ఫుడ్కోర్ట్ ఓనరు గారి సతీమణి

భుజానికి చెవికి మధ్యనుంది అతని కరవాణి.

చేతులు ఖాళీగా లేవు.ఫుడ్ కౌంటర్ వెనకాల అతనున్నాడు.

ఫుడ్ కౌంటరు ముందు నాలాగా చేతిలోనో, జేబుల్లోన్నో డబ్బులున్న మారాజులు, మారాణులు, ఫుడ్‌కి లాట్రికొడుతున్నవాళ్ళున్నారు.  కానీ అతనికి ఇవేమి పట్టటంలేదు. ఫోనులో చక్కగా అవతలి వాళ్ళతో చతుర్లాడుతూ రెండుచేతుల్తోటి ఏదో టిపిని ని పొట్లం కడుతున్నాడు.  అతనివెనకాల 24 ఇంచి కలర్ టీవీ బ్లేర్ మంటోంది.  ఫూడ్ కోర్ట్ యజమాని స్నేహితులనుకుంటాను ముగ్గురూ దానికెదురుగా మూడు ప్లాస్టిక్కు కుర్చిలలో కూర్చుని అదేదో చలనచిత్ర కళాఖండాన్ని చూస్తున్నారు.  అందులో ఒకడు గోల్డ్ ఫ్లేకు పిల్టర్ కింగ్స్ సిగరెట్టు నుసిని అలవోకగా కుడిచేత్తో ఆ ఫుడ్‌కోర్ట్ నేలమీదకి రాలుస్తున్నాడు. అఫ్ కోర్సు అతనికి పాసివ్ స్మోకర్స్ గురించి పెద్ద బెంగున్నట్టు లేదు.  ఈ పెపంచకంలో ఎన్ని దోమలు, ఈగలు చావటంలేదు క్షణ క్షణానికి.  జీవితములు బుద్బుదప్రాయములు కదా!  అయినా మన స్నేహితుడు ఓటల్లో మనం శ్వేతకాష్టాన్ని కాల్చకపోతే ఇంహెవడు కాలుస్తాడు?

మన పాకర్ ఇంకా భుజానికి చెవికి మధ్యనున్న కరవాణి ద్వారా చేస్తున్న సంభాషణకి స్పాట్ పెట్టలేదు.

మెడలో కుక్కబిళ్ళ తగిలించుకున్న ఆ యువతి బహుశ తిన్నగా తన కార్యాలయం నుండి వచ్చినట్టుంది, ముఖంలో అలసట కనపడుతోంది.  తలకి తగిలించుకున్న శిరస్త్రాణం బరువును మోస్తూ, ఒంటికాల్మీద నిలబడి, కాదు, వేచి ఉంది.

ఆ పక్కనే ఇద్దరు పిల్లలతో  ఉన్నాడు, వాళ్ల తండ్రి కామోసు!  వాళ్ళు ఆశగా సీమవెండి పళ్ళెంలో చెల్లాచెదురుగా పడేసిన పకోడిలవైపు చూస్తున్నారు.  అవి సాయంకాలం ఏ నాలుగింటికో వేయించినట్టున్నవి.  చూస్తుంటేనే తెలిసిపోతున్నది ఆ వాలిపోయిన ఉల్లిపాయల ముక్కల్ని చూస్తుంటే…ఏ సబ్ జీరో టెంపరేచర్లోనే ఉన్నాయని.

మన పాకర్ ఇంకా భుజానికి చెవికి మధ్యనున్న కరవాణి ద్వార చేస్తున్న సంభాషణకి స్పాట్ పెట్టలేదు.

ఫుడ్కోర్ట్ ఓనరు గారి సతీమణి అనుకుంటాను…ఏమ్చెయ్యాలో  తోచక అక్కడ నిలబడుంది.

ఇందాక పాక్చేసిన టిప్నిని కౌంటర్ మీదున్న ఒక పోలిధిన్ సంచిలోకి తోసేసి  ఎదురుగా నిలబడ్డ ఆయన్కేసి చూసేసి…ఇవి నీకే తీసుకుఫో అని కళ్లతోనే అనేసాడు ఆ పాకర్ కుర్రాడు.  ఎంత గొప్ప నైపుణ్యమున్న మారాజు!

మెడలో కుక్కబిళ్ళున్న యువతికి, భుజానికి చెవికి మధ్యనున్న కరవాణితో అలానే సంభాషిస్తూ…నీకు ఏం కావలన్న చూపు.  ఆమె  “రెండు పరోటాలు, కర్రీ” అంది.  ఈ లోపు ఫుడ్‌కోర్ట్ ఓనరు గారి సతీమణి అనుకున్నామే ఆవిడ ముందుకు కదిలింది.  మెడలో కుక్కబిళ్ళున్న యువతి భుజానికున్న షోల్డర్‌బ్యాగులోపల్నుంచి పర్సు తీసి లోపలికి చెయ్య్ జొనిపి దెవులాడి ఒక వంద రూపాయల నోట్ని దొరకబుచ్చుకుని ఆ ఫుడ్కోర్ట్ ఓనరు గారి సతీమణి  అనుకున్నామే ఆవిడకి అందించింది, కుడిచెత్తో.  అసలే మన అడలేడిస్‌కి సెంటిమెంట్స్ ఎక్కువకదా!  ఫుడ్కోర్ట్ ఓనరు గారి సతీమణి అనుకున్నామే ఆవిడ కూడ కుడి చేత్తో దాన్ని అందుకుంటూ మన పాకర్ వైపు చూసింది…ఎంత తీసుకోవలని ప్రశ్న అనుకుంటాను.  పెదాలతో అరవై అన్నాడా మహానుభావుడు.  ఫుడ్కోర్ట్ ఓనరు గారి సతీమణి అనుకున్నామే ఆవిడ కాష్ కౌంటర్వైపు వెళ్ళింది, చిల్లర తెచ్చివ్వడానికి.

Chapati
చపాతిలు – వితౌట్ ఆయిల్ కాదు

మన పాకర్ ఇంకా భుజానికి చెవికి మధ్యనున్న కరవాణి ద్వారా చేస్తున్న సంభాషణకి స్పాట్ పెట్టలేదు.

