మనసుంటే మార్గముంటుంది!

eenaaDu, vipula, chatura etc


1908, సెప్టెంబరు 9 బుధవారం. వినాయక చవితి పండగ రోజు. ముంబై లో ఆ రోజున ఆంధ్రపత్రిక – వారపత్రిక గా మొదలైంది. వ్యవస్థాపకులు కాశీనాథుని నాగేశ్వరావు పంతులు.  ముంబై నుండి 1914 లో మద్రాసు – ప్రస్తుతం చెన్నై కి వెళ్లింది ఆంధ్రపత్రిక. ఇసబెల్లా హాస్పిటల్, లజ్ కార్నర్ కి మధ్యలో నాగేశ్వరరావు పార్క్ వుంది. దానిని ఆనుకునే అమృతాంజన్ (ఆయుర్వేదం తైలం) నొప్పికి వాడే మందు కర్మాగారం కూడా అ పక్కనే వుండేది. (నాన్నతో కొన్ని సాయంత్రాలు ఆ పార్క్ లో గడిపాను నేను.) మద్రాసులో ఆ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుండి ఆ దినపత్రికతో బాటు ‘అంధ్ర పత్రిక’ వారపత్రిక కూడ వెలువడడం మొదలైంది.  దాదాపు దశాబ్దం తరువాత అంటే జవరి 1924 లో ‘భారతి‘ మాసపత్రిక వెలువరించారు నాగేశ్వరావు పంతులు గారు.

భారతియందు భాష, వాజ్మయము, శాస్త్రములు, కళలు మొదలగు విషయములు సాదరభావముతోఁ జర్చించుటకవకాశములు గల్పించబడును. వాజ్మయ నిర్మాణమునకిపుడు జరుగుచున్న ప్రయత్నములు పరిస్ఫుటము చేయబడును. శిల్పమునకు చిత్రలేఖనమునకు శాసనములకు సంబంధించిన విషయములు చిత్రములతోఁ బ్రచురింపఁ బడును.” అని భారతి సంపాదకులు చెప్పుకున్నారు.

పంతులు గారి మనవడు శివలెంక రాధకృష్ణ గారి హయాంలో ‘భారతి’ ని నిలిపి వేయాల్సి వచ్చింది. కారణం ‘ఆర్ధిక భారం.’ (ఆ రోజుల్లో మద్రాసులో రాణీ బుక్ సెంటర్ మాత్రమే క్రమం తప్పకుండా భారతి ని పాఠకులకి అందించేది. ప్రత్యేక సంచికలను ఒక పదో/పాతిక మందో నెల ముందే ‘బుక్’ చేసుకునేవారు.) కాని ‘భారతి’ ప్రచురణ ఆపడానికి కుదరదు. ఎందుకని? పంతులు గారు ‘అంధ్రపత్రిక’ దినపత్రిక వెలువడినంతకాలం ‘భారతి’ వెలువడాల్సిందే’ అని ఒక నిబంధనని పెట్టారు. మరేం చెయ్యాలి అని యాజమాన్యం ఆలోచించింది. ‘టాబ్లాయిడ్‘ గా వెలువరించాలని నిర్ణయించారు. అలా ‘ఆంధ్రపత్రిక’ దిన పత్రిక లో ఒక ‘బ్రాడ్ షీట్’ ని ‘భారతి’ అని మకుటం పెట్టి ‘టెక్నికల్’ గా ఆపకుండా దానిని నెలకొక సారి ప్రచురించారు. తరువాతి రోజుల్లో మళ్ళీ పుస్తక రూపంలో తెచ్చారు. కానీ ఆంధ్రప్రదేశానికి తరలివచ్చిన తరువాత మొత్తం ‘ఆంధ్రపత్రిక’ మూత పడిపోయింది. దిన పత్రిక, వార పత్రిక, భారతి అన్ని మూత పడ్డాయి.

eenaaDu, vipula, chatura etc
ఆంధ్రపత్రిక, భారతి, ఈనాడు ప్రకటన

ఇటీవలి కాలంలో ‘ఆంధ్రజ్యోతి‘ ఆదివారం ‘సండే’ కి కూడా గ్రహణం పట్టింది. అప్పట్లో పిన్నింగు అని, బైడింగు అని రవాణా సరఫరాలో ఇబ్బందులున్నవని చెప్పి ఆంధ్రజ్యోతి ‘ఆదివారం’ ని దినపత్రికలో టాబ్లాయిడ్ కి మార్చేసారు. ఏది ఏమైనా చివరకి అది మళ్ళీ తన పాత రూపులో వెలువడ్డం సంతోషం. ఈ #కరోనా #కోవిడ్19 గడ్డు కాలంలో కూడా పుటలు తగ్గించినా జాల పత్రికగా దాన్ని వెలువరించింనందుకు #ఆంధ్రజ్యోతి సంపాదకవర్గానికి, యాజమాన్యానికి సాహితీప్రియులు ధన్యవాదాలు చెప్పుకోవాలి. గత కొద్ది వారాలుగా అచ్చులో కూడా ‘ఆదివారం’ ఆంధ్రజ్యోతి అందుబాటులోకొచ్చింది. అందుకు కూడా మనం ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు తెలియజెయ్యాలి.

