భలేగా దొరికాడు!

క్లాసు పుస్తకాలు, నోటుబుక్కులు, హోం వర్కులు చేస్తూ కనబడ్డవాడేకాని చేతిలో చందమామ, బాలమిత్ర లాంటి పుస్తకాలతో చూసిన గుర్తు లేదు. (చదివే ఉంటాడు, చదవకుండా ఎలా!) ఇద్దరమూ, మిగతా మిత్రులతో కలిసి, గోళీలు ఆడుకున్నాం. బిళ్లం గోడు కూడా అడుకున్నాం. క్రికెట్టు కూడా. కొట్టుకున్న, తిట్టుకున్న సందర్భాలు లేవు.

తరువాతెప్పుడో, మెడిసిన్ లో సీటు వచ్చింది చదువుకుంటున్నాడని తెలుసు. సరే, ఇక పెళ్ళి. బజుల్లా రోడ్డు ఇంట్లో సత్యనారాయణ వ్రతం. ఒకటి రెండు సార్లు, ఆంధ్రా బాంకులో కనపడ్డాడు. వాళ్ళ నాన్నగారు ఉన్నన్నిన్నాళ్ళు తన కబుర్లు కొన్ని తెలుస్తుండేవి. తరువాత ఎప్పుడో స్పర్ టాంక్ రోడ్ మూలమీద కనపడ్డాడు. ఇంగ్లాడ్‌లో ఉంటున్నానన్నాడు.

అప్పుడప్పుడు వెతుక్కునేవాడిని, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడో అని! ఆ తరువాతెప్పుడో తెలిసింది అమెరికాకి వెళ్ళాడని.  వాళ్ళ్ అన్నయ్యనుకుంటాను చెప్పాడు.

అనుకోకుండా రెండు, మూడేళ్ల క్రితం, హైద్రాబాదులో ఎయిర్‍పోర్టుకి వెళ్తూ దారిలో కధాసాహితి నవీన్ ఫోనులో పలకరించాడు. మూలింటామె గురించి మాట్లాడాడు. ఆశ్చర్య మేసింది. “సాహిత్యమేమిటి, తెలుగు సాహిత్యమేమిటి, మూలింటామె ఏమిటి? దాన్ని నువ్వు సమీక్షించడమేమిటి,” అన్న నా ప్రశ్నల పరంపరకి, “దేశానికి దూరంగా ఉన్నప్పుడు, ప్రేమలు, ఆపేక్షలు పెరుగుతాయిగా…నాకు అలా తెలుగు మీద ప్రేమ, సాహిత్యం మీద అనురాగం పెరిగింది,” అన్నాడు. సరేలే అనుకున్నాను.

మొన్న జంపాల గారు ఫేస్‌బుక్ లో, DTLC పేజిలో ఒక ఫోటోలో ఉన్నారు.  అది గ్రూప్ ఫోటో.   అందులో కనబడ్డాడు. వార్ని, భలే దొరికాడుగా అనుకున్నాను. ఆ ఫోటో కి కామెంట్ లో ఆ మిత్రుడికి తెలియజేయమని కోరాను.

DTLC Detroit Oct 2018
డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి సమావేశంలో రాఘవేంద్ర చౌదరి

మర్నాడు 22 అక్టోబరు. ఉదయం తన ఫోను కాల్ తో నిద్రలేపాడు. ఆ తేది, ఆ రోజు మర్చిపోను.

