వర్క్‌ప్లేస్‌లో ఎలా గెలవ్వోచ్చు…ఇలా

Win At Workplace - a book by Suresh Veluguri

కొత్త ఉద్యోగానికి వెళ్ళేముందు అనే తొలి అధ్యాయంతో  మొదలైన ఈ వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి పుస్తకం కొత్తగా  కాలేజీలనుంచి బయటికొచ్చి విశాల ప్రపంచలోకి అడుగుపెడుతున్న లక్షలాదిమందిలో మీరు ఒకరు”  అనే వాక్యంతో మొదలవుతుంది.  దాన్నిబట్టి ఈ వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి ని ఎవరిని  దృష్టిలో పెట్టుకుని మొదలు పెట్టాడో ఈ రచయిత అర్ధం అవుతుంది.  అలా అని ఇది విద్యార్ధులకి మాత్రమే కాదని గుడ్డిగా ఈ పుస్తకం మధ్యలో ఎక్కడ తలదూర్చినా తెలిసిపోతుంది.  ఒహో ఇది IT industry లోని టెకీ గాళ్ళకా అంటే…కాదు బోయ్స్ అండ్ గరల్స్.  ఇది అందరికీను.  అంటే ముఖ్యంగా ఉద్యోగస్థులందరికి…కొత్తగా ఉద్యోగాల్లోకి అడుగుపెట్టేవారికి, వేసేసిన వారికి, అలా ముందుకు సాగి పోతున్నవారికి కూడా!

వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి ని తను ఎంచుకున్న అంశాలను 36 చాప్టర్స్‌‌గా వర్గీకరించి, సుమారుగా 160 పేజిలలో పొందుపరిచి అందజేసాడు సురేశ్.

సోషల్ మీడియా (పేజి 76) గురించి ప్రస్తావిస్తూ, వర్క్‌ప్లేస్ లోనే కాదు ఉద్యోగం రావడానికి, పోవడానికి కూడా అదే కారణం అంటూ సోదాహరణంగా చెప్పాడు.

ఈ పుస్తకం పాఠకులకి బహుశ బోనస్ ఇవ్వాలనుకున్నట్టున్నడు రచయిత.  సంపాదనకి సేఫ్టి అనే పేరుతో ఒక అధ్యాయం (చాప్టర్ 33)ఇచ్చాడు.  చాలమంది కొత్తవారికి, ఉద్యోగంలో ఉన్నా పూర్తిగా తెలియని వారికి ఇందులో ఇచ్చిన వివరాలు బోనస్సే!

139 వ పేజి నుంచి 146 పేజీ వరకు కేవలం మహిళల కొరకే వినియోగించి వారికి బాగా పనికివచ్చే సమచారాన్ని క్లుప్తంగా ఇచ్చడు. స్మార్ట్ ఫోన్లు వాడే వారికీ కొన్ని సేఫ్టీ ఆప్స్‌ గురించి తెలియజేసాడు.
 
169 పేజిలో టొస్ట్‌మాస్టర్స్ ని పరిచయంచేసాడు.  వెబ్‌లింక్ ఇచ్చాడు కాబట్టి పాఠకులకి సులువుగానే అదనపు సమాచారం అందే అవకాశం కల్పించాడు.    

67 వ పేజిలో 5W’s & 1H ఫార్ములా గురించి ప్రస్తావించాడు కాని ఆ ఫార్ములా ఏమిటో చెప్పలేదు.  ప్రసారమాధ్యామాలలో అనుభవజ్ఞులకు తెలిసే అవకాశం ఉంది కాని ఉద్యోగస్తులకి మరీ ముఖ్యంగా తను ఎంచుకున్న రీడర్ ప్రొఫైల్ ఉన్నవారికి ఆ ఫార్ములా తెలిసిఉండే అవకాశం తక్కువ.  కాకపోతే అదే ఫార్ములాని 155 వ పేజిలో మరో విధంగా పరిచయం చేసాడు…ఇలా ఫైవ్ డబ్ల్యూస్ అండ్ వన్ హెచ్ (ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఎలా?) అని వివరించాడుకూడా!.

కాకపొతే పూనే ఉద్యోగస్తుడి ఆపసోపాలు చెబుతూ, మళ్ళీ  అతని కధే (?) 122 వ పేజిలో కూడా చెప్పాడు.  తన ముందుమాట (11 వ పేజిలో) కంటెట్ రిపీట్ అయినట్టు ముందే చెప్పినా, రిపీట్ కాకుండా చెప్పే అవకాశం కూడ ఉంది.  

తెలుగు చదువుకున్న వారికే ఈ పుస్తకం అనుకున్నప్పుడు కొత్తగా ఉద్యోగరంగంలోకి అడుగు పెడుతున్నవారికి పింక్ స్లిప్ గురించి తెలుస్తుందా అనే సందేహం కలిగింది.  పేజి 132.
 