కొన్ని నెలల క్రితమే ‘సాక్షి‘ దినపత్రిక కూడా ‘సాహిత్యం‘ పేజిని ‘ఫన్ డే‘ లో కి పంపింది. ఆ ‘సాహిత్యం’ పేజి ‘డ్రాప్’ అయినప్పుడల్లా వచ్చే వారం వుంటుందా, వూడుతుందా అని ఎదురుచూసేవాళ్లు పాఠకులు. వాళ్లని నిరాశపరచడమెందుకని ‘పర్మనెంటు డ్రాప్’ అనుకుని, వద్దులే అని దయతో ‘ఫన్ డే’ లో ఒక పేజి ఇచ్చారు. గుడ్డిలో మెల్ల అది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి.  ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రతి సోమవారం ‘వివిధ‘ లో సాహిత్యానికి ప్రాముఖ్యత ఇచ్చి అందజేస్తోంది.  ఇంకా కొన్ని తెలుగు దిన పత్రికలు కూడా ఆదివారం మాగజైన్ సంచికలు వెలువరుస్తున్నవి. ఉదాః విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవతెలంగాణ, వార్త, సూర్య, దర్వాజ, నమస్తే తెలంగాణా ఇత్యాదులు.

మనకి జాలపత్రికలు కూడా తక్కువేమి కాదు. ‘సాహిత్యసేవ’ కోసం సాహితీ ప్రియులు వెలువరిస్తున్నవారున్నారు. ఈమాట (1998 అక్టోబరులో ప్రారంభం), సారంగ (దాదాపు దశాబ్దం క్రితం), కౌముది (2007), సంచిక, నెచ్చెలి, వగైరాలు. ఇవన్ని కూడా ఆయా నిర్వాహకులు ఎటువంటి ఆర్ధికమైన లాభాపేక్ష లేకుండా ప్రచురిస్తున్నారు. ప్రకటనలు సైతం వుండవు వీటిల్లో. సభ్యత్వం / చందా రుసుములు కూడా లేవు.

ఈ అంతర్జ్వాల పత్రికలని వ్యక్తులు నిర్వహిస్తుండగా, ఈనాడు / వసుంధర / రామోజి ఫౌండేషన్ ఆ నాలుగు పత్రికలు; విపుల, చతుర, తెలుగు వెలుగు, బాలభారతం ని కనీసం జాల పత్రికల రూపాన్నైనా వెలువరించలేకపోవడం అన్నది నమ్మశక్యంగా లేదు. విపుల, చతుర లు 1978లో మొదలైనవి. దాదాపు నలభై మూడేళ్ళ క్రిత్రం. అలాగే ‘భాషకు, సాహిత్యాని సేవ చేసేందుకు ప్రత్యేక వేదిక ఉండాలన్న ఉద్దేశంతో 2012 సెప్టెంబరు’ లో తెలుగు వెలుగు పాఠకులకి అందించారు. నా వరకు నేను ఇది తెలుగు వారికి మరో ‘భారతి’ గా వుంటుందని ఆశించాను. అలాగే జరిగింది మూతపడటం విషయంలో. ‘ఇన్నాళ్ళుగా సేవాదృక్పథంతో సాగిస్తూ వచ్చిన ఈ నాలుగు పత్రికలను’ ఈమ్యాగజైన్స్ రూపంలో ఈనాడు నెట్ లో అందుబాటులో ఉంచా‘ రు. కానీ ఈ ఏప్రిల్ నుండి నిలిపివేయడం అన్నది ‘సాహిత్యాభిమానులకు’ జీర్ణం కావడం కష్టం. ఈనాడు లాంటి వ్యవస్థ, మానవవనరులున్న సంస్థ ఈ నాలుగు పత్రికల నిర్వాహణ భారాన్ని మోయలేకపోతుండంటే ఆశ్చర్యంగా కూడా ఉంది. నిజమే #కోవిడ్19 లాంటి అనూహ్యమైన ఆపద మానవజీవితాన్ని అతలా కుతలం చేసింది కానీ ఈ రోజున మనకి కోవిడ్ టీకా అందుబాటులోకి వచ్చింది. వ్యాపారంలో ఒడిదుడుకులుంటాయి. వాటిని అధిగమించడం ఈనాడు లాంటి సంస్థలకు కష్టమేమి కాదు. ఈనాడు కంటే చిన్నవి మనగలుగుతున్న సందర్భంలో ‘మన అమ్మభాష పరిపుష్టత కోసం ఈనాడు, ఈటీవీ, ఈ టీవీ భారత్ లు నిరంతరం కృషిచేస్తునే ఉంటాయని’ మేనేజింగ్ ట్రస్టీ – రామోజీ ఫౌండేషన్ చెప్పినా …తెలుగు సాహితీ చరిత్రలో ఈ పత్రికలు ఆపేయ్యడం విషాదమే. ఇన్నాళ్లుగా ఆయా పత్రికలకి రచనలు పంపుతున్న రచయితలు కూడా నిరుత్సాహానికి లోనయ్యారు ఈ వార్త తెలుసుకుని. పాఠకుల ఆదరణ తగ్గింది అన్నప్పుడు బహుశ రచయితలు కూడా తమ చేస్తున్న రచనల గురించి పునరాలోచించుకోవల్సిన సందర్భం అనిపిస్తుంది. మనసుంటే మార్గముంటుంది! కనీసం జాలపత్రికల రూపంలో ఐనా ఈ నాలుగు పత్రికలని బ్రతికించమని రామోజీ ఫౌండేషన్ ని కోరడమే ఒక సాహిత్యాభిమానిగా నేను చెయ్యగలిగింది!

