స్క్రిప్ట్ ఆర్ట్శ్ శాస్త్రిగారు ‘బాపు‘ బొమ్మలతో తెలుగువారి పండగలకి కొత్త శోభలిఛ్హిన రోజులవి. ఉగాదికి, సంక్రాంతికి, వివాహాలకనేమిటి ప్రతి సందర్భానికి ఒక బాపు కార్డ్. ఒక పాకెట్లో పది కార్డులు. పది కవరులు వాటికి సరిపడా! బొమ్మలాయనివి. లోపల మాటలు. బొమ్మకి తగినట్టుగా పదాలు. కొన్ని కావ్యాలలోనుంచి. కొన్ని ఆరుద్ర లాంటి కవుల కలాలనుండి.
ఒకటి రెండూ కాదు. కొంటే అదొక పాకెట్టు. ఇదొక పాకెట్టు. తలా ఒకటి అసార్టెడ్. బావకి మరదలు. చెల్లెలికి అన్నయ్య. భార్యకి భర్త. మామ్మకి మనవడు. ఆఫ్రికాకి. అట్లాంటాకి. ఆస్ట్రేలియాకి. అబుదభికి. గవర్నర్ గారేంటి. సి ఎమ్ గారేంటి. సినిమా తారలేంటి. గుమస్తా ఏమిటి? ఎమ్ డి ఏవిటి? ఒకడేవిటి? ఒక నెలరోజుల ముందే కొనేసి రిజిస్టర్డ్ పోస్ట్‌లో పంపేవాళ్ళు కొందరు. స్పీడ్‌పోస్ట్ లో పంపేవాళ్ళు కొందరు.
సర్కార్ ఎక్స్ ప్రెస్ ఎక్కి, బీచీ స్టేషన్లో దిగి, మద్రాసులో సి ఎ చదివేసి, పనిలో పనిగా సినిమా తారలందర్ని ఒక లుక్కేసి మళ్ళీ ఏ హౌరా మెయిలో, కోరమాండలో ఎక్కేసే రోజులవి.
అలాంటి రోజుల్లో…
ఒక ఉగాది.
పొద్దున్నే.
నీరసంగా వఛ్హారు ఇద్దరు కుర్రాళ్ళు.
బాపు గ్రీటింగ్స్ కావాలంటూ. అన్ని అయిపోగా మిగిలిన వాటిల్లో నుంచి తలాఒకటి కార్డ్‌లు తీసుకున్నారు. ఆంధ్రపత్రిక వారి పంచాగం ఒకటి. నేమాని వారి పంచాంగం ఒకటి. మొహాలు వేలాడేసుకుని చిల్లర ఇస్తున్నారు అమ్మకి.
“ఏంటయ్యా, పండగరోజు ఇలా నిరుత్సాహంగా ఉన్నారు?” అని అడిగింది అమ్మ.
“ఉగాది రోజండి. ఎప్పుడు ఇల్లు వదిలి లేమండి. అమ్మ చేత్తో ఉగాది పఛ్హడి తినేవాళ్ళం. ఈ సంవత్సరం ఆ గతి లేదు. ఇక్కడెక్కడా ఉగాది పచ్చడి పెట్టేవాళ్ళెవరూ లేరు. ఇంక ఇలా ఉండక ఎలా ఉంటామండి?” అని అన్నాడు అందులో ఒకడు చెమర్చిన కళ్ళతో. ఏదో కంపెనిలో ఇంటర్నల్ ఆడిట్ కని వఛ్హారట. పండక్కి ఇంటికి వెళ్ళడానికి కుదర్లేదు. “వెళ్ళొస్తామండి” అని వాళ్ళు వెళ్లబోతుంటే అమ్మ వాళ్ళని మాటల్లో దింపింది. నేను కలగజేసుకున్నాను. ఏలూరు వైపు వాళ్ళు. అమ్మ వాళ్ళతో మాట్లాడుతూనే ఉంది. మధ్యలో ఫోన్ చేసింది ఇంటికి. నా భార్యకి ఏదో చెప్పింది. నాతో ‘కరుప్పయ్య’ ని ఒక్కసారి వెంటనే ఇంటికి వెళ్ళి రమ్మనమని చెప్పు అంది.
