కుక్క బిస్కత్తులు కుక్కలు తింటాయ్.
యజమాని బిస్కత్తులు ఎప్పుడు విసురుతాడా అని ఎదురుచూస్తూ ఉంటాయ్.
అచ్చం మనుషుల్లాగానే, నక్కలు, తోడేళ్ళు కూడా ఉంటాయి, కుక్కల్లాగా తింటాయి!
కాని సింహం అలా కాదు.
ఎవరో వొచ్చి పెడతారని ఎదురు చూడదు.
ఆకలి వేస్తేనే వేటాడుతుంది.
ఆకలి వేసినప్పుడు సింహాం పంజా విసురుతుంది.
మెడని విరిచి, చంపి తాపీగా తింటుంది.
తను తినగా మిగిలితే వదిలేస్తుంది.
కడుపునిండినా కుక్కుకుంటూ కూర్చుని తినదు.
నక్కలకి తోడేళ్ళకి, రాబందులకి, డేగలకి ఇతర ప్రాణకోటికి వదిలేస్తుంది.
కుక్కలాగా మనిషి కాళ్ల దగ్గిర కూర్చుని దేబిరిస్తూ ఉండదు, సింహం.
సింహం మృగరాజు. రారాజు.
ఏనుగులాగా చచ్చినా బ్రతికిఉన్నా దాని విలువ దానిదే!
జీవించినంత కాలం సింహం లా జీవించాలి!
పాఠకుడే రారాజు
కా రా మాస్టారు ని అడిగాను, “చదవగలుగుతున్నారా?” అని. “ఇబ్బందిగానే ఉంది. ఇదివరకటిలాగా ఏకధాటిగా చదవలేక పోతున్నాను. ఐనా మధ్య మధ్య ఆపి కళ్ళకి కాస్త విశ్రాంతినిస్తూ చదువుతూనే ఉన్నాను. చదవకపోతే ఎలా? ఊపిరి ఆడదుగా?! మీకు తెలియందేముంది ?” అని అన్నారు. అప్పటికి వారికి సుమారు 86 ఏళ్ళు అనుకుంటాను. ఐనా చిన్న స్టూలు లాక్కుని దానిమీద కెక్కి నిలబడి, అటక మీదున్న కొన్ని పుస్తకాలని అందుకుని, దిగి తీసుకువచ్చి మీరు చదవాలని నాకు అందజేసారు. చదవడం మీద ప్రేమ అది.
“అదిగో, దానితో చదువుతున్నాను” అంటూ టేబుల్ మీదున్న భూతద్దాన్ని చూపించారు త్రిపుర, అదే ప్రశ్నని వారిని అడిగినప్పుడు. అది చూసినప్పుడు, “సమగ్ర ఆంధ్ర సాహిత్యం” కోసం భూతద్దం తో కుస్తీపడుతున్న ఆరుద్ర గుర్తు వచ్చారు. “చెక్కుల మీద సంతకాలు పెట్టగలుగుతున్నారా?” అని అడిగాను. “నా కోడి కెలుకుడిని మా బాంక్ వాళ్ళు సంతకం క్రిందే భావిస్తున్నారు. ఐ యాం థాంక్‌ఫుల్ టు దెం” అని అన్నారు త్రిపుర నవ్వుతూ. చదవకుండా, రాయకుండా ఎలా ఉండగలరు ఎవరైనా అన్నది వారి ప్రశ్న. చదవడం మీద ప్రేమ అది.
“ప్రతిరోజు నెట్ ని ఎప్పుడో ఒకప్పుడు చూస్తూనే ఉంటాను. కంప్యూటర్ మీద, నా రచనలన్నింటిని నేనే టైప్ చేసుకుంటాను నాకు ఇబ్బంది ఏమి లేదు. ఇంటర్నెట్ లో చదువుకుంటాను కూడా”, అని అన్నారు మొన్న “పెద్ధిభొట్ల సాహితీ పురస్కారం” అందుకున్న రచయిత్రి సత్యవతి పోచిరాజు. చదవడం మీద ప్రేమ అది.