కనీసం ఇటువంటి వాటికోసమైనా పాద సూచికలు అంటే ఫుట్‌నోట్స్ / ఫర్దర్ రీడింగ్‌ అంటే ఇంకొంచెం వివరంగా తెలుసుకోవాలనుకునేవారికి పుస్తకం చివర్న ఒక చిన్న బిబ్లియోగ్రఫి (bibliography) ని ఇచ్చి ఉంటే బాగుండేది.

ఆఫిస్ కాదు రచయిత మాటల్లో వర్క్‌ప్లేస్ అనుకుంటే ఆ వర్క్‌ప్లేస్ ఎటికెట్ గురించి కూడా చెప్పిఉంటే ఈ వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి ఇంకొంచెం సమగ్రంగా తయారైఉండేది.

Win At Workplace - a book by Suresh Veluguri
వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి – సురేశ్

“పుస్తకం రాస్తున్నాను సార్,”  అన్నప్పట్నుంచి దీని కోసం ఎదురుచూస్తునే ఉన్నాను.  ఆసక్తిగా!  గతంలో నేను ఆంధ్రజ్యోతి పత్రిక వారి దిక్సూచి‌కి కెరీర్ కార్నర్ కాలం ఒకటి వ్రాసాను. అదొక పక్క, మరో పక్కన అప్పట్లో ఒక HR సంస్థకి CEO గా ఉండటం మూలంగా కలిగిన ఆసక్తి, అంతే కాదు people management మీద నాకున్న ఉత్సుకత…సురేశ్ ఈ తరం వాడు ఏం వ్రాస్తాడు, ఎలా రాస్తాడు అని.  పైగా నేను కూడ గత అయిదారేళ్ళుగా వ్రాద్దామని అనుకుంటూ…తాత్సారం చేస్తూ వస్తున్నాను.  అది కొంత కుతూహలం.  ఇక ఆ సొంత గోల ఆపితే…ఈ పుస్తకం అవసరమా అని నన్ను అడిగితే… ఈ విషయలా మీద ఇదే తొలు పుస్తకం …కాబట్టి తెలుగు వరకే పరిమితమైనవారికి  ఇది ఉపకరిస్తుంది.   మనకి తెలుగులో పర్సనాలిటి డెవలప్‌మెంట్ పుస్తకాలు చాలా వచ్చినవి కాని  ఆఫీసు లో ఇలా గెలవండి అన్న పుస్తకం వచ్చినట్టు లేదు.  కాబట్టి ఈ పుస్తకం అవసరమైనదే  ఉద్యోగస్తులకి, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి, చిన్న యాజమాన్యాలకి కూడా!  

ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఎందుకంటే వారికి కూడా  ఒక చాప్టర్‌ని కేటాయించాడు రచయిత.

ఇక చిన్న చిన్న యాజమాన్యాలకి ఎందుకంటే, ఉద్యోగస్తుడు కుక్కలాగ విశ్వాసంతో పడిఉండే వాడు కాదు, అలాగే గాడిద చాకిరికి మాత్రమే పనికి వచ్చేవాడు కాదని, వాడుకూడా మనిషేనని సంస్థమేలుకోసం ఆరాట పడే ప్రాణమని…అలాంటి వారిని గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం ఇస్తే, తమ సంస్థ కూడా బాగుపడి మరో పదిమందికి చేయుత నిస్తే వ్యాపారం కూడ అభివృద్ధి చెందుతుంది, సమాజానికి ఆ మేర కొంత మేలు జరుగుతుంది.  

వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి ఇంగ్లిష్ లో కూడా తయారవుతున్నది.  

ప్రస్తుతం తెలుగులో 176 పేజీల వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి పుస్తకం ధర 199.00 రూపాయలు.  పుస్తకం ధర తక్కువే.
Brahmam (Bhavana Graphix) కవర్ పేజి డిజైన్ చేసారు.
Charitha Impressions వాళ్ళ ముద్రణ.
అప్పుతచ్చులైతే పంటికింద పడలేదు మరి!

పుస్తకంలో ఏముందో చూద్దామనుకుంటే ఇక్కడ కొన్ని చాప్టర్స్ ప్రీవ్యూగా ఫ్రీగా చదువుకోవచ్చు.

 ఆ తరువాత వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి పుస్తకాన్ని ఇక్కడ కొనుక్కోవచ్చు:

వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి – సురేశ్ వెలుగూరి

VMRG International
6-3-596 / 79 /4, Naveen Nagar,
Hyderabad – 500 004
Phone:  +91 (40) 2332 6620, Mob:  98499 70455
www.vmrgmedia.com

అమెజాన్ (Amazon) లో వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి పుస్తకం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

కినిగె (Kinige) లో వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి ఈ బుక్ ఇక్కడుంది.

