దాదాపుగా గత దశాబ్దం అంటే పదేళ్ళుగా నేను తెలుగు సాహిత్యం – పాఠకులు గురించి నేను ఒక ప్రతిపాదన చేస్తూవచ్చాను. ఆ ప్రతిపాదన మిత్రులతో పంచుకుంటూనే వున్నాను. అలాగే సాంఘిక మాధ్యమాలు అంటే Social Media. ప్రస్తుతం ఒక తరం విరివిగా వాడుతున్న ఫేస్‌బుక్, కొంతకాలం క్రితం ప్రాచుర్యంలో వున్న బ్లాగ్ ప్రపంచం, గూగుల్ వారి ఆర్కుట్, గుగుల్ ప్లస్ లాంటి వాటిల్లో నా అభిప్రాయాన్ని తెలియపరుస్తునే వచ్చాను.
అదేమిటంటే సాంఘిక ప్రసారమాధ్యమాలలో మాత్రమే తెలుగు సాహిత్య పిపాసువులు అంటే కవులు, రచయితలు, కళాకారులున్నారన్నది భ్రమ! తెలుగు సాంఘిక మాధ్యమాల వెలుపల విస్తారమైన ప్రపంచం వున్నదన్నీనూ, అందులో తెలుగులో రాసే రచయితలు, కవులు వగైరా మాత్రమే కాక తెలుగు పాఠకులు వున్నారన్నీను అని నా ప్రతిపాదన! అంతే కాదు ఆ ఫేస్‌బుక్‌లో యువత లేదని కూదా చెప్పాను. ఆ యువత తెలుగు చదివే ఆసక్తి వున్న యువత అని, తెలుగులో రాయాలని కోరిక ఆ యువతకి వున్నదని కూడా చెప్పాను.
కాకపోతే ఆ యువతకి తెలుగు సాహిత్యం చదవడం ఎక్కడ మొదలు పెట్టాలని తెలియదు. వారిలో కొంత మందితో మాట్లాడినప్పుడు వారు నన్ను అడిగారు కూడా. “సార్, తెలుగు సాహిత్యం చదవాలంటే ఏ పుస్తకంతో మొదలు పెట్టాలి?” దానికి అనేక మంది అనేక సలాహాలు ఇస్తూ వచ్చారు. ఇస్తున్నారు కూడా. ఆ జాబితాల వివరాలు భవిష్యత్తులో ఇక్కడే మీకు ఇస్తాను.
ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వాలని నేను ఎప్పట్నుంచో ఇవ్వాలని అనుకుంటూ వచ్చాను. అది ఇప్పటి ఈ రోజుకు కి కుదిరింది. ప్రస్తుతం దాదాపు పాతికేళ్ళ (పాతిక = 25, + ఏళ్ళు = సంవత్సరాలు = పాతికేళ్ళు) క్రితం కొంతమంది తెలుగు సాహిత్యాభిమానులు తయారు చేసిన జాబితా ఇది. దీనిని ఈమాట అనే తెలుగు జాల పత్రిక (interent / web / magazine) లో ప్రచురించారు. ఈ జాబితాను ప్రచురించినవారు వారి మాటల్లోనే ఇలా అన్నారు:
“లోకో భిన్న రుచిః! ఈ జాబితా మీకు సమగ్రంగా తోచకపోవచ్చు, అసంపూర్ణంగా అనిపించవచ్చు; మీ గొప్ప 100 పుస్తకాల జాబితా వేరే పుస్తకాలతో నిండి ఉండవచ్చు. ఈ జాబితా వెనుక ఏ రకమైన అధికారిక గుర్తింపు లేదు. ఇది కొంతమంది సాహిత్యాభిమానుల సమిష్టి ఎన్నిక. కొందరు పాఠకులతో ఈ పుస్తకాలను మొదటిసారో, మరోసారో చదివించటమే ఈ ఎన్నిక ఉద్దేశం.”