“టాంక్ బండ్ మీద వెళ్తున్నప్పుడు వచ్చింది..ఒక ఫ్లాష్ లాంటి ఆలోచన. బండి అపేసి, పక్కనే లాన్‌లో కూర్చుని లాప్‌టాప్ మీద అప్పటికప్పుడు వ్రాసిన కధ “వర్డ్ కాన్సర్” అని తెలియజేసిన పాత్రికేయురాలు – వర్ధమాన రచయిత్రి అరుణ పప్పు. వ్రాయడం, చదవడం మీద ప్రేమ అది.
తెలుగు ఆచార్యులు. మల్లీశ్వరి గారు ఆన్‌లైన్‌లో వ్రాసుకున్న బ్లాగులను ఏర్చి కూర్చి “జాజిమల్లి” బ్లాగు కథలు గా ప్రచురించింది పర్‌స్పెక్టివ్ ప్రచురణ సంస్థ.
ఆ మధ్య ఒక పుస్తక ఆవిష్కరణ సభకి హైద్రాబాదు నుండి సకాలంలో అచ్చు పుస్తకాలు అమెరికాలో అందకపోతే, “ప్రింట్ ఆన్ డిమాండ్” సాంకేతిక పరిజ్ఞానంతో అక్కడే తెలుగు పుస్తకాలన్ని అచ్చొంతించి ఆ ఆవిష్కరణ సభని నిర్విఘ్నంగా, విజయవంతంగా నిర్వహించుకున్నారు.
కేంద్ర సాహిత్య అకాడెమి లాంటి ప్రచురణ సంస్థలు కూడా ఈ నాడు రచయితలు తమకు పంపే రచనలను సాఫ్ట్‌కాపీలుగానే పంపమని కోరుతున్నవని గమనించాలి.
ఈ రోజు అదిలాబాదు లో తను రాసిన రచన ని ఆన్‌లైన్‌లో తన లాప్‌టాప్‌నుండే ఈపబ్లిష్ చేసుకుంటున్నాడు తెలుగు రచయిత.
అది ఈ రోజు రచనా వ్యాసంగంలో ఉన్న తెలుగు రచయితలు, వారి రచనలు, ప్రచురణల పరిస్థితి.
ఒకప్పుడు హైద్రాబాదులోని కోఠీలోనో, కాచీగూడాలోనో, వైజాగు గుప్తా బ్రదర్స్‌లోనో, విజయవాడ ఏలూరు రోడ్డులోని నవోదయలో నో, మద్రాసు పాండి బజారులోని రాణి బుక్ సెంటర్ లోనో, తెలుగు పుస్తకాలు కొనుక్కుని, మద్రాసు ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్టు నుంచి వెళ్ళే వారు ప్రవాసాంధ్ర పాఠకులు. కాని ఇప్పటి పరిస్థితి వేరు.
ఇల్లినాయ్‌లో ఉంటున్న అన్నయ్య, అదిలాబాదులో తన తమ్ముడికి కావల్సిన పుస్తకాన్ని ఆన్‌లైన్‌లో ఈబుక్ రూపంలో కొని ఈమైల్ ద్వారా పంపిస్తే దానిని డవున్‌లోడ్ చేసుకుని చదువుకుంటున్నాడు ఆ విద్యార్ధి. ఫ్రాన్స్ లో తెలుగు పదాన్ని ఉపయోగించడంలో సంధిగ్ధం ఎదురైతే ఆన్‌లైన్ లో ఆంధ్రబారతికి వెళ్ళి అర్ధం తెలుసుకుంటున్నాడు తెలుగు భాషాభిమాని.
ఇంటర్నెట్ పుణ్యామా అని పుస్తకాలకోసం ఇది వరకటిలాగా గంటల సేపు ప్రయాణాలు, రోజుల తరబడి విలువైన సమయాన్ని వెచ్చించి వెతుక్కోవడం తగ్గింది. ఆన్‌లైన్ లో ఈబుక్స్ మాత్రమే కాదు, అచ్చు పుస్తకాలు కూడా కొనుక్కోవచ్చు, బంగారం, బస్సు, టికెట్లు లాగా. కొనుక్కోవడమే కాదు, అద్దెకి కూడా తీసుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల మీద దాడికి అమెరికా ఉపయోగించిన “డ్రోన్” ల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్న నవతరం “డ్రోన్” తో పాఠకుడు కోరుకున్న అచ్చు పుస్తకాన్ని అతని ఇంటికే అతి తక్కువ ఖర్చుతో అందే ఏర్పాట్లు చక చకా సాగుతున్నవి.