ఫుడ్డు కౌంటర్ పక్కనే ఉన్న స్టూలు మీదున్న పెద్ద హాట్పాక్ నుండి రెండు పరోటాలు అందుకున్నాడు.  వాటిని తనముందున్న ఫుడ్కౌంటర్ లోపల ఖాళీ జాగాలో పడేసాడు. రెండు అరజేతులతోను వాటిని మర్దనా చేసాడు.  ఆ మర్దన కి ఫుడ్కౌంటరు అదిరిపోయింది.  ఒక దినపత్రిక ఫుల్ షీట్ అందుకుని, దానిలోకి వాటిని విసిరేసి చుట్టు చుట్టేసి, అంచులు మడిచేసి, దాన్నిఓ పాలిధీన్ సంచిలోకి తోసేసి, అదే చేత్తో మరో చిన్న పాలిధిన్ కవర్ అందుకుని, తన పక్కనే ఉన్న సాంబారు (అని నేఅనుకున్నా)  స్టీలు గిన్నె లోఉన్న గరిటేని అందుకుని దానిని మరో పక్కనే ఉన్న పప్పు (అని నేఅనుకున్న) గిన్నెలోకి పడేసి ఇంత పప్పు అందుకుని దానిని ఆ పాలిధిన్ సంచీలోకి వొంపేసాడు.  తరువాత ఆ పాలిధిన్ సంచీ కొసలు పట్టుకుని గిర్రున తిప్పాడు.  ఎంత నైపుణ్యం!  ఇప్పుడు ఆ కొసలు రెండింట్ని మధ్యకంటా లాగి ముడేసాడు.  ఆ పప్పు పాకెట్ని ఇందాక పరోటాచుట్టని పడేసిన సంచిలోకి వేసేసి, కుడిచేత్తో మెడలో కుక్కబిళ్ళున్న యువతికి అందించాడు.  పాపం, మహా పతివ్రతఅయిన ఆ ఇల్లాలు, పాకర్ వేళ్లకి తనవేళ్ళు తగలకుండా అతి జాగ్రత్తగా ఆ సంచిని అందుకుంది.  ఈ లోపు ఫుడ్కోర్ట్ ఓనరు గారి సతీమణి అనుకున్నామే ఆవిడ చిల్లరని తెచ్చి ఈ మెడలో కుక్కబిళ్ళున్న యువతికి అందించింది కుడిచేత్తోనే. ఈవిడకూడా కుడిచేత్తోనే అందుకుంది.  అందుకుని వెనక్కి తిరుగుతూ, ఎడం చేత్తో, తను వేసుకున్న టాప్ని సర్దుకుంది, నడుంకిందకి లాక్కుంటూ.  బహుశ పాకర్ చూపుల మీద అనుమానం కామోసు!

మన పాకర్ ఇంకా భుజానికి చెవికి మధ్యనున్న కరవాణి ద్వారా చేస్తున్న సంభాషణకి స్పాట్ పెట్టలేదు.

నా వంక చూసాడు, పాకర్ “ఏం కావా”లన్నట్టు.

కరవాణిలో మాట్లాడుతున్నాడుగా అని ఎడం చెయ్యి బొటన్వేలుతో చిటికినవేల్ని, నాలుగోవేల్ని మడిచిపట్కుని చూపుడువేల్తో బాటు మధ్యవేల్ని చూపించాను. చూపిస్తూ  శబ్దం చెయ్యకుండా పెదాల్ని, రెండు చపాతిలు అని అర్ధం అయ్యేలాగ కదిలించాను.  అలాగే ‘పప్పు’ వైపు కళ్ళతో సైగ చేసాను.  సైగ చేస్తూ ఫుడ్‌కోర్ట్ ఓనరు గారి సతీమణి అనుకున్నామే ఆవిడ్కి నా ఎడంచేత్తో, నా జీన్స్ పాంటు వెనకాతలున్న ఎడం జేబిలోనుంచి యాభై రూపాయల్నోట్నిలాగి బొటనవేలు చూపుడువేల్మధ్య పట్కుని అందించాను.  ఆవిడ్నోటు అటువైపు కొసల్తోటి అందుకుంది.

ఇందాక లాగానే, పాకర్ హాట్పాక్ నుంచి రెండు చపాతీలు తీసి, న్యూస్పేపర్ మీదకి గిరాటేసి, రోల్చేసి, అంచుల్మడిచేసి, పోలితిన్కవర్లోకి నెట్టేసాడు.  పప్పు గిన్నెలోంచి రెండు గరిటెల పప్పుని మరో చిన్నకవర్లోకి వేసేసాడు.  దాని కొసలుపట్టుకుని తిప్పాడు.  ఈలోపు కరవాణి తో సంభాషణ తీవ్రత ఘాటు గాఢమైనట్టుంది.  గొంతు పెంచాడు.  పప్పున్న సంచి కొసర్లు ముడేసేసి, దాన్నిన్ను, చపాతిరోలున్న సంచినిన్ను ఫుడ్ కౌంటర్మీదకి విసిరేసినంతపన్జేసాడు.

ఫుడ్కోర్ట్ ఓనరు గారి సతీమణి అనుకున్నామే ఆవిడ యాభై రూపాయలలో, చపాతి ఒక్కింటికి పది రూపాయల్చొప్పున్న రెండు చపాతీలకి ఇరవై రూపాయలు, కరికి మరో ఇరవై రూపాయలు వెరసి నలభై రూపాయల్పోను తీసుకుని నాకివ్వాల్సిన పది రూపాయల చేంజ్ చేత్తో పట్టుకుని నా వైపొస్తున్న క్షణంలో…
నేను పప్పున్నసంచి, చపాతిరోలున్న సంచిన్ను అందుకుంటుంటే…పప్పున్న సంచి చెవుల ముడి ఊడిపొయ్యి…పప్పు నేలతల్లి నోట్లోకి జారుకుంది.

అప్పుడు…ఏది ….అప్పుడు మన పాకర్ ఇంకా భుజానికి చెవికి మధ్యనున్న కరవాణి ద్వారా చేస్తున్న సంభాషణకి స్పాట్  పెట్టాడు.

చపాతిరోలున్న సంచిని ఆ ఫుడ్కవుంటర్ మీదకి గిరాటేసి ఫుడ్కవుంటర్ వాళ్ళకి నా వీపు చూపిస్తూ వడివడిగా అడుగులేసుకుంటూ వచ్చేసాను.