▓► ఆంధ్రపత్రికకి సంబంధించిన వివరాలకి మూలం తెలుగు వికి. – te.wikipedia.org/

వెండి తెర నవలలు – అట్లూరి పిచ్చేశ్వరరావు

సినిమా చూడటానికి ఎడ్ల బళ్ళు కట్టుకుని వెళ్ళిన వాళ్ళున్నారు.  వైజాగ్ నుంచి మద్రాసుకి ఒకరాత్రంతా ప్రయాణం చేసి వచ్చి సినిమా చూపించమని నన్ను వేధించుకుని తిని సినిమా చూసి అటునుంఛి అటే సెంట్రల్ స్టేష‌న్‌లో పొగబండికి రిజర్వేషన్ కూడా నాతో చేయించుకుని వెళ్ళిపోయినవారున్నారు.

అటువంటి అవకాశం లేని వారికి అప్పట్లో ఆకాశవాణి వారి సంక్షిప్త శబ్ద చిత్రాలే గతి.  ఒకటికి పది సార్లు చూడటానికి అవకాశం లేని వారు,  ఎన్టీవోడి డవిలాగు, ఏ ఎన్ ఆర్ ఎస్‌వీఆర్ డవిలాగు కాకుండా అసలు కథ ని ఓల్‌మొత్తం అర్ధం చేసుకోవడానికి, చదివి చూడలేని తోటివారికి చదివి వినిపించడానికి వెండితెర నవలలు భలే పనిచేసేవి.  అంతే కాకుండా ఆ వెండి తెర నవల ద్వారా తమ సినిమాలకి కొంత అదనపు ఆకర్షణ ని కూడ తెచ్చుకోవడానికి వాటిని వాడుకున్నారు ఆనాటి చలనచిత్ర నిర్మాతలు, పంపిణీదారులు.

Pitcheswara Rao Atluri (1924 - 1966)

తెలుగు లో వెండితెరనవలకు ఆద్యులు అట్లూరి పిచ్చేశ్వర రావు (12th April 1925 – 26th Sept 1966).  వారి తొలి తెలుగు ప్రక్రియ కి తెరతీసినది గౌతమ బుద్ధ లఘుచిత్రం.  ఆ బాటనే పయనించినవారు రామచందర్, ముళ్ళపూడి వెంకటరమణ, రావి కొండలరావు, నేటి చలన చిత్ర దర్శకులు వంశీ తదితరులు.

వెండితెర నవలల మీద TV 5 ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తమ “Favorite Five” శీర్షికన ప్రసారం చేసింది.  సుమారు పదిహేను నిముషాలు నిడివి ఉన్న ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు.

గమనిక:
ఈ ప్రసార కార్యక్రమం పూర్తి హక్కులు TV5 కే చెందుతాయి. నాకు ఎటువంటి సంబంధం హక్కులు లేవు.
All rights to this program whether implied or otherwise belong to TV5 or to their respective entities.

కొత్త వంతెన

“కొత్త వంతెన”

నిన్న సాయంత్రం “కొత్తవంతెన” పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది.  “ఆంధ్రజ్యోతి” దిన పత్రిక సంపాదకుడు.  కె.శ్రీనివాస్, ఈ వ్యాసాలను తొలుత “ప్రజాతంత్ర” పత్రికలో దాదాపు ఒక దశాబ్దం క్రితం ప్రచురించారు.  వాటన్నింటిని ఇప్పుడు మళ్ళీ ఒక సంకలనం కింద “అనేక పబ్లికేషన్స్” ప్రచురించింది.

