అన్వర్ కి ధాంక్స్‌తో..

ఆదివారం.  మార్చ్ 2, 2014. మళ్ళీ SMS.  ఆర్టిస్ట్ మోహన్ గారి పిలుపు.  మనవాళ్లందరూ వస్తున్నారు.  మీరు కూడా రావాలి.  మన శేఖర్ కి మనం చెయ్యాలి! సందర్భం శేఖర్ కార్టూనిస్ట్‌గా గోల్డెన్ జూబిలి సెలబ్రేషన్.

శేఖర్ కార్టూనిస్ట్ గా నే పరిచయం అయ్యాడు  ఆంధ్రజ్యోతి లో.  కె.పి డెస్క్ పక్కనే.  కె.పి ని దాటుకుని శేఖర్ డెస్క్‌కి వెళ్ళాలి.  ఆ పక్కనే వసంతలక్ష్మి గారి డెస్క్.

కినిగె కి తన కార్టూన్ పుస్తకాన్ని ఇచ్చిన తొలి కార్టూనిస్టు శేఖర్.  అదొక అభిమానం.  తరువాత ఎప్పుడో ఒకసారి నా మీద కోపగించుకున్నాడు కూడా!  “నాకు మీరు పిచ్చేశ్వరరావు గారి అబ్బాయని ఎందుకు చెప్పలేదు.  ఆయనంటే మా తరానికి ఎంత ఇష్టమో, మీకు తెలియదు. అటువంటి వాళ్ళు అంత త్వరగా వెళ్ళిపోవాడనికి హడావుడి ఏమిటో?” అనుకున్నడు స్వగతంగా.

అమెరికా సంయుక్త రాష్ట్రాలకి వెళ్లబోయేముందు, వెళ్ళి వచ్చిన తరువాత తన పుస్తకాన్ని డిజిటల్ బుక్‌గా ఎలా డిజైన్‌చేస్తే బాగుంటుందో అని కలిసినప్పుడు మాట్లాడుకునేవాళ్ళం.  కలవనప్పుడు ఫోన్ చేసేవాడు.  ఫోనులో “తింటున్నాన్నా?” అని అడిగి నవ్వేవాడు.

“సార్, మీ ఇంటికి దగ్గిర్లోకి మారుతున్నాను. మనం ఇక రోజు కలుసుకోవచ్చు.  బహుశ నేనే మీ ఇంటికి వస్తాను.  కలిసి టీ తాగోచ్చు,” అని ఎంతో సంతోషంగా నవ్వుతూ చెప్పినప్పుడు ఆనందమేసింది.

తరువాత ఎప్పుడో తెలిసింది..ఆరోగ్యం బాగోలేదని.  ఇంటికి వెళ్ళి పలకరించాలని అనుకునేటప్పడికి ఇల్లు మారడం కూడా ఐపోయింది.

Cartoonist Chandrasekher
Cartoonist Chandrasekher (Jul 16, 1965 – 19 May 2014)

ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ ‌క్లబ్‌లో అతని కోసం చూసాను.  కొంచెం ఆలస్యం అయ్యింది నేను వెళ్ళేటప్పటికి.  మనిషి కనబడలేదు.  వెతుకున్నాను.  కాప్..నోటికి మాస్క్ అడ్డం ఉంది.  ఆ మాస్క్ పైన కళ్ళు. నవ్వు.  ఉగ్గబట్టుకున్న ఆనందం.  సంతోషం.  ప్రెస్‌క్లబ్ నిండిపోయింది.  కాని మనిషిని చూసిన నేను ఖంగు తిన్నాను.  నాకు తెలిసిన శేఖర్ రూపు కాదది.  మనిషి మొఖంలో విపరీతమైన అలసట. సగం అయిపొయ్యాడు.  ఎందుకో ఉండబుద్ది కాలేదక్కడ.  తనతో మాట్లాడడానికి తగిన ప్రదేశమూ కాదు..సందర్భమూ కాదు.  ఈ లోపు ఒకటికి రెండు సార్లు ఫోను చేసిన అన్వర్, sms లు గుప్పించిన ఇతర మిత్రులని పలకరించాను.

హడావుడిగా పరిచయుస్థుడొకాయన వచ్చాడు.  పక్కనే శ్రీమతి అనుకుంటాను.  పేద్ద పూలమాల.  ఒక పుష్ఫగుచ్చం.  హడావుడి హడావుడిగా వేదిక దగ్గిరకు దాదాపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపొయ్యారు.  ఆఖరి చూపు.  పార్ధివ శరీరాన్ని పుష్పమాలంకృతాన్ని చెయ్యాలన్న తాపత్రయం కనపడింది ఆ వేగంలో, ఆ మాటల్లో, ఆ గమనంలో.  విరక్తి పుట్టింది.