గొప్ప విషయం ఏమిటంటే, DTLC లో ఉన్నాడు. 2005 నుంచి.  దాదాపు పదమూడేళ్ళు! ఇద్దరికి తెలిసిన వారు, పరిచయం ఉన్నవారు, సాహిత్య పిపాసులు.  తెలుగు, తెలుగు సాహిత్యం! అయినా నాకు తెలియక పోయింది!  బహుశ ఏ సోషల్ మెడియాలోను ప్రోఫైల్ లేదనుకుంటాను!  లేకపోతే నేనెప్పుడో తగులుకునేవాడిని.  (బహుశ నాలాంటి వాళ్లు తగులుకుంటారనే తప్పుకునుంటాడు.
ద హ
)

రాత్రి నిఘంటువు చూసా,” అని అందులో అంటూ నన్ను ‘రిపబ్లిక్ గార్డెన్స్‘ కి తీసుకువెళ్లిపొయ్యాడు. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం. తన భాష, యాస, పలుకుబడి, ఆ నవ్వు, ఆ తల ఊపడం, దేన్ని వదులుకోలేదు! “ఆంధ్ర సాహిత్య పరిషత్తు” గురించి ప్రస్తావిస్తూ, “మా ఊరు మద్రాసు” అని అన్నాడు! ప్రాణం ఒక్కసారి లేచి వచ్చింది! చి న

Amazing, రాఘవేంద్ర…చౌదరి! అసలు నువ్వు తెలుగులో, ఆ సామెతలు, ఆ కోటబుల్ కోట్స్ , ఆ వ్యంగ్యం, ఆ చమత్కారం…భలే!  You know something! DTLC స్పూర్థి నాకు వేదిక ని మొదలుపెట్టడానికి. అఫ్‍ కోర్సు, మద్రాసులో మేము (అమ్మ, నేను, ఇతర సాహితీమిత్రులు) దాదాపు మూడు దశాబ్దాలు నిర్వహించిన సాహితీ సమావేశాల అనుభవం ఉందనుకో!

It is nice to know of your association with DTLC and love for your Telugu language! You made my day.

ఇక్కడ DTLC లో తన మాటలని వినండి.

BTW, that is…
పోఁగాలము దాపించినవారు దీప నిర్వాణగంధము నరుంధతిని మిత్రవాక్యమును మూర్కొనరు, కనరు, వినరని పెద్దలు చెప్పుదురుచి న

వెంటాడుతుంది ఈ పుస్తకం

ఒకటి, యండమూరి వీరేంద్రనాధ్ కామెంట్ నా దృష్టికి రాకపోతే ఈ పుస్తకాని అంత త్వరగా చూసేవాడిని కాదు.  రెండు దాసరి అమరేంద్ర గారు ఈ అనువాదకుడికి ‘వాగ్దానం’ చెయ్యకపోయినా ఈ పుస్తకాన్ని ఒక్క రాత్రి పూట చదివి ముగించేవాడిని కాదు.  మూడు ఈ పరిచయం ఇక్కడ ఉండటానికి కారణం విజయవాడలో పుస్తక ప్రదర్శన.
పైగా జనవరి 28 ఆదివారం ఉదయం హైద్రాబాదు చలిలో ఈ పుస్తకాన్ని పరిచయం చెయ్యాల్సిరావడం.  అబ్బే, వేదిక తరఫున కాదు. ఆలంబన దీనికి సభాస్థలి. కార్యక్రమం డా వింజమూరి సూర్యప్రకాశ్ గారి Spreading Lights లో ఒక భాగం.

ఇక పోతే ఈ పుస్తకం లో 70 వ పేజిలో ఒక చిన్న పిట్ట కథ ఉంది.  ఆ కథ విపించింది సూఫీ బాబా.
అప్పటివరకూ పురుషులనే తప్ప ‘స్త్రీ’ ని చూడలేదతడు. తన అనుమానాన్ని వెలిబుచ్చుతూ, ఆమె గుండెలకేసి చూపించి, తామిద్దరిమధ్య తేడా గురించి గృహస్థుని ప్రశ్నించాడు.
అమాయకమైన ప్రశ్నకి ఆ తండ్రికి కోపం రాలేదు. ఎదుట ఉన్నది మొదటిసారి తమ ప్రపంచంలోకి వచ్చిన బౌద్ధసన్యాసి అని అతడికి తెలుసు. తేడా గురించి చెపుతూ, ‘తల్లి అయిన తరువాత, పిల్లల్ని పోషించ వలసిన బాధ్యత ఉన్నది కాబట్టి ప్రకృతి ఆ బాలికకు ఆ విధమైన అవయవాలను ఇచ్చింద’ని వివరణ ఇచ్చాడు.
ఆమాటలకు సుదీర్ఘమైన ఆలోచనలో పడిన యువకుడు, ఆరోజుకు సరిపడా బియ్యం మాత్రం ఉంచుకొని, మిగతా ఆరు రోజులదినుసులు వెనక్కి ఇచ్చి తిరిగి తన గురువు దగ్గరికి చేరుకున్నాడు.
ఇలా ఎందుకు చేశావని అడిగాడు గురువు.