నా వెన్క ఫుడ్‌కోర్ట్ ఓనరు గారి సతీమణి అనుకున్నామే ఆవిడ “అంకుల్, అంకుల్” అని పిలుస్తోంది.  “సార్”, “సారు,” అంటూ పాకర్ పిలుస్తున్నాడు.

ఇంటికాడ ఒక ఆప్లికాయ, పెద్ద గళాసునిండ హెర్టేజ్వాడి పెరుగు గిల్కోట్టేసి మజ్జిగ చేసేస్కుని తిని,తాగి తొంగున్నా ఆ రాత్రి.

 

వేట లో ఇది మూడవది అనుకుంటా! మొదటిది ఇక్కడ.  రెండవదేమో ఇక్కడాను.

రామములక్కాయ ముక్క…

వెలెట్ వచ్చాడు.  హింది సినిమాలలో ఉత్తరాది సైనికులని చూపిస్తౌరు చూడండి.  అలాంటి యూనిఫార్మ్‌లో ఉన్నాడు. తలకి ఒక పెద్దపాగా. దానికో పెద్ద కుచ్చు.  అట్టహాసంగా ఉన్నాడు. పెద్దవి గుబురు మీసాలు. ఆరడుగులు ఉంటాడు.  ముందుకు వంగి ఎడంచేత్తో కారు తలుపు తెరిచాడు.  “వెల్‌కం,” చెబుతూ కుడిచేత్తో శాల్యూట్ కొట్టాడు.

నేనెప్పుడు కారు వెనక సీటులో కుడిచేతి డోర్ వైపే కూర్చుంటాను.  ఇండియాలో అలాఅయితేనే కారు దిగడానికి సుఖంగా ఉంటుంది.  రైడ్‌లో ఉన్నప్పుడు, విండ్ షీల్డ్ పూర్తిగా కనపడుతుంది కూడా, మన దృష్టికి  డ్రైవర్ తల అడ్డం రాదు.  అందులో సుఖం అది.  సెడాన్ కారు కదా..సులువుగానే దిగాను, కారులోనుంచి.  రెండు చేతుల్తో నడుంచుట్టూ పాంటుని పైకి లాక్కున్నాను.  వీపు వెనక షర్ట్‌ని పాంట్ లోపలికి టక్ చేస్తూ ముందుకు అడుగులు వేసాను.  ఎప్పుడో ఉదయం చేసిన బ్రేక్‌ఫాస్ట్.  మూడు ఇడ్లీలు.  ఒక కాఫీ వితౌట్ షుగర్.  వాడి దగ్గిర టీ బాగుండదట. వెయిటర్ సలహా అది.  అందుకని కాఫీ తాగాను.  క్లయింట్‌ తిన్నాడు నన్ను ..ఆ మూడు ఇడ్లీలకి మరో మూడు.  నా మూడ్‌ని కూడా తిన్నాడు.

మధ్యాహ్నం ఏదో గడ్డి ఎక్కడో నమిలేసాను.  ఇదిగో ఇప్పుడు ఆకలి దంచేస్తున్నది.  క్లయింట్‌ని అడిగితే ఇక్కడ బాగుంటుందని అన్నాడు.  రెస్టరెంట్ పేరు ఏదో చిల్లీస్.  ఎల్లో…ఆరంజో..రెడ్డో.  పుడ్డు బాగుంటే పేరుతో పనేముంది?

రెండు చేతులు కలిపి నమస్తే అంటూ, తనకి అలవాటైపోయిన ప్లాస్టిక్ నవ్వుతో అహ్వానించింది. పెదవులకి ఏదో రంగు బహుశ ఎరుపు రంగేమో, పులుముకుంది.  ఆ అమ్మాయి కి ఇరవై ఏళ్ళుంటాయేమో! లౌంజ్ వెలుతుర్లో ఆ హొస్టెస్ కట్టుకున్న చీర తళ తళ లాడుతోంది.  షో కావాలి కదా మరి.  అమ్మాయికి కాదు, రెస్టారెంట్ కి.  అలవాటు చొప్పున అమ్మాయి పాదాల వంక చూసాను.  చీర అంచులు నలిగి పోయి మాసి పోయినవి.  ఎన్నాళ్లయిందో ఉతికి. గోళ్ళకి నలుపు రంగు పాలిష్. పాదాలు ప్లాస్టిక్ చెప్పుల్ని తగిలించుకున్నాయి. రోడ్డు మీద ప్లాట్‌ఫార్మ్ మీద అమ్మేవి.  బహుశ ఒక ఏడు, ఎనిమిది వేలిస్తారేమో  ఆమెకి!

“ప్లీజ్ కం,”  అంటూ నన్ను డైనింగ్ హాలు తలుపు దగ్గిరకి తీసుకుని వెళ్ళింది.  తలుపు తెరిచి లోపలికి వెళ్ళిపోయింది.  నేను బయట నిలబడిపొయ్యాను.  హొస్టెస్ తలుపు తెరిచి పట్టుకుని, గెస్ట్‌ని లోపలికి వెళ్ళిన తరువాత తన వెనక ఎవరు లేకపోతే తలుపుని మూసేసి తరువాత ప్రోసెస్ లోకి ఎంటర్ అవ్వాలి.  ఈ అమ్మాయి ఆ పని చెయ్యలేదు.  నా మొహం మీద తలుపేసేసింది.

“సారీ, సర్” అంటూ తలుపు తెరుచుకుని వచ్చి మళ్ళీ నన్ను లోపలికి తీసుకువెళ్ళింది.  విశాలమైన డైనింగ్ హాలు.  నాకు ఎదురుగా పొడుగ్గా నాలుగు వరుసలలొ టేబుల్స్ ని అరేంజ్ చేసారు.  నా ఎడంచేతి వైపు కిచెన్ లోకి స్వింగ్ డోర్స్.  నాకు ఎదురుగుండా ఎడమ చేతి వేపు బ్లూ కలర్ నియాన్ లైట్ల్‌తో ‘జెంట్స్’ అని కుడిచేతి వైపు “లేడిస్” అని ఇంగ్లిష్ ‌లో సైన్ బోర్డ్స్.  ఆ నియాన్ లైట్స్ లేకపోతే ఆ డైనింగ్ హాలు లో ఉన్న డిమ్ లైట్ కి ఏవి కనపడవు.  కుడి చేతి వైపు గోడకి ఆనుకున్ని మరో వరుస.  గెస్ట్లు, కట్లరి‌తోను నోటితోను చప్పుడు చేస్తూ తింటున్నారు కాబట్టి నా కళ్ళకి వాళ్లు వినబడుతున్నారు.

