సినిమా చూడటానికి ఎడ్ల బళ్ళు కట్టుకుని వెళ్ళిన వాళ్ళున్నారు. వైజాగ్ నుంచి మద్రాసుకి ఒకరాత్రంతా ప్రయాణం చేసి వచ్చి సినిమా చూపించమని నన్ను వేధించుకుని తిని సినిమా చూసి అటునుంఛి అటే సెంట్రల్ స్టేషన్‌లో పొగబండికి రిజర్వేషన్ కూడా నాతో చేయించుకుని వెళ్ళిపోయినవారున్నారు.
అటువంటి అవకాశం లేని వారికి అప్పట్లో ఆకాశవాణి వారి సంక్షిప్త శబ్ద చిత్రాలే గతి. ఒకటికి పది సార్లు చూడటానికి అవకాశం లేని వారు, ఎన్టీవోడి డవిలాగు, ఏ ఎన్ ఆర్ ఎస్‌వీఆర్ డవిలాగు కాకుండా అసలు కథ ని ఓల్‌మొత్తం అర్ధం చేసుకోవడానికి, చదివి చూడలేని తోటివారికి చదివి వినిపించడానికి వెండితెర నవలలు భలే పనిచేసేవి. అంతే కాకుండా ఆ వెండి తెర నవల ద్వారా తమ సినిమాలకి కొంత అదనపు ఆకర్షణ ని కూడ తెచ్చుకోవడానికి వాటిని వాడుకున్నారు ఆనాటి చలనచిత్ర నిర్మాతలు, పంపిణీదారులు.
తెలుగు లో వెండితెరనవలకు ఆద్యులు అట్లూరి పిచ్చేశ్వర రావు (12th April 1925 – 26th Sept 1966). వారి తొలి తెలుగు ప్రక్రియ కి తెరతీసినది గౌతమ బుద్ధ లఘుచిత్రం. ఆ బాటనే పయనించినవారు రామచందర్, ముళ్ళపూడి వెంకటరమణ, రావి కొండలరావు, నేటి చలన చిత్ర దర్శకులు వంశీ తదితరులు.
వెండితెర నవలల మీద TV 5 ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తమ “Favorite Five” శీర్షికన ప్రసారం చేసింది. సుమారు పదిహేను నిముషాలు నిడివి ఉన్న ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు.
గమనిక: ఈ ప్రసార కార్యక్రమం పూర్తి హక్కులు TV5 కే చెందుతాయి. నాకు ఎటువంటి సంబంధం హక్కులు లేవు. All rights to this program whether implied or otherwise belong to TV5 or to their respective entities.
ఆ మధ్య ఒక రచయితని అడిగాను, “మీరు ఎందుకు వ్రాస్తున్నారు?” అని.
ఠకీమని చెప్పాడాయన “డబ్బుల కోసం” అని.
మరొకరిని అడిగాను. “అయ్ ఆమ్ ఎక్స్‌ప్రెసివ్” అని జవాబు.
ఆంధ్రులు కాదు తెలుగు వారందరూ అభిమానించే (సినవారు కూడా ఉన్నారు) జవాబు, “రాయక పోతే చచ్చిపోతా”.
సముద్రంలోనుంచి బయటపడి, చెట్టుమీదకి ఎక్కి కిందకి దిగాడు. అన్ని వందల వేల సంవత్సరాలలో, వాడికి శబ్దం చెయ్యడం వచ్చింది. దానికి ఒక లయ ఏర్పచుకున్నాడు. భాష అయ్యింది అది. కథలు చెప్పుకోవడం మొదలయ్యింది. అనుకుందాం! సరే మౌఖికంగా కథలు చెప్పుకుంటున్ననాటి నుంచి బూతులు, అసభ్యపదజాలం వాడుక దేశ కాల పరిస్థితులని బట్టి మారుతునే ఉన్నవి. రోజు ఇంటా బయటా వింటున్నవేకదా?
ఫ్రీడ్‌మన్ అన్నట్టు, డాల్ఫిన్స్ కి , వేల్స్ కీ కూడా భాష ఉంది. మాట్లాడుకుంటాయి. ఏనుగులు, కాకులు, కుక్కలు, పిల్లులు, పాములు అన్నింటికి ఒక భాష వుంది. అన్ని ప్రేమించుకుంటాయి, కాట్లాడు కుంటాయి, తిట్టుకుంటాయి, ఆడుకుంటాయి అన్ని పనులు చేసుకుంటాయి.
“దిద్దుబాటు” తెలుగులో తొలి కథ అని అన్నారు. అబ్బే లేదు..ఇంకా చాలా కథలున్నవి (దాదాపు ఒక తొంభై దాకా అని ఒక అంచనా!) దానికి ముందే అని తెల్ఛేసారు. రేపో, మాపో అవి మనచేతుల్లోకి రానున్నవి. (బహుశ ఈ 2014 లోనే రావచ్చు).దిద్దుబాటు ని షార్ట్‌ఫిల్మ్‌గా కూడా తీసాడు అట్టాడ అప్పల్నాయుడు గారి అబ్బాయి సృజన్.