ఇందాక యండమూరి షేర్ చేసారు అని ఉదహరించింది ఈ పై కథనే.
ఇది ఈ పోస్ట్‌కి నేపధ్యం.   నేను అభిమానించే పారిశ్రామికవేత్త జే” ( టాటా సన్నిహితులు ఆయన్ని ఆ పేరుతో పిలుచుకునేవారు) కి ఈ పుస్తకాన్ని అంకితమిచ్చాడు అజిత్ సింఘాని.  అది మరొక కారణం ఈ పుస్తకాని చదవడానికి.

ఒక్క మాట.  ఇది పుస్తక పరిచయం మాత్రమే.

ఇక వివరాలలోకి వెడదాం.  పుస్తకం పేరు ఇంగ్లీష్ లో One life to ride. రచయిత Ajit Harisinghani.

ఇక దీనిని తెలుగులో కి అనువదించింది కొల్లూరి సోమశంకర్.  తెలుగులో ఈ పుస్తకానికి   పెట్టిన పేరు ప్రయాణానికే జీవితం . prayaanaanikE jeevitam - translation into Telugu by Kolluri Somasankar

ప్రయాణానికే జీవితం – తెలుగు అనువాదం కొల్లూరి సోమశంకర్
మూలం – ఆంగ్లం – అజిత్ సింఘాని

కోలా శేషాచలం నీలగిరి యాత్ర లో ఒక ప్రకరణం మాకు ఫిఫ్త్ ఫార్మ్ లో అనుకుంటాను పాఠంగా ఉండేది.  మా తెలుగు ఉపాధ్యాయులు శ్రీ వీరాచారి గారు మాకు దానిని చెప్పారు.  అప్పటికే తెలియని తెలుగు పదాలని  ఆ పాఠం తో పాటు వారి ద్వారా నేర్చుకున్నాం.

ఏనుగుల వీరాస్వామి   కాశీ యాత్ర చరిత్ర ,    మల్లాది వ్రాసిన రెండు పుస్తకాలు – ట్రావెలాగ్ అమెరికా, ట్రావెలాగ్ యూరోప్ లాంటివి,  నేను చూసిన అమెరికా అని అక్కినేని వ్రాసిన పుస్తకాలు వగైరాలు ప్రయాణాలు, యాత్రలు చేసిన వారి స్వీయానుభావాలే. ఈ మధ్యే మధురాంతకం నరేంద్ర గారు అమ్‌స్టర్‌డామ్ లో అద్భుతం నవలని అందించారు. ఈ నవలకి వారి విదేశి యాత్ర ఒక ప్రేరణ.

ఇవి కాక మరో రకం పుస్తకాలున్నవి.  వాటిల్లో వీసాలు, మోసాలు, పాస్‌పొర్ట్లు, టికెట్లు, హోటళ్లు, తిండి, తిప్పలు వగైరాలు మాత్రమే ఉంటాయి.

సోమశంకర్ అనువదించిన ప్రయాణానికే జీవితం లో ఇవేమి ఉండవు.  మరేవో ఉంటాయి కాబట్టి ఈ పుస్తకం చదివిన తరువాత కూడ పాఠకుడ్ని వెన్నంటి వేటాడుతుంది అని అంటున్నాను.