కాబట్టి మీకు మీ మిత్రులు, బంధువులు కాని ఇతరులు సూచించిన పుస్తకాలు గురించి కాని వివరాలు వుండకపోవచ్చు. దానికి కారణం మొదట్లోనే చెప్పినట్టు ఈ జాబితా దాదాపు 25 సంవత్సరాల క్రితంది. కాబట్టి ఇందులో సమకాలీన (contemporary) అంటే 1999 తరువాత వెలువడ్డ సాహిత్యం, పుస్తకాలు, కవితలు, కథలు, నవలలు, నాటకాలు వగైరా వుండవు.
ఇక ఈ జాబితాల సేకరణలో నాకు తోడ్పడిన మిత్రులు డా జంపాల చౌదరి, ఏ వి రమణమూర్తి, సి . భాస్కరరావు గారలకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఆ జాబితలు విడిగా ఇస్తాను. చాలా మంది చాలా జాబితాలు తయారు చేసారు కాని వాటిల్లో కొన్నింటిని నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
సరే, ఇక్కడ ఇందాక ప్రస్తావించిన ఈమాట లో వచ్చిన జాబితా చూడండి. మీకు ఏవైనా సందేహాలుంంటే నాకు ఇక్కడే comment బాక్స్‌లో తెలియజేయండి. నాకు తెలిసినంత మేరకు సందేహాలు తీర్చడానికి ప్రయత్నిస్తాను.
ఇక ఈ జాబితాల సేకరణలో నాకు తోడ్పడిన మిత్రులు డా జంపాల చౌదరి, ఏ వి రమణమూర్తి, సి . భాస్కరరావు గారలకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Note; This post was written keeping in mind the Gen Z who are interested in reading Telugu books.
వినూత్న తెలుగు సాహిత్య వాతావరణంలో ఒక కొత్త సంస్కృతి వచ్చి చేరింది. అది మంచిదిలాగే కనపడ్తుంది గానీ దాని వల్ల కల్గే హాని చాప కింద నీరులా విస్తరిస్తూ పోతుంది.
కొత్తగా రాస్తున్న వాళ్ళలో చాలా మంది “కాఫ్కాని చదువు, మాయా ఫలానా రచన చదివావా? మంటో శైలి ఎంత గొప్పదంటే, ఫలానా ఫ్రెంచ్ రచయిత ఏమన్నాడంటే, ఫలానా ఇంగ్లీష్ నవల్లో ఒక చోట రచయిత ఇలా అంటాడు” అని ఉటంకిస్తుంటారు. ఇందులో తప్పేమీ లేదు. అయితే వీళ్ళలో తొంబైశాతం మందికి మన సొంతింటి సుగంధాలు బహుదూరం. వాళ్ళేమన్నారో, రాశారో తెలీదు. పక్కా లోకల్ చాసోనో, కుటుంబరావో, రావిశాస్త్రో తెలుస్తారని, వాళ్ళ పుస్తకాలు వీళ్ళు చదివారని మనం అనుకోకూడదు. చాలామంది కొత్త రచయితలకి వీళ్ల పుస్తకాలు గ్రీకూ లాటినూ.
ఆనాటి పాత సాహిత్యాన్ని ఇష్టపడి చదివే పాఠకులకు అపురూపంగా దొరికిన కొత్త పుస్తకం అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు (కొత్త ముద్రణ).