సరే, దిద్దుబాటుతోనే మొదలు పెడదాం.
మరి ఆ రోజే సాని కొంపలున్నవిగా?
మగాడు తిరుగుతునే ఉన్నాడుగా? ఆవిడ ఇంట్లోనే ఉందిగా?
“కన్యాశుల్కం” నుంచి, ఈ రోజు “వాడి పాకేజి నాకంటే తక్కువలేవే..వాడ్ని నేనెలాచేసుకుంటానే మమ్మీ?” అని ఈ రోజు చదువుకుని,ఉద్యోగంచేసుకున్న యువతి గారాలు పోతోంది.దిద్దుబాటు వెలువడిన సాంఘిక నేపధ్యం ఏమిటి? దేశ కాల పరిస్థితులేమిటి? ఈ రోజు దేశ కాల పరిస్థితులేమిటి? ఎరుపు రోజుల్లో కథకి ఒక సాంఘిక బాధ్యత ఉంది అని అనుకుని వాళ్ళు కథలు, నవలలు, కవితలు, నాటికలు గట్రా వ్రాసుకున్నారు. అవి “గర్జించు రష్యా” రోజులనుకుంటే ఇవి “గాండ్రించు అమెరికా ” రోజులనుకోవచ్చు. మరి మార్పు రాలేదా?మూలింటామె లో లాగా పందొసంత లాంటి వ్యక్తులు లేరా? అంటే ఉన్నారు! ఇప్పుడు కాదు..అనగనగా అప్పుడెప్పుడోనే ఉన్నారు. ఈ రోజు బయటికి వచ్చిందా? కాదే? పల్లెటూళ్ల లో పాలేర్లు, రైతులు, రైతు కూలీలు అయితే, పట్టణాలలో సేల్స్ గరల్స్, ఆఫీసులో క్లెర్క్‌లు వాళ్ళ రాసలీలల మీద ఎన్ని కథలు రాలేదు!
మరి “అరుంధతి” (ఉన్నంతలో – రాజారామ్మోహనరావు – 2012 స్వాతి మాస పత్రికలో) రామారావు పక్కలోకి వెళ్ళలేదేం? (కథ 2012 సంకలనం – సం: వాసిరెడ్డి నవీన్, శివశంకర్ పాపినేని)
కాబట్టి ఆ మార్పుని ఒప్పుకున్నవాళ్ళు ఈ మార్పులని కూడా అంగీకరించాలి.
అలాగే చదవతగ్గ రచన ఏదైనా సరే చదువుతారు. దానికి భాష అడ్డం రాకూడదు. కాని వచ్చేసిందిగా?!
భాషే కాదు. వస్తువులో కూడా మార్పులు వచ్చేసినవి.
* * *
ఈ మధ్య వచ్చిన కథ ఒకటి. ఎబినేజర్ అనబడే ఒక మాదిగ నింబోడి కథ ని వ్రాసింది కాశీభట్ల వేణుగోపాల్.
ఈయన “F” నాలుగు అక్షరాల పదాన్ని ఆంగ్లంలోనే అయినా వాడారు. (ఈ నాలుగు అక్షరాల ఎఫ్ పదం ఏమిటని అడగేవారి కోసం కాదు ఇది వ్రాస్తుంట!) అందులో ఎబినేజర్ పాత్రకి కళ్ళలో ఒక దానికి శుక్లం వచ్చింది. శుక్లాన్ని ఆంగ్లంలో కాటరాక్ట్ అంటారు. కాటరాక్ట్‌ని కొన్ని ప్రాంతలలో కొంత మంది “కన్ను పూసింది” అని అంటారు. శుక్లం ని “కన్ను లో పూత” అని కూడ చెప్పుకుంటారు. అంటే ఈ కథలో ఎబినీజర్ అనే పాత్ర కన్నుపూచింది. కన్నులో పూవు. కన్నులో పూవు ఉంది కాబట్టి ఆ వ్యక్తికి *పూకంటోడు అనే మారుపేరు (నిక్‌నేమ్) ఎగతాళిగా పిలుచుకునే పేరు పెట్టారు.ఆ మారుపేరు తన పాఠకులకు అమోదయోగ్యంకాదని ఒకరో ఇద్దరో సంపాదకులు అభిప్రాయపడ్డారు. ఆ మారుపేరులో వారికి బూతు వినపడింది. అంతే కాదు వారికి అసభ్యంగాను అభ్యంతరకరంగాను తోచింది. రచయితకి ఒక సూచన చేసారు. ఎబినేజర్ “మారుపేరు” (nickname) మార్చండి. ఆ కథని మేము ప్రచురిస్తామని. రచయిత ఒప్పుకోలేదు. రచయిత “మా ప్రాంతంలో అలా కన్నులో పూత అంటే శుక్లాలున్నవాడిని అదే పేరుతో పిలుస్తారు. అది జనబాహుళ్యంలో ప్రచారంలో ఉంది కాబట్టి నేను మీ సూచనను అంగీకరించను. మీరు కథని ప్రచురించకపోయినా ఫరవాలేదు” అంటూ వివరణ ఇచ్చారు.
