గత పాతికేళ్ళుగా క్రమం తప్పకుండా వెలువడుతున్న కధాసాహితి వారి 25 వార్షిక కథా సంకలనం కథ 2014 లో ఈ ముగ్గురి కథలున్నవి.
బత్తుల రమాసుందరి మొదటి కథ ఇక్కడ
చదువుకోవచ్చు; మనిద్దరమే ఉందాం అమ్మా! ఆంధ్రజ్యోతి దిన పత్రిక వారి ఆదివారం అనుబంధం (01-09-2013లో ప్రచురితం)
ఇక రెండవ వారు పాలగిరి విశ్వప్రసాద్, వీరి మొదటి కథ బోలు మనుషులు రచన మాస పత్రిక సెప్టెంబరు 1991లో
ప్రచురితం. నేను వెతికినంతలో అది నాకు జాలంలో దొరకలేదు.
ఇక మూడవ కథకుడు భగవంతం.
వీరి మొదటి కథవెయిటింగ్ ఫర్ యాద్గిరి.
ఈ కథ తొలిసారిగా 2006లో వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితం.
చలన చిత్ర దర్శకుడు వంశీ, నా కెందుకు నచ్చిందంటేఅనే శీర్షికతో
గోతెలుగు డాట్ కాం లో ఈ కథని మెచ్చుకుంటూ పరిచయం చేసిన కథ. భగవంతం పాడిన పాట ఇక్కడ వినొచ్చు. సా.వెం.రమేశ్ స్వరం కూడా!
రానున్న ఆదివారం 20న, తెనాలి లో జరగనున్న కథ 2014 ఆవిష్కరణ సభలో బహుశ వీరందరిని మీరు కలుసుకోవచ్చు. వీరు ముగ్గురే కాదు ఇంకా ఉన్నారు. వారిలో కొంతమంది గురించి రేపు చెబుతాను.
ఇప్పుడే అందింది. రమేశ్ పంపాడు.
ముఖచిత్రం చూస్తే ‘రయికముడి ఎరగని బతుకు’ (భూమిక, డిసెంబరు 2012) గుర్తు వచ్చింది.
అట్టమీద బొమ్మ వేసింది బి కిరణ్ కుమారి. బాగుంది. చూడగానే చేతిలోకి పుస్తకాన్ని తీసుకుని చదవాలనిపిస్తుంది…రమేశ్ ఎవరో, రమేశ్ కతలేమిటో తెలియని వారికి కూడా!
ఆ నలుపు, తెలుపు రంగులలో ఒక అందం ఉంది.
పుస్తకం వెనుక తిప్పిచూస్తే…కొన్ని స్కెచెస్ ఉన్నాయి. నలుపులో తెలుపు. అక్షరాలు కూడా తెలుపులో.
ఆ అక్షరాలతో మనం కూడ పరుగెడతాం!
రమేశ్ కళ్ళెదుట నిలిచిన కల లో కొన్ని మాటలు: మళ్ళా ‘కతలమ్మో కతలు’ అనే నా గొంతు తెరువులో ఉలివింది. తిరిగినాను, తిరిగినాను, తెరువంతా తిరిగినాను. అది బాగా రూకలుండే తెరువే. అంతకు ముందు నా కతల్ని అబ్బురంగా తీసుకున్నవాళ్ళు ఉండే తెరువే. కాని నా కతలు వెలపోలేదు. . . . ఒక్కటీ నచ్చలేదు వాళ్లకు, ఒక్కటీ కతగా తోచలేదు వాళ్ళకు. . . . నాకు దిగులు కలిగింది. . . . అప్పుడు తిరుపతి ఉమన్న చెప్పినాడు, ‘పెద్దతెరువులోనే బండిని తిప్పితే ఎట్టాసామీ, సన్న సందుల్లో కూడా మణుసులు ఉంటారు. అక్కడకూడ కతలంటే ఊపిరిచ్చేవాళ్ళు ఉంటారు. ఒకసారి ఆ తట్టుకు పోయిరా పో’ అని.
పుస్తకాన్ని పూదోట శౌరీలు, మల్లవరపు విజయమరియదాస్ లకు అంకితం ఇచ్చాడు రమేశ్.
పుస్తకం లో ఉన్న కతలు వాటి క్రమం:
తెలుగు సిన్నోడు తిమ్మరాయప్ప మీసర వాన ఊడల్లేని మర్రి పదిమందికి పెట్టే పడసాల ఆ అడివంచు పల్లె కాకికి కడవడు పిచిక్కి పిడికిడు రయికముడి ఎరగని బతుకు చెట్లు చెప్పిన కత సిడిమొయిలు బడకొడితి వాడు గోపాలకృష్ణ కొటాయి ఒంటినిట్టాడి గుడిసె ఎందుండి వస్తీవి తుమ్మీదా అబ్బిళింత కతలగంప మాదిగపుటక కాదు మొయిలు నొగులు పాంచాలమ్మ పాట
ప్రతి కథ చివర అందులో తను వాడిన కొన్ని పదాలకి…మీకు, మీకేంటి నాకు కూడ అర్ధం అయ్యే తెలుగు పదాల అర్ధం ఇచ్చాడు.
ప్రతులకు మీరు పుస్తకం ధర రెండు వందలు పంపవలసింది ఇక్కడికి:
1-2-740, హనుమాన్ మందిరం దగ్గిర, రాకాసి పేట, బోధన్ 503 180
ఫోను: +91 90101 53505
గమనికపుస్తకంలో ప్రతులకు “అన్ని ముఖ్యమైన పుస్తక కేంద్రాలు” అని ఉన్నా అవి ఈ విషాదాంధ్రలో కాని, ప్రజాశ్రేయస్సులో కాని దొరుకుతాయన్న నమ్మకం లేదు. కాబట్టి పై ప్రచురణకర్తలకి రొక్కం పంపండి. అనుమానాలుంటే వారికి ఫోను చెయ్యండి. చెబుతారు మీకు పుస్తకం ఎక్కడ దొరుకుతుందో. వీలైతే వాళ్ళకి కొరియరు / పోస్ట్ ఖర్చులు పంపండి. మరో పుస్తకం వాళ్ళు ప్రచురిస్తే మనకి మరో పుస్తకం అందుబాటులోకి వస్తుంది మరి!