మనసుంటే మార్గముంటుంది!

eenaaDu, vipula, chatura etc


1908, సెప్టెంబరు 9 బుధవారం. వినాయక చవితి పండగ రోజు. ముంబై లో ఆ రోజున ఆంధ్రపత్రిక – వారపత్రిక గా మొదలైంది. వ్యవస్థాపకులు కాశీనాథుని నాగేశ్వరావు పంతులు.  ముంబై నుండి 1914 లో మద్రాసు – ప్రస్తుతం చెన్నై కి వెళ్లింది ఆంధ్రపత్రిక. ఇసబెల్లా హాస్పిటల్, లజ్ కార్నర్ కి మధ్యలో నాగేశ్వరరావు పార్క్ వుంది. దానిని ఆనుకునే అమృతాంజన్ (ఆయుర్వేదం తైలం) నొప్పికి వాడే మందు కర్మాగారం కూడా అ పక్కనే వుండేది. (నాన్నతో కొన్ని సాయంత్రాలు ఆ పార్క్ లో గడిపాను నేను.) మద్రాసులో ఆ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుండి ఆ దినపత్రికతో బాటు ‘అంధ్ర పత్రిక’ వారపత్రిక కూడ వెలువడడం మొదలైంది.  దాదాపు దశాబ్దం తరువాత అంటే జవరి 1924 లో ‘భారతి‘ మాసపత్రిక వెలువరించారు నాగేశ్వరావు పంతులు గారు.

భారతియందు భాష, వాజ్మయము, శాస్త్రములు, కళలు మొదలగు విషయములు సాదరభావముతోఁ జర్చించుటకవకాశములు గల్పించబడును. వాజ్మయ నిర్మాణమునకిపుడు జరుగుచున్న ప్రయత్నములు పరిస్ఫుటము చేయబడును. శిల్పమునకు చిత్రలేఖనమునకు శాసనములకు సంబంధించిన విషయములు చిత్రములతోఁ బ్రచురింపఁ బడును.” అని భారతి సంపాదకులు చెప్పుకున్నారు.

పంతులు గారి మనవడు శివలెంక రాధకృష్ణ గారి హయాంలో ‘భారతి’ ని నిలిపి వేయాల్సి వచ్చింది. కారణం ‘ఆర్ధిక భారం.’ (ఆ రోజుల్లో మద్రాసులో రాణీ బుక్ సెంటర్ మాత్రమే క్రమం తప్పకుండా భారతి ని పాఠకులకి అందించేది. ప్రత్యేక సంచికలను ఒక పదో/పాతిక మందో నెల ముందే ‘బుక్’ చేసుకునేవారు.) కాని ‘భారతి’ ప్రచురణ ఆపడానికి కుదరదు. ఎందుకని? పంతులు గారు ‘అంధ్రపత్రిక’ దినపత్రిక వెలువడినంతకాలం ‘భారతి’ వెలువడాల్సిందే’ అని ఒక నిబంధనని పెట్టారు. మరేం చెయ్యాలి అని యాజమాన్యం ఆలోచించింది. ‘టాబ్లాయిడ్‘ గా వెలువరించాలని నిర్ణయించారు. అలా ‘ఆంధ్రపత్రిక’ దిన పత్రిక లో ఒక ‘బ్రాడ్ షీట్’ ని ‘భారతి’ అని మకుటం పెట్టి ‘టెక్నికల్’ గా ఆపకుండా దానిని నెలకొక సారి ప్రచురించారు. తరువాతి రోజుల్లో మళ్ళీ పుస్తక రూపంలో తెచ్చారు. కానీ ఆంధ్రప్రదేశానికి తరలివచ్చిన తరువాత మొత్తం ‘ఆంధ్రపత్రిక’ మూత పడిపోయింది. దిన పత్రిక, వార పత్రిక, భారతి అన్ని మూత పడ్డాయి.