ఆ పత్రిక సంపాదకులు అంగీకరించలేదు. కాబట్టి ఆ కథని అచ్చులో చదువుకునే అదృష్టం కొంత మంది పాఠకులకి దక్కలేదు. కొంతమంది జాలపాఠకులకి (online readers) ఆ దురదృష్టం కలిగింది. అవును, ఎవరు దీన్ని గురించి మాట్లడుకున్నట్టు కనపడలేదే!?
ఇందులో లచ్చుమమ్మ మొగుడు కామేశ్వరరావు. ఆ లచ్చుమమ్మ వయసు దాదాపు 39 ఏళ్ళు. కాలేజిలో చదువుకునే సరయు ఈ దంపతుల కూతురు. మురళి లచ్చుమమ్మ మేనల్లుడు. డాక్టరి చదువుకుంటున్నాడు. వాడి దృష్టి తన మీదకు “మళ్ళించుకోవడానికి సరయు తిప్పలు. దానిని వదిలి నా పక్క చేరడానికి వాడి చిరాకులు.” అని ఆ తల్లి స్వగతం. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? మురళీ తన మేనత్త తో గడపటానికే వాళ్ళింటికి వెళ్ళడం. ఎందుకని అంటే ఆమెకి “చేతనైంది చెప్తే చచ్చిపోతావ్రా మగడా. కావాలంటే మురళిని అడుగు. నెలకు మూడుసార్లు ఇంత దూరం ఎందుకొస్తాడో తెలుస్తుంది” అనుకుంటుంది. లచ్చుమమ్మ మళ్ళీ మరో మాట కూడా అనుకుంటుంది “అయినా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?” అని.
ఎబనీజర్ పాత్ర వాడి పూకంటోడు అనే పేరు 2014 లోదే. అరుంధతి పాత్ర 2012 లోదే
పునీత పాత్ర 2014 లోదే.
ఈ మూడు కథలని చదువుకున్నవారు ఉన్నారు.
“కీమో” కథలో ఆరు చోట్ల *F* పదం వాడారు రచయిత. అది ఆంగ్ల పదం అయినా సంభాషణలు ఇంగ్లిష్‌లో కాబట్టి ట్రాన్స్‌లిటరేటేడ్ పదం అది. మరి ఇందాక భాష అనుకున్నామే?! మరి ఇక్కడ ఇది కూడా వచ్చేసిందిగా?!
మరో సందర్భం;
ఈ సారి ఏకంగా ఒక వెబ్‌జైన్ సంపాదకుడే వాడేసుకున్నారు F పదాన్ని!
ఆయన మాటల్లోనే “I fucked up so many relationships. I want us to be a success“.
మరి దీనికేమంటారు ?
మరి మంచుపూవు లోని కావేరి కూతురు ప్రియ లో భార్యని చూసుకున్న తండ్రి ఆలోచనలని వెలికి తెచ్చిన రచయిత ని ఏంచెయ్యాలి?మొన్న వేదికసమావేశం లో ఒక ఆంగ్ల కధని పరిచయం చేసాను. Ba-Boon – థామస్ పియర్సన్ వ్రాసిన కథ అది. 2014 లొనే వచ్చిందా కథ. అన్ని తనే అయిన సోదరుడు ఒకానొక దుర్ఘటనకి గురైన తరువాత అతని చెల్లెలు అతనికి తోడై ఉండాల్సిన పరిస్థితి. తన బాయ్‌ఫ్రెండ్‌తో ఒకానొక సందర్భంలో ఒక compromising situation లో వీడియో షూట్ లో పాల్గొంటుంది. ఆ టేప్ తెచ్చుకోవాలి. కొన్ని వందల వీడియో టేపులన్నింటిని చూస్తేగానీ ఏది తనది అన్నది తెలియదు. మరి సొంత అన్నతోనే ఆ వీడియో చూడాలా? ఈ అంశాన్ని ప్రంపంచంలోని ప్రతి ఆంగ్ల పాఠకుడు అంగీకరిస్తాడా?
కొవ్వలి నవలలని జాకెట్లలలో, లంగాలలో, ఓణీలలో దాచుకుని చదువుకునే వారు ఒకనాటి చదువుకున్న స్త్రీలు. అలాగే మధు పుస్తకాలని కూడా దాచుకుని చదువుకునేవారు ఈ జాలం అవతరించకముందు.ఇప్పుడు వస్తున్న ఈ కథలమీద, ఆ కథల కోసం తీసుకున్న వస్తువు మీద, ఆ పాత్రలు వాడిన భాషమీద కొంత మంది పాఠకుల అభిప్రాయాలని చదివిన తరువాత, ఇవన్నీ కూడా సెక్సు అంటే బూతు పదాలు వాడినందుకు వచ్చిన విమర్శలు అనే అనిపిస్తోంది. కొంత మంది అనుకునే బూతు ఆలోచనలు, అవి బయట పెట్టినందుకు వచ్చిన విమర్శలు గానే మిగిలిపోతాయి తప్ప మరొకటి కాదు.
మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా అంతర్జాలం లోనే వెబ్‌జైన్‌లలోనే వెలువడ్డవి. అంతర్జాలానికి ఎల్లలు లేవు. అలాగే అక్కడ స్వేచ్చమీద కట్టడి లేదు.కా రా మాస్టారు అన్నట్టు: ” చీకటిలో ఉన్నా కొందరందులో వెలుగుని గురించి రాస్తారు. వెలుగులో ఉంటూ జీవితం లోని చీకటి గురించి రాస్తారు. వెలుగే తప్ప చీకటిని ఎరుగని వారు అందులోని నీలి నీడలనే చీకటిగాను, మరి కొందరు చీకటి చీకటి కాదని, వెలుగే చీకటి, చీకటే వెలుగని రాస్తారు” ( కా రా రచనలు పుట 379).
ఆయన వ్రాసిన సందర్భం వేరైనా ఈనాటి కథకులకి, పాఠకులకి తెలియాల్సి ఉంది.
ఆంక్షలు పెట్టకండి.వచ్చేవి ఎలాగు వస్తాయి. పొయ్యేవి ఎలాగూ పోతాయి.
మంచి ముత్యాలని ఏరుకోవడమే మీరు చేయగలిగింది!
ఏది మంచి? మీకు ఏది మంచి అని తోస్తే అదే మంచి!!
అప్పట్లో ఇంటర్‌నెట్ లేని రోజుల్లో గ్రీటింగ్ కార్డులతో పుట్టిన రోజులకి శుభాకాంక్షలు, గిట్టిన రోజులకి సందేశాలు కూడా పంపుకునేవారు. ఆ రోజుల్లో కొంచెం చదువుకున్నవారు, మహానగరాలలో ఉండేవారు (భారతదేశంలో) వకీల్స్ వారి గ్రీటింగ్ కార్డులు కొనుక్కుని పంపేవారు. చక్కని సందేశాలతో, ముచ్చటైన బొమ్మలతో కళాత్మకంగా ఉండేవి అవి. గ్రీటింగ్ కార్డులు కూడా కళాత్మకంగా ఉంటాయా అని అడిగేవారితో నాకు అస్సలు పేచి లేదు. అందుకని వారి జోలికి వెళ్ళను. వకీల్స్, ఎలార్ రోజుల్లో వారికి పోటిగా ఆర్చీస్ అనే సంస్థ బయలుదేరింది.
ఆనాటి నవతరం, యువతరం కోసం వాళ్ళు కార్డ్లు మొదలుపెట్టారు. ఆ తరువాత పెన్నులు, గన్నులు, బొమ్మల అమ్మకాలన్నింటిలోకి ప్రవేశించారు. మొదట్లో ఈ గ్రీటింగ్ కార్డులమీద ధరల వివరాలుండేవి కాదు. దుకాణందారు తనకిష్టం వచ్చిన ధరకి అమ్మేవాడు. కొనుక్కునేవాడు..మనసులోనే నిక్కినా నిలిగినా కొనుక్కునేవాడు. తప్పదు. కొంత పీర్ ప్రెజర్ కూడా ఉండేది. రీడర్స్ డైజెస్ట్ చేతిలో లేకపోతే వాడొక వెధవాయ్ అన్నటైపులో అన్నమాట! ఇప్పుడు “చే” బొమ్మతో ఉన్న కాలర్‌లెస్ టీ వేసుకున్నట్టు. (“చే” ఎవరు అని ఆడిగితే, “చీ, చీ..నన్నే అడుగుతావా అని తన తెలియని తనాన్ని దాచుకునే వెధవలున్నట్టు).
అలాంటి రోజుల్లో బ్రతక నేర్చిన మిత్రుడు (వాడు బ్రతకనేర్చినవాడని అంతకుముందే తెలిసింది..అది మరొక కథ) ఎవరి బర్త్‌డేకో గ్రీటింగ్ కార్డ్ కావాలని రావడం..(నాతో సెలక్ట్ చేయించుకోవాలని అప్పట్లో తాంబరం నుంచి బెసెంట్ నగర్ నుండి, పరశువాక్కం లాంటి దూరప్రాంతలనుండి వచ్చేవారు) ఒక చక్కని కార్డుని అసలు ధరకే (లాభాలు లేకుండా..మిత్రుడు కదా?) తీసుకోవడం అయిపోయింది. పాపం డబ్బులిద్దామని పర్సుతీస్తే అందులో అన్ని వంద రూపాయల నోట్లే!
