నాకు దేముడంటే ఇష్టం

“ఏవిటి మాస్టారు..చాలా రోజులకి.  ఎలా ఉన్నారు?”
“బాగానే ఉన్నానండి”.
“ఎలా వున్నవి సాహిత్య సభలు, మీ ఊళ్ళో”.
“బాగానే జరుగుతున్నవి”
“నేను ఇప్పుడు మీ ఊళ్ళోనే ఉన్నాను”
“ఈ రోజున ఫలానా చోట “@#$%‌” వాళ్ళ సభ ఉందంట. అక్కడికి  రారాదు.  మనం అక్కడ కలుసుకుందాం”.

తేనీరు
“నాకు దేముడంటే ఇష్టం”

“నేను రాలేనండి”.
“ఏందుకని?  పండితులున్నారంటకదా?”
“ఉన్నారండి..కాని నాకు దేముడంటే ఇష్టం అండి.”
“ఐతే..”
“వాళ్ళు దేముడ్ని తిడతారండి.  నాకది ఇష్టం ఉండదు.  పనిమాలా వెళ్ళి ఆవన్ని వినడం ఎందుకు?  కలవాలనుకుంటే  నేనే మీదగ్గిరకు వస్తాను. కాసేపు కబుర్లు చెప్పుకుందాం”
“రండి.  ఐతే చక్కగా టీలు తాగుతూ కబర్లు చెప్పుకుందాం”.

మంచి మిత్రుడితో స్నేహాం మరోక శిఖరం చేరింది.

చిల్లర

రెండు పదుల నోట్లు ఇచ్చినప్పుడు  చాకలి..’చిల్లర‌’ అని గొణుకున్నప్పుడు మంగళ రావు దృష్టి బట్టల ఇస్త్రీ లెక్ఖల మీద పడింది.  ఈ లోపు అతను చిల్లర తేవడానికి పూరి పాకలోని గది లోపలికి వెళ్ళాడు.

మూడు షర్ట్లూ.  ఒకొక్క దానికి నాలుగు రూపాయలు. మూడు నాలుగులు పన్నెండు రూపాయలు.  తను ఒక పది రూపాయల నోటు, ఒక రెండు రూపాయల బిళ్ళ ఇస్తే సరి పోయేది అనుకుంటూ, పాంటు జేబులో చెయ్యి పెట్టి చూసుకున్నాడు.  నాణేలు లేవు.  తన దగ్గిర అవి ఉండవు కదా!
రెండు నిముషాలు ఐనవి.

చిల్లర

చాకలి వెతుక్కుంటున్నట్టు న్నాడు.

చిల్లర లేదేమో..ఉంచుకోమని అందామనేలోపు అతను చిల్లరున్న కుడి జేతిని జాపుతూ ముందుకి వచ్చాడు. “ఉంచుకో తరువాత తీసుకుంటాలే,”  అని అంటూ మంగళరావు చెయ్యి జాపాడు. “ఉన్నాయ్ సారు”, అంటూ అతను మూడు నాణేలు మంగళరావు చేతిలో బెట్టాడు.  “నేన్నది చిల్లర..డబ్బులు కాదు”, అంటు మంగళరావు డబ్బు అందుకున్నాడు.లెక్ఖబెట్టకుండానే పాంట్ జేబులోకి వదిలాడు వాటిని.

#ghatana

భారతి

శివయ్య, పద్మావతి కి కలిగిన సంతానమే భారతి.  ఆమె చిన్నప్పుడే తండ్రి తాగుడికి అలవాటు పడి అనారోగ్యం తో చనిపోయాడు.  భారతికి అప్పుడు ఐ దారు ఏళ్లు ఉంటాయేమో.   పద్మావతి కూలీ నాలీ చేసుకుంటూ బ్రతికుని వెళ్ళదీసుకుందామనుకునేది.  ఒంటరి ఆడది.  కడుపు మాడ్చుకోవడం కష్టం గా ఉండేది.  దానికి తోడు పిల్లదాని కడుపు కూడా చూడాలి.  సూరి దృష్టి లో ఆమె పడింది.  మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు వేసిన తప్పటడుగు ఆమె జీవితాన్ని మార్చేసింది.  సూరి చేతులు మార్చుకున్నాడు.  పద్మావతి ఇప్పుడు డబ్బుతో సుఖం కొనుకోవచ్చు అనే ఆలోచనతో డబ్బు వెమ్మట పరిగెత్తడం మొదలయ్యింది.  ఆ క్రమంలో భారతిని నిర్లక్షం చేసింది.