విజయవాడలో “మో” హాస్పిటల్‌లో ఉంటే..”సార్,  ఐపోయ్యిందా?  డిక్లేర్ చేసేద్దామా”?   అని స్ట్రింగర్స్ శ్రీ శ్రీ విశ్వేశ్వరావు గారిని పీక్కు తిన్న వైనం గుర్తోచ్చింది.  మనసు రోసింది. అసహ్యం వేసింది. రోత పుట్టింది.

వెళ్ళిపోదామని వెనక్కి తిరుగుతుంటే..అన్వర్ ఎదురువచ్చాడు.  “సార్, వెళ్ళిపోతున్నారా?” అంటూ. ఔనన్నట్టుగా తలూపూతూ గేటు వైపుకి కదులుతుంటే..”వుండండి సార్..రెండు మాటలు మాట్లాడి వెళ్లండి”  అని అన్నాడు.  వాళ్ళ మధ్య నేనేమి మాట్లాడుతాను అనుకుంటూ నిలబడిపొయ్యాను.  “ఉండండి సార్.  ఒక్క రెండు మాటలు మాట్లాడండి.  తనుకూడా వింటాడు కదా?”అని అన్నాడు. ఇక ఆ మాటకు తిరుగులేదు.  సరే అని ఆగి పొయ్యాను.

ఈ లోపు మాట్లాడేవాళ్ళున్నారు.  వాళ్ళ తరువాత..అన్వర్ నాకు మైకు ఇప్పించాడు.  శేఖర్ వెనకకి చేరుకున్నాను.  శేఖర్ భుజం మీద చెయ్యి వేసాను.  శేఖర్ నా ముఖంలోకి చూసాడు.  మా ఇద్దరి కళ్ళు కలిసినవి.  He knows.  He knew, I knew. He also knew that my heart is with him. I wished him all the best with all my heart.  I expressed my good wishes to all his frineds for supporting him at that time. లేచి నిలబడ్డాడు.  కౌగలించుకున్నాడు.  That was the parting embrace. I knew.

మైక్ ఆర్టిస్టు మోహన్ గారికిచ్చాను.  అన్వర్ కి థాంక్స్ చెప్పాను.  వచ్చేసాను.

మా అమ్మ పోయినప్పుడు చలసాని ప్రసాదరావు గారు రాలేదు.  దానికి ఆయన చెప్పిన కారణం.  “నాకు మీ అమ్మ చక్కగా సంతోషం గా నవ్వుతూ ఉన్నప్పుడు చూసిన జ్ఞాపకం.  నాకు అదే గుర్తుంచుకోవాలని ఉంది” అని.
చంద్రశేఖర్ విషయం లో నాది అదే ఉద్దేశం. అందుకే కొడుకు పెళ్ళికి వెళ్ళలేక పొయ్యాను.  ఈ రోజు వెళ్ళడం లేదు.  ఫోటో కూడ తను నవ్వుతున్నదే పెట్టాను.

ఆ రోజున అన్వర్ నన్ను గుర్తుపెట్టుకుని పిలవకపొతే..నాకు శేఖర్ చిరు దరహసం అందేది కాదు.

గుడ్‌బై శేఖర్.  You are a good friend.  I shall remember your smile.  Always.

ఇది వ్యాపారం కాదు.  నేను ఇప్పుడు కినిగె లో లేను కూడా!  శేఖర్ పుస్తకాలు ఇవి కొన్ని అని చెప్పడానికి మాత్రమే:  http://kinige.com/author/Shekar

ఈబుక్స్‌కి లేవా సమీక్షకు అర్హతలు!

పిలల్ల నామకరణానికి నేమ్స్ కోసం నెట్‌ని ఆశ్రయిస్తాం.
వాళ్ళ సందేహలు తీర్చడానికి జాలంలో జవాబులు వెదుక్కుంటాం.
అర్ధాలు చెప్పడానికి ఆన్‌లైన్ డిక్షనరీలు చూసుకుంటాం.
ఆ పిల్లల పరిక్షా ఫలితాలని ఇంటర్నెట్ ‌లో తెలుసుకుంటాం.
ఉద్యోగాలకి ఇంటర్నెట్‌లో అప్ప్లై చేసుకుంటాం.
ప్రేమలేఖలు, ఊస్టింగ్ ఆర్డర్లు, గ్రీంటిగ్‌లు ఆన్‌లైన్‌లో అందుకుంటాం.
ఫేస్‌బుక్కు‌లోను, జీప్లస్సు‌లోను స్నేహాలు చేస్తాం.
కోడల్లని, అళ్ళుళ్ళని నెట్‌లో వెతుక్కుంటాం.
బస్సు టికెట్లు, రైలు టికెట్లని, సినిమా టికెట్లని ఇంటర్‌నెట్‌లో కొనుక్కుంటాం.
పాన్ కార్డ్లు, వోటర్ కార్డులకి ఫారాలు ఆన్‌లైన్లో నింపుతాం.
RTI రా భయ్, అని వాడ్ని ఆన్‌లైన్‌లో నిలదీస్తాం.
పత్రికలని, కథలని, కవితలని ఆన్‌లైన్‌లో చదువుకుంటాం.
స్టోరిని, ఫీచర్‌ని, కవరింగ్‌ని, ఐటంని ఈమైల్‌లో పంపుకుంటాం.