ఘంటా చక్రపాణి నిర్వహించిన ఈ సభలో “కొత్తవంతెన‌” అచ్చు పుస్తకాన్ని టిజాక్ అధ్యక్షులు కోదండరామ్ ఆవిష్కరించగా,  “కినిగె‌” ఈబుక్ ని ఆచార్యులు జి హరగోపాల్ ఆవిష్కరించారు. రచయిత కె శ్రీనివాస్ కోరిక మేరకు “గొంతు బాగొలె”దంటునే “జై తెలంగాణ” పాటని పాడి ప్రముఖ గాయకుడు అందెశ్రీ సభికులను అలరించారు.

"కొత్త వంతెన‌" - కె శ్రీనివాస్ వ్యాస సంకలనం ఆవిష్కరణ సభ
“కొత్త వంతెన‌” – కె శ్రీనివాస్ వ్యాస సంకలనం ఆవిష్కరణ సభ

వేదికని అలంకరించినవారిలో షాజహాన, జూపాక సుభద్ర, “నమస్తే తెలంగాణ” సంపాదకుడు అల్లం నారాయణ ఉన్నారు.

విరసం సభ్యులు వరవరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సభలో మరో విశేషం ఏమిటంటే, రచయిత శ్రీనివాస్ తండ్రి శ్రీ సింగరాచార్యులు పాల్గొని ప్రసంగించడం.

డా.వింజమూరి తో సరదాగా కాసేపు RainBow FM లో

వైద్యులు వింజమూరి సూర్య ప్రకాశ్ గారు రేపు అంటే

20th, శుక్రవారం2012 రోజున,
Rainbow (Radio channel) AIR FM 101.9 లో

Spreading Lights

కార్యక్రమం గురించి శ్రోతలతో

సరదాగా కాసేపు

పంచుకుంటారు.

మధ్యహ్నాం

1.30 కి

ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.

సరే.  ఇక ఈ డా. వింజమూరి ఎవరు?
Vinjamuri
డాక్టరు గారు.  వైద్యం చేసే డాక్టరు గారు.  కాని వైద్యం కాదు మన సంఘానికి కావల్సింది విజ్ఞానం.  అది పుస్తకాలలో ఉంది కాబట్టి దానిని ముందు ప్రజల మస్తిష్కాలలోకి ఇంజెక్ట్ చేస్తే సంఘం బాగు పడుతుంది అని నమ్మి డాక్టరిని వదిలేసి ఇదిగో ఈ పస్తకాల పూజతో ప్రజలని సేవించుకుంటున్నారు.  ఒక్క రూపాయి అడగరు. నిస్వార్ధంగా చేస్తున్నారు ఈ డాక్టరు వింజమూరి గారు.

Spreading Lights
వారు మొదలుపెట్టిన “Spreading Lights” కార్యక్రమలో ఒక భాగమే పుస్తకాలను చదువుకోవడం. రచయిత తన పుస్తకాన్ని కాని, పాఠకుడు తనకు నచ్చిన పుస్తకాన్ని కాని పది మంది తో ను పంచుకోవడం ఈ కార్యక్రమం విశేషం. భాగ్యనగరం లో ఐతే ప్రకాశ్ చొరవ,కృషి, పట్టుదల పుణ్యమా అంటూ ఇప్పుడు కనీసం పది చోట్ల ప్రతి వారం ఏదో ఒక దరోజున ఈ Spreading Lights కార్యక్రమం జరుగుతున్నది.  నేను కూడా వీటిలో పాల్గొన్నాను.

మీరు కూడా మీ ప్రాంతంలో ఈ Spreading Lights కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు.  మీరు ముగ్గురే ఐనా ఫరవాలేదు.  ముప్పై మంది ఐతే మరీ సంతోషం.  🙂

సరదాగా కాసేపు

ఇక  రేపటి సరదాగా కాసేపు ప్రతి సాహిత్యాభిమాని తప్పక వినదగ్గ రేడియో కార్యక్రమం. నిజమే,ఏ సాయంత్రమో ఐతే బాగుండేది, ఆఫీసులకి వెళ్ళేవాళ్ళకి ఇబ్బందే.

ఐనా వినడానికి ప్రయత్నించండి.

ఇక్కడ పైన ఉన్న చాయచిత్రంలో మీ ఎడమవైపు నుండి రెండో వారు శ్రీ వింజమూరి సూర్య ప్రకాశ్ గారు. (భుజానికి సంచీ తగిలించుకుని ఉన్నారే వారే)