“అలా రా బాస్, టీ తాగి, దమ్ము కొడదాం. హోటల్ వాడు చిల్లర ఇస్తాడులే” అని నన్ను లాక్కువెళ్ళాడు. గోల్డ్‌ఫ్లేక్ కింగ్స్, టెన్స్ పాకెట్ ఆ రోజుల్లో అక్షరాల ముప్పై రూపాయలు. నా షర్ట్ జేబు ఎప్పుడు దానితో నిండుగా ఉండేది. (కొందరిలాగా పాంట్ జేబులో పెట్టుకుని దాచుకోవడం నాకు తెలీదు). సరే, ఒకటి మనవాడికిచ్చాను..నేను ఒకటి అంటిచ్చుకున్నాను. స్పేషల్ టీ ఆ రోజుల్లో మూడు రూపాయలు. ఇద్దరికి ఐతే రెండుకప్పుల నిండా వచ్చేది. ఆ స్పెషల్ టీ తెచ్చిన బేరర్ కి చిల్లరలేక..పావలా టిప్పు. బిల్లు పే చెద్దామనుకున్న మిత్రుడు మళ్ళీ వంద రూపాయల నోటు ఇస్తే..హోటల్ యజమాన్ నవ్వుతూ నా వంక చూశాడు. ఆ మూడు రూపాయలు నేనే ఇచ్చాను. (ఇందాకటి పావలా టిప్పు కూడా నాదే!)
ప్లాట్‌ఫార్మ్ మీద నిలబడి కబుర్లు చెప్పుకున్నాం. ఒక రెండు నిముషాలు. గోల్డ్‌ఫ్లేక్ కింగ్స్ కదా అనేమో మిత్ర గురువు దమ్ము లాగుతున్నాడు..ఫిల్టర్ కూడా కాలిపొయ్యేటట్టుంది. అప్పుడు దానిని చూపుడు వేలు మధ్యవేలు మధ్యన పెట్టుకుని చమత్కారంగా విసిరేసాడు. అది హోటల్ పక్కనే ఉన్న బడ్డికొట్టుముందు వీధిలాంతరు స్థంభానికి తగిలి కింద పడింది.
“సరే బాసు, మళ్ళీ కలుద్దాం”, అంటూ నేను రోడ్డు దాటడానికి కదులుతూ..అతనికి షేక్‌హాండిచ్చి రాబోతుంటే..చెయ్య్ పట్టుకుని ఆపేసి అన్నాడు కదా..”బాసు రెండు రూపాయల కార్డు కొని, మూడు రూపాయల సిగరెట్టు, ఒక స్పెషల్ టీ కొట్టేసాడేంటి వీడు అని అనుకుంటున్నావా?”
అతను అనేదాక ఆ ఆలోచన నా ఊహలోకి కూడ రాలేదు. అప్పుడు వచ్చింది. కార్డు కొన్నానంటాడు అది కూడా ఫ్రీ గానే తీసుకున్నాడు గా అని. అదేమి లేదులే అని నవ్వేసి, చెయ్యి వదిలించుకుని వచ్చేసాను.
అఫ్‌కోర్సు..ఏదో ప్రభుత్వ సంస్థలో లంచం ఇచ్చి ఉద్యోగం సంపాయించుకున్నాడు. ఇద్దరు కూతుళ్ళకి అమెరికా సంబంధాలు చేసాడు. కోట్ల రూపాయల విలువగల భవంతుల యజమాని ఈ రోజు.
ఇదంతా ఎందుకు చెప్పానంటే..ప్రతి వ్యాపారస్థుడు దొంగ కాదు,చీట్ కాదు. వాడికి స్నేహాలు, బంధువులు, ప్రేమలు, అభిమానాలు, నైతిక విలువలుంటాయి! నిన్న ఎవరో ఫేస్‌బుక్‌లో వ్యాపారస్థుడుకి అలాంటివి ఉండవన్న అర్ధం వచ్చే మాటన్నారు, అందుకని ఈ ఏడుపు!
నిండా డేంజరస్ మనుషులుండారు ఈ ప్రపంచంలో. అతి ప్రమాదకారులు వీరు. మాటలతో మనల్ని మాయజేస్తారు. ఇదిగో అంటారు. అదిగో అంటారు. వీళ్ళు మన నోటికి వినిపిస్తారు. చెవులకి చూపిస్తారు. చొంగ కారుతుంటుంది ఒక పక్క. చేతులూపుకుంటూ, కళ్ళు తెరుచుకుని వాళ్ల మాయమాటల దారెంట వెళ్ళిపోయి వాళ్ళు చూపించే ఆ మరో ప్రపంచాన్ని కంటాం! చిన్నపిల్లల్లగా!!
డబల్ ఢమాకా అంటారనుకుంటా..ఒక కథతో మొదలుపెడతాడు, మరో కథ మొదలుపెడతాడు. వాటి చుట్టూ మరో ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ఆ మూడింటీతో పాటు మరో కొత్త అంశం ప్రవేశపెడతాడు. త్రీ డి అంటారే. అలా! కళ్ళు తిరుగుతాయి. ఆ సుడిగుండంలో పడిపోతాం. గిరా గిరా తిరుగుతాం, పడి కొట్టుకుపోతాం. మన లోపలికి నీళ్ళేళ్ళిపోతాయి. మరో కొత్త భాష! మరో కొత్త కోణం. మరో కొత్త మూలం అవిష్కరింపజేస్తాడు. ఎక్కడో తెల్తాం. అక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది..కాని ఉండలేం కదా! ఒక జీవితం ఉంది కదా? ఒక జీవనం చెయ్యాలి కదా? ఒక జీవిక కావాలి కదా?
