భరణీ స్టూడియోస్ అధినేత పాలువాయి రామకృష్ణ దర్శకత్వంలో వెలువడిన ‘బాటసారి‘ లో నాయిక పాత్ర పోషించిన భానుమతి, రామకృష్ణగారి సతీమణి. అక్కినేని నాగేశ్వరరావు నాయకుడుగా నటించిన ఈ చిత్రానికి మూలకధ బెంగాలి నవల ‘బడదీది‘. బెంగాలి రచయిత శరత్‍బాబు. ఆ ‘బాటసారి’ చలనచిత్రాన్ని వెండితెర నవలగా ఆవిష్కరించి తెలుగువారికి వెండితెర నవలలను పరిచయం చేసింది అట్లూరి పిఛ్హేశ్వర రావు. త్రిపురనేని రామస్వామి కనిష్ట పుత్రిక చౌదరాణి వీరి శ్రీమతి. ఆ విధంగా బారిస్టరు, శతావధాని .’కవిరాజు’ త్రిపురనేని రామస్వామి కి అల్లుడు. అట్లూరి పిఛ్హేశ్వరరావు నాకు తండ్రి. చౌదరాణి నాకు తల్లి. నాన్న 92 ముగించుకుని 93లో అడుగు పెడుతున్న రోజు ఇది. బానుమతి పాడిన “ఓ బాటసారి…” పాట ని ఇక్కడ వినవఛ్హు.
baaTasaari (బాటసారి) film novel – 153 pages was published by the makers of the movie in July 1961. It was priced 0.75 np. That would be three annas.
Tidbit
You will notice the banner mentioning the title of the movie is signed GHRao He was quite popular in those days. I personally knew him. My mother and I were keen on having the signboard for the proposed Rani Book Centre (an exclusive Telugu bookstore) written in Telugu. Our search brought him to us. He was Hanumantha Rao. In fact he did the first sign board in Telugu for Rani Book Centre in 1969. What a coincidence!
ఒకటి, యండమూరి వీరేంద్రనాధ్ కామెంట్ నా దృష్టికి రాకపోతే ఈ పుస్తకాని అంత త్వరగా చూసేవాడిని కాదు. రెండుదాసరి అమరేంద్ర గారు ఈ అనువాదకుడికి ‘వాగ్దానం’ చెయ్యకపోయినా ఈ పుస్తకాన్ని ఒక్క రాత్రి పూట చదివి ముగించేవాడిని కాదు. మూడు ఈ పరిచయం ఇక్కడ ఉండటానికి కారణం విజయవాడలో పుస్తక ప్రదర్శన.
పైగా జనవరి 28 ఆదివారం ఉదయం హైద్రాబాదు చలిలో ఈ పుస్తకాన్ని పరిచయం చెయ్యాల్సిరావడం. అబ్బే, వేదిక తరఫున కాదు. ఆలంబన దీనికి సభాస్థలి. కార్యక్రమం డా వింజమూరి సూర్యప్రకాశ్ గారి Spreading Lights లో ఒక భాగం.
ఇక పోతే ఈ పుస్తకం లో 70 వ పేజిలో ఒక చిన్న పిట్ట కథ ఉంది. ఆ కథ విపించింది సూఫీ బాబా.
“అప్పటివరకూ పురుషులనే తప్ప ‘స్త్రీ’ ని చూడలేదతడు. తన అనుమానాన్ని వెలిబుచ్చుతూ, ఆమె గుండెలకేసి చూపించి, తామిద్దరిమధ్య తేడా గురించి గృహస్థుని ప్రశ్నించాడు. అమాయకమైన ప్రశ్నకి ఆ తండ్రికి కోపం రాలేదు. ఎదుట ఉన్నది మొదటిసారి తమ ప్రపంచంలోకి వచ్చిన బౌద్ధసన్యాసి అని అతడికి తెలుసు. తేడా గురించి చెపుతూ, ‘తల్లి అయిన తరువాత, పిల్లల్ని పోషించ వలసిన బాధ్యత ఉన్నది కాబట్టి ప్రకృతి ఆ బాలికకు ఆ విధమైన అవయవాలను ఇచ్చింద’ని వివరణ ఇచ్చాడు. ఆమాటలకు సుదీర్ఘమైన ఆలోచనలో పడిన యువకుడు, ఆరోజుకు సరిపడా బియ్యం మాత్రం ఉంచుకొని, మిగతా ఆరు రోజులదినుసులు వెనక్కి ఇచ్చి తిరిగి తన గురువు దగ్గరికి చేరుకున్నాడు. ఇలా ఎందుకు చేశావని అడిగాడు గురువు.“
ఇందాక యండమూరి షేర్ చేసారు అని ఉదహరించింది ఈ పై కథనే.