మనవడితో మాట్లాడుకోవడానికి బామ్మ “టాబ్‌లెట్” తో కుస్తీ పడుతోంది. మనవరాలికి తెలుగు నేర్పడానికి “స్మార్ట్‌ఫోన్” ఆప్స్‌ని ఆశ్రయిస్తున్నాడు తాత గారు. సీరియల్స్ వచ్చి తెలుగు పుస్తకాలని పక్కకి నెట్టేసింది అనడం ఫాషన్ అయి’పోయింది’.
తెలుగు పాఠక ప్రపంచం దినదినాభివృద్ధి చెందుతున్నది. అంది పుచ్చుకోవలసిన వారు, రచయితలు, ప్రచురణ కర్తలే! వారిదే ఆలస్యం! పాఠకుడే రారాజు, ఈ రోజున!
గెస్ట్‌కాలం – ఈ రీడింగ్
ఈ రీడింగ్ – ఈజీ రీడింగ్
ఈ వ్యాసం నిన్న సాక్షి దినపత్రిక, ఫామిలీ లో మొదలైన గెస్ట్‌కాలం లో వచ్చింది. పుస్తకాలతో మొదలుపెడితో బాగుంటుందని అని వారనుకుని నన్ను వ్రాయమని కోరారు. ఆ సందర్భంగా వ్రాసిని వ్యాసం ఇది. అన్నట్టు ఈ గెస్ట్‌కాలం ప్రతి బుధవారం వస్తుంది. ఆయా రంగాలలో నిష్ణాతుఁలు వారనికొకరు మీకు అందిస్తుంటారు. ఇక వ్యాసం ఇది. స్థలాభావం వల్ల వ్యాసం కొంత “సంపాదకుల కోత” కి గురైంది. పూర్తి పాఠం తరువాత ఎప్పుడైనా వీలున్నప్పుడు ఇక్కడే పోస్ట్ చేస్తాను.
సూచన: బొమ్మ మీద క్లిక్ చెయ్యండి. సులభంగా చదువుకోవచ్చు
నో
“నాన్న”.
“ఊ..”
“రిటైర్..అయిపోయింతరువాత, ఏం చేద్దామనుకుంటున్నావు?”
“ఇక్కడే ఉంటాను”.
“అలా కాదు, ఒంటరిగా ఇక్కడెందుకు? మా దగ్గిరకు వచ్చి ఉండవచ్చుగా?”
“ఉహూ”.
“ఎందుకని?”
“మీ ఇంటికి వస్తే, నేను మీ హౌజ్ రూల్స్ పాటించాలి. అదే నా ఇంట్లో ఐతే నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. ఇన్ని సంవత్సరాలు నేను, మీ అమ్మ అందరం అలానే ఉన్నాం. మీ ఇంట్లో అలా ఉండటానికి కుదరదు. అందుకని, నో!”
ఆ మాత్రం తెలీదూ?
అరే ఎప్పుడొచ్చావు? బాగులు గీగులు గట్రా? ఏం తెచ్చావేమిటి?
..
మొన్నొచ్చాను. సరే చూసెళ్దామని..
ఇది బాగుందే..తీసుకెళ్ళనా?
అరే..ఒక రెండు రోజుల ముందు అడిగిఉంటే బాగుండేది..ఎవరికో ప్రామిస్ చేసాను..ఐనా నాకు తెలుసు..మన స్నేహనికి ఇదీ అడ్డం రాదని. ఏమంటావ్?
..
నీ దగ్గిరతే ఏం
నా దగ్గిరైతే ఏం..ఒకటేలే..ఐనా పిల్లది చదువుకుంటుందని..
..
ఐనా ఏరా? ఇంటికి వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రాకుడదని తెలియదా?
కనీసం ఒక అరడజను అరటి పళ్ళన్నా తెచ్చిఉండచ్చు కదరా? నాకీ తిప్పుడు తప్పేది!
