వరండాలో నుంచి హాలు గుమ్మందగ్గిరకి వెళ్ళి లోపలికి తొంగి చూడ్డం. అమ్మ కనపడుతుంది శూన్యంలోకి చూస్తూ. తన పక్కన అందరూ స్త్రీలే. అమ్మ కి అటువైపు చాప మీద నాన్న కదలకుండా. ఎవరి దుఃఖంలో వారు.
నేను బేరుమని ఏడవడం. ఇవతలికి రావడం. వరండాలో పేము కుర్చిలో కూలబడటం. ఏడుపు. చూట్టూ ఉన్నవాళ్లలో ఎవరో ఒకళ్ళో ఇద్దరో దగ్గిరకి తీసుకోవడానికి ప్రయత్నించడం. నేను వాళ్ళని దూరంగా నెట్టివేయడం. కాసేపటికి వెక్కిళ్ళు ఆపుకోవడం. ఈ లోపు మరెవరో హాలులోకి వెళ్ళడం. మళ్ళీ లోపలినుండి సన్నగా రోదన మొదలవ్వడం.
అది విని నేను మళ్ళీ బిగ్గరగా ఏడవడం. వెక్కిళ్ళు. నా స్నేహితులు ఎవరూ పక్కన లేరు. ఒంటరిని. ఎవరి దగ్గిరకి వెళ్ళకుండా నేను ఆ పేము కుర్చిలో కూర్చుని ఏడుస్తున్నాను. చుట్టూ తెలిసినవాళ్ళు, తెలియని వాళ్ళు, బంధువులు, పరిచయస్తులు అందరూ పెద్దవాళ్ళే.
నా స్నేహితులు ఎవరూ లేరు.
వెనక ఎక్కడో నా మోతి ఏడుపు.
ఆ రాత్రి విలపిస్తూ, రోదిస్తున్నప్పుడు వచ్చాడు ఆయన. ఏవో వాళ్ళతో గుసగుసలు. లోపల హాల్లోకి వెళ్ళివచ్చాడు. ఆయన్ని గుర్తు పట్టాను. ఏమి మాట్లాడలేదు. నేను ఏడుస్తున్నాను. ఎవరో నా పక్కనే ఒక ఫోల్డింగ్ చెయిర్ వేసారు. కూర్చున్నాడు, ఆయన. గుర్తుపట్టాను ఆయన్ని. అంతకుముందు ఏవో స్టూడియోలలో షూటింగులలో చూసాను. ఆయనంటే ఇష్టం కూడా. నెమ్మదిగా నా ఎడమరెక్క పట్టుకుని దగ్గిరకు తీసుకున్నాడు. ఒళ్ళోకి తీసుకున్నాడు. కళ్ళు తుడిచాడు. ఏవో అవి ఇవి మాటలు చెపుతున్నాడు. నేను వినడం మొదలుపెట్టాను. చేతులు కదిలిస్తున్నాడు. ఖాళీ అరచేతులు. గబుక్కున అందులో ఒక కలం కనపడింది. గుప్పెట మూసాడు. తెరిచాడు. అరచేతిలో ఏమిలేదు. మళ్ళీ ఖాళీ. మరో చెయ్యి చూపించాడు. అందులో ఉంది కలం. ఈ సారి నాణేలు. గుప్పిట్లో చూపించి మూసి తెరిచాడు. లేవు. తన షర్ట్ జేబులోకి వెళ్ళిపోయినవి.
నా ఏడుపు ఆగిపోయింది. మళ్ళీ నాకు ఏవో కబుర్లు చెప్పాడు. తల నిమిరాడు. బుగ్గలు నిమిరాడు. కళ్ళు తుడిచాడు. నా స్నేహితుడి లాగా బుజ్జగించాడు.
లేచి నిలబడ్డాడు. ఎవరినో పిలిచాడు. వారికేదో చెప్పాడు. హాలులో నుంచి ఎవరో వచ్చారు. వరండా లోనుంచి నన్ను హాల్ లోకి, అటునుంచి పడకగదిలోకి తీసుకెళ్ళారు. నా మంచం మీద పడుకోబెట్టారు. దుప్పటి కప్పారు. నేను అలాగే నిద్రపొయ్యాను.
ఆ తరువాత కూడ ఆయన అప్పుడప్పుడు వచ్చేవారు. అమ్మని నన్ను పలకరించేవారు. కాసేపు కూర్చుని కబుర్లు చెప్పేవారు. ఆయనే రమణా రెడ్డి.