ఈ లోపు కళ్లముందు ఒక అద్భుతం జరిగింది.  మాయాజాలం.  ఎక్కడ్నుంచి ఊడిపడ్డాడో మరి, “ఐ విల్ టేక్ కెర్,” అంటూ ఆ యువకుడు ఆ అమ్మాయిని నాకు వదిలించేసి, నన్ను తనకు తగిలించుకున్నాడు.  “కిత్నె సాబ్” అని అడిగాను.  బహుశ ఎంత ‘మంద’ని ఏమో అతని ప్రశ్న.  ఆ చీకటి వెలుతురులో అతని దంతాలు తెల్లగా మెరుస్తున్నాయి.

“…’ఆమ్ అలొన్,” అని అన్నాను.

“దిస్ వే సర్, ” అంటూ నా ముందున్న ఫోర్ సీటర్ టేబుల్ని నాకు ప్రెజెంట్ చేసాడు.  ఎంట్రన్స్ ఎదురుగుండా కూర్చుని ప్రతివాడికి కనబడుతూ ఏం తింటాం? తినేటప్పుడు ప్రైవసీ ఉండద్దూ, పైగా పబ్లిక్కులో?

ఎడం చేతి వైపు గోడని ఆనుకుని ఉన్న రిసెస్స్ ఏరియాలో పాంట్రీ (సైడ్ సెక్షన్) పక్కనే అయితే బాగుంటుంది.  గోడకి ఆనుకునే సోఫా టూ సీటర్. దానికి పాంట్రీకి మధ్య చిన్న సైడ్ టేబుల్.  టేబుల్ గోడకి అనుకుని ఉంది.  ఆ గోడకున్న ద్వారం నుంచే ఇందాక నేను లోపలికి వచ్చింది. వచ్చేవాళ్ళని, పొయ్యేవాళ్ళని చూస్తూ కాలక్షేపంచేస్తూ తినొచ్చు.  పరీక్షగా చూస్తే కాని మనం వాళ్ళకు కనపడం.  అతనికి జవాబు ఇవ్వలేదు.  పాంట్రీ వైపుగా అడుగులేసాను. టూ సీటర్ సోఫాకి అభిముఖంగా మరో ఇద్దరికి కుర్చీలు.  మాములుగా ఒంటరిగా ఒఖ్ఖరే ఉన్న టేబుల్ దగ్గిరకి ఇంకొకళ్ళు రారు…సిటీస్‌లో అయితే.  పైగా గోడకి అనుకుని ఏ.సి వెంట్.  దాని త్రో నా మీదకు రాదు.  బాగుంది అనుకుంటూ ఆ టేబుల్ దగ్గిర సెటిల్ అయ్యాను.

ఏ.సి కింద బిగించిన లాంప్ వెలుతురులో నీలంరంగు ప్లాస్టిక్ ఫోల్డర్‌లో మెను ని టేబుల్ మీద నేను చేయి చాస్తే అందేంత దూరంలో పెట్టి నిలబడ్డాడు.  అంచులు మడ్డి కొట్టుకుని పోయ్యి డాగ్ ఇయర్స్ తో ఉందది.  ఎడం చేతి చూపుడు వేలు బొటన వేలు మధ్య వేళ్ళకి అంటీ అంటనట్టుగా దానిని పట్టుకుని నా దగ్గిరకు లాక్కున్నాను.  లోపల కంప్యూటర్ ప్రింట్ అవుట్స్‌తో మెను.  సలాడ్స్, స్టాటర్స్ నుంచి బివరెజెస్ దాక. వెజ్జు, నాన్ వెజ్జు కాక డ్రై ఫుడ్ కూడ ఉన్నాయందులో. గుజ్జుతో కూడా! గజ్జి రాదుకదా అనిపించింది ఆ మెను ఫోల్డర్‌ని చూస్తే.  కంపంరం పుట్టింది.  బతకడానికి తినాలి. తప్పుదు.

టొమాటో సూప్, ఒక వెజ్ సలాడ్, రెండు ఫుల్కాలు, ఒక మిక్స్‌డ్ వెజ్ కర్రీ ఆర్డరిచ్చాను.  కూల్ వాటర్ బాటిల్ ఒకటి వాటితో పాటుగా. “టెన్ మినిట్స్, యు విల్ హావ్ దెం సర్, ” అని వెళ్ళిపొయ్యాడు, “ఎంత సేపు పడుతుంది?” అని అడిగితే.

mixed veg curry
మిక్స్‌డ్ వెజ్ కర్రి

అప్పటికి కళ్ళు ఆ చీకటి వెలుతురుకి అలవాటు పడ్డాయి.  టేబుల్ కవర్స్ మీద మరకలు.  ఏ బోన్ సూపో, వెజ్ మంచూరియాకి పూసుకున్న సూప్ మరకలో!  బెడ్‌షీట్ల మీద మరకలు గుర్తువచ్చాయి. నవ్వొచ్చింది.  కాని బయటకు కనపడేటట్టు నవ్వలేదు.  అలవాటయిపోయింది, అలా.  టేబుల్ మధ్యలో స్టాండ్ కి నాలుగు ప్లాస్టిక్ కప్పులు ఉన్నాయి.  బహుశ చిల్లీ సాస్, వెనిగర్, టమాటో సాస్, మరింకేదో పదార్ధం.  మూతలు లేవు వాటికి. వాటి పక్కనే పెప్పర్, సాల్ట్ హోల్డర్.  ఒక క్రోమియం ప్లేటెడ్ హోల్డర్‌లో కొన్ని పేపర్ నాప్కిన్స్.  ఒక వైపుకి వాలిపోయినవి. బహుశ డైనర్ల కబుర్లన్ని విని ఓపిక నశించో లేక, డైనర్ల చేతుల్లో తమ స్నేహితుల జీవితాలన్నీ దాఋణంగా నలిపివేయబడ్డం చూసో. పాపం!

