ఇంద్రజాలికుడు

వరండాలో నుంచి హాలు గుమ్మందగ్గిరకి వెళ్ళి లోపలికి తొంగి చూడ్డం.  అమ్మ కనపడుతుంది శూన్యంలోకి చూస్తూ.    తన పక్కన అందరూ స్త్రీలే.  అమ్మ కి అటువైపు చాప మీద నాన్న కదలకుండా.  ఎవరి దుఃఖంలో వారు.

నేను బేరుమని ఏడవడం.  ఇవతలికి రావడం. వరండాలో పేము కుర్చిలో కూలబడటం. ఏడుపు.  చూట్టూ ఉన్నవాళ్లలో ఎవరో ఒకళ్ళో ఇద్దరో దగ్గిరకి తీసుకోవడానికి ప్రయత్నించడం.  నేను వాళ్ళని దూరంగా నెట్టివేయడం. కాసేపటికి వెక్కిళ్ళు ఆపుకోవడం.  ఈ లోపు మరెవరో హాలులోకి వెళ్ళడం.  మళ్ళీ లోపలినుండి సన్నగా రోదన మొదలవ్వడం.

అది విని నేను మళ్ళీ బిగ్గరగా ఏడవడం.  వెక్కిళ్ళు.  నా స్నేహితులు ఎవరూ పక్కన లేరు.  ఒంటరిని.  ఎవరి దగ్గిరకి వెళ్ళకుండా నేను ఆ పేము కుర్చిలో కూర్చుని ఏడుస్తున్నాను.  చుట్టూ తెలిసినవాళ్ళు, తెలియని వాళ్ళు, బంధువులు, పరిచయస్తులు అందరూ పెద్దవాళ్ళే.

నా స్నేహితులు ఎవరూ లేరు.
వెనక ఎక్కడో నా మోతి ఏడుపు.

ఆ రాత్రి విలపిస్తూ, రోదిస్తున్నప్పుడు వచ్చాడు ఆయన.  ఏవో వాళ్ళతో గుసగుసలు.  లోపల హాల్లోకి వెళ్ళివచ్చాడు. ఆయన్ని గుర్తు పట్టాను.  ఏమి మాట్లాడలేదు. నేను ఏడుస్తున్నాను.  ఎవరో నా పక్కనే ఒక ఫోల్డింగ్ చెయిర్ వేసారు.  కూర్చున్నాడు, ఆయన.  గుర్తుపట్టాను ఆయన్ని. అంతకుముందు ఏవో స్టూడియోలలో షూటింగులలో చూసాను.  ఆయనంటే ఇష్టం కూడా.  నెమ్మదిగా నా ఎడమరెక్క పట్టుకుని దగ్గిరకు తీసుకున్నాడు.  ఒళ్ళోకి తీసుకున్నాడు.  కళ్ళు తుడిచాడు.  ఏవో అవి ఇవి మాటలు చెపుతున్నాడు.  నేను వినడం మొదలుపెట్టాను.  చేతులు కదిలిస్తున్నాడు.  ఖాళీ అరచేతులు.  గబుక్కున అందులో ఒక కలం కనపడింది.  గుప్పెట మూసాడు. తెరిచాడు.  అరచేతిలో ఏమిలేదు.  మళ్ళీ ఖాళీ.  మరో చెయ్యి చూపించాడు.  అందులో ఉంది కలం.  ఈ సారి నాణేలు.  గుప్పిట్లో చూపించి మూసి తెరిచాడు.  లేవు.  తన షర్ట్ జేబులోకి వెళ్ళిపోయినవి.

నా ఏడుపు ఆగిపోయింది.  మళ్ళీ నాకు ఏవో కబుర్లు చెప్పాడు.  తల నిమిరాడు.  బుగ్గలు నిమిరాడు.  కళ్ళు తుడిచాడు.  నా స్నేహితుడి లాగా బుజ్జగించాడు.

లేచి నిలబడ్డాడు.  ఎవరినో పిలిచాడు. వారికేదో చెప్పాడు.  హాలులో నుంచి ఎవరో వచ్చారు.  వరండా లోనుంచి నన్ను హాల్ లోకి, అటునుంచి పడకగదిలోకి తీసుకెళ్ళారు.  నా మంచం మీద పడుకోబెట్టారు.  దుప్పటి కప్పారు.  నేను అలాగే నిద్రపొయ్యాను.