వెలగా వెంకటప్పయ్య

మొన్న మళ్ళీ కాళీపట్నం రామారావు మాస్టారి నవతీతరణం అభినందన ప్రత్యేక సంచిక చదివినప్పుడు వెలగా వారి వ్యాసం చదివాను.  చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వారి వయస్సుకి అంతర్జాలం గురించి ఆ మాత్రం అవగాహన ఉండటం.  అంతే కాదు ఆ ఏడు పేజీల సాహితీ వ్యాసం చివరి పేరగ్రాఫ్ లో వారన్న మాట: “ఇంటర్‌నెట్ ఉంటే ప్రతి ఇల్లు ఒక కథానిలయం అవుతుంది…కారా మాస్టారు సేకరించిన అపూర్వ కథా సంపదను అధికంగా ఉపయోగించినా, అసలు ఉపయోగించకపోయినా శిధిలమౌవుతుంది.  శిధిలం మాట మరిపించేది, మురిపించేది అంతర్జాల మాయాజాలం.”

Dr Velaga Venkatappaiah, Tenali
డా. వెలగా వెంకటప్పయ్య (1930 – 29 Dec 2014)

సాక్షి దిన పత్రిక లో నేను వ్రాసిన గూగుల్ నెట్‌లో e బుక్స్ చదివి వెంటనే నాకు ఫోన్ చేసి అభినందించిన వారిలో ఆయన ఒకరు.  ఆ వ్యాసాన్ని ఆయన ఆంధ్రా యూనివర్సిటి కి సమర్పించిన ఒక పత్రంలో ప్రస్తావించానని, అక్కడి విద్యార్ధులకి అందజేసానని కూడ తెలియజేసారు.

తెలుగునాట గ్రంధాలయాల ఏర్పాటు కోసం ఆయన చేసిన కృషి చాల గొప్పది.

కవిరాజు త్రిపురనేని రామస్వామి అంటే వారికి అభిమానం.  కవిరాజు మనుమడిగా ఆ అభిమానం నా మీద కూడ కొంత చూపించారనుకుంటాను.  మేము మద్రాసులో ఉన్నప్పుడు ఆక్కడికి వచ్చినప్పుడల్లా మా అమ్మ ‘కవిరాజు’ కుమార్తె చౌదరాణి ని తప్పక కలిసేవారు.

ఆదివారం మే 6, 2012 న కేంద్ర సాహిత్య అకాడెమి కవిరాజు త్రిపురనేని రామస్వామి సాహిత్యం మీద గుడివాడ లో నిర్వహించిన సదస్సులో వారు కూడ పాల్గొన్నారు.

Seminar on Kaviraju Tripuraneni Ramaswamy
The invitation to the seminar on ‘Kaviraju’ Tripuraneni Ramaswamy.

వెలగా వారు ఈ రోజు ఉదయం విజయవాడలో ఆయుష్ హాస్పిటల్స్ లో ఆఖరి శ్వాస తీసుకున్నారని తెలిసినప్పుడు బాధవేసింది. మరో స్థంభం నేల కూలింది.

రచనలు
వారి రచనలలో కొన్ని, వాటి  ముఖచిత్రాలు ఇక్కడున్నవి.  సాహిత్యాభిమాని – ఆర్ బి రావ్ సౌజన్యం.
https://www.facebook.com/media/set/?set=a.10155009212985385.1073741875.624985384&type=1&l=1ce9757082

ఖూనీ

ఖూనీ – నాటకం

‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి గారి కుమార్తె చౌదరాణి. తల్లి అన్నపూర్ణ. జననం గురువారం, జూలై 25న. 1935 లో. తెనాలి లో. తండ్రి గతించిన నాటికి తనకి ఏడు సంవత్సరాలు. అందుకే తండ్రినుండి అంత ప్రేమకి నోచుకుందేమో.

అతి పిన్న వయసులోనే భర్త అట్లూరి పిచ్చేశ్వర రావు ని కోల్పోయింది. ఒంటరిగానే బతికింది. కాదు జీవించింది. జీవితంతో ధైర్యంగా యుద్దం చేసి మరీ జీవించింది. అవసరమైనప్పుడు రివాల్వర్ లైసెన్సు తీసుకోవడానికి కూడ వెరువలేదు. భర్త ఇచ్చిన ధైర్యమే. గెలిచింది. జీవితంలో వసంతాలు తక్కువే ఐనా అరవై వేసవులు చూసింది. నేటికి ఉంటే 80 పూర్తి అయ్యేవి.  ప్రపంచం మర్చిపోయినప్పుడు తన తండ్రిని ప్రపంచానికి గుర్తుచేసింది.