తల్లి చేసిన తప్పులన్నింటిని భారతి చెయ్యలేదు.

(ఈ బొమ్మలోని వ్యక్తి భారతి కాదు)

చదువుకుంది. కాపీలు కొట్టింది. మార్కులు సంపాదించింది. మాల్సుకెళ్ళింది. ఉద్యోగాలు చేస్తూన్న షాపులలోనే దొంగతనాలు చేసింది. బస్సులెక్కింది. మగవాడి బలహీనతతో  ఆడుకోవడం నేర్చింది. స్కూటర్లెక్కింది. బైకులెక్కింది. కారులెక్కింది.  సుఖమయ జీవితాన్ని ప్రేమించింది.  సుఖాలు లేని జీవితాన్ని అసహ్యించుకుంది. లేమిని చూసి భయపడింది.  డబ్బుకోసం వెంపర్లాడింది.  కొత్త అలవాట్లు నేర్చుకుంది.  తన విలువలంటు కొత్త భాష్యాలు చెప్పుకుంది.  వాటినే ఆచరించండం మొదలు పెట్టింది.

బస్ స్టాపులో కనపడింది.  స్టేషన్ ప్లాట్ ఫారం మీద వల విసురుతూ కనపడింది.  చివరకు నా ఆఫీసుకే ఉద్యోగం అంటూ వచ్చింది.  ఉద్యోగం కోసం ఏ పనైనా చేస్తానని నొక్కి వక్కాణించింది.

తాడుని తెగేదాకా లాగింది. కట్టు తెగింది. మరి ఇప్పుడు ఏమయ్యిందో? ఎక్కడుందో?

* ఇది వ్రాస్తున్నప్పుడు..ఓ హెన్రి కథ ది గిల్టీ పార్టీ  లో లిజ్జీ గుర్తోస్తోంది.

పదండి ముందుకు..

హేమాంబరధర రావు కి వివాహమయ్యింది.  భార్య పేరు లక్షీకాంతం.  వారికి ఇద్దరు పిల్లలు.  సుభ్రమణ్యేశ్వ రావు పెద్దవాడు.  రెండవ సంతానం కూతురు. కామాక్షి. వాళ్ళుండేది ఆరంతస్థుల మేడ. అంతస్థుకి నాలుగు పోర్షన్లు.  హేమాంబరధర రావు కుటుంబం ఉండేది మూడవ అంతస్థులోని రెండవ పోర్షను. అది లిఫ్ట్‌కి ఎడంగా ఉంటుంది.  దానికి నెలకి అద్దే ఆరు వేల రూపాయలు. మూడు నెలలు అడ్వాన్సు.  మెయింటనెన్స్‌కి ఒక ఐదువందలు.  సుమారుగా ఒక వెయ్యి రూపాయలు నీళ్ళకి అదనంగా కట్టుకుంటారు.

హేమాంబరధర రావు కి ఒక ద్విచక్రవాహనం ఉంది.  హోండా యూనికార్ణ్.  లక్షీకాంతం కట్నంతో పాటు ఆవిడ తండ్రి దాన్ని కూడా అతనికి సమర్పించుకున్నాడు. లక్షీకాంతానికి కాలేజికి వెళ్ళడానికని ఒక ఆక్టివా స్కూటర్ని కూడ ఆయన కొనిచ్చాడు.  అదికూడా ఆమెతోపాటు హేమాంబధరరావు గూటికి చేరింది. ఇక సుభ్రమణ్యేశ్వ రావుకి ఒక బి‌ఎస్‌ఎ స్పోర్ట్స్ మాడల్ సైకిలూ,  కామాక్షి కి ఒక ఏవన్ వారి లేడిస్ సైకిలు హేమాంబరధర రావు తన జీతం డబ్బులతోనే కొన్నాడు. అన్నట్టు హేమాంబరధర రావు అకవుంట్స్ ఎక్జిక్యూటివ్ గా ఇంపెక్స్ కంపెనిలో ఉద్యోగస్తుడు.  తృప్తి సూపర్ మార్కెట్‌లో లక్షీకాంతం ఫ్లోర్ మేనేజరుగా ఉద్యోగం చేస్తోంది.

