భరణీ స్టూడియోస్ అధినేత పాలువాయి రామకృష్ణ దర్శకత్వంలో వెలువడిన ‘బాటసారి‘ లో నాయిక పాత్ర పోషించిన భానుమతి, రామకృష్ణగారి సతీమణి. అక్కినేని నాగేశ్వరరావు నాయకుడుగా నటించిన ఈ చిత్రానికి మూలకధ బెంగాలి నవల ‘బడదీది‘. బెంగాలి రచయిత శరత్‍బాబు. ఆ ‘బాటసారి’ చలనచిత్రాన్ని వెండితెర నవలగా ఆవిష్కరించి తెలుగువారికి వెండితెర నవలలను పరిచయం చేసింది అట్లూరి పిఛ్హేశ్వర రావు. త్రిపురనేని రామస్వామి కనిష్ట పుత్రిక చౌదరాణి వీరి శ్రీమతి. ఆ విధంగా బారిస్టరు, శతావధాని .’కవిరాజు’ త్రిపురనేని రామస్వామి కి అల్లుడు. అట్లూరి పిఛ్హేశ్వరరావు నాకు తండ్రి. చౌదరాణి నాకు తల్లి. నాన్న 92 ముగించుకుని 93లో అడుగు పెడుతున్న రోజు ఇది. బానుమతి పాడిన “ఓ బాటసారి…” పాట ని ఇక్కడ వినవఛ్హు.
baaTasaari (బాటసారి) film novel – 153 pages was published by the makers of the movie in July 1961. It was priced 0.75 np. That would be three annas.
Tidbit
You will notice the banner mentioning the title of the movie is signed GHRao He was quite popular in those days. I personally knew him. My mother and I were keen on having the signboard for the proposed Rani Book Centre (an exclusive Telugu bookstore) written in Telugu. Our search brought him to us. He was Hanumantha Rao. In fact he did the first sign board in Telugu for Rani Book Centre in 1969. What a coincidence!
స్క్రిప్ట్ ఆర్ట్శ్ శాస్త్రిగారు ‘బాపు‘ బొమ్మలతో తెలుగువారి పండగలకి కొత్త శోభలిఛ్హిన రోజులవి. ఉగాదికి, సంక్రాంతికి, వివాహాలకనేమిటి ప్రతి సందర్భానికి ఒక బాపు కార్డ్. ఒక పాకెట్లో పది కార్డులు. పది కవరులు వాటికి సరిపడా! బొమ్మలాయనివి. లోపల మాటలు. బొమ్మకి తగినట్టుగా పదాలు. కొన్ని కావ్యాలలోనుంచి. కొన్ని ఆరుద్ర లాంటి కవుల కలాలనుండి.
ఒకటి రెండూ కాదు. కొంటే అదొక పాకెట్టు. ఇదొక పాకెట్టు. తలా ఒకటి అసార్టెడ్. బావకి మరదలు. చెల్లెలికి అన్నయ్య. భార్యకి భర్త. మామ్మకి మనవడు. ఆఫ్రికాకి. అట్లాంటాకి. ఆస్ట్రేలియాకి. అబుదభికి. గవర్నర్ గారేంటి. సి ఎమ్ గారేంటి. సినిమా తారలేంటి. గుమస్తా ఏమిటి? ఎమ్ డి ఏవిటి? ఒకడేవిటి? ఒక నెలరోజుల ముందే కొనేసి రిజిస్టర్డ్ పోస్ట్‌లో పంపేవాళ్ళు కొందరు. స్పీడ్‍పోస్ట్ లో పంపేవాళ్ళు కొందరు.
సర్కార్ ఎక్స్ ప్రెస్ ఎక్కి, బీచీ స్టేషన్‍లో దిగి, మద్రాసులో సి ఎ చదివేసి, పనిలో పనిగా సినిమా తారలందర్ని ఒక లుక్కేసి మళ్ళీ ఏ హౌరా మెయిలో, కోరమాండలో ఎక్కేసే రోజులవి.
అలాంటి రోజుల్లో…
ఒక ఉగాది.
పొద్దున్నే.
నీరసంగా వఛ్హారు ఇద్దరు కుర్రాళ్ళు.