అనేక సంవత్సరాల నుంచి పెండింగ్‌లో పెట్టబడిన ఈ పుస్తకాన్ని పిచ్చేశ్వరరావుగారి కుమారుడు, రచయిత అనిల్ అట్లూరి ఎట్టకేలకు ఇటీవల తీసుకు వచ్చారు. ఈ పుస్తకంలో పిచ్చేశ్వరరావుగారివి 26 కథలు, నాలుగు పుస్తక సమీక్షలు, అనిల్ రాసుకున్న కొన్ని మాటలూ, జ్ఞాపకాలూ ఉన్నాయి. పుస్తకం పేపర్ క్వాలిటీ అంత గొప్పగా లేకపోవడం కొంత నిరాశపరిచే విషయం. తర్వాతి ముద్రణలో ఈ విషయమై ప్రకాశకులు జాగ్రత్త పడాల్సి ఉంది. అలానే పిచ్చేశ్వరరావు కథలకే ఈ పుస్తకాన్ని పరిమితం చేసుంటే బాగుండేదేమో. కాని ఇవి పట్టించుకోవలసిన అభ్యంతరాలు కావు. ఈ పుస్తకంలో కథలు అలాంటివి.అట్లూరి పిచ్చేశ్వరరావుగారి పేరు తెలిసినవారికి ఆయన కథకుడిగా కంటే అనువాదకుడిగా ఎక్కువగా తెలుసు. ముఖ్యంగా కిషన్ చందర్ అనువాదకుడిగా. ఆయన సినిమా రచయితగా కూడా పని చేశారు. ముఖ్యంగా ‘వెండితెర నవల’ కాన్సెప్ట్ పిచ్చేశ్వరరావుగారితోనే మొదలైందని కోతి కొమ్మచ్చిలో ముళ్ళపూడి కూడా రాస్తారు. తొలి వెండితెర నవల గౌతమ బుద్ధ. అది రాసింది పిచ్చేశ్వరరావుగారు.
పూర్తి సమీక్ష చదవడానికి ఈ లంకె మీద క్లిక్ చెయ్యండి.
ఆయన యుద్ధకాలాన్ని చూశారు. స్వయంగా నేవీలో పనిచేశారు.
ఈ పుస్తకం చదివాక, రచయితగా ఆయనేమిటో తెలిశాక, ఆయన ఇంకా ఏమి రాశారనే ఆలోచన పాఠకుడి మెదడులో తప్పక మొలకెత్తుతుంది. అటువంటి ప్రభావశీలమైన కథలు ఇందులో ఉన్నాయి.
రచయిత విప్లవ వాది కావడంతో దాదాపు అన్ని కథల్లోనూ ఈ ధోరణి కనిపిస్తుంది. దాదాపు ప్రతి కథా ఒక విముక్తిని సూచిస్తూ ముగుస్తుంది. సుబ్బమ్మ కథ ‘సంఘానికీ జై’ అని ముగిస్తే, నెత్తురు కథ ఆసాంతం ఎర్రెర్రగా సెగలు కక్కుతుంది.
చిరంజీవి కథ ఒక విప్లవ తరంగమే. ఆయన కథలన్నిటిలోకీ ది బెస్ట్‌గా ఈ కథను విమర్శకులు ఎన్నిక చేస్తారు.
‘ఇదిప్పుడు మన దేశమే’, ‘బ్రతకటం తెలియని మనిషి’, ‘జీవచ్ఛవాలు’ ఇత్యాది కథలన్నీ సామాజిక అంశాలు, నిరసన, తిరుగుబాటు తత్వాలతోనే నిండి ఉంటాయి. అమెరికా నుంచి వచ్చిన నావికుడి కథ జీవచ్చవాలు. యుద్ధం ప్రజల జీవితంలోనే కాదు, యుద్ధంలో పనిచేయాల్సి వచ్చినవారి జీవితంలోనూ ఎంతటి అశాంతిని మనిషి జీవితంలో నింపుతుందో. అందుకే ఆ కథలో చివర్లో “మళ్ళీ టోవెడో (నౌక)ఎప్పుడొస్తుందిరా?” అని రచయిత స్నేహితుడు అడుగుతాడు. “ఎందుకురా?” అని కథకుడు అడిగితే అతడంటాడు. “ఆ మృతజీవిని చూడాలిరా.”