కరుప్పయ్యన్ రిక్షాతను. కొత్తగా అప్పట్లో రిక్షాలకి మోటర్లుండేవి. పోస్టాఫిసు మూలమీద రిక్షా స్టాండ్. అక్కడుంటాడు. స్టాండ్ లోనే ఉన్నాడు. “ఒకసారి అర్జెంటుగా ఇంటికి వెళ్ళిరా,” అని పంపాను. ఇదిగో ఇక్కడున్నటు వస్తాను అని బుర్రు మని వెళ్ళాడు. గట్టిగా నడిస్తే పది నిముషాలు పట్టదు ఇంటికి చేరుకోవడానికి.
పది నిముషాలలో వఛ్హాడు వెనక్కి. చేతిలో చిన్న సంచి. అందుకుని అమ్మకిచ్చాను. సంచి తీసుకుని అమ్మలోపలికి వెళ్ళింది. పుస్తకాల రాక్ల వెనుక కొంత ఖాళీ ఉంటుంది. ఈ కుర్రాళ్ళ మూడు బాగోలేదుగా! “వెళ్ళొస్తామండి” అని కుర్చిల్లో కూర్చున్నవారు లేచారు. (అప్పట్లో ‘ఆంటి’ లు ‘అంకుల్స్’ లేరు. అక్కయ్య గారు, బాబయ్, పిన్ని గార్లే. ఎక్కువ. లేదు “అండి”!)
“ఆగండాగండి,” ఆంటూ అమ్మ ముందుకు వఛ్హింది. అమ్మ చేతిలో స్టీలు పళ్ళెం. అందులో రెండు గిన్నెలు. గెన్నెలో స్పూన్. ఆ రెండిట్లోను ఉగాది పఛ్హడి.
అవి చూడగానే వాళ్ళ ముఖాలు విప్పారి ఇంతింతైనవి. కళ్ళలో ఆనందం. అమ్మ వాళ్ళ అరిచేతిల్లోకి గిన్నెలో నుంచి స్పూన్ తో తీసి ఆ ఉగాది పచ్చడిని అందించింది. లొట్టలేసుకుంటూ తినేసారు. అందులో ఒకతను అరి చెయ్యి నాకేసుకున్నాడు. బయటపెట్టిన బకెట్ నీళ్లతో చేతులు కడుకున్నారు ఇద్దరూ. మాటల్లేవు. పాంట్ జేబులోంచి హాంకిలు తీసుకుని మూతులు తుడుచుకున్నారు. చేతులు తుడుచుకున్నారు. ” తినండమ్మా ఇంకా కావాలంటే,” అని అమ్మ ఆ పళ్ళెం టేబుల్ మీద పెట్టింది, టేబుల్ వెనక్కి వెళ్ళి కూచోబోతూ.
“ఉండండుండండి,” అంటూ అందులో ఒకరు అమ్మ కాళ్ళమీదకి పడిపోయ్యి ” మా అమ్మ అంతటివారు, మిమ్మల్ని మరిచిపోలేమమ్మా, మమ్మల్ని ఆశీర్వదించండి” అని అపేశారు. అందంతా అయిపోయింది. వెళ్లలేక వెళ్ళారిద్దరూ! కళ్ళు తుడుచుకుంటూ!
ఆ ఉగాది మొదలు ప్రతి ఉగాది రోజున అడిగిన వారికి ఉగాది పచ్చడి వడ్డించడం ఆనవాయితి అయిపోయింది రాణీ బుక్ సెంటర్ కి. తరువాత తరువాత ‘రాణమ్మ’ చేతి ఉగాది పచ్చడి కోసమే పాండిబజారులోని రాణీ బుక్ సెంటర్ కి వచ్చేవారు కొంతమంది. వాళ్ల ఇళ్ళల్లో చేసుకుని తిన్నా!
But today, it is a different story. Neither is Rani Book Center there, nor my mother! What an irony! But that is life I guess.
అమ్మ = చౌదరాణి
ఇక్కడ వాడిన బాపు బొమ్మకి హక్కుదార్లుః https://te.wikipedia.org/w/index.php?curid=78744