బాపు గ్రీటింగ్స్ కావాలంటూ. అన్ని అయిపోగా మిగిలిన వాటిల్లో నుంచి తలాఒకటి కార్డ్లు తీసుకున్నారు. ఆంధ్రపత్రిక వారి పంచాగం ఒకటి. నేమాని వారి పంచాంగం ఒకటి. మొహాలు వేలాడేసుకుని చిల్లర ఇస్తున్నారు అమ్మకి.
“ఏంటయ్యా, పండగరోజు ఇలా నిరుత్సాహంగా ఉన్నారు?” అని అడిగింది అమ్మ.
“ఉగాది రోజండి. ఎప్పుడు ఇల్లు వదిలి లేమండి. అమ్మ చేత్తో ఉగాది పఛ్హడి తినేవాళ్ళం. ఈ సంవత్సరం ఆ గతి లేదు. ఇక్కడెక్కడా ఉగాది పచ్చడి పెట్టేవాళ్ళెవరూ లేరు. ఇంక ఇలా ఉండక ఎలా ఉంటామండి?” అని అన్నాడు అందులో ఒకడు చెమర్చిన కళ్ళతో. ఏదో కంపెనిలో ఇంటర్నల్ ఆడిట్ కని వఛ్హారట. పండక్కి ఇంటికి వెళ్ళడానికి కుదర్లేదు. “వెళ్ళొస్తామండి” అని వాళ్ళు వెళ్లబోతుంటే అమ్మ వాళ్ళని మాటల్లో దింపింది. నేను కలగజేసుకున్నాను. ఏలూరు వైపు వాళ్ళు. అమ్మ వాళ్ళతో మాట్లాడుతూనే ఉంది. మధ్యలో ఫోన్ చేసింది ఇంటికి. నా భార్యకి ఏదో చెప్పింది. నాతో ‘కరుప్పయ్య’ ని ఒక్కసారి వెంటనే ఇంటికి వెళ్ళి రమ్మనమని చెప్పు అంది.
కరుప్పయ్యన్ రిక్షాతను. కొత్తగా అప్పట్లో రిక్షాలకి మోటర్లుండేవి. పోస్టాఫిసు మూలమీద రిక్షా స్టాండ్. అక్కడుంటాడు. స్టాండ్ లోనే ఉన్నాడు. “ఒకసారి అర్జెంటుగా ఇంటికి వెళ్ళిరా,” అని పంపాను. ఇదిగో ఇక్కడున్నటు వస్తాను అని బుర్రు మని వెళ్ళాడు. గట్టిగా నడిస్తే పది నిముషాలు పట్టదు ఇంటికి చేరుకోవడానికి.
పది నిముషాలలో వఛ్హాడు వెనక్కి. చేతిలో చిన్న సంచి. అందుకుని అమ్మకిచ్చాను. సంచి తీసుకుని అమ్మలోపలికి వెళ్ళింది. పుస్తకాల రాక్‍ల వెనుక కొంత ఖాళీ ఉంటుంది. ఈ కుర్రాళ్ళ మూడు బాగోలేదుగా! “వెళ్ళొస్తామండి” అని కుర్చిల్లో కూర్చున్నవారు లేచారు. (అప్పట్లో ‘ఆంటి’ లు ‘అంకుల్స్’ లేరు. అక్కయ్య గారు, బాబయ్, పిన్ని గార్లే. ఎక్కువ. లేదు “అండి”!)
“ఆగండాగండి,” ఆంటూ అమ్మ ముందుకు వఛ్హింది. అమ్మ చేతిలో స్టీలు పళ్ళెం. అందులో రెండు గిన్నెలు. గెన్నెలో స్పూన్. ఆ రెండిట్లోను ఉగాది పఛ్హడి.
అవి చూడగానే వాళ్ళ ముఖాలు విప్పారి ఇంతింతైనవి. కళ్ళలో ఆనందం. అమ్మ వాళ్ళ అరిచేతిల్లోకి గిన్నెలో నుంచి స్పూన్ తో తీసి ఆ ఉగాది పచ్చడిని అందించింది. లొట్టలేసుకుంటూ తినేసారు. అందులో ఒకతను అరి చెయ్యి నాకేసుకున్నాడు. బయటపెట్టిన బకెట్ నీళ్లతో చేతులు కడుకున్నారు ఇద్దరూ. మాటల్లేవు. పాంట్ జేబులోంచి హాంకిలు తీసుకుని మూతులు తుడుచుకున్నారు. చేతులు తుడుచుకున్నారు. ” తినండమ్మా ఇంకా కావాలంటే,” అని అమ్మ ఆ పళ్ళెం టేబుల్ మీద పెట్టింది, టేబుల్ వెనక్కి వెళ్ళి కూచోబోతూ.