ప్రతి కథలోనూ మానవతాకోణం అంతర్భాగమై అల్లుకుపోయి ఉంటుంది. మనుషులన్నా, స్వేచ్చ అన్నా, స్వాభిమానమన్నా, పోరాటమన్నా, ముఖ్యంగా చిక్కని ఎరుపన్నా రచయితకు మహా ప్రేమ. మనుషుల కోసం, మానవకల్యాణం కోసం ప్రతి కథలో రచయిత తపిస్తాడు. జీవితంలో దుఃఖానికి కారణాలు అన్వేషిస్తాడు.
కథాకాలాన్ని అనుసరించి ఈ కథల్లో యుద్ధ వాతావరణమూ, యుద్ధం మీద చర్చా ఉన్నాయి. రచయితకు ఉన్న అపార విజ్ఞానం ఈ కథల్లో చోటు చేసుకున్న సంఘటనల మీద, అంతర్జాతీయ పరిణామాల మీద ఆయన వ్యాఖ్యానం తేటతెల్లం చేస్తుంది. స్వయంగా నేవీలో కొంతకాలం పనిచేసిన రచయిత రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటులో పాల్గొని ఉండటం ఆయన నేవీ కథలకు నేపథ్యం అని స్పష్టమవుతుంది.
చిరంజీవి కథ ఈ నేపథ్యంలోంచి పుట్టిందే. ప్రతి పాఠకుడినీ కదిలించే ఈ కథ తెలుగు కథాసాహిత్యంలో నిజంగా ఎప్పటికీ నిల్చిపోయేదే.
చిరంజీవి ఒక ప్రత్యేక వ్యక్తి ప్రత్యేక వ్యక్తిత్వపు కథ. ఎవరికీ లొంగని, ఎన్నడూ జంకని చిరంజీవి మిలటరీ హాస్పటల్లో పడి చివరి క్షణాల్లో మూలుగుతున్నపుడు కథకుడు అతని కథ మనకి చెపుతూ పోతాడు. అధికారులను ఎక్కడికక్కడ ఎదిరిస్తూ, ప్రశ్నిస్తూ, తిరగబడుతూ, తోటి సైనికుల్ని తన మాటలతో, ఉపన్యాసాలతో ఉర్రూతలూగించి, రక్తాన్ని పరుగులు పెట్టించి విప్లవ జ్వాలలు రేపిన చిరంజీవి చచ్చిపోతాడేమో అని గుండె దడ పుట్టిస్తాడు రచయిత. చివరికి డాక్టరు లోపల నుంచి వచ్చి కళ్ళు తుడుచుకుని “చిరంజీవి చనిపోలేదు, అట్లా చూస్తావేం? వీళ్ళంతా చిరంజీవులే, ఈ జనం చిరంజీవులే” అని పాఠకులకు చిరంజీవితో ఎనలేని బంధాన్ని క్షణంలో కట్టేస్తాడు.
మసకబారిన చూపు మధ్య నుంచి ఆ తర్వాతి వాక్యం “ఎస్. బీ. ఏ. చేతుల్లోంచి తుపాకీ లాక్కున్నా నేను” అని కనపడి అని చిరంజీవిని నిజంగా చిరంజీవిని చేస్తుంది.
‘కథకుడికిగా పిచ్చేశ్వరరావు’ అని కొడవటిగంటి కుటుంబరావు 1967లో రాసిన వ్యాసంలో “ఒక మనిషి చావు అవాస్తవం అనిపించడానికి కారణం ఏమిటని నేను ఆలోచించాను. ఆ మనిషి మీది ప్రేమాభిమానాలు మాత్రమే అందుకు కారణం కావు. మనిషితో పాటు పోకుండా సజీవంగా మిగిలిపోయేదేదో ఉంటుంది. అదే మనిషి చావుని నమ్మశక్యం కాకుండా చేస్తుంది” అంటారు. డాక్టరు వచ్చి “చిరంజీవి చనిపోలేదు, ఈ జనమంతా చిరంజీవులే” అన్నపుడు, చప్పున ఈ వాక్యం గుర్తొస్తుంది.