కాని అతనికి అదే జీవితం, అదే జీవనం, అదే జీవిక అయ్యింది. సిగ్గు ఎవరికి ఉండాలో మరి?
భగ, భగా, ధగ ధగా మెరుస్తూ కళ్ళు మిరిమిట్లు గొలుపుతుంది., సిడిమొయిలు. అలాంటి లోకం ఒకటి ఉందా? తెలుసుకోవాలంటే వివరాలకు కథ 2013 ని కొనుక్కుని చదువుకోండి! కథకి అద్భుతమైన బొమ్మ గీసినవారు ఏలే లక్షణ్.
ఆదివారం. మార్చ్ 2, 2014. మళ్ళీ SMS. ఆర్టిస్ట్ మోహన్ గారి పిలుపు. మనవాళ్లందరూ వస్తున్నారు. మీరు కూడా రావాలి. మన శేఖర్ కి మనం చెయ్యాలి! సందర్భం శేఖర్ కార్టూనిస్ట్‌గా గోల్డెన్ జూబిలి సెలబ్రేషన్.
శేఖర్ కార్టూనిస్ట్ గా నే పరిచయం అయ్యాడు ఆంధ్రజ్యోతి లో. కె.పి డెస్క్ పక్కనే. కె.పి ని దాటుకుని శేఖర్ డెస్క్‌కి వెళ్ళాలి. ఆ పక్కనే వసంతలక్ష్మి గారి డెస్క్.
కినిగె కి తన కార్టూన్ పుస్తకాన్ని ఇచ్చిన తొలి కార్టూనిస్టు శేఖర్. అదొక అభిమానం. తరువాత ఎప్పుడో ఒకసారి నా మీద కోపగించుకున్నాడు కూడా! “నాకు మీరు పిచ్చేశ్వరరావు గారి అబ్బాయని ఎందుకు చెప్పలేదు. ఆయనంటే మా తరానికి ఎంత ఇష్టమో, మీకు తెలియదు. అటువంటి వాళ్ళు అంత త్వరగా వెళ్ళిపోవాడనికి హడావుడి ఏమిటో?” అనుకున్నడు స్వగతంగా.
అమెరికా సంయుక్త రాష్ట్రాలకి వెళ్లబోయేముందు, వెళ్ళి వచ్చిన తరువాత తన పుస్తకాన్ని డిజిటల్ బుక్‌గా ఎలా డిజైన్‌చేస్తే బాగుంటుందో అని కలిసినప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. కలవనప్పుడు ఫోన్ చేసేవాడు. ఫోనులో “తింటున్నాన్నా?” అని అడిగి నవ్వేవాడు.
“సార్, మీ ఇంటికి దగ్గిర్లోకి మారుతున్నాను. మనం ఇక రోజు కలుసుకోవచ్చు. బహుశ నేనే మీ ఇంటికి వస్తాను. కలిసి టీ తాగోచ్చు,” అని ఎంతో సంతోషంగా నవ్వుతూ చెప్పినప్పుడు ఆనందమేసింది.
తరువాత ఎప్పుడో తెలిసింది..ఆరోగ్యం బాగోలేదని. ఇంటికి వెళ్ళి పలకరించాలని అనుకునేటప్పడికి ఇల్లు మారడం కూడా ఐపోయింది.
ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో అతని కోసం చూసాను. కొంచెం ఆలస్యం అయ్యింది నేను వెళ్ళేటప్పటికి. మనిషి కనబడలేదు. వెతుకున్నాను. కాప్..నోటికి మాస్క్ అడ్డం ఉంది. ఆ మాస్క్ పైన కళ్ళు. నవ్వు. ఉగ్గబట్టుకున్న ఆనందం. సంతోషం. ప్రెస్‌క్లబ్ నిండిపోయింది. కాని మనిషిని చూసిన నేను ఖంగు తిన్నాను. నాకు తెలిసిన శేఖర్ రూపు కాదది. మనిషి మొఖంలో విపరీతమైన అలసట. సగం అయిపొయ్యాడు. ఎందుకో ఉండబుద్ది కాలేదక్కడ. తనతో మాట్లాడడానికి తగిన ప్రదేశమూ కాదు..సందర్భమూ కాదు. ఈ లోపు ఒకటికి రెండు సార్లు ఫోను చేసిన అన్వర్, sms లు గుప్పించిన ఇతర మిత్రులని పలకరించాను.