సర్వర్ వచ్చాడు.  కాదు ప్రత్యక్షమయ్యాడు.  చీకట్లో వాడి వొంటి నలుపు కనపడ్డం లేదు.  వాడు వేసుకున్న బట్టలు కనపడుతున్నాయి.  నాకు ఎడం చేతి పక్కగా ఒక చిన్న మెలమైన్ ప్లేట్ పెట్టాడు.  వాడికి, అదే దగ్గిర.  దానికి కుడిచేతి వైపు గాజు గ్లాసు.  ప్లేట్‌కి ఎడం చేతివైపు స్పూన్‌లు, కత్తులు.  కుడి చేతి వైపు ఫోర్క్ ఒకటి. అంటే నేను తినాలంటే కుడి చేతి వైపు కి జరిగి పళ్ళెం నాముందుకి వచ్చేలా నన్ను నేను సర్ధుకుని కూర్చోవాలి.  ఫుడ్ సర్వ్ చేసేది వాడు కదా!  నేను డైనర్‌ని మాత్రమే. అందులోను డబ్బులిచ్చే డైనర్‌ని.  టిప్పు ఎంత ఇవ్వాలి వీడికి అని లెఖ్ఖ వేసుకుంటున్నాను. డజ్ హి డిజర్వ్ ఎ టిప్!

నేను కదల్లేదు.  వాడు  సదిరేసి వెళ్ళిపొయ్యాడు.  స్టీరియోలో మంద్రస్థాయిలో ఎవరో “రాప్” తున్నారు. “రాపర్” తల్లి ఎవడితోనే లేచి పోయిందట!
ఆమెన్.
ఏమెన్.
ఎ మాన్.

రెండు మూడు ఫామిలిస్ అనుకుంటా పిల్లలతో.  మరో టేబుల్ దగ్గిర యువతీ యువకులు.  పెళ్ళవ్వాల్సిన వాళ్ళో మరి ఇంకా సంసారం ఏవిటో తెలియని వాళ్ళో..ఒకరి కళ్ళలోకి ఒకర్ని చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు.  మధ్య మధ్యలో ఒకరికొకరు అందించుకుంటున్నారు. ఎంత ప్రేమో ఒకళ్ళమీద మరొకరికి!  ఒక ఏడేళ్ళ తరువాత సెవెన్ యియర్స్ ఇచ్ వస్తే ఏంచేస్తారో? అయినా సెవెన్ యియర్స్ కావాలా ఈ రోజుల్లో వాళ్ళకి?

తమాషా ఏమిటంటే ఎవరూ తమ స్మార్ట్‌ఫోన్లు బయటికి తీసి చూసుకోవడం లేదు.  భలే ఆశ్చర్యం వేసింది నాకు.  నా ఫోను టేబుల్ పైనే నా ముందే ఉంది. అప్పుడొకటి అప్పుడోకటి మెసెజెస్, అలర్ట్స్ స్కోల్ అవుతూ లాకవుట్ స్కీన్ మీద కనపడుతునే ఉన్నాయి.

సూపు తెచ్చాడు.  మళ్ళీ నాకు ఎడంగా ఉన్న ప్లేట్‌లో పెట్టాడు.  నేను అందుకోలేదు.   నేను పళ్ళెం వైపు జరగనూ లేదు.  వాడి నల్లమొహంలోని కళ్ళలోని, తెల్లగుడ్లలో ఆశ్చర్యం కనపడింది నాకు.  కాని ఆ చీకట్లో, కళ్ళజోడు లోపలన్న నా కళ్ళల్లో వాడికి నా ఆకలిరాముడి క్రోధం కనపడలేదని …కాదు కాదు…. నేను చూపించలేదని వాడికి అర్ధం అయినట్టు లేదు. అలాంటి విషయాల్లో నేను మాస్టర్ని కదా? అమితాబ్ బచ్చన్ ఏమిటి, నాముందు మార్లెన్ బ్రాండో కూడా బలాదూరే!

నిశబ్దంగా ప్రత్యక్షమయ్యాడు ఇందాక వచ్చిన వెయిటర్. వాడేనా? ఎవడో ఒకడు!  సర్వర్ వంక ఒక చూపు చూసి, బౌల్, ప్లేట్, కత్తులు, ఫోర్కులు అన్ని  నా ముందే నాకు అందుబాటులో మళ్ళీ పేర్చాడు.  నేను ఏవి ముట్టుకోలేదు.

“సార్, న్యూ బాయ్ సార్,  సార్,” అని అపాలోజెటిక్ గా అన్నాడు.  “వాటర్ బాటిల్, ప్లీజ్,” అని అభావంగా అన్నాను.  వాడు నిష్క్రమించాడు.  కాస్త లోపలికి చల్లని త్రాగు మినరల్ నీరు వెల్తేగాని కడుపులో మంట తగ్గదు మరి.  అది వాడికి అర్ధం అయినట్టున్నది.

టేబుల్ మీదున్న నా ఫోన్‌ని షర్ట్ జేబులోకి జారవిడిచాను.

నెమ్మదిగా సూపుని కానిస్తుండగా..,ప్లేట్ తీసుకువచ్చాడు..ఇందాకటి నల్లనయ్య.  వాడికి లోపల కోటింగ్ పడ్డట్టున్నది.  నేను ముగించేసిన సూప్ బౌల్, దాని తాలుకు ప్లేట్, స్పూన్ వగైరాలు తీసుకుని తన వెంట తెచ్చుకున్న ట్రే‌లోకి సర్ధుకున్నాడు. కొంచెం భయం భయం గానే ఉన్నాడు.   ఆ ట్రే ని పక్కనే అన్‌ఆక్కుపైడ్ టేబుల్ మీద పెట్టేసుకున్నాడు.

ప్లేట్‌ని పేపర్ నాప్‌కిన్‌ తో తుడుచుకున్నాను.  నాప్‌కిన్‌లు శుభ్రం గా ఉండి వుండవచ్చన్న నమ్మకం మరి. ఎవడ్నో ఒకకడ్ని నమ్మాలిగా!  దేవుడ్ని నమ్మరు మీరు?  లెటెక్స్ గ్లవ్స్ అనుకుంటాను.  అవితొడుకున్న కుడిచేత్తో, చపాతీలలోఒకటి తీసీ నెమ్మదిగా,  నా ముందుంచిన మెలమైన్ ప్లేట్‌లో పెట్టాడు.  ఇప్పుడు మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రిని సర్వ్ చెయ్యాలి.