Jonathan Livingston Seagull
Jonathan Livingston Seagull by Richar Bach

 Richard David Bach పుస్తకం ఒకటి 70 లలో పాఠకులని ఒక కుదుపు కుదిపింది.  ఆ పుస్తకం పేరు Jonathan Livingston Seagull .

ప్రయాణానికే జీవితం  చదువుతుంటే నాకు ఆ పుస్తకం జ్ఞాపకం వచ్చింది.  కొన్ని లక్షల ప్రతులు అమ్ముడైన పుస్తకం అది.

ప్రయాణానికే జీవితం పుస్తకంలో వీసాలు, మోసాలు, పాస్‌పోర్ట్లు, ట్రైయిన్ టైం‌టేబుల్స్ గాని అజిత్ ప్రయాణానికి ఉపయోగించుకున్న బుల్లెట్ గురించి వివరాలు కాని ఉండవు.  లోలోన, పొరలలో దాగి ఉన్న మనిషి మనసుని అది ఆవిష్కరింపచేస్తుంది.  గమ్యం మొక్కటే కాదు ముఖ్యం అజిత్ లాంటి యాత్రికులకు. మనసును తెలుసుకోవడం కూడ ముఖ్యమే!

54 వ పేజిలో ఒక జీవిత గాధ ఉంది.  జరిగిన కథ అది.  ఒక భారతీయుడు అతని కుటుంబం, ఒక పాకిస్థాని అతని కుటుంబం.  ఒక కుటుంబాన్ని రక్షించిన మరో కుటుంబం ఏమైంది అన్నది చదివితే మనసు ద్రవించిపోతుంది.

157 పేజిలో మరాఠ యువకులు పదాతి దళంలో చేరి, తమ కుటుంబానికి, స్నేహితులకి బంధువులకి దూరంగా, శత్రువులకి అత్యంత సమీపంగా జీవిస్తూ… ప్రతి క్షణం ప్రాణభీతితో ఎలా జీవిస్తున్నారో చదువుతుంటే అజిత్ తో పాటు మనం కూడ కన్నీరు పెడతాం.

అంత ఒడుపుగా ఆంగ్లలోనుంచి తెలుగులోకి అనువదించి పాఠకుడ్ని కూడ ఉద్వేగానికి లోను చేసేటంత గొప్పగా అనువదించాడు ఈ అనువాదకుడు – కొల్లూరి సోమశంకర్.

బుల్లెట్ బండి మీద సవారి కాదా ఈ పుస్తకం?  కాదు.  అంతేకాదు.  ఈ పుస్తకం విపశ్యన (విపాసన)గురించి కూడా మీకు చెబుతుంది.

అచ్చు తప్పులున్నాయి కాని పంటి కింద రాయిలాగా అడ్డుపడవు.  ముద్దకి ముద్దకి రాళ్ళని వెతుక్కోనక్కర్లేదు.  భాష సాఫీగానే ఉంది.

చదవతగ్గ పుస్తకమే!  సందర్భం ఏదైనా బహుమతిగా కూడ ఇవ్వొచ్చు .

ప్రతులకు:
K. Soma Sankar
1-30-28, Tirumalanagar,
Kanajiguda, Secunderabad 500 015.
మొబైల్ ఫోను: +91 99484 64365
ధర : రూ: 120.00

ప్రముఖ పుస్తక విక్రేతలందరి దగ్గిర దొరుకుతుంది.  ఒకవేళ లేకపోతే వారిని తెప్పించి పెట్టమని అడగండి.  కుదరకపోతే రచయిత ఉండనే ఉన్నాడు.  ఆర్డర్ పెట్టండి.

అన్వర్ కి ధాంక్స్‌తో..

ఆదివారం.  మార్చ్ 2, 2014. మళ్ళీ SMS.  ఆర్టిస్ట్ మోహన్ గారి పిలుపు.  మనవాళ్లందరూ వస్తున్నారు.  మీరు కూడా రావాలి.  మన శేఖర్ కి మనం చెయ్యాలి! సందర్భం శేఖర్ కార్టూనిస్ట్‌గా గోల్డెన్ జూబిలి సెలబ్రేషన్.