ఆ నాలుగు అంతస్థులవారికి గ్రవుండ్ ఫ్లోర్‌లోనే పార్కింగ్.  కొంచెం ఫ్రీగా ఉండటానికి భవంతి ముందు రోడ్డు మీద ఆపుకోవచ్చు కాని ఇరుకైనా  అందులోనే పార్కింగ్ చేసుకోవడం వాళ్ళందరికి అలవాటైపోయింది.  ఈ మధ్య ఎవరో జెనరల్ మోటార్స్ వాడి బీట్ కారుని కూడ కొనుక్కున్నారు.   దాంతో పాటే హ్యుండాయి వారి ఎల్ 10 కూడ ఆ పార్కింగ్‌లోకి చేరింది.  అన్ని పోటీలు పడుతునే ఉన్నవి ఆ పార్కింగ్ లో స్థలం కోసం.

సాయంత్రం పూట హేమాంబరధర రావు ఇంటికి చేరేటప్పడికి ఆరు లేదా ఏడు గంటలవుతుంది.  గేట్లు తెరిచే ఉంటవి.  తన బండి దిగకుండానే లోపలికి పోనిస్తాడు హేమాంబరధర రావు.  ఎడమచేతివైపు గోడకి వారగా ,కిటికి క్రింద బండి దిగకుండానే, ఎడమ పాదంతో సైడ్ స్టాండ్ దింపుతాడు.  అదే వూపులో బండి టాంక్ మీద ఉన్న లంచ్ బాగ్‌ని ఎడమచేత్తో అందుకుని కుడిచేత్తో లాక్‌చేసి గిర్రున తిరుగుతూ బండి మీద నుంచి దిగుతాడు. ఒకొక్కసారి ఆ గోడకి ఉన్న కిటికిలోనుంచి మాంచి మసాలా వాసనలు, లేదు తాళింపుల ఘాటు అతనికి అహ్వానం పలుకుతాయి.  కిటికి ఉన్న గోడకి అవతలి వైపు వంట గది.  అందులో సింవాచలం అతని ఆడలేడిసుంటారు. ఆ ఆడలేడిసు గొంతుని ఎప్పుడు హేమాంబరధర రావు విన్నది లేదు.  కాని ఒకొక్కరోజు ఆ గరిటేలు, గిన్నేలు, పళ్లేలు చేసే శబ్దాని బట్టి ఆడలేడిసు సింవాచలంకి ఏంచెబుతున్నారనేది అర్ధం అయ్యేది.  ఆ వంట గది ఆనుకుని ఒక చిన్న గది.  ఆ గదికి ఆనుకుని లిఫ్టు.  ఆ లిప్టుని అల్లుకుంటు పైకి సాగిపొయ్యే మెట్లు.  ఆ మెట్ల క్రింద ఇస్త్రీ బల్ల.  ఆ పార్కింగ్ లాట్‌కి ఏం ఖర్మ మొత్తం ఆ భవంతికే అది కమాండ్ సెంటర్.  సింవాచలం దానికి అధికారి.  పాలు, పళ్ళు, కొరియర్లు, కరెంటు వాళ్ళు, డైనేజి వాళ్ళు, వాటర్ వాళ్ళూ, ఒక్కరేమిటి ఆ భవంతి యజమానితో సహా అందరికి సింవాచలం అక్కడే కనిపిస్తాడు..కలుస్తాడు..చూస్తాడు..మాట్లాడతాడు.