eenaaDu, vipula, chatura etc
ఆంధ్రపత్రిక, భారతి, ఈనాడు ప్రకటన

ఇటీవలి కాలంలో ‘ఆంధ్రజ్యోతి‘ ఆదివారం ‘సండే’ కి కూడా గ్రహణం పట్టింది. అప్పట్లో పిన్నింగు అని, బైడింగు అని రవాణా సరఫరాలో ఇబ్బందులున్నవని చెప్పి ఆంధ్రజ్యోతి ‘ఆదివారం’ ని దినపత్రికలో టాబ్లాయిడ్ కి మార్చేసారు. ఏది ఏమైనా చివరకి అది మళ్ళీ తన పాత రూపులో వెలువడ్డం సంతోషం. ఈ #కరోనా #కోవిడ్19 గడ్డు కాలంలో కూడా పుటలు తగ్గించినా జాల పత్రికగా దాన్ని వెలువరించింనందుకు #ఆంధ్రజ్యోతి సంపాదకవర్గానికి, యాజమాన్యానికి సాహితీప్రియులు ధన్యవాదాలు చెప్పుకోవాలి. గత కొద్ది వారాలుగా అచ్చులో కూడా ‘ఆదివారం’ ఆంధ్రజ్యోతి అందుబాటులోకొచ్చింది. అందుకు కూడా మనం ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు తెలియజెయ్యాలి.

కొన్ని నెలల క్రితమే ‘సాక్షి‘ దినపత్రిక కూడా ‘సాహిత్యం‘ పేజిని ‘ఫన్ డే‘ లో కి పంపింది. ఆ ‘సాహిత్యం’ పేజి ‘డ్రాప్’ అయినప్పుడల్లా వచ్చే వారం వుంటుందా, వూడుతుందా అని ఎదురుచూసేవాళ్లు పాఠకులు. వాళ్లని నిరాశపరచడమెందుకని ‘పర్మనెంటు డ్రాప్’ అనుకుని, వద్దులే అని దయతో ‘ఫన్ డే’ లో ఒక పేజి ఇచ్చారు. గుడ్డిలో మెల్ల అది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి.  ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రతి సోమవారం ‘వివిధ‘ లో సాహిత్యానికి ప్రాముఖ్యత ఇచ్చి అందజేస్తోంది.  ఇంకా కొన్ని తెలుగు దిన పత్రికలు కూడా ఆదివారం మాగజైన్ సంచికలు వెలువరుస్తున్నవి. ఉదాః విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవతెలంగాణ, వార్త, సూర్య, దర్వాజ, నమస్తే తెలంగాణా ఇత్యాదులు.

మనకి జాలపత్రికలు కూడా తక్కువేమి కాదు. ‘సాహిత్యసేవ’ కోసం సాహితీ ప్రియులు వెలువరిస్తున్నవారున్నారు. ఈమాట (1998 అక్టోబరులో ప్రారంభం), సారంగ (దాదాపు దశాబ్దం క్రితం), కౌముది (2007), సంచిక, నెచ్చెలి, వగైరాలు. ఇవన్ని కూడా ఆయా నిర్వాహకులు ఎటువంటి ఆర్ధికమైన లాభాపేక్ష లేకుండా ప్రచురిస్తున్నారు. ప్రకటనలు సైతం వుండవు వీటిల్లో. సభ్యత్వం / చందా రుసుములు కూడా లేవు.