EBook

ప్రింట్ బుక్ ని, డి‌వి‌డిని, ఈబుక్ ని ఆన్‌లైన్‌లో కొనుక్కుంటాం.
కొనుక్కున్న ఈబుక్‌ని కిండిల్ లోను, ఐపాడు లోను అందరూ గమనించేలా చూసుకుంటాం.  లాప్‌టాప్‌లోనూ, డెస్క్‌టాప్‌లోను అప్పుడప్పుడూ చదువుకుంటాం.

ఉచితం  గా పుస్తకాలని అందుకుంటాం, స్వీకరిస్తాం, రివ్యూ చేస్తాం, సమీక్షిస్తాం. పుస్తకం అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణాలలో దొరుకుతుంది అని కూడ పాఠకులకి చెబుతాం. తన ఈ బుక్ గురించి రచయిత తెలియజేస్తే, అది మాకూ తెలుసన్నట్టుగా బుర్ర ఊపుతాం.

కాని..
కాని
ఈబుక్ గా వెలువడిన సాహిత్యాన్ని గుర్తించం. ఒకవేళ గుర్తించినా స్వీకరించం. స్వీకరించినా రివ్యూ చెయ్యం, సమీక్షించం, ఆన్‌లైన్‌లో ఎక్కడ దొరుకుతుందో అని కూడా పాఠకుడికి తెలియజేయం. అదేమిటంటే ఈబుక్స్ గురించి అందరికి తెలిదుగా అని అనేస్తాం. స్పేసు లేదండి అని అంటాం. పైగా మిగతావాళ్ళేవరూ, ఈ భాషలోను చెయ్యటం లేదుగా అని కూడా అనేస్తాం. మరీ ఐతే, టెక్ని‌కల్ సమస్యలున్నాయని దాటేస్తాం.

అదే మా వాడేతే భుజాలమీదకెక్కించుకుని ఊరేగిస్తాం.

కాని మా సాహిత్యాభిమాన్నాన్ని శంకింస్తే మాత్రం ఊరుకోం!

కొసమెరుపు ప్రాసారమధ్యమాలలో పనిచేస్తున్నవారి పుస్తకాలు కూడా kinige.com లో ఉన్నవి.  కనీసం ఇప్పుడైనా ఈ సాహిత్యాన్ని ఈ ప్రసార మాధ్యమాలు గుర్తిస్తాయని, దానికి సముచిత స్థానాన్ని కలిపిస్తుందని ఆశిస్తాను.

‘మో’ ఎవరు?

అని నిన్న నన్నొకరు అడిగారు.

ఎక్కడ?

రవీంద్రభారతి, భాగ్యనగరం.

సందర్భం:

తనికెళ్ళ భరణి సాహితి పురస్కార ప్రదానం.

కూర్చోడానికి ఖాళీ కుర్చీ కనపడక అడిగినట్టున్నాడు.  అడిగిందెవరా అని వెనక్కి తిరిగి చూసాను.  కళ్ళజోడు. నెరిసిన జుత్తు. “సభ మొదలైన తరువాత తెలుస్తుందండి మీకు”, అని  మళ్ళీ నా దృష్టిని వేదిక మీదకి సారించాను.

అవధానం జరుగుతున్నది. అప్రస్తుత ప్రశ్న ; ” అత్యంత లోభి కూడ దానం చెయ్యలేనిది ఏది?”.  అవధాని గారు జవాబిచ్చే లోపే, నా చుట్టూ ఉన్న ప్రేక్షకులు ” కాలధర్మం” అని ఘొల్లుమన్నారు.

అధ్యక్షుడు సి. నారాయణ రెడ్డి గారు, నిషాదం అంటే సంగీతంలో సప్తమ స్వరం అని  వివరిస్తూ.. మో పుస్తకం నిషాదం చదవడం మొదలుపెట్టినప్పుడు..”ఏమో‌” అని అనుకున్నానని కాని “అమ్మో” అని అనిపిస్తుందని అన్నారు.

గవర్నమెంట్ ఎలిమెంటరి స్కూల్ళో చదువుకున్న తనకు, “మో‌” నిషాదం మీద మాట్లాడేంత పరిజ్ఞానం లేదని, నటుడు భరణి ఇలాంటి సత్కార్యాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అందజేసారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య.

