి, ఆఫ్రికానుండి, అమెరికా సంయుక్త రాష్ట్రాల దాక కాక వాటిమధ్యనున్న దేశాలలోని తెలుగు పాఠకుడు ఈ రోజు తెలుగు పుస్తకాలు కొనుక్కుంటున్నాడు. చదువుకుంటున్నాడు. లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాడు. ఏటా, అనధికార గణాంకాల ప్రకారం సుమారు గా పదిహేను కోట్ల రూపాయల విలువగల పుస్తక క్రయ విక్రయాలు జరుగుతున్నవీ. ఈ లెఖ్ఖలలో జాలం ద్వార అమ్మిన అచ్చు పుస్తకాలు కాని డిజిటల్ పుస్తకాలు కాని కలపలేదు. అలాగే విదేశాలలో ముద్రిణపొంది అమ్ముడవుతున్న పుస్తకాల గణాంకాలు లేవు! ఐనా ఇవన్నీ తెలుగు భాషవి మాత్రమే సుమా! తెలుగు వారెంతమంది? ఆ మధ్య పదిహేను / పదహారు కోట్లమంది ఉన్నారని అన్నారుగా. ఆ మాటే ప్రామాణికంగా తీసుకుంటే ప్రతి తెలుగువాడు తెలుగు పుస్తకం కోసం ఒక రూపాయి వెచ్చించినట్టే!
ఎన్నికల లెక్కల్లో కొంచెం అటు ఇటుగా ఎనిమిది కోట్ల మంది అని తేలిందా? పోని అదే లెఖ్ఖ వేసుకుందాం! ఆ లెఖ్ఖన సగటున ప్రతి తెలుగువాడు తెలుగు పుస్తకం కోసం రెండు రూప్యంబులు వెచ్చించెనన్నమాట! ఇప్పుడు చెప్పమనండి..తెలుగు ఎలా చచ్చిపోతుందో, తెలుగు భాష ఎలా చచ్చిపోతుందో, తెలుగు పుస్తకం ఎలా అవసాన దశకి చేరుకుందో రుజువు చెయ్యమనండి!! చూసే వాడి చూపులో ఉంటుంది అందం అన్న చందానా,.పచ్చ కామెర్లవాడికి ప్రపంచం అంతా పచ్చగానే కనపడుతుంది.
అది నేటి సాహిత్యం పరిస్థితి. ఇక తెలుగు చచ్చిపోయింది. చచ్చి పోతోంది. ఇక తెలుగు చదివేవారు లేరు అనేది ఎవరో మీరే నిర్ణయించుకోండి.
ఒక యువ నవ కథా రచయిత, ఒక సాయంత్రం ఒక సాహిత్య సభ దగ్గిర నా బుర్ర తిని (తినిపించుకునేవాడుంటే బుర్రలు తినడం నాకు చాలా ఇష్టం) ఒకటో రెండో సంవత్సరాలు ఆలోచించుకుని మొన్నిమధ్య అచ్చు పత్రికలలో వెలువడ్డ తన కధలన్నింటిని గుదిగుచ్చి ఒక సంకలనంగా వెలువరించాడు. ఆవిష్కరణ సభకు ముందే తనకు తెలిసిన పుస్తకాల దుకాణాలలో పాఠకులకు అవి అందుబాటులో ఉండే ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే జాలంలో ఈబుక్‌గా దేశవిదేశాలలో అవిష్కరణ సమయానికి వెలువడేటట్టుగా ఏర్పాట్లు చేసుకున్నాడు. అంతర్జాలంలో అంటే ఆన్‌లైనులో సాహిత్యానికి, తెలుగు భాషకి, తెలుగుకి సంబంధించిన దాదాపు ప్రతి సమూహంలోను తన పుస్తక ఆవిష్కరణ గురించి పదిమందికి తెలిసేటట్టు ముఖపత్రాల రూపురేఖలు, రంగులు, అక్షరాల ఎంపిక దగ్గిరనుండి ప్రచారం చేసాడు.
పది పత్రికల కార్యాలయా మెట్లు, లిప్ట్‌లు ఎక్కాడు. తెలిసిన పదిమంది పాత్రికేయ మిత్రులని తన పుస్తకం గురించి సమీక్షో, పరిచయమో, స్వీకారమో, కనీసం ఒక వాక్యమో, ఏదో ఒకటి వ్రాయమని అడగడమో, బతిమాలడమో చేస్తూ తలా రెండు ప్రతులు అందించాడు. తెలియని వారిని పరిచయం చేసుకుని వారి చేతికి తన ప్రతిని అందించి సవినయంగా మరీ అడిగాడు.
నిర్మొహమాటంగా, నిస్సిగ్గుగా తనకు తెలిసిన బ్లాగర్లని, జాలపత్రికల సంపాదకులని, తోటి రచయితలని అందరిని తన పుస్తకం గురించి తమ పత్రికలలో, బ్లాగులలో, పేజిలలో, కాలంలలో, వెబ్‌సైటులలో వెబ్‌జైనలలో వ్రాయమని అడిగాడు.