కాని ఆ రోజు సింవాచలం గేటు దగ్గిరే కనపడ్డాడు.  కాని హేమాంబరధర రావు తన యూనికార్ణ్ ని పార్క్ చేసేటప్పుడు అన్నాడు.  “సారు గారు..మీ బండి ని కాస్త ఆ ఎదర పార్క్ చేసుకోండి” అని.  హేమాంబరధర రావుకి అర్ధం కాలేదు ముందు.  అర్ధం ఐన తరువాత ఎందుకన్నట్టు ప్రశ్నార్ధకంగా చూసాడు.  సింవాచలం చిరునవ్వు నవ్వుతూ ” మా బండి వస్తోంది సారు.  మా అబ్బాయి కూడా బైకు కొనుక్కున్నాడండి” అని అన్నాడు.  అతని మాటల్లో అహంకారం కాని మరే కారం లేదు. నేను కూడ మీ అంతస్థుకి ఎదిగాను అని చెప్పక చెప్పడం తప్ప.

హేమాంబరధర రావు మొఖం ఒక్క క్షణం కళ తప్పింది.  అకవుంట్స్ మనిషి కదా! కనపడనీయకుండా నవ్వేసి బండి ని దాదాపు కమాండ్ సెంటర్ దగ్గిరకి తీసుకువెళ్ళి పార్క్ చేసి వెనక్కి తిరిగి సింవాచలం వైపు “చాలా?” అన్నట్టు చూసాడు.  చాలు సార్ అని అనకుండానే మొఖంతో తన అభిప్రాయాన్ని పలికించాడు సింవాచలం.

ఇది జరిగిన మూడో నెలకల్లా మూడవ అంతస్థులోని రెండవ పోర్షన్ ఖాళీ ఐయ్యింది.  అందులోనే హేమాంబరధర రావు ఉండేవాడు.

#ghatana

ABN ఆంధ్రజ్యోతి టి వి చానెల్‌ల్లో రెజ్యుమె మీద నా ప్రోగ్రామ్

మొన్న అంటే జూన్ 15 వ తారిఖున ఏ బి ఎన్ ఆంధ్రజ్యోతి టివి (ABN Andhrajyothy) వారి దిక్సూచి ప్రోగ్రామ్ లో రెజ్యుమె గురించి ఒక అరగంట లైవ్ ప్రోగాం లో పాల్గొన్నాను.  ప్రోగ్రాం సాయత్రం ఐదున్నర నుండి ఆరు గంటల మధ్య జరిగింది.

నేపధ్యం

Continue reading “ABN ఆంధ్రజ్యోతి టి వి చానెల్‌ల్లో రెజ్యుమె మీద నా ప్రోగ్రామ్”

“చెక్ ఎక్కడ ఇవ్వాలి?”

ఒక ఐరోపా బహుళ జాతి సంస్థ కి భారత దేశంలోని హైదరాబాదులో ఒక డెవలప్ మెంట్ సెంటర్ ఉంది. ఆ సంస్థలో సుమారుగా ఒక నూట యాభై మంది దాకా పని చేస్తున్నారు.

అందులో టెస్టర్ ఉద్యోగానికి గత సంవత్సరం “కుమార్” (పేరు మార్చబడినది) ఇంటర్వ్యూకి హాజరయి ఎన్నికయ్యాడు. అతనికి మిగతా వసతులతో బాటే ఆ సంస్థ తాము ఎన్నుకున్న బాంకులో ఒక ఖాతాని తెరిచి పెట్టింది. ప్రతి నెల రెండు, మూడు తారీఖులలోపలే ఆ ఖాతాలోనే అతని జీతం, ప్రోత్సహాకాలు, బోనస్ లు వగైరాలు జమచేస్తున్నది.

బాంక్ ఇచ్చిన డెబిట్ కార్డ్ తో తనకు అవసరమైనప్పుడు అతని తనకి కావలసిన డబ్బుని డ్రా చేసుకునేవాడు. ఆ ఖాతని చూపించి కుమార్ ఒక మోటర్ సైకిల్ ని , ఒక ఆధునికమైన కంప్యూటర్ ని కొనుక్కున్నాడు. మామూలుగా ఋణ సౌకర్యం కలిపించే సంస్థ లు అతని దగ్గిర “పోస్ట్ డెటెడ్” చెక్కులని తీసుకునే ఇచ్చారు. తనకు కావల్సిన మ్యూజిక్ సిస్టం ని కొనుక్కునేటప్పుడు అతని జేబులో డబ్బు సరిపోలేదు. వెంటనే ఆ దగ్గిరలోనే ఉన్న తన బాంక్ ఏ టి ఎం కి వెళ్ళి డబ్బు డ్రా చేసి వారికి ఇచ్చి తన మ్యూజిక్ సిస్టం ని ఇంటికి తెచ్చుకున్నాడు.