ఆ తరువాత కూడ ఆయన అప్పుడప్పుడు వచ్చేవారు. అమ్మని నన్ను పలకరించేవారు. కాసేపు కూర్చుని కబుర్లు చెప్పేవారు.  ఆయనే రమణా రెడ్డి.

వ్యాపారస్తుడు దొంగ.

అప్పట్లో ఇంటర్‌నెట్ లేని రోజుల్లో గ్రీటింగ్ కార్డులతో పుట్టిన రోజులకి శుభాకాంక్షలు, గిట్టిన రోజులకి సందేశాలు కూడా పంపుకునేవారు.  ఆ రోజుల్లో కొంచెం చదువుకున్నవారు, మహానగరాలలో ఉండేవారు (భారతదేశంలో)  వకీల్స్ వారి గ్రీటింగ్ కార్డులు కొనుక్కుని పంపేవారు.  చక్కని సందేశాలతో, ముచ్చటైన బొమ్మలతో కళాత్మకంగా ఉండేవి అవి. గ్రీటింగ్ కార్డులు కూడా కళాత్మకంగా ఉంటాయా అని అడిగేవారితో నాకు అస్సలు పేచి లేదు.  అందుకని వారి జోలికి వెళ్ళను.  వకీల్స్, ఎలార్ రోజుల్లో వారికి పోటిగా ఆర్చీస్ అనే సంస్థ  బయలుదేరింది.

ఆనాటి నవతరం, యువతరం కోసం వాళ్ళు కార్డ్లు మొదలుపెట్టారు.  ఆ తరువాత పెన్నులు, గన్నులు, బొమ్మల అమ్మకాలన్నింటిలోకి ప్రవేశించారు.  మొదట్లో ఈ గ్రీటింగ్ కార్డులమీద ధరల వివరాలుండేవి కాదు.  దుకాణందారు తనకిష్టం వచ్చిన ధరకి అమ్మేవాడు.  కొనుక్కునేవాడు..మనసులోనే నిక్కినా నిలిగినా కొనుక్కునేవాడు.  తప్పదు.  కొంత పీర్ ప్రెజర్ కూడా ఉండేది.  రీడర్స్ డైజెస్ట్ చేతిలో లేకపోతే వాడొక వెధవాయ్ అన్నటైపులో అన్నమాట!  ఇప్పుడు “చే” బొమ్మతో ఉన్న కాలర్‌లెస్ టీ వేసుకున్నట్టు.  (“చే” ఎవరు అని ఆడిగితే, “చీ, చీ..నన్నే అడుగుతావా  అని తన తెలియని తనాన్ని దాచుకునే వెధవలున్నట్టు).

వ్యాపారస్థులందరూ దొంగలు కాదు!
వ్యాపారస్థులందరూ దొంగలు కాదు!

అలాంటి రోజుల్లో బ్రతక నేర్చిన మిత్రుడు (వాడు బ్రతకనేర్చినవాడని అంతకుముందే తెలిసింది..అది మరొక కథ) ఎవరి బర్త్‌డేకో గ్రీటింగ్ కార్డ్ కావాలని రావడం..(నాతో సెలక్ట్ చేయించుకోవాలని అప్పట్లో తాంబరం నుంచి బెసెంట్ నగర్ నుండి, పరశువాక్కం లాంటి దూరప్రాంతలనుండి వచ్చేవారు)  ఒక చక్కని కార్డుని అసలు ధరకే (లాభాలు లేకుండా..మిత్రుడు కదా?) తీసుకోవడం అయిపోయింది.  పాపం డబ్బులిద్దామని పర్సుతీస్తే అందులో అన్ని వంద రూపాయల నోట్లే!

“అలా రా బాస్,  టీ తాగి, దమ్ము కొడదాం. హోటల్ వాడు చిల్లర ఇస్తాడులే” అని నన్ను లాక్కువెళ్ళాడు.  గోల్డ్‌ఫ్లేక్ కింగ్స్, టెన్స్ పాకెట్ ఆ రోజుల్లో అక్షరాల ముప్పై రూపాయలు.  నా షర్ట్ జేబు ఎప్పుడు దానితో నిండుగా ఉండేది.  (కొందరిలాగా పాంట్ జేబులో పెట్టుకుని దాచుకోవడం నాకు తెలీదు).  సరే, ఒకటి మనవాడికిచ్చాను..నేను ఒకటి అంటిచ్చుకున్నాను.  స్పేషల్ టీ ఆ రోజుల్లో మూడు రూపాయలు.  ఇద్దరికి ఐతే రెండుకప్పుల నిండా వచ్చేది.  ఆ స్పెషల్ టీ తెచ్చిన బేరర్ కి చిల్లరలేక..పావలా టిప్పు.  బిల్లు పే చెద్దామనుకున్న మిత్రుడు మళ్ళీ వంద రూపాయల నోటు ఇస్తే..హోటల్ యజమాన్ నవ్వుతూ నా వంక చూశాడు.  ఆ మూడు రూపాయలు నేనే ఇచ్చాను. (ఇందాకటి పావలా టిప్పు కూడా నాదే!)