మాలతీ చందూర్ – మద్రాసు – ఒక స్మృతి
మొన్న జనవరి లో కలిసాను మాలతీ చందూర్ గారిని. వారింట్లోనే. కచేరి రోడ్డు లో, మైలాపూర్‌లో శాంధోమ్ చర్చి కి దగ్గిర్లో. వారింటి పక్కనే ఒక కేరళ వైద్యశాల ఉంటుంది. శ్యామలాంబ గారు వారి సోదరి. నేను, ఆరుద్ర రామలక్షి గారి పిల్లలు, దాశరధి గారి పిల్లలందరం కలిసి చదువుకున్న చిల్డ్ర్‌న్స్ గార్డెన్ స్కూలో లో వారు ఉపాధ్యాయురాలు. దాదాపు మా కుంటుబాలు అన్ని కూడా 4 దశాబ్దాలుగా కలుస్తునే ఉన్నాయి. సాహిత్య సభలు కానివ్వండి, సినిమా ప్రీవ్యూలు కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, వివాహాలు కానివ్వండి మరొహటి కానివ్వండి.
చందూరు గారు వచ్చేవారు, హెరాల్డ్ కారులో. మాలతీ గారు కూడ వారితో బాటే. సినిమా సెన్సార్ బోర్డ్ కి వేసే సెన్సార్ షో కి నేను కూడ వెళ్ళేవాడిని. సినిమా నటుడు, ఛంద్రమోహన్ మామగారు, రచయిత్రి తులసి జలంధర గారి తండ్రి , డా గాలి బాలసుందర రావు గారు అద్దెకుండే ఇంట్లో ఒక పక్కగా ఖాళీ స్థలం ఉండేది. దానిలో సాహితీ సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. వాటికి కూడా భార్యా భర్తలు ఇద్దరూ వస్తుండేవారు.
1996 లో మా అమ్మ చనిపోయిన తరువాత ఫోనులో పలకరించుకోవడమే గాని, నేను వెళ్ళి కలిసింది లేదు. కాని మొన్న జనవరిలో వెళ్ళినప్పుడు కలిసాను. సాయంత్రం కలుద్దామనుకుంటే, మరుసరి రోజు ఉదయం కలుద్దామని అన్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో వెళ్ళాను. దాదాపు గంటో గంటన్నరో గడిపాను. మద్రాసులో తెలుగు వాతావరణం, తెలుగు సాహిత్య సభలు, సమావేశాలు, ఆ వాతావరణం, ఆంధ్ర రాష్ట్రం లో సాహిత్యం, సాహిత్య రంగంలో రాజకీయాలు వగైరాలు సాహితి మిత్రుల గురించి వాకబులు, కబుర్లు.
“జగతి” గురించి ప్రస్తావన వచ్చింది. చందూర్ గారు పోగానే “జగతి” ప్రచురణ ని ఆపేసానని చెప్పారు. ఇంతలో నేను వద్దని వారిస్తున్నా వినకుండా “కాఫీ చేసి తెస్తానుండు”, అంటూ మా టీచర్ గారు లోపలికి వెళ్ళారు. “అనిల్ తో మామయ్య గురించి మాట్లాడవచ్చు అంటావా?” అంటూ మాలతి గారు మా టీచర్ గారిని అడగటం..వారు “తనేమన్నా బయట వాడా నువ్వు మాట్లాడకుండా ఉండటానికి” అంటుండగానే..లోపలికి వెళ్ళి ఇంతలావు బైండ్ చేసిన పుస్తకం తీసుకువచ్చారు. అదే “జగతి డైరి”. జగతి నుంచి ఏరి కూర్చిన వ్యాస సంకలనం. చందూరు గారి వ్రాసినవి. ఎంతొ ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో ఆ పుస్తకాన్ని నాకు చూపించారు ఆవిడ. దాదాపు ఒక సంవత్సర కాలం “జగతి” లన్ని ముందేసుకుని వాటిలో ఏరి కూర్చిన సంకలనం అది. అంత పెద్ద పుస్తకానికి ధర కూడ తక్కువే పెట్టారు.
నా భార్య గతించిన విషయం తనకి తెలిసిందని అంటూ తను వ్రాసిన శిశిరవసంతం నవల లో “సంధ్య” గురించి చెబుతూ ఆ నవలని తప్పకుండా చదవమని కోరారు. ఆ నవలలో “సంధ్య” కి కాన్సర్. కాన్సర్ తో చేసిన యుద్దంలో సంధ్య గెలుస్తుంది ఆ నవలలో.