ముందే నిర్ణయించుకున్న ఒకానొక సాయంత్రాన ఆవిష్కరణ సభ కావించాడు. సభ పేలింది. అమ్మకానికి ఆవిష్కరణ సభలోనే కొన్ని ప్రతులని అందుబాటులో ఉంచాడు. అమ్మినవి అమ్మగా..ఉచితంగా ఇచ్చినవి కూడ ఉన్నవి. (నాకు ఇంకా ప్రతి ఇంకా అందిలేదు. పైగా నేను ఆ ఆవిష్కరణ సభలో పాల్గొనలేదు. అది వేరే విషయం). ఇంత వివరంగా మీకు ఎందుకు తెలియజేయవలసి వచ్చినదంటే..దమ్ముంటే నా పుస్తకం అమ్ముడవుతుంది అని అనుకోరాదని. ఆ రోజులు చెల్లిపోయినవని మీకు తెలియజేయడానికే. బంగారు పళ్ళేనికైనా గోడ చేర్పు కావాలి!
పొద్దున లేచినప్పటినుంచి ఫోనులో ఎస్ ఎమ్ ఎస్‌లు, దినపత్రికలు తెరిస్తే వార్తల సంగతి తరువాత, ముందు ప్రకటనలు. దిన పత్రికల వారు సొమ్ము పుచ్చుకుని వేసే ప్రకటనల మధ్య మళ్ళీ లీఫ్‌లెట్లు, కరపత్రాలు. ఇంటి గేటుకి ప్లేటులు, కారు బంపర్ మీద స్టికరు, బైకు నెంబరు ప్లేటు మీద ప్రకటన, బస్సు సీటు మీద ప్రకటన, రహాదారికి అటూ, ఇటూ హోర్డింగులు. ఇది గాక స్కూలు ఫీజులు, ఫేర్‌వెల్ పార్టి చందాలు, హాస్పిటల్ బిల్లులు, కట్టవలసిన కిస్తీలు, ఈఎమ్‌ఐలూ ఇలా సవాలక్ష సమస్యలు ఈ జీవికి. వీటన్నింటి మధ్య మీ పుస్తకం కనపడాలి. కుదిరే పనేనా?
అందుకనే అనేది ఇందాక చెప్పానే ఈ నవశకం యువ రచయిత చేసిన పనులన్ని చెయ్యాలి! నా పుస్తకం దమ్ముంది అనుకుంటే చాలదు. దమ్ముంది అని ఆ చదువరికి చెప్పాలి. ఉన్నది లేనిది పాఠకుడు నిర్ణయిస్తాడు.
కాబట్టి ఓ రచయితా, నీ డబ్బుతో ప్రచురించుకున్న నీ పుస్తకం పదిమందికి అందాలంటే ముందు దానిని గురించి వారికి తెలియజేయి. అంతేగాని ఉచితంగా ఇచ్చేయ్యకు. అదేదో సామెతుంది. ఉచితంగా వస్తే ఫినాయిలు కూడా తాగే మనుషులుంటారని!
బెంగుళూరులో త్రిపురనేని గోపిచంద్ శతజయంతి
బెంగుళూరులో
త్రిపురనేని గోపిచంద్ శతజయంతి ఉత్సవాలు
శ్రీ కృష్ణ దేవరాయ రసజ్ఞ సమాఖ్య
వేదిక
శ్రీ కృష్ణ దేవరాయ కళామందిరం, తెలుగు విజ్ఞాన సమితి నెం 29, గాయత్రి దేవి పార్క్ ఎక్సటెన్షన్ 29, Gayatri Devi Park Extensionవయ్యలి కావల్, Vayyali Kaval
బెంగుళూర్ 560 003 Bengaluru
ఫోన్: (080) 2331 7850 Location map
కార్యక్రమం వివరాలు
ఆచార్య. కాత్యాయని విద్మహే (తెలుగు శాఖ, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్లు) * On Gopichand’s Writing Dr. Gopichand Katragadda * తత్వవేత్తలు డా. మన్నవ భాస్కర నాయుడు * పోస్టు చెయ్యని ఉత్తరాలు డా. దివాకర్ల రాజేశ్వరి (’శ్రీ రస’ సంస్థాపక కార్యదర్శి) * మా నాన్న గారు త్రిపురనేని సాయిచంద్ * నాకు నచ్చిన గోపిచంద్ కథ శ్రీమతి అంబిక అనంత్ (’శ్రీ రస’ సంస్థాపక కార్యదర్శి) * మెరుపుల మరకలు (నవల) డా. కె. ఆశాజ్యోతి * సమావేశానికి ముఖ్య అధ్యక్షులు – వారి పలుకులు
ఆచార్య: కవన శర్మ
*
వందన సమర్పణం
*
గోపిచంద్ రచన సర్వస్వం – 10 సంపుటాలు (ధర: రూ 1500/-) సభా ప్రాంగణంలో లభ్యం (అలకనంద వారి ప్రచురణ)సౌజన్యం:
శ్రీమతి కాట్రగడ్డ రజని (త్రిపురనేని గోపిచంద్ కుమార్తె) & శ్రీ కాట్రగడ్డ సుబ్రహ్మణ్యం శ్రీమతి కాట్రగడ్డ సీమ & డాక్టర్ కాట్రగడ్డ గోపిచంద్‘శ్రీ రస’
శ్రీ తంగిరాల వెంకట సుబ్బారావు (సంస్థాపక అధ్యక్షులు) శ్రీమతి దివాకర్ల రాజేశ్వరి (సంస్థాపక కార్యదర్శి) శ్రీ మతి అంబికా అనంత్ (సంస్థాపక కార్యదర్శి)