శేఖర్ కార్టూనిస్ట్ గా నే పరిచయం అయ్యాడు  ఆంధ్రజ్యోతి లో.  కె.పి డెస్క్ పక్కనే.  కె.పి ని దాటుకుని శేఖర్ డెస్క్‌కి వెళ్ళాలి.  ఆ పక్కనే వసంతలక్ష్మి గారి డెస్క్.

కినిగె కి తన కార్టూన్ పుస్తకాన్ని ఇచ్చిన తొలి కార్టూనిస్టు శేఖర్.  అదొక అభిమానం.  తరువాత ఎప్పుడో ఒకసారి నా మీద కోపగించుకున్నాడు కూడా!  “నాకు మీరు పిచ్చేశ్వరరావు గారి అబ్బాయని ఎందుకు చెప్పలేదు.  ఆయనంటే మా తరానికి ఎంత ఇష్టమో, మీకు తెలియదు. అటువంటి వాళ్ళు అంత త్వరగా వెళ్ళిపోవాడనికి హడావుడి ఏమిటో?” అనుకున్నడు స్వగతంగా.

అమెరికా సంయుక్త రాష్ట్రాలకి వెళ్లబోయేముందు, వెళ్ళి వచ్చిన తరువాత తన పుస్తకాన్ని డిజిటల్ బుక్‌గా ఎలా డిజైన్‌చేస్తే బాగుంటుందో అని కలిసినప్పుడు మాట్లాడుకునేవాళ్ళం.  కలవనప్పుడు ఫోన్ చేసేవాడు.  ఫోనులో “తింటున్నాన్నా?” అని అడిగి నవ్వేవాడు.

“సార్, మీ ఇంటికి దగ్గిర్లోకి మారుతున్నాను. మనం ఇక రోజు కలుసుకోవచ్చు.  బహుశ నేనే మీ ఇంటికి వస్తాను.  కలిసి టీ తాగోచ్చు,” అని ఎంతో సంతోషంగా నవ్వుతూ చెప్పినప్పుడు ఆనందమేసింది.

తరువాత ఎప్పుడో తెలిసింది..ఆరోగ్యం బాగోలేదని.  ఇంటికి వెళ్ళి పలకరించాలని అనుకునేటప్పడికి ఇల్లు మారడం కూడా ఐపోయింది.

Cartoonist Chandrasekher
Cartoonist Chandrasekher (Jul 16, 1965 – 19 May 2014)

ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ ‌క్లబ్‌లో అతని కోసం చూసాను.  కొంచెం ఆలస్యం అయ్యింది నేను వెళ్ళేటప్పటికి.  మనిషి కనబడలేదు.  వెతుకున్నాను.  కాప్..నోటికి మాస్క్ అడ్డం ఉంది.  ఆ మాస్క్ పైన కళ్ళు. నవ్వు.  ఉగ్గబట్టుకున్న ఆనందం.  సంతోషం.  ప్రెస్‌క్లబ్ నిండిపోయింది.  కాని మనిషిని చూసిన నేను ఖంగు తిన్నాను.  నాకు తెలిసిన శేఖర్ రూపు కాదది.  మనిషి మొఖంలో విపరీతమైన అలసట. సగం అయిపొయ్యాడు.  ఎందుకో ఉండబుద్ది కాలేదక్కడ.  తనతో మాట్లాడడానికి తగిన ప్రదేశమూ కాదు..సందర్భమూ కాదు.  ఈ లోపు ఒకటికి రెండు సార్లు ఫోను చేసిన అన్వర్, sms లు గుప్పించిన ఇతర మిత్రులని పలకరించాను.