పాత్రికేయురాలు అరుణ పప్పు వ్రాసిన కథా సంపుటి “చందనపు బొమ్మ“కి ఒక పరిచయ సభని మద్రాసులో ఏర్పాటు చేసినప్పుడు ఆ నాటి సాయంత్రం వక్తలలో ఆమె ఒకరు. సినీ రచయిత, కవి భువనచంద్ర, నటి లక్ష్మి, నిర్మాత కాట్రగడ్డ మురారి, ఘంటసాల రత్నకుమార్ తదితరులు ఆ సభలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో తన కోసం ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళి వారితో సంతంకం చేయించుకున్న జ్ఞాపకంగా మిగిలి పోయిన “శిశిర వసంతం” నవల ఇది. కాని నిజ జీవితంలో గెలిచిన మాలతీ చందూర్ కాన్సర్ తో చేసిన యుద్దంలో పరాజిత.
నిజమే
నిజమే.
ధైర్యం ఉండాలి. రేపటి మీద నమ్మకం ఉండాలి.
కాని నమ్మకం ఉంటే చాలదు. దానికి ప్రణాళిక కూడా ఉండాలి. బలమైన పునాదులుండాలి. అసలు చెయ్యవలసిన గమ్యం ఏమిటి అన్నది నిర్ణయించుకుంటే కాని మిగతా విషయాలు తెరపైకి రావు.
నేను నెత్తిక్కెక్కించుకున్నది ఎక్కువ. వాటన్నింటిని నేను గమ్యం చేర్చాలి. చేర్చాలి అంటే నేను రేపు బ్రతికి ఉండాలి. ఉండాలి అంటే ఒక అంచనా, ఒక ప్రణాళిక, ఒక నీయమావళి ఉండాలి. దాని ప్రకారం పనులు మొదలు పెట్టాలి. ముగింపుకి కి త్రోవని ఎర్ఫాటు చెయ్యాలి. మధ్యలో ఆగిపోవలసి వస్తే..అందుకోవడానికి మరొక చేతిని కూడా చూసుకోవాలి.
కాబట్టి ఈ పూట మందులు వేసుకోవాలి. రేపటికోసం ఈ రోజు మందులు వేసుకోవాలి. బ్రతకడందేమున్నది..చెట్లు బతకడం లేదా..కుక్కలు పందులు బ్రతకడంలేదా? కొమ్మచివరనున్న పూవులు వికసించడం లేదా? రాలే లోపు చెయ్యాల్సినవి చాలా ఉన్నవి మిత్రమా!
చెయ్యగలను అన్న ధీమా, ధైర్యంతోనే ఉన్నాను.
రేపు తెల్లవారుఝామున లేచి, ఉదయించే సూర్యుడ్ని చూస్తానన్న నమ్మకంతోనే ఈ పూట నిద్రిస్తున్నాను.
మునగ చెట్టు
మునగచెట్టు
చూసాను.
చాలామందిని చూసాను.
అతి దగ్గిరగా చూసాను.
ఎక్కించిన వాళ్లను చూసాను.
పైకి ఎగదోసి మరి ఎక్కించిన వారిని చూసాను.
చిటారు కొమ్మదాక ఎక్కిన వారిని చూసాను.
ఎక్కిన వారిని చూసాను.
ఎక్కి కళ్ళు మూసుకుని పోయి గుడ్డివాళ్ళైపోయిన వారిని చూసాను.
పైనుంచి క్రిందపడ్డ వారిని చూసాను.
దబ్బున పడ్డ వారిని చూసాను.
కాళ్ళు చేతులు విరిగిన వారిని చూశాను.
నడుములు పడిపోయి జీవితాంతం మంచాలకే బంది ఐపోయిన వాళ్ళని చూసాను.
పడిన వాళ్ళకి అసరాగా ఎవరూ నిలబడని పరిస్థితులని కూడా చూసాను.
వాళ్ళు ఒంటరిగా దుర్భరమైన జీవితాన్ని గడిపి కాల గర్భంలో కలిసిపోయిన వైనాన్ని గమనించాను.
ఇంకా చెప్పాలంటే మునగ చెట్టుకి మిగతా చెట్లకి ఉన్న తేడా కూడా తెలుసుకున్నాను.