ఈ కథలు చదివి, పుస్తకం అలా గూట్లో పడేసి పక్కకి పోలేం. అలా అని పుస్తకం ఎదురుగా ఉంటే అది వేసే ప్రశ్నల్ని మనం తట్టుకోలేం. వెంటాడి ప్రశ్నించి వేధించే పుస్తకం ఇది.
మనం బజారుకి పోతే, ఏ ఆస్పత్రి సందు చివరో చిరంజీవి కనపడి పలకరిస్తాడేమో, ఏ సుబ్బమ్మో కనపడి నినదిస్తుందో, వసుంధర గురించి తనకేం తెలుసో ఆ రోడ్డు చెప్తుందేమో, శాస్త్రి పలకరిస్తాడా, విమలాదేవి ఎదురై విషాదంగా నవ్వుతుందా అన్నంతగా జీవం నింపుకున్న ఆ పాత్రలన్నీ మన వెంట పడతాయి.
పుస్తకం మొదలు కావడమే నెత్తురు కథతో మొదలవుతుంది. అది నెత్తురా, మనిషా, ఆత్మా, రక్తమాంసాలు నిండినా మనిషా?
‘రంగేసిన గుడ్డ కాదది, నెత్తురు పులుముకున్న గుడ్డ, నీలా నాలా బతికిన మనిషి నెత్తురు’ అని స్పష్టత ఇస్తాడు రచయిత. ఆ నెత్తురులో తెల్ల రక్తకణాలూ ఈదినై, ఎర్ర రక్తకణాలూ ఈదినై అంటాడు.
ఈ కథల నిండా గట్టి గుండె, స్థిరమైన ఆలోచనలు, మొండి తిరుగుబాటు స్వభావమూ ఉన్న మనుషులు పలకరిస్తుంటారు. నేవీలో ఆవిరి మెషిన్ లీకేజ్ నుంచి అందరినీ కాపాడిన చిరుద్యోగికి పెన్షన్ ఇవ్వ నిరాకరించి “గేటు దగ్గర కూచునే ఉజ్జోగం చేస్తావా పోనీ” అన్న ఆఫీసరు మొహాన్న పేణ్ణీళ్ళు కొడతాడతను.
తన పెన్షన్ గవర్నమెంట్‌కి వృథా ఖర్చు అన్న ఆ అధికారికి, ఆనాడు జరిగిన సంఘటన మొత్తం చెప్పి నేవీ ఆఫీసర్ల జీతాలెంత వృథానో వివరించి, “గేటు కీపర్ ఉజ్జోగం చెయ్యను” అంటాడు. ఇలాంటి వ్యక్తులే కాదు, జీవం నిండిన వాక్యాలు, చదవగానే ఎప్పటికీ గుర్తుండిపోతాయేమో అన్నట్టుండే మెరుపు వాక్యాలు, కథకు నిండుతనాన్ని తెచ్చిపెట్టే వాక్యాలు ఈ కథల నిండా పరుచుకుని ఉంటాయి.
– నేటి నుంచీ నేను స్వతంత్రుణ్ణట. ఔను, కాదనేందుకు నాకు స్వాతంత్ర్యం లేదు (ఆగస్టు 15 న).
– మారే పరిస్థితుల్లో చావు బతుకులు చోట్లు మార్చుకుంటాయి. వీళ్ళందరూ చావంటే ఉన్న భయంతో బతుకుతున్నారు గానీ, బతుకంటే ఉన్న మమతతో కాదు ( బ్రతకటం తెలియని వాడు).
– చేతిలో ఉన్న చావుని చూసి భయపడటానికి ఒప్పుకోక పోతే గతంలో బతకండి (వెర్రి కాదు వేదాంతం).
అభ్యుదయపు మేలిముసుగుల మీద ఛెళ్ళున తగిలే సన్నని చర్నాకోల దెబ్బలున్నాయి ఈ కథల్లో.