“ఉండండుండండి,” అంటూ అందులో ఒకరు అమ్మ కాళ్ళమీదకి పడిపోయ్యి ” మా అమ్మ అంతటివారు, మిమ్మల్ని మరిచిపోలేమమ్మా, మమ్మల్ని ఆశీర్వదించండి” అని అపేశారు. అందంతా అయిపోయింది. వెళ్లలేక వెళ్ళారిద్దరూ! కళ్ళు తుడుచుకుంటూ!
ఆ ఉగాది మొదలు ప్రతి ఉగాది రోజున అడిగిన వారికి ఉగాది పచ్చడి వడ్డించడం ఆనవాయితి అయిపోయింది రాణీ బుక్ సెంటర్ కి. తరువాత తరువాత ‘రాణమ్మ’ చేతి ఉగాది పచ్చడి కోసమే పాండిబజారులోని రాణీ బుక్ సెంటర్ కి వచ్చేవారు కొంతమంది. వాళ్ల ఇళ్ళల్లో చేసుకుని తిన్నా!
But today, it is a different story. Neither is Rani Book Center there, nor my mother! What an irony! But that is life I guess.
అమ్మ = చౌదరాణి
ఇక్కడ వాడిన బాపు బొమ్మకి హక్కుదార్లుః https://te.wikipedia.org/w/index.php?curid=78744
The Loneliness of Being
Rajesh Khanna DARK STAR
ఇది ఇంగ్లిష్ పుస్తకం.
హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్. ఈ పుస్తకానికి #hydlitfestival కి ఈ టపాకి ఏమిటి సంబంధం అని మీకు సందేహాలు రావడం ఆశ్చర్యం లేదు. మద్రాసు. అదే సంబంధం. Chennai is a city, Madras is an emotion అదే జ్ఞాపకం వస్తోంది ఇప్పుడు.
దాదాపు దశాబ్దం క్రితం వరకు దక్షిణాది చలనచిత్రాలకు కేంద్రంగా ఉండేది మద్రాసు. ఉత్తరాది వాళ్ళు కూడ మద్రాసులో సినిమా నిర్మాణాలు చేసుకునేవారు. వాళ్ళకి పంపిణీ కార్యాలయాలు కూడ అక్కడ ఉండేవి. ఆంద్రప్రదేశ్ వారికి కూడ మద్రాసే అప్పుడు.
చాలా సినిమాలు మద్రాసులో షూట్ చేసుకున్నారు బాంబే నిర్మాతలు. వాటిలో ఒకటి. హాతీ మేరే సాథి. నిర్మాత ‘సాండో‘ చిన్నప్ప తేవర్. హాతీ మేరే సాథి లో నాయకుడు రాజు పాత్రధారి – రాజేష్ ఖన్నా. సినిమాలో హీరో ఉద్యోగం కోసం రోడ్లవెమ్మటపడతాడు. అందులో భాగంగా పాండిబజార్ లో ఆ దృశ్యాలని చిత్రీకరించారు. (ఆ పాండిబజారులోనే రాణి బుక్ సెంటర్ తెలుగు పుస్తకాల కొట్టు ఉండేది. రాణి బుక్ సెంటర్‌ని స్థాపించింది చౌదరాణి. రచయిత అట్లూరి పిచ్చేశ్వర రావు – చౌదరాణి నా తల్లితండ్రులు. చౌదరాణి ‘కవిరాజు‘ త్రిపురనేని రామస్వామి కనిష్ట పుత్రిక.) ఇక మా నాన్న అట్లూరి పిచ్చేశ్వరావు తొలి తెలుగు వెండితెర కథనాన్ని గ్రంధస్తం చేసినవారు.
హాతీ మేరే సాథి లో రాజేష్ ఖన్నాకి “ఉద్యోగం కావాలి, ఉందా?” అని అడిగితే, “లేదు పో,” పొమ్మనడం కూడ ఉంది. రాణి బుక్ సెంటర్ ఎదురుగుండా ఉండే రాజేశ్వరి ఎలక్ట్రికల్స్‌లోను, హమీదియా హోటల్ & బేకరి లో కూడా ఉద్యోగాలు లేవని ఈ కాకా / జతిన్ ఖన్నా ని తరిమేస్తారు.