చపాతిని కుడిచేయి చూపుడు వేలు అంచుతో,  నా వైపున్న ప్లేట్ అంచుకి లాగాను.  చపాతీకి అటువైపు ప్లేట్‌లో కొంచెం స్థలం ఉంది.  నా ఉద్దేశం సెర్వర్ స్పూన్‌తో స్కూప్ చేసిన మిక్స్‌డ్ వెజ్ కరిని నా ప్లేట్‌లో అక్కడ ప్లేస్ చెయ్యాలని.

ఎడం చెయ్యి అరిచేతిలోకి బౌల్‌ని సర్ధుకున్నాడు.
కుడిచేత్తో స్పూన్ ని అందుకున్నాడు.
స్పూన్ ని బౌల్‌లోకి దూర్చి కర్రిని స్కూప్ చేసాడు.
నా వైపుకు వంగాడు.
అతి జాగ్రత్తగా నా ప్లేట్‌ మీదకి తీసుకువచ్చాడు.
అప్పుడు ప్లేట్‌లోకి జారవిడిచాడు.
కొంత కరి నా ప్లేట్‌లోకి జారింది.
ఎర్రగా ఉందది.
పొగలు కక్కుతూ.
మళ్ళీ రెండో సారి స్పూన్‌ని బౌల్ లోకి జొనిపాడు.
కర్రీని స్కూప్ చేసాడు.
కుడిచేత్తో దాన్ని ప్లేట్ దగ్గిరకి చేరుస్తున్నాడు.
ప్లేట్ లోకి జారుస్తున్నాడు.
ప్లేట్‌లోకి జార్చేసాడు.
టామాటొ ముక్క అనుకుంటాను, స్పూన్ లోపలికి కొంచెం, స్పూన్ అంచుమీద నుంచి కొంచెం కిందకి వేలాడుతోంది.
ఆ ముక్క స్పూన్‌లోనుంచి ప్లేట్‌లోకి జారలేదు.
దాన్ని నా ప్లేట్‌లోకి జార్చాలి.
నెమ్మదిగా విదిల్చాడు.
ఉహూ.
ఆ టమాటో ముక్క బలంగా స్పూన్ ని పట్టుకుని వెలాడ్తోంది.
జారడం లేదు.
కొంచెం గట్టిగా విదిల్చాడు.
అబ్బే, లాభం లేదు.
ఈ సారి ఘట్టిగా విదిల్చాడు.
బ్రూస్ లీ స్టైల్లో.
రెండంగుళ్ళాల్లో ఆ మూవెమెంట్.
కంట్రోల్డ్ ఫోకస్డ్ ఎనర్జి.
ఆ వేగానికి స్పూన్ నా ప్లేట్‌కి కొట్టుకుంది.
“ఠంగ్” మని మెత్తని చప్పుడు. శ్మశానంలో కపాలం పగిలినప్పుడు వినబడుతుంది అలాంటి చప్పుడు (ట కాదు, నిజమే.  ఎన్ని జీవుల్ని పంపలేదు ఈ చేతుల్తో!).
టమాటో ముక్క , నా మెలమైన్ ప్లేట్ కి అటు వైపు అంటే, టేబుల్ మీద పడింది.
ప్లేట్‌లో కాదు.
అప్పుడు వొదిలాడు ఆ నల్లనయ్య-సెర్వర్ వాడికి వచ్చిన ఇంగ్లిష్‌ పదాన్ని.
“షిట్.”
నాప్‌కిన్ స్టాండ్‌లో నుంచి ఒక పేపర్ నాప్‌కిన్‌ని అందుకున్నాను.

చూడండి – వేట లో  First link ఇది. Third link ఇక్కడుంది.
రెండోది మీరు ఇప్పుడు చదివిందే !

ఖుదర్దు

“ఖుదర్దు,” అని అన్నది అతనే.
“ఖుదర్దు,” అని ఆ యాజమానుడు అనకపొతే అస్సలు ఈ జీవితంలో ఈ ఘటనేలేదు.
ఖుదర్దు.
తప్పదు.
బతకాలిగా!
బతకాలి అంటే తినాలి.
కాని కొంతమంది తినడంకోసమే బతుకుతారు.  అది మనకు అప్రస్తుతం.  కాబట్టి ప్రస్తుతంలోకి వద్దాం. నేను బతకడానికి తినాలి.  తినాలి కాబట్టి వేటాడాలి.  వేటలో ఒక భాగం మెట్ట్లు ఎక్కడం.  కాబట్టి మెట్లు ఎక్కాలి.  ఎక్కి వారి ముందు నిలబడాలి.  అప్పుడు చూపు ప్రస్తావన వస్తుంది.  వాళ్ళని నేను చూడటం.  నన్ను వాళ్ళు చూడటం. నా వేటకి, నా చూపుకి , వాళ్ళకి చూపులకి సంబంధించిన విషయం. ఇక ఆ చూపుల కథలోకి వెళదాం.

* * *

ఆ చూపే..ఆ చూపంటేనే చిరాకు.

నల్లగా ఉన్నాడు.  నలుపు మీద తెల్లని పొడుగు చేతుల లినెన్ చొక్కా.  దగ్గిరకు వెళ్లగానే నిలబడి చూసేవాడికి ముందు జుత్తు కనపడుతుంది.  క్యాష్ కవుంటరు వెనక కూర్చునిఉంటాడుగా అందుకని.  కుడి వేపు పాపిడి.  నుదుటి మీదకి పడే రంగేసుకున్నజుట్టు. జుత్తు ఏమంత ఒత్తుగా లేదు.  నుదురు పెద్దదే.  కొంపదీసి ఆ కనుబొమలికి కూడా రంగేసాడేటో! కోటేరు ముక్కు మీదకి జారిపోతున్న బంగారపు రంగు ఫ్రేమున్న కళ్ళజోడు.  ఫోటోక్రొమాటిక్ అద్దాలు.  నారింజ రంగు పూత ఆ అద్దాలకి. అదీ హౌరా బ్రిడ్జ్‌లాగా పొడుగాటి ముక్కు మీద.  జారడం ఇప్పుడా తరువాత అని అలోచిస్తున్నట్టుంది.  అద్దాల వెనుక చిన్ని గుండ్రటి కళ్ళు.  కళ్ళక్రింద బీరు సంచులు.  ఆ ముక్కు కింద బొగ్గు నలుపు రంగేసిన సన్నటి మీసం.  ముక్కులాగానే అదీ పలచగానే ఉంది.  గంభీరంగా లేదు.  సన్నటి పెదాలు.  విడిపోతే ముత్యాలు రాలిపోతాయేమో అనే భయంతో ముడుచుకుని పోయినట్టున్నయి.