ప్లాట్‌ఫార్మ్ మీద నిలబడి కబుర్లు చెప్పుకున్నాం.  ఒక రెండు నిముషాలు.  గోల్డ్‌ఫ్లేక్ కింగ్స్ కదా అనేమో మిత్ర గురువు  దమ్ము లాగుతున్నాడు..ఫిల్టర్ కూడా కాలిపొయ్యేటట్టుంది.  అప్పుడు దానిని చూపుడు వేలు మధ్యవేలు మధ్యన పెట్టుకుని చమత్కారంగా విసిరేసాడు.  అది హోటల్ పక్కనే ఉన్న బడ్డికొట్టుముందు వీధిలాంతరు స్థంభానికి తగిలి కింద పడింది.

“సరే బాసు, మళ్ళీ కలుద్దాం”, అంటూ నేను రోడ్డు దాటడానికి కదులుతూ..అతనికి షేక్‌హాండిచ్చి రాబోతుంటే..చెయ్య్ పట్టుకుని ఆపేసి అన్నాడు కదా..”బాసు రెండు రూపాయల కార్డు కొని, మూడు రూపాయల సిగరెట్టు, ఒక స్పెషల్ టీ కొట్టేసాడేంటి వీడు అని అనుకుంటున్నావా?”

అతను అనేదాక ఆ ఆలోచన నా ఊహలోకి కూడ రాలేదు.  అప్పుడు వచ్చింది.  కార్డు కొన్నానంటాడు అది కూడా ఫ్రీ గానే తీసుకున్నాడు గా అని.  అదేమి లేదులే అని నవ్వేసి, చెయ్యి వదిలించుకుని వచ్చేసాను.

అఫ్‌కోర్సు..ఏదో ప్రభుత్వ సంస్థలో లంచం ఇచ్చి ఉద్యోగం సంపాయించుకున్నాడు.  ఇద్దరు కూతుళ్ళకి అమెరికా సంబంధాలు చేసాడు.  కోట్ల రూపాయల విలువగల భవంతుల యజమాని ఈ రోజు.

ఇదంతా ఎందుకు చెప్పానంటే..ప్రతి వ్యాపారస్థుడు దొంగ కాదు, చీట్ కాదు. వాడికి స్నేహాలు, బంధువులు, ప్రేమలు, అభిమానాలు, నైతిక విలువలుంటాయి!  నిన్న ఎవరో ఫేస్‌బుక్‌లో వ్యాపారస్థుడుకి అలాంటివి ఉండవన్న అర్ధం వచ్చే మాటన్నారు, అందుకని ఈ ఏడుపు!

అన్వర్ కి ధాంక్స్‌తో..

ఆదివారం.  మార్చ్ 2, 2014. మళ్ళీ SMS.  ఆర్టిస్ట్ మోహన్ గారి పిలుపు.  మనవాళ్లందరూ వస్తున్నారు.  మీరు కూడా రావాలి.  మన శేఖర్ కి మనం చెయ్యాలి! సందర్భం శేఖర్ కార్టూనిస్ట్‌గా గోల్డెన్ జూబిలి సెలబ్రేషన్.

శేఖర్ కార్టూనిస్ట్ గా నే పరిచయం అయ్యాడు  ఆంధ్రజ్యోతి లో.  కె.పి డెస్క్ పక్కనే.  కె.పి ని దాటుకుని శేఖర్ డెస్క్‌కి వెళ్ళాలి.  ఆ పక్కనే వసంతలక్ష్మి గారి డెస్క్.

కినిగె కి తన కార్టూన్ పుస్తకాన్ని ఇచ్చిన తొలి కార్టూనిస్టు శేఖర్.  అదొక అభిమానం.  తరువాత ఎప్పుడో ఒకసారి నా మీద కోపగించుకున్నాడు కూడా!  “నాకు మీరు పిచ్చేశ్వరరావు గారి అబ్బాయని ఎందుకు చెప్పలేదు.  ఆయనంటే మా తరానికి ఎంత ఇష్టమో, మీకు తెలియదు. అటువంటి వాళ్ళు అంత త్వరగా వెళ్ళిపోవాడనికి హడావుడి ఏమిటో?” అనుకున్నడు స్వగతంగా.