ఆ హాతీ మేరే సాథి సినిమా గురించి, రాజేష్ ఖన్నా గురించి పుస్తకం రాసిన రచయిత ఈ #hydlitfestival కి వస్తున్నాడు కదా అని వెళ్ళాను.
రచయిత ఎవరు? కవిత చింతామణి పుత్రుడు. కవిత ఎవరు? కె. ఆరుద్ర రామలక్షి ల ప్రధమ పుత్రిక. సరే, ఈ ఆరుద్ర, రామలక్షి లు ఎవరు? ( మీకు తెలియకపపోతే గూగుల్ చెయ్యండి). నా తల్లి తండ్రులకు స్నేహితులు. సాహితీ బంధువులు. ఓహ్ రచయిత పేరు చెప్పలేదు కదూ! అతని పేరు గౌతమ్ చింతామణి.
ఇవన్ని అతి ముఖ్యమైన కారణాలు నేను #hydlitfestival కి వెళ్లడానికి. జనవరి 23,24,25, 26 తారిఖులలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగం పేట లో జరిగింది ఈ హైద్రాబాద్ లిటరేచర్ ఫెస్టివల్. పైన హెడర్ లో ఉంది ఆ పాఠశాల ప్రధాన భవంతి చిత్రమే! అందులో 26 వ తేదిన టాటా రాక్‌ఫోర్ట్ సభాస్థలి వేదిక. మధ్యాహ్నం Reams on Reels అనే శీర్షికమీద గౌతమ్ , ఎమ్. కె రాఘవేంద్ర లు చలనచిత్ర రంగం మీద తాము వ్రాసిన పుస్తకాలను గురించి సంచాలనకర్త ఉమ మగళ్ తో కలిసి వచ్చిన ఆహుతులతో పంచుకున్నారు.
ఇక పుస్తకం ఎలాగుంది?
ఇప్పటికే బాలివుడ్‌మీద రాస్తూ తనకుంటూ ఒక ఉనికిని ఏర్పరుచుకుంతున్న రచయిత గౌతమ్. నిబద్ధతతో చేసిన రచన ఇది.
సూపర్ స్టార్
→ రాజేష్ ఖన్నా ఎవరితో పడుకున్నాడు,
→ ఏ నిర్మాతని ఏడిపించాడు,
→ రోజుకుని ఎన్ని పెగ్గులు తాగేవాడు, → పేక ఆడేవాడా?
లాంటి వ్యక్తిగత విషయాలూ, అతని జీవితంలోని వివాదాలు రాయలేదు. సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా గురించి అతని నటజీవితం గురించి మాత్రమే వ్రాసాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గౌతమ్ చింతామణి తన మాతమహుల పేరు నిలబెట్టాడు. అనవసరమైన వ్యక్తిగత వివాదాలలోకి వెళ్ళలేదు. అయినా పుస్తకం విడుదలైన అతి తక్కువ సమయంలోనే మలి ముద్రణకి నోచుకుంది. భారతీయ చలనచిత్ర రంగంలోని తొలి “సూపర్ స్టార్” మీద వెలివడిన పుస్తకం ఇది.
మొన్న మళ్ళీ కాళీపట్నం రామారావు మాస్టారి నవతీతరణం అభినందన ప్రత్యేక సంచిక చదివినప్పుడు వెలగా వారి వ్యాసం చదివాను. చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వారి వయస్సుకి అంతర్జాలం గురించి ఆ మాత్రం అవగాహన ఉండటం. అంతే కాదు ఆ ఏడు పేజీల సాహితీ వ్యాసం చివరి పేరగ్రాఫ్ లో వారన్న మాట: “ఇంటర్‌నెట్ ఉంటే ప్రతి ఇల్లు ఒక కథానిలయం అవుతుంది…కారా మాస్టారు సేకరించిన అపూర్వ కథా సంపదను అధికంగా ఉపయోగించినా, అసలు ఉపయోగించకపోయినా శిధిలమౌవుతుంది. శిధిలం మాట మరిపించేది, మురిపించేది అంతర్జాల మాయాజాలం.”