ఈ అంతర్జ్వాల పత్రికలని వ్యక్తులు నిర్వహిస్తుండగా, ఈనాడు / వసుంధర / రామోజి ఫౌండేషన్ ఆ నాలుగు పత్రికలు; విపుల, చతుర, తెలుగు వెలుగు, బాలభారతం ని కనీసం జాల పత్రికల రూపాన్నైనా వెలువరించలేకపోవడం అన్నది నమ్మశక్యంగా లేదు. విపుల, చతుర లు 1978లో మొదలైనవి. దాదాపు నలభై మూడేళ్ళ క్రిత్రం. అలాగే ‘భాషకు, సాహిత్యాని సేవ చేసేందుకు ప్రత్యేక వేదిక ఉండాలన్న ఉద్దేశంతో 2012 సెప్టెంబరు’ లో తెలుగు వెలుగు పాఠకులకి అందించారు. నా వరకు నేను ఇది తెలుగు వారికి మరో ‘భారతి’ గా వుంటుందని ఆశించాను. అలాగే జరిగింది మూతపడటం విషయంలో. ‘ఇన్నాళ్ళుగా సేవాదృక్పథంతో సాగిస్తూ వచ్చిన ఈ నాలుగు పత్రికలను’ ఈమ్యాగజైన్స్ రూపంలో ఈనాడు నెట్ లో అందుబాటులో ఉంచా‘ రు. కానీ ఈ ఏప్రిల్ నుండి నిలిపివేయడం అన్నది ‘సాహిత్యాభిమానులకు’ జీర్ణం కావడం కష్టం. ఈనాడు లాంటి వ్యవస్థ, మానవవనరులున్న సంస్థ ఈ నాలుగు పత్రికల నిర్వాహణ భారాన్ని మోయలేకపోతుండంటే ఆశ్చర్యంగా కూడా ఉంది. నిజమే #కోవిడ్19 లాంటి అనూహ్యమైన ఆపద మానవజీవితాన్ని అతలా కుతలం చేసింది కానీ ఈ రోజున మనకి కోవిడ్ టీకా అందుబాటులోకి వచ్చింది. వ్యాపారంలో ఒడిదుడుకులుంటాయి. వాటిని అధిగమించడం ఈనాడు లాంటి సంస్థలకు కష్టమేమి కాదు. ఈనాడు కంటే చిన్నవి మనగలుగుతున్న సందర్భంలో ‘మన అమ్మభాష పరిపుష్టత కోసం ఈనాడు, ఈటీవీ, ఈ టీవీ భారత్ లు నిరంతరం కృషిచేస్తునే ఉంటాయని’ మేనేజింగ్ ట్రస్టీ – రామోజీ ఫౌండేషన్ చెప్పినా …తెలుగు సాహితీ చరిత్రలో ఈ పత్రికలు ఆపేయ్యడం విషాదమే. ఇన్నాళ్లుగా ఆయా పత్రికలకి రచనలు పంపుతున్న రచయితలు కూడా నిరుత్సాహానికి లోనయ్యారు ఈ వార్త తెలుసుకుని. పాఠకుల ఆదరణ తగ్గింది అన్నప్పుడు బహుశ రచయితలు కూడా తమ చేస్తున్న రచనల గురించి పునరాలోచించుకోవల్సిన సందర్భం అనిపిస్తుంది. మనసుంటే మార్గముంటుంది! కనీసం జాలపత్రికల రూపంలో ఐనా ఈ నాలుగు పత్రికలని బ్రతికించమని రామోజీ ఫౌండేషన్ ని కోరడమే ఒక సాహిత్యాభిమానిగా నేను చెయ్యగలిగింది!

▓► ఆంధ్రపత్రికకి సంబంధించిన వివరాలకి మూలం తెలుగు వికి. – te.wikipedia.org/

నీ సాహిత్యానికి అదే ఎక్కువ!

puraskar - felicitation - award

దాదాపు ఒక రెండు దశాబ్దాల క్రితం అనుకుందాం. పడవల్లాంటి కార్లు,  ఆరడగుల ఆజానుబాహువు, నుదుటి మీద ముంగుర్లు  సర్దుకుంటూ ఏ ఫెమినానో, డికెన్సు పుస్తకాన్ని చదువుకుంటున్న ఆమె, తో, ప్రేమ, ఆఖరి పేజిలో కధానాయిక కోరుకున్న ఆసుపత్రి ప్రారంభోత్సవం లాంటి ఆకాశంలో విహరించడానికి కావల్సిన అందమైన కలలతో వెలువడే నవలా శకం అది.
ShadowShadowByMadhuBaabuTulasidalamByYandamoori PracticalJokerByKommuriSambasivaRao secretaryByYaddanapudiSulochanaRani
ఒక ఒంటరి వాడు, ఒక యువతి, ఏ పల్లెటూరు నుంచో ఒక మహా నగరానికి వచ్చి ప్రపంచాన్ని జయించే క్రమంలో ఇచ్చే వాల్యుబుల్ కోట్స్ తో మరో వైపునుంచి పర్సనాలిటి డెవలెప్మెంట్ ఇత్రివృత్తాలతో వెలువెడుతున్న సో కాల్డ్ ‘క్షుద్ర సాహిత్యం’ నవలా యుగం అది.