ఇక తెలుగు భాష బోధకుడిగా కొన్నాళ్ళు ఉద్యోగం చేసినా, చలన చిత్ర నటుడుగా బ్రహ్మాండంగా సాగిపోతున్న బ్రహ్మానందం,

“అది గది

దాని అద్దె పది”

అనే కవితలోస్తూన ఈ రోజుల్లో, మో నిషాదం చదివి, అర్ధం చేసుకుని, జీర్ణం చేసుకునే అవకాశం ఆ భగవంతుడు తనకివ్వలేదని, తన ఫేసుకి ఆయన ఒక స్టఫ్ ని ఇచ్చి ప్రజలని రంజింపజెయ్యమన్నాడని చెప్పుకొచ్చారు.

ప్రేక్షకులతో పాటూ గా కూర్చోవలసిన తనను, వేదిక మీద కూర్చోపెట్టిన భరణి, తన అభిమానాన్ని చాటుకున్నాడే కాని తనకి ఆ అర్హత లేదని, వినమ్రంగా విన్నవించుకున్నాడు నటుడు ప్రకాశ్ రాజ్.

త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ‘మో‌’ మీద కోపం వచ్చింది.  ఔను, దర్శకుడు శ్రీనివాసే! ‘మో‌’ చదివినంత తను చదవలేదు కాబట్టి, తన కోపం.  ఆ కోపంతో ఆ సాహిత్యం అంతా చదివేస్తానంటాడియన.  అసలు తనకి రవింద్ర భారతి కార్ పార్కింగ్‌లో నిలబడే అర్హత కూడా లేదని కాని భరణి మాట తీసెయ్యలేక వేదిక మీద దాక్కోడం కుదరక కూర్చున్నాని నవ్వుల మధ్య చెప్పాడు.

న్యాయనిర్ణేతలు శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు, ఆచార్య మృణాళిని, కవి శివారెడ్డి.  తాము ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నుకున్న కవితా సంపుటి “నిషాదం” అని తమకు అందిన 108 కవితా సంపుటాలలో దానిని ఎన్నుకోవడానికి గల కొన్ని కారణాలని వివరించారు, కవి శివారెడ్డి.

తనికెళ్ళ భరణి, చక్కని చామరం క్రింద ‘మో‌’ అని  మనం పిలుచుకునే వేగుంట మోహన ప్రసాద్ ని సుఖాసీనుడిని చేసి, వేద పండితుల మంత్రోచ్హారణల మధ్య  స్వర్ణ పుష్పాభిషేకం చేసారు. వేదికనలంకరించిన పెద్దలలో చలన చిత్ర కథకులు, సంభాషణ కర్త పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన వేంకటేశ్వర రావు గారితో సహా అందరూ ‘‌మో’ కి తమ శుభాకాంక్షలు అందజేసారు.

‘మో‌’ తన దైన శైలిలో..ముందే వ్రాసుకుని తెచ్చుకున్న పాఠం నుంచి కొంత మేరకు చదివి వినిపించారు.

బర్త్ డే బాయ్ భరణికి కొంత మంది మిత్రులు తమ శుభాకాంక్షలు తెలియ చేసుకున్నారు.

జాతీయ గీతం జనగణ మణతో సభ ముగిసింది.

ఎటువంటి హడావిడి లేకుండా, వెకిలి ప్రసంగాలు, అనవసరపు డప్పాలు లేకుండా సాఫీగా, హాయిగా జరిగిన గొప్ప సాహిత్య సభ ఇది.  తెలుగు కవి కి తెలుగు కవిత్వానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే పండుగ రోజులకి ఇది తొలి రోజు మాత్రమే.

భరణి తన మాటల్లో చెప్పిన “గద్వాల్ సంస్థానం వారి ఆచారం” మళ్ళీ మొదలవ్వాలని..తెలుగు భాష బ్రతకడానికి ఇటువంటి సాహిత్య కార్యక్రమాలు విరివిగా జరగాలని మనమందరం కోరుకోవాలి.

వీలైతే ‘మో‌’ ప్రసగం పూర్తి పాఠం, అలాగే మితృడు నరేశ్ నున్న ‘మో‌’ మీద వ్రాసి, అచ్చొత్తంచి, ఉచితంగా పంచిన ఒక చిన్న పుస్తకాన్ని మీకు ఇక్కడ అందించడానికి ప్రయత్నిస్తాను.

ఈ తనికెళ్ళ భరణి సాహితి పురస్కారం జరిగినది కళా ఫౌండేషన్ ఆధ్యర్యంలో..కనకధార వెంచర్స్ సహాయంతో..

కినిగె.కాం లో

తనికెళ్ళ భరణి సాహిత్యం ఇక్కడ  ..  ‘మో’ నిషాదం ఇక్కడ  లభ్యం.