సోమ వారం కుమార్ ఆఫీసుకు వెళ్ళలేదు. అతని “లీడ్” కుమార్ కి ఫోన్ చేసి , “ఎందుకని రాలేదు?” అని ఆదిగాడు. నీరసంగా ఉంది అందుకని రాలేకపొతున్నాను అని జవాబిచ్చాడు కుమార్. అతని గొంతులోని నీరసాన్ని గ్రహించిన అతని “లీడ్” జ్వరం ఉందా అని అడిగాడు. “లేదు కాని ..,”అంటూ నసిగాడు కుమార్. లీడ్ రొక్కించి అడిగేటప్పడికి “కుమార్” రెండు రోజులనుంచి ఏమి తినడం లేదు అని చెప్పాడు. “ఏందుకని, ఎమయ్యింది” అని “లీడ్” ఆదుర్దాగా అడిగాడు.

కుమార్ ” డబ్బ్లు లేవు” అని జవాబిచ్చాడు.

“అదేమిటి, జీతం క్రెడిట్ అయ్యిందిగా? మరి ఇంక డబ్బుల ఇబ్బంది ఏముంది?” అని ఆశ్చర్యంగా అడిగాడు.

“ఏ.టి.ఏమ్ . కార్డ్ పోయింది. మరి డబ్బులెలా తీసుకోను” అని అమాయకంగా అడిగాడు, కుమార్.

“చెక్ బుక్ ఉందిగా, చెక్ రాసుకుని తీసుకెళ్ళి ఇవ్వు, వాళ్ళు డబ్బులు ఇస్తారు” అని చెప్పాడు “లీడ్ విస్తుపోతు.

“చెక్ ఎక్కడ ఇవ్వాలి?” అని అడిగాడు కుమార్.

కుమార్ పాతికవేల జీతగాడు. ఇంటర్ లో అతను 94% తో పాస్ అయ్యాడు.

అంతర్జాలం (Internet)లో వెదకడానికి కిటుకులు

లో మనం ఉద్యోగంలో చేరుదాం అనుకున్నప్పుడు ఆ కార్పరేట్ సంస్థ గురించి ఎలా తెలుసుకోవచ్చు అన్నది ప్రస్తావన. దానికి గతంలోనే వివరంగా వెబ్ సైట్స్ తో బాటు చాలా సమాచారం ఇచ్చాను. ఇక్కడ అవి కాకుండా గూగుల్ శోధనతో ఎలా తెలుసుకోవచ్చు అన్నవాటికి రెండు ఈ-బుక్స్‌ని ఇచ్చాను. ఈ కిటుకుల ద్వారా మీరు గూగుల్‌ని మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకుని లాభిస్తారని అశిస్తున్నాను.
గూగుల్ సెర్చ్‌ని శక్తివంతంగా ఉపయోగించడానికి (తెలుగులొ) ఇక్కడ చూడండి.
దీనిని అందించిన వారు: శ్రీధర్ చందుపట్ల
శ్రీధర్ చందుపట్ల గారికి కృతజ్ఞతలు.
గూగుల్లో వెదకడానికి గూగుల్‌వారి గైడ్ (ఇంగ్లిష్‌లో) ఇక్కడ చూడండి.
ఇక్కడ పై రెండు ఫైల్సు మీరు డవున్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.
రెండు ఉచితమే!

Assistant Editor – వెం‌టనే కావాలి


జనవరిలో ప్రారంభంకానున్న ఒక దినపత్రికకు అనుబంధంగా ప్రారంభించబడుతున్న web portal కి Assistant Editor కావాలి.