‘మనవాళ్ళమ్మాయే’ కదాని పనిలో పెట్టుకున్న సుబ్బమ్మని ‘సుబ్బి’ అని పిలిచే రమణయ్య లాటి మనుషుల మీద చెణుకు: “మనవాళ్ళ పిల్లే కదా, మరి సుబ్బీ అని పిలుస్తావేమిరా?” అని అడగబోయిన కథకుడు “ఒకవేళ మన వాళ్ల పిల్ల కాకపోతే వాడు సుబ్బీ అని పిలిస్తే నేనేమి అభ్యంతరం చెప్పే వాడినో” అంటాడు.
పాపారావు తండ్రి, మాల వాళ్ల సరసన కూచుని భోజనాలు చేసిన మనిషి. కొడుకు మాత్రం వెట్టి వెంకడి కొడుకుతో గోళీలాడ్డం అతనికి సుతరామూ నచ్చదు. వెంకడొచ్చి వీడిని “చిన్న దొరగారూ” అంటుంటే, వెంకడి కొడుకొచ్చి “పాపారావూ, రావోయ్ గోళీలాడుకుందాం” అని పిలుస్తుంటే ఆయనకు మండుతుంది. “మాలవాళ్ల చేత నీళ్ళెందుకు పోయించుకుంటున్నావంటే, వాళ్లంటే ప్రేమ ఉండీ కాదు,అంటంటే పెడమొగం ఉండీ కాదు, పడమర చెరువు మీ ఇంటికి అరమైలు దూరంలో ఉంది. ఇంట్లోకి కావల్సిన పది కావిళ్ళూ మోస్తే పెద్దలు గుర్తొస్తారని చేస్తున్నావు ఈ సంస్కరణంతా. మీ పాలేరుకు పది సోలలు వడ్లెక్కువ కొల్చావా? పది రోజులు సెలవులిచ్చావా?” అని పక్కింటి వాడు అడుగుతాడేమో అని పాపారావు భయపడుతున్న మాటలు తాను అనేస్తాడు రచయిత.
కొన్ని కథలు ఆలోచనల ప్రవాహంతో చైతన్యస్రవంతి శైలిలో సాగుతాయి. వెర్రి కాదు వేదాంతం, ఒక అనుభవం, కోరిన వరం ఈ కోవలోవే. అబ్‍స్ట్రాక్ట్ చిత్రణ పిచ్చేశ్వరరావుగారికి అతి సులభమైన ప్రక్రియగా తోస్తుంది కొన్ని కథలు చదువుతుంటే. ఓల్గా అన్నట్టు ఆయన చిన్న వయసులోనే కాలం చేయకుండా ఉండి ఉంటే, తన మార్మికతతో తెలుగు సాహిత్యపు మార్కెజ్‍గా మిగిలేవారే.
వసుంధర కథ తెలుగు కథా సాహిత్యంలో ఎన్నడూ చూడని, ఎవరూ చేయని ఒక వినూత్న ప్రయోగం. వసుంధర గురించి ఆమె చదువుకున్న కాలేజీ, ఆమె నడిచిన రోడ్డూ, గడ్డీ అన్నీ వివరంగా చెపుతుంటాయి. మధ్యలో కాలం, వ్యక్తులు వచ్చి మార్పులు అనివార్యమంటుంటాయి. కథ వసుంధర చుట్టూనే తిరిగినా, ఆమె ఎక్కడా మాట్లాడదు. ప్రజాకంటకుడైన భర్త నుంచి సమాజాన్ని కాపాడటానికి వసుంధర చేసిన పనిని కూడా వసుంధర చెప్పదు. ఇటువంటి కథ బహుశా ఇంతకు ముందెన్నడూ చదివి ఉండం. ఈ సంకలనంలో ఇదొక ఆణిముత్యం లాంటి కథ. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర ఈ వసుంధర. ఒక బలమైన వ్యక్తి ఆమె, రాజీ పడిని నిక్కచ్చి మనిషి.