హడావుడిగా పరిచయుస్థుడొకాయన వచ్చాడు.  పక్కనే శ్రీమతి అనుకుంటాను.  పేద్ద పూలమాల.  ఒక పుష్ఫగుచ్చం.  హడావుడి హడావుడిగా వేదిక దగ్గిరకు దాదాపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపొయ్యారు.  ఆఖరి చూపు.  పార్ధివ శరీరాన్ని పుష్పమాలంకృతాన్ని చెయ్యాలన్న తాపత్రయం కనపడింది ఆ వేగంలో, ఆ మాటల్లో, ఆ గమనంలో.  విరక్తి పుట్టింది.

విజయవాడలో “మో” హాస్పిటల్‌లో ఉంటే..”సార్,  ఐపోయ్యిందా?  డిక్లేర్ చేసేద్దామా”?   అని స్ట్రింగర్స్ శ్రీ శ్రీ విశ్వేశ్వరావు గారిని పీక్కు తిన్న వైనం గుర్తోచ్చింది.  మనసు రోసింది. అసహ్యం వేసింది. రోత పుట్టింది.

వెళ్ళిపోదామని వెనక్కి తిరుగుతుంటే..అన్వర్ ఎదురువచ్చాడు.  “సార్, వెళ్ళిపోతున్నారా?” అంటూ. ఔనన్నట్టుగా తలూపూతూ గేటు వైపుకి కదులుతుంటే..”వుండండి సార్..రెండు మాటలు మాట్లాడి వెళ్లండి”  అని అన్నాడు.  వాళ్ళ మధ్య నేనేమి మాట్లాడుతాను అనుకుంటూ నిలబడిపొయ్యాను.  “ఉండండి సార్.  ఒక్క రెండు మాటలు మాట్లాడండి.  తనుకూడా వింటాడు కదా?”అని అన్నాడు. ఇక ఆ మాటకు తిరుగులేదు.  సరే అని ఆగి పొయ్యాను.

ఈ లోపు మాట్లాడేవాళ్ళున్నారు.  వాళ్ళ తరువాత..అన్వర్ నాకు మైకు ఇప్పించాడు.  శేఖర్ వెనకకి చేరుకున్నాను.  శేఖర్ భుజం మీద చెయ్యి వేసాను.  శేఖర్ నా ముఖంలోకి చూసాడు.  మా ఇద్దరి కళ్ళు కలిసినవి.  He knows.  He knew, I knew. He also knew that my heart is with him. I wished him all the best with all my heart.  I expressed my good wishes to all his frineds for supporting him at that time. లేచి నిలబడ్డాడు.  కౌగలించుకున్నాడు.  That was the parting embrace. I knew.

మైక్ ఆర్టిస్టు మోహన్ గారికిచ్చాను.  అన్వర్ కి థాంక్స్ చెప్పాను.  వచ్చేసాను.

మా అమ్మ పోయినప్పుడు చలసాని ప్రసాదరావు గారు రాలేదు.  దానికి ఆయన చెప్పిన కారణం.  “నాకు మీ అమ్మ చక్కగా సంతోషం గా నవ్వుతూ ఉన్నప్పుడు చూసిన జ్ఞాపకం.  నాకు అదే గుర్తుంచుకోవాలని ఉంది” అని.
చంద్రశేఖర్ విషయం లో నాది అదే ఉద్దేశం. అందుకే కొడుకు పెళ్ళికి వెళ్ళలేక పొయ్యాను.  ఈ రోజు వెళ్ళడం లేదు.  ఫోటో కూడ తను నవ్వుతున్నదే పెట్టాను.

ఆ రోజున అన్వర్ నన్ను గుర్తుపెట్టుకుని పిలవకపొతే..నాకు శేఖర్ చిరు దరహసం అందేది కాదు.

గుడ్‌బై శేఖర్.  You are a good friend.  I shall remember your smile.  Always.

ఇది వ్యాపారం కాదు.  నేను ఇప్పుడు కినిగె లో లేను కూడా!  శేఖర్ పుస్తకాలు ఇవి కొన్ని అని చెప్పడానికి మాత్రమే:  http://kinige.com/author/Shekar