రాగిబిందె గొంతు లాంటి మెడ.  దానిని మూడొంతులు కప్పేసిన లినెన్ కాలరు.  కాలరు క్రింది కనపడాలని కనపడే చిటికిన వేలేడు మందాన ఉన్న బంగారు గొలుసు.  దానికో పులిగోరు పతకం.  పులిగోరు పతకం క్రింద తెల్లని బన్ని.  బన్నీ మీద పై మూడు బొత్తలూడదీసేసిన లినెన్ చొక్కా.

ఎక్జిక్యూటివ్ కుర్చిఅంటారే అలాంటి కుర్చి. కొని ఎన్ని సంవత్సరాలు అయిందో గాని దాన్ని తయారుచేసిన వర్క్‌షాప్‌వాడు వేసిన ప్లాస్టిక్ కవర్లు ఇంకా తియ్యలేదు..దుమ్ముకొట్టుకుని కుర్చి ఎంత పాతదో చెపుతున్నాయి.  కౌంటర్‌ అడ్డం ఉందిగాని కాని లేకపోతే ఏదో ఒక మోకాలి మీద మరో కాలు అడ్డం వేసుకుని కాలూపుతూ చూసేవాడు.  కుర్చిలో ముందుకు జారాడా కావాలని లేక ముడ్డిమీద లినెన్ పాంటు ఆ రెక్జిన్ లెదర్ మీద ఆగలేదోకాని ముందుకు జారుతూ, ముక్కుమీదకి జారిన కళ్లజోడు పై ఫ్రేమ్ అంచుమీదనుండి నా మీదకు దృష్టి సారించాడు.  ఏలినవారి రాజ్యంలోకి భిక్షకోసం అడుగుపెట్టిన ఏలియన్ని కదా నేను మరి.

“పుల్కాలున్నయ్యా?” అని అడిగాను. తలేగరేసాడు ఉన్నాయన్నట్టు.  కుడి చెయ్యి కౌంటర్ మీదకి వచ్చింది.  ముంజేతి మీదకు జారిపోతున్న అర అంగుళం వెడల్పున్న బంగారపు పట్టి. బొటనవేలుకు మందంగా ఉన్న బంగారపు ఉంగరంలో పొదిగిన తెల్ల రాయి సిఎఫ్‌‌ఎల్ లాంప్ వెలుతురులో  ధగధగమెరుస్తూ నాకు కనపడింది.  నేను చూసానన్నది ఆ చిన్న గుండ్రటి కళ్ళు గుర్తు పట్టేసి ఆ గర్వాన్ని నాకు కనపడేలా వెలిబుచ్చినవి.   ఈ లోపు నా కుడిచేతివేపు పాంటు జేబులో నుంచి లెదర్ వాలెట్ బయటికి లాగాను.
“ఎంత?” అని అడిగాను.
“ఎన్ని కావాలేటి?” అని అడిగాడు.
“ప్లేటుకి ఎన్నండీ?” అని అడుగుతూ ఆ డైనింగ్ హాలులోపలికి దృష్టి సారించాను.
” ఫ్లేట్‌కి రెండు.”
“ప్లేట్ ఎంత?”
“ఒకటీ సిక్స్ రుపీస్. అంటే ఫ్లేటు టెల్వ్ రుపీస్.”  నాకు లెక్కలు నేర్పించిన ఆనందం, ఆంగ్లలో నేర్పించాను చూసుకోహ్ మరి అన్న గర్వం వారి గొంతులో వినబడి, కంటిలో కనబడింది అన్నది నా బుర్రకి అర్ధం అయ్యింది.
“రెండు ప్లేట్లు,” అంటూ యాభై రూపాయలనోటు అందించాను.

కప్పనాలుక విసిరేసి పురుగుని పట్టుకున్నట్టు, అతని కుడిచెయ్యి నోటుని లాక్కుంది.  క్షణం లోపే.
భ్రుక్రుటి ముడిపడింది.”అయిదు తీసుకోండి,” అని అన్నాడా ఏలిక, లేదా ఆజ్ఞాపించారా?

చిరాకేసింది.  ఈయనేవడు నేను ఎన్ని తినాలో నిర్ణయించడానికి.  ఒహో వారు ప్రభువులు కదూ!
“నేను అన్ని తినలేనండి,” అని ఏ మాత్రం వ్యంగ్యం, కోపం, నిర్లక్ష్యం లాంటివి వినపడకుండా మామూలుగా అతి సాధారణంగా అన్నాను అని అనుకున్నాను.  అనే ఉంటాను. అలవాటేగా.

తల వంగింది.  పెదాల మీద బొగ్గు నలుపు రంగేసిన మీసం కొసలు మరి కొంచెం కిందకి కుంగాయి.  సరే ఇక కనుబొమల సంగతి చెప్పఖ్లేర్లేదు.  నెత్తిమీద జుత్తు ఎక్కువ కనపడుతోంది.  కాస్త పలచబడింది.  దట్టంగా నూనే రాసినట్టుంది.  ఏలిన వారి శ్రీమతే అయిఉంటుంది.  ముఖంలో కళ్లు పూర్తిగా కనపడటం లేదు.  పెదాల అంచులు కూడ ఒక లిప్తపాటు కుంగి బలవంతంగా విచ్చుకున్నాయి. ఈ పెపంచకంలో, ఏది…తన సామ్రాజ్యంలో ఇటువంటి పౌరుడ్ని ..ఏది ముష్టి ఆరు రూపాయల పులక తినలేని దౌర్భాగ్యుడ్ని తన జీవితంలో  చూడల్సి వచ్చినందుకు వగస్తున్నట్టుంది. పెదాలు విడివడ్డాయి..మూసుకున్నాయి.  దవడలు కదిలాయి.  పళ్ళు కనబడ్డాయి.  వాటి మధ్యనుంఛి నాలుక అలా చెంగున ఒక్కసారి బయటికి దూకింది.  అలాగే వెనక్కి లోపలికి వెళ్ళిపోయింది.  ఊరికే వెళ్ళిపోలేదు…పెదాలని తడిపేసివెళ్ళింది.  నా రెండు చెవుల మధ్యనున్న పదార్ధానికి అర్ధం అయ్యిదేమిటంటే…ఇలాంటి బేరం నాకే తగలాలా అని తెలుపు లినైన్ చొక్కా అనుకుందని.