తెలుగు బాగా వచ్చా?
English ఇంకా బాగా వచ్చా?
అరె! మీకొసమే ఎదురుచూస్తున్నాము!

అంతర్జాలం దానికి సంభందించిన విషయాలమీద పూర్తి అవగాహన ఉందా? Portal సు వాటి content మీద మీకంటు కొంత స్వంత అభిప్రాయాలున్నవా? అవి పంచుకోగలరా? అనుభవం కూడా వుందా?
అయ్యొ. మరి ఇంకా అక్కడే నిలబడ్డారేం?

మీకు దాదాపు పాతికేళ్ళ వయసుందా?
ఐతే మీరు అర్హులే!

కనీసం graduation పూర్తి గావించారా?
ఐతే మరి ఇంక ఆలస్యం ఎందుకు?
అప్లై చెయ్యండి!

పగలే నండి ఉద్యోగం. Portal అన్నాంగదా?

జీతం ఎంతంటారా?
మీ ఉత్సాహము, అనుభవాన్నిబట్టి కనీసం నెలకి పది, పదిహేను వేల మధ్య ఉంటుంది?

ఉద్యోగం ఎక్కడంటారా?
భాగ్యనగరంలోనే!

మీకీ ఉద్యోగ అఖర్లేదా?
సరే మీకు తెలిసిన వాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే వారికి చెప్పి అప్లై చెయ్యమనండి.

ఫొనెందుకండి?

careers AT thus dot in కి
Subject లైన్‌లో Assistant Editor
అని వ్రాసి మీ అప్లికేషన్ పంపండి.

* reference ఇస్తే బాగుంటుంది. మా పనిని సులభంగా చేసుకోగలుగుతాం!

ప్రతి అప్లికెషన్‌కి జవాబు ఉంటుంది.
Waiting లొ పెట్టం.

ప్రైవేటు రంగంలొ రిజర్వేషన్లు ఉండాలా?

యూ.పి ముఖ్యమంత్రి మాయావతి ప్రైవేట్ రంగంలొ కూడా రిజర్వేషన్లను అమలుపరచడానికి తగిన పనులన్ని పూర్తి చేసుకుంది. (ఈ వార్త ఇక్కడ).

* ఏవరేవరికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తున్నయి?
వెనుకబడ్డ కులావారికి, ఆర్ధికముగా వెనుకబడివున్నవారికీ ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.

* ప్రైవేటు రంగంలొ ఏయే సంస్థలు ఈ రిజర్వేషన్లు పాటించాలి?

1 – కొత్తగా స్థాపించే సంస్థలకు మాత్రేమే ఇది వర్తిస్తుంది.

2 – ప్రభుత్వంలోని ఏ శాఖనుండిగాని, భూమిగాని, ఏదేని గ్రాంట్ గాని, కట్టే శిస్తులలో రాయితిగాని మరేవిధంగానైన సహాయంగాని పొందిన సంస్థలు ఈ రిజర్వేషన్లను అమలు పరచాలి.

* మరి ఏమేరకు ఈ సంస్థలు రిజర్వేషలని అమలు చెయ్యాలి?

30 శాతం దాక అమలు చెయ్యాలి.

సంభందిత శాఖా, రాష్త్ర కార్మిక శాఖ, ఆ సంస్థ యాజమాన్యం రిజర్వేషన్ని సరిగ్గా అమలుపరుస్తుందాలేదా అన్నది పర్యవేక్చ్చిస్తుంటయి.

మన ముఖ్యమంత్రిగారు కూడా దానిని మన రాష్త్రంలో కూడా ప్రయోగించి పాటించడానికి కసరత్తులు మోదలుపెట్టారు.
(ఈ వార్త ఇక్కడ).
యూ.పి వారి పాలసి విధి విధానలని తెప్పిస్తున్నారు. కూలంకషంకా దానిని పరిశీలించి బహుశ
ఈ రాష్ట్రానికి కావల్సిన, చేయాల్సిన మార్పులు చేర్పులు చేసి తగిన చట్టాన్ని అమలులోకి తీసుకువస్తారు.

దీనికి మరి మీరు ఏమంటారో తెలియజేయగలరా?