దేవదారు వృక్షాలకి, మామిడి చెట్లకి, పూల పొదలకి, గడ్డిపోచలకి మధ్య ఉన్న సారూప్యాలను కూడా తెలుసుకున్నాను.
పైవేవి నేను స్వయంగా అనుభవించి తెలుసుకోలేదు.
జీవితం నాకు నేర్పిన పాఠాలు అవి.
నేను మంచి విద్యార్ధిని అని నా నమ్మకం.
కరెంటు షాక్ కొడుతుందని ముట్టుకుని తెలుసుకోనఖర్లేదు.
నిప్పు ముట్టుకుంటే కాలుతుందని కూడ దానిని ముట్టుకుని తెలుసుకోనఖర్లేదు.
అలాగే మునగ చెట్టు ఎక్కి కింద పడి అనుభవం పొందనఖర్లేని ఒక జీవితం నాకు దొరికింది.
అటువంటి జీవితం నాకు ప్రసాదించిన జ్ఞానం అది.
కాబట్టి నన్ను మునగచెట్టు ఎక్కించడానికి ప్రయత్నించవద్దు.
భంగ పడి మీరు అవమానాల ఊబి లో కూరుకుపోవద్దు.
చక్కగా మీ జీవితాన్ని, హుందాగా, ఆత్మగౌరవంతోను, ఆనందంగాను, సుఖసంతోషాలతో గడపండి.
దయచేసి నన్ను మునగచెట్టు ఎక్కించడానికి ప్రయత్నించొద్దు!
అది మీవల్ల కాదు కదా..మీమ్మల్ని పుట్టించిన ఆ బాబు వల్ల కూడా కాదు!!
పబ్లిక్కుగా బాగానే జరిగింది..ఐనా
ఏదో వెలితి.
తలిశెట్టి రామారావు గారి పేరు విన్నారా?
లేదా?
ఆ మహాను భావుడే తొలి తెలుగు వ్యంగ చిత్రకారుడు (అంటే కార్టూనిస్ట్) అని తెలుగు వ్యంగ చిత్రకారులు నిర్ణయించేసారు. పబ్లిక్కుగానే. ప్రసార మాధ్యమాలకి ప్రకటనలు, పత్రికలలో వ్రాతలు వగైరా అన్ని ఐపోయినవి. ఆయనే తొలి తెలుగు వ్యంగ చిత్రకారుడు అని వూరుకున్నారా? లేదు. ఆయన పుట్టిన మే 20వ తారీఖుని తెలుగు కార్టూనిష్టుల దినోత్సవం గా కూడా నిర్ణయించేసారు. పబ్లిక్కుగానే. అలా అనేసి వూరుకున్నారా? లేదు. ప్రకటించేసారు! ఎలా? పబ్లిక్కుగానే. ప్రసారమాధ్యమాల వారందరూ కూడ తమ తమ శ్రోతలకి, పాఠకులకి, వీక్షకులకి, ఇతరులకి ఆ వార్తని బట్వాడా చేసేసారు. ప్లబిక్కుగానే ఇదంతా!
పైగా ఈ తెలుగు ఈ వ్యంగ చిత్రకారులందరూ కలిసి, ఆయన..ఎవరూ? ఆ తొలి తెలుగు వ్యంగ చిత్రకారుడి పేరు మీద ఒక “తలిశెట్టి రామారావు అవార్డు కార్టూన్ ల పోటి” ని కూడా ఘనంగా నిర్వహించారు. పబ్లిక్కుగానే నండీ! బహుమతులిచ్చారు ఆ పోటీలలో. పబ్లిక్కు గానే! ఎవరు ఇచ్చారండి బహుమతులు. తనికెళ్ల భరణి..చలనచిత్ర వ్యంగ నటుడు (అందామా)! ఎక్కడ? భాగ్యనగరం లోనే!ఎప్పుడూ? ఆ తేదినే! మే 20వ తారీఖునే!! అది కూడ పబ్లిక్కుగానే. పబ్లికే కదండీ నేను, అందుకనే హాజరయ్యానండి, దానికి కూడా!
అయ్యా అది ఐపోయింది.