తనని గుర్తు చేసుకుంటూ తనకిచ్చే ఈ చిరుకానుక ఈ రోజున ఈ పుస్తకం ఖూనీ. తనుకోరుకున్నట్టుగా అందరికి అందుబాటులో. డిజిటల్ ఎడిషన్ గూగుల్ బుక్స్ ప్లే ద్వారా. ఇప్పుడు గూగుల్ బుక్స్ లో మీరు
అందుకుని చదువుకోవచ్చు.

మీకు సులభంగా అర్ధమయ్యే తెలుగు లో శ్రీ రావెల సాంబశివరావు గారికి కృతజ్ఞతలతో.

'Kaviraju' Tripuraneni Ramaswamy

పుస్తకం సాంకేతిక వివరాలు:
Full Title: Khooni, a play
Author: “Kaviraju” Tripuraneni Ramaswamy
Re-told:  Ravela Sambasiva Rao
Language: Telugu
Print Length: 45 Pages
Google Play GGKey:WKYHC48AABJ E
Publisher: Tripura Prachuranalu
Published: January 2014
Cover design: Giridhar

ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు

మొన్న ఎలక్షన్‌లో గెలిచిన నరేంద్రమోడి గెలుపుకి పుస్తకాలకి సంబంధం ఏమిటా?  అంతర్జాలం.  సోషల్ మిడియా!

తొలి ముద్రణ 2013.  మలి ముద్రణ 2013.  అమ్మకాలు దాదాపు ముప్పై ఐదు వేలు.  పుస్తకం ఆవిష్కరణ సభ భాగ్యనగరం లో పెద్ద హోటలు. ఐదువందల రూపాయలు నోట్లు ఇచ్చిన వారు, చేతికి అందిన ప్రతులు అందుకున్నారు. చిల్లర అడగలేదు.  తెలుగు పుస్తకమే.  ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు..

మరో మంచి హోటల్ లో పుస్తక ఆవిష్కరణ.  తొలి ముద్రణ ఆగస్టు 2013.  అమ్మకానికి ప్రతులు లేవు. మలి ముద్రణ డిసెంబరు 2013. కథకుడు మరో ముద్రణ గురించి ఆలోచిస్తున్నాడు.

తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు.

మరో పుస్తకం. మూడవ ముద్రణ.  కొన్ని వేల ప్రతులు. తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు..కొనుక్కున్నారు.

పైన నేను ఉదహరించిన తెలుగు పుస్తకాలన్నింటిని చదవాలని, కావాలని పాఠకులు కొనుకున్నారు.

మూడు పుస్తకాలు తెలుగులోనే ఐనా వాటిలోని విషయాలు విభిన్నమైనవి.  ఒకటి కధా సంకలనం.  ఒకటి జీవిత చరిత్ర. మరొకటి సాహిత్య పురస్కారం అందుకున్నది.

మొన్న ఏప్రిల్ లో నెల్లూరులో మరో పుస్తకం ఆవిష్కరణ.  వేదిక దగ్గిర ప్రతులు అమ్ముడైపోయినవి.  పుస్తకాలు కావాలి.  ప్రతులు లేవు. తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు…కొనుక్కున్నారు.  కొంతమంది పదుల ప్రతులు కొనుకున్నారు.

నేనిక్కడ ఉదహరించినవి నా దృష్టికి వచ్చిన వాటిల్లో మూడో నాలుగో పునర్ముద్రణలు మాత్రమే!  ఇవి కాక ఇతర ప్రాంతాల్లో పునర్ముద్రణలకు నోచుకున్న పుస్తకాలు అనేకం! ఇవికాక ప్రచురణకర్తలు పునర్ముద్రించుకుంటున్నవి అనేకం ఉన్నవి!  ప్రవాసాంధ్రుల ప్రచురణలు?

అనంతరామ్ పేరు విన్నారా?  మొన్నామధ్య ఏప్రిల్‌లో పెళ్ళి చేసుకున్న అనంతరామ్ కొంతమంది బ్లాగర్లకి మాత్రమే తన బ్లాగు ద్వారా పరిచయం. రెండువేల పదమూడులో రామ్@శ్రుతిడాట్‌కామ్ అనే శీర్షికతో ఈ నవ యువ రచయిత  తన తొలి ప్రేమకధా నవలని ఈబుక్ గా ప్రచురించుకున్నాడు.  తొలుత అది ఈబుక్‌గానే వెలువడింది. ఆ  నవల తొలుత అచ్చులో వెలువడలేదు.  ఈబుక్‌ అమ్మకాల మీద వచ్చిన రాయల్టీలతో తన పుస్తకం అచ్చువేసుకున్నాడు.  తెలుగు పుస్తకమే. ఉచితంగా పంచలేదు. కొనుక్కున్నారు.  (పాఠకమహాశయా! ఈ యువ నవ రచయితని ఈ వ్యాసకర్త ఇప్పడిదాక కలవలేదు.  కనీసం ఆ రచయిత వివాహానికి ఆహ్వాన పత్రిక అందుకున్న గుర్తు కూడా లేదు).

