లక్షాలాది మంది ఆయన పాడగా వినాలని,
ఆయనతో ఒక కరచాలనం చెయ్యాలని,
వారి ఆశిస్సులుంటే చాలని కోరుకునేవారు.
ఆయనేమో అక్కడెక్కడో బెంగుళూరు బేకరిలో ఏ పాస్ట్రీ యో, బిస్కట్టో బాగుందని కొని తీసుకువచ్చేవారు.
నాకోసం.
అడయారు నుంచి టీ నగర్ దాకా. (http://goo.gl/maps/6Z7xu ) దాదాపు ఓ పది కిలోమీటర్లు. నన్ను గుర్తు పెట్టుకుని మరీ. వారికి నేనేమి బంధువును కాను. ఐనా.
ఆదివారం సాయంత్రాలు ఆరు ఏడు ఆ ప్రాంతాల్లొను, రాత్రి ఐతే 8 ఏ ప్రాంతాల్లొ వచ్చేవారు. మేమిద్దరం ఆయన కారులో కూర్చునో, కారుకి ఆనుకునో నిలబడి కబుర్లు చెప్పుకుంటూ గంటల కొద్ది కాలం గడిపేవారం.
“ఫరవాలేదు..నేనిమి అనుకోను..మీ స్మోకింగ్ మీది” అని ముందే అనేసేవారు. మాములుగా మా కబుర్లు సంగీతం, సాహిత్యం మీదే ఉండేది.ఘజల్స్ మీద వారికి ఆసక్తి మెండు. కొత్తగా వ్రాసింది తీసుకువచ్చేవారు. రాగయుక్తంగా చదివి వినిపించేవారు. నాకు అర్థం కాని చోట వివరంగా విడమరిచి చెప్పేవారు.
ఆ జేబులో కనీసం ఒక ఐదారు పెన్నులు, ఆ చేతిలో పుస్తకాలు లేకుండా కనపడేవారు కాదు. తనని ఆహ్వానించిన ప్రతి సభకి హాజరయ్యేవారు. ఒక ప్రశంసా పత్రమో, ఒక కవితో చదివి వినిపించి దాన్ని ఆ నాటి కర్త కి అందించి వెళ్ళేవారు. వాటిని సేకరించి ప్రచురిస్తే బాగుంటుంది. కాని అదేమి సామాన్యమైన విషయం కాదు! ఆయన అలా వ్రాసిచ్చింది తక్కువేమి కాదు.
వయస్సుతో నిమిత్తం లేకుండా ఎంతో స్నేహంగా ఉండేవారు. చెరగని చిరునవ్వు!
మొన్నామధ్య మద్రాసు వెళ్ళినప్పుడు కూడా అనుకున్నాను. వెళ్ళి కలవాలని.
చాలమందిని కోల్పొయ్యాను.
కోల్పోతున్నాను కూడా!