హడావుడిగా పరిచయుస్థుడొకాయన వచ్చాడు. పక్కనే శ్రీమతి అనుకుంటాను. పేద్ద పూలమాల. ఒక పుష్ఫగుచ్చం. హడావుడి హడావుడిగా వేదిక దగ్గిరకు దాదాపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపొయ్యారు. ఆఖరి చూపు. పార్ధివ శరీరాన్ని పుష్పమాలంకృతాన్ని చెయ్యాలన్న తాపత్రయం కనపడింది ఆ వేగంలో, ఆ మాటల్లో, ఆ గమనంలో. విరక్తి పుట్టింది.
విజయవాడలో “మో” హాస్పిటల్‌లో ఉంటే..”సార్, ఐపోయ్యిందా? డిక్లేర్ చేసేద్దామా”? అని స్ట్రింగర్స్ శ్రీ శ్రీ విశ్వేశ్వరావు గారిని పీక్కు తిన్న వైనం గుర్తోచ్చింది. మనసు రోసింది. అసహ్యం వేసింది. రోత పుట్టింది.
వెళ్ళిపోదామని వెనక్కి తిరుగుతుంటే..అన్వర్ ఎదురువచ్చాడు. “సార్, వెళ్ళిపోతున్నారా?” అంటూ. ఔనన్నట్టుగా తలూపూతూ గేటు వైపుకి కదులుతుంటే..”వుండండి సార్..రెండు మాటలు మాట్లాడి వెళ్లండి” అని అన్నాడు. వాళ్ళ మధ్య నేనేమి మాట్లాడుతాను అనుకుంటూ నిలబడిపొయ్యాను. “ఉండండి సార్. ఒక్క రెండు మాటలు మాట్లాడండి. తనుకూడా వింటాడు కదా?”అని అన్నాడు. ఇక ఆ మాటకు తిరుగులేదు. సరే అని ఆగి పొయ్యాను.
ఈ లోపు మాట్లాడేవాళ్ళున్నారు. వాళ్ళ తరువాత..అన్వర్ నాకు మైకు ఇప్పించాడు. శేఖర్ వెనకకి చేరుకున్నాను. శేఖర్ భుజం మీద చెయ్యి వేసాను. శేఖర్ నా ముఖంలోకి చూసాడు. మా ఇద్దరి కళ్ళు కలిసినవి. He knows. He knew, I knew. He also knew that my heart is with him. I wished him all the best with all my heart. I expressed my good wishes to all his frineds for supporting him at that time. లేచి నిలబడ్డాడు. కౌగలించుకున్నాడు. That was the parting embrace. I knew.
మైక్ ఆర్టిస్టు మోహన్ గారికిచ్చాను. అన్వర్ కి థాంక్స్ చెప్పాను. వచ్చేసాను.
మా అమ్మ పోయినప్పుడు చలసాని ప్రసాదరావు గారు రాలేదు. దానికి ఆయన చెప్పిన కారణం. “నాకు మీ అమ్మ చక్కగా సంతోషం గా నవ్వుతూ ఉన్నప్పుడు చూసిన జ్ఞాపకం. నాకు అదే గుర్తుంచుకోవాలని ఉంది” అని.
చంద్రశేఖర్ విషయం లో నాది అదే ఉద్దేశం. అందుకే కొడుకు పెళ్ళికి వెళ్ళలేక పొయ్యాను. ఈ రోజు వెళ్ళడం లేదు. ఫోటో కూడ తను నవ్వుతున్నదే పెట్టాను.
ఆ రోజున అన్వర్ నన్ను గుర్తుపెట్టుకుని పిలవకపొతే..నాకు శేఖర్ చిరు దరహసం అందేది కాదు.
గుడ్‌బై శేఖర్. You are a good friend. I shall remember your smile. Always.
ఇది వ్యాపారం కాదు. నేను ఇప్పుడు కినిగె లో లేను కూడా! శేఖర్ పుస్తకాలు ఇవి కొన్ని అని చెప్పడానికి మాత్రమే: http://kinige.com/author/Shekar
పోయిన సంవత్సరం అంటే 2013 లో ఒక పెద్ద రచయిత (“మాకు తెలియకుండా ఎప్పుడు పెద్దవాడైపొయ్యాడు” అని ఒక మరో పెద్దాయన సభాముఖంగానే అడిగాడు అనుకొండి, అది వేరే విషయం!) నన్నో ప్రశ్న అడిగాడు.
కాని నా జవాబు మాత్రం, “నాకు మరో విధంగా ఉండటం చేతకాదు” అని. ఈ ప్రస్థావన ఇప్పుడెండుకంటారా..ఎందుకో గుర్తు వచ్చింది..అద్దంలో నా దంతాలు చూసుకుంటూఉంటే..the last smile is always mine.
నాకు గుర్తున్న బాలు మహేంద్ర ఈ క్రింది బొమ్మలో ఉన్నట్టు ఉండేవాడు.అప్పటికే మూండ్రాం పిరై విడుదలై పోయింది. సఫైర్ కాంప్లెక్స్ లోని ఎమరాల్డ్ లో చూసాను ఆ సినిమాని. సెకండ్ షో. తరువాత సత్యం ధియేటర్స్‌లో చూసాను. శివం లో అనుకుంటాను. తెలుగు సినిమాలలో కెమరా ఒకటి ఉంది, దానితో సినిమాని మనకి చూపించేవాడు కెమరమెన్ అని తెలియజేసిన అద్బుతమైన కెమరామెన్ వి ఎస్ ఆర్ స్వామి అని అనుకునేవాళ్లం నేను నా స్నేహితులం. అలాగే తమిళ సినిమాలకి బాలు.