ఒకప్పుడు రచయితలకి సిగరెట్ల పాకెట్టిచ్చి,  తేనిరు పోసి, హ్విస్కి లు తాగించి, పుస్తకాలు వ్రాయించి, డబ్బు పెట్టుబడి పెట్టి, ఆ పుస్తకాన్ని ప్రచురించి, లాభాలార్జించి , భవంతులు కట్టుకున్న ప్రచురణకర్తలున్నకాలం తెలిసినవారుండేవుంటారు మీ పాఠకులలో.  అవి ఆ రోజులు.

తన పుస్తకాల అమ్మకాల మీద వచ్చిన రాయల్టీలతో పిల్లలకి చదువులు చెప్పించుకుంటూ, విదేశాలలో ఉద్యోగాలకు పంపించుకుంటూ, భవంతులు కట్టించుకుని, కారులలో షికారులు చేస్తూన్నాడు ఈ రోజు రచయిత. ఇవి ఈ రోజులు.

శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాక.. అదిలాబాదు నుండి తిరుపతి దాక ఉన్న తెలుగు రచయితల సాహిత్యం ఈ రోజు అంతర్జాలం ద్వారా అందరికి అందుబాటులోకి వచ్చింది.  ఆక్‌లాండ్ నుండి, ఆసియా నుండి, ఆఫ్రికానుండి, అమెరికా సంయుక్త రాష్ట్రాల దాక కాక వాటిమధ్యనున్న దేశాలలోని తెలుగు పాఠకుడు ఈ రోజు తెలుగు పుస్తకాలు కొనుక్కుంటున్నాడు.  చదువుకుంటున్నాడు.  లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాడు.  ఏటా, అనధికార గణాంకాల ప్రకారం సుమారు గా పదిహేను కోట్ల రూపాయల విలువగల పుస్తక క్రయ విక్రయాలు జరుగుతున్నవీ.  ఈ లెఖ్ఖలలో జాలం ద్వార అమ్మిన అచ్చు పుస్తకాలు కాని డిజిటల్ పుస్తకాలు కాని కలపలేదు.  అలాగే విదేశాలలో ముద్రిణపొంది అమ్ముడవుతున్న పుస్తకాల గణాంకాలు లేవు!  ఐనా ఇవన్నీ తెలుగు భాషవి మాత్రమే సుమా!  తెలుగు వారెంతమంది?  ఆ మధ్య పదిహేను / పదహారు కోట్లమంది ఉన్నారని అన్నారుగా.  ఆ మాటే ప్రామాణికంగా తీసుకుంటే ప్రతి తెలుగువాడు తెలుగు పుస్తకం కోసం ఒక రూపాయి వెచ్చించినట్టే!

ఎన్నికల లెక్కల్లో కొంచెం అటు ఇటుగా ఎనిమిది కోట్ల మంది అని తేలిందా?  పోని అదే లెఖ్ఖ వేసుకుందాం!  ఆ లెఖ్ఖన సగటున ప్రతి తెలుగువాడు తెలుగు పుస్తకం కోసం రెండు రూప్యంబులు వెచ్చించెనన్నమాట!  ఇప్పుడు చెప్పమనండి..తెలుగు ఎలా చచ్చిపోతుందో, తెలుగు భాష ఎలా చచ్చిపోతుందో, తెలుగు పుస్తకం ఎలా అవసాన దశకి చేరుకుందో రుజువు చెయ్యమనండి!! చూసే వాడి చూపులో ఉంటుంది అందం అన్న చందానా,.పచ్చ కామెర్లవాడికి ప్రపంచం అంతా పచ్చగానే కనపడుతుంది.

అది నేటి సాహిత్యం పరిస్థితి.  ఇక తెలుగు చచ్చిపోయింది. చచ్చి పోతోంది.  ఇక తెలుగు చదివేవారు లేరు అనేది ఎవరో మీరే నిర్ణయించుకోండి.