అమెరికా సంయుక్త రాష్ట్రాలకి వెళ్లబోయేముందు, వెళ్ళి వచ్చిన తరువాత తన పుస్తకాన్ని డిజిటల్ బుక్‌గా ఎలా డిజైన్‌చేస్తే బాగుంటుందో అని కలిసినప్పుడు మాట్లాడుకునేవాళ్ళం.  కలవనప్పుడు ఫోన్ చేసేవాడు.  ఫోనులో “తింటున్నాన్నా?” అని అడిగి నవ్వేవాడు.

“సార్, మీ ఇంటికి దగ్గిర్లోకి మారుతున్నాను. మనం ఇక రోజు కలుసుకోవచ్చు.  బహుశ నేనే మీ ఇంటికి వస్తాను.  కలిసి టీ తాగోచ్చు,” అని ఎంతో సంతోషంగా నవ్వుతూ చెప్పినప్పుడు ఆనందమేసింది.

తరువాత ఎప్పుడో తెలిసింది..ఆరోగ్యం బాగోలేదని.  ఇంటికి వెళ్ళి పలకరించాలని అనుకునేటప్పడికి ఇల్లు మారడం కూడా ఐపోయింది.

Cartoonist Chandrasekher
Cartoonist Chandrasekher (Jul 16, 1965 – 19 May 2014)

ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ ‌క్లబ్‌లో అతని కోసం చూసాను.  కొంచెం ఆలస్యం అయ్యింది నేను వెళ్ళేటప్పటికి.  మనిషి కనబడలేదు.  వెతుకున్నాను.  కాప్..నోటికి మాస్క్ అడ్డం ఉంది.  ఆ మాస్క్ పైన కళ్ళు. నవ్వు.  ఉగ్గబట్టుకున్న ఆనందం.  సంతోషం.  ప్రెస్‌క్లబ్ నిండిపోయింది.  కాని మనిషిని చూసిన నేను ఖంగు తిన్నాను.  నాకు తెలిసిన శేఖర్ రూపు కాదది.  మనిషి మొఖంలో విపరీతమైన అలసట. సగం అయిపొయ్యాడు.  ఎందుకో ఉండబుద్ది కాలేదక్కడ.  తనతో మాట్లాడడానికి తగిన ప్రదేశమూ కాదు..సందర్భమూ కాదు.  ఈ లోపు ఒకటికి రెండు సార్లు ఫోను చేసిన అన్వర్, sms లు గుప్పించిన ఇతర మిత్రులని పలకరించాను.

హడావుడిగా పరిచయుస్థుడొకాయన వచ్చాడు.  పక్కనే శ్రీమతి అనుకుంటాను.  పేద్ద పూలమాల.  ఒక పుష్ఫగుచ్చం.  హడావుడి హడావుడిగా వేదిక దగ్గిరకు దాదాపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపొయ్యారు.  ఆఖరి చూపు.  పార్ధివ శరీరాన్ని పుష్పమాలంకృతాన్ని చెయ్యాలన్న తాపత్రయం కనపడింది ఆ వేగంలో, ఆ మాటల్లో, ఆ గమనంలో.  విరక్తి పుట్టింది.

విజయవాడలో “మో” హాస్పిటల్‌లో ఉంటే..”సార్,  ఐపోయ్యిందా?  డిక్లేర్ చేసేద్దామా”?   అని స్ట్రింగర్స్ శ్రీ శ్రీ విశ్వేశ్వరావు గారిని పీక్కు తిన్న వైనం గుర్తోచ్చింది.  మనసు రోసింది. అసహ్యం వేసింది. రోత పుట్టింది.

వెళ్ళిపోదామని వెనక్కి తిరుగుతుంటే..అన్వర్ ఎదురువచ్చాడు.  “సార్, వెళ్ళిపోతున్నారా?” అంటూ. ఔనన్నట్టుగా తలూపూతూ గేటు వైపుకి కదులుతుంటే..”వుండండి సార్..రెండు మాటలు మాట్లాడి వెళ్లండి”  అని అన్నాడు.  వాళ్ళ మధ్య నేనేమి మాట్లాడుతాను అనుకుంటూ నిలబడిపొయ్యాను.  “ఉండండి సార్.  ఒక్క రెండు మాటలు మాట్లాడండి.  తనుకూడా వింటాడు కదా?”అని అన్నాడు. ఇక ఆ మాటకు తిరుగులేదు.  సరే అని ఆగి పొయ్యాను.