“కూర ఎంతండి?” ప్రభువుల వారు కదా.  అందుకని సగౌరవంగానే అడిగాను.
“ఒరేయి రాజు, చెప్పు” అని తలేత్తకుండా ఒక ఆజ్ఞని అలా గాలిలోకి వదిలారు వారు.  ఫుడ్డు కవుంటరు వెనకాతల ఉన్న “రాజు” గోరు,  అర్ధనిమిలిత నేత్రాలతో, తన శ్వాసకి అడ్డుపడుతున్న పదార్దాన్ని కుడి చూపుడివేలితో వారి నాసికలోనుండి వెలికితీయడానికి తీవ్రమైన ప్రయత్నంలో ఉన్నా…నా వైపుకి తిరిగి, ”వెజ్ కరీనా, నాన్ వెజ్జా?” అని ప్రశ్నించారు.  కళ్ళు తెరిచేనండి.

కాష్ కవుంటరు వెనకమాతలున్న ప్రభువులవారి తలకిందికి వంగే వుంది.  ఆయన దవడలు కదులుతూనే ఉన్నాయి.  “రాజు” అనబడే సేవకుడి నాసికలో వేలు అలాగే వుంది.
“వెజ్జు.”
“టొంటి రుపీస్,” రాజు గారి ధరని సూచించారు.

<img class-19 size-full" src=""https://telugu.anilatluri.com/wp-content/uploads/sites/3/2014/09/AnilAtluri_GhatanaIMG_20141204_080908b.jpg?w=263" alt="రెండు పది రూపాయలు, ఒక అయిదు, రూపాయల నోట్లు, ఒక రూపాయి నాణెం" width="262" height="300" scale="2">
రెండు పది రూపాయలు, ఒక అయిదు, రూపాయల నోట్లు, ఒక రూపాయి నాణెం.

రెండు పళ్ళే‌‌ల పులకాలు, అంటే నాలుగు పులకాలు.  ఒకొక్క పులక ఆరు రూపాయలు చొప్పున, నాలుగు పులకాల ధర ఇరవై నాలుగు రూపాయలు. ఒక శాఖాహారపు కూర ఇరవై రూపాయలు.  మొత్తం వెరసి నలభై ఆరు రూపాయలు అని లెక్కవేసుకుని కాషు కవుంటరు వెనకమాతల ఎక్జిక్యూటివ్ కుర్చిలో కూర్చుని ఇంకా దింపిన తలెత్తకుండా సొరుగులో దేనికోసమో దెవులాడుతున్న ప్రభువులవారు బహుశ నేను సమర్పించుకున్న యాభై రూపాయలలో, ఇరవై నాలుగు రూపాయలు వారు పుచ్చుకోగా, నాకు ఇవ్వాల్సిన ఇరవై ఆరు రూపాయలు కాబట్టి ఏలిక వారి వద్ద ఒక్క రూపాయ బిళ్ళ గాని నోటుగాని వుండివుండక దాని కోసం వెతుకుతున్నారేమో అని అనుకుని, నా పంట్లాము ఎడమచేతివైపునున్న జేబిలోనికి చేతిని పంపి ఏవైనా నాణేలున్నాయమోనని చూసాను.  చేతికి ఏవి తగలలేదు.

ఇక తప్పదు.

“ఫరవాలేదు.  ఉంచండి.  ఆ రూపాయి ఈ సారి వచ్చినప్పుడు ఇద్దురులెండి,” అని అన్నాను.

చివాల్నా తలెత్తారు, నాధులు.  బుస బుస మని పొంగింది.  రక్తం.  ఆ ముఖం నలుపులో కూడా ఎరుపు కనపడింది.  కళ్లలోని తెల్లగుడ్డులోని రక్తవాహికలలో రక్తం కూడా  గంటకి దాదాపు అయిదారు వందల కిలోమీటర్ల వేగంతో పరిగెత్తింది.

“ఖుద్దర్దు,”  అని అనడం లో ఱేడు, వారి జీవితకాలం లో , ఏది తనుపెడితే పెట్టిన కూడు తినే ఓహ సామాన్య బీద పౌరుడి “ధయాధాఖ్సుణ్యాల” మీద జీవించడమే.. ఖుదర్దు. ఒక్క రూపాయ. ఒక్క రూపాయ అప్పుండమే!  ఖుదర్దు.

ఈ లోపు దేవర వారి సేవకుడు..ఏది నాసికలో ఉన్న పదార్ధాన్ని చూపుడు వేలితో వెలికి లాగడానికి ప్రయత్నిస్తున్నవారు తమ షరాయి జేబు అడుగునుండి ఒక నాణేన్ని బయటికి లాగి అది రూపాయి ని నిర్ధారించుకుని, దేవర వారిని సమీపించడము, వంగి,  ఆ ఒక్క రూపాయి విలువ నాణ్ణేన్ని తన కుడి చేత్తో, కాష్ కవుంటర్ మీద జాగ్రత్తగా పెట్టడము జరిగింది.

అధీపులవారు దానిని అందుకుని, దానితో పాటుగా రెండు పదిరూపాయలనోటుని , ఒక అయిదు రూపాయల విలువ నాణ్ణేన్ని నా వైపుకి ఆ కాష్ కవుంటరు మీద నెట్టారు.  కుడి చెయ్యి చూపుడు వేలితో.  అప్పుడు గమనించాను అధీపులవారు చేతికి గోరింటాకు కూడా వేసుకున్నారని.

ఒక పదిరూపాయలనోటు మీద మరో పది రూపాయలనోటు, వాటి మీద మధ్యలో పెట్టిన ఒక అయిదు రూపాయల నాణెం దానిపైన పెట్టిన ఒక రూపాయ్ బిళ్ళని కాష్ కవుంటరు మీదుంచి నా ముందుకు తోసారు.

ఖుదర్దు, అంతే. నాలుగంటే నాలుగే పులకాలు, నా మాటే నాది.

 

గమనిక: వేట లో ఇది మొదటిది. రెండవది ఇక్కడ. మూడోదేమో ఇది.