ఒక యువ నవ కథా రచయిత, ఒక సాయంత్రం ఒక సాహిత్య సభ దగ్గిర నా బుర్ర తిని (తినిపించుకునేవాడుంటే బుర్రలు తినడం నాకు చాలా ఇష్టం) ఒకటో రెండో సంవత్సరాలు ఆలోచించుకుని మొన్నిమధ్య అచ్చు పత్రికలలో వెలువడ్డ తన కధలన్నింటిని గుదిగుచ్చి ఒక సంకలనంగా వెలువరించాడు.  ఆవిష్కరణ సభకు ముందే తనకు తెలిసిన పుస్తకాల దుకాణాలలో పాఠకులకు అవి అందుబాటులో ఉండే ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే జాలంలో ఈబుక్‌గా దేశవిదేశాలలో అవిష్కరణ సమయానికి వెలువడేటట్టుగా ఏర్పాట్లు చేసుకున్నాడు.  అంతర్జాలంలో అంటే ఆన్‌లైనులో  సాహిత్యానికి, తెలుగు భాషకి, తెలుగుకి సంబంధించిన దాదాపు ప్రతి సమూహంలోను తన పుస్తక ఆవిష్కరణ గురించి పదిమందికి తెలిసేటట్టు ముఖపత్రాల రూపురేఖలు, రంగులు, అక్షరాల ఎంపిక  దగ్గిరనుండి ప్రచారం చేసాడు.

పది పత్రికల కార్యాలయా మెట్లు, లిప్ట్‌లు ఎక్కాడు.  తెలిసిన పదిమంది పాత్రికేయ మిత్రులని తన పుస్తకం గురించి సమీక్షో, పరిచయమో, స్వీకారమో, కనీసం ఒక వాక్యమో, ఏదో ఒకటి వ్రాయమని అడగడమో, బతిమాలడమో చేస్తూ తలా రెండు ప్రతులు అందించాడు. తెలియని వారిని పరిచయం చేసుకుని వారి చేతికి తన ప్రతిని అందించి సవినయంగా మరీ అడిగాడు.

నిర్మొహమాటంగా, నిస్సిగ్గుగా తనకు తెలిసిన బ్లాగర్లని, జాలపత్రికల సంపాదకులని, తోటి రచయితలని అందరిని తన పుస్తకం గురించి తమ పత్రికలలో, బ్లాగులలో, పేజిలలో, కాలంలలో, వెబ్‌సైటులలో వెబ్‌జైనలలో వ్రాయమని అడిగాడు.

ముందే నిర్ణయించుకున్న ఒకానొక సాయంత్రాన ఆవిష్కరణ సభ కావించాడు. సభ పేలింది. అమ్మకానికి ఆవిష్కరణ సభలోనే కొన్ని ప్రతులని అందుబాటులో ఉంచాడు.  అమ్మినవి అమ్మగా..ఉచితంగా ఇచ్చినవి కూడ ఉన్నవి.  (నాకు ఇంకా ప్రతి ఇంకా అందిలేదు. పైగా నేను ఆ ఆవిష్కరణ సభలో పాల్గొనలేదు. అది వేరే విషయం). ఇంత వివరంగా మీకు ఎందుకు తెలియజేయవలసి వచ్చినదంటే..దమ్ముంటే నా పుస్తకం అమ్ముడవుతుంది అని అనుకోరాదని.  ఆ రోజులు చెల్లిపోయినవని మీకు తెలియజేయడానికే.  బంగారు పళ్ళేనికైనా గోడ చేర్పు కావాలి!

పొద్దున లేచినప్పటినుంచి ఫోను‌లో ఎస్ ఎమ్ ఎస్‌లు, దినపత్రికలు తెరిస్తే వార్తల సంగతి తరువాత, ముందు ప్రకటనలు.  దిన పత్రికల వారు సొమ్ము పుచ్చుకుని వేసే ప్రకటనల మధ్య మళ్ళీ లీఫ్‌లెట్లు, కరపత్రాలు.  ఇంటి గేటుకి ప్లేటులు, కారు బంపర్ మీద స్టికరు, బైకు నెంబరు ప్లేటు మీద ప్రకటన, బస్సు సీటు మీద ప్రకటన, రహాదారికి అటూ, ఇటూ హోర్డింగులు. ఇది గాక స్కూలు ఫీజులు, ఫేర్‌వెల్ పార్టి చందాలు, హాస్పిటల్ బిల్లులు,  కట్టవలసిన కిస్తీలు, ఈఎమ్‌ఐలూ ఇలా సవాలక్ష సమస్యలు ఈ జీవికి.  వీటన్నింటి మధ్య మీ పుస్తకం కనపడాలి.  కుదిరే పనేనా?

అందుకనే అనేది ఇందాక చెప్పానే ఈ నవశకం యువ రచయిత చేసిన పనులన్ని చెయ్యాలి!  నా పుస్తకం దమ్ముంది అనుకుంటే చాలదు.  దమ్ముంది అని ఆ చదువరికి చెప్పాలి.  ఉన్నది లేనిది పాఠకుడు నిర్ణయిస్తాడు.

కాబట్టి ఓ రచయితా, నీ డబ్బుతో ప్రచురించుకున్న నీ పుస్తకం పదిమందికి అందాలంటే ముందు దానిని గురించి వారికి తెలియజేయి.  అంతేగాని ఉచితంగా ఇచ్చేయ్యకు.  అదేదో సామెతుంది.  ఉచితంగా వస్తే ఫినాయిలు కూడా తాగే మనుషులుంటారని!