బెంగాలి నవలల అనుసృజనలతో హోరెత్తి పోతున్న సమయంలో, రాబిన్ కుక్నిక్ కార్టర్ కిల్ మాస్టర్, ఆర్ధర్ హెయిలి, అలిస్టర్ మెక్లెయిన్, హారోల్డ్ రాబిన్స్, స్టాన్లి గార్డ్‌నెర్ , ఫోర్స్‌త్, డేవిడ్ సెల్జర్ ల రచనల / పాత్రల కిచిడి తో సీరియస్‌గా సీరియల్స్ తో వార పత్రికల అమ్మకాలు లక్షల్లోకి  చేరుకున్న శకం అది.

puraskar - felicitation - award
పురస్కారం – బహుమతి

బ్లాంక్ చెక్‌లతో తన ఇంటి వసారాలో ప్రచురణ కర్తలు కూర్చుని ఉంటే రచయిత/త్రు లు వారిని గుర్తించని రోజులు, అవి.

ఆలాంటి రోజులలో రచయితకు సాంఘిక బాధ్యత ఉన్నదన్న నిర్దుష్టమైన అభిప్రాయంతో ఉండి రచనలు చేస్తున్న ఒకానొక రచయితకు ప్రభుత్వం గుర్తింపుతో బాటు కొంత నగదు కూడ అందింది.

కమర్షియల్ రైటర్‌గా డబ్బుకు డబ్బుకు, పేరు, గుర్తింపు పొందిన ఒకానొక రచయిత , ఈనాడు గ్రూప్‌‌లో మేగజైన్స్  ఎడిటర్ చలసాని ప్రసాద రావు గారిని కలిసాడు.  పిచ్చాపాటి మాటల్లో, ఆ రచయిత “ఆయ్యా, ఇన్ని పత్రికలలో, నా కథ గాని, నవలగాని, సీరియల్ గాని, ప్రచురించనివి ఒకటి కూడ లేవు.  మరి నన్ను గుర్తించదేమి ఈ ప్రభుత్వం?” అని తన అవేదనని, ఆక్రోశాన్ని, అక్కస్సుని వెళ్లబుచ్చాడు.

ఠకీ మని ఆయన అన్నాడు కదా, ” నీకు గుర్తింపు ఎందుకు?  డబ్బు సంపాదించుకుంటున్నావు కదా?  నీకు గ్లామర్ ఉంది కదా?  ఆయనకి అవి రెండు లేవు కదా!  అందుకనే ఆయన్ని ప్రభుత్వం గుర్తించింది.  పురస్కారమిచ్చి గౌరవించింది.  నీకున్న దానితో నువ్వు తృప్తి పడు.  నీ సాహిత్యానికి అదే ఎక్కువ!”

ఈ సందర్భంగా
మీకు,
మీ అప్తులకు,
మీ ఆత్మీయులందరికి
సంక్రాంతి
శుభాకాంక్షలు

తెలియజేసుకుంటున్నాను.

సౌజన్యం ఆ మధ్య ఏవో మాటల మధ్య దాసరి అమరేంద్ర, నేను, కథ నవీన్ కలిసి మాట్లాడుకుంటుంటే బయటపడ్డ విషయం అది. రచయిత/త్రి పేరు మాత్రం నన్ను అడగవద్దు.   😉