ఈ లోపు మాట్లాడేవాళ్ళున్నారు.  వాళ్ళ తరువాత..అన్వర్ నాకు మైకు ఇప్పించాడు.  శేఖర్ వెనకకి చేరుకున్నాను.  శేఖర్ భుజం మీద చెయ్యి వేసాను.  శేఖర్ నా ముఖంలోకి చూసాడు.  మా ఇద్దరి కళ్ళు కలిసినవి.  He knows.  He knew, I knew. He also knew that my heart is with him. I wished him all the best with all my heart.  I expressed my good wishes to all his frineds for supporting him at that time. లేచి నిలబడ్డాడు.  కౌగలించుకున్నాడు.  That was the parting embrace. I knew.

మైక్ ఆర్టిస్టు మోహన్ గారికిచ్చాను.  అన్వర్ కి థాంక్స్ చెప్పాను.  వచ్చేసాను.

మా అమ్మ పోయినప్పుడు చలసాని ప్రసాదరావు గారు రాలేదు.  దానికి ఆయన చెప్పిన కారణం.  “నాకు మీ అమ్మ చక్కగా సంతోషం గా నవ్వుతూ ఉన్నప్పుడు చూసిన జ్ఞాపకం.  నాకు అదే గుర్తుంచుకోవాలని ఉంది” అని.
చంద్రశేఖర్ విషయం లో నాది అదే ఉద్దేశం. అందుకే కొడుకు పెళ్ళికి వెళ్ళలేక పొయ్యాను.  ఈ రోజు వెళ్ళడం లేదు.  ఫోటో కూడ తను నవ్వుతున్నదే పెట్టాను.

ఆ రోజున అన్వర్ నన్ను గుర్తుపెట్టుకుని పిలవకపొతే..నాకు శేఖర్ చిరు దరహసం అందేది కాదు.

గుడ్‌బై శేఖర్.  You are a good friend.  I shall remember your smile.  Always.

ఇది వ్యాపారం కాదు.  నేను ఇప్పుడు కినిగె లో లేను కూడా!  శేఖర్ పుస్తకాలు ఇవి కొన్ని అని చెప్పడానికి మాత్రమే:  http://kinige.com/author/Shekar

ప్రశ్న

పోయిన సంవత్సరం అంటే 2013 లో ఒక పెద్ద రచయిత (“మాకు తెలియకుండా ఎప్పుడు పెద్దవాడైపొయ్యాడు” అని ఒక మరో పెద్దాయన సభాముఖంగానే అడిగాడు అనుకొండి, అది వేరే విషయం!) నన్నో ప్రశ్న అడిగాడు.

Open Smile
How do you like my dentures> 😉

“సార్, మీరేప్పుడు ఇలా అందరితోను నవ్వుతూ, ఫ్రెండ్లిగానే ఉంటారా?” అని. వ్యంగంగా అన్నాడో, వెట ‘కారం’ గా అడిగాడో, స్నేహంగా అనేసాడో, నవ్వు పులుముకుని అడిగాడో నేనైతే అర్ధాలు, కారాలు, మిరియాలు వెతుక్కోలేదు.

కాని నా జవాబు మాత్రం, “నాకు మరో విధంగా ఉండటం చేతకాదు” అని.  ఈ ప్రస్థావన ఇప్పుడెండుకంటారా..ఎందుకో గుర్తు వచ్చింది..అద్దంలో నా దంతాలు చూసుకుంటూఉంటే..the last smile is always mine.