అన్వర్ కి ధాంక్స్‌తో..

ఆదివారం.  మార్చ్ 2, 2014. మళ్ళీ SMS.  ఆర్టిస్ట్ మోహన్ గారి పిలుపు.  మనవాళ్లందరూ వస్తున్నారు.  మీరు కూడా రావాలి.  మన శేఖర్ కి మనం చెయ్యాలి! సందర్భం శేఖర్ కార్టూనిస్ట్‌గా గోల్డెన్ జూబిలి సెలబ్రేషన్.

శేఖర్ కార్టూనిస్ట్ గా నే పరిచయం అయ్యాడు  ఆంధ్రజ్యోతి లో.  కె.పి డెస్క్ పక్కనే.  కె.పి ని దాటుకుని శేఖర్ డెస్క్‌కి వెళ్ళాలి.  ఆ పక్కనే వసంతలక్ష్మి గారి డెస్క్.

కినిగె కి తన కార్టూన్ పుస్తకాన్ని ఇచ్చిన తొలి కార్టూనిస్టు శేఖర్.  అదొక అభిమానం.  తరువాత ఎప్పుడో ఒకసారి నా మీద కోపగించుకున్నాడు కూడా!  “నాకు మీరు పిచ్చేశ్వరరావు గారి అబ్బాయని ఎందుకు చెప్పలేదు.  ఆయనంటే మా తరానికి ఎంత ఇష్టమో, మీకు తెలియదు. అటువంటి వాళ్ళు అంత త్వరగా వెళ్ళిపోవాడనికి హడావుడి ఏమిటో?” అనుకున్నడు స్వగతంగా.

అమెరికా సంయుక్త రాష్ట్రాలకి వెళ్లబోయేముందు, వెళ్ళి వచ్చిన తరువాత తన పుస్తకాన్ని డిజిటల్ బుక్‌గా ఎలా డిజైన్‌చేస్తే బాగుంటుందో అని కలిసినప్పుడు మాట్లాడుకునేవాళ్ళం.  కలవనప్పుడు ఫోన్ చేసేవాడు.  ఫోనులో “తింటున్నాన్నా?” అని అడిగి నవ్వేవాడు.

“సార్, మీ ఇంటికి దగ్గిర్లోకి మారుతున్నాను. మనం ఇక రోజు కలుసుకోవచ్చు.  బహుశ నేనే మీ ఇంటికి వస్తాను.  కలిసి టీ తాగోచ్చు,” అని ఎంతో సంతోషంగా నవ్వుతూ చెప్పినప్పుడు ఆనందమేసింది.

తరువాత ఎప్పుడో తెలిసింది..ఆరోగ్యం బాగోలేదని.  ఇంటికి వెళ్ళి పలకరించాలని అనుకునేటప్పడికి ఇల్లు మారడం కూడా ఐపోయింది.

Cartoonist Chandrasekher
Cartoonist Chandrasekher (Jul 16, 1965 – 19 May 2014)

ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ ‌క్లబ్‌లో అతని కోసం చూసాను.  కొంచెం ఆలస్యం అయ్యింది నేను వెళ్ళేటప్పటికి.  మనిషి కనబడలేదు.  వెతుకున్నాను.  కాప్..నోటికి మాస్క్ అడ్డం ఉంది.  ఆ మాస్క్ పైన కళ్ళు. నవ్వు.  ఉగ్గబట్టుకున్న ఆనందం.  సంతోషం.  ప్రెస్‌క్లబ్ నిండిపోయింది.  కాని మనిషిని చూసిన నేను ఖంగు తిన్నాను.  నాకు తెలిసిన శేఖర్ రూపు కాదది.  మనిషి మొఖంలో విపరీతమైన అలసట. సగం అయిపొయ్యాడు.  ఎందుకో ఉండబుద్ది కాలేదక్కడ.  తనతో మాట్లాడడానికి తగిన ప్రదేశమూ కాదు..సందర్భమూ కాదు.  ఈ లోపు ఒకటికి రెండు సార్లు ఫోను చేసిన అన్వర్, sms లు గుప్పించిన ఇతర మిత్రులని పలకరించాను.

హడావుడిగా పరిచయుస్థుడొకాయన వచ్చాడు.  పక్కనే శ్రీమతి అనుకుంటాను.  పేద్ద పూలమాల.  ఒక పుష్ఫగుచ్చం.  హడావుడి హడావుడిగా వేదిక దగ్గిరకు దాదాపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపొయ్యారు.  ఆఖరి చూపు.  పార్ధివ శరీరాన్ని పుష్పమాలంకృతాన్ని చెయ్యాలన్న తాపత్రయం కనపడింది ఆ వేగంలో, ఆ మాటల్లో, ఆ గమనంలో.  విరక్తి పుట్టింది.