ఇది ఈ పోస్ట్‌కి నేపధ్యం. నేను అభిమానించే పారిశ్రామికవేత్త “జే” ( టాటా సన్నిహితులు ఆయన్ని ఆ పేరుతో పిలుచుకునేవారు) కి ఈ పుస్తకాన్ని అంకితమిచ్చాడు అజిత్ సింఘాని. అది మరొక కారణం ఈ పుస్తకాని చదవడానికి.
ఒక్క మాట. ఇది పుస్తక పరిచయం మాత్రమే.
ఇక వివరాలలోకి వెడదాం. పుస్తకం పేరు ఇంగ్లీష్ లో One life to ride. రచయిత Ajit Harisinghani.
ప్రయాణానికే జీవితం – తెలుగు అనువాదం కొల్లూరి సోమశంకర్
మూలం – ఆంగ్లం – అజిత్ సింఘాని
కోలా శేషాచలంనీలగిరి యాత్ర లో ఒక ప్రకరణం మాకు ఫిఫ్త్ ఫార్మ్ లో అనుకుంటాను పాఠంగా ఉండేది. మా తెలుగు ఉపాధ్యాయులు శ్రీ వీరాచారి గారు మాకు దానిని చెప్పారు. అప్పటికే తెలియని తెలుగు పదాలని ఆ పాఠం తో పాటు వారి ద్వారా నేర్చుకున్నాం.
ఇవి కాక మరో రకం పుస్తకాలున్నవి. వాటిల్లో వీసాలు, మోసాలు, పాస్‌పొర్ట్లు, టికెట్లు, హోటళ్లు, తిండి, తిప్పలు వగైరాలు మాత్రమే ఉంటాయి.
సోమశంకర్ అనువదించిన ప్రయాణానికే జీవితం లో ఇవేమి ఉండవు. మరేవో ఉంటాయి కాబట్టి ఈ పుస్తకం చదివిన తరువాత కూడ పాఠకుడ్ని వెన్నంటి వేటాడుతుంది అని అంటున్నాను.
Richard David Bach పుస్తకం ఒకటి 70 లలో పాఠకులని ఒక కుదుపు కుదిపింది. ఆ పుస్తకం పేరు Jonathan Livingston Seagull .
ప్రయాణానికే జీవితం చదువుతుంటే నాకు ఆ పుస్తకం జ్ఞాపకం వచ్చింది. కొన్ని లక్షల ప్రతులు అమ్ముడైన పుస్తకం అది.
ప్రయాణానికే జీవితం పుస్తకంలో వీసాలు, మోసాలు, పాస్‌పోర్ట్లు, ట్రైయిన్ టైంటేబుల్స్ గాని అజిత్ ప్రయాణానికి ఉపయోగించుకున్న బుల్లెట్ గురించి వివరాలు కాని ఉండవు. లోలోన, పొరలలో దాగి ఉన్న మనిషి మనసుని అది ఆవిష్కరింపచేస్తుంది. గమ్యం మొక్కటే కాదు ముఖ్యం అజిత్ లాంటి యాత్రికులకు. మనసును తెలుసుకోవడం కూడ ముఖ్యమే!
54 వ పేజిలో ఒక జీవిత గాధ ఉంది. జరిగిన కథ అది. ఒక భారతీయుడు అతని కుటుంబం, ఒక పాకిస్థాని అతని కుటుంబం. ఒక కుటుంబాన్ని రక్షించిన మరో కుటుంబం ఏమైంది అన్నది చదివితే మనసు ద్రవించిపోతుంది.
157 పేజిలో మరాఠ యువకులు పదాతి దళంలో చేరి, తమ కుటుంబానికి, స్నేహితులకి బంధువులకి దూరంగా, శత్రువులకి అత్యంత సమీపంగా జీవిస్తూ… ప్రతి క్షణం ప్రాణభీతితో ఎలా జీవిస్తున్నారో చదువుతుంటే అజిత్ తో పాటు మనం కూడ కన్నీరు పెడతాం.
అంత ఒడుపుగా ఆంగ్లలోనుంచి తెలుగులోకి అనువదించి పాఠకుడ్ని కూడ ఉద్వేగానికి లోను చేసేటంత గొప్పగా అనువదించాడు ఈ అనువాదకుడు – కొల్లూరి సోమశంకర్.