btw how do you like my teeth?  😉

కుక్క బిస్కత్తులు

కుక్క బిస్కత్తులు కుక్కలు తింటాయ్.
యజమాని బిస్కత్తులు ఎప్పుడు విసురుతాడా అని ఎదురుచూస్తూ ఉంటాయ్.
అచ్చం మనుషుల్లాగానే, నక్కలు, తోడేళ్ళు కూడా ఉంటాయి, కుక్కల్లాగా తింటాయి!
కాని సింహం అలా కాదు.
ఎవరో వొచ్చి పెడతారని ఎదురు చూడదు.
ఆకలి వేస్తేనే వేటాడుతుంది.
ఆకలి వేసినప్పుడు సింహాం పంజా విసురుతుంది.
మెడని విరిచి, చంపి తాపీగా తింటుంది.
తను తినగా మిగిలితే వదిలేస్తుంది.
కడుపునిండినా  కుక్కుకుంటూ కూర్చుని తినదు.
నక్కలకి తోడేళ్ళకి, రాబందులకి, డేగలకి ఇతర ప్రాణకోటికి వదిలేస్తుంది.
కుక్కలాగా మనిషి కాళ్ల దగ్గిర కూర్చుని దేబిరిస్తూ ఉండదు, సింహం.
సింహం మృగరాజు.  రారాజు.
ఏనుగులాగా చచ్చినా బ్రతికిఉన్నా దాని విలువ దానిదే!
జీవించినంత కాలం సింహం లా జీవించాలి!

నో

“నాన్న”.
“ఊ..”

“రిటైర్..అయిపోయింతరువాత, ఏం చేద్దామనుకుంటున్నావు?”
“ఇక్కడే ఉంటాను”.

No  నో

“అలా కాదు, ఒంటరిగా ఇక్కడెందుకు?  మా దగ్గిరకు వచ్చి ఉండవచ్చుగా?”
“ఉహూ”.
“ఎందుకని?”

“మీ ఇంటికి వస్తే, నేను మీ హౌజ్ రూల్స్ పాటించాలి.  అదే నా ఇంట్లో ఐతే నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను.  ఇన్ని సంవత్సరాలు నేను, మీ అమ్మ అందరం అలానే ఉన్నాం.  మీ ఇంట్లో అలా ఉండటానికి కుదరదు. అందుకని, నో!”

ఆ మాత్రం తెలీదూ?

అరే ఎప్పుడొచ్చావు?  బాగులు గీగులు గట్రా?  ఏం తెచ్చావేమిటి?
..
మొన్నొచ్చాను.  సరే చూసెళ్దామని..
ఇది బాగుందే..తీసుకెళ్ళనా?

bananas
                               Bananas

అరే..ఒక రెండు రోజుల ముందు అడిగిఉంటే బాగుండేది..ఎవరికో ప్రామిస్ చేసాను..ఐనా నాకు తెలుసు..మన స్నేహనికి ఇదీ అడ్డం రాదని.  ఏమంటావ్?
..
నీ దగ్గిరతే ఏం
నా దగ్గిరైతే ఏం..ఒకటేలే..ఐనా పిల్లది చదువుకుంటుందని..
..
ఐనా ఏరా?  ఇంటికి వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రాకుడదని తెలియదా?
కనీసం ఒక అరడజను అరటి పళ్ళన్నా తెచ్చిఉండచ్చు కదరా?  నాకీ తిప్పుడు తప్పేది!

మాలతీ చందూర్ – మద్రాసు – ఒక స్మృతి

Malati and N R Chendur, Madras

మొన్న జనవరి లో కలిసాను మాలతీ చందూర్ గారిని.  వారింట్లోనే.  కచేరి రోడ్డు లో, మైలాపూర్‌లో శాంధోమ్ చర్చి కి దగ్గిర్లో.  వారింటి పక్కనే ఒక కేరళ వైద్యశాల ఉంటుంది.  శ్యామలాంబ గారు వారి సోదరి.  నేను, ఆరుద్ర రామలక్షి గారి పిల్లలు, దాశరధి గారి పిల్లలందరం కలిసి చదువుకున్న చిల్డ్ర్‌న్స్ గార్డెన్ స్కూలో లో వారు ఉపాధ్యాయురాలు.  దాదాపు మా కుంటుబాలు అన్ని కూడా 4 దశాబ్దాలుగా కలుస్తునే ఉన్నాయి. సాహిత్య సభలు కానివ్వండి, సినిమా ప్రీవ్యూలు కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, వివాహాలు కానివ్వండి మరొహటి కానివ్వండి.

చందూరు గారు వచ్చేవారు, హెరాల్డ్ కారులో. మాలతీ గారు కూడ వారితో బాటే. సినిమా సెన్సార్ బోర్డ్ కి వేసే సెన్సార్ షో కి నేను కూడ వెళ్ళేవాడిని. సినిమా నటుడు, ఛంద్రమోహన్ మామగారు, రచయిత్రి తులసి జలంధర గారి తండ్రి , డా గాలి బాలసుందర రావు గారు అద్దెకుండే ఇంట్లో ఒక పక్కగా ఖాళీ స్థలం ఉండేది. దానిలో సాహితీ సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. వాటికి కూడా భార్యా భర్తలు ఇద్దరూ వస్తుండేవారు.