విజయవాడలో “మో” హాస్పిటల్‌లో ఉంటే..”సార్,  ఐపోయ్యిందా?  డిక్లేర్ చేసేద్దామా”?   అని స్ట్రింగర్స్ శ్రీ శ్రీ విశ్వేశ్వరావు గారిని పీక్కు తిన్న వైనం గుర్తోచ్చింది.  మనసు రోసింది. అసహ్యం వేసింది. రోత పుట్టింది.

వెళ్ళిపోదామని వెనక్కి తిరుగుతుంటే..అన్వర్ ఎదురువచ్చాడు.  “సార్, వెళ్ళిపోతున్నారా?” అంటూ. ఔనన్నట్టుగా తలూపూతూ గేటు వైపుకి కదులుతుంటే..”వుండండి సార్..రెండు మాటలు మాట్లాడి వెళ్లండి”  అని అన్నాడు.  వాళ్ళ మధ్య నేనేమి మాట్లాడుతాను అనుకుంటూ నిలబడిపొయ్యాను.  “ఉండండి సార్.  ఒక్క రెండు మాటలు మాట్లాడండి.  తనుకూడా వింటాడు కదా?”అని అన్నాడు. ఇక ఆ మాటకు తిరుగులేదు.  సరే అని ఆగి పొయ్యాను.

ఈ లోపు మాట్లాడేవాళ్ళున్నారు.  వాళ్ళ తరువాత..అన్వర్ నాకు మైకు ఇప్పించాడు.  శేఖర్ వెనకకి చేరుకున్నాను.  శేఖర్ భుజం మీద చెయ్యి వేసాను.  శేఖర్ నా ముఖంలోకి చూసాడు.  మా ఇద్దరి కళ్ళు కలిసినవి.  He knows.  He knew, I knew. He also knew that my heart is with him. I wished him all the best with all my heart.  I expressed my good wishes to all his frineds for supporting him at that time. లేచి నిలబడ్డాడు.  కౌగలించుకున్నాడు.  That was the parting embrace. I knew.

మైక్ ఆర్టిస్టు మోహన్ గారికిచ్చాను.  అన్వర్ కి థాంక్స్ చెప్పాను.  వచ్చేసాను.

మా అమ్మ పోయినప్పుడు చలసాని ప్రసాదరావు గారు రాలేదు.  దానికి ఆయన చెప్పిన కారణం.  “నాకు మీ అమ్మ చక్కగా సంతోషం గా నవ్వుతూ ఉన్నప్పుడు చూసిన జ్ఞాపకం.  నాకు అదే గుర్తుంచుకోవాలని ఉంది” అని.
చంద్రశేఖర్ విషయం లో నాది అదే ఉద్దేశం. అందుకే కొడుకు పెళ్ళికి వెళ్ళలేక పొయ్యాను.  ఈ రోజు వెళ్ళడం లేదు.  ఫోటో కూడ తను నవ్వుతున్నదే పెట్టాను.

ఆ రోజున అన్వర్ నన్ను గుర్తుపెట్టుకుని పిలవకపొతే..నాకు శేఖర్ చిరు దరహసం అందేది కాదు.

గుడ్‌బై శేఖర్.  You are a good friend.  I shall remember your smile.  Always.

ఇది వ్యాపారం కాదు.  నేను ఇప్పుడు కినిగె లో లేను కూడా!  శేఖర్ పుస్తకాలు ఇవి కొన్ని అని చెప్పడానికి మాత్రమే:  http://kinige.com/author/Shekar

గెస్ట్‌కాలం – ఈ రీడింగ్

ఈ రీడింగ్ – ఈజీ రీడింగ్
ఈ వ్యాసం నిన్న సాక్షి దినపత్రిక,  ఫామిలీ లో మొదలైన గెస్ట్‌కాలం లో వచ్చింది.  పుస్తకాలతో మొదలుపెడితో బాగుంటుందని అని వారనుకుని నన్ను వ్రాయమని కోరారు.  ఆ సందర్భంగా వ్రాసిని వ్యాసం ఇది.  అన్నట్టు ఈ గెస్ట్‌కాలం ప్రతి బుధవారం వస్తుంది.  ఆయా రంగాలలో నిష్ణాతుఁలు వారనికొకరు మీకు అందిస్తుంటారు.  ఇక వ్యాసం ఇది.  స్థలాభావం వల్ల వ్యాసం కొంత “సంపాదకుల కోత” కి గురైంది.  పూర్తి పాఠం తరువాత ఎప్పుడైనా వీలున్నప్పుడు ఇక్కడే పోస్ట్ చేస్తాను.

సూచన: బొమ్మ మీద క్లిక్ చెయ్యండి.  సులభంగా చదువుకోవచ్చు

e reading easy reading