కూర్చుని ఏదో చదువుకుంటున్నాను. నీడ, తరువాత అలికిడి. చదువుతున్న పుస్తకంలోనుండి తలెత్తి చూస్తే పొడుగ్గా ..నాకంటే ఎత్తు.. అదిగో ఆ బొమ్మలో లాగా ఆలివ్ గ్రీన్ కాప్ తో బాలు. నవ్వుతూ. మామూలుగా సినిమా రంగం వాళ్ళతో వాళ్ల సినిమా గురించి పబ్లిక్ గా ప్రస్తావించేవాడిని కాదు. ఆ రోజున మేమిద్దరమే ఉన్నాం. “మూండ్రాం పిరై బాగుంది. మీ కెమరా అద్భుతం”, అని అన్నాను. చిరునవ్వు తో సమాధానమిచ్చాడాయన. “నేను కూడా చాలా హాపి. అందరికి నచ్చింది. నాకూ నచ్చింది” అన్నాడాయన. తెలుగులో అదే “వసంత కోకిల” గా విడుదలైనది.
ఒక రెండు నిముషాలు అవి ఇవి మాట్లాడుకున్న తరువాత.. “తెలుగు లో గొప్ప సాహిత్యం ఉందంట కదా? ఏమైన మంచి పుస్తకాలు సజెస్ట్ చెయ్యండి అన్నాడాయన. “మీకు తెలుగు చదవడం వచ్చా?” అని ఆశ్చర్యంగా అడిగాను. “ఏం తెలుగు చదవడం నాకు రాకపోతే ఏం? ఎవరితోనైనా చదివించుకుంటానుగా!” అని అన్నాడాయన”.
అలా తెలుగు సాహిత్యం తో ఆయనకి పరిచయం. తెలుగు సాహిత్యం ద్వారా నాకు పరిచయం. ఆయన సినిమాలు అన్ని చూసాను. గొప్ప కెమెరామెన్. నిన్న #pepperspray కథ లేకుండా ఉంటే..బహుశ మన మిడియా వాళ్ళూ ఆయన క్లిప్‌లతో మోత మోగించేవారనుకుంటా!
అరే ఎప్పుడొచ్చావు? బాగులు గీగులు గట్రా? ఏం తెచ్చావేమిటి?
..
మొన్నొచ్చాను. సరే చూసెళ్దామని..
ఇది బాగుందే..తీసుకెళ్ళనా?
అరే..ఒక రెండు రోజుల ముందు అడిగిఉంటే బాగుండేది..ఎవరికో ప్రామిస్ చేసాను..ఐనా నాకు తెలుసు..మన స్నేహనికి ఇదీ అడ్డం రాదని. ఏమంటావ్?
..
నీ దగ్గిరతే ఏం
నా దగ్గిరైతే ఏం..ఒకటేలే..ఐనా పిల్లది చదువుకుంటుందని..
..
ఐనా ఏరా? ఇంటికి వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రాకుడదని తెలియదా?
కనీసం ఒక అరడజను అరటి పళ్ళన్నా తెచ్చిఉండచ్చు కదరా? నాకీ తిప్పుడు తప్పేది!
చదివిన కొన్ని వేల పుస్తకాలనుండి, అక్కడొక అధ్యాయం, ఇక్కడొక పేజి, మరెక్కడినుండో ఒక పేరా, మరో చోట నుండి ఒక పదబంధం తో అద్భుతమైన అనుభవాలతో ఏర్చి కూర్చిన పూలదండ కాదిది.
శిల్పం, శైలి, ప్రక్రియలతో కథనంకు కావల్సిన దినుసులతో పాఠకులను అలరించాలని వండి వార్చినది అంతకంటే కాదు. వారేవరో అడిగినట్టు..ఒక మంచి సంపాదకుడు చెక్కిన శిల్పం అసలే కాదు.
జీవితం అలవోకగా, నిర్లక్షంగా, విదిల్చిన గాజుపెంకులు హృదయపు మాంసపు ముద్దలమీద గీసిన గాట్లనుండి, స్రవిస్తున్న రక్తపుబొట్లతో తడిచి పోతున్న పచ్చి గాయాలనుండి జారి పడిన మాటలివి.
ఆఫ్సర్ కి కృతజ్ఞతలతో..
పాదసూచికః ౩౧ మార్చ్ ౨౦౧౭ తో బహశ సారంగ సర్వర్స్ డౌన్ అయిపోతాయి. అందుకని నా స్వంత గూగుల్ డైవ్ కి ౨౮ మార్చ్ న లంకె ఇఛ్హాను.