1996 లో మా అమ్మ చనిపోయిన తరువాత ఫోనులో పలకరించుకోవడమే గాని, నేను వెళ్ళి కలిసింది లేదు. కాని మొన్న జనవరిలో వెళ్ళినప్పుడు కలిసాను. సాయంత్రం కలుద్దామనుకుంటే, మరుసరి రోజు ఉదయం కలుద్దామని అన్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో వెళ్ళాను. దాదాపు గంటో గంటన్నరో గడిపాను. మద్రాసులో తెలుగు వాతావరణం, తెలుగు సాహిత్య సభలు, సమావేశాలు, ఆ వాతావరణం, ఆంధ్ర రాష్ట్రం లో సాహిత్యం, సాహిత్య రంగంలో రాజకీయాలు వగైరాలు సాహితి మిత్రుల గురించి వాకబులు, కబుర్లు.
“జగతి”  గురించి ప్రస్తావన వచ్చింది.  చందూర్ గారు పోగానే “జగతి” ప్రచురణ ని ఆపేసానని చెప్పారు. ఇంతలో నేను వద్దని వారిస్తున్నా వినకుండా “కాఫీ చేసి తెస్తానుండు”, అంటూ మా టీచర్ గారు లోపలికి వెళ్ళారు.  “అనిల్ తో మామయ్య గురించి మాట్లాడవచ్చు అంటావా?” అంటూ మాలతి గారు మా టీచర్ గారిని అడగటం..వారు “తనేమన్నా బయట వాడా నువ్వు మాట్లాడకుండా ఉండటానికి” అంటుండగానే..లోపలికి వెళ్ళి ఇంతలావు బైండ్ చేసిన పుస్తకం తీసుకువచ్చారు. అదే “జగతి డైరి”. జగతి నుంచి ఏరి కూర్చిన వ్యాస సంకలనం. చందూరు గారి వ్రాసినవి. ఎంతొ ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో ఆ పుస్తకాన్ని నాకు చూపించారు ఆవిడ. దాదాపు ఒక సంవత్సర కాలం “జగతి” లన్ని ముందేసుకుని వాటిలో ఏరి కూర్చిన సంకలనం అది.  అంత పెద్ద పుస్తకానికి ధర కూడ తక్కువే పెట్టారు.

నా భార్య గతించిన విషయం తనకి తెలిసిందని అంటూ తను వ్రాసిన శిశిరవసంతం నవల లో “సంధ్య” గురించి చెబుతూ ఆ నవలని తప్పకుండా చదవమని కోరారు.  ఆ నవలలో “సంధ్య” కి కాన్సర్.  కాన్సర్ తో చేసిన యుద్దంలో సంధ్య గెలుస్తుంది ఆ నవలలో.

పాత్రికేయురాలు అరుణ పప్పు వ్రాసిన కథా సంపుటి “చందనపు బొమ్మ“కి ఒక పరిచయ సభని మద్రాసులో ఏర్పాటు చేసినప్పుడు ఆ నాటి సాయంత్రం వక్తలలో ఆమె ఒకరు. సినీ రచయిత, కవి భువనచంద్ర, నటి లక్ష్మి, నిర్మాత కాట్రగడ్డ మురారి, ఘంటసాల రత్నకుమార్ తదితరులు ఆ సభలో పాల్గొన్నారు.  ఆ సందర్భంలో తన కోసం ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళి వారితో సంతంకం చేయించుకున్న జ్ఞాపకంగా మిగిలి పోయిన “శిశిర వసంతం” నవల ఇది. కాని నిజ జీవితంలో గెలిచిన మాలతీ చందూర్ కాన్సర్ తో చేసిన యుద్దంలో పరాజిత.

శిశిరవసంతం, సంధ్య నాయిక

నిజమే

nijame..true
nijame..true

నిజమే.

ధైర్యం ఉండాలి. రేపటి మీద నమ్మకం ఉండాలి.

కాని నమ్మకం ఉంటే చాలదు. దానికి ప్రణాళిక కూడా ఉండాలి.  బలమైన పునాదులుండాలి.  అసలు చెయ్యవలసిన గమ్యం ఏమిటి అన్నది నిర్ణయించుకుంటే కాని మిగతా విషయాలు తెరపైకి రావు.