మొన్న అంటే, 28 న మొదలుబెట్టి, 29, 30 న కూడ మన కార్టూనిష్టు మిత్రులు కార్టూనోత్సవ్ పబ్లిక్కుగా,పబ్లిక్కుకి అందుబాటులో ఉండే పబ్లిక్ గార్డెన్స్‌లో జరుపుకున్నారు.నరేంద్ర లూథర్ గారు, పొత్తూరి వేంకటేశ్వరావు గారు, మరి కె.వి రమణా చారి గారు లాంటి పెద్దల సమక్షంలో 30 వ తారిఖున తమ పెద్దలని ఘనంగా సన్మానించుకున్నారు. పబ్లిక్కు గానే నండోయి!
అందులో ఒక కొత్త ప్రతిపాదన చేసారు. పబ్క్లిక్ గానే నండి. అదేమిటంటే, తమకి గురుతుల్యులైన మరో పెద్ద “కార్టూనిష్టు” పుట్టిన రోజుని తెలుగు కార్టూనిష్టుల దినోత్సవంగా పరిగణించాలని. వారు ఎంచుకున్న “కార్టూనిష్టు” గారి గురించి ఏ ఒక్కరికి అభ్యంతరంలేదు. వారికి జరగవలసిన సన్మానాలు, పురస్కారాలు భవిష్యత్తు లో చేయవలసిని కార్యక్రమాలు చాలానే ఉంటవి. అటువంటి సందర్భంలో ఇటువంటి “ప్రతిపాదన” ఎంత వరకు సమంజసమన్నదే ప్రశ్న! పైగా ఆ “గురువు” గారికి అసలు ఈ విషయం తెలుసా అన్న సందేహం కూడా కలుగుతుంది. తెలిసుంటే వారు సున్నితంగా తిరస్కరించే మనస్తత్వమున్నవారే అని కూడా నా బోటి వారి అభిప్రాయం. ఆ “గురువు” గారే తన “గురువు” గా భావించే మరొ “పెద్ద గురువు” గారు హటాత్తుగా ఆ సభకి వచ్చివుంటే, అప్పుడు గౌరవం వారికే దక్కేదేమో?! పబ్లిక్కుగా అన్నా, అనకపోయీనా నిన్న “కార్టూనోత్సవ్” కి హాజరైన కొంతమంది మిత్రులు ప్రైవేటుగా నాతో తమ అభిప్రాయాన్ని వెల్లడి చేసుకున్నారు.
ఒకరికి తగిలించిన కిరీటాన్ని లాక్కుని మరొకరిని దానిని ధరింపజెయ్యబూనడం ఎంత వరకు సమంజసం?
అందులోను పబ్లిక్కుగా!
తలిశెట్టి వ్యంగ చిత్రాలు ఇక్కడ కినిగె.కాం లో
అబ్బే లేదండి..నేను బతికే ఉన్నాను!
మొన్నామధ్య ఒక పెద్ద రసపోషకుడిగారిని కలిసాను. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉంటే..దురదుంది కదా..సాహిత్య దురద..పుట్టింది. గోక్కుంటూ అలనాటి భారతి గురించి, ఆ నాటి ఆంధ్రభూమి గురించి, అప్పటి అభ్యుదయ గురించి, ఆ రోజుల్లో కాగడ గురించి. కృష్ణాపత్రిక గురించి, సంవేదన, కళ ఈ నాటి సృజన గురించి ఆయన ఒక పది మాటలు మాట్లాడితే నేను ఒక పదం వొదుల్తు..పుసిక్కిన మిసిమి అని అన్నాను.
ఆయన చాల లాఘవంగా దాన్ని ఒడిసి పట్టుకుని, దాన్నీ తిప్పి మళ్ళీ నా మీదకు వదిలాడు, “మిసిమి..సెక్‌సు పత్రికా అది..దాని పేరు వినలేదే ఎప్పుడూ?!” అంటూ. మీరందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది..అక్కడ నా పక్కన ఉన్నట్టైయితే..మీ అందరి ఆరోగ్య భీమా పధకాలన్నింటిని పరీక్షకి పంపాల్సి వచ్చేది. అబ్బే లేదండి..నేను బతికే ఉన్నాను! టపా కట్టేసి ఉంటే ఇక్కడ ఈ టపా ఉండేది కాదు కదా!