సాక్షి దిన పత్రిక లో నేను వ్రాసిన గూగుల్ నెట్‌లో e బుక్స్ చదివి వెంటనే నాకు ఫోన్ చేసి అభినందించిన వారిలో ఆయన ఒకరు. ఆ వ్యాసాన్ని ఆయన ఆంధ్రా యూనివర్సిటి కి సమర్పించిన ఒక పత్రంలో ప్రస్తావించానని, అక్కడి విద్యార్ధులకి అందజేసానని కూడ తెలియజేసారు.
తెలుగునాట గ్రంధాలయాల ఏర్పాటు కోసం ఆయన చేసిన కృషి చాల గొప్పది.
కవిరాజు త్రిపురనేని రామస్వామి అంటే వారికి అభిమానం. కవిరాజు మనుమడిగా ఆ అభిమానం నా మీద కూడ కొంత చూపించారనుకుంటాను. మేము మద్రాసులో ఉన్నప్పుడు ఆక్కడికి వచ్చినప్పుడల్లా మా అమ్మ ‘కవిరాజు’ కుమార్తె చౌదరాణి ని తప్పక కలిసేవారు.
ఆదివారం మే 6, 2012 న కేంద్ర సాహిత్య అకాడెమి కవిరాజు త్రిపురనేని రామస్వామి సాహిత్యం మీద గుడివాడ లో నిర్వహించిన సదస్సులో వారు కూడ పాల్గొన్నారు.
వెలగా వారు ఈ రోజు ఉదయం విజయవాడలో ఆయుష్ హాస్పిటల్స్ లో ఆఖరి శ్వాస తీసుకున్నారని తెలిసినప్పుడు బాధవేసింది. మరో స్థంభం నేల కూలింది.
రచనలు
వారి రచనలలో కొన్ని, వాటి ముఖచిత్రాలు ఇక్కడున్నవి. సాహిత్యాభిమాని – ఆర్ బి రావ్ సౌజన్యం.
https://www.facebook.com/media/set/?set=a.10155009212985385.1073741875.624985384&type=1&l=1ce9757082
‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి గారి కుమార్తె చౌదరాణి. తల్లి అన్నపూర్ణ. జననం గురువారం, జూలై 25న. 1935 లో. తెనాలి లో. తండ్రి గతించిన నాటికి తనకి ఏడు సంవత్సరాలు. అందుకే తండ్రినుండి అంత ప్రేమకి నోచుకుందేమో.
అతి పిన్న వయసులోనే భర్త అట్లూరి పిచ్చేశ్వర రావు ని కోల్పోయింది. ఒంటరిగానే బతికింది. కాదు జీవించింది. జీవితంతో ధైర్యంగా యుద్దం చేసి మరీ జీవించింది. అవసరమైనప్పుడు రివాల్వర్ లైసెన్సు తీసుకోవడానికి కూడ వెరువలేదు. భర్త ఇచ్చిన ధైర్యమే. గెలిచింది. జీవితంలో వసంతాలు తక్కువే ఐనా అరవై వేసవులు చూసింది. నేటికి ఉంటే 80 పూర్తి అయ్యేవి. ప్రపంచం మర్చిపోయినప్పుడు తన తండ్రిని ప్రపంచానికి గుర్తుచేసింది.
తనని గుర్తు చేసుకుంటూ తనకిచ్చే ఈ చిరుకానుక ఈ రోజున ఈ పుస్తకం ఖూనీ. తనుకోరుకున్నట్టుగా అందరికి అందుబాటులో. డిజిటల్ ఎడిషన్ గూగుల్ బుక్స్ ప్లే ద్వారా. ఇప్పుడు గూగుల్ బుక్స్ లో మీరు
అందుకుని చదువుకోవచ్చు.
మీకు సులభంగా అర్ధమయ్యే తెలుగు లో శ్రీ రావెల సాంబశివరావు గారికి కృతజ్ఞతలతో.
పుస్తకం సాంకేతిక వివరాలు:
Full Title: Khooni, a play
Author: “Kaviraju” Tripuraneni Ramaswamy
Re-told: Ravela Sambasiva Rao
Language: Telugu
Print Length: 45 Pages
Google Play GGKey:WKYHC48AABJ E
Publisher: Tripura Prachuranalu
Published: January 2014
Cover design: Giridhar