నేను నెత్తిక్కెక్కించుకున్నది ఎక్కువ.  వాటన్నింటిని నేను గమ్యం చేర్చాలి.  చేర్చాలి అంటే నేను రేపు బ్రతికి ఉండాలి. ఉండాలి అంటే ఒక అంచనా, ఒక ప్రణాళిక,  ఒక నీయమావళి ఉండాలి.  దాని ప్రకారం పనులు మొదలు పెట్టాలి.  ముగింపుకి కి త్రోవని ఎర్ఫాటు చెయ్యాలి.  మధ్యలో ఆగిపోవలసి వస్తే..అందుకోవడానికి మరొక చేతిని కూడా చూసుకోవాలి.

కాబట్టి ఈ పూట మందులు వేసుకోవాలి. రేపటికోసం ఈ రోజు మందులు వేసుకోవాలి.  బ్రతకడందేమున్నది..చెట్లు బతకడం లేదా..కుక్కలు పందులు బ్రతకడంలేదా? కొమ్మచివరనున్న పూవులు వికసించడం లేదా?  రాలే లోపు చెయ్యాల్సినవి చాలా ఉన్నవి మిత్రమా!

చెయ్యగలను అన్న ధీమా, ధైర్యంతోనే ఉన్నాను.

రేపు తెల్లవారుఝామున లేచి, ఉదయించే సూర్యుడ్ని చూస్తానన్న నమ్మకంతోనే ఈ పూట నిద్రిస్తున్నాను.

మునగ చెట్టు

మునగచెట్టు

చూసాను.
చాలామందిని చూసాను.
అతి దగ్గిరగా చూసాను.
ఎక్కించిన వాళ్లను చూసాను.
పైకి ఎగదోసి మరి ఎక్కించిన వారిని చూసాను.
చిటారు కొమ్మదాక ఎక్కిన వారిని చూసాను.

ఎక్కిన వారిని చూసాను.
ఎక్కి కళ్ళు మూసుకుని పోయి గుడ్డివాళ్ళైపోయిన వారిని చూసాను.
పైనుంచి క్రిందపడ్డ వారిని చూసాను.
దబ్బున పడ్డ వారిని చూసాను.
కాళ్ళు చేతులు విరిగిన వారిని చూశాను.
నడుములు పడిపోయి జీవితాంతం మంచాలకే బంది ఐపోయిన వాళ్ళని చూసాను.
పడిన వాళ్ళకి అసరాగా ఎవరూ నిలబడని పరిస్థితులని కూడా చూసాను.
వాళ్ళు ఒంటరిగా దుర్భరమైన జీవితాన్ని గడిపి కాల గర్భంలో కలిసిపోయిన వైనాన్ని గమనించాను.

మునగ చెట్టు
మునగ చెట్టు

ఇంకా చెప్పాలంటే మునగ చెట్టుకి మిగతా చెట్లకి ఉన్న తేడా కూడా తెలుసుకున్నాను.
దేవదారు వృక్షాలకి, మామిడి చెట్లకి, పూల పొదలకి,  గడ్డిపోచలకి మధ్య ఉన్న సారూప్యాలను కూడా తెలుసుకున్నాను.

పైవేవి నేను స్వయంగా అనుభవించి తెలుసుకోలేదు.
జీవితం నాకు నేర్పిన పాఠాలు అవి.
నేను మంచి విద్యార్ధిని అని నా నమ్మకం.

కరెంటు షాక్ కొడుతుందని ముట్టుకుని తెలుసుకోనఖర్లేదు.
నిప్పు ముట్టుకుంటే కాలుతుందని కూడ దానిని ముట్టుకుని తెలుసుకోన‌ఖర్లేదు.

అలాగే మునగ చెట్టు ఎక్కి కింద పడి అనుభవం పొందనఖర్లేని ఒక జీవితం నాకు దొరికింది.
అటువంటి జీవితం నాకు ప్రసాదించిన జ్ఞానం అది.
కాబట్టి నన్ను మునగచెట్టు ఎక్కించడానికి ప్రయత్నించవద్దు.
భంగ పడి మీరు అవమానాల ఊబి లో కూరుకుపోవద్దు.
చక్కగా మీ జీవితాన్ని,  హుందాగా, ఆత్మగౌరవంతోను,  ఆనందంగాను, సుఖసంతోషాలతో గడపండి.
దయచేసి నన్ను మునగచెట్టు ఎక్కించడానికి ప్రయత్నించొద్దు!
అది మీవల్ల కాదు కదా..మీమ్మల్ని పుట్టించిన ఆ బాబు వల్ల కూడా కాదు!!