వేదన, హింస అనుభవిస్తూ కూడా, రేపటిలో వెలుగు చూసి సర్దుకుపోయే ఇద్దరు స్త్రీల కథలు ఇందులో ఉన్నాయి. గడిచిన దినాలు కథని ఉత్తమ పురుషలో నడుపుతూ రచయిత, తల్లి పాత్రని వర్ణించిన విధానం చదువుతుంటే గుండె చెమరుస్తుంది.
పని మనిషి మరో కథ. ఇందులో కథ మొత్తం కథలోని భార్యా భర్తల మధ్య నడుస్తుంది గానీ రచయిత వారింట్లో పని చేసే పని మనిషిని శీర్షికగా ఎంచారు. తన వెగటు అలవాట్లు మార్చుకోలేక, భార్య అందాన్ని, పరిశుభ్రతను సహించలేక, తాను స్వయంగా ఆత్మన్యూనత పాలవుతూ, ఆమెపై గెలవటానికి ఆమె పుట్టింటిని ఎద్దేవా చేసే విమలా దేవి భర్త, చివరికి ఆత్మన్యూనత ఉక్రోషంగా మారి భార్యను ఇనపచువ్వతో చితకబాదుతాడు. పర్యవసానం పైడితల్లి నెత్తిన పడుతుంది. ఇటువంటి భర్తలు కూడా చిరంజీవులే, కాలాతీత వ్యక్తులే ఒక విధంగా. ప్రతి సమాజంలోనూ, ప్రతి వీధిలోనూ ఉంటారు.
తీరని కోరిక కథలో ‘కోరికలలో తెగలూ తరగతులూ తప్పించుకోలేని వాళ్లం, తరగతులూ తెగలూ లేని సమాజాన్ని సృష్టించుకోగలమా?’ అనే వాక్యం రేకెత్తించే ఆలోచనలు అసంఖ్యాకం. శాస్త్రి, కథకుడు, వింత మరణం, గడవని నిన్న – దేనికదే సరి కొత్త ఇతివృత్తం, అబ్బురపరిచే శైలి, దొరికినట్టే దొరికి జారిపోయే వాక్యం.
గొప్ప రచయితలు నిశ్శబ్దంగా రచనలు చేస్తారు. తమంతట తాము మన దగ్గరికి రారు. మనమే వెదికి పట్టుకోవాలి. తెలుగు రాయడం తెలియడమే అర్హతగా కథారచన సాగుతున్న ఈ రోజుల్లో, అట్లూరి పిచ్చేశ్వరరావుగారి రచనలు చదవడం ఒక అవసరం. ఒక పాఠం.
ఇన్ని రోజుల తర్వాత ఈ పుస్తకం తెలుగు పాఠకుడి చేతిలోకి రావడం తెలుగు సాహిత్య వాతావరణంలో ఒక మేలి మలుపు. కొత్తగా రాస్తున్న వాళ్ళూ, ఎప్పటి నుంచో రాస్తున్న వాళ్ళే కాక, పాత కొత్త పాఠకులు, సాహితీ ప్రేమికులూ తప్పక చదవవలసినవి అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు.
ఇవి పాఠకులని నిరాశ పరచవు సరికదా, పాత సాహిత్యం ఎంత గొప్పదో తెలిసి మరి కొన్ని పాత పుస్తకాలూ తిరగేసేలా చేస్తుంది.
అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు పుటలు: 280 ప్రచురణ: CLS Publishers, Hyderabad. పుస్తకం ధర: 250రూ.
ప్రతుల కోసం ఈ లంకెని క్లిక్ చెయ్యండి: లభ్యం: నవోదయా బుక్‍హౌస్ (హైదరాబాద్), పల్లవి పబ్లికేషన్స్ (విజయవాడ), అనల్ప ప్రచురణలు, అమెజాన్, లోగిలి (గుంటూరు), బుక్ సెంటర్, వాగ్దేవి (విశాఖపట్నం).