బుల్లెట్ బండి మీద సవారి కాదా ఈ పుస్తకం? కాదు. అంతేకాదు. ఈ పుస్తకం విపశ్యన (విపాసన)గురించి కూడా మీకు చెబుతుంది.
అచ్చు తప్పులున్నాయి కాని పంటి కింద రాయిలాగా అడ్డుపడవు. ముద్దకి ముద్దకి రాళ్ళని వెతుక్కోనక్కర్లేదు. భాష సాఫీగానే ఉంది.
చదవతగ్గ పుస్తకమే! సందర్భం ఏదైనా బహుమతిగా కూడ ఇవ్వొచ్చు .
ప్రతులకు:
K. Soma Sankar
1-30-28, Tirumalanagar,
Kanajiguda, Secunderabad 500 015.
మొబైల్ ఫోను: +91 99484 64365
ధర : రూ: 120.00
ప్రముఖ పుస్తక విక్రేతలందరి దగ్గిర దొరుకుతుంది. ఒకవేళ లేకపోతే వారిని తెప్పించి పెట్టమని అడగండి. కుదరకపోతే రచయిత ఉండనే ఉన్నాడు. ఆర్డర్ పెట్టండి.
“బెర్నాడ్ షా వ్రాసిన ‘సీజర్ అండ్ క్లియోపాట్రా’ నాటకంలో థియోడాటస్ అనే అతను అలెగ్జాండ్రియా లైబ్రెరి తగలబడిపోతుంటే చూడలేక సీజర్ దగ్గిరకి వెళ్ళి బ్రతిమాలాతాడు. సైనికులని పంపి మంటలార్పమనీ, పుస్తకాలని కాపాడమనీ. సీజరు ససేమిరా అంటాడు.
‘అక్కడాహుతౌతున్నది వట్టి కాగితాల కట్టలు కాదు. మానవజాతి కష్టించి ఆర్జించుకున్న సంస్కృతీ, సంస్కార, సంప్రదాయాలు దగ్ధమౌతున్నాయి. మానవజాతి సంపాదించుకున్న మధుర స్మృతులన్నీ మసైపోతున్నాయి’ అని అక్రోశిస్తాడు ధియోడాటస్.
‘నువ్వేమి చెయ్యకుండా కూర్చుంటే రాబొయ్యే తరాలవారు నిన్ను పుస్తకాల విలువ కూడా తెలుసుకోలేని మూర్ఖుడిగాను, ఆటవిక సైనికుడిగాను జమ కడతారు సుమా!’ అని సీజర్ని హెచ్చరిస్తాడు.
అలాంటి సీజర్లింకా యీ యిరవయ్యో శతాబ్దంలో కూడా ఉన్నారా? అని మనం సందేహించవల్సిన అగత్యం లేకుండా పోయింది: ‘ప్రజాస్వామ్యానికి, వ్యక్తి స్వాతంత్యానికి పట్టుకొమ్మ అని, భూతలస్వర్గం (God’s own country) అని పేరు మోసిన అమెరికా పుస్తకాల మీద బ్రహ్మాండమైన దాడిని ప్రారంభించింది.’ ” అట్లూరి పిచ్చేశ్వర రావు వ్రాసిన విన్నవి – కన్నవి లో నుంచి.
నిన్న జరిగిన సంఘటన నాకు మా నాన్న వ్రాసిన పై పేరాగ్రాఫ్‌ని గుర్తు చేసింది.
కానీ దాని నేపధ్యం వేరు.
నిన్న సాయంత్రం యువ సాహితీ మిత్రుడు అనిల్ బత్తుల (అతను ఈ భూమ్మిద పడకముందే ప్రచురించబడ్డ సోవియట్ పుస్తకాలు అతి ముఖ్యంగా వాటి తెలుగు అనువాదాలని ఇప్పుడు డిజిటల్ ఫార్మాట్ లో ఉచితంగానే అందరికి అందజేయాలనే ఒక ఆశయంతో ముందుకు సాగుతున్నవాడు) నాకు ఫోన్ చేసి, “సార్, పారిస్ పతనం మీ నాన్నగారే కదా అనువదించింది? ఒక పాత ప్రతి ఒకటి ఈ హైద్రాబాద్ బుక్ ఫెయిర్‌లో ఎక్కడో ఉందట! ఇందాక ఫలానా వారు ఫోన్ చేసారు. ఒక్కసారి మిమ్మల్ని కనుక్కుని కన్ఫర్మ్ చేసుకుందామని చేసాను సార్,” అని అన్నాడు.
అతను అడిగింది నిజమే! The Fall of Paris ని వ్రాసింది ఇల్యా ఎహ్రెన్‌బర్గ్ (Ilya Ehrenburg). ఆంగ్లంలో తొలి ప్రచురణ 1940 ప్రాంతాలలో.
దాని తెలుగులో కి అనువదించింది అట్లూరి పిచ్చేశ్వర రావు. సుమారు 840 పేజిలు. తెలుగులో ప్రచురణ కాలం మార్చ్ 1960.
సరే, ఇక బుక్ ఫైయిర్ లో పారిస్ పతనం దొరకడానికి, మీ నాన్న వ్రాసిన దానికి, సీజర్ కి ఆ లైబ్రేరి తగలబెట్టడానికి సంబంధం ఏవిటి అనే దానికి వస్తున్నాను.
1980 ప్రాంతాలలో తానా సభలకి వెళ్ళారనుకుంటాను డి. వి. నరసరాజు గారు. తానా పత్రిక లో ఏదో వ్యాసం కోసం వారికి ఫోను చేసినప్పుడు “ఇస్తాను, రండి ఇంట్లోనే ఉన్నాను,” అని అన్నారు. ఆ సందర్భాన్ని కూడ గుర్తు చేసింది నిన్నటి అనిల్ బత్తుల ఫోన్ కాల్.
నరసరాజు గారు అన్నారు కదా, “అనిల్, పుస్తకాలు మన దగ్గిరే ఉంటే లాభం ఏమి ఉంది? అవి ముద్రించింది పది మంది చదవాలనే కదా! మీరు తీసుకు వెళ్లండి. చదవండి. మీ పని అయిపోయిన తరువాత నాకు తెచ్చి ఇవ్వండి. మీరు నాకు ఇవ్వక పోయినా ఫరవాలేదు. ఇంకేవరైనా చదువుతానంటే వారికివ్వండి,” అని.
పదిమంది చదవడానికి పుస్తక భాండాగారాలు అంటే లైబ్రేరిలు ఏర్పడ్డాయి. ఆ భాండాగారాలలోని పుస్తకాలు ఇప్పుడు పదిమందికి అందుబాటులోకి వెళ్లకుండా దొడ్డి గుమ్మంద్వారా ఇలా బజారులోకి వస్తున్నాయ్యా? అది హర్షణీయమా అన్న ప్రశ్న తలెత్తింది నాలో.
మా నాన్న గారి సాహిత్యం పునర్ముద్రణ కోసం నాకు ప్రస్తుతం అందుబాటులోలేని పుస్తకాలకోసం వెతుక్కుంటున్నప్పుడు సాహిత్యాభిమానులలో ఒకరిద్దరు తాము చూసామని దొరికిన రెండు మూడు పుస్తాకాలు సుమారు నాలుగైదు దశాబ్దాల క్రితం ప్రచురితమైన వాటి ప్రతులు కొని పంపారు.
840 పుటల పారిస్ పతనం, 1960 మార్చి ప్రచురణ, (బవుండ్ ఎడిషన్ అనేవారు) ప్రతి ధర 10 రూపాయలు. ఈ రోజు అదే పుస్తకాన్ని బహుశ ఏ 250/- కో 300/- కో అమ్మినా కొనుక్కునే వారున్నారు. ఎందుకంటే అంత ధర పెట్టి ఆ ప్రతిని కొన్నవారిని నేనెరుగుదును.
మనకి తెలుసో, తెలియకో ఇలాంటి అరుదైన పుస్తకాలని ఏదో ఒక విధంగా సంపాదించి ఇలా అమ్ముకోవడాన్ని మనం సమర్ధించాలా అన్నది నా ప్రశ్న. ఏదో ఒక పుస్తకమే కదా అని సరిపుచ్చుకోమంటారా? అలా ఒక పుస్తకంతో మొదలైనది మరి రేపు లైబ్రేరిలను కొల్లగొడితే? పది మంది కి అందాల్సిన పుస్తకాలు ఏ ఒక్కరి అలమారకో పరిమితమైతే అప్పుడేమంటారు?
దయచేసి మీ అభిప్రాయాల్ని క్రింది వ్యాఖ్యలలో తెలియజేయగోర్తాను.
తా. కలం: హైద్రాబాద్ బుక్ ఫెయిర్‌లో ప్రతి అమ